కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 17

మీ జీవితంలోని ఎత్తుపల్లాల్లో యెహోవా మీకు తోడుంటాడు

మీ జీవితంలోని ఎత్తుపల్లాల్లో యెహోవా మీకు తోడుంటాడు

“నీతిమంతునికి ఎన్నో కష్టాలు వస్తాయి, అయితే వాటన్నిటి నుండి యెహోవా అతన్ని కాపాడతాడు.”​—కీర్త. 34:19.

పాట 44 ఒక దీనుడి ప్రార్థన

ఈ ఆర్టికల్‌లో … a

1. యెహోవా ప్రజలుగా మనకు ఏం తెలుసు?

 యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, మన జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాడని ఆయన ప్రజలుగా మనకు తెలుసు. (రోమా. 8:35-39) అంతేకాదు బైబిలు సూత్రాల్ని పాటిస్తే మన జీవితం సాఫీగా సాగిపోతుందని కూడా మనకు తెలుసు. (యెష. 48:17, 18) కానీ మన జీవితంలో ఊహించని ఎదురుదెబ్బలు తగిలితే అప్పుడేంటి?

2. మనకు ఎలాంటి సమస్యలు రావచ్చు? దానివల్ల మనకు ఎలాంటి ప్రశ్నలు రావచ్చు?

2 యెహోవా సేవకుల జీవితం పూలబాటేమి కాదు. ఉదాహరణకు, మన కుటుంబంలో ఎవరైనా మన ఆశల్ని అడియాశలు చేసుండవచ్చు. మనం చేయాలనుకున్నంత యెహోవా సేవ చేయకుండా తీవ్రమైన అనారోగ్య సమస్యలు కట్టిపడేసుండవచ్చు. ప్రకృతి విపత్తులు మన జీవితాన్ని చిందరవందర చేసుండవచ్చు. లేదా మన నమ్మకాల వల్ల హింస ఎదురైవుండవచ్చు. ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైతే ‘నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనేమైనా తప్పు చేశానా? యెహోవా నన్ను పట్టించుకోవడం మానేశాడా?’ అని అనిపించవచ్చు. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? అలాగైతే డీలా పడిపోకండి. చాలామంది యెహోవా నమ్మకమైన సేవకులకు కూడా ఇలాగే అనిపించింది.—కీర్త. 22:1, 2; హబ. 1:2, 3.

3. కీర్తన 34:19 నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

3 కీర్తన 34:19 చదవండి. ఈ కీర్తనలో ఉన్న రెండు ముఖ్యమైన విషయాల్ని గమనించండి: (1) నీతిమంతులకు కష్టాలు వస్తాయి. (2) యెహోవా వాళ్లను కాపాడతాడు. ఇంతకీ యెహోవా మనల్ని ఎలా కాపాడతాడు? ఒక విధానం ఏంటంటే, ఈ లోకంలోని జీవితం పూలపాన్పులా ఉండదని అర్థంచేసుకోవడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. నిజమే, ఆయన సేవ చేస్తే సంతోషంగా ఉంటామని మాటిస్తున్నాడు. కానీ మన జీవితం ఏ చీకూచింతా లేకుండా ఉంటుందని గ్యారంటీ ఇవ్వట్లేదు. (యెష. 66:14) బదులుగా సదా సంతోషంగా ఉండే భవిష్యత్తు వైపు మన కళ్లు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. (2 కొరిం. 4:16-18) ఈలోపు ఒక్కోరోజు గట్టెక్కడానికి ఆయన సహాయం చేస్తాడు.—విలా. 3:22-24.

4. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?

4 బైబిలు కాలాల్లో, మన కాలంలో నమ్మకమైన యెహోవా సేవకుల ఉదాహరణలు పరిశీలించి వాళ్ల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చూస్తాం. అయితే, మన జీవితంలో ఊహించని ఎదురుదెబ్బలు తగలవచ్చు. కానీ యెహోవా మీద ఆశ పెట్టుకుంటే, ఆయన మనల్ని ఎప్పుడూ నిరాశపర్చడు. (కీర్త. 55:22) ఈ ఉదాహరణల్ని పరిశీలిస్తుండగా మనం ఇలా ఆలోచించవచ్చు: ‘ఒకవేళ నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే నేనేం చేస్తాను? ఈ ఉదాహరణలు యెహోవా మీద నా నమ్మకాన్ని ఎలా పెంచుతున్నాయి? వీటినుండి నేను ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?’

బైబిలు కాలాల్లో

తన మామ లాబాను యాకోబు 20 ఏళ్ల కష్టాన్ని దోచుకున్నాడు, కానీ యెహోవా యాకోబును దీవించాడు (5వ పేరా చూడండి)

5. లాబాను వల్ల యాకోబు ఎలాంటి కష్టాలుపడ్డాడు? (కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి.)

5 బైబిలు కాలాల్లో యెహోవా ఆరాధకుల జీవితాలు ఊహించని మలుపులు తిరిగాయి. యాకోబు గురించి ఆలోచించండి. లాబాను కూతుళ్లలో ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకోమని వాళ్ల నాన్న ఆయనకు చెప్పాడు. ఈ లాబాను వాళ్ల బంధువు అలాగే యెహోవా ఆరాధకుడు కూడా. అలా చేసుకుంటే, యెహోవా ఆయన్ని దీవిస్తాడని కూడా వాళ్ల నాన్న చెప్పాడు. (ఆది. 28:1-4) కాబట్టి యాకోబు వాళ్ల నాన్న చెప్పినట్టే చేశాడు. కనానును విడిచి లాబాను ఇంటికి వెళ్లాడు. ఈ లాబానుకు ఇద్దరు కూతుళ్లు. ఒకరు లేయా, ఇంకొకరు రాహేలు. యాకోబు లాబాను చిన్న కూతురైన రాహేలు ప్రేమలో పడ్డాడు. అందుకే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఏడు సంవత్సరాలు పనిచేయడానికి ఒప్పుకున్నాడు. (ఆది. 29:18) కానీ యాకోబు అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి. లాబాను మాయచేసి తన పెద్ద కూతురు లేయాను ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే, వారం తర్వాత రాహేలును కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. కానీ దానికోసం యాకోబు మరో ఏడు సంవత్సరాలు పనిచేయాలని షరతు పెట్టాడు. (ఆది. 29:25-27) అంతేకాదు వ్యాపార విషయాల్లో కూడా లాబాను లెక్కలేనన్ని అవకతవకలు చేశాడు. మొత్తానికి యాకోబు 20 ఏళ్ల కష్టాన్ని లాబాను దోచుకున్నాడు.—ఆది. 31:41, 42.

6. యాకోబుకు ఇంకా ఏ కష్టాలు వచ్చాయి?

6 యాకోబు కష్టాలు అంతటితో ఆగలేదు. ఆయనది పెద్ద కుటుంబం. అయితే వాళ్ల కొడుకులకు ఒకరంటే ఒకరికి నిమిషం పడేదికాదు. ఆఖరికి వాళ్ల సొంత తమ్ముడైన యోసేపును దాసునిగా అమ్మేశారు. యాకోబు ఇద్దరు కొడుకులు షిమ్యోను, లేవి తమ కుటుంబానికి తలవంపులు, యెహోవా పేరుకు మచ్చ తీసుకొచ్చారు. దానికితోడు యాకోబు ప్రాణంగా ప్రేమించిన రాహేలు తమ రెండో బిడ్డను కని ప్రాణం విడిచింది. ఆ తర్వాత కొంతకాలానికి తీవ్రమైన కరువు కాటేయడంతో, యాకోబు తన ముసలితనంలో ఐగుప్తుకు వెళ్లిపోవాల్సి వచ్చింది.—ఆది. 34:30; 35:16-19; 37:28; 45:9-11, 28.

7. యాకోబు మీద తన ఆమోదం ఉందని యెహోవా ఎలా చూపించాడు?

7 యాకోబుకు అన్ని కష్టాలు వచ్చినా యెహోవా మీద, ఆయన ఇచ్చిన మాటమీద తన విశ్వాసం చెక్కుచెదరలేదు. అందుకే యెహోవా కూడా తన ఆమోదం యాకోబు మీద ఉందని చూపించాడు. ఎలాగంటే, లాబాను ఎన్ని ఎత్తుగడలు వేసినా యెహోవా మాత్రం ఆస్తి ఇచ్చి యాకోబును దీవించాడు. అంతేకాదు చనిపోయాడు, ఇక రాడు అనుకున్న యోసేపును మళ్లీ కలిసినప్పుడు యాకోబు యెహోవాకు ఎన్నిసార్లు థ్యాంక్స్‌ చెప్పుంటాడో ఒకసారి ఆలోచించండి. యాకోబుకు యెహోవాతో దగ్గరి సంబంధం ఉండింది కాబట్టి తనకు వచ్చిన కష్టాల్ని ఇష్టంగా సహించాడు. (ఆది. 30:43; 32:9, 10; 46:28-30) మనకు కూడా యెహోవాతో దగ్గరి సంబంధం ఉంటే మన జీవితం ఊహించని మలుపులు తిరిగినా, వాటన్నిటిని సునాయాసంగా దాటేస్తాం.

8. దావీదు ఏం చేయాలని ఆశపడ్డాడు?

8 రాజైన దావీదు యెహోవా సేవలో తను అనుకున్నవన్నీ చేయలేకపోయాడు. ఉదాహరణకు, దేవుని కోసం ఒక ఆలయం కట్టాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు. తన మనసులో మాటను నాతాను ప్రవక్తకు చెప్పాడు. దానికి నాతాను ప్రవక్త కూడా “సత్యదేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, నీ మనసులో ఏముంటే అది చేయి” అని అన్నాడు. (1 దిన. 17:1, 2) ఆ మాటలు వినగానే దావీదు ఆనందంలో మునిగి తేలుంటాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తను ఎప్పటినుండో కలలుగన్న ఆ పని కోసం నడుం బిగించాడు.

9. తన ఆశలు మీద నీళ్లు చల్లే వార్త విన్న తర్వాత దావీదు ఏం చేశాడు?

9 ఆ వెంటనే, దావీదు రాజు ఆశల మీద నీళ్లు చల్లే ఒక వార్తను నాతాను ప్రవక్త మోసుకొచ్చాడు. ఎందుకంటే “ఆ రాత్రే” యెహోవా నాతాను ప్రవక్తతో తనకోసం ఆలయం కట్టేది దావీదు కాదుగానీ అతని కొడుకుల్లో ఒకరు కడతారని చెప్పాడు. (1 దిన. 17:3, 4, 11, 12) మరి ఈ వార్త వినగానే దావీదు ఏం చేశాడు? తన కొడుకైన సొలొమోను కట్టించే ఆలయానికి డబ్బును, కావాల్సిన సామాన్లు అన్నిటినీ సిద్ధం చేయడం మీద దృష్టిపెట్టి, తను చేయగలిగింది చేశాడు.—1 దిన. 29:1-5.

10. దావీదుకు యెహోవా ఏ ఆశీర్వాదం ఇచ్చాడు?

10 తన కోసం దావీదు ఆలయం కట్టడు అనే చేదు వార్తను చెప్పిన తర్వాత, యెహోవా ఒక తీపి వార్తను చెప్తూ అతనితో ఒప్పందం చేశాడు. తన వంశస్థుల్లో ఒకరు ఎప్పటికీ రాజుగా పరిపాలిస్తారని యెహోవా దావీదుకు మాటిచ్చాడు. (2 సమూ. 7:16) కొత్త లోకంలో తన వంశం నుండి వచ్చిన యేసు వెయ్యేళ్ల పరిపాలన కిందే, తను ఉన్నాడని తెలుసుకున్నప్పుడు దావీదు సంతోషానికి అవధులుండవు. మనం కూడా యెహోవా సేవలో అనుకున్నవన్నీ చేయలేనప్పుడు, మనం కలలో కూడా ఊహించని ఆశీర్వాదం యెహోవా మన కోసం దాచి ఉంచాడని ఈ వృత్తాంతం నేర్పిస్తుంది.

11. వాళ్లు అనుకున్నప్పుడు దేవుని రాజ్యం రాకపోయినా, మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్ని యెహోవా ఎలా దీవించాడు? (అపొస్తలుల కార్యాలు 6:7)

11 మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల జీవితాలు ఊహించని మలుపులు తిరిగాయి. ఉదాహరణకు, వాళ్లు దేవుని రాజ్యం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. కానీ అది ఎప్పుడొస్తుందో వాళ్లకు తెలియలేదు. (అపొ. 1:6, 7) మరి వాళ్లు ఏం చేశారు? అలా ఎదురుచూస్తూ కాలం గడిపే బదులు పరిచర్యలో మునిగిపోయారు. అలా కొత్తకొత్త ప్రాంతాలకు మంచివార్త ప్రకటిస్తుండగా, యెహోవా వాళ్ల ప్రయత్నాలన్నిటినీ దీవించాడని కళ్లారా చూశారు.—అపొస్తలుల కార్యాలు 6:7 చదవండి.

12. కరువు వచ్చినప్పుడు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఏం చేశారు?

12 ఒకసారి “భూమంతటిని” గొప్ప కరువు కాటేసింది. (అపొ. 11:28) మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు దానికి మినహాయింపేమి కాదు. ఆహార కొరత ఏర్పడినప్పుడు వాళ్లెంత అల్లాడిపోయి ఉంటారో ఊహించగలరా? ఆ కరువు కుటుంబ పెద్దల కంటిమీద కునుకు లేకుండా చేసివుంటుంది. అలాగే ఇంట్లో వాళ్లందరి కడుపు నింపడానికి వాళ్లు తల్లడిల్లిపోయి ఉంటారు. మరి పరిచర్య ఇంకా ఎక్కువ చేయాలనే ఆశలు పెట్టుకున్న యౌవనుల సంగతేంటి? ఇక వాళ్ల ప్రణాళికలన్నీ అటకెక్కినట్టేనా? పరిస్థితులు ఎలావున్నా క్రైస్తవులు వెనక్కి తగ్గలేదు. కొత్త పరిస్థితులకు అలవాటుపడ్డారు. వాళ్లు ఎలా వీలైతే అలా పరిచర్య చేశారు. అలాగే యూదయలో ఉన్న తోటి క్రైస్తవులకు ఇవ్వగలిగింది సంతోషంగా ఇచ్చారు.—అపొ. 11:29, 30.

13. కరువులో కూడా క్రైస్తవులు ఎలాంటి దీవెనల్ని రుచిచూశారు?

13 అంత కరువులో కూడా క్రైస్తవులు ఎలాంటి దీవెనల్ని రుచిచూశారు? ఆహారాన్ని, అవసరమైన ఇతర వస్తువుల్ని అందుకున్నప్పుడు యెహోవా అభయహస్తాన్ని కళ్లారా చూశారు. (మత్త. 6:31-33) వాళ్లకు అండగా ఉండడానికి వచ్చిన తోటి ఆరాధకులకు మరింత దగ్గరయ్యారు. అలాగే విరాళం ఇచ్చిన లేదా మరోవిధంగా సహాయం చేసినవాళ్లు, ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని రుచిచూశారు. (అపొ. 20:35) ఏదేమైనా, మారిన పరిస్థితులకు అలవాటుపడిన వాళ్లందర్నీ యెహోవా దీవించాడు.

14. అపొస్తలులైన పౌలు, బర్నబాకు ఏం జరిగింది? దానివల్ల వచ్చిన ఫలితం ఏంటి? (అపొస్తలుల కార్యాలు 14:21, 22)

14 మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు చాలాసార్లు హింస వచ్చింది. కొన్నిసార్లయితే, హింస వస్తుందని వాళ్లు అస్సలు ఊహించలేదు. ఎందుకంటే బర్నబా, పౌలు లుస్త్రలో ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగిందో ఆలోచించండి. మొదట్లో అక్కడున్నవాళ్లు వీళ్లను సాదరంగా ఆహ్వానించి, వీళ్లు చెప్పింది విన్నారు. కానీ తర్వాత వ్యతిరేకులు కొంతమందిని “తమ వైపుకు తిప్పుకున్నారు.” దాంతో చప్పట్లుకొట్టిన చేతులతోనే, పౌలును రాళ్లతో కొట్టి చంపినంత పనిచేశారు. (అపొ. 14:19) కానీ బర్నబా, పౌలు వేరేచోటికి వెళ్లి ప్రకటించారు. ఫలితం ఏంటి? వాళ్లు “చాలామందిని” శిష్యులుగా చేశారు. అలాగే వాళ్ల మాటలవల్ల, చేతలవల్ల తోటి ఆరాధకుల్ని బలపర్చారు. (అపొస్తలుల కార్యాలు 14:21, 22 చదవండి.) హింస వచ్చినా బర్నబా, పౌలు వెన్ను చూపలేదు. దాన్ని చూసి చాలామంది ధైర్యం తెచ్చుకున్నారు. మనం కూడా వెన్ను చూపకుండా యెహోవా చెప్పింది చేస్తూ ఉంటే ఆయన దీవెనల్ని కుమ్మరిస్తూనే ఉంటాడు.

ఈరోజుల్లో

15. బ్రదర్‌ మాక్‌మిలన్‌ నుండి మీరేం నేర్చుకున్నారు?

15 1914 కన్నా ముందు, యెహోవా ప్రజల అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఉదాహరణకు, బ్రదర్‌ ఎ. హెచ్‌. మాక్‌మిలన్‌ గురించి ఆలోచించండి. ఆ సమయంలో ఉన్న చాలామందిలాగే ఆయన కూడా తొందరలోనే పరలోకానికి వెళ్లిపోతానని అనుకున్నాడు. సెప్టెంబరు, 1914​లో ఆయన ఇచ్చిన ఒక ప్రసంగంలో ఇలా అన్నాడు: “బహుశా ఇదే నా చివరి ప్రసంగం అయ్యుంటుంది.” కానీ మనందరికి తెలుసు అది ఆయన చివరి ప్రసంగం కాదు. ఆ తర్వాత బ్రదర్‌ మాక్‌మిలన్‌ ఇలా అన్నాడు: “బహుశా మనలో కొంతమంది వెంటనే పరలోకానికి వెళ్లిపోతామని తొందరపడి ఆలోచించినట్టున్నాం. దానికి బదులు, మనం ప్రభువు సేవలో మునిగిపోయి ఉండాల్సింది.” బ్రదర్‌ మాక్‌మిలన్‌ ఉత్సాహంగా పరిచర్య చేస్తూ ఆ పనిలోనే మునిగిపోయాడు. అలాగే యుద్ధం చేయనందుకు జైలుకు వెళ్లిన చాలామంది బ్రదర్స్‌ని ఆయన ప్రోత్సహించాడు. అంతేకాదు ఆయన చివరిదశలో కూడా నమ్మకంగా మీటింగ్స్‌కి వెళ్లాడు. పరలోకానికి వెళ్లడానికి ఎదురుచూస్తూ, అలా తన సమయాన్ని మంచిగా ఉపయోగించుకున్నందుకు బ్రదర్‌ మాక్‌మిలన్‌ ఎలా ప్రయోజనం పొందాడు? 1966​లో ఆయన చనిపోయే కొద్దిరోజుల ముందు ఇలా చెప్పాడు: “ఈ రోజు వరకు నా విశ్వాసం పెరుగుతూనే వచ్చింది.” మనం కూడా కష్టాల్ని చాలాకాలంగా సహిస్తూ ఉంటే ఆ బ్రదర్‌ ఉంచిన చక్కని ఆదర్శాన్ని అనుకరించవచ్చు.—హెబ్రీ. 13:7.

16. బ్రదర్‌ హెర్బర్ట్‌ జెన్నింగ్స్‌, ఆయన భార్య ఎలాంటి ఊహించని పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? (యాకోబు 4:14)

16 చాలామంది యెహోవా సేవకులు ఊహించని జబ్బులతో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఉదాహరణకు ఘానాలో బ్రదర్‌ హెర్బర్ట్‌ జెన్నింగ్స్‌, ఆయన భార్య మిషనరీలుగా సంతోషంగా తమ నియామకాన్ని చేస్తున్నప్పుడు, తనకు ఊహించని మానసిక సమస్య వచ్చిందని తన జీవిత కథలో చెప్పాడు. b యాకోబు 4:14​లో ఉన్న మాటల్ని గుర్తుచేసుకుంటూ బ్రదర్‌ జెన్నింగ్స్‌ ఏం అంటున్నాడంటే: “అది మేము ఎదురుచూడని ‘రేపు.’ ఇక చేసేదేమీలేక వాస్తవానికి తలవంచి ఘానాను, అక్కడున్న స్నేహితుల్ని విడిచిపెట్టి ట్రీట్‌మెంట్‌ కోసం కెనడాకు వచ్చేశాం.” (చదవండి.) తమ కష్టాలకు ఎదురీదుతూ నమ్మకంగా సేవచేయడానికి బ్రదర్‌ జెన్నింగ్స్‌కి, ఆయన భార్యకు యెహోవా సహాయం చేస్తూ వచ్చాడు.

17. బ్రదర్‌ జెన్నింగ్స్‌ నుండి ఇతరులు ఎలా ప్రయోజనం పొందారు?

17 బ్రదర్‌ జెన్నింగ్స్‌ తన జీవిత కథలో మనసువిప్పి చెప్పిన మాటలు, ఎంతోమంది జీవితాల్లో చెరగని ముద్రను వేశాయి. ఒక సిస్టర్‌ ఇలా అంటుంది: “నేను ఎన్నో ఆర్టికల్స్‌ చదివాను. కానీ ఈ ఆర్టికల్‌ చదివినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తనకు వచ్చిన జబ్బు వల్ల బ్రదర్‌ జెన్నింగ్స్‌ తన నియామకాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చదివినప్పుడు, నాకున్న పరిస్థితుల గురించి సరిగ్గా ఆలోచించేలా అది నాకు సహాయం చేసింది.” అదేవిధంగా ఇంకొక బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “పది సంవత్సరాలు సంఘపెద్దగా సేవచేసిన తర్వాత, నాకున్న మానసిక సమస్యవల్ల ఆ సేవను వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేను చేతకానివాణ్ణని అనిపించింది. అలాగే జీవిత కథల్ని చదివితే ఇంకా బాధలో కూరుకుపోతాను అని అనుకున్నాను. కానీ బ్రదర్‌ జెన్నింగ్స్‌ చూపించిన సహనం గురించి చదివినప్పుడు అది నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.” మనం కూడా అనుకోని కష్టాల్ని సహించినప్పుడు ఇతరుల్ని ప్రోత్సహించేవాళ్లుగా ఉంటామని అది మనకు గుర్తుచేస్తుంది. మన జీవితం ఊహించని మలుపులు తిరిగినా మనం విశ్వాసానికి, సహనానికి ప్రతిరూపాలుగా నిలిచిపోవచ్చు.—1 పేతు. 5:9.

మనం యెహోవా మీద ఆధారపడితే, మన జీవితంలో వచ్చే ఒడిదుడుకులు మనల్ని ఆయనకు ఇంకా దగ్గర చేస్తాయి (18వ పేరా చూడండి)

18. ఈ చిత్రాల్లో చూపిస్తున్నట్టు, నైజీరియాలోని విధవరాలి నుండి మీరేం నేర్చుకోవచ్చు?

18 కోవిడ్‌ లాంటి మహమ్మారులు చాలామంది యెహోవా ప్రజల జీవితాల్ని కుదిపేశాయి. ఉదాహరణకు, నైజీరియాలోని ఒక విధవరాలి దగ్గర చాలా తక్కువ ఆహారం, డబ్బులు మాత్రమే ఉన్నాయి. ఒకరోజు పొద్దున వాళ్ల పాప, ‘ఇది తిన్న తర్వాత మనకు ఇక ఏమీలేదు కదా మమ్మీ’ అని ఆమెతో అంది. అప్పుడు ఆ సిస్టర్‌ వాళ్ల పాపతో ‘అవును ఇక ఏమీలేదు. కానీ మనం సారెపతులోని విధవరాలిలా ఇది తినేసి, మన పూర్తి భారాన్ని యెహోవా మీద వేద్దాం’ అని అంది. (1 రాజు. 17:8-16) మధ్యాహ్నం ఏం తినాలా అని ఆలోచించేలోపే, తోటి సహోదరులు ఆమెకు ఒక ప్యాకెట్‌ ఇచ్చారు. దాంట్లో రెండు వారాల కంటే ఎక్కువ రోజులకు సరిపోయే ఆహారం ఉంది. ఆ సిస్టర్‌ తన పాపతో అన్న మాటల్ని యెహోవా కూడా విన్నాడు. నిజానికి, మనం యెహోవా మీద ఆధారపడితే మన జీవితంలో వచ్చే ఒడిదుడుకులు మనల్ని ఆయనకు ఇంకా ఎక్కువ దగ్గర చేస్తాయి.—1 పేతు. 5:6, 7.

19. బ్రదర్‌ అలెక్సియా యర్‌షోవ్‌ ఎలాంటి హింసను సహించాడు?

19 ఈమధ్య కాలంలో చాలామంది బ్రదర్స్‌, సిస్టర్స్‌ ఊహించని హింసను ఎదుర్కొన్నారు. రష్యాలో ఉంటున్న బ్రదర్‌ అలెక్సియా యర్‌షోవ్‌ గురించి చూడండి. 1994​లో ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ ప్రాంతంలో పరిచర్య చేయడానికి కొంత స్వేచ్ఛ ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రష్యాలో పరిస్థితులు తారుమారయ్యాయి. 2020​లో పోలీసులు బ్రదర్‌ యర్‌షోవ్‌ ఇంట్లోకి చొరబడి, సోదా చేసి ఆ ఇంటిని జప్తు చేశారు. కొన్ని నెలల తర్వాత, ఒక వీడియో ఆధారంగా ప్రభుత్వం ఆయన మీద క్రిమినల్‌ కేసు పెట్టింది. ఆ వీడియోని, బ్రదర్‌ దగ్గర సంవత్సరం పైగా స్టడీ తీసుకుంటున్నట్టు నటించిన వ్యక్తి తీశాడు. అది ఎంతపెద్ద వెన్నుపోటో కదా!

20. యెహోవాతో ఉన్న తన బంధాన్ని బ్రదర్‌ యర్‌షోవ్‌ ఎలా బలపర్చుకున్నాడు?

20 బ్రదర్‌ యర్‌షోవ్‌ హింసను నమ్మకంగా సహించడంవల్ల ఏదైనా ఉపయోగం ఉందా? ఉంది. యెహోవాతో ఆయనకున్న బంధం బలపడింది. ఆయన ఏమంటున్నాడంటే: “నేను, నా భార్య కలిసి ఎక్కువసార్లు ప్రార్థిస్తూ ఉంటాం. యెహోవా సహాయం లేకుండా నేను ఆ పరిస్థితి నుండి గట్టెక్కేవాణ్ణి కాదు. డీలా పడిపోకుండా ఉండడానికి వ్యక్తిగత అధ్యయనం నాకు సహాయం చేస్తుంది. అలాగే గతంలోని నమ్మకమైన సేవకుల ఉదాహరణల గురించి నేను లోతుగా ఆలోచిస్తాను. యెహోవా మీద నమ్మకం ఉంచుతూ ప్రశాంతంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో చెప్పే ఎన్నో ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి.”

21. ఈ ఆర్టికల్‌లో మనం ఏం నేర్చుకున్నాం?

21 ఈ ఆర్టికల్‌లో మనం ఏం నేర్చుకున్నాం? మన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. అయినా, యెహోవా మీద ఆధారపడితే ఆయన ఎప్పుడూ మన వెన్నంటే ఉంటాడు. ఈ ఆర్టికల్‌ ముఖ్య లేఖనం చెప్పినట్టు “నీతిమంతునికి ఎన్నో కష్టాలు వస్తాయి, అయితే వాటన్నిటి నుండి యెహోవా అతన్ని కాపాడతాడు.” (కీర్త. 34:19) కాబట్టి మనకు వచ్చే కష్టాల మీద కాకుండా, వాటిని తట్టుకోవడానికి యెహోవా ఇచ్చే శక్తి మీద మనసుపెడదాం. అప్పుడు మనం కూడా అపొస్తలుడైన పౌలులాగే “నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను” అని చెప్తాం.—ఫిలి. 4:13.

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

a మన జీవితంలో మనం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటాం. అయితే యెహోవా తన నమ్మకమైన ఆరాధకులకు ఎప్పుడూ తోడుంటాడు అనే భరోసాతో ఉండవచ్చు. యెహోవా తన ఆరాధకులకు గతంలో ఎలా తోడున్నాడు? మనకాలంలో ఎలా తోడుంటున్నాడు? బైబిలు కాలాల్లోని అలాగే మన కాలంలోని కొన్ని ఉదాహరణల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అలా పరిశీలించడంవల్ల, యెహోవాను నమ్ముకుంటే ఆయన మనకు ఎప్పుడూ తోడుంటాడనే ధీమాతో ఎలా ఉండవచ్చో చూస్తాం.