కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 18

మీటింగ్స్‌లో ఒకరినొకరం ప్రోత్సహించుకుందాం

మీటింగ్స్‌లో ఒకరినొకరం ప్రోత్సహించుకుందాం

“మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం . . . , ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఉందాం.”​—హెబ్రీ. 10:24, 25.

పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి

ఈ ఆర్టికల్‌లో … a

1. మనం మీటింగ్స్‌లో ఎందుకు కామెంట్స్‌ చెప్తాం?

 మనం మీటింగ్స్‌కి ఎందుకు వస్తాం? మొదటిగా, యెహోవాను స్తుతించడానికి వస్తాం. (కీర్త. 26:12; 111:1) రెండోది, ఈ కష్టసమయాల్లో ఒకరినొకరం ప్రోత్సహించుకోవడానికి మీటింగ్స్‌కి వస్తాం. (1 థెస్స. 5:11) అయితే, మనం కామెంట్స్‌ చెప్పినప్పుడు ఆ రెండు పనులు చేస్తాం.

2. మీటింగ్స్‌లో మనకు ఏ అవకాశాలు ఉన్నాయి?

2 ప్రతీవారం మీటింగ్స్‌లో కామెంట్స్‌ చెప్పే ఎన్నో అవకాశాలు మనకు ఉన్నాయి. ఉదాహరణకు, ఆదివారం కావలికోట అధ్యయనంలో మనం కామెంట్స్‌ చెప్పవచ్చు. వారం మధ్యలో జరిగే మీటింగ్స్‌లో దేవుని వాక్యంలో రత్నాలు, సంఘ బైబిలు అధ్యయనం అలాగే ఇతర చర్చా భాగాల్లో మనం కామెంట్స్‌ చెప్పవచ్చు.

3. కామెంట్స్‌ చెప్పడానికి మనకు ఎలాంటి ఇబ్బందులు రావచ్చు? వాటినుండి బయటపడడానికి హెబ్రీయులు 10:24, 25 ఎలా ఉపయోగపడుతుంది?

3 మనందరం యెహోవాను స్తుతించాలని, తోటి బ్రదర్స్‌, సిస్టర్స్‌ని ప్రోత్సహించాలని కోరుకుంటాం. అయితే, కామెంట్స్‌ చెప్తున్నప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఉదాహరణకు, కొంతమందికి కామెంట్స్‌ చెప్పాలంటే భయంభయంగా, గుండె దడగా అనిపించవచ్చు. ఇంకొంతమందికి కామెంట్స్‌ చెప్పాలని ఉత్సాహంగా ఉన్నా, వాళ్లని ఎక్కువసార్లు అడగట్లేదు అని అనిపించవచ్చు. ఈ ఇబ్బందుల నుండి ఎలా బయటపడవచ్చు? అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన ఉత్తరంలో దానికి జవాబు ఉంది. ఆయన మీటింగ్స్‌ ప్రాముఖ్యత గురించి చెప్తూ మనం ‘ఒకరినొకరం ప్రోత్సహించుకోవడం’ మీద మనసుపెట్టాలని చెప్పాడు. (హెబ్రీయులు 10:24, 25 చదవండి.) విశ్వాసంతో మనం చెప్పే చిన్న కామెంట్‌ అయినా, తోటివాళ్లను ప్రోత్సహిస్తుందని గుర్తు పెట్టుకున్నప్పుడు కామెంట్స్‌ చెప్పడానికి ముందుకొస్తాం. అలాగే ఒకవేళ మనల్ని ఎక్కువ అడగకపోయినా కామెంట్స్‌ చెప్పే అవకాశం సంఘంలో వేరేవాళ్లకు దొరుకుతుంది అనే సంతోషంతో మనం ఉండవచ్చు.—1 పేతు. 3:8.

4. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

4 ఈ ఆర్టికల్‌లో ముందుగా, ఎక్కువమంది కామెంట్స్‌ చెప్పే అవకాశంలేని చిన్న సంఘాల్లో ఒకరినొకరు ఎలా ప్రోత్సహించుకోవచ్చో చర్చిస్తాం. తర్వాత, ఎక్కువమంది చేతులెత్తే పెద్ద సంఘాల్లో ఒకరినొకరు ఎలా ప్రోత్సహించుకోవచ్చో చూస్తాం. చివరిగా, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఏయే విషయాలు మన కామెంట్స్‌లో చెప్పవచ్చో చూస్తాం.

చిన్న సంఘాల్లో ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

5. కామెంట్స్‌ చెప్పేవాళ్లు తక్కువమంది ఉన్న సంఘాల్లో ఒకరినొకరు ఎలా ప్రోత్సహించుకోవచ్చు?

5 చిన్న సంఘాల్లో లేదా గ్రూపుల్లో, కామెంట్స్‌ చెప్పేవాళ్లు ఎక్కువమంది ఉండకపోవచ్చు. కొన్నిసార్లయితే, అధ్యయనం నిర్వహించే సహోదరుడు ఎవరు చేతులెత్తుతారా అని ఎదురుచూడవచ్చు. అలాంటప్పుడు మీటింగ్స్‌ సాగదీసినట్టుగా, చప్పగా ఉండవచ్చు. మరి మీరేం చేయవచ్చు? ఎక్కువసార్లు చేతులెత్తండి. అది చూసి మిగతావాళ్లు కూడా చేతులెత్తడానికి ముందుకొస్తారు.

6-7. భయపడకుండా, కంగారుపడకుండా కామెంట్స్‌ చెప్పడానికి కొన్ని సలహాలు ఏంటి?

6 కామెంట్స్‌ చెప్పాలంటే మీకు కంగారుగా అనిపిస్తుందా? అలా మీ ఒక్కరికే కాదు చాలామందికి అనిపిస్తుంది. అయితే మీరు బ్రదర్స్‌, సిస్టర్స్‌ని ప్రోత్సహించాలని అనుకుంటే, మీ కంగారును తగ్గించుకోవడానికి కొన్ని సలహాలు ప్రయత్నించి చూడండి. దానికోసం మీరేం చేస్తే బాగుంటుంది?

7 బహుశా మీరు ఇంతకుముందు వచ్చిన కావలికోట పత్రికల్లోని కొన్ని సలహాల్ని పాటించవచ్చు. b ఉదాహరణకు, బాగా ప్రిపేర్‌ అవ్వండి. (సామె. 21:5) ఆర్టికల్‌లోని విషయాలు మీకు ఎంతబాగా తెలిస్తే, మీరు అంత ఈజీగా కామెంట్‌ చేయగలుగుతారు. అంతేకాదు, చిన్నచిన్న కామెంట్స్‌ చెప్పండి. (సామె. 15:23; 17:27) చిన్న కామెంట్‌ చెప్పినప్పుడు మీకు అంత కంగారుగా, భయంగా అనిపించదు. బహుశా మీ కామెంట్‌ ఒకట్రెండు లైన్లు ఉండవచ్చు. అలా చెప్పినప్పుడు మీ కామెంట్‌ చాలా విషయాలతో ఉండకుండా చిన్నగా ఉంటుంది. బ్రదర్స్‌, సిస్టర్స్‌కి కూడా తేలిగ్గా అర్థమౌతుంది. చిన్న కామెంట్‌ని మీ సొంత మాటల్లో చెప్పినప్పుడు మీరు బాగా ప్రిపేర్‌ అయ్యారని, ఆర్టికల్‌ అంతా మీకు బాగా అర్థమైందని చూపిస్తారు.

8. కామెంట్స్‌ చెప్పడానికి మనం చేసే ప్రయత్నాలన్నిటినీ యెహోవా ఎలా చూస్తాడు?

8 ఇవన్నీ ప్రయత్నించి, ఒకట్రెండు కామెంట్స్‌ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా కంగారుగా అనిపిస్తే ఏం చేయాలి? కామెంట్స్‌ చెప్పడానికి మీరు చేసే ప్రయత్నాలన్నిటినీ యెహోవా విలువైనదిగా చూస్తాడనే భరోసాతో ఉండండి. (లూకా 21:1-4) మీరు చేయగలిగినదంతా చేయడమంటే మీ తలకుమించి చేయడం కాదు. (ఫిలి. 4:5) కాబట్టి మీరేం చేయగలరో ముందు ఆలోచించి పెట్టుకోండి. ఒక లక్ష్యం పెట్టుకోండి, అంటే బహుశా మీరు ఒక చిన్న కామెంట్‌ చేయాలనే లక్ష్యం పెట్టుకోవచ్చు. తర్వాత, ప్రశాంతంగా ఉండడానికి ప్రార్థించండి.

పెద్ద సంఘాల్లో ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

9. పెద్ద సంఘాల్లో ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వవచ్చు?

9 మీ సంఘంలో చాలామంది ప్రచారకులు ఉంటే, మీకు వేరే ఇబ్బంది ఎదురవ్వవచ్చు. బహుశా కామెంట్స్‌ చెప్పడానికి చాలామంది బ్రదర్స్‌, సిస్టర్స్‌ చేతులెత్తవచ్చు. అప్పుడు మీకు ఎక్కువగా అవకాశం దొరక్కపోవచ్చు. డానియెల్లా అనే సిస్టర్‌ గురించి ఆలోచించండి. c ఆమెకు మీటింగ్స్‌లో కామెంట్స్‌ చెప్పడమంటే చాలా ఇష్టం. అలా కామెంట్స్‌ చెప్పడాన్ని ఆమె ఆరాధనలో ఒక భాగంగా చూసేది. అంతేకాదు ఇతరుల్ని ప్రోత్సహించే, బైబిలు సత్యాల మీద తన విశ్వాసాన్ని బలపర్చుకునే అవకాశాలుగా కూడా చూసేది. కానీ ఆమె పెద్ద సంఘానికి వెళ్లినప్పుడు, ఆమెకు కామెంట్స్‌ చెప్పే అవకాశాలు చాలా తక్కువగా దొరికేవి. కొన్నిసార్లయితే మీటింగ్‌ అంతటిలో ఆమెకు ఒక్కసారి కూడా అవకాశం దొరికేదికాదు. ఆమె ఇలా అంటుంది: “నాకు చాలా విసుగు వచ్చేది. నేనేదో అవకాశాన్ని కోల్పోయాను అని అనిపించేది. అలా మళ్లీమళ్లీ జరిగినప్పుడు నన్ను కావాలనే అడగట్లేదేమో అని అనుకునేదాన్ని.”

10. ఎక్కువ కామెంట్స్‌ చెప్పడానికి మీరేం చేయవచ్చు?

10 డానియెల్లాలాగే మీకు కూడా అనిపిస్తుందా? అలాగైతే ఇక కామెంట్స్‌ చెప్పొద్దు, కూర్చుని విందామని అనిపించవచ్చు. కానీ అలా అనుకోకుండా ప్రయత్నిస్తూ ఉండండి. దానికోసం మీరేం చేయవచ్చు? ప్రతీ మీటింగ్‌కి ఎక్కువ కామెంట్స్‌ ప్రిపేర్‌ అవ్వండి. అప్పుడు, మొదటి కొన్ని పేరాలకు మీకు అవకాశం దొరక్కపోయినా, తర్వాతి పేరాల్లో మీకు అవకాశం దొరకవచ్చు. కావలికోట ప్రిపేర్‌ అవుతున్నప్పుడు ప్రతీ పేరా, ఆర్టికల్‌ అంశంతో ఎలా ముడిపడి ఉందో ఆలోచించండి. అలా చేస్తే ఆర్టికల్‌ మొత్తంలో ఎక్కడో ఒకచోట మీరు కామెంట్‌ చెప్పవచ్చు. అంతేకాదు లోతైన సత్యాలు ఉన్న, వివరించడానికి కొంచెం కష్టంగా ఉన్న పేరాల్ని ప్రిపేర్‌ అవ్వండి. (1 కొరిం. 2:10) ఎందుకంటే ఆ పేరాలకు బహుశా ఎక్కువమంది చేతులు ఎత్తకపోవచ్చు. ఒకవేళ ఇవన్నీ చేశాక కూడా మీటింగ్‌లో మీకు కామెంట్‌ చెప్పే అవకాశం దొరక్కపోతే అప్పుడేంటి? మీరు ఏ ప్రశ్నకు కామెంట్‌ ప్రిపేర్‌ అయ్యారో కావలికోట నిర్వహించే బ్రదర్‌కి ముందుగానే వెళ్లి చెప్పవచ్చు.

11. ఫిలిప్పీయులు 2:4 ఏమని ప్రోత్సహిస్తుంది?

11 ఫిలిప్పీయులు 2:4 చదవండి. ఈ లేఖనం ప్రకారం, క్రైస్తవులు తమ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండాలని అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించాడు. దీన్ని మనం మీటింగ్స్‌లో ఎలా పాటించవచ్చు? మనలాగే ఇతరులకు కూడా కామెంట్‌ చెప్పాలని ఉంటుందని గుర్తుంచుకోవడం ద్వారా పాటించవచ్చు.

నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు వేరేవాళ్లకు అవకాశం ఇచ్చినట్టే, మీటింగ్స్‌లో కూడా కామెంట్స్‌ చెప్పే అవకాశం వేరేవాళ్లకు ఇవ్వండి (12వ పేరా చూడండి)

12. మీటింగ్స్‌లో ఇతరుల్ని ప్రోత్సహించడానికి ఒక మంచి పద్ధతి ఏంటి? (చిత్రం కూడా చూడండి.)

12 దీనిగురించి ఒకసారి ఆలోచించండి. స్నేహితులు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు, వేరేవాళ్లకు అవకాశం ఇవ్వకుండా మీరే అంతా మాట్లాడేస్తారా? లేదు కదా. అందరూ మాట్లాడాలని మీరు అనుకుంటారు. అలాగే మీటింగ్స్‌లో కూడా అందరూ కామెంట్స్‌ చెప్పాలని మీరు కోరుకుంటారు. నిజానికి మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ ఒక్క కామెంట్‌ అయినా చెప్పి, తమ విశ్వాసాన్ని చూపించే అవకాశం ఇవ్వడం వాళ్లను ప్రోత్సహించే ఒక మంచి పద్ధతి. (1 కొరిం. 10:24) దాన్ని ఎలా చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

13. ఎక్కువమంది కామెంట్స్‌ చెప్పేలా మనం ఎలా అవకాశం ఇవ్వచ్చు?

13 చిన్నచిన్న కామెంట్స్‌ చెప్పండి. అప్పుడు ఎక్కువమందికి కామెంట్స్‌ చెప్పే అవకాశం దొరుకుతుంది. పెద్దలు, అనుభవం ఉన్న బ్రదర్స్‌, సిస్టర్స్‌ ఈ విషయంలో ముందుండొచ్చు. ఒకవేళ మీరు చిన్న కామెంట్స్‌ చెప్పినా అన్ని విషయాలు చెప్పకుండా జాగ్రత్తపడండి. పేరాలో ఉన్న అన్ని విషయాలు మీరే చెప్పేస్తే, బహుశా వేరేవాళ్లు చెప్పడానికి ఇంకేమి మిగలకపోవచ్చు. ఉదాహరణకు, ఈ పేరానే తీసుకోండి. ఇందులో రెండు సలహాలు ఉన్నాయి. ఒకటి, చిన్న కామెంట్స్‌ చెప్పండి. రెండు, అన్ని విషయాలు చెప్పకుండా జాగ్రత్తపడండి. ఈ పేరాకు ఒకవేళ మిమ్మల్నే ముందు కామెంట్‌ అడిగితే, ఒక్క విషయాన్నే చెప్పడానికి ప్రయత్నించండి.

ఎప్పుడు చెయ్యి ఎత్తకూడదో జాగ్రత్తగా ఆలోచించండి (14వ పేరా చూడండి) f

14. కామెంట్స్‌ చెప్పడానికి చెయ్యి ఎత్తుతున్నప్పుడు ఎందుకు ఆలోచించాలి? (చిత్రం కూడా చూడండి.)

14 కామెంట్‌ చెప్పడానికి చెయ్యి ఎత్తుతున్నప్పుడు కాసేపు ఆలోచించండి. ప్రతీసారి మనమే చెయ్యి ఎత్తుతుంటే, వేరేవాళ్లు చెయ్యి ఎత్తినా మనల్నే అడగాలని ఆ భాగాన్ని నిర్వహించే బ్రదర్‌ని ఒత్తిడి చేసినట్టు ఉంటుంది. ఒకవేళ అలా చేస్తే, ఇతరులకు చెయ్యి ఎత్తాలని అనిపించకపోవచ్చు.—ప్రసం. 3:7.

15. (ఎ) మనల్ని కామెంట్‌ అడగకపోతే మనం ఏం చేయకూడదు? (బి) కామెంట్‌ అడిగేవాళ్లు అందరి గురించి ఎలా ఆలోచించవచ్చు? (“ మీరు కామెంట్స్‌ అడుగుతుంటే” అనే బాక్సు చూడండి.)

15 చాలామంది చేతులెత్తినప్పుడు మనకు ప్రతీసారి కామెంట్‌ చెప్పే అవకాశం రాకపోవచ్చు. కొన్నిసార్లయితే మనల్ని అడగనే అడగకపోవచ్చు. అలాంటప్పుడు మనకు బాధేస్తుంది. కానీ మనల్ని అడగలేదని డీలా పడిపోవద్దు లేదా కోపం తెచ్చుకోకూడదు.—ప్రసం. 7:9.

16. కామెంట్స్‌ చెప్పేవాళ్లను మనం ఎలా ప్రోత్సహించవచ్చు?

16 మీరు చెయ్యెత్తిన ప్రతీసారి మిమ్మల్ని అడగకపోతే, ఇతరులు చెప్పే కామెంట్స్‌ వినండి. మీటింగ్‌ అయిపోయిన తర్వాత వాళ్లు చెప్పిన కామెంట్‌ గురించి వాళ్లని మెచ్చుకోండి. బ్రదర్స్‌, సిస్టర్స్‌ని మెచ్చుకోవడం, ప్రోత్సహించడానికి మీరు ఇచ్చే కామెంట్‌ లాంటిదే. (సామె. 10:21) కాబట్టి మెచ్చుకోవడం ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఇంకో విధానం.

ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి మరికొన్ని విధానాలు

17. (ఎ) పిల్లల వయసుకు తగ్గట్టు కామెంట్‌ ప్రిపేర్‌ అయ్యేలా తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు? (బి) వీడియోలో ఉన్నట్టు, కామెంట్‌ ప్రిపేర్‌ అవ్వడానికి ఏ నాలుగు పనులు చేయాలి? (అధస్సూచి కూడా చూడండి.)

17 మీటింగ్స్‌లో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఇంకా ఏం చేయవచ్చు? మీరు తల్లిదండ్రులైతే, మీ పిల్లల వయసుకు తగ్గట్టు కామెంట్‌ ప్రిపేర్‌ అయ్యేలా సహాయం చేయండి. (మత్త. 21:16) అయితే, కొన్నిసార్లు భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు లేదా నైతిక విషయాలు లాంటి పెద్దపెద్ద అంశాల గురించి చర్చిస్తుండవచ్చు. అలాంటప్పుడు, పిల్లలకు ఒకటో రెండో పేరాలకు కామెంట్‌ చెప్పే అవకాశం ఉండవచ్చు. అలాగే చెయ్యెత్తిన ప్రతీసారి వాళ్లను ఎందుకు అడగకపోవచ్చో అర్థమయ్యేలా పిల్లలకు చెప్పండి. అలా చెప్తే వేరేవాళ్లను అడిగినప్పుడు వాళ్లు చిన్నబుచ్చుకోకుండా ఉంటారు.—1 తిమో. 6:18. d

18. కామెంట్స్‌ చెప్తున్నప్పుడు దృష్టి మన మీదికి రాకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు? (సామెతలు 27:2)

18 యెహోవాను ఘనపర్చే, తోటి క్రైస్తవుల్ని ప్రోత్సహించే కామెంట్స్‌ మనందరం ప్రిపేర్‌ అవ్వొచ్చు. (సామె. 25:11) అయితే, అప్పుడప్పుడు మన సొంత అనుభవాన్ని చెప్పడం తప్పుకాదు. కానీ మన గురించే ఎక్కువగా చెప్పకుండా జాగ్రత్తపడాలి. (సామెతలు 27:2 చదవండి; 2 కొరిం. 10:18) దానికి బదులు మన కామెంట్స్‌ యెహోవా, ఆయన వాక్యం, ఆయన ప్రజల చుట్టూ తిరిగితే బాగుంటుంది. (ప్రక. 4:11) నిజమే కొన్నిసార్లు పేరాలో మన సొంత అభిప్రాయాలు చెప్పమని అడగవచ్చు. అలాంటప్పుడు చెప్పడంలో తప్పులేదు. దానికి సంబంధించి ఒక ఉదాహరణ తర్వాతి పేరాలో చూద్దాం.

19. (ఎ) మీటింగ్స్‌లో వేరేవాళ్ల గురించి ఆలోచించడంవల్ల ఏం చేసినట్టు అవుతుంది? (రోమీయులు 1:11, 12) (బి) కామెంట్స్‌ చెప్పడం గురించి మీ అభిప్రాయం ఏంటి?

19 కామెంట్స్‌ ఇలాగే చెప్పాలి, ఇలా చెప్పకూడదు అనే రూల్స్‌ ఏమీ లేవు. మనందరం కామెంట్స్‌ చెప్పడం వల్ల ఒకరినొకరం ప్రోత్సహించుకునే అవకాశం ఉంటుంది. దీని ఉద్దేశం మనందరం వీలైనంత ఎక్కువ కామెంట్స్‌ చెయ్యాలి. అలాగే మనకు కామెంట్స్‌ చెప్పే అవకాశం దొరికినప్పుడు సంతృప్తిపడాలి, వేరేవాళ్లు కామెంట్స్‌ చెప్తున్నప్పుడు వాళ్లకు కూడా అవకాశం దొరికిందని సంతోషపడాలి. మీటింగ్స్‌లో వేరేవాళ్ల గురించి ఆలోచించినప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకునే అవకాశాలు దొరుకుతాయి.—రోమీయులు 1:11, 12 చదవండి.

పాట 93 దేవా, మా కూటాలను దీవించు

a మీటింగ్స్‌లో కామెంట్స్‌ చెప్పినప్పుడు ఒకరినొకరం ప్రోత్సహించుకుంటాం. అయితే, కొంతమందికి కామెంట్స్‌ చెప్పాలంటే గుండె దడగా అనిపించవచ్చు. ఇంకొంతమందికి కామెంట్స్‌ చెప్పడం బాగా ఇష్టం. కానీ వాళ్లను ఎక్కువ అడగట్లేదు అని అనుకోవచ్చు. మీ పరిస్థితి ఏదైనా, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఒకరినొకరం ఎలా ప్రోత్సహించుకోవచ్చు? మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా ప్రోత్సహించడానికి మనం ఎలాంటి కామెంట్స్‌ చేయవచ్చు? వీటికి ఈ ఆర్టికల్‌లో జవాబులు చూస్తాం.

c కొన్ని అసలు పేర్లు కావు.

f చిత్రాల వివరణ: ఎక్కువమంది చేతులెత్తే పెద్ద సంఘంలో ఒక సహోదరుడు కామెంట్‌ చెప్పాడు. ఆ తర్వాత వేరేవాళ్లకు కామెంట్‌ చెప్పే అవకాశం ఇచ్చాడు.