అధ్యయన ఆర్టికల్ 19
యెహోవా మాటిచ్చిన కొత్త లోకంపై మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి
‘యెహోవా ఏదైనా మాటిస్తే, దాన్ని నెరవేర్చకుండా ఉంటాడా?’—సంఖ్యా. 23:19.
పాట 142 మన నిరీక్షణను గట్టిగా పట్టుకుందాం
ఈ ఆర్టికల్‌లో … a
1-2. కొత్త లోకం కోసం ఎదురుచూస్తూ మనం ఏం చేస్తూ ఉండాలి?
యెహోవా మాటిచ్చినట్టు ఈ వ్యవస్థ స్థానంలో, నీతితో ఉండే కొత్త లోకం రాబోతుందని మనం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం. (2 పేతు. 3:13) అయితే అది ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. కానీ జరుగుతున్న సంఘటనల్ని బట్టి చూస్తే అది త్వరలోనే వస్తుందని తెలుస్తుంది.—మత్త. 24:32-34, 36; అపొ. 1:7.
2 ఈలోగా, మనం ఎంతకాలం నుండి సత్యంలో ఉన్నా, యెహోవా ఇచ్చిన మాట మీద మన విశ్వాసాన్ని బలపర్చుకుంటూనే ఉండాలి. ఎందుకు? ఎందుకంటే బలమైన విశ్వాసం కూడా బలహీనపడవచ్చు. నిజానికి అపొస్తలుడైన పౌలు బలహీనపడిన విశ్వాసాన్ని ‘సులభంగా చిక్కుల్లో పడేసే పాపం’ అని అన్నాడు. (హెబ్రీ. 12:1) మన విశ్వాసం అంతకంతకూ తరిగిపోకుండా ఉండాలంటే, కొత్త లోకం అక్షర సత్యమని చూపించే రుజువుల గురించి మనం ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండాలి.—హెబ్రీ. 11:1.
3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
3 యెహోవా మాటిచ్చిన కొత్త లోకం మీద మన విశ్వాసాన్ని బలపర్చుకునే మూడు విధానాల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అవేంటంటే: (1) యేసు చేసిన ప్రాణ త్యాగం గురించి ధ్యానించడం, (2) యెహోవాకు ఉన్న శక్తి గురించి ఆలోచించడం, (3) యెహోవాకు దగ్గర చేసే పనుల్లో బిజీగా ఉండడం. తర్వాత, హబక్కూకుకు యెహోవా ఇచ్చిన సందేశం నేడు మన విశ్వాసాన్ని ఎలా బలపరుస్తుందో తెలుసుకుంటాం. ముందుగా, కొత్త లోకం మీద మనకు ఉన్న విశ్వాసాన్ని నీరుగార్చే ఎలాంటి పరిస్థితుల్ని ఈరోజుల్లో ఎదుర్కొంటామో చూస్తాం.
విశ్వాసాన్ని నీరుగార్చే పరిస్థితులు
4. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు బలమైన విశ్వాసం అవసరం?
4 మనం ప్రతీరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు బలమైన విశ్వాసం అవసరం. ఉదాహరణకు స్నేహితులు, వినోదం, చదువు, పెళ్లి, పిల్లలు, ఉద్యోగం వంటి విషయాల్లో మనం నిర్ణయాలు తీసుకుంటాం. అప్పుడు మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఈ లోకం త్వరలోనే ఆవిరైపోతుందని, దేవుడు మాటిచ్చిన కొత్త లోకం దాని స్థానంలో వస్తుందని నమ్ముతున్నట్టు నా నిర్ణయాలు చూపిస్తున్నాయా? లేదా చనిపోతే అంతా అయిపోతుందని ఆలోచించే ప్రజల్లా నా నిర్ణయాలు ఉన్నాయా?’ (మత్త. 6:19, 20; లూకా 12:16-21) కొత్త లోకం కనుచూపుమేరలోనే ఉందని మనం బలంగా నమ్మినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటాం.
5-6. కష్టాలు మనల్ని చుట్టుముట్టేసినప్పుడు బలమైన విశ్వాసం ఎందుకు అవసరమో ఒక ఉదాహరణతో చెప్పండి.
5 కష్టాలు వచ్చినప్పుడు కూడా మనకు బలమైన విశ్వాసం అవసరం. వ్యతిరేకతను, తీవ్రమైన అనారోగ్య సమస్యను లేదా ఇంకేదైనా సమస్యను మనం ఎదుర్కోవచ్చు. మొదట్లో దాన్ని మనం సహించగలమనే అనుకుంటాం. కానీ కష్టాల కాలనిడివి పెరిగేకొద్దీ వాటిని సహించడానికి, సంతోషంగా యెహోవా సేవలో కొనసాగడానికి మనకు బలమైన విశ్వాసం అవసరం.—రోమా. 12:12; 1 పేతు. 1:6, 7.
6 మనం కష్టాల్ని ఎదుర్కొంటున్నప్పుడు యెహోవా తీసుకొచ్చే కొత్త లోకం ఎప్పటికైనా వస్తుందా అని అనిపించవచ్చు. అంతమాత్రాన మన విశ్వాసం బలహీనపడిపోయినట్టా? అలా ఏం కాదు. ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. వేసవికాలంలో ఎండలు మండిపోతున్నప్పుడు, అసలు ఈ సంవత్సరం వర్షాకాలం వస్తుందా అని మనకు అనిపించవచ్చు. కానీ కాలం మారినప్పుడు వర్షాలు ఖచ్చితంగా పడతాయి. అలాగే కష్టాలు మనల్ని చుట్టుముట్టేసినప్పుడు, కొత్త లోకం ఇక రాదేమో అని మనకు అనిపించవచ్చు. కానీ కొత్త లోకం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే యెహోవా దాన్ని మాటిచ్చాడు. ఆయన ఏదైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటాడు అని మనకు తెలుసు. (కీర్త. 94:3, 14, 15; హెబ్రీ. 6:17-19) కాబట్టి ఆ ధీమాతో మనం బలమైన విశ్వాసం చూపిస్తూ జీవితంలో యెహోవా ఆరాధనను అన్నిటికన్నా ముందుపెడతాం.
7. ఏ ఆలోచన మనల్ని కమ్మేయకుండా జాగ్రత్తపడాలి?
7 పరిచర్య చేస్తున్నప్పుడు కూడా మనకు బలమైన విశ్వాసం అవసరం. కొత్త లోకం గురించిన “మంచివార్తను” మనం ప్రకటిస్తున్నప్పుడు, చాలామంది అదొక పగటికల అని అనుకుంటారు. (మత్త. 24:14; యెహె. 33:32) వాళ్ల ఆలోచన మనల్ని కమ్మేయకుండా మనం జాగ్రత్తపడాలి. దాని కోసం మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు బలపర్చుకుంటూనే ఉండాలి. దాన్నెలా చేయవచ్చో తెలిపే మూడు విషయాల్ని ఇప్పుడు చూద్దాం.
యేసు చేసిన ప్రాణ త్యాగం గురించి ధ్యానించండి
8-9. యేసు చేసిన ప్రాణ త్యాగం గురించి ధ్యానించడం మన విశ్వాసాన్ని ఎలా బలపరుస్తుంది?
8 మొదటిగా, యేసు చేసిన ప్రాణ త్యాగం గురించి ధ్యానించడం ద్వారా మన విశ్వాసాన్ని బలపర్చుకోవచ్చు. యెహోవా చెప్పిన మాటలన్నీ ఖచ్చితంగా నిజమౌతాయని ఆ త్యాగం భరోసా ఇస్తుంది. యెహోవా ఆ త్యాగాన్ని ఎందుకు చేశాడో, అది ఎందుకు అంత పెద్ద త్యాగమో జాగ్రత్తగా ఆలోచించండి. అలా చేసినప్పుడు యెహోవా మాటిచ్చిన శాశ్వత జీవితం ఖచ్చితంగా వస్తుందనే మన విశ్వాసం బలపడుతుంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు?
9 ఎందుకంటే యెహోవా ఎంత పెద్ద త్యాగం చేశాడో ఆలోచించండి. ఆయన తన ఒక్కగానొక్క కుమారుణ్ణి, తనకు ఎంతో చేదోడువాదోడుగా ఉన్న కుమారుణ్ణి, పరిపూర్ణ మనిషిగా పరలోకం నుండి భూమ్మీదకు పంపించాడు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు మనిషి పడ్డ ప్రతీ కష్టాన్ని పడ్డాడు. అలాగే ఆయన అష్టకష్టాలుపడి, చివరికి బాధాకరంగా చనిపోయాడు. అవన్నీ అనుమతించడం ద్వారా యెహోవా ఎంత పెద్ద త్యాగం చేశాడో కదా! మనం కొంతకాలం సంతోషంగా ఉండి, ఆ తర్వాత ఆవిరైపోయే జీవితం కోసం మన ప్రియ పరలోక తండ్రి అంత త్యాగం చేసుంటాడా? కాదు కదా. (యోహా. 3:16; 1 పేతు. 1:18, 19) యెహోవా అంత పెద్ద త్యాగం చేశాడంటే, కొత్త లోకంలో మనకు ఖచ్చితంగా ఆయుష్షు నిండిపోని జీవితాన్ని ఇస్తాడు.
యెహోవాకు ఉన్న శక్తి గురించి ఆలోచించండి
10. ఎఫెసీయులు 3:20 ప్రకారం, యెహోవా ఏం చేయగలడు?
10 రెండోదిగా, యెహోవాకు ఉన్న శక్తి గురించి ఆలోచించడంవల్ల మన విశ్వాసాన్ని బలపర్చుకోవచ్చు. తాను మాటిచ్చిన ప్రతీది నిజం చేసే శక్తి ఆయనకుంది. అయితే, కొత్త లోకంలో ఆయన ఇచ్చే జీవితం పగటికల అని చాలామంది అనుకుంటారు. కానీ మనుషులకు అసాధ్యం అనిపించేదాన్ని చేసి చూపించడం యెహోవాకు అలవాటే. ఎంతైనా ఆయన సర్వశక్తిగల దేవుడు కదా! (యోబు 42:2; మార్కు 10:27) అంత శక్తి ఉన్న దేవుడు చిన్నాచితకా విషయాల గురించి మాటిస్తాడా?—ఎఫెసీయులు 3:20 చదవండి.
11. మనుషులకు అసాధ్యం అనిపించింది యెహోవా సుసాధ్యం చేసిన ఉదాహరణల్లో ఏదైనా ఒకటి చెప్పండి. (“ యెహోవా అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు” అనే బాక్సు చూడండి.)
11 మనుషులకు అసాధ్యం అనిపించినది గతంలో యెహోవా సుసాధ్యం చేసిన కొన్ని ఉదాహరణల్ని ఇప్పుడు చూద్దాం. ఒకటి, అబ్రాహాము శారాలకు ముసలితనంలో ఒక కొడుకు పుడతాడని యెహోవా మాటిచ్చాడు. అది అసాధ్యం అనిపించింది, కానీ జరిగింది. (ఆది. 17:15-17) రెండోది, అబ్రాహాము వంశస్థులకు కనాను దేశాన్ని ఇస్తానని యెహోవా మాటిచ్చాడు. కానీ అప్పుడది అసాధ్యం అనిపించింది. ఎందుకంటే, అప్పుడు వాళ్లు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. కానీ తర్వాత అదికూడా నిజమైంది. మూడోది, ఎలీసబెతుకు ముసలితనంలో ఒక కొడుకు పుడతాడని యెహోవా చెప్పాడు. అదికూడా అసాధ్యం అనిపించింది. కానీ అదికూడా నెరవేరింది. నాలుగవది, కన్యగా ఉన్న మరియకు కూడా ఒక కొడుకు పుడతాడని యెహోవా చెప్పాడు. అదికూడా అసాధ్యం అనిపించింది. కానీ యేసు పుట్టాడు. అలా యేసు పుడతాడని యెహోవా ఎన్నో వేల సంవత్సరాల ముందే ఏదెను తోటలోనే మాటిచ్చాడు.—ఆది. 3:15.
12. యెహోవాకు ఉన్న శక్తి గురించి యెహోషువ 23:14, యెషయా 55:10, 11 ఏం భరోసా ఇస్తున్నాయి?
12 యెహోవా మాటిచ్చి, నెరవేర్చిన ఎన్నో సంఘటనల గురించి ధ్యానించినప్పుడు, ఆయనకు ఉన్న శక్తి మీద మన విశ్వాసం పెరుగుతుంది. (యెహోషువ 23:14; యెషయా 55:10, 11 చదవండి.) అప్పుడు కొత్త లోకం గురించి ఆయన ఇచ్చిన మాట పగటికల కాదని, గాల్లో మేడలు కట్టడం లాంటిది కాదని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పగలుగుతాం. కొత్త ఆకాశం, కొత్త భూమి గురించి యెహోవాయే ఇలా చెప్పాడు: “ఈ మాటలు నమ్మదగినవి, సత్యమైనవి.”—ప్రక. 21:1, 5.
యెహోవాకు దగ్గర చేసే పనుల్లో బిజీగా ఉండండి
13. మీటింగ్స్ వల్ల మన విశ్వాసం ఎలా బలపడుతుంది? వివరించండి.
13 మూడవదిగా, యెహోవాకు దగ్గర చేసే పనుల్లో బిజీగా ఉన్నప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. ఉదాహరణకు, మీటింగ్స్‌కి వెళ్లడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతామో ఆలోచించండి. యానా అనే సిస్టర్ పదుల సంవత్సరాలుగా పూర్తికాల సేవలో వేర్వేరు నియామకాలు చేసింది. b ఆమె ఇలా చెప్తుంది: “నేను విశ్వాసంలో పాతుకుపోయేలా మీటింగ్స్ నాకు సహాయం చేశాయి. టాక్ ఇచ్చే బ్రదర్ అంత ఆసక్తిగా చెప్పకపోయినా లేదా దానిలో కొత్త విషయాలేమీ తేకపోయినా, బైబిలు సత్యాన్ని ఇంకా బాగా అర్థంచేసుకునే ఏదోక విషయం నా చెవిన పడేది. దానివల్ల నా విశ్వాసం బలపడింది.” అయితే మీటింగ్స్‌లో వేరేవాళ్ల కామెంట్స్ వినడంవల్ల కూడా మన విశ్వాసం బలపడుతుంది.—రోమా. 1:11, 12; 10:17.
14. పరిచర్య మన విశ్వాసాన్ని ఎలా పెంచుతుంది?
14 పరిచర్యలో పాల్గొనడంవల్ల కూడా మన విశ్వాసం బలపడుతుంది. (హెబ్రీ. 10:23) 70 కంటే ఎక్కువ సంవత్సరాలుగా యెహోవా సేవచేస్తున్న బార్బరా అనే బ్రదర్ ఇలా అంటున్నాడు: “ప్రీచింగ్ చేయడంవల్ల నా విశ్వాసం బలపడుతూ వచ్చింది. యెహోవా మాటిచ్చిన అద్భుతమైన విషయాల గురించి నేను ఎంతెక్కువ మాట్లాడితే, నా విశ్వాసం అంతెక్కువ బలపడడం నేను చూశాను.”
15. వ్యక్తిగత అధ్యయనం మన విశ్వాసాన్ని ఎలా పెంచుతుంది? (చిత్రాలు కూడా చూడండి.)
15 యెహోవాకు దగ్గర చేసే పనుల్లో ఇంకో పని ఏంటంటే, వ్యక్తిగత అధ్యయనం. దీనివల్ల కూడా మన విశ్వాసం బలపడుతుంది. సూజన్ అనే సిస్టర్ అనుభవాన్ని గమనించండి. వ్యక్తిగత అధ్యయనం కోసం ముందే పట్టిక వేసుకోవడం ఎంతో ఉపయోగపడిందని తను చెప్తుంది. తను ఏమంటుందంటే: “నేను ఆదివారం రోజే తర్వాతి వారం జరిగే కావలికోట ఆర్టికల్ ప్రిపేర్ అవుతాను. మధ్యవారం జరిగే మీటింగ్ కోసం సోమవారం, మంగళవారం ప్రిపేర్ అవుతాను. అలాగే మిగిలిన రోజుల్లో నేను వ్యక్తిగత అధ్యయనం చేస్తాను.” ఇలా పట్టిక వేసుకుని, దాన్ని పాటించడంవల్ల సూజన్ సిస్టర్ విశ్వాసం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఐరిన్ అనే ఇంకో సిస్టర్ అనుభవాన్ని చూడండి. ఆమె పదుల సంవత్సరాలుగా ప్రపంచ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తుంది. బైబిలు ప్రవచనాల గురించి అధ్యయనం చేయడంవల్ల ఆమె విశ్వాసం బలపడింది. ఆమె ఏమంటుందంటే: “యెహోవా చెప్పిన ప్రవచనాల్లో ఒక్కటికూడా పొల్లుపోకుండా నెరవేరడం చూసినప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించింది.” c
“అది తప్పకుండా నెరవేరుతుంది”
16. యెహోవా హబక్కూకుకు ఇచ్చిన భరోసా మనకెలా వర్తిస్తుంది? (హెబ్రీయులు 10:36, 37)
16 కొంతమంది యెహోవా సేవకులు ఈ వ్యవస్థ ముంగిపు కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. మనవైపు నుండి చూస్తే, యెహోవా మాటిచ్చింది నెరవేరడం ఆలస్యం అవుతుందని అనిపించవచ్చు. యెహోవా హబక్కూకు ప్రవక్తకు ఇలా భరోసా ఇచ్చాడు: “ఆ దర్శనం దాని నియమిత సమయం కోసం ఎదురుచూస్తోంది, అది నెరవేరడానికి త్వరపడుతోంది, అది అబద్ధం అవ్వదు. ఒకవేళ ఆలస్యమైనా, దానికోసం కనిపెట్టుకొని ఉండు! ఎందుకంటే, అది తప్పకుండా నెరవేరుతుంది. ఆలస్యం అవ్వదు!” (హబ. 2:3) ఆ మాటలు హబక్కూకు ప్రవక్తకు మాత్రమేనా? లేదా మనకు కూడా వర్తిస్తాయా? పవిత్రశక్తి ప్రేరణతో అపొస్తలుడైన పౌలు కొత్త లోకం కోసం ఎదురుచూస్తున్న క్రైస్తవులకు ఆ మాటల్ని అన్వయించాడు. (హెబ్రీయులు 10:36, 37 చదవండి.) అవును, యెహోవా మాటిచ్చిన కొత్త లోకం లేట్ అవుతున్నట్టు అనిపించినా “అది తప్పకుండా నెరవేరుతుంది. ఆలస్యం అవ్వదు!”
17. యెహోవా హబక్కూకుకు ఇచ్చిన సలహాను ఒక సిస్టర్ ఎలా పాటించింది?
17 “ఎదురుచూస్తూ ఉండమనే” సలహాను పాటించిన చాలామంది యెహోవా సేవకులు దశాబ్దాలుగా కళ్లు కాయలుకాసేలా ఎదురుచూశారు. లూయీస్ అనే సిస్టర్ అనుభవాన్ని చూడండి. ఆమె 1939లో యెహోవా సేవ చేయడం మొదలుపెట్టింది. ఆమె ఇలా అంటుంది: “నా స్కూలు చదువు పూర్తయ్యేలోపు హార్‌మెగిద్దోన్ వచ్చేస్తుందని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. సంవత్సరాలు గడుస్తుండగా నేను నోవహు, అబ్రాహాము, యోసేపు అలాగే ఇతరుల ఉదాహరణల్ని పరిశీలించాను. యెహోవా ఇచ్చిన వాగ్దానం కోసం వాళ్లు ఎంతగా ఎదురుచూశారో నేను నేర్చుకున్నాను. ఆ ఉదాహరణల్నే నేను ‘ఎదురుచూసినవాళ్లు’ అని అంటాను. ఎదురుచూస్తూ ఉండడంవల్ల నేను, ఇతరులు కొత్త లోకం తప్పకుండా వస్తుందనే నమ్మకంతో ఉండగలిగాం.” ఆమే కాదు చాలాకాలంగా యెహోవా సేవచేస్తున్న ఎంతోమంది ఆ మాటలతో ఒప్పుకుంటారు.
18. మనచుట్టూ ఉన్న సృష్టిని చూడడం కొత్త లోకంపై మన విశ్వాసాన్ని ఎలా పెంచుతుంది?
18 నిజమే ఇంకా కొత్త లోకం రాలేదు. కానీ అది ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి మనం చూస్తున్న నక్షత్రాలు, చెట్లు, జంతువులు, తోటి మనుషుల గురించి ఆలోచించండి. ఇవేవీ ఇంతకుముందు లేవు. కానీ ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే యెహోవా వాటిని సృష్టించాడు. కాబట్టి ఇవి ఉన్నాయా లేవా అని మనం సందేహపడం. (ఆది. 1:1, 26, 27) యెహోవా కొత్త లోకం తీసుకొస్తానని కూడా మాటిచ్చాడు. ఆయన మాటమీద నిలబడతాడు. కాబట్టి కొత్త లోకంలో మనుషులందరూ వందశాతం ఆరోగ్యంతో ఎప్పటికీ జీవిస్తారు. ఈ విశ్వం ఉందనడం ఎంత వాస్తవమో, యెహోవా అనుకున్న సమయానికి కొత్త లోకం రావడం కూడా అంతే వాస్తవం.—యెష. 65:17; ప్రక. 21:3, 4.
19. మీ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవచ్చు?
19 ఈలోగా, మీ విశ్వాసాన్ని బలపర్చుకునే ఏ అవకాశాన్ని వదులుకోకండి. యేసు చేసిన త్యాగం మీద కృతజ్ఞత పెంచుకోండి, యెహోవాకు ఉన్న శక్తి గురించి ఆలోచించండి, యెహోవాకు దగ్గర చేసే పనుల్లో బిజీగా ఉండండి. ఇవన్నీ చేస్తూ ఉండడంవల్ల ‘విశ్వాసం ద్వారా, ఓర్పు ద్వారా వాగ్దానాలకు వారసులౌతారు.’—హెబ్రీ. 6:11, 12; రోమా. 5:5.
పాట 139 కొత్త లోకంలో ఉన్నట్టు ఊహించుకోండి!
a ఈరోజుల్లో చాలామంది కొత్త లోకం గురించి బైబిలు ఇస్తున్న మాటను నమ్మట్లేదు. అదొక పగటికల అని, కట్టుకథ అని వాళ్లు అనుకుంటున్నారు. అయితే యెహోవా మాటిచ్చినవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని మనకు తెలుసు. అయినాసరే, మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు బలపర్చుకుంటూనే ఉండాలి. దాన్నెలా చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
b కొన్ని అసలు పేర్లు కావు.
c యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకంలో “ప్రవచనం” కింద బైబిలు ప్రవచనాలకు సంబంధించి చాలా ఆర్టికల్స్‌ని చూడవచ్చు. ఉదాహరణకు 2008, జనవరి 1 కావలికోట పత్రికలో “యెహోవా చెప్పిన ప్రవచనాలు తప్పక నెరవేరతాయి” అనే ఆర్టికల్ చూడండి.