జీవిత కథ
నా బలహీనతల్లో యెహోవా శక్తి ఎంత గొప్పదో రుచిచూశాను
1985 లో నేను, నా భార్య కొలంబియాకు వచ్చినప్పుడు ఆ దేశమంతా రక్తపాతంతో నిండిపోయింది. అక్కడి నగరాల్లో ఉన్న డ్రగ్ మాఫియా అలాగే పర్వత ప్రాంతాల్లో ఉన్న ఉద్యమకారులు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారారు. మేము ఆ తర్వాత సేవ చేసిన మెడ్లిన్ అనే ప్రాంతంలో టీనేజీ వయసులో ఉన్న రౌడీలు ఉండేవాళ్లు. వాళ్లు గన్లు పట్టుకుని వీధుల్లో తిరిగేవాళ్లు, డ్రగ్స్ అమ్మేవాళ్లు, మామూళ్లు వసూలు చేసేవాళ్లు, కిరాయి హత్యలు చేసేవాళ్లు. వాళ్లలో ఎవ్వరూ ఎక్కువరోజులు బ్రతికేవాళ్లు కాదు. మేము వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది.
ప్రపంచపటంలో ఎక్కడో ఓ మూలనున్న ఫిన్లాండ్లో, చాలా సర్వసాధారణంగా బ్రతికే ఇద్దరు దక్షిణ అమెరికాకు ఎలా వచ్చారు? గడిచిన సంవత్సరాల్లో మేము నేర్చుకున్న పాఠాలు ఏంటి? ఇప్పుడు చెప్తాను వినండి.
ఫిన్లాండ్లో నా బాల్యం
నేను 1955 లో పుట్టాను. నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఫిన్లాండ్లోని దక్షిణ తీరప్రాంతంలో నేను పెరిగాను. ఇప్పుడు దాన్నే వాంటా అని పిలుస్తున్నారు.
నేను పుట్టడానికి కొన్ని సంవత్సరాల ముందు, మా మమ్మీ బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యింది. కానీ మా డాడీకి సత్యం అంటే అస్సలు ఇష్టంలేదు. మా మమ్మీ మాకు బైబిలు విషయాలు చెప్పడంగానీ, మీటింగ్స్‌కి తీసుకెళ్లడం గానీ డాడీ అస్సలు చేయనిచ్చేవాడు కాదు. కాబట్టి మా డాడీ లేనప్పుడు మా మమ్మీ మాకు కొన్ని బైబిలు సత్యాల్ని నేర్పించింది.
నాకు చిన్నప్పటినుండి యెహోవా అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆయనకు ఇష్టంలేని పని ఏదీ చేసేవాడిని కాదు. ఉదాహరణకు, నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు నేను వెరిలట్టిజా (ఫిన్లాండ్లో రక్తంతో చేసే ప్యాన్ కేకులు) తినని చెప్పినందుకు మా స్కూల్ టీచర్ కోపంతో ఊగిపోయింది. ఆమె ఒక చేత్తో నా చెంపలు ఒత్తేసి, ఇంకో చేత్తో ఫోర్క్‌తో ఆ ప్యాన్ కేకును నా నోట్లో కుక్కడానికి చూసింది. కానీ నేను ఆమె చేతిని నెట్టేశాను.
నాకు 12 ఏళ్లున్నప్పుడు మా డాడీ చనిపోయారు. ఆ తర్వాత నుండి నేను మీటింగ్స్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. అక్కడ బ్రదర్స్ నామీద ప్రేమ, శ్రద్ధ చూపించారు. దానివల్ల నేను యెహోవాకు ఇంకా దగ్గరవ్వగలిగాను. నేను రోజూ బైబిలు చదివేవాణ్ణి. మన ప్రచురణల్ని కూడా జాగ్రత్తగా అధ్యయనం చేసేవాణ్ణి. ఈ అధ్యయన అలవాట్ల వల్ల నేను 1969, ఆగస్టు 8న అంటే నాకు 14 ఏళ్లున్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను.
నా స్కూల్ చదువులు పూర్తవ్వగానే నేను పయినీరు అయ్యాను. ఆ తర్వాత కొద్ది వారాలకే, ఫిన్లాండ్లోని పైలవేసి అనే అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవచేయడానికి వెళ్లిపోయాను.
అక్కడ నాకు కాబోయే భార్య సిర్కాను కలిశాను. ఆమెకు వినయం, యెహోవా మీద ప్రేమ చాలా ఎక్కువ. వాటిని చూసే నేను పడిపోయాను. ఆమె పొగడ్తల్ని ఆశించేదికాదు. ఖరీదైన వస్తువుల్ని కూడా కోరుకునేది కాదు. మేమిద్దరం యెహోవా సేవలో మా బెస్ట్ ఇవ్వాలనుకున్నాం. మాకు ఏ నియామకం ఇచ్చినా దాన్ని ఇష్టంగా చేయాలనుకున్నాం. 1974, మార్చి 23న మేము పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత హనీమూన్‌కి వెళ్లే బదులు, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న కార్టుల్లా అనే ప్రాంతానికి వెళ్లిపోయాం.
యెహోవా మమ్మల్ని శ్రద్ధగా చూసుకున్నాడు
పెళ్లయిన మొదటిరోజు నుండే రాజ్యానికి మొదటిస్థానం ఇస్తే మా అవసరాల్ని యెహోవా తీరుస్తాడని కళ్లారా చూశాం. (మత్త. 6:33) ఉదాహరణకు, మేము కార్టుల్లాలో ఉన్నప్పుడు మాకు కార్ లేదు. కాబట్టి మేము సైకిల్ మీద వెళ్లేవాళ్లం. కానీ చలికాలాల్లో గడ్డకట్టుకుపోయేంత చలి ఉండేది. ఇంతపెద్ద టెరిటరీలో ప్రీచింగ్ చేయాలంటే మాకు ఒక కార్ అవసరం. కానీ అది కొనుక్కునేంత స్తోమత మాకు లేదు.
అనుకోకుండా ఒకరోజు మా చిన్న అన్నయ్య మమ్మల్ని చూడడానికి వచ్చాడు. ఆయన తన కార్ వాడుకోమని మాకు చెప్పాడు. దానికి ఇన్సూరెన్స్ కూడా కట్టేసివుంది. కేవలం మేము పెట్రోల్ కొట్టించుకుని వాడుకోవడమే. ఇప్పుడు మాకు అవసరమైన కార్ మా దగ్గరుంది.
మా అవసరాలు తీర్చే బాధ్యతను యెహోవా తీసుకున్నాడని మాకు అర్థమైంది. ఇప్పుడు మేము చేయాల్సిన పనల్లా ఆయన రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వడమే!
గిలియడ్ పాఠశాల
1978 లో మేము పయినీరు సేవా పాఠశాల హాజరౌతున్నప్పుడు, దాని ఉపదేశకుల్లో ఒకరైన రైమో క్యూకనెన్ a అనే బ్రదర్ మమ్మల్ని గిలియడ్‌కు అప్లై చేసుకోమని ప్రోత్సహించాడు. కాబట్టి మేము ఆ పాఠశాలకి అర్హత సాధించడానికి ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాం. కానీ 1980 లో గిలియడ్‌కు అప్లై చేసుకోవడానికి ముందే, మమ్మల్ని ఫిన్లాండ్ బ్రాంచి కార్యాలయంలో సేవ చేయడానికి ఆహ్వానించారు. అప్పట్లో బెతెల్‌లో సేవ చేసేవాళ్లకు గిలియడ్‌కు అప్లై చేసుకునే అవకాశం లేదు. కానీ మాకు నచ్చిన చోటు కంటే, యెహోవాకు నచ్చిన చోట సేవ చేయాలని మేము అనుకున్నాం. కాబట్టి ఆ ఆహ్వానాన్ని తీసుకుని మేము ఫిన్లాండ్ బ్రాంచికి వచ్చాం. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా గిలియడ్‌కు అప్లై చేసుకునే అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆపలేదు.
కొన్ని సంవత్సరాల తర్వాత పరిపాలక సభ బెతెల్‌లో సేవ చేసే వాళ్లకు కూడా గిలియడ్‌కు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చింది. అప్పుడు మేము వెంటనే గిలియడ్‌కి అప్లికేషన్ పెట్టాం. అంటే మాకు బెతెల్ సేవ ఇష్టం లేదని కాదుగానీ, మాకు అర్హత ఉంటే అవసరమున్న ప్రాంతంలో సేవ చేయాలని కోరుకున్నాం. మమ్మల్ని గిలియడ్‌కు పిలిచారు. 1985, సెప్టెంబరు నెలలో 79వ గిలియడ్ తరగతిని మేము పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత మమ్మల్ని కొలంబియాకు నియమించారు.
మా మొట్టమొదటి మిషనరీ నియామకం
కొలంబియాలో మమ్మల్ని ముందుగా బ్రాంచి కార్యాలయానికి నియమించారు. నాకిచ్చిన నియామకాన్ని చక్కగా చేయడానికి చూశాను. కానీ ఒక సంవత్సరం తర్వాత నాకు కొంచెం మార్పు కావాలని అనిపించింది. అందుకే జీవితంలో ఒకే ఒక్కసారి నాకు వేరే నియామకం ఇవ్వమని అడిగాను. ఆ తర్వాత మమ్మల్ని హ్యూల ప్రాంతంలోని నేవా నగరానికి మిషనరీగా నియమించారు.
ప్రీచింగ్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి కాకముందు ఫిన్లాండ్లో పయినీరు సేవ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రీచింగ్ చేసేవాణ్ణి. పెళ్లయ్యాక కూడా మేము రోజంతా ప్రీచింగ్ చేసేవాళ్లం. మా ఇంటికి దూరంగా ప్రీచింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కార్లోనే నిద్రపోయేవాళ్లం. దానివల్ల ప్రయాణానికి టైమ్ కలిసొచ్చేది. అప్పుడు మేము ఉదయాన్నే లేచి ప్రీచింగ్‌కి వెళ్లిపోయేవాళ్లం.
మిషనరీలుగా ఒకప్పుడు ప్రీచింగ్‌లో మాకున్న ఉత్సాహం మళ్లీ వచ్చినట్లు అనిపించింది. మా సంఘం కూడా అభివృద్ధి చెందింది. కొలంబియాలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్ చాలా మర్యాదస్థులు, వాళ్లకు ప్రేమ, కృతజ్ఞత కూడా ఎక్కువే.
ప్రార్థనకు ఉన్న శక్తిని చూశాను
మేము ఉంటున్న నేవా చుట్టుపక్కల పట్టణాల్లో యెహోవాసాక్షులు ఒక్కరు కూడా లేరు. వాళ్లకు మంచివార్త ఎవరు ప్రకటిస్తారా అని నేను బాగా ఆలోచించేవాణ్ణి. అయితే ఉద్యమకారుల పోరాటాల వల్ల బయటివాళ్లకు అది అంత సురక్షితమైన ప్రాంతం కాదు. కాబట్టి ఆ పట్టణాలకు చెందిన ఎవరైనా ఒకరు నేవాలో ఉంటూ సత్యం నేర్చుకుంటే బాగుండని అనుకున్నాను. ఆ తర్వాత అతను బాప్తిస్మం తీసుకుని, ఆధ్యాత్మికంగా పరిణతి సాధించి తన సొంతూరు వెళ్లి ప్రీచింగ్ చేస్తే చాలా బాగుంటుందని ప్రార్థన చేశాను. కానీ యెహోవాకు నాకన్నా మంచి ఐడియాలు ఉంటాయని మర్చిపోయాను.
కొన్ని రోజులకు ఫెర్నాండో గొంజాలీజ్ అనే యువకునితో బైబిలు స్టడీ మొదలుపెట్టాను. ఆయన ఒక్క యెహోవాసాక్షి కూడా లేని ఆ పట్టణాల్లో ఒకటైన అల్జీసైరస్లో ఉండేవాడు. ఫెర్నాండో ఉద్యోగం కోసం దాదాపు 50 కి.మీ. కన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేసి, నేవాకు వచ్చేవాడు. ఆయన ప్రతీ స్టడీకి చక్కగా సిద్ధపడేవాడు, ప్రతీ మీటింగ్‌కి వచ్చేవాడు. స్టడీ తీసుకుంటున్న మొదటి రోజు నుండే తన సొంతూరులో చుట్టుపక్కల వాళ్లందర్ని పిలిచి, స్టడీలో ఆయన నేర్చుకున్న విషయాలు చెప్తుండేవాడు.
ఫెర్నాండో స్టడీ తీసుకోవడం మొదలుపెట్టిన ఆరు నెలలకే అంటే 1990, జనవరిలో బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన పయినీరు అయ్యాడు. ఇప్పుడు అల్జీసైరస్ పట్టణంలో స్థానికంగా ఒక యెహోవాసాక్షి ఉన్నాడు కాబట్టి అక్కడికి ప్రత్యేక పయినీర్లను నియమించడం సురక్షితమని బ్రాంచి కార్యాలయానికి
అనిపించింది. దాంతో 1992, ఫిబ్రవరిలో అక్కడ ఒక సంఘం మొదలైంది.ఫెర్నాండో ప్రీచింగ్ విషయంలో తన సొంతూరికే పరిమితమయ్యాడా? లేదు. పెళ్లయ్యాక ఆయనా, ఆయన భార్య కొలంబియాలోని శాన్ విసెంటె డెల్ కాగ్వాన్ పట్టణానికి వెళ్లిపోయారు. అక్కడ ఒక్క యెహోవాసాక్షి కూడా లేరు. వాళ్లు అక్కడ ఒక సంఘం మొదలయ్యేలా సహాయం చేశారు. 2002 లో ఫెర్నాండో ప్రాంతీయ పర్యవేక్షకునిగా నియమించబడ్డాడు. ఆయనా, ఆయన భార్య ఓల్గా ఈరోజు వరకు ప్రయాణ సేవలోనే కొనసాగుతున్నారు.
నాకు ఎదురైన ఈ అనుభవాన్ని బట్టి నేనొక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. అదేంటంటే, దేవుడిచ్చిన నియామకానికి సంబంధించి మనకేం అవసరమో దాన్ని సూటిగా అడగాలి. మనం చేయలేనిదాన్ని యెహోవా చేయగలడు. ఎంతైనా కోత యజమాని ఆయనే, మనం కాదు!—మత్త. 9:38.
తన పని “చేయాలనే కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని” యెహోవా ఇస్తాడు
1990 లో మమ్మల్ని ప్రయాణ సేవకు నియమించారు. కొలంబియా రాజధానియైన బొగొటా మా మొట్టమొదటి సర్క్యూట్. ఆ నియామకం చేయాలంటే మాకు చాలా భయమేసింది. ఎందుకంటే నాకు, నా భార్యకు ప్రత్యేకమైన నైపుణ్యాలు ఏమీ లేవు. మేము చాలా మామూలు ప్రజలం. అంతేకాదు పెద్దపెద్ద నగరాల్లో బ్రతకడం మాకు తెలీదు. కానీ ఫిలిప్పీయులు 2:13 లో యెహోవా ఇచ్చిన మాట మా విషయంలో నిజమవ్వడం మేము చూశాం. “తనకు ఇష్టమైనవి చేయాలనే కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని ఇచ్చి దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు. అలా చేయడం ఆయనకు ఇష్టం.”
ఆ తర్వాత ఈ ఆర్టికల్ మొదట్లో చెప్పినట్టు, మెడ్లిన్ అనే ప్రాంతంలో ఉన్న ఒక సర్క్యూట్‌కి మమ్మల్ని నియమించారు. అక్కడి ప్రజలు వీధుల్లో జరిగే కొట్లాటలకు అలవాటు పడిపోయారు. అది వాళ్లకు పెద్ద వింతేమీ కాదు. ఉదాహరణకు, ఒకరోజు నేను ఒక బైబిలు స్టడీకి వెళ్లాను. ఆ ఇంటి బయట ఉన్నట్టుండి ప్రజలు గన్లతో కాల్చుకుంటున్నారు. నాకు భయమేసి కిందికి వంగి దాక్కోవడానికి చూశాను. కానీ నా బైబిలు విద్యార్థి మాత్రం ఉలుకూపలుకూ లేకుండా ప్రశాంతంగా పేరా చదివాడు. పేరా చదవడం అయిపోయాక ఒక్క నిమిషం అండి బయటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లాడు. కాసేపటికి ఇద్దరి పిల్లలతో లోపలికి వచ్చి “సారీ అండి, మా పిల్లలు వీధిలో ఉన్నారు అందుకే తీసుకొచ్చాను” అని అన్నాడు.
ఇంకొన్ని సందర్భాల్లో మేము చావు అంచుల దాకా వెళ్లొచ్చాం. ఒకసారి మేము ప్రీచింగ్ చేస్తున్నప్పుడు నా భార్య నావైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె చాలా కంగారుకంగారుగా ఉంది. తనను ఎవరో కాల్చారని ఆమె చెప్పింది. నేను షాక్ అయ్యాను! నా బుర్ర పని చేయలేదు. కానీ ఆ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, కాల్చిన వ్యక్తి సిర్కాను కాదు ఆమె పక్కన నడుచుకుంటూపోయే వ్యక్తిని కాల్చాడు.
కాలం గడిచేకొద్దీ, మేము కూడా వీధుల్లో జరిగే కొట్లాటలకు అలవాటు పడిపోయాం. అక్కడున్న మన బ్రదర్స్‌సిస్టర్స్ ఇలాంటి పరిస్థితుల్లో, ఇంతకన్నా ఘోరమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండడం చూసి, మేము ధైర్యం తెచ్చుకున్నాం. యెహోవా వాళ్లకు సహాయం చేశాడంటే, మాకు కూడా తప్పకుండా సహాయం చేస్తాడని నమ్మాం. మేము ఎప్పుడూ స్థానికంగా ఉన్న సంఘపెద్దల సలహాల్ని పాటించాం, జాగ్రత్తలు తీసుకున్నాం, మిగతాది యెహోవాకు వదిలేశాం.
నిజానికి కొన్ని పరిస్థితులు మేము అనుకున్నంత భయంకరంగా ఏమీ లేవు. ఒకసారి నేను ఒక ఇంటికి
వెళ్లినప్పుడు ఆ ఇంటి పక్కన ఇద్దరు ఆడవాళ్లు అరుచుకుంటున్నట్టు నాకు వినిపించింది. గొడవలు చూడాలని గానీ వినాలని గానీ నాకు ఆసక్తి ఉండదు. కానీ ఆ ఇంటివ్యక్తి మెల్లిగా బయటికి రమ్మని సైగ చేసింది. వెళ్లి చూసేసరికి, రెండు చిలుకలు అచ్చం ఇద్దరు ఆడవాళ్లలా అరుచుకుంటున్నాయి.కొత్త బాధ్యతలు, కొత్త సవాళ్లు
1997 లో నన్ను పరిచర్య శిక్షణా పాఠశాలకు ఉపదేశకునిగా నియమించారు. b సంస్థ నిర్వహించే పాఠశాలలకు వెళ్లడమంటే నాకు చాలా ఇష్టం. కానీ అలాంటి ఒక పాఠశాలకు ఉపదేశకునిగా ఉండే ఒక గొప్ప అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు.
ఆ తర్వాత, నేను జిల్లా పర్యవేక్షకునిగా సేవ చేశాను. ఆ ఏర్పాటు ఆగిపోయినప్పుడు తిరిగి ప్రాంతీయ సేవకు వచ్చాను. అలా దాదాపు 30 సంవత్సరాలకు పైగా, నేను సంస్థ నిర్వహించే పాఠశాలలకు ఉపదేశకునిగా, ప్రయాణ పర్యవేక్షకునిగా సంతోషంగా సేవ చేశాను. ఈ నియామకాలన్నీ ఎన్నో దీవెనలు తెచ్చి పెట్టాయి. కానీ ఆ నియామకాలు ఎప్పుడూ పూలపాన్పులా లేవు. అలా ఎందుకన్నానో చెప్తాను.
నేను కొంచెం గట్టి మనిషినే. దీనివల్ల నాకొచ్చే కష్టాల్ని చక్కగా ఎదుర్కొన్నాను. కానీ కొన్ని సందర్భాల్లో సంఘంలోని విషయాల్ని సరిదిద్దడానికి అత్యుత్సాహం చూపించేవాణ్ణి. అదే ఉత్సాహంతో ఇతరులతో ప్రేమగా, దయగా ఉండమని కొంతమందికి సలహా ఇచ్చాను. చెప్పాలంటే, ఆ సందర్భాల్లో నేనే ఆ లక్షణాల్ని చూపించలేకపోయాను.—రోమా. 7:21-23.
నా పొరపాట్లను బట్టి కొన్నిసార్లు చాలా డీలా పడిపోయాను. (రోమా. 7:24) ఒకానొక సందర్భంలోనైతే, ఈ మిషనరీ సేవ వదిలేసి ఫిన్లాండ్కి వెళ్లిపోవడం మంచిదని ప్రార్థనలో యెహోవాకు చెప్పాను. కానీ ఆరోజు సాయంత్రం మీటింగ్‌లో చాలా ప్రోత్సాహకరమైన విషయాలు విన్నాను. ఆ తర్వాత నా నియామకంలోనే కొనసాగుతూ, నాలో ఉన్న పొరపాట్లను సరిచేసుకుంటూ ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆరోజు యెహోవా నా ప్రార్థనకు ఇచ్చిన జవాబును ఈరోజు వరకు మర్చిపోలేదు! దాంతోపాటు, నా బలహీనతల్ని తీసేసుకోవడానికి ప్రేమగా సహాయం చేసినందుకు నేనెప్పుడూ ఆయనకు రుణపడి ఉంటాను.
భవిష్యత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను
సిర్కా, నేను పూర్తికాల సేవలో పొందిన దీవెనల్ని బట్టి యెహోవాకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం! అంతేకాదు నన్ను ప్రేమించే, నమ్మకంగా ఉండే భార్యను ఇచ్చినందుకు యెహోవాకు థ్యాంక్స్ అనేది చాలా చిన్నమాట.
త్వరలో నాకు 70 ఏళ్లు వస్తాయి. కాబట్టి ఉపదేశకునిగా, ప్రయాణ పర్యవేక్షకునిగా చేసే సేవను ఆపేయాల్సిన టైమ్ దగ్గరపడింది. కానీ నాకు అస్సలు బాధ లేదు. ఎందుకంటే వినయం, ప్రేమ, కృతజ్ఞత నిండిన హృదయంతో యెహోవాను స్తుతించినప్పుడు ఆయనకు ఘనత వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. (మీకా 6:8; మార్కు 12:32-34) కాబట్టి యెహోవాను ఘనపర్చడానికి మనం అందరికి తెలిసే లాంటి నియామకాల్నే చేయాల్సిన అవసరంలేదు.
నాకొచ్చిన నియామకాలన్నిటి గురించి ఒక్కసారి వెనక్కెళ్లి ఆలోచిస్తే, అవన్నీ ఇతరులకన్నా నేను బెస్ట్ అనిగానీ, వాళ్లకన్నా నాకు ఎక్కువ సామర్థ్యాలు ఉన్నాయని గానీ రాలేదు. అది కేవలం యెహోవా కృప వల్లే నాకు వచ్చాయి. నాలో బలహీనతలు ఉన్నాసరే, యెహోవా ఆ సేవావకాశాల్ని నాకిచ్చాడు. అలాగే కేవలం యెహోవా సహాయంతో మాత్రమే నేను వాటిని చేయగలిగాను. అలా నా బలహీనతల్లో యెహోవా శక్తి ఎంత గొప్పదో రుచిచూశాను!—2 కొరిం. 12:9.
a “యెహోవాను సేవించాలని తీర్మానించుకున్నాం” అనే రైమో క్యూకనెన్ జీవిత కథ 2006, ఏప్రిల్ 1 కావలికోటలో వచ్చింది.
b ఈ పాఠశాల స్థానంలో రాజ్య సువార్తికుల కోసం పాఠశాల వచ్చింది.