కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 16

విమోచన క్రయధనం మీద కృతజ్ఞత చూపిస్తూ ఉండండి

విమోచన క్రయధనం మీద కృతజ్ఞత చూపిస్తూ ఉండండి

“మానవ కుమారుడు . . . ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు.”—మార్కు 10:45.

పాట 18 విమోచన క్రయధనంపట్ల కృతజ్ఞత

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. విమోచన క్రయధనం అంటే ఏంటి? అది మనకు ఎందుకు అవసరం?

పరిపూర్ణ మనిషైన ఆదాము పాపం చేసినప్పుడు, శాశ్వత జీవితం పొందే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తనకే కాదు పుట్టబోయే పిల్లలకు కూడా ఆ అవకాశం లేకుండా చేశాడు. ఆదాము చేసింది క్షమించరాని తప్పు, ఆయన కావాలనే పాపం చేశాడు కాబట్టి చనిపోవడం సరైనదే. మరి ఆయన పిల్లల సంగతేంటి? ఆదాము చేసిన పాపంలో వాళ్లకు ఏ వంతూ లేదు. (రోమా. 5:12, 14) మరి ఆయన పిల్లల్ని మరణశిక్ష నుండి కాపాడడానికి ఏదైనా దారి ఉందా? ఉంది! ఆదాము పాపం చేసిన వెంటనే, ఆయన సంతానంలో ఉన్న కోట్లమందిని పాపం నుండి, మరణం నుండి విడిపించడానికి తనేం చేయబోతున్నాడో యెహోవా క్రమక్రమంగా వివరించాడు. (ఆది. 3:15) తర్వాత సమయం వచ్చినప్పుడు, “ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా” ప్రాణాన్ని అర్పించడానికి యెహోవా తన కుమారుణ్ణి పరలోకం నుండి భూమ్మీదికి పంపించాడు.—మార్కు 10:45; యోహా. 6:51.

2 విమోచన క్రయధనం అంటే ఏంటి? క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో విమోచన క్రయధనం అంటే, ఆదాము పోగొట్టుకున్న దాన్ని తిరిగి కొనడానికి యేసు చెల్లించిన మూల్యం. (1 కొరిం. 15:22) మనకు విమోచన క్రయధనం ఎందుకు అవసరం? ఎందుకంటే, ధర్మశాస్త్రంలో యెహోవా పెట్టిన న్యాయ ప్రమాణం ప్రకారం ప్రాణానికి ప్రాణం చెల్లించాలి. (నిర్గ. 21:23, 24) ఆదాము పరిపూర్ణ మానవ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి, దేవుని న్యాయ ప్రమాణం ప్రకారం యేసు తన పరిపూర్ణ మానవ ప్రాణాన్ని అర్పించాడు. (రోమా. 5:17) ఆ విధంగా, విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉంచే వాళ్లందరికీ యేసు “నిత్యుడైన తండ్రి” అయ్యాడు.—యెష. 9:6; రోమా. 3:23, 24.

3. యోహాను 14:31; 15:13 ప్రకారం, యేసు తన పరిపూర్ణ మానవ ప్రాణాన్ని అర్పించడానికి ఎందుకు సిద్ధమయ్యాడు?

3 యేసు తన పరలోక తండ్రిని, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టే తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమయ్యాడు. (యోహాను 14:31; 15:13 చదవండి.) ఆ ప్రేమవల్లే చివరివరకు యథార్థంగా ఉండాలని, తన తండ్రి ఇష్టం చేయాలని నిశ్చయించుకున్నాడు. చనిపోయేంత వరకు నమ్మకంగా ఉండడం ద్వారా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. దానివల్ల మనుషుల విషయంలో, భూమి విషయంలో యెహోవా మొదట ఏం అనుకున్నాడో అది నిజమౌతుంది. యేసు ఎంతో బాధ అనుభవించి చనిపోయేలా దేవుడు ఎందుకు అనుమతించాడో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే విమోచన క్రయధనం మీద ఎంతో కృతజ్ఞత చూపించిన ఒక బైబిలు రచయిత గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. చివరిగా యెహోవా, యేసు ఇచ్చిన విమోచన క్రయధనం మీద మనమెలా కృతజ్ఞత చూపించవచ్చో, ఆ కృతజ్ఞతను ఎలా పెంచుకోవచ్చో చర్చిస్తాం.

యేసు బాధలు పడేలా యెహోవా ఎందుకు అనుమతించాడు?

మన కోసం విమోచన క్రయధనం అర్పించడానికి యేసు ఏమేం సహించాడో ఆలోచించండి! (4వ పేరా చూడండి)

4. యేసు ఎలా చనిపోయాడో వివరించండి.

4 భూమ్మీద యేసు ఆఖరి రోజు ఎలా గడిచిందో ఊహించుకోండి. కావాలనుకుంటే దేవదూతల సైన్యాల్ని పంపించమని ఆయన అడగవచ్చు. కానీ ఆయన, రోమా సైనికులు తనను బంధించడానికి వచ్చినప్పుడు వాళ్లతో వెళ్లాడు. వాళ్లు ఆయన్ని దారుణంగా కొట్టారు. (మత్త. 26:52-54; యోహా. 18:3; 19:1) వాళ్లు కొరడాతో ఆయన వీపు మీద కొట్టినప్పుడు, అది ఆయన మాంసాన్ని చీల్చేసింది. తర్వాత, రక్తం కారుతున్న ఆయన వీపు మీద బరువైన కొయ్యను మోపారు. మరణశిక్ష వేసే చోటుకు యేసు ఆ కొయ్యను ఈడ్చుకెళ్లడం మొదలుపెట్టాడు. కానీ ఆయన నీరసించిపోవడంతో, సైనికులు అటుగా వెళ్తున్న ఒకతన్ని ఆపి ఆ కొయ్యను మోయమని బలవంతపెట్టారు. (మత్త. 27:32) మరణశిక్ష వేసే చోటుకు చేరుకున్నప్పుడు, సైనికులు యేసును కొయ్య మీద పడుకోబెట్టి చేతులకు, కాళ్లకు మేకులు దిగగొట్టారు. తర్వాత కొయ్యను నిలబెట్టినప్పుడు, ఆయన బరువంతా ఆ మేకుల మీద పడడం వల్ల అవి ఆయన కండను చీల్చేస్తున్నాయి. యేసు తల్లి, స్నేహితులు బోరున ఏడుస్తున్నారు. కానీ యూదా నాయకులు ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు. (లూకా 23:32-38; యోహా. 19:25) గంటల తరబడి యేసు ఎన్నో విధాలుగా బాధ అనుభవిస్తున్నాడు. గుండె మీద, ఊపిరితిత్తుల మీద ఎక్కువ భారం పడడం వల్ల ఆయన శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆయన కష్టంగా ఊపిరి తీసుకుంటూ, చివరిసారిగా యెహోవాకు ప్రార్థించాడు. తర్వాత తల వంచి తుది శ్వాస విడిచాడు. (మార్కు 15:37; లూకా 23:46; యోహా. 10:17, 18; 19:30) యేసు చాలా సమయం పాటు, ఎంతో వేదన పడి, అవమానకరంగా చనిపోయాడు!

5. యేసుకు ఏది ఎక్కువ బాధ కలిగించింది?

5 ఆ సమయమంతటిలో, తనను ఎలా చంపుతున్నారు అనేది కాదుగానీ, ఏ ఆరోపణ మీద చంపుతున్నారు అనేదే యేసుకు ఎక్కువ బాధ కలిగించింది. దైవదూషణ చేస్తున్నాడనే అబద్ధ ఆరోపణ ఆయన మీద వేశారు. దైవదూషకుడు అంటే దేవుని మీద గానీ, దేవుని పేరు మీద గానీ ఏమాత్రం గౌరవంలేని వ్యక్తి. (మత్త. 26:64-66) దైవదూషకుడు అనే ఆరోపణ యేసును ఎంతగా బాధపెట్టిందంటే, యెహోవా ఈ అవమానాన్ని దూరం చేస్తే బావుంటుందని ఆయన అనుకున్నాడు. (మత్త. 26:38, 39, 42) యెహోవా తన ప్రియమైన కుమారుణ్ణి ఎందుకు బాధలు అనుభవించి చనిపోనిచ్చాడు? మూడు కారణాలు పరిశీలిద్దాం.

6. యేసు కొయ్య మీద ఎందుకు వేలాడదీయబడాల్సి వచ్చింది?

6 మొదటిగా, యూదుల్ని ఒక శాపం నుండి విడిపించడానికి యేసు కొయ్య మీద వేలాడదీయబడాల్సి వచ్చింది. (గల. 3:10, 13) వాళ్లు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని మాటిచ్చారు, కానీ మాట మీద నిలబడలేదు. దానివల్ల, ఆదాము నుండి వారసత్వంగా వచ్చిన పాపంతో పాటు ఈ శాపం కూడా వాళ్ల మీదికి వచ్చింది. (రోమా. 5:12) దేవుని ధర్మశాస్త్రం ప్రకారం, మరణశిక్షకు తగిన పాపం చేసిన వ్యక్తిని చంపేయాలి. తర్వాత అతని శవాన్ని కొయ్య మీద వేలాడదీయవచ్చు. * (ద్వితీ. 21:22, 23; 27:26) యేసు యూదుల శాపాన్ని తన మీద వేసుకుని కొయ్య మీద వేలాడదీయబడ్డాడు. దానివల్ల, ఆయన్ని ఎవరైతే తిరస్కరించారో ఆ యూదులు తమ శాపం నుండి విడుదలై, ఆయన బలి నుండి ప్రయోజనం పొందడం సాధ్యమైంది.

7. దేవుడు తన కుమారుణ్ణి బాధలు పడనివ్వడానికి రెండో కారణం ఏంటి?

7 దేవుడు యేసును బాధలు పడనివ్వడానికి రెండో కారణం పరిశీలించండి. భవిష్యత్తులో యేసు ప్రధాన యాజకుడిగా సేవ చేసేలా యెహోవా ఆయనకు శిక్షణ ఇస్తున్నాడు. పూర్తిస్థాయిలో పరీక్షించబడినప్పుడు దేవునికి లోబడడం ఎంత కష్టంగా ఉంటుందో యేసు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఆయన ఎంత ఒత్తిడికి లోనయ్యాడంటే, సహాయం కోసం “దేవునికి కన్నీళ్లతో బిగ్గరగా అభ్యర్థనలు, విన్నపాలు చేశాడు.” యేసు ఎంతో మానసిక వేదన అనుభవించాడు కాబట్టి, ఆయన మన అవసరాల్ని అర్థం చేసుకోగలడు, మనకు ‘పరీక్షలు ఎదురైనప్పుడు సహాయం చేయగలడు.’ ఎంతో కరుణగల వ్యక్తిని, ‘మన బలహీనతల్ని అర్థంచేసుకునే’ వ్యక్తిని ప్రధాన యాజకుడిగా నియమించినందుకు మనం యెహోవాకు ఎంత కృతజ్ఞులమో కదా!—హెబ్రీ. 2:17, 18; 4:14-16; 5:7-10.

8. యెహోవా యేసును తీవ్రంగా బాధలు పడనివ్వడానికి మూడో కారణం ఏంటి?

8 మూడవదిగా, ఒక ముఖ్యమైన ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి యెహోవా యేసును తీవ్రంగా బాధలు పడనిచ్చాడు. అదేంటంటే, తీవ్రమైన పరీక్షలు వచ్చినప్పుడు మనుషులు దేవునికి నమ్మకంగా ఉండగలరా? అలా ఉండలేరని సాతాను చెప్తున్నాడు. మనుషులు స్వార్థంతోనే దేవుణ్ణి ఆరాధిస్తారని అతను అంటున్నాడు. వాళ్ల పూర్వీకుడైన ఆదాములాగే వాళ్లకు కూడా యెహోవా మీద ప్రేమ లేదని అతను అనుకుంటున్నాడు. (యోబు 1:9-11; 2:4, 5) తన కుమారుడు తనకు విశ్వసనీయంగా ఉంటాడన్న నమ్మకంతో, ఆయన పూర్తిస్థాయిలో పరీక్షించబడేలా యెహోవా అనుమతించాడు. యేసు చివరివరకు యథార్థంగా ఉన్నాడు, సాతాను అబద్ధికుడని నిరూపించాడు.

విమోచన క్రయధనం మీద ఎంతో కృతజ్ఞత ఉన్న ఒక బైబిలు రచయిత

9. అపొస్తలుడైన యోహాను మనకు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?

9 విమోచన క్రయధనం అనే బోధ ఎంతోమంది క్రైస్తవుల విశ్వాసాన్ని బలపర్చింది. వ్యతిరేకత ఎదురైనా వాళ్లు మానకుండా ప్రకటిస్తూ ఉన్నారు, జీవితమంతా ఎన్నోరకాల కష్టాల్ని సహించారు. అపొస్తలుడైన యోహాను ఉదాహరణ పరిశీలించండి. క్రీస్తు గురించిన, విమోచన క్రయధనం గురించిన సత్యాన్ని ఆయన బహుశా 60 కంటే ఎక్కువ సంవత్సరాలు నమ్మకంగా ప్రకటించాడు. ఆయన వల్ల తమకు ముప్పు ఉందని రోమా ప్రభుత్వం అనుకుంది, అందుకే దాదాపు వందేళ్ల వయసులో ఆయన్ని పత్మాసు ద్వీపంలో బందీగా ఉంచింది. ఆయన చేసిన నేరం ఏంటి? ‘దేవుని గురించి మాట్లాడడం, యేసు గురించి సాక్ష్యమివ్వడం.’ (ప్రక. 1:9) విశ్వాసం, సహనం విషయంలో యోహాను ఎంత చక్కని ఆదర్శం ఉంచాడో కదా!

10. యోహానుకు విమోచన క్రయధనం మీద కృతజ్ఞత ఉందని ఆయన రాసిన పుస్తకాలు ఎలా చూపిస్తున్నాయి?

10 యేసు మీద తనకెంత ప్రేమ ఉందో, విమోచన క్రయధనం మీద తనకెంత కృతజ్ఞత ఉందో తను రాసిన బైబిలు పుస్తకాల్లో యోహాను తెలియజేశాడు. వాటిలో విమోచన క్రయధనం గురించి, లేదా విమోచన క్రయధనం తీసుకొచ్చే ప్రయోజనాల గురించి 100 కంటే ఎక్కువసార్లు ప్రస్తావించాడు. ఉదాహరణకు, యోహాను ఇలా రాశాడు: “ఎవరైనా పాపం చేసినా, తండ్రి దగ్గర మనకు ఒక సహాయకుడు ఉన్నాడు, ఆయనే నీతిమంతుడైన యేసుక్రీస్తు.” (1 యోహా. 2:1, 2) అంతేకాదు, ‘యేసు గురించి సాక్ష్యమివ్వడం’ ఎంత ప్రాముఖ్యమో కూడా యోహాను తన పుస్తకాల్లో తెలియజేశాడు. (ప్రక. 19:10) అవును, విమోచన క్రయధనం మీద యోహానుకు ఎంత కృతజ్ఞత ఉందో తెలుస్తోంది. ఆయనలాగే మనం కూడా కృతజ్ఞత ఎలా చూపించవచ్చు?

విమోచన క్రయధనం మీద మీరు ఎలా కృతజ్ఞత చూపించవచ్చు?

విమోచన క్రయధనం మీద మనకు నిజంగా కృతజ్ఞత ఉంటే, పాపం చేయాలనే ఒత్తిడిని ఎదిరిస్తాం (11వ పేరా చూడండి) *

11. ఒత్తిడిని ఎదిరించడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

11 పాపం చేయాలనే ఒత్తిడిని ఎదిరించండి. విమోచన క్రయధనం మీద నిజంగా కృతజ్ఞత ఉంటే, మనం ఇలా అనుకోం: ‘పాపం చేయాలనే ఒత్తిడిని ఎదిరించడానికి నేను ఇంతగా కృషి చేయాల్సిన అవసరం లేదు. నేను ముందు పాపం చేసేసి, తర్వాత క్షమాపణ అడగవచ్చు.’ బదులుగా, విమోచన క్రయధనం మీద కృతజ్ఞత ఉంటే, తప్పు చేయాలనే ఒత్తిడి వచ్చినప్పుడు మనం ఇలా అనుకుంటాం: ‘లేదు! యెహోవా, యేసు నాకోసం ఇంత చేసినప్పుడు నేను ఈ పని ఎలా చేయగలను?’ అంతేకాదు, మనం బలం కోసం యెహోవాకు ప్రార్థిస్తూ, ‘నన్ను ప్రలోభానికి లొంగిపోనివ్వకు’ అని వేడుకోవచ్చు.—మత్త. 6:13.

12. మొదటి యోహాను 3:16-18 లో ఉన్న సలహాను మనం ఎలా పాటించవచ్చు?

12 మీ సహోదర సహోదరీల్ని ప్రేమించండి. మనం అలా ప్రేమ చూపిస్తే, విమోచన క్రయధనం మీద కృతజ్ఞత కూడా చూపించినట్టే. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, యేసు ప్రాణం పెట్టింది మన ఒక్కరి కోసమే కాదుగానీ మన సహోదర సహోదరీల కోసం కూడా. ఆయన వాళ్లకోసం చనిపోవడానికి సిద్ధమయ్యాడంటే, ఆయన దృష్టిలో వాళ్లు ఎంత విలువైనవాళ్లో అర్థమౌతుంది. (1 యోహాను 3:16-18 చదవండి.) సహోదర సహోదరీల మీద మనకున్న ప్రేమను మన ప్రవర్తనలో చూపిస్తాం. (ఎఫె. 4:29, 31–5:2) ఉదాహరణకు, వాళ్లకు ఒంట్లో బాలేనప్పుడు లేదా ప్రకృతి విపత్తుల్ని, ఇతర తీవ్రమైన కష్టాల్ని ఎదుర్కొంటున్నప్పుడు మనం వాళ్లకు సహాయం చేస్తాం. కానీ, వాళ్లు మనల్ని బాధపెట్టేలా మాట్లాడితే లేదా ప్రవర్తిస్తే, అప్పుడేంటి?

13. మనం ఎందుకు క్షమించాలి?

13 మీ సహోదరుణ్ణి లేదా సహోదరిని క్షమించడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుందా? (లేవీ. 19:18) అలాగైతే ఈ సలహా పాటించండి: “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. ఇతరుల మీద ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నాసరే అలా క్షమించండి. యెహోవా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి.” (కొలొ. 3:13) మన సహోదరుణ్ణి లేదా సహోదరిని క్షమించిన ప్రతీసారి, విమోచన క్రయధనం మీద మనకు ఎంత కృతజ్ఞత ఉందో మన పరలోక తండ్రికి చూపిస్తున్నట్టే. దేవుడు ఇచ్చిన ఈ బహుమానం మీద మన కృతజ్ఞతను ఎలా పెంచుకుంటూ ఉండవచ్చు?

విమోచన క్రయధనం మీద మీకున్న కృతజ్ఞతను ఎలా పెంచుకోవచ్చు?

14. విమోచన క్రయధనం మీద కృతజ్ఞతను పెంచుకోవడానికి ఏం చేయవచ్చు?

14 విమోచన క్రయధనం ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి. ఇండియాలో ఉంటున్న జోయన్న అనే 83 ఏళ్ల సహోదరి ఇలా అంటుంది: “ప్రతీరోజూ నా ప్రార్థనల్లో విమోచన క్రయధనం గురించి ప్రస్తావించడం, దాన్ని ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం ప్రాముఖ్యమని నేను అనుకుంటాను.” మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆరోజు మీరు ఏమేం తప్పులు చేశారో యెహోవాకు చెప్పండి. తర్వాత క్షమించమని అడగండి. కానీ మీరు ఒకవేళ ఘోరమైన పాపం చేస్తే, సంఘ పెద్దల సహాయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్లు మీరు చెప్పేది వింటారు, ప్రేమతో మీకు బైబిలు నుండి సలహా ఇస్తారు. వాళ్లు మీతో కలిసి ప్రార్థిస్తూ, మీరు మళ్లీ యెహోవాతో మంచి సంబంధం కలిగివుండేలా మీ పాపాల్ని క్షమించమని యెహోవాను అడుగుతారు.—యాకో. 5:14-16.

15. విమోచన క్రయధనం గురించి చదవడానికి, ధ్యానించడానికి ఎందుకు సమయం తీసుకోవాలి?

15 విమోచన క్రయధనం గురించి ధ్యానించండి. రాజమణి అనే 73 ఏళ్ల సహోదరి ఇలా అంటుంది: “యేసు బాధ అనుభవించి చనిపోవడం గురించి చదివిన ప్రతీసారి నాకు ఏడ్పు వస్తుంది.” దేవుని కుమారుడు ఎంత బాధపడి చనిపోయాడో ఆలోచించినప్పుడు, మీకు కూడా ఏడ్పు రావచ్చు. కానీ యేసు అర్పించిన బలి గురించి మీరు ఎంత ఎక్కువగా ధ్యానిస్తే, అంత ఎక్కువగా మీకు ఆయన మీద, ఆయన తండ్రి మీద ప్రేమ పెరుగుతుంది. మీరు విమోచన క్రయధనాన్ని అధ్యయన ప్రాజెక్టులా పెట్టుకుని, దాని గురించి ధ్యానించగలరా?

సాదాసీదాగా ఉండే ప్రభువు రాత్రి భోజనం ద్వారా, తన బలిని ఎలా గుర్తు చేసుకోవాలో యేసు తన శిష్యులకు చూపించాడు (16వ పేరా చూడండి)

16. విమోచన క్రయధనం గురించి వేరేవాళ్లకు చెప్పడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం? (ముఖచిత్రం చూడండి.)

16 విమోచన క్రయధనం గురించి వేరేవాళ్లకు చెప్పండి. మనం విమోచన క్రయధనం గురించి వేరేవాళ్లతో మాట్లాడిన ప్రతీసారి, దానిమీద మనకున్న కృతజ్ఞత పెరుగుతుంది. యేసు మనకోసం ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో వేరేవాళ్లకు వివరించడానికి మన దగ్గర చక్కని పనిముట్లు ఉన్నాయి. ఉదాహరణకు, దేవుడు చెప్తున్న మంచివార్త! బ్రోషుర్‌లో “యేసుక్రీస్తు ఎవరు?” అనే 4వ పాఠాన్ని మనం ఉపయోగించవచ్చు, లేదా బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? పుస్తకంలో “దేవుని గొప్ప బహుమానం—విమోచన క్రయధనం” అనే 5వ అధ్యాయాన్ని ఉపయోగించవచ్చు. ప్రతీ సంవత్సరం యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు వెళ్లడం ద్వారా, వేరేవాళ్లను కూడా ఉత్సాహంగా ఆహ్వానించడం ద్వారా విమోచన క్రయధనం మీద మనకున్న కృతజ్ఞతను పెంచుకుంటాం. తన కుమారుని గురించి వేరేవాళ్లకు చెప్పే గొప్ప గౌరవాన్ని యెహోవా మనకిచ్చాడు!

17. విమోచన క్రయధనం దేవుడు మనుషులకు ఇచ్చిన అతిగొప్ప బహుమానం అని ఎందుకు చెప్పవచ్చు?

17 విమోచన క్రయధనం మీద కృతజ్ఞతను పెంచుకుంటూ ఉండడానికి మనకు మంచి కారణాలు ఉన్నాయి. విమోచన క్రయధనం వల్లే, మనం అపరిపూర్ణులమైనా యెహోవాతో దగ్గరి సంబంధాన్ని ఆనందించగలుగుతున్నాం. విమోచన క్రయధనం వల్లే, అపవాది పనులు పూర్తిగా నాశనమౌతాయి. (1 యోహా. 3:8) విమోచన క్రయధనం వల్లే, యెహోవా మొదట అనుకున్నట్టుగా భూమంతా పరదైసుగా మారుతుంది. అప్పుడు మీరు కలిసే ప్రతీఒక్కరు యెహోవాను ప్రేమించేవాళ్లే, ఆయన్ని ఆరాధించేవాళ్లే. కాబట్టి, ప్రతీరోజూ విమోచన క్రయధనం మీద మనకున్న కృతజ్ఞతను చూపించే అవకాశాల కోసం వెదుకుదాం. అది దేవుడు మనుషులకు ఇచ్చిన అతిగొప్ప బహుమానం!

పాట 20 ప్రశస్తమైన నీ కుమారుణ్ణి ఇచ్చావు

^ పేరా 5 యేసు ఎందుకు ఎంతో బాధ అనుభవించి చనిపోవాల్సి వచ్చింది? ఆ ప్రశ్నకు జవాబు ఈ ఆర్టికల్‌లో చూస్తాం. విమోచన క్రయధనం మీద కృతజ్ఞతను పెంచుకోవడానికి కూడా ఈ ఆర్టికల్‌ మనకు సహాయం చేస్తుంది.

^ పేరా 6 సాధారణంగా రోమన్లు దోషుల్ని బ్రతికుండగానే, కొయ్యకు కట్టేసేవాళ్లు లేదా మేకులు దిగగొట్టేవాళ్లు. తన కుమారుడు ఈ విధంగా చంపబడేందుకు యెహోవా అనుమతించాడు.

^ పేరా 55 చిత్రాల వివరణ: ఒక సహోదరుడు అశ్లీల చిత్రాలు చూడాలనే ఒత్తిడిని ఎదిరిస్తున్నాడు. ఇంకో సహోదరుడు సిగరెట్‌ తాగాలనే ఒత్తిడిని ఎదిరిస్తున్నాడు. మరో సహోదరుడు లంచం తీసుకోవాలనే ఒత్తిడిని ఎదిరిస్తున్నాడు.