తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—మడగాస్కర్‌లో
దాదాపు 25 ఏళ్ల వయసున్న సిల్వియానా అనే పయినీరు సహోదరి ఇలా అంటోంది, “పయినీర్ల అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవచేసిన నా స్నేహితుల అనుభవాలను విన్నప్పుడు, నాకూ ఆ సంతోషం రుచి చూడాలని అనిపించింది. కానీ అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లి సేవచేయడం నా శక్తికి మించినదని భయపడ్డాను.”
మీకూ సిల్వియానాలాగే అనిపిస్తుందా? రాజ్య సువార్తికుల అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవచేయాలనే కోరిక మీకూ ఉందా? కానీ ఆ లక్ష్యాన్ని ఎప్పటికైనా చేరుకోగలనా అని ఆలోచిస్తున్నారా? అలాగైతే నిరుత్సాహపడకండి. వేలమంది సహోదరసహోదరీలు యెహోవా సహాయంతో అడ్డంకులను అధిగమించి తమ పరిచర్యను విస్తృతం చేసుకున్నారు. వాళ్లలో కొంతమంది యెహోవా సహాయాన్ని ఎలా పొందారో తెలుసుకోవడానికి, ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ద్వీపమైన మడగాస్కర్‌కు వెళ్దాం.
ఆఫ్రికాలోని ఈ ప్రాంతంలో సత్యంపట్ల ఆసక్తిగలవాళ్లు, బైబిల్ని గౌరవించేవాళ్లు చాలామంది ఉన్నారు. గత 10 కన్నా ఎక్కువ సంవత్సరాల్లో, 11 వేర్వేరు దేశాలకు a చెందిన 70 కన్నా ఎక్కువమంది ఉత్సాహవంతులైన ప్రచారకులు ప్రీచింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అంతేకాదు, అతిపెద్దదైన ఆ ద్వీపమంతట మంచివార్తను ప్రకటించడానికి ఎంతోమంది స్థానిక ప్రచారకులు ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్లలో కొంతమంది గురించి తెలుసుకుందాం.
భయాన్ని, నిరుత్సాహాన్ని అధిగమించడం
తమ 30వ పడిలో ఉన్న లూయీ, పరిన్ అనే జంట ఫ్రాన్స్ నుండి మడగాస్కర్‌కు వెళ్లిపోయారు. వేరే దేశానికి వెళ్లి సేవచేయాలని వాళ్లు ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నారు. కానీ పరిన్ వెనకాడింది. ఆమె ఇలా వివరిస్తోంది, “మా కుటుంబాన్ని, సంఘాన్ని, అపార్ట్‌మెంట్‌ను, అలవాటు పడిన ప్రాంతాలన్నిటినీ, మా రోజువారీ పనులను వదిలి తెలియని ప్రాంతానికి వెళ్లడానికి భయపడ్డాను. నిజానికి, నేను అధిగమించాల్సి వచ్చిన అతిపెద్ద అడ్డంకి నా భయాలే.” కానీ పరిన్ ధైర్యం తెచ్చుకొని 2012లో లూయీతో కలిసి మడగాస్కర్‌కు వెళ్లింది. వాళ్లు తీసుకున్న నిర్ణయం గురించి ఆమె ఎలా భావిస్తోంది? “గతంలోకి చూస్తే, మా జీవితాల్లో యెహోవా సహాయాన్ని రుచిచూడడంవల్ల మా విశ్వాసం మరింత బలపడిందని నేను చెప్పగలను” అని ఆమె అంది. లూయీ ఇలా చెప్తున్నాడు, “మీరు ఊహించగలరా,
మడగాస్కర్‌లో మేము హాజరైన మొదటి జ్ఞాపకార్థ ఆచరణకు మా బైబిలు విద్యార్థుల్లో 10 మంది హాజరయ్యారు.”మరి సమస్యలు వచ్చినప్పటికీ తమ నియామకంలో కొనసాగడానికి ఆ దంపతులకు ఏమి సహాయం చేసింది? సహించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వమని వాళ్లు యెహోవాకు ప్రార్థన చేశారు. (ఫిలి. 4:13) “యెహోవా మా ప్రార్థనలకు జవాబిచ్చి, మాకు తన ‘శాంతిని’ ఇచ్చాడు. దాంతో మేము పరిచర్యలో పొందుతున్న ఆనందాల మీదే మనసుపెట్టగలిగాం. అంతేకాదు, మా నియామకంలో కొనసాగుతూనే ఉండమని మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఫ్రాన్స్‌లోని స్నేహితులు మాకు ఈ-మెయిల్స్, ఉత్తరాలు పంపించారు” అని లూయీ చెప్తున్నాడు.—ఫిలి. 4:6, 7; 2 కొరిం. 4:7.
లూయీ, పరిన్ చూపించిన సహనానికి యెహోవా వాళ్లను మెండుగా ఆశీర్వదించాడు. లూయీ ఇలా చెప్తున్నాడు, “2014, అక్టోబరులో ఫ్రాన్స్‌లో జరిగిన క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాలకు b మేం హాజరయ్యాం. అది యెహోవా మాకిచ్చిన మర్చిపోలేని బహుమానం.” ఆ పాఠశాల అయిపోయాక, మళ్లీ మడగాస్కర్‌లో సేవ చేయడానికి నియమించినందుకు వాళ్లు చాలా సంతోషించారు.
“మేం మిమ్మల్ని చూసి గర్వపడతాం”
డీడ్యే, నాడీన అనే మధ్య వయసు దంపతులు 2010లో ఫ్రాన్స్ నుండి మడగాస్కర్‌కు వెళ్లిపోయారు. డీడ్యే ఇలా చెప్తున్నాడు, “మేం యౌవనంలో ఉన్నప్పుడు పయినీర్లుగా సేవచేశాం. ఆ తర్వాత మాకు పుట్టిన ముగ్గురు పిల్లల్ని పెంచడమే సరిపోయింది. వాళ్లు పెద్దవాళ్లయ్యాక, వేరే దేశానికి వెళ్లి సేవచేయడం గురించి ఆలోచించాం.” నాడీన ఇలా చెప్తోంది, “పిల్లల్ని వదిలి వెళ్లడమనే ఆలోచన నన్ను ముందడుగు వేయనివ్వలేదు. కానీ మా పిల్లలు ఏమన్నారంటే, ‘అవసరం ఉన్న వేరే దేశానికి వెళ్లి మీరు సేవచేస్తే మేము మిమ్మల్ని చూసి గర్వపడతాం.’” వాళ్ల ప్రోత్సాహంవల్లే మేము మడగాస్కర్‌కు వెళ్లాం. ప్రస్తుతం మేం వాళ్లకు దూరంగా ఉంటున్నా, తరచూ వాళ్లతో మాట్లాడగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది.
మలగాసి భాష నేర్చుకోవడం ఆ జంటకు ఒక సవాలే. ఎందుకంటే, “మేమిప్పుడు 20 ఏళ్ల యౌవనులం కాదు” అని నవ్వుతూ చెప్పింది నాడీన. మరి వాళ్లు ఆ భాషను ఎలా నేర్చుకోగలిగారు? ముందు, ఫ్రెంచ్ భాష మాట్లాడే సంఘానికి వెళ్లడం మొదలుపెట్టారు. స్థానిక భాష నేర్చుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చించగలరనే నమ్మకం కుదిరాక వాళ్లు మలగాసీ భాషా సంఘానికి వెళ్లారు. నాడీన ఇలా అంటోంది, “మేము ప్రీచింగ్‌లో కలిసే చాలామందికి బైబిలు గురించి నేర్చుకోవడమంటే చాలా ఇష్టం. మేము వాళ్ల ఇంటికి వెళ్లినందుకు తరచూ కృతజ్ఞతలు చెప్తుంటారు. మొదట్లో నాకు ఇదంతా కలలా అనిపించింది. ఇక్కడ పయినీరు సేవ చేయడం నాకు చాలా ఇష్టం. నేను ఉదయం నిద్రలేచినప్పుడు మనసులో, ‘వావ్! ఈ రోజు కూడా నేను ప్రీచింగ్‌కు వెళ్తున్నాను’ అని అనుకుంటాను.”
మలగాసి భాష నేర్చుకునే రోజుల్ని గుర్తుచేసుకున్నప్పుడు డీడ్యేకు నవ్వొస్తుంది. ఆయనిలా చెప్తున్నాడు, “ఒకసారి నేను మీటింగ్ నిర్వహిస్తున్నప్పుడు సహోదరసహోదరీలు జవాబులు చెప్తున్నారు కానీ వాళ్ల భాష నాకు అస్సలు అర్థంకావట్లేదు. వాళ్లు ఏమి చెప్పినా నేను మాత్రం ‘థ్యాంక్యూ’ అని చెప్తున్నాను. ఒక సహోదరి జవాబు చెప్పాక కూడా నేను థ్యాంక్యూ చెప్పినప్పుడు, ఆమె జవాబు తప్పని వెనక సీట్లలో కూర్చున్న వాళ్లు సైగలు చేయడం మొదలుపెట్టారు. వెంటనే నేను మరో సహోదరుణ్ణి అడిగాను, ఆయన జవాబు చెప్పాడు. కనీసం ఆయనైనా సరైన జవాబు చెప్పుంటాడు అనుకున్నాను.”
ఆమె సంతోషంగా ఒప్పుకుంది
2005లో జరిగిన సమావేశంలో ట్యెరీ, ఆయన భార్యయైన నాద్య “దేవుని మహిమపర్చే లక్ష్యసాధనకు కృషిచేయండి”
అనే డ్రామా (ఇంగ్లీషు) చూశారు. తిమోతి గురించిన ఆ బైబిలు డ్రామా వాళ్ల హృదయాలను తాకింది. అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లి సేవచేయాలనే వాళ్ల కోరికను బలపర్చింది. ట్యెరీ ఇలా అంటున్నాడు, “డ్రామా అయిపోయాక చప్పట్లు కొడుతూ నా భార్య వైపు తిరిగి, ‘మనం ఏ ప్రాంతానికి వెళ్దాం?’ అని అడిగాను. తను కూడా అదే ఆలోచిస్తోందని చెప్పింది.” సమావేశం అయిపోయిన వెంటనే, వాళ్లు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. నాద్య ఇలా అంటోంది, “కేవలం నాలుగు సూట్‌కేసుల్లో పట్టేంత వరకు కొద్దికొద్దిగా మా వస్తువులను తగ్గించుకుంటూ వచ్చాం.”వాళ్లు 2006లో మడగాస్కర్ వెళ్లారు. అక్కడికి వెళ్లినప్పటి నుండి పరిచర్యను ఆనందిస్తూనే ఉన్నారు. నాద్య ఇలా అంటోంది, “అక్కడి ప్రజలను కలవడం మాకెంతో సంతోషంగా ఉంటుంది.”
ఆరు సంవత్సరాల తర్వాత ఆ భార్యాభర్తలకు ఒక సవాలు ఎదురైంది. ఫ్రాన్స్‌లో ఉండే నాద్యవాళ్ల అమ్మ మారీ మాడలెన్ కింద పడిపోవడంవల్ల చెయ్యి విరిగి, తలకు దెబ్బ తగిలింది. అయితే డాక్టర్‌ను కలిసి మాట్లాడాక, మారీ మాడలెన్‌ను తమతోపాటు మడగాస్కర్‌కు వచ్చి ఉండమని నాద్యవాళ్లు అడిగారు. మారీకి 80 ఏళ్లు ఉన్నప్పటికీ వాళ్లతో వెళ్లడానికి సంతోషంగా ఒప్పుకుంది. వేరే దేశంలో ఉంటున్నందుకు మారీ మాడలెన్‌కి ఎలా అనిపిస్తోంది? “అలవాటుపడడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. నాకు చాలా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ సంఘానికి ఎంతో ఉపయోగపడుతున్నాను అనిపిస్తుంది. నేను ఇక్కడ ఉండడంవల్ల కూతురు-అల్లుడు తమ సేవ కొనసాగించగలుగుతున్నారు. అది నాకు నిజంగా సంతోషాన్నిస్తుంది.”
“యెహోవా నాకు సహాయం చేశాడు”
20వ పడిలో ఉన్న రైన్ అనే సహోదరుడు తూర్పు మడగాస్కర్‌లోని సారవంత ప్రాంతమైన ఆల్‌ట్చా మంగూరూలో పెరిగాడు. ఆయనకు స్కూల్లో మంచి మార్కులు రావడంతో పైచదువులు చదవాలని అనుకున్నాడు. కానీ బైబిలు స్టడీ తీసుకున్నాక మనసు మార్చుకున్నాడు. రైన్ ఇలా అంటున్నాడు, “నా చదువును త్వరగా పూర్తి చేసుకుని, ‘ఫైనల్ పరీక్షల్లో నేను పాస్ అయితే పయినీరు సేవ మొదలుపెడతాను’ అని యెహోవాకు మాటిచ్చాను.” చదువు అయిపోయాక రైన్ తన మాట నిలబెట్టుకున్నాడు. ఒక పయినీరు సహోదరునితో కలిసి ఉంటూ, పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటూ పయినీరు సేవ మొదలుపెట్టాడు. “నేను తీసుకున్న చాలా మంచి నిర్ణయం అదే” అని రైన్ చెప్తున్నాడు.
కానీ రైన్ పైచదువులు ఎందుకు చదవాలనుకోలేదో ఆయన బంధువులకు అర్థంకాలేదు. ఆయన ఇలా చెప్తున్నాడు, “మా నాన్న, బాబాయి, నానమ్మ నన్ను పైచదువులు చదవమని ప్రోత్సహించారు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో పయినీరు సేవ ఆపాలనుకోలేదు.” అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేయాలని రైన్ ఎప్పటినుండో అనుకుంటున్నాడు. ఇంతకీ ఆయనకు ఆ కోరిక ఎలా కలిగింది? రైన్ ఇలా చెప్తున్నాడు, “మా ఇంట్లో దొంగలు పడి చాలా వస్తువులు ఎత్తుకుపోయారు. ఆ సమయంలో, ‘పరలోకంలో సంపదలు కూడబెట్టుకోవడం’ గురించి యేసు చెప్పిన మాటలు నాకు గుర్తుకొచ్చాయి. దాంతో ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకోవడానికి కృషి చేయాలని నేను నిర్ణయించుకున్నాను.” (మత్త. 6:19, 20) రైన్ తాను ఉంటున్న ప్రాంతం నుండి 1,300 కి.మీ. దూరంలో ఉన్న కరువు ప్రాంతమైన దక్షిణ మడగాస్కర్‌కి వెళ్లాడు. అక్కడ ఆంటన్‌డ్రూయ్ ప్రజలు జీవిస్తారు. ఇంతకీ రైన్ అక్కడికి ఎందుకు వెళ్లాడు?
ఆ దొంగతనం జరగడానికి ఒక నెల ముందు, రైన్ ఇద్దరు ఆంటన్‌డ్రూయ్ అబ్బాయిలతో బైబిలు స్టడీ మొదలుపెట్టాడు. రైన్ ఆ భాషలో కొన్ని పదాలను నేర్చుకున్నాడు. మంచివార్తను ఇంకా తెలుసుకోని ఎంతోమంది ఆంటన్‌డ్రూయ్ ప్రజల గురించి ఆయన ఆలోచించాడు. అందుకే, “టన్‌డ్రూయ్ భాష మాట్లాడే ప్రాంతానికి వెళ్లేందుకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాను” అని రైన్ చెప్తున్నాడు.
అక్కడికి వెళ్లిన వెంటనే రైన్‌కు ఒక సమస్య ఎదురైంది. ఆయనకు ఉద్యోగం దొరకలేదు. ఒకతను రైన్‌ను ఇలా అడిగాడు, “ఉద్యోగాల కోసం ప్రజలు మీ ప్రాంతానికి వస్తుంటే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావ్?” రెండు వారాల తర్వాత, వేరే ప్రాంతంలో జరుగుతున్న ప్రాదేశిక సమావేశానికి రైన్ వెళ్లాడు. కానీ తిరిగి రావడానికి ఆయన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు, ఏమి చేయాలో అర్థంకాలేదు. సమావేశం చివరి రోజున, ఒక సహోదరుడు రైన్ జేబులో ఏదో కవరు పెట్టాడు. ఆయన తిరిగి ఆంటన్‌డ్రూయ్ ప్రాంతానికి వెళ్లడానికి, అక్కడ ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి సరిపోయేంత డబ్బు ఆ కవరులో ఉంది. రైన్ ఇలా చెప్తున్నాడు, “సరైన సమయంలో యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవా గురించి తెలుసుకునే అవకాశంలేని వాళ్లకు నేను సత్యాన్ని నేర్పించగలుగుతున్నాను.” సంఘంలో కూడా చేయడానికి చాలా పని ఉంది. రైన్ ఇంకా ఇలా అంటున్నాడు, “నేను వారం విడిచి వారం బహిరంగ ప్రసంగాన్ని ఇవ్వాల్సి వచ్చేది. యెహోవా నాకు తన సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నాడు.” యెహోవా గురించి నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఎంతోమంది టన్‌డ్రూయ్ భాషా ప్రజలకు రైన్ ఇప్పటికీ మంచివార్త ప్రకటిస్తున్నాడు.
‘సత్యవంతుడైన దేవుని చేత దీవించబడతారు’
‘తమ కోసం దీవెనను వెదికే వాళ్లు సత్యవంతుడైన దేవుని చేత దీవించబడతారు’ అని యెహోవా మనకు హామీ ఇస్తున్నాడు. (యెష. 65:16, NW) పరిచర్య ఎక్కువ చేయాలనుకున్నప్పుడు ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు కృషి చేసినప్పుడు, యెహోవా దీవెనల్ని మనం పొందుతాం. ఈ ఆర్టికల్ మొదట్లో మనం చూసిన సిల్వియానా ఉదాహరణనే పరిశీలించండి. మీకు గుర్తుందా, అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లి సేవచేయడం తన శక్తికి మించిందని ఆమె మొదట్లో భయపడింది. ఎందుకు? ఆమె ఇలా వివరిస్తోంది, “నా ఎడమ కాలు, కుడి కాలుకన్నా దాదాపు 9 సెంటీమీటర్లు పొట్టిగా ఉంటుంది. దానివల్ల కుంటుతూ నడుస్తాను, త్వరగా అలసిపోతాను.”
2014లో సిల్వియానా తన సంఘంలోని మరో యువ పయినీరు అయిన సిల్వీ ఆన్‌తో కలిసి తమ ఊరు నుండి 85 కి.మీ. దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరుకు వెళ్లింది. అడ్డంకులు ఎదురైనప్పటికీ సిల్వియానా కల నిజమైంది. ‘కొత్త నియామకాన్ని ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే, డోరటిన్ అనే నా బైబిలు విద్యార్థి ప్రాంతీయ సమావేశంలో బాప్తిస్మం తీసుకుంది’ అని సిల్వియానా చెప్తోంది. సిల్వియానా ఎంత చక్కని దీవెన పొందిందో కదా!
‘నేను నీకు సహాయం చేస్తాను’
అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లినవాళ్లు విశ్వాసంతో చెప్పిన మాటల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? పరిచర్యను విస్తృతం చేసుకోవడానికి మనకు ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించేందుకు కృషిచేసినప్పుడు, యెహోవా తన సేవకులకు ఇచ్చిన మాట ఎంత నిజమో స్వయంగా తెలుసుకుంటాం. ఆయనిలా మాటిచ్చాడు, ‘నేను నిన్ను బలపరుస్తాను, అవును, నీకు సహాయం చేస్తాను.’ (యెష. 41:9, 10, NW) ఆయన సహాయాన్ని మనం పొందినప్పుడు, ఆయనతో మనకున్న స్నేహం మరింత బలపడుతుంది. అంతేకాదు, మనం ఉంటున్న ప్రాంతంలో లేదా వేరే దేశంలో సేవ చేయడానికి మన జీవితాల్ని సంతోషంగా అంకితం చేసినప్పుడు, కొత్త లోకంలో దేవుడు మనకిచ్చే మరిన్ని నియామకాలకు సిద్ధమౌతాం. పై పేరాల్లో మాట్లాడుకున్న డీడ్యే అనే సహోదరుడు ఇలా అంటున్నాడు, “అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేయడం భవిష్యత్తు కోసం మనకు దొరుకుతున్న మంచి శిక్షణ.” సేవచేయడానికి సంతోషంగా ముందుకొచ్చే ఎంతోమంది త్వరలోనే ఈ శిక్షణను పొందాలని కోరుకుంటున్నాం.
a అమెరికా, కెనడా, గ్వాడెలోప్, జర్మనీ, జెక్‌రిపబ్లిక్, న్యూ కలెడోనియా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డం, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, స్వీడన్ దేశాల నుండి ప్రచారకులు వచ్చారు.
b ఇప్పుడు ఆ పాఠశాల స్థానంలో రాజ్య సువార్తికుల కోసం పాఠశాలను నిర్వహిస్తున్నారు. వేరే దేశంలో సేవ చేస్తున్న అర్హులైన పూర్తికాల సేవకులు ఈ పాఠశాల కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్లు తమ సొంత దేశంలో హాజరవ్వవచ్చు లేదా వేరే దేశంలో తమ మాతృభాషలో జరిగే పాఠశాలకు హాజరవ్వవచ్చు.