మీకు తెలుసా?
దావీదు రాజు సైన్యంలో విదేశీయులు ఎందుకున్నారు?
దావీదు రాజు సైన్యంలో విదేశీయులు కూడా ఉన్నారు. ఉదాహరణకు అమ్మోనీయుడైన జెలెకు, హిత్తీయుడైన ఊరియా, మోయాబీయుడైన ఇత్మా ఉన్నారు. a (1 దిన. 11:39, 41, 46) వీళ్లే కాదు ‘కెరేతీయులు, పెలేతీయులు, గిత్తీయులు’ కూడా ఉన్నారు. (2 సమూ. 15:18) కెరేతీయులకు, పెలేతీయులకు ఫిలిష్తీయులతో దగ్గరి బంధుత్వం ఉండివుంటుంది. (యెహె. 25:16) గిత్తీయులేమో ఫిలిష్తీయుల నగరమైన గాతు వాసులు.—యెహో. 13:2, 3; 1 సమూ. 6:17, 18.
దావీదు తన సైన్యంలో విదేశీయుల్ని ఎందుకు ఉండనిచ్చాడు? వాళ్లు తనకు అలాగే ముఖ్యంగా యెహోవాకు విశ్వసనీయంగా ఉంటారని దావీదు నమ్మాడు. ఉదాహరణకు కెరేతీయులు, పెలేతీయుల గురించి ద న్యూ ఇంటర్ప్రెటర్స్ డిక్షనరీ ఆఫ్ ద బైబిల్ ఇలా చెప్తుంది: “దావీదు పరిపాలనలోని చాలా కష్టమైన రోజుల్లో వాళ్లు ఆయనకు విశ్వసనీయంగా ఉన్నారు.” ఎలా? “ఇశ్రాయేలీయులందరూ” దావీదును విడిచిపెట్టి “సమస్యలు సృష్టించే షేబ” అనే వ్యక్తిని అనుసరించారు. కానీ అప్పుడు కెరేతీయులు, పెలేతీయులు మాత్రం దావీదును విడిచిపెట్టకుండా షేబ తిరుగుబాటును అడ్డుకున్నారు. (2 సమూ. 20:1, 2, 7) ఇంకో సందర్భంలో, దావీదు కొడుకు అదోనీయా రాజ సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు కూడా కెరేతీయులు, పెలేతీయులు దావీదుకు విశ్వసనీయంగా ఉన్నారు. యెహోవా దావీదు తర్వాత రాజుగా ఎన్నుకున్న సొలొమోనును వాళ్లు సింహాసనం మీద కూర్చోబెట్టారు.—1 రాజు. 1:24-27, 38, 39.
దావీదుకు నమ్మిన బంటుగా ఉన్న ఇంకో విదేశీయుడు గిత్తీయుడైన ఇత్తయి. ఒకసారి దావీదు కొడుకైన అబ్షాలోము ఎదురుతిరిగి, ఇశ్రాయేలీయుల హృదయాల్ని దావీదుకు వ్యతిరేకంగా తనవైపుకు తిప్పుకున్నాడు. అప్పుడు ఇత్తయి, అతని 600 మంది యోధులు రాజైన దావీదుకు మద్దతిచ్చారు. ఇత్తయి విదేశీయుడు కాబట్టి తనకోసం యుద్ధం చేయాల్సిన అవసరంలేదని దావీదు అతనితో చెప్పాడు. కానీ ఇత్తయి ఇలా అన్నాడు: “యెహోవా జీవం తోడు, నా ప్రభువైన రాజు జీవం తోడు; చావైనా, బ్రతుకైనా నా ప్రభువైన రాజు ఎక్కడుంటే, నీ సేవకుడు అక్కడే ఉంటాడు!”—2 సమూ. 15:6, 18-21.
కెరేతీయులు, పెలేతీయులు, గిత్తీయులు విదేశీయులైనా యెహోవా నిజమైన దేవుడని, ఆయన అభిషేకించిన వ్యక్తి దావీదే అని గుర్తించారు. తన కోసం, యెహోవా కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అలాంటివాళ్లు తన పక్కన ఉన్నందుకు దావీదుకు ఎంత ధైర్యంగా అనిపించివుంటుందో కదా!
a ద్వితీయోపదేశకాండం 23:3-6 లో ఉన్న దేవుని నియమం ప్రకారం అమ్మోనీయులు, మోయాబీయులు ఇశ్రాయేలీయుల సమాజంలోకి రాకూడదు. అయితే, వాళ్లకు ఆ దేశంలో ఉండే చట్టపరమైన పౌరసత్వం గురించి ఆ నియమం మాట్లాడుతుంది గానీ వాళ్లు దేవుని ప్రజల మధ్య ఉండకూడదని గానీ వాళ్లతో సహవసించకూడదని గానీ చెప్పట్లేదు. లేఖనాలపై అంతర్దృష్టి (ఇంగ్లీష్) 1వ సంపుటి, 95వ పేజీ చూడండి.