అధ్యయన ఆర్టికల్ 15
యేసు చేసిన అద్భుతాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
“ఆయన మంచిపనులు చేస్తూ, … వాళ్లను బాగుచేస్తూ ఆ ప్రాంతమంతా తిరిగాడు.”—అపొ. 10:38.
పాట 13 క్రీస్తు మన ఆదర్శం
ఈ ఆర్టికల్‌లో … a
1. యేసు తన మొదటి అద్భుతాన్ని చేసిన సందర్భాన్ని వివరించండి.
అది క్రీ.శ. 29. అవి యేసు పరిచర్య మొదలుపెట్టిన తొలి రోజులు. యేసు, వాళ్ల అమ్మ మరియ, కొంతమంది శిష్యులు కానాలో జరిగిన ఒక పెళ్లి విందుకు వెళ్లారు. ఈ కానా అనే ఊరు యేసు సొంత ఊరైన నజరేతుకు ఉత్తరాన ఉంది. ఆ పెళ్లి ఇంటివాళ్లు మరియకు బాగా కావాల్సినవాళ్లు. అందుకే పెళ్లిలో సందడంతా మరియదే. వచ్చిన అతిథులందర్నీ ఆమె దగ్గరుండి చూసుకుంటుంది. అయితే ఉన్నట్టుండి ఒక సమస్య వచ్చి పడింది. విందులో ద్రాక్షారసం అయిపోయింది. దాంతో ఆ కుటుంబానికి, ఆ కొత్త దంపతులకు తల కొట్టేసినంత పనైంది. b బహుశా పిలిచిన దానికంటే ఎక్కువమంది అతిథులు వచ్చుంటారు. అప్పుడు మరియకు కాళ్లు చేతులు ఆడలేదు. వెంటనే తన కొడుకు దగ్గరికి వెళ్లి, “ద్రాక్షారసం” అయిపోయిందని చెప్పింది. (యోహా. 2:1-3) అప్పుడు యేసు ఏం చేశాడు? ఎవ్వరి ఊహకందని ఒక పనిచేశాడు. ఆయన నీళ్లను అద్భుతరీతిలో “మంచి ద్రాక్షారసంగా” మార్చాడు.—యోహా. 2:9, 10.
2-3. (ఎ) యేసు అద్భుతాలు చేసే తన శక్తిని ఎలా ఉపయోగించాడు? (బి) వాటిని పరిశీలిస్తున్నప్పుడు మనం ఏం నేర్చుకోవచ్చు?
2 ఆ అద్భుతం ఆరంభం మాత్రమే, తన పరిచర్య ముందుకు వెళ్తుండగా యేసు ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తాడు. c తనకున్న అద్భుతాలు చేసే శక్తిని వేలమంది ప్రజల కోసం ఉపయోగించాడు. ఉదాహరణకు, ఆయన చేసిన రెండు అద్భుతాల్లో ఒకసారి 5,000 మంది పురుషులకు, తర్వాత 4,000 మంది పురుషులకు ఆహారం పెట్టాడు. స్త్రీలు, పిల్లలు కలుపుకొని మొత్తం 27,000 కన్నా ఎక్కువమందికి ఆహారం పెట్టాడు. (మత్త. 14:15-21; 15:32-38) ఈ రెండు సందర్భాల్లో కేవలం ఆహారం పెట్టడమేకాదు, అక్కడికి వచ్చిన ఎంతోమందిని ఆయన బాగుచేశాడు. (మత్త. 14:14; 15:30, 31) అది చూసిన ప్రజలు ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బై ఉంటారు.
3 యేసు చేసిన అద్భుతాల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఈ ఆర్టికల్‌లో ఆయన చేసిన అద్భుతాల నుండి విశ్వాసాన్ని బలపర్చే పాఠాల్ని నేర్చుకుంటాం. అలాగే ఆయన అద్భుతాలు చేసినప్పుడు చూపించిన వినయాన్ని, కనికరాన్ని మనమెలా అనుకరించవచ్చో నేర్చుకుంటాం.
యెహోవా, యేసు గురించి పాఠాలు
4. యేసు చేసిన అద్భుతాలు మనకు ఎవరి గురించి కూడా నేర్పిస్తున్నాయి?
4 యేసు చేసిన అద్భుతాలు ఆయన గురించే కాదు, వాటి వెనుకున్న ఆయన తండ్రి గురించి కూడా నేర్పిస్తున్నాయి. ఎంతైనా ఈ అద్భుతాలన్నిటికీ యెహోవాయే మూలం. అపొస్తలుల కార్యాలు 10:38 ఇలా చెప్తుంది: “దేవుడు ఆయన్ని పవిత్రశక్తితో అభిషేకించాడు. ఆయనకు శక్తిని ఇచ్చాడు. దానివల్ల ఆయన మంచిపనులు చేస్తూ, అపవాది చేత పీడించబడుతున్న వాళ్లను బాగుచేస్తూ ఆ ప్రాంతమంతా తిరిగాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు.” నిజానికి యేసు కూడా తన మాటల్లో, పనుల్లో, ఆఖరికి ఆయన చేసిన అద్భుతాల్లో తన తండ్రి ఎలా ఆలోచిస్తాడో, ఆయనకు ఎలా అనిపిస్తుందో అచ్చుగుద్దినట్టు చూపించాడు. (యోహా. 14:9) అయితే, యేసు చేసిన అద్భుతాల నుండి మనం నేర్చుకునే మూడు పాఠాల్ని ఇప్పుడు చూద్దాం.
5. యేసు ఏ కారణంవల్ల అద్భుతాలు చేశాడు? (మత్తయి 20:30-34)
5 మొదటిది యేసు, ఆయన తండ్రి మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారు. యేసు ఈ భూమ్మీద ఉన్నప్పుడు ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకే సమస్యలతో నలిగిపోతున్న ప్రజలకు ఉపశమనం ఇవ్వడానికి ఆయన అద్భుతాలు చేసే తన శక్తిని ఉపయోగించాడు. ఒక సందర్భంలో, ఇద్దరు గుడ్డివాళ్లు తమను బాగుచేయమని యేసును అడిగారు. (మత్తయి 20:30-34 చదవండి.) అప్పుడు ఆయన వాళ్లమీద “జాలిపడి” బాగుచేశాడు. ఇక్కడ “జాలిపడ్డాడు” అని అనువదించబడిన గ్రీకు క్రియాపదం, కడుపు తరుక్కుపోవడాన్ని సూచిస్తుంది. లోలోపల నుండి కలిగిన ఆ కనికరం వల్ల యేసు ఎంతోమంది ప్రజలకు ఆహారం పెట్టాడు, కుష్ఠువాళ్లను బాగుచేశాడు. ఆ విధంగా ఆయన ప్రేమ చూపించాడు. (మత్త. 15:32; మార్కు 1:41) “కనికరంగల” యెహోవా, ఆయన కుమారుడు మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారని, మన బాధను వాళ్ల బాధగా చూస్తున్నారనే నమ్మకంతో ఉండవచ్చు. (లూకా 1:78; 1 పేతు. 5:7) కాబట్టి ప్రజల్ని పట్టిపీడిస్తున్న సమస్యల్ని తీసివేయడానికి వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
6. దేవుడు యేసుకు ఏ శక్తినిచ్చాడు?
6 రెండోది, మనుషుల సమస్యలన్నీ తీసేయడానికి దేవుడు యేసుకు శక్తిని ఇచ్చాడు. మనం శతవిధాల ప్రయత్నించినా తీసేసుకోలేని సమస్యల్ని యేసు తన శక్తితో తీసేయగలడని తన అద్భుతాల ద్వారా చూపించాడు. ఉదాహరణకు, మనుషుల్ని వారసత్వంగా పట్టిపీడిస్తున్న పాపాన్ని, దానివల్ల వచ్చే అనారోగ్యాన్ని, మరణాన్ని కూకటివేళ్లతోసహా పెరికేసే శక్తి ఆయనకుంది. (మత్త. 9:1-6; రోమా. 5:12, 18, 19) అన్నిరకాల జబ్బుల్ని, చివరికి చనిపోయినవాళ్లను కూడా తిరిగి లేపే శక్తి ఆయనకుందని తన అద్భుతాలు నిరూపిస్తున్నాయి. (మత్త. 4:23; యోహా. 11:43, 44) అంతేకాదు, బీభత్సమైన తుఫానును ఆపే, చెడ్డ దూతల్ని వెళ్లగొట్టే శక్తి కూడా ఆయనకుంది. (మార్కు 4:37-39; లూకా 8:2) యెహోవా తన కొడుకుకు అంత శక్తినిచ్చాడని తెలుసుకోవడం మనకు ఎంత ఊరటనిస్తుందో కదా!
7-8. (ఎ) యేసు చేసిన అద్భుతాలు మనకు ఏ భరోసాను ఇస్తున్నాయి? (బి) రానున్న కొత్తలోకంలో జరిగే ఏ అద్భుతం కోసం మీ కళ్లు ఎదురుచూస్తున్నాయి?
7 మూడోది, మనం ఎదురుచూసేవన్నీ దేవుని రాజ్యంలో నిజమౌతాయనే భరోసాతో ఉండవచ్చు. యేసు ఈ భూమ్మీద మనిషిగా ఉన్నప్పుడే అన్ని అద్భుతాలు చేశాడంటే, దేవుని రాజ్యానికి రాజుగా భవిష్యత్తులో ఇంకే స్థాయిలో చేస్తాడో ఊహించుకోండి. క్రీస్తు పరిపాలనలో మనం ఏం అనుభవిస్తామో ఆలోచించండి. మనుషుల్ని పట్టిపీడిస్తున్న జబ్బులన్నీ పోయి వంద శాతం ఆరోగ్యం ఉంటుంది. (యెష. 33:24; 35:5, 6; ప్రక. 21:3, 4) మనం ఇక పస్తులు ఉండం. ప్రకృతి విపత్తులవల్ల నష్టపోం. (యెష. 25:6; మార్కు 4:41) మన ప్రియమైనవాళ్లు “సమాధుల్లో” నుండి తిరిగి వచ్చినప్పుడు, గడపగడపలో ఆనందం వెల్లివిరుస్తుంది. (యోహా. 5:28, 29) మరి రానున్న కొత్తలోకంలో జరిగే ఏ అద్భుతం కోసం మీ కళ్లు ఎదురుచూస్తున్నాయి?
8 యేసు అద్భుతాలు చేస్తున్నప్పుడు వినయాన్ని, కనికరాన్ని చూపించాడు. ఆ లక్షణాల్ని మనమూ చూపించాలని అనుకుంటాం. అయితే, యేసు చేసిన రెండు అద్భుతాల్ని ఇప్పుడు చూద్దాం. కానాలో జరిగిన పెళ్లి విందుతో మొదలుపెడదాం.
వినయం గురించిన పాఠం
9. పెళ్లి విందులో యేసు ఏం చేశాడు? (యోహాను 2:6-10)
9 యోహాను 2:6-10 చదవండి. పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు, యేసు దానిగురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. మెస్సీయ అద్భుతంగా ద్రాక్షారసాన్ని తయారు చేస్తాడని కూడా ఏ ప్రవచనం చెప్పడం లేదు. కానీ ఒకసారి ఊహించండి, మీ పెళ్లిలోనే అలా జరిగితే మీకెలా అనిపిస్తుంది? తలకొట్టేసినట్టుగా ఉంటుంది కదా! అందుకే, యేసు ఆ కొత్త జంట మీద జాలిపడి వాళ్లకు ఆ పరిస్థితి రానివ్వలేదు. కాబట్టి ముందు చూసినట్లుగా, ఆయన ఒక అద్భుతాన్ని చేశాడు. ఆయన ఒకట్రెండు కాదు, దాదాపు 390 లీటర్ల నీళ్లను మంచి ద్రాక్షారసంగా మార్చాడు. ఇంతకీ ఆయన అంతెక్కువ ద్రాక్షారసాన్ని ఎందుకు చేశాడు? బహుశా దాన్ని భవిష్యత్తులో ఉపయోగించడానికో లేదా ఆ కొత్త జంట దాన్ని అమ్ముకొని, పెళ్లి ఖర్చులు తీర్చుకోవడానికో అయ్యుండవచ్చు. ఆ అద్భుతం జరిగిన తర్వాత ఆ కొత్త జంట కాస్త ఊపిరి పీల్చుకొని ఉంటారు.
10. యోహాను 2వ అధ్యాయంలో ఉన్న కొన్ని ముఖ్యమైన వివరాలు ఏంటి? (చిత్రం కూడా చూడండి.)
10 యోహాను 2వ అధ్యాయంలో ఉన్న కొన్ని ముఖ్యమైన వివరాల్ని గమనించారా? ఆ రాతి బానల్ని నీళ్లతో యేసే వెళ్లి నింపేయలేదు. దృష్టి తనవైపు మళ్లకుండా ఆ పనిని సేవకుల్ని చేయమని చెప్పాడు. (6, 7 వచనాలు) నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన తర్వాత కూడా, ద్రాక్షారసాన్ని విందు నిర్వాహకుని దగ్గరకు యేసే స్వయంగా తీసుకెళ్లి ఇవ్వలేదు గానీ దాన్ని సేవకుల్నే తీసుకెళ్లమన్నాడు. (8వ వచనం) అంతేకాదు, యేసు కొంత ద్రాక్షారసాన్ని తీసుకుని అతిథులు అందరికీ కనిపించేలా పట్టుకుని, ‘ఈ ద్రాక్షారసాన్ని నేనే చేశాను, రుచి చూడండి’ అని గొప్పలు చెప్పుకోలేదు.
11. యేసు చేసిన అద్భుతం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
11 యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన అద్భుతం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? వినయం. యేసు ఈ అద్భుతం గురించి గొప్పలు చెప్పుకోలేదు. నిజానికి ఆయన చేసిన దేనికీ గొప్పలు చెప్పుకోలేదు. బదులుగా, ప్రతీసారి ఆ ఘనతను వినయంగా తన తండ్రికి ఇచ్చేశాడు. (యోహా. 5:19, 30; 8:28) మనం యేసును అనుకరిస్తే, మనం చేసినవాటికి గొప్పలు చెప్పుకోకుండా వినయంగా ఉంటాం. యెహోవా సేవలో మనం ఏం చేసినా, మన గురించి గొప్పలు చెప్పుకోకుండా, మనం సేవ చేస్తున్న యెహోవా గురించి గొప్పలు చెప్పుకుంటాం. (యిర్మీ. 9:23, 24) ఘనతంతా ఆయనకు ఇస్తాం. ఎంతైనా, యెహోవా సహాయం లేకుండా మనం ఏమైనా చేయగలమా?—1 కొరిం. 1:26-31.
12. యేసులా వినయం చూపించే ఇంకో విధానం ఏంటో ఉదాహరణతో చెప్పండి.
12 యేసులా వినయం చూపించే ఇంకొక విధానం చూడండి. ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: ఒక యువ సంఘ పరిచారకుడు మొదటిసారి బహిరంగ ప్రసంగం ఇవ్వడానికి ఒక సంఘపెద్ద చాలా సమయం పెట్టి సహాయం చేశాడు. చివరికి ఆ యువ సహోదరుడు చక్కని ప్రసంగాన్ని ఇచ్చాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకరు వచ్చి ఆ సంఘపెద్దతో, ‘ఆ బ్రదర్ టాక్ భలే ఇచ్చాడు కదా?’ అని అన్నప్పుడు, ఆ సంఘపెద్ద ‘అవును, అలా చేయడానికి నేనే ఆయనకు హెల్ప్ చేశాను’ అని అంటాడా? లేదా వినయంగా ‘అవును చాలా బాగా చేశాడు. ఆయన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది’ అని అంటాడా? మనకు వినయం ఉంటే, మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు గొప్పలు చెప్పుకోం. మనం చేసే ప్రతీది యెహోవా చూస్తాడని, విలువైనదిగా ఎంచుతాడని సంతృప్తితో ఉంటాం. (మత్తయి 6:2-4 తో పోల్చండి; హెబ్రీ. 13:16) నిజానికి, మనం యేసులా వినయం చూపించినప్పుడు యెహోవా సంతోషిస్తాడు.—1 పేతు. 5:6.
కనికరం గురించిన పాఠం
13. యేసు నాయీను అనే నగరం దగ్గర ఏం చూశాడు? ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? (లూకా 7:11-15)
13 లూకా 7:11-15 చదవండి. యేసు పరిచర్య మొదలుపెట్టిన కొంతకాలానికి జరిగిన ఒక సంఘటన గురించి ఆలోచించండి. ఆయన నాయీను అనే గలిలయ నగరానికి వెళ్లాడు. 900 సంవత్సరాల క్రితం ఎలీషా ఒక స్త్రీ కొడుకుని పునరుత్థానం చేసిన షూనేము నగరానికి ఇది చాలా దగ్గర్లో ఉంది. (2 రాజు. 4:32-37) యేసు ఆ నగర ద్వారం దగ్గరికి వచ్చేసరికి అక్కడ వాతావరణం అంతా విషాదకరంగా ఉంది. ఒక పెద్ద గుంపు ఒక శవాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు. చనిపోయింది విధవరాలికి ఉన్న ఒక్కగానొక్క కొడుకు. ఆ బాబు చనిపోవడంతో ఆ తల్లి గుండె చెరువైపోయింది. అంత పెద్ద గుంపు ఉన్నా ఎవ్వరూ ఆమెను ఓదార్చలేకపోతున్నారు. యేసు వాళ్లను మధ్యలో ఆపి, ఎవ్వరూ ఊహించని ఒక పని చేశాడు. ఆ విధవరాలి కొడుకుని బ్రతికించాడు! సువార్త పుస్తకాల్లో యేసు చేసిన మూడు పునరుత్థానాల్లో ఇది మొట్టమొదటిది.
14. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఏ ముఖ్యమైన వివరాలున్నాయి? (చిత్రం కూడా చూడండి.)
14 లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉన్న కొన్ని ముఖ్యమైన వివరాల్ని చూడండి. యేసు ఏడుస్తున్న ఆ తల్లిని చూశాడు. తర్వాత ఆమె మీద “జాలిపడ్డాడు” అని గమనించారా? (13వ వచనం) కొడుకు శవం ముందు ఏడుస్తున్న ఆ తల్లిని చూసినప్పుడు, యేసు కనికరంతో చలించిపోయాడు. అయితే యేసు ఆమెను చూసి, అయ్యో పాపం అని ఊరుకోలేదు గానీ తన కనికరాన్ని చేతల్లో చూపించాడు. ఆమె దగ్గరికి వెళ్లి “ఏడ్వకు” అని ధైర్యం చెప్పాడు. తర్వాత ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆ బాబును బ్రతికించి తన తల్లి చేతిలో పెట్టాడు.—14, 15 వచనాలు.
15. యేసు చేసిన అద్భుతాల నుండి మనం ఇంకా ఏం నేర్చుకోవచ్చు?
15 యేసు విధవరాలు కొడుకుని అద్భుతంగా బ్రతికించిన ఆ సంఘటన నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? బాధలో ఉన్నవాళ్లమీద కనికరం చూపించాలి. అయితే యేసులా మనం చనిపోయినవాళ్లను బ్రతికించలేం. కానీ దుఃఖంలో మునిగిపోయినవాళ్లను గమనిస్తూ ఉండడం ద్వారా యేసులా కనికరం చూపించవచ్చు. వాళ్లకు సహాయం చేయడానికి, వాళ్లను ఓదార్చడానికి మనమే చొరవ తీసుకుని కనికరం చూపించవచ్చు. d (సామె. 17:17; 2 కొరిం. 1:3, 4; 1 పేతు. 3:8) మనం మాట్లాడే చిన్న మాటైనా, చేసే చిన్న పనైనా వాళ్లకు కొండంత బలాన్ని ఇస్తుంది.
16. చిత్రంలో చూపించినట్టు ఈ మధ్యే పాపను కోల్పోయిన సిస్టర్ నుండి మీరేం నేర్చుకున్నారు?
16 ఒక అనుభవాన్ని చూడండి. కొన్నేళ్ల క్రితం మీటింగ్ హాల్‌లో ఒక సిస్టర్ పునరుత్థాన నిరీక్షణ గురించి పాట పాడుతూ ఏడుస్తుంది. ఎందుకంటే, ఈ మధ్యే వాళ్ల పాప చనిపోయింది. అలా ఏడుస్తూ ఉండడం చూసిన ఇంకొక సిస్టర్, ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజాల మీద చెయ్యి వేసి మిగతా పాటను ఆమెతో కలిసి పాడింది. పాపని కోల్పోయిన ఆ సిస్టర్ ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఇలా అంటుంది: “బ్రదర్స్, సిస్టర్స్ పైన నా ప్రేమ ఇంకా పెరిగింది. ఆ రోజు మీటింగ్‌కి వెళ్లి నేను మంచి పని చేశాను. మనకు ఓదార్పు దొరికే ఏకైక చోటు రాజ్యమందిరం మాత్రమే.” మనం కూడా దుఃఖంతో నలిగిపోయిన వాళ్లను ఓదార్చడానికి కనికరంతో చేసే చిన్న పనైనా యెహోవా చూస్తాడని, దాన్ని విలువైనదిగా ఎంచుతాడని నమ్మకంతో ఉండవచ్చు.—కీర్త. 34:18.
యేసు చేసిన అద్భుతాల గురించి అధ్యయనం చేయండి
17. ఈ ఆర్టికల్‌లో మీరేం నేర్చుకున్నారు?
17 సువార్త పుస్తకాల్లో యేసు చేసిన అద్భుతాలన్నిటి గురించి అధ్యయనం చేయడంవల్ల ఎంతో ప్రోత్సాహం పొందుతాం. యెహోవా, యేసు మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారని, మనుషుల సమస్యలన్నిటినీ తీసేసే శక్తి యేసుకు ఉందని, మనం ఎదురుచూసే పరిస్థితులన్నీ దేవుని రాజ్యంలో నిజమౌతాయి అనే నమ్మకాన్ని అవి కలిగిస్తాయి. ఆ అద్భుతాల్ని చదువుతున్నప్పుడు, యేసుక్రీస్తు చూపించిన లక్షణాల్నే మనమూ ఎలా చూపించవచ్చో ఆలోచించండి. వ్యక్తిగత అధ్యయనంలో లేదా కుటుంబ ఆరాధనలో యేసు చేసిన మిగతా అద్భుతాల గురించి చదివేలా షెడ్యూల్ వేసుకోండి. వాటి నుండి మీరు ఏ పాఠాలు నేర్చుకోవచ్చో, వాటిని ఇతరులకు ఎలా చెప్పవచ్చో ఆలోచించండి. అలా చేయడంవల్ల, ఒకర్నొకరు ప్రోత్సహించుకునే మంచి అవకాశాలు దొరుకుతాయి.—రోమా. 1:11, 12.
18. తర్వాతి ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
18 యేసు తన పరిచర్య ముగింపులో చివరి పునరుత్థానాన్ని చేశాడు. కానీ ఇది చాలా వేరుగా ఉంది. ఆయన తన ప్రాణ స్నేహితుణ్ణి పునరుత్థానం చేశాడు, అదికూడా ఊహించని పరిస్థితుల్లో. సువార్త పుస్తకాల్లో నమోదైన ఈ అద్భుతం నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? ఇది పునరుత్థాన నిరీక్షణ మీద మన విశ్వాసాన్ని ఎలా బలపరుస్తుంది? ఈ ప్రశ్నల గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.
పాట 20 ప్రశస్తమైన నీ కుమారుణ్ణి ఇచ్చావు
a ఆయన బీభత్సమైన తుఫానును ఆపాడు, రోగుల్ని బాగుచేశాడు, చనిపోయినవాళ్లను తిరిగి లేపాడు. యేసు చేసిన ఈ అద్భుతాలన్నీ చదువుతున్నప్పుడు మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అయితే, బైబిల్లో రాయించిన ఈ సంఘటనలన్నీ చదివి సంబరపడిపోవడమే కాదు, వాటి నుండి పాఠాలు కూడా నేర్చుకోవచ్చు. ఇవి మనం చూస్తుండగా యెహోవా మీద, యేసు మీద మన విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చో, ఆ అద్భుతాల నుండి మనం ఏ లక్షణాలు నేర్చుకోవచ్చో చూస్తాం.
b ఒక బైబిలు పండితుడు ఇలా అన్నాడు: “తూర్పు దేశాల్లో ఆతిథ్యం ఇవ్వడాన్ని ప్రాముఖ్యంగా చూసేవాళ్లు. ఆతిథ్యం ఇచ్చేవాళ్లు, అతిథులకు ఏదీ తక్కువ కాకుండా చూసుకోవాలి. మంచి ఆతిథ్యం ఇవ్వడం అంటే, ముఖ్యంగా పెళ్లి విందుల్లో ఆహారం, ద్రాక్షారసం పొంగిపొర్లేలా ఇవ్వాలి.”
c సువార్త పుస్తకాల్లో యేసు చేసిన అద్భుతాలు 30 కన్నా ఎక్కువే ఉన్నాయి. దానికితోడు, కొన్నిసార్లు ఒకట్రెండు అద్భుతాల్ని కలిపి ప్రస్తావించారు. ఒక సందర్భంలో “నగర ప్రజలంతా” ఆయన దగ్గరికి వచ్చినప్పుడు “రోగాలతో బాధపడుతున్న చాలామందిని” ఆయన బాగుచేశాడు.—మార్కు 1:32-34.
d దుఃఖంలో మునిగిపోయిన వాళ్లతో ఏం మాట్లాడాలో లేదా వాళ్లను ఎలా ఓదార్చాలో తెలుసుకోవడానికి, 2010, నవంబరు 1 కావలికోట (ఇంగ్లీష్) సంచికలోని “దుఃఖంలో మునిగిపోయిన వాళ్లను యేసులా ఓదార్చండి” అనే ఆర్టికల్ చూడండి.
e చిత్రాల వివరణ: పెళ్లి విందులో దంపతులు అలాగే అతిథులు మంచి ద్రాక్షారసాన్ని ఆస్వాదిస్తున్నారు. వాళ్ల వెనుక యేసుక్రీస్తు నిలబడివున్నాడు.