అధ్యయన ఆర్టికల్ 17
పాట 111 మన సంతోషానికి కారణాలు
ఆధ్యాత్మిక పరదైసును ఎప్పుడూ వదిలేయకండి!
“నేను సృష్టించేవాటిని బట్టి మీరు ఉల్లసించండి, ఎప్పటికీ సంతోషించండి.”—యెష. 65:18.
ముఖ్యాంశం
ఆధ్యాత్మిక పరదైసులో ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో, వేరేవాళ్లు అందులోకి వచ్చేలా మనమెలా సహాయం చేయవచ్చో నేర్చుకుంటాం.
1. ఆధ్యాత్మిక పరదైసు అంటే ఏంటి? మనమేం చేయాలని గట్టిగా నిర్ణయించుకోవాలి?
ఈరోజుల్లో కూడా భూమ్మీద ఒక పరదైసు ఉంది. అది లక్షలమంది ప్రజలతో కళకళలాడుతుంది. వాళ్లు నిజమైన శాంతిని అనుభవిస్తూ, ఎన్నో మంచి పనులు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ఆ పరదైసులో ఉన్నవాళ్లు దాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, వేరేవాళ్లు అందులోకి రావాలని వాళ్లు కోరుకుంటున్నారు. ఇంతకీ ఏంటది? అదే ఆధ్యాత్మిక పరదైసు! a
2. ఆధ్యాత్మిక పరదైసులో ఉన్న గొప్పతనం ఏంటి?
2 సాతాను ఈ లోకాన్ని అణువణువూ ద్వేషంతో, చెడుతనంతో, ప్రమాదాలతో నింపేశాడు. ఆశ్చర్యకరంగా, ఇదే లోకంలో కనువిందు చేసే ఇంకో ప్రపంచాన్ని యెహోవా సృష్టించాడు. (1 యోహా. 5:19; ప్రక. 12:12) ఈ వ్యవస్థ వల్ల జరిగే నష్టాన్ని మన ప్రేమగల తండ్రి చూస్తున్నాడు. అందుకే మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లడానికి కావాల్సిన భద్రతను ఆయన ఇస్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక పరదైసును బైబిలు “ఆశ్రయంగా,” “బాగా నీళ్లుపెట్టిన తోటలా” వర్ణిస్తుంది. (యెష. 4:6; 58:11) యెహోవా దీవెనతో ఆ పరదైసులో ఉన్నవాళ్లు ఈ కష్టమైన చివరిరోజుల్లో కూడా చక్కగా బ్రతకగలుగుతున్నారు.—యెష. 54:14; 2 తిమో. 3:1.
3. యెషయా 65వ అధ్యాయంలో ఉన్న మాటలు ఒకప్పుడు ఎలా నెరవేరాయి?
3 ఆధ్యాత్మిక పరదైసు ఎంత అందంగా ఉంటుందో యెషయా ప్రవక్త ద్వారా యెహోవా వర్ణించాడు. ఆ వర్ణన యెషయా 65వ అధ్యాయంలో చూస్తాం. ఆ మాటలు క్రీ.పూ. 537 లో ఒకసారి నెరవేరాయి. ఆ సమయంలో పశ్చాత్తాపం చూపించిన యూదులు బబులోను చెర నుండి విడుదలై, తమ స్వదేశానికి తిరిగొచ్చారు. నేలమట్టం అయిన యెరూషలేము నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి, ఇశ్రాయేలులో స్వచ్ఛారాధనకు కేంద్రంగా ఉన్న ఆలయాన్ని తిరిగి కట్టడానికి యెహోవా తన ప్రజలకు సహాయం చేశాడు, వాళ్లను దీవించాడు.—యెష. 51:11; జెక. 8:3.
4. యెషయా 65వ అధ్యాయంలో ఉన్న మాటలు మనకాలంలో ఎలా నెరవేరాయి?
4 ఈ రోజుల్లోని యెహోవా ఆరాధకులు మహాబబులోను చెర నుండి విడుదలైనప్పుడు, అంటే క్రీ.శ. 1919 నుండి యెషయా ప్రవచనం ఇంకోసారి నెరవేరడం మొదలైంది. అప్పటినుండి ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక పరదైసు రూపుదిద్దుకోవడం మొదలైంది. ఉత్సాహవంతులైన రాజ్య ప్రచారకుల వల్ల ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి, అందులో ఉన్నవాళ్లు క్రైస్తవ లక్షణాల్ని చూపించగలుగుతున్నారు. ఒకప్పుడు క్రూర జంతువుల్లా భయంకరంగా ఉన్న స్త్రీపురుషులు “దేవుని ఇష్టప్రకారం సృష్టించబడిన కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకున్నారు. (ఎఫె. 4:24) నిజమే, యెషయా చెప్పిన ఎన్నో దీవెనలు కొత్తలోకంలో ఉన్నదున్నట్టు నెరవేరతాయి. కానీ ఇప్పుడు కూడా మనం ఎన్నో దీవెనల్ని రుచి చూడగలుగుతున్నాం. ఆధ్యాత్మిక పరదైసులో ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో, దాన్ని మనం ఎందుకు విడిచిపెట్టకూడదో ఇప్పుడు చూద్దాం.
ఆధ్యాత్మిక పరదైసులో ఉన్నవాళ్లకు ఎలా ఉంటుంది?
5. యెషయా 65:13 లో మాటిచ్చినట్టు ఆధ్యాత్మిక పరదైసులో మనం వేటిని ఆస్వాదిస్తున్నాం?
5 పుష్టిగా, హాయిగా. ఆధ్యాత్మిక పరదైసు లోపల ఉన్నవాళ్లకు, బయట ఉన్నవాళ్లకు మధ్యున్న పెద్ద తేడాను యెషయా ప్రవచనంలో చూస్తాం. (యెషయా 65:13 చదవండి.) యెహోవా తన ఆరాధకులకు ఏలోటూ లేకుండా ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇచ్చి, తృప్తిగా ఉంచుతున్నాడు. తన పవిత్రశక్తిని, తన వాక్యాన్ని అలాగే బోలెడన్ని ప్రచురణల్ని ఇస్తున్నాడు. మనం వాటిని ‘తింటూ, తాగుతూ సంతోషంగా ఉంటున్నాం.’ (ప్రకటన 22:17 తో పోల్చండి.) దానికి పూర్తి భిన్నంగా, ఆధ్యాత్మిక పరదైసు బయట ఉన్నవాళ్లు ‘ఆకలితో, దాహంతో ఉంటూ అవమానాలపాలు అవుతున్నారు.’ వాళ్లు ఆధ్యాత్మిక ఆకలితో అలమటిస్తున్నారు.—ఆమో. 8:11.
6. యోవేలు 2:21-24 ప్రకారం, యెహోవా ఆధ్యాత్మిక ఆహారాన్ని ఏయే విధాలుగా ఇస్తున్నాడు? అవి తీసుకుంటే మనమెలా ఉంటాం?
6 యెహోవా తన ప్రజలకు అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని చాలా ధారాళంగా ఇస్తాడు. ఆ విషయాన్ని చెప్పడానికి యోవేలు తన ప్రవచనంలో మనిషి బ్రతకడానికి అవసరమైన ధాన్యం, ద్రాక్షారసం, నూనె లాంటి పదార్థాల్ని ప్రస్తావించాడు. (యోవేలు 2:21-24) యెహోవా బైబిలు, ప్రచురణలు, వెబ్‌సైట్, మీటింగ్స్, ప్రాంతీయ సమావేశాలు, ప్రాదేశిక సమావేశాల ద్వారా ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తాడు. మనం వాటన్నిటిని రోజూ తీసుకున్నప్పుడు ఇంకా పుష్టిగా ఉంటాం, జీవితం చాలా హాయిగా ఉంటుంది.
7. మనం ఎందుకు “హృదయానందంతో” ఉంటాం? (యెషయా 65:14)
7 సంతోషం, సంతృప్తి. దేవుని ప్రజల హృదయాలు కృతజ్ఞతతో ఉప్పొంగిపోతాయి కాబట్టి “సంతోషంగా కేకలు వేస్తారు.” (యెషయా 65:14 చదవండి.) మన విశ్వాసాన్ని బలపర్చే సత్యాలు, దేవుని వాక్యంలో మనల్ని ఓదార్చే మాటలు అలాగే క్రీస్తు విమోచన క్రయధనం మీద ఆధారపడిన మన గట్టి నిరీక్షణ వల్ల మనం “హృదయానందంతో” ఉంటాం. వీటన్నిటి గురించి మన ఆధ్యాత్మిక అన్నదమ్ములతో, అక్కాచెల్లెళ్లతో మాట్లాడినప్పుడు మనం అంతులేని ఆనందాన్ని పొందుతాం.—కీర్త. 34:8; 133:1-3.
8. ఆధ్యాత్మిక పరదైసులో కొట్టొచ్చినట్లు కనిపించే రెండు లక్షణాలు ఏంటి?
8 ఆధ్యాత్మిక పరదైసులో యెహోవా ప్రజల మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే లక్షణాలు రెండు ఉన్నాయి. అవి ప్రేమ, ఐక్యత. ఈ ‘ఐక్యత’ కొత్తలోకంలో జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి శాంపిల్ మాత్రమే. ఇప్పటికన్నా అప్పుడు యెహోవా ఆరాధకులు ప్రేమను, ఐక్యతను గొప్ప స్థాయిలో చూపించగలుగుతారు. (కొలొ. 3:14) మన సిస్టర్ ఒకావిడ మొట్టమొదటిసారి యెహోవాసాక్షుల్ని కలిసినప్పుడు ఆమె ఏం గమనించిందో ఇలా చెప్తుంది: “అసలు సంతోషం అంటే ఏంటో నాకు తెలీదు. మా ఇంట్లో వాళ్లతో కూడా నేను సంతోషంగా ఉండేదాన్ని కాదు. మొట్టమొదటిసారి ప్రేమను పనుల్లో చూసింది యెహోవాసాక్షుల దగ్గరే.” ఎవరికైనా నిజమైన సంతోషం, సంతృప్తి కావాలంటే ఆధ్యాత్మిక పరదైసులోకి రావాల్సిందే! మన గురించి లోకంలోని వాళ్లు ఏమనుకున్నా, మనకు మాత్రం యెహోవా దగ్గర, మన బ్రదర్స్‌సిస్టర్స్ దగ్గర మంచి పేరుంది.—యెష. 65:15.
9. మన కష్టాల గురించి యెషయా 65:16, 17 ఏం మాటిస్తోంది?
9 సేదదీర్పు, ప్రశాంతత. యెషయా 65:14 చెప్తున్నట్టు, ఆధ్యాత్మిక పరదైసు బయట ఉండాలని అనుకుంటున్నవాళ్లు “హృదయ వేదనతో ఏడుస్తారు, కృంగిన మనసుతో విలపిస్తారు.” మరి దేవుని ప్రజల బాధకు, వేదనకు కారణమైన వాటి సంగతేంటి? మెల్లమెల్లగా అవి “మరవబడతాయి; అవి [దేవుని] కళ్లకు కనిపించకుండా దాచబడతాయి.” (యెషయా 65:16, 17 చదవండి.) యెహోవా మన కష్టాలన్నిటినీ తీరుస్తాడు, కాలం గడుస్తుండగా గతం తాలూకు చేదు జ్ఞాపకాలన్నిటినీ తుడిచేస్తాడు.
10. యెహోవా సంస్థలో ఉండడం గొప్ప దీవెన అని మీకెందుకు అనిపిస్తుంది? (చిత్రం కూడా చూడండి.)
10 ఇప్పుడు కూడా, మనం మీటింగ్స్‌కి వెళ్లినప్పుడు ప్రశాంతతను, సేదదీర్పును పొందుతాం. ఈ లోకంలో మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం. అంతేకాదు మనం ప్రేమ, సంతోషం, శాంతి, దయ, సౌమ్యత లాంటి పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని చూపించినప్పుడు, ఆధ్యాత్మిక పరదైసులో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకుంటాం. (గల. 5:22, 23) యెహోవా సంస్థలో ఒకరిగా ఉండడం నిజంగా ఒక గొప్ప దీవెన! ఆధ్యాత్మిక పరదైసులో ఉన్నవాళ్లు “కొత్త ఆకాశం, కొత్త భూమి” గురించి దేవుడిచ్చిన మాట పూర్తిగా నెరవేరడం చూస్తారు.
11. యెషయా 65:18, 19 ప్రకారం, ఆధ్యాత్మిక పరదైసులో మనం పొందే దీవెనల్ని బట్టి మనకేం అనిపిస్తుంది?
11 కృతజ్ఞత, ఉల్లాసం. ఆధ్యాత్మిక పరదైసులో ‘సంతోషంగా, ఉల్లాసంగా’ ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయని యెషయా చెప్పాడు. ఎందుకంటే ఇలాంటి ప్రపంచాన్ని తయారుచేసింది యెహోవాయే! (యెషయా 65:18, 19 చదవండి.) అందుకే, ఆధ్యాత్మిక కరువుకాటకాలతో నిండిన ఈ లోక సంస్థల నుండి చాలామంది బయటికొచ్చి, అందమైన ఆధ్యాత్మిక పరదైసులో అడుగుపెట్టేలా యెహోవా మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. సత్యంలో ఉండడం వల్ల మనం రుచి చూసిన ఎన్నో దీవెనల్ని బట్టి, వాటిగురించి ఇతరులకు చెప్పకుండా ఉండలేం!—యిర్మీ. 31:12.
12. యెషయా 65:20-24 లో ఉన్న మాటలు చదివినప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఎందుకు?
12 ఇప్పుడు మనం ఆధ్యాత్మిక పరదైసులో ఉన్నాం కాబట్టి మనకున్న నిరీక్షణనుబట్టి కృతజ్ఞతతో, ఉల్లాసంతో నిండిపోతాం. కొత్తలోకంలో మన కళ్లు చూసేవి, మన చేతులు చేసేవి ఏంటో ఒక్కసారి ఊహించండి. బైబిలు ఇలా మాటిస్తోంది: “పుట్టిన కొన్ని రోజులకే చనిపోయే పసిబిడ్డలు గానీ, ఆయుష్షు నిండకుండానే చనిపోయే ముసలివాళ్లు గానీ అక్కడ ఇక ఉండరు.” మనం ‘ఇళ్లు కట్టుకొని వాటిలో నివసిస్తాం, ద్రాక్షతోటలు నాటుకొని వాటి పండ్లు తింటాం.’ యెహోవా మనల్ని దీవిస్తాడు కాబట్టి మనం ‘వృథాగా ప్రయాసపడం.’ ఆయన మనల్ని భద్రంగా, సంతృప్తిగా ఉంచుతూ జీవితానికి నిజమైన అర్థాన్ని ఇస్తానని మాటిస్తున్నాడు. మనం ఇంకా “వేడుకోకముందే” మన అవసరాలేమిటో తెలుసుకుని, “ప్రతీ జీవి కోరికను” ఆయన తృప్తిపరుస్తాడు.—యెష. 65:20-24; కీర్త. 145:16.
13. యెహోవా సేవ చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రజలు ఎలాంటి మార్పులు చేసుకుంటారని యెషయా 65:25 చెప్తుంది?
13 శాంతిభద్రతలు. యెహోవా పవిత్రశక్తి సహాయంతో ఒకప్పుడు క్రూర జంతువు లాంటి స్వభావం ఉన్న చాలామంది శాంతిగా మారి తమ జీవితంలో ఊహించని మార్పులు చేసుకున్నారు. (యెషయా 65:25 చదవండి.) తమలో ఉన్న అవలక్షణాల్ని తీసేసుకోవడానికి వాళ్లు చాలా గట్టిగా కృషిచేశారు. (రోమా. 12:2; ఎఫె. 4:22-24) నిజమే, దేవుని ప్రజలుగా మనం ఇంకా అపరిపూర్ణులం కాబట్టి పొరపాట్లు చేస్తుంటాం. అయితే ప్రేమ, శాంతి అనే బంధంలో యెహోవా “అన్నిరకాల” ప్రజల్ని ఐక్యం చేశాడు. దాన్ని తెంచేయడం ఎవ్వరి తరంకాదు! (తీతు 2:11) ఎందుకంటే, అలాంటి ఐక్యత సర్వశక్తిగల దేవుడు మాత్రమే చేయగల అద్భుతం!
14. ఒక బ్రదర్ విషయంలో యెషయా 65:25 లోని మాటలు ఎలా నిజమయ్యాయి?
14 ప్రజలు నిజంగా మారతారా? ఈ అనుభవాన్ని చూడండి. 20 ఏళ్లు రాకముందే చాలాసార్లు జైలుకు వెళ్లొచ్చిన ఒక అబ్బాయి అనైతికంగా, క్రూరంగా జీవించేవాడు. అతను కార్లను కొట్టేసినందుకు, ఇళ్లకు కన్నాలు వేసినందుకు, వేరే ఘోరమైన నేరాలు చేసినందుకు జైలుకు వెళ్లాడు. అతను ఎప్పుడూ గొడవలకు సై అనేవాడు. కానీ బైబిలు నుండి మొట్టమొదటిసారి సత్యం విన్నప్పుడు, యెహోవాసాక్షుల మీటింగ్స్‌కి రావడం మొదలుపెట్టినప్పుడు, బ్రతకడానికి అతనికి ఒక కారణం దొరికింది. ఇక నుంచి యెహోవాను ఆరాధించడానికే బ్రతకాలని అతను అనుకున్నాడు. బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షియైన తర్వాత యెషయా 65:25 లోని మాటలు తన విషయంలో ఎలా నిజమయ్యాయో అతను ఆలోచిస్తూ ఉండేవాడు. తోడేలులా క్రూరంగా ఉన్న అతను గొర్రెపిల్లలా సాధువుగా మారాడు.
15. ఆధ్యాత్మిక పరదైసులోకి ఎక్కువమంది రావాలని మనం ఎందుకు కోరుకుంటాం? దానికోసం మనం ఏం చేస్తాం?
15 యెషయా 65:13 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు” అనే మాటలతో మొదలై, 25వ వచనం “యెహోవా అంటున్నాడు” అనే మాటతో ముగుస్తుంది. ఆయన ఏదైనా మాటిస్తే అది ఖచ్చితంగా నిజమౌతుంది! (యెష. 55:10, 11) ఇప్పటికే మనం ఆయన మాటిచ్చిన ఆధ్యాత్మిక పరదైసులో ఉన్నాం. ఎవ్వరికీ లేని ఒక అందమైన కుటుంబాన్ని యెహోవా మనకు ఇచ్చాడు. మనం ఆ కుటుంబంలో ఒకరిగా ఉన్నాం కాబట్టి క్రూరమైన ఈ లోకంలో కూడా శాంతిభద్రతలను అనుభవించగలుగుతున్నాం. (కీర్త. 72:7) అందుకే, మన కుటుంబంలోకి వీలైనంత ఎక్కువమంది రావాలని కోరుకుంటాం. దానికోసమే శిష్యుల్ని చేసే పని మీద మనం మనసుపెడతాం.—మత్త. 28:19, 20.
ఆధ్యాత్మిక పరదైసులోకి ఇతరుల్ని ఎలా తీసుకురావచ్చు?
16. ప్రజలు ఆధ్యాత్మిక పరదైసులోకి ఎలా ఆకర్షించబడుతున్నారు?
16 మనలో ప్రతీఒక్కరం ఆధ్యాత్మిక పరదైసును ఇంకా అందంగా, ఆకర్షణీయంగా చేయవచ్చు. దానికోసం మనం యెహోవాను అనుకరించాలి. ప్రజలకు ఇష్టం లేకుండా ఆయన ఎవ్వరినీ తన సంస్థలోకి లాక్కురాడు. బదులుగా, ఆయన వాళ్లను తనవైపుకు మృదువుగా ‘ఆకర్షిస్తాడు.’ (యోహా. 6:44; యిర్మీ. 31:3) మంచి మనసు ఉన్నవాళ్లు యెహోవాకున్న లక్షణాల గురించి, ఆయనకున్న అద్భుతమైన వ్యక్తిత్వం గురించి నేర్చుకున్నప్పుడు వాళ్లంతటవాళ్లే ఆయన దగ్గరికి వస్తారు. అయితే మన మంచి లక్షణాలతో, పనులతో ప్రజల్ని ఆధ్యాత్మిక పరదైసు వైపుకు ఎలా ఆకర్షించవచ్చు?
17. వేరేవాళ్లను ఆధ్యాత్మిక పరదైసులోకి ఆకర్షించే ఒక విధానం ఏంటి?
17 వేరేవాళ్లను ఆధ్యాత్మిక పరదైసులోకి ఆకర్షించే ఒక విధానం ఏంటంటే, మనం మన బ్రదర్స్‌సిస్టర్స్‌తో ప్రేమగా, దయగా ఉండాలి. ఒకప్పటి కొరింథు సంఘంలో జరిగిన మీటింగ్స్‌కి కొత్తగా వచ్చినవాళ్లు, “దేవుడు నిజంగా మీ మధ్య ఉన్నాడు” అని అన్నారు. ఆ మాటల్నే ఈరోజు మన మీటింగ్స్‌కి కొత్తగా వచ్చినవాళ్లు కూడా అనాలని మనం కోరుకుంటాం. (1 కొరిం. 14:24, 25; జెక. 8:23) అందుకే, “ఒకరితో ఒకరు శాంతిగా మెలగండి” అనే సలహాను మనం పాటిస్తూ ఉండాలి.—1 థెస్స. 5:13.
18. ప్రజల్ని యెహోవా సంస్థ వైపుకు ఇంకా ఏం ఆకర్షిస్తుంది?
18 మనం బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఎప్పుడూ యెహోవా చూసినట్టే చూడడానికి ప్రయత్నించాలి. అలా చేయాలంటే మెల్లమెల్లగా కనబడకుండా పోయే లోపాల మీద కాకుండా, ఎప్పుడూ కనిపిస్తూ ఉండే మంచి లక్షణాల మీద మనం మనసుపెట్టాలి. అంతేకాదు, ‘ఒకరితో ఒకరు దయగా మెలుగుతూ, కనికరం చూపిస్తూ, మనస్ఫూర్తిగా క్షమించినప్పుడు’ ఏవైనా మనస్పర్థలు వస్తే, వాటిని ప్రేమతో తీసేసుకోవచ్చు. (ఎఫె. 4:32) అలాంటి ప్రేమను రుచి చూడాలనుకునేవాళ్లు ఆధ్యాత్మిక పరదైసులోకి ఆకర్షించబడతారు. b
ఆధ్యాత్మిక పరదైసులోనే ఉండండి
19. (ఎ) ఆధ్యాత్మిక పరదైసులోకి తిరిగొచ్చిన కొంతమంది ఏమంటున్నారో “ వెళ్లినవాళ్లు తిరిగొచ్చారు” అనే బాక్స్ చూసి చెప్పండి. (బి) మనమేం చేయాలని నిర్ణయించుకోవాలి? (చిత్రం కూడా చూడండి.)
19 ఆధ్యాత్మిక పరదైసు గురించి ఎంత చెప్పినా తక్కువే! అది రోజురోజుకూ అందంగా తయారౌతుంది. దానిలోకి వచ్చే యెహోవా ఆరాధకుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. యెహోవా తయారుచేసిన ఈ పరదైసు పట్ల మన హృదయాల్లో కృతజ్ఞత ఎప్పుడూ ఉప్పొంగిపోవాలి. ఎవరికైనా సేదదీర్పు, సంతృప్తి, ప్రశాంతత, భద్రత కావాలంటే వాళ్లు ఖచ్చితంగా ఆధ్యాత్మిక పరదైసులోకి రావాల్సిందే, దాన్ని అస్సలు వదలకుండా ఉండాల్సిందే! అయితే మనల్ని ఆధ్యాత్మిక పరదైసులో నుండి బయటకు లాగేయడానికి సాతాను అన్ని ప్రయత్నాలూ చేస్తాడు, కాబట్టి తస్మాత్ జాగ్రత్త! (1 పేతు. 5:8; ప్రక. 12:9) అతన్ని మనం అస్సలు గెలవనివ్వకూడదు. అందుకే, మనం కూడా ఆధ్యాత్మిక పరదైసుకు ఉన్న అందచందాల్ని, పవిత్రతను-ప్రశాంతతను కాపాడడానికి అన్ని ప్రయత్నాలూ చేద్దాం.
మీరెలా జవాబిస్తారు?
-
ఆధ్యాత్మిక పరదైసు అంటే ఏంటి?
-
ఆధ్యాత్మిక పరదైసులో మనం ఎలాంటి దీవెనల్ని ఆస్వాదిస్తున్నాం?
-
వేరేవాళ్లను ఆధ్యాత్మిక పరదైసులోకి మనం ఎలా ఆకర్షించవచ్చు?
పాట 144 మీ దృష్టి లక్ష్యంపై ఉంచండి!
a పదాల వివరణ: “ఆధ్యాత్మిక పరదైసు” అంటే యెహోవాను ఆరాధించే ఒక వాతావరణం. ఈ ఆధ్యాత్మిక పరదైసులో మనం యెహోవాతో, తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌తో మంచి సంబంధం కలిగివుంటాం.
b ఇప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారు? అలినా జిట్నికోవ: నా కల ఎలా నెరవేరిందంటే. . . అనే వీడియోను jw.orgలో చూసి, ఒక సిస్టర్ ఆధ్యాత్మిక పరదైసులో ఉండడం వల్ల పొందిన దీవెనల గురించి తెలుసుకోండి.
c చిత్రం వివరణ: బ్రదర్స్-సిస్టర్స్ మీటింగ్‌లో ఒకరితోఒకరు మాట్లాడుకుంటూ సరదాగా ఉన్నారు. కానీ ఒక్క బ్రదర్ మాత్రం ఎవ్వరితో మాట్లాడకుండా కూర్చున్నాడు.