కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 16

“నీ సహోదరుడు లేస్తాడు”

“నీ సహోదరుడు లేస్తాడు”

“యేసు ఆమెతో [మార్తతో], ‘నీ సహోదరుడు లేస్తాడు’ అన్నాడు.”​—యోహా. 11:23.

పాట 151 ఆయన పిలుస్తాడు

ఈ ఆర్టికల్‌లో … a

1. మ్యాథ్యూ అనే అబ్బాయికి పునరుత్థాన నిరీక్షణ మీద ఎంత నమ్మకముంది?

 మ్యాథ్యూ అనే ఏడేళ్ల అబ్బాయికి ఒక పెద్ద జబ్బు వచ్చి చాలా ఆపరేషన్లు అయ్యాయి. ఒకరోజు ఆ బాబు వాళ్ల కుటుంబంతో కలిసి బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రోగ్రామ్‌ చూస్తున్నాడు. ఆ ప్రోగ్రామ్‌ చివర్లో పునరుత్థాన నిరీక్షణకు సంబంధించిన ఒక పాట వచ్చింది. b ఆ పాట చూసిన తర్వాత మ్యాథ్యూ వాళ్ల అమ్మానాన్నల దగ్గరికి వెళ్లి, వాళ్ల చేతులు పట్టుకుని “చూశారా మమ్మీడాడీ, నేను చనిపోయినా మళ్లీ బ్రతుకుతాను, కాబట్టి మీరు ఏడ్వకండి” అని అన్నాడు. ఆ పసి మనసులో పునరుత్థాన నిరీక్షణ ఎంత బలంగా నాటుకుపోయిందో చూసిన తర్వాత ఆ అమ్మానాన్నలకు ఎలా అనిపించివుంటుందో ఊహించండి.

2-3. పునరుత్థాన నిరీక్షణ గురించి ఎప్పటికప్పుడు ఆలోచించడం ఎందుకు మంచిది?

2 బైబిలు మాటిస్తున్న పునరుత్థాన నిరీక్షణ గురించి ఎప్పటికప్పుడు ఆలోచించడం మంచిది. (యోహా. 5:28, 29) ఎందుకంటే ఏ జబ్బు ఎప్పుడు మనల్ని పొట్టన పెట్టుకుంటుందో మనకు తెలీదు. లేదా మనం ప్రాణంగా ప్రేమించేవాళ్లను ఎప్పుడు కోల్పోతామో తెలీదు. (ప్రసం. 9:11; యాకో. 4:13, 14) ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం దుఃఖంలో మునిగిపోకుండా ఉండడానికి పునరుత్థాన నిరీక్షణ సహాయం చేస్తుంది. (1 థెస్స. 4:13) మన పరలోక తండ్రికి మన గురించి అణువణువు తెలుసని, మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడని లేఖనాలు అభయాన్నిస్తున్నాయి. (లూకా 12:7) యెహోవాకు మన గురించి ఎంత తెలుసంటే మన వ్యక్తిత్వాన్ని, మన జ్ఞాపకాల్ని పదిలంగా ఉంచి మనల్ని మళ్లీ సృష్టించగలడు. అంతేకాదు, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మనందరికి శాశ్వతకాలం జీవించే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ మనం చనిపోయినా ఆయన తిరిగి లేపుతానని చెప్తున్నాడు.

3 ఈ ఆర్టికల్‌లో మూడు విషయాల్ని చూస్తాం. మొదటిది, పునరుత్థానాన్ని మనం ఎందుకు నమ్మవచ్చో చూస్తాం. రెండోది, ఈ ఆర్టికల్‌ ముఖ్యవచనమైన “నీ సహోదరుడు లేస్తాడు” అనే మాటలు ఉన్న విశ్వాసాన్ని బలపర్చే వృత్తాంతాన్ని పరిశీలిస్తాం. (యోహా. 11:23) మూడోది, పునరుత్థాన నిరీక్షణ పగటికల కాదుగానీ అక్షర సత్యమనే నమ్మకాన్ని ఎలా కుదుర్చుకోవచ్చో చూస్తాం.

పునరుత్థానాన్ని మనం ఎందుకు నమ్మవచ్చు?

4. మీరు ఒక మాటను దేన్నిబట్టి నమ్ముతారో ఉదాహరణతో చెప్పండి.

4 మనం ఒక మాటను నమ్మాలంటే ఆ మాట ఇచ్చిన వ్యక్తికి దాన్ని నిలబెట్టుకోవాలనే కోరిక ఉండాలి, ఆ మాట నిలబెట్టుకునే సామర్థ్యం కూడా ఉండాలి. ఉదాహరణకు, ఒక తుఫానువల్ల మీ ఇల్లు బాగా పాడైంది అనుకోండి. అప్పుడు మీ ఫ్రెండ్‌ వచ్చి ‘మీ ఇల్లును మళ్లీ కట్టిస్తాను’ అని మాటిచ్చాడు. ఆయన నిజాయితీపరుడు కాబట్టి మీకు సహాయం చేయాలనే కోరిక ఆయనకు ఉందని మీకు తెలుసు. ఒకవేళ ఆయన ఒక మంచి మేస్త్రీ అయ్యి, ఇల్లు కట్టడానికి కావల్సినవన్నీ ఆయన దగ్గర ఉంటే ఆయనకు ఆ సామర్థ్యం కూడా ఉన్నట్టే. కాబట్టి ఆయన ఇచ్చిన మాటను మీరు నమ్ముతారు. మరి పునరుత్థానం చేస్తానని దేవుడు ఇచ్చిన మాట సంగతేంటి? పునరుత్థానం చేయాలనే కోరిక, అలా చేసే శక్తి ఆయనకు ఉన్నాయా?

5-6. చనిపోయినవాళ్లను లేపాలనే కోరిక యెహోవాకు ఉందని ఎలా చెప్పవచ్చు?

5 చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించాలనే కోరిక యెహోవాకు ఉందా? నిస్సందేహంగా. ఎందుకంటే, పునరుత్థానం గురించి ఆయన బైబిల్లో రాయించాడు. (యెష. 26:19; హోషే. 13:14; ప్రక. 20:11-13) నిజానికి యెహోవా ఏదైనా మాటిచ్చాడంటే నూటికినూరు శాతం దాన్ని నిలబెట్టుకుంటాడు. (యెహో. 23:14) యెహోవా చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించాలని పరితపిస్తున్నాడు. అలాగని మనం ఎలా చెప్పవచ్చు?

6 యోబు చెప్పిన మాటల గురించి ఆలోచించండి. ఒకవేళ అతను చనిపోయినా తనను మళ్లీ బ్రతికించాలని యెహోవా బలంగా కోరుకుంటున్నాడని అతను నమ్మాడు. (యోబు 14:14, 15) చనిపోయిన తన ఆరాధకులందర్నీ తిరిగి బ్రతికించాలని యెహోవా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. వాళ్లందర్నీ బ్రతికించి, వాళ్లకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ఇవ్వాలని ఆయన ఆరాటపడుతున్నాడు. మరి యెహోవా గురించి తెలుసుకునే అవకాశం దొరక్కముందే చనిపోయిన కోటానుకోట్ల మంది సంగతేంటి? మన దేవుడు ఎంత ప్రేమగలవాడంటే, వాళ్లను కూడా లేపాలని ఆయన ఎదురుచూస్తున్నాడు. (అపొ. 24:15) వాళ్లు కూడా ఆయనకు స్నేహితులై, భూమ్మీద ఎప్పటికీ జీవించే అవకాశం వాళ్లకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. (యోహా. 3:16) వీటన్నిటినిబట్టి, చనిపోయినవాళ్లను లేపాలనే కోరిక యెహోవాకు ఉందని తేటతెల్లమౌతుంది.

7-8. చనిపోయినవాళ్లను బ్రతికించే శక్తి యెహోవాకు ఉందని ఎలా చెప్పవచ్చు?

7 చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించే శక్తి యెహోవాకు ఉందా? ముమ్మాటికీ ఉంది. ఎందుకంటే ఆయన ‘సర్వశక్తిమంతుడు’ అని బైబిలు చెప్తుంది. (ప్రక. 1:8) కాబట్టి ఏ శత్రువునైనా ఆఖరికి మరణమనే శత్రువును కూడా ఓడించే శక్తి యెహోవాకు ఉంది. (1 కొరిం. 15:26) అది తెలుసుకోవడం మనకు ఊరటను, ధైర్యాన్ని ఇస్తుంది. సిస్టర్‌ ఎమ్మా అనుభవాన్ని పరిశీలించండి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె, ఆమె కుటుంబం చాలా కష్టాలుపడ్డారు. నాజీ నిర్బంధ శిబిరంలో తన వాళ్లను కూడా కోల్పోయింది. అయితే వాళ్ల పాపను ఓదార్చడానికి ఆమె ఇలా చెప్పింది: “ఒకవేళ చనిపోయినవాళ్లు ఎప్పటికీ బ్రతకరంటే యెహోవాకన్నా మరణానికి ఎక్కువ శక్తి ఉన్నట్టు. అసలు యెహోవాకన్నా శక్తిమంతులు ఎవరైనా ఉన్నారా? లేరు కదా.” మనుషులకు ప్రాణం పోసిన యెహోవా, చనిపోయినవాళ్లకు తిరిగి ప్రాణం పోయలేడా? ఖచ్చితంగా! ఆయనకు ఆ శక్తి ఉంది.

8 చనిపోయినవాళ్లను బ్రతికించే శక్తి యెహోవాకు ఉందని చెప్పడానికి ఇంకో కారణం ఏంటి? యెహోవాకు అంతులేని జ్ఞాపకశక్తి ఉంది. ఆయన ప్రతీ నక్షత్రాన్ని పేరుపెట్టి పిలుస్తాడని బైబిలు చెప్తుంది. (యెష. 40:26) దీన్నిబట్టి, ఇప్పటివరకు చనిపోయిన ఏ ఒక్కర్నీ యెహోవా మర్చిపోలేదు అని అర్థమౌతుంది. (యోబు 14:13; లూకా 20:37, 38) ఆయన ఎవరినైతే పునరుత్థానం చేయబోతున్నాడో వాళ్లకు సంబంధించిన ప్రతీ చిన్న వివరం అంటే వాళ్ల రూపురేఖలు, వాళ్ల వ్యక్తిత్వం, వాళ్ల జీవితంలో ఎదురైన అనుభవాలు, వాళ్ల జ్ఞాపకాలు అన్నిటినీ యెహోవా సునాయాసంగా గుర్తు పెట్టుకోగలుగుతాడు.

9. చనిపోయినవాళ్లను బ్రతికిస్తానని యెహోవా ఇచ్చిన మాటను మీరెందుకు నమ్ముతున్నారు?

9 అవును, చనిపోయినవాళ్లను బ్రతికిస్తానని యెహోవా ఇచ్చిన మాటను మనం పూర్తిగా నమ్మవచ్చు. ఎందుకంటే అలా చేయాలనే కోరిక, అలా చేసే శక్తి యెహోవాకు ఉన్నాయి. యెహోవా ఇచ్చిన మాటను నమ్మడానికి మరో కారణం ఏంటంటే, చనిపోయినవాళ్లను ఆయన ఇంతకుముందే లేపాడు. అంతేకాదు, బైబిలు కాలాల్లో చనిపోయినవాళ్లను లేపేలా, కొంతమంది నమ్మకమైన సేవకులకు, యేసుకు ఆయన శక్తినిచ్చాడు. ఇప్పుడు యోహాను 11వ అధ్యాయంలో యేసు చేసిన ఒక పునరుత్థానం గురించి పరిశీలిద్దాం.

యేసు ప్రాణ స్నేహితుడు చనిపోయాడు

10. యొర్దాను అవతల యేసు పరిచర్య చేస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆయన ఏం చేశాడు? (యోహాను 11:1-3)

10 యోహాను 11:1-3 చదవండి. క్రీ.శ. 32వ సంవత్సరం చివర్లో బేతనియ గ్రామంలో ఏం జరిగిందో ఆలోచించండి. ఆ గ్రామంలో ఉండే లాజరు, అతని ఇద్దరు సహోదరీలైన మార్త, మరియలు యేసుకు మంచి స్నేహితులు. (లూకా 10:38-42) అయితే, ఒకరోజు లాజరుకు బాగా జబ్బు చేసింది. దాంతో అతని సహోదరీలు కంగారుపడ్డారు. వాళ్లు లాజరుకు జబ్బు చేసిందనే విషయాన్ని యేసుకు కబురు పంపించారు. యేసేమో యొర్దాను అవతల, దాదాపు రెండు రోజుల ప్రయాణమంత దూరంలో ఉన్నాడు. (యోహా. 10:40) బాధాకరమైన విషయం ఏంటంటే, లాజరుకు జబ్బు చేసిందని యేసుకు తెలిసేలోపే లాజరు చనిపోయాడు. ఆయన చనిపోయాడని తెలిసినా, యేసు అక్కడే రెండు రోజులు ఉండి, తర్వాత బేతనియకు బయలుదేరాడు. అంటే యేసు బేతనియకు వచ్చేసరికి లాజరు చనిపోయి నాలుగు రోజులైంది. ఇప్పుడు యేసు తన స్నేహితులందరి కోసం, యెహోవాకు మహిమ వచ్చేలా ఒక పని చేయబోతున్నాడు.—యోహా. 11:4, 6, 11, 17.

11. ఈ వృత్తాంతం నుండి స్నేహం గురించి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

11 ఈ వృత్తాంతంలో స్నేహం గురించి ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి మార్త, మరియలు యేసుకు కబురు పంపించినప్పుడు ఆయన్ని బేతనియకు రమ్మని వాళ్లు అడగలేదు. వాళ్లు కేవలం యేసు ప్రాణ స్నేహితునికి జబ్బు చేసిందని మాత్రమే చెప్పారు. (యోహా. 11:3) అంతేకాదు, లాజరు చనిపోయాడని తెలిసిన తర్వాత, యేసు తన కాలు కదపకుండా ఉన్నచోట నుండే అతన్ని పునరుత్థానం చేసి ఉండవచ్చు. కానీ యేసు తన స్నేహితులైన మార్త, మరియల వెన్నంటే ఉండాలని అనుకున్నాడు. అందుకే ఆయన బేతనియకు వచ్చాడు. మీకు కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే మీ దగ్గర వాలిపోయే ఫ్రెండ్‌ మీకు ఉన్నాడా? అలాగైతే మీకు కష్టాలు వచ్చినప్పుడు ఆయనవైపు చూడొచ్చని మీకు తెలుసు. (సామె. 17:17) మనం యేసును అనుకరిస్తూ అలాంటి ఫ్రెండ్‌గా ఉందాం. ఇప్పుడు ఆ వృత్తాంతంలోకి వెళ్లి, తర్వాత ఏం జరిగిందో చూద్దాం.

12. యేసు మార్తకు ఏమని మాటిచ్చాడు? అది ఎందుకు వట్టిమాట కాదు? (యోహాను 11:23-26)

12 యోహాను 11:23-26 చదవండి. యేసు బేతనియ గ్రామంలోకి అడుగుపెట్టాడని తెలిసిన వెంటనే, మార్త పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయన్ని కలిసి “ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండివుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు” అని అంది. (యోహా. 11:21) నిజమే, యేసు అక్కడ ఉండివుంటే లాజరును బాగు చేసేవాడే. కానీ ఇప్పుడు యేసు మనసులో వేరేది ఉంది. ఆయన ఒక అసాధారణమైన పని చేయబోతున్నాడు. “నీ సహోదరుడు లేస్తాడు” అని యేసు మార్తకు మాటిచ్చాడు. మార్త ఆ మాటను నమ్మడానికిగల కారణాన్ని చెప్తూ యేసు ఇలా అన్నాడు: “పునరుత్థానాన్ని, జీవాన్ని నేనే.” అవును, చనిపోయినవాళ్లకు ప్రాణం పోసే శక్తిని యెహోవా యేసుకు ఇచ్చాడు. గతంలో ఒక పాపని చనిపోయిన కొద్దిసేపటికే యేసు పునరుత్థానం చేశాడు. మరో సందర్భంలో, ఒక యువకున్ని చనిపోయిన రోజునే యేసు లేపాడు. (లూకా 7:11-15; 8:49-55) కానీ ఇప్పుడు చనిపోయి నాలుగు రోజులు దాటి, శరీరం కుళ్లిపోవడం మొదలైన వ్యక్తిని యేసు పునరుత్థానం చేయగలడా?

“లాజరూ, బయటికి రా!”

కన్నీరుమున్నీరౌతున్న తన స్నేహితుల్ని చూసి యేసుకు కన్నీళ్లు ఆగలేదు (13-14 పేరాలు చూడండి)

13. యోహాను 11:32-35 ప్రకారం మరియ, ఆమెతో ఉన్నవాళ్లు ఏడ్వడం చూసినప్పుడు యేసు ఏం చేశాడు? (చిత్రం కూడా చూడండి.)

13 యోహాను 11:32-35 చదవండి. తర్వాత ఏం జరిగింది? మరియ కూడా యేసును కలవడానికి వెళ్లింది. ఆమె కూడా యేసుతో “ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండివుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు” అని అంది. ఆమె అలాగే ఆమెతో ఉన్నవాళ్లు శోకసముద్రంలో మునిగిపోయారు. వాళ్లు ఏడ్వడం చూసినప్పుడు, విన్నప్పుడు యేసుకు గుండె పిండేసినట్టు అయ్యింది. యేసు తన స్నేహితుల మీద ఎంత జాలిపడ్డాడంటే వాళ్లను చూసిన తర్వాత ఆయన తన ఏడ్పు ఆపుకోలేకపోయాడు. ప్రాణంగా ప్రేమించేవాళ్లు ఇక లేరని తెలిసినప్పుడు మనుషుల ప్రాణం ఎంత విలవిలలాడుతుందో యేసుకు తెలుసు. అందుకే వాళ్ల కన్నీళ్లకు కారణమైన దాన్ని తీసేయడానికి ఆయన ఇక ఏమాత్రం ఆలస్య చేయాలనుకోలేదు.

14. మరియ ఏడ్వడం చూసి యేసు కూడా ఏడ్చాడంటే ఇది యెహోవా గురించి మనకు ఏం నేర్పిస్తుంది?

14 మరియ ఏడ్వడం చూసి యేసు కూడా ఏడ్చాడంటే, యెహోవా ఎంత కనికరంగల దేవుడో మనం అర్థంచేసుకోవచ్చు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? తన తండ్రి ఎలా ఆలోచిస్తాడో, ఆయనకు ఎలా అనిపిస్తుందో యేసు అచ్చుగుద్దినట్టు చూపించాడని ముందటి ఆర్టికల్‌లో చూశాం. (యోహా. 12:45) కాబట్టి తన స్నేహితులు ఏడ్వడం చూసినప్పుడు యేసు కూడా ఏడ్చాడని మనం చదివినప్పుడు, మన కన్నీళ్లను చూసి యెహోవా ఎంత బాధపడతాడో కూడా మనం అర్థంచేసుకోవచ్చు. (కీర్త. 56:8) ఇది విన్నప్పుడు కనికరంగల దేవునికి ఇంకా దగ్గరవ్వాలని మనకు అనిపించట్లేదా?

చనిపోయినవాళ్లకు ప్రాణం పోసే శక్తి తనకు ఉందని యేసు చూపించాడు (15-16 పేరాలు చూడండి)

15. యోహాను 11:41-44 ప్రకారం, లాజరు సమాధి దగ్గర ఏం జరిగింది? (చిత్రం కూడా చూడండి.)

15 యోహాను 11:41-44 చదవండి. యేసు లాజరు సమాధి దగ్గరికి వచ్చి, రాయిని తీసేయమని చెప్పాడు. అప్పుడు మార్త, వద్దు ప్రభువా శవం వాసన వస్తుందేమో అని అడ్డు చెప్తుంది. దానికి యేసు “నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీకు చెప్పలేదా?” అని అంటాడు. (యోహా. 11:39, 40) ఆ తర్వాత యేసు ఆకాశం వైపు చూసి, అందరికి కనిపించేలా ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే, తర్వాత జరగబోయేదానికి పూర్తి మహిమ ఆయన యెహోవాకు ఇవ్వాలనుకున్నాడు. ఆ తర్వాత యేసు “లాజరూ, బయటికి రా!” అని గట్టిగా అన్నాడు. అప్పుడు లాజరు సమాధిలో నుండి నడుచుకుంటూ వచ్చేశాడు. కొంతమంది అసంభవం అనుకున్న పనిని యేసు ఇక్కడ చేసి చూపించాడు. c

16. యోహాను 11వ అధ్యాయంలో ఉన్న వృత్తాంతం పునరుత్థాన నిరీక్షణ మీద మనకు ఉన్న విశ్వాసాన్ని ఎలా బలపరుస్తుంది?

16 యోహాను 11వ అధ్యాయంలోని వృత్తాంతం, పునరుత్థాన నిరీక్షణ మీద మనకున్న విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఎలా? మార్తతో యేసు ఏ మాటిచ్చాడో గుర్తుందా? “నీ సహోదరుడు లేస్తాడు.” (యోహా. 11:23) తన తండ్రిలాగే యేసుకు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే కోరిక, అలా నిలబెట్టుకునే శక్తి ఉన్నాయి. చావును, అది కలిగించే బాధను కూకటివేళ్లతోసహా పెరికేయాలనే కోరిక యేసుకు ఉందని ఆయన కన్నీళ్లు చూపిస్తున్నాయి. లాజరు సమాధిలో నుండి నడుచుకుంటూ రావడం, యేసుకు చనిపోయినవాళ్లను లేపే శక్తి ఉందని మరోసారి రుజువు చేసింది. అంతేకాదు, మార్తకు యేసు ఏమని గుర్తుచేశాడో ఆలోచించండి: “నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీకు చెప్పలేదా?” (యోహా. 11:40) పునరుత్థానం జరుగుతుందని దేవుడిచ్చిన మాటను నమ్మడానికి మనకు బలమైన కారణాలున్నాయి. అయితే, పునరుత్థానం అక్షర సత్యమని నమ్మడానికి మనం ఏం చేయవచ్చు?

పునరుత్థాన నిరీక్షణ పగటికల కాదు అక్షర సత్యం

17. పునరుత్థానానికి సంబంధించిన వృత్తాంతాల్ని చదువుతున్నప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి?

17 పునరుత్థానాల గురించి చదవండి, లోతుగా ఆలోచించండి. చనిపోయి ఈ భూమ్మీదే జీవించడానికి బ్రతికించబడిన ఎనిమిదిమంది గురించి బైబిలు చెప్తుంది. d వాటిలో ఒక్కొక్క వృత్తాంతాన్ని జాగ్రత్తగా చదవండి. అలా చదువుతున్నప్పుడు వాళ్లందరు కల్పిత పాత్రలు కాదుగానీ, నిజమైన వ్యక్తులని గుర్తుంచుకోండి. వాటినుండి మీరు ఏ పాఠాలు నేర్చుకోవచ్చో ఆలోచించండి. చనిపోయినవాళ్లకు తిరిగి ప్రాణం పోయాలనే కోరిక, అలా చేసే శక్తి దేవునికి ఉన్నాయని ఆ వృత్తాంతాలు ఎలా నిరూపిస్తున్నాయో ఆలోచించండి. అన్నిటికన్నా ముఖ్యంగా, యేసు పునరుత్థానం గురించి ఆలోచించండి. ఆయన పునరుత్థానానికి కొన్ని వందలమంది ప్రత్యక్ష సాక్షులున్నారు. కాబట్టి పునరుత్థాన నిరీక్షణ మీద విశ్వాసం ఉంచడానికి మనకు బలమైన కారణాలున్నాయి.—1 కొరిం. 15:3-6, 20-22.

18. పునరుత్థాన నిరీక్షణకు సంబంధించిన పాటల్ని మీరెలా ఉపయోగించుకోవచ్చు? (అధస్సూచి కూడా చూడండి.)

18 పునరుత్థాన నిరీక్షణకు సంబంధించిన పాటల్ని వినండి, పాడండి, వాటిగురించి ఆలోచించండి. e (ఎఫె. 5:19) ఈ పాటలు, పునరుత్థానం నిజంగా జరుగుతుందనే విశ్వాసాన్ని ఇంకా పెంచుతాయి. కాబట్టి వాటిని వింటూ ఉండండి, ప్రాక్టీస్‌ చేయండి. ఆ పాటలో ఉన్న మాటల గురించి మీ కుటుంబ ఆరాధనలో చర్చించుకోండి. ఆ పాటల్ని మీ హృదయమనే పుస్తకంలో రాసిపెట్టుకోండి. అప్పుడు మీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా లేదా మీరు ప్రాణంగా ప్రేమించేవాళ్లు చనిపోయినా ఓదార్పు, బలం పొందడానికి ఈ పాటలు గుర్తొచ్చేలా పవిత్రశక్తి సహాయం చేస్తుంది.

19. పునరుత్థానం గురించి మనం ఏం ఊహించుకోవచ్చు? (“ మీరు వాళ్లను ఏం అడుగుతారు?” అనే బాక్సు చూడండి)

19 మీ ఊహాశక్తికి పదునుపెట్టండి. మనం కొత్తలోకంలో ఉన్నట్టు ఊహించుకునే సామర్థ్యాన్ని యెహోవా మనకు ఇచ్చాడు. ఒక సిస్టర్‌ ఇలా చెప్తుంది: “నేను కొత్తలోకంలో ఉన్నట్టు ఎంతలా ఊహించుకుంటానంటే, ఆఖరికి పరదైసులో ఉన్న రోజాపూల వాసన కూడా నాకు వచ్చినట్టు అనిపిస్తుంది.” బైబిలు కాలాల్లో ఉన్న నమ్మకమైన స్త్రీపురుషుల్ని కలిసినట్టు ఊహించుకోండి. మీరు ఎవర్ని కలవాలని ఎదురుచూస్తున్నారు? వాళ్లను కలిసిన వెంటనే మీరు ఏం అడుగుతారు? అంతేకాదు మీకు ఎంతో ఇష్టమైనవాళ్లు పునరుత్థానమైన తర్వాత వాళ్లతో మీరు మాట్లాడే మొట్టమొదటి మాట ఏంటో, వాళ్లను ఎంత గట్టిగా హత్తుకుంటారో, వాళ్లను చూసిన తర్వాత మీకు వచ్చే ఆనందబాష్పాలు ఎలా ఉంటాయో ఊహించుకోండి.

20. మనం ఏం చేయాలని నిర్ణయించుకున్నాం?

20 చనిపోయినవాళ్లను లేపుతానని యెహోవా ఇచ్చిన మాటకు మనం ఎన్నిసార్లు థ్యాంక్స్‌ చెప్పినా తక్కువే. ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నిజమౌతుందనే నమ్మకంతో ఉండవచ్చు. ఎందుకంటే ఆ మాట నిలబెట్టుకోవాలనే కోరిక, అలా చేసే శక్తి యెహోవాకు ఉన్నాయి. కాబట్టి ఈ అందమైన నిరీక్షణపై మనకున్న విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉందాం. అలాచేస్తే, పునరుత్థానాన్ని మాటిచ్చిన దేవునికి మనం ఇంకా దగ్గరౌతాం. ఆయన మనలో ప్రతీఒక్కరికి ఈ మాటిస్తున్నాడు ‘మీ ప్రియమైనవాళ్లు లేస్తారు!’

పాట 147 యెహోవా శాశ్వత జీవితాన్ని వాగ్దానం చేశాడు

a మీరు ప్రాణంగా ప్రేమించేవాళ్లు చనిపోయినప్పుడు పునరుత్థాన నిరీక్షణ మీకు ఎంతో ఓదార్పు ఇస్తుంది. అయితే, మీరు పునరుత్థాన నిరీక్షణను ఎందుకు నమ్ముతున్నారో వేరేవాళ్లకు ఎలా చెప్తారు? పునరుత్థాన నిరీక్షణ పగటికల కాదుగానీ అక్షర సత్యమనే నమ్మకాన్ని ఎలా కుదుర్చుకోవచ్చు? పునరుత్థాన నిరీక్షణపై మనందరి విశ్వాసాన్ని పెంచడమే ఈ ఆర్టికల్‌ ఉద్దేశం.

b ఈ పాట నవంబరు, 2016 బ్రాడ్‌కాస్టింగ్‌లో కనుచూపుమేరలోనే ఉంది (ఇంగ్లీష్‌) అనే అంశంతో వచ్చింది.

e సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి అనే పుస్తకంలో ఈ పాటల్ని చూడండి: “కొత్త లోకంలో ఉన్నట్టు ఊహించుకోండి!” (139వ పాట), “మీ దృష్టి లక్ష్యంపై ఉంచండి!” (144వ పాట), “ఆయన పిలుస్తాడు” (151వ పాట). అలాగే jw.orgలో ఉన్న ఈ ప్రత్యేక పాటల్ని కూడా చూడండి: “కనుచూపుమేరలోనే ఉంది (ఇంగ్లీష్‌),” “కొత్త లోకం రాబోతుంది,” అలాగే “మీరు కళ్లారా చూస్తారు.”