కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 2

మీరు ఇతరులకు “ఎంతో ఊరటను” ఇవ్వొచ్చు

మీరు ఇతరులకు “ఎంతో ఊరటను” ఇవ్వొచ్చు

“దేవుని రాజ్యం కోసం పాటుపడే విషయంలో కేవలం వీళ్లు మాత్రమే నా తోటి పనివాళ్లు, వీళ్లు నాకు ఎంతో ఊరటను ఇచ్చారు.”—కొలొ. 4:11.

పాట 90 ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా నమ్మకమైన సేవకుల్లో చాలామంది ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు?

ప్రపంచవ్యాప్తంగా యెహోవా సేవకుల్లో చాలామంది ఎన్నో ఒత్తిళ్లను, బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మీ సంఘంలో కూడా అలాంటివాళ్లు ఉన్నారా? కొంతమంది క్రైస్తవులు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు; ఇంకొందరు తమకు ఇష్టమైనవాళ్లను పోగొట్టుకున్నారు. మరికొందరు తమ కుటుంబ సభ్యుల్లో లేదా తమ స్నేహితుల్లో ఒకరు సత్యాన్ని విడిచిపెట్టడం చూసి తీవ్రంగా నొచ్చుకున్నారు. ఇంకొందరు ప్రకృతి విపత్తుల బారినపడ్డారు. అలాంటి సహోదరసహోదరీలందరికీ ఓదార్పు అవసరం. మనం వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?

2. అపొస్తలుడైన పౌలుకు కొన్నిసార్లు ఓదార్పు ఎందుకు అవసరమైంది?

2 అపొస్తలుడైన పౌలు ప్రాణాంతకమైన పరిస్థితులను ఒకదాని తర్వాత ఒకటి ఎదుర్కొన్నాడు. (2 కొరిం. 11:23-28) అంతేకాదు ఆయన ‘శరీరంలో ఓ ముల్లును’ కూడా భరించాల్సి వచ్చింది, అది బహుశా ఏదైనా అనారోగ్యం కావొచ్చు. (2 కొరిం. 12:7) ఒకప్పుడు తన తోటి పనివాడైన దేమా, “ఈ వ్యవస్థ మీద ప్రేమతో” తనను వదిలేసి వెళ్లిపోయినప్పుడు పౌలు నిరుత్సాహపడ్డాడు. (2 తిమో. 4:10) పౌలు ధైర్యంగల అభిషిక్త క్రైస్తవుడు, ఆయన ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేశాడు. కానీ కొన్నిసార్లు ఆయన కూడా నిరుత్సాహానికి గురయ్యాడు.—రోమా. 9:1, 2.

3. పౌలుకు ఎవరి ద్వారా ఓదార్పు, మద్దతు అందాయి?

3 పౌలుకు కావాల్సిన ఓదార్పు, మద్దతు ఆయనకు అందాయి. ఎలా? యెహోవా పౌలును బలపర్చడానికి తప్పకుండా తన పవిత్రశక్తిని ఉపయోగించివుంటాడు. (2 కొరిం. 4:7; ఫిలి. 4:13) యెహోవా తోటి క్రైస్తవుల ద్వారా కూడా పౌలును ఓదార్చాడు. పౌలు తన తోటివాళ్లలో కొంతమంది గురించి చెప్తూ వాళ్లు “ఎంతో ఊరటను ఇచ్చారు” అని వివరించాడు. (కొలొ. 4:11) ఆయన పేర్లతో ప్రస్తావించిన వాళ్లలో అరిస్తార్కు, తుకికు, మార్కు ఉన్నారు. పౌలు తన కష్టాలను తట్టుకోవడానికి సహాయం చేస్తూ వాళ్లు ఆయన్ని బలపర్చారు. పౌలుకు అంతలా ఓదార్పునిచ్చిన ఈ ముగ్గురు క్రైస్తవులకు ఏ మూడు లక్షణాలు సహాయపడ్డాయి? మనం కూడా ఒకరినొకరం ఓదార్చుకుంటున్నప్పుడు, ప్రోత్సహించుకుంటున్నప్పుడు వాళ్ల మంచి ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చు?

విశ్వసనీయుడైన అరిస్తార్కులా ఉండండి

అరిస్తార్కులా మనం కూడా మన సహోదరసహోదరీల ‘కష్టకాలాల్లో’ విశ్వసనీయులైన స్నేహితుల్లా ఉండవచ్చు (4-5 పేరాలు చూడండి) *

4. పౌలుకు విశ్వసనీయుడైన స్నేహితుడని అరిస్తార్కు ఎలా నిరూపించుకున్నాడు?

4 మాసిదోనియలోని థెస్సలొనీకకు చెందిన అరిస్తార్కు అనే క్రైస్తవుడు, పౌలుకు విశ్వసనీయుడైన స్నేహితుడని నిరూపించుకున్నాడు. పౌలు మూడో మిషనరీ యాత్రలో భాగంగా ఎఫెసుకు వచ్చిన సందర్భంలో అరిస్తార్కు గురించి మొదటిసారి మనం చదువుతాం. పౌలుతో ఉండగా ఒక గుంపు అరిస్తార్కును బంధించారు. (అపొ. 19:29) చివరికి ఆయన విడుదలైన తర్వాత, తన భద్రత గురించి ఆలోచించకుండా పౌలును విశ్వసనీయంగా అంటిపెట్టుకొని ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత, గ్రీసులో వ్యతిరేకులు పౌలును చంపుతామని బెదిరిస్తూ ఉన్నా అరిస్తార్కు మాత్రం పౌలును విడిచిపెట్టలేదు. (అపొ. 20:2-4) దాదాపు క్రీ.శ. 58 లో పౌలు రోముకు ఖైదీగా వెళ్లినప్పుడు అరిస్తార్కు ఆ సుదీర్ఘ ప్రయాణంలో పౌలుతోపాటే ఉన్నాడు. దారిలో వాళ్ల ఓడ బద్దలైనప్పుడు కూడా ఆ తాకిడిని వాళ్లిద్దరూ కలిసి ఎదుర్కొన్నారు. (అపొ. 27:1, 2, 41) వాళ్లు రోముకు చేరుకున్నాక, బహుశా ఆయన పౌలుతో కొంతకాలం బందీగా ఉండివుంటాడు. (కొలొ. 4:10) అలాంటి విశ్వసనీయుడైన స్నేహితుని ద్వారా పౌలు తప్పకుండా ప్రోత్సాహాన్ని, ఓదార్పును పొందివుంటాడు.

5. సామెతలు 17:17 ప్రకారం మనం విశ్వసనీయులైన స్నేహితుల్లా ఎలా ఉండొచ్చు?

5 అరిస్తార్కులా మనం కూడా మన సహోదరసహోదరీలకు అనుకూల సమయాల్లోనే కాకుండా ‘కష్టకాలాల్లో’ కూడా ఒక విశ్వసనీయుడైన స్నేహితునిలా ఉండవచ్చు. (సామెతలు 17:17 చదవండి.) ఏదైనా ఒక కష్టం ముగిసిన తర్వాత కూడా మన సహోదరునికి లేదా సహోదరికి ఓదార్పు అవసరం కావొచ్చు. జానెట్‌ * అమ్మానాన్నలిద్దరూ క్యాన్సర్‌ వల్ల మూడు నెలల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఆమె ఇలా చెప్తుంది: “మా అమ్మానాన్న చనిపోయి చాలాకాలం గడిచినా నేనింకా బాధలో ఉన్నానని నన్ను గుర్తుంచుకున్న విశ్వసనీయులైన నా స్నేహితులకు నేను కృతజ్ఞురాలిని.”

6. విశ్వసనీయంగా ఉంటే మనం ఏం చేస్తాం?

6 విశ్వసనీయులైన స్నేహితులు తమ సహోదరసహోదరీలకు మద్దతివ్వడానికి త్యాగాలు చేస్తారు. ఉదాహరణకు, పీటర్‌ అనే సహోదరునికి ప్రాణాంతక వ్యాధి ఉందని తెలిసింది. అతని భార్య క్యాథరీన్‌ ఇలా చెప్తుంది: “మా సంఘంలో ఒక జంట మమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ పీటర్‌ వ్యాధి బయటపడింది. మమ్మల్ని ఆ పరిస్థితుల్లో ఒంటరిగా వదలకూడదని వాళ్లు అక్కడికక్కడే నిర్ణయించుకున్నారు. అవసరమైనప్పుడల్లా వాళ్లు మాకు అందుబాటులో ఉన్నారు.” మన కష్టాల్ని తట్టుకోవడానికి సహాయం చేసే నిజమైన స్నేహితులు మనకు ఉండడం ఎంత ఊరటగా ఉంటుందో కదా!

నమ్మకస్థుడైన తుకికులా ఉండండి

ఇతరులు సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనం తుకికులాగే నమ్మకస్థుడైన స్నేహితునిలా ఉండవచ్చు (7-9 పేరాలు చూడండి) *

7-8. కొలొస్సయులు 4:7-9 ప్రకారం తుకికు నమ్మకస్థుడని ఎలా నిరూపించుకున్నాడు?

7 ఆసియాలోని రోముకు చెందిన తుకికు అనే క్రైస్తవుడు పౌలుకు నమ్మకమైన సహచరుడిగా ఉన్నాడు. (అపొ. 20:4) దాదాపు క్రీ.శ. 55లో, పౌలు యూదయ క్రైస్తవుల సహాయార్థం విరాళాలు సేకరించే పనిని చేపట్టాడు. ఈ ముఖ్యమైన పనిలో ఆయన తుకికు సహాయం తీసుకునివుంటాడు. (2 కొరిం. 8:18-20) తర్వాత పౌలు మొదటిసారి రోములో బందీగా ఉన్నప్పుడు తుకికు పౌలు వ్యక్తిగత రాయబారిగా పనిచేశాడు. పౌలు రాసిన ప్రోత్సాహకరమైన ఉత్తరాలను, సందేశాలను తుకికు ఆసియాలోని సంఘాలకు చేరవేశాడు.—కొలొ. 4:7-9.

8 ఆయన చివరివరకు పౌలుకు నమ్మకమైన స్నేహితుడిలా ఉన్నాడు. (తీతు 3:12) ఆ రోజుల్లో అందరు క్రైస్తవులు తుకికు అంత ఆధారపడదగిన వాళ్లు కాదు. దాదాపు క్రీ.శ. 65⁠లో పౌలు రెండోసారి బందీగా ఉన్నప్పుడు ఆసియాలోని చాలామంది క్రైస్తవులు తనతో సహవసించడం మానేశారని ఆయన రాశాడు. బహుశా వ్యతిరేకులకు భయపడి వాళ్లు అలా చేసివుంటారు. (2 తిమో. 1:15) దానికి భిన్నంగా తుకికు ఆధారపడదగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే పౌలు ఆయనపై ఆధారపడ్డాడు, ఆయనకు మరో నియామకం కూడా ఇచ్చాడు. (2 తిమో. 4:12) తుకికు లాంటి మంచి స్నేహితుడు ఉన్నందుకు పౌలు తప్పకుండా సంతోషించి ఉంటాడు.

9. తుకికును మనమెలా అనుకరించవచ్చు?

9 మనం కూడా నమ్మకమైన స్నేహితులుగా ఉండడం ద్వారా తుకికును అనుకరించవచ్చు. ఉదాహరణకు, మనం మన సహోదరసహోదరీలకు సహాయం చేస్తామని మాటివ్వడమే కాదు, అవసరమైన సహాయం కూడా చేయాలి. (మత్త. 5:37; లూకా 16:10) సహాయం అవసరమైనవాళ్లకు మనం ఆధారపడదగిన వాళ్లమని తెలిసినప్పుడు వాళ్లు చాలా ఓదార్పు పొందుతారు. అదెలాగో చెప్తూ ఒక సహోదరి ఇలా వివరిస్తోంది: “సహాయం చేస్తామని మాటిచ్చినవాళ్లు, మీకు అవసరమైనప్పుడు పక్కన ఉంటారో లేదో అనే ఆందోళన అవసరంలేదు.”

10. సామెతలు 18:24 లో చెప్పినట్టు కష్టాల్ని, నిరుత్సాహాన్ని ఎదుర్కొంటున్నవాళ్లు ఎవరి నుండి ఓదార్పు పొందవచ్చు?

10 కష్టాల్ని లేదా నిరుత్సాహాన్ని ఎదుర్కొంటున్నవాళ్లు తరచూ నమ్మకమైన ఒక స్నేహితుని నుండి ఓదార్పు పొందుతారు. (సామెతలు 18:24 చదవండి.) తన పెద్దబ్బాయి బహిష్కరించబడడం చూసి నిరుత్సాహపడిన బిజే అనే సహోదరుడు ఇలా అంటున్నాడు, “నా భావాల్ని నమ్మకమైన వ్యక్తితో పంచుకోవాలని అనిపించింది.” కార్లోస్‌ ఒక తప్పు చేయడం వల్ల సంఘంలో తాను సంతోషంగా చేస్తున్న ఒక సేవావకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఆయనిలా అంటున్నాడు, “తప్పుపడతారనే భయంలేకుండా నా భావాల్ని తేలిగ్గా చెప్పేసేంత ‘సురక్షితమైన స్థలం’ నాకు అవసరమైంది.” ఆ సురక్షితమైన స్థలం, తన సమస్య నుండి బయటపడడానికి సహాయం చేసిన పెద్దలే అని కార్లోస్‌ తెలుసుకున్నాడు. తను చెప్పేదేదీ పెద్దలు వేరేవాళ్లకు చెప్పరనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఊరట పొందాడు.

11. మనం నమ్మకస్థులైన స్నేహితుల్లా, విషయాలను గోప్యంగా ఉంచే స్నేహితుల్లా ఎలా ఉండవచ్చు?

11 మనం నమ్మకస్థులైన స్నేహితుల్లా, విషయాలను గోప్యంగా ఉంచే స్నేహితుల్లా ఉండాలంటే ఓర్పును అలవర్చుకోవాలి. జానా అనే సహోదరి భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయినప్పుడు, దగ్గరి స్నేహితులతో తన భావాలను చెప్పుకోవడం ఆమెకు ఊరటనిచ్చింది. ఆమె ఇలా చెప్పింది, “వాళ్లు నేను చెప్పేది ఓపిగ్గా విన్నారు. బహుశా నేను చెప్పిందే మళ్లీమళ్లీ చెప్పివుంటాను.” మీరు కూడా ఓపిగ్గా వినడం ద్వారా మంచి స్నేహితులుగా ఉండొచ్చు.

సేవలు అందించడానికి సుముఖంగా ఉన్న మార్కులా ఉండండి

మార్కు దయతో చేసిన పనులు పౌలు కష్టాల్ని సహించడానికి సహాయం చేశాయి, విషాద సంఘటనలు జరిగినప్పుడు మనం సహోదరులకు సహాయం చేయవచ్చు (12-14 పేరాలు చూడండి) *

12. మార్కు ఎవరు? ఆయన ఇతరులకు సేవచేయడానికి సుముఖత ఎలా చూపించాడు?

12 మార్కు యెరూషలేముకు చెందిన ఒక యూదా క్రైస్తవుడు. ఆయన దగ్గరి బంధువైన బర్నబా సుపరిచితుడైన మిషనరీ. (కొలొ. 4:10) మార్కుది ధనవంతుల కుటుంబం అయ్యుండవచ్చు. కానీ మార్కు తన జీవితంలో వస్తుపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మార్కు తన జీవితమంతా ఇతరులకు సేవచేయడానికి సుముఖంగా ఉన్నాడు; ఆయన ఇతరులకు సంతోషంగా సేవచేశాడు. ఉదాహరణకు అపొస్తలుడైన పౌలు, అపొస్తలుడైన పేతురు తమ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఆయా సమయాల్లో మార్కు వాళ్లతో కలిసి సేవచేశాడు. బహుశా మార్కు వాళ్లకోసం ఆహారం కొనుక్కురావడం, వాళ్లు ఉండడానికి చోటు వెదకడం, ఇంకా ఇతర పనులు చేసివుండవచ్చు. (అపొ. 13:2-5; 1 పేతు. 5:13) మార్కు తనను ‘బలపర్చాడని’, ‘రాజ్యం కోసం పాటుపడే విషయంలో నా తోటి పనివాళ్లలో’ ఒకడని పౌలు అన్నాడు.—కొలొ. 4:10, 11, అధస్సూచి.

13. మార్కు అందించిన మద్దతును, ప్రోత్సాహాన్ని పౌలు విలువైనదిగా ఎంచాడని 2 తిమోతి 4:11 ఎలా చూపిస్తుంది?

13 మార్కు, పౌలు సన్నిహిత స్నేహితుల్లో ఒకడయ్యాడు. ఉదాహరణకు, దాదాపు క్రీ.శ. 65 లో పౌలు రోములో చివరిసారిగా బందీగా ఉన్నప్పుడు ఆయన తిమోతికి తన రెండో ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో పౌలు తిమోతిని రోముకు రమ్మని చెప్తూ తనతో మార్కును కూడా తీసుకుని రమ్మన్నాడు. (2 తిమో. 4:11) మార్కు గతంలో చేసిన నమ్మకమైన సేవను పౌలు విలువైనదిగా ఎంచాడనడంలో సందేహం లేదు, అందుకే ఆ క్లిష్ట పరిస్థితుల్లో మార్కు తనతో ఉండాలని కోరుకున్నాడు. మార్కు పౌలుకు కావల్సిన పనులు చేసిపెట్టాడు. బహుశా వాటిలో ఆహారాన్ని అందించడం, ఉత్తరాలు రాయడానికి కావల్సిన వస్తువుల్ని తెచ్చి ఇవ్వడం ఉండవచ్చు. పౌలుకు మరణశిక్ష అమలయ్యే వరకు, తన ఆఖరి రోజుల్ని సహించడానికి మార్కు అందించిన మద్దతు, ప్రోత్సాహం ఆయనకు సహాయం చేసివుంటాయి.

14-15. ఇతరులకు అవసరమైన సహాయం అందించడం గురించి మత్తయి 7:12 ఏం చెప్తుంది?

14 మత్తయి 7:12 చదవండి. కష్టాల్లో మనకు కావాల్సిన సహాయం అందించిన వాళ్లకు మనమెంతో రుణపడివుంటాం కదా! “మీరు బాధలో ఉన్నప్పుడు రోజూ చేసుకునే ఎన్నో పనులే చాలా భారంగా అనిపించవచ్చు” అని రైన్‌ చెప్తున్నాడు. ఆయన తన తండ్రిని ఘోరమైన ప్రమాదంలో పోగొట్టుకున్నాడు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు, “ఎవరైనా మనకు అవసరమైన పనులు చేసినప్పుడు, అవి చిన్నవైనా సరే చాలా ఊరటగా అనిపిస్తుంది.”

15 మనం జాగ్రత్తగా గమనించేవాళ్లముగా ఉండడం ద్వారా ఇతరులకు కావల్సిన సహాయం అందించగలుగుతాం. ఉదాహరణకు, మనం ముందు మాట్లాడుకున్న పీటర్‌, క్యాథరీన్‌కు సహాయం చేయడానికి ఒక సహోదరి చొరవ తీసుకుంది. పీటర్‌గానీ, క్యాథరీన్‌గానీ కారు నడిపే స్థితిలో లేరు కాబట్టి వాళ్లను డాక్టరు దగ్గరకు ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు తీసుకువెళ్లడానికి ఆ సహోదరి ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా, సంఘం నుండి ఒక్కొక్కరు వంతుల వారీగా పీటర్‌, క్యాథరీన్‌ను హాస్పిటల్‌కు స్వచ్ఛందంగా తీసుకెళ్లేలా, ఆ సహోదరి ఒక పట్టిక తయారుచేసింది. ఆ ఏర్పాటు ఏమైనా ఉపయోగపడిందా? దానివల్ల “మా భుజాల మీద నుండి బరువును తీసేసినట్టు అనిపించింది” అని క్యాథరీన్‌ అంటుంది. దయతో మీరు చేసే సహాయం చిన్నదైనా సరే చాలా ఊరటనిస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి.

16. ఓదార్పును అందించే విషయంలో మనం మార్కు నుండి ఏ ముఖ్యమైన పాఠం నేర్చుకుంటాం?

16 మొదటి శతాబ్దపు శిష్యుడైన మార్కు పనిరద్దీలో ఉండే క్రైస్తవుడు అయ్యుంటాడు. ఆయనకు తన పేరుతో ఉన్న మంచివార్త పుస్తకాన్ని రాయడంతోపాటు ఇతర బరువైన ఆధ్యాత్మిక నియామకాలు ఉన్నాయి. అయినా, పౌలుకు ఓదార్పు ఇవ్వడానికి మార్కు సమయం కేటాయించాడు. మార్కు సహాయం కోరడానికి పౌలు ఇబ్బందిపడలేదు. ఆంజెలా అనే సహోదరి కుటుంబ సభ్యుల్లో ఒకరు హత్యకు గురయ్యారు. తనను ఓదార్చడానికి ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన వాళ్లపట్ల ఆమె కృతజ్ఞత కలిగివుంది. ఆమె ఇలా చెప్తుంది, “స్నేహితులు మనస్ఫూర్తిగా సహాయం చేయాలనుకున్నప్పుడు వాళ్లతో మాట్లాడడానికి ఇబ్బందిపడం. వాళ్లు నాకు సహాయం చేయాలనుకున్నారని, అలా చేయడానికి వాళ్లు భయపడలేదని అనిపించింది.” మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘తోటి ఆరాధకులకు అవసరమైన ఓదార్పు ఇవ్వడానికి సుముఖంగా ఉండే వ్యక్తినని నాకు పేరు ఉందా?’

ఇతరులను ఓదార్చాలని నిశ్చయించుకోండి

17. రెండో కొరింథీయులు 1:3, 4 వచనాలను ధ్యానిస్తే మనమెలా ఇతరులకు ఓదార్పును ఇవ్వడానికి పురికొల్పబడతాం?

17 ఎవరికి ఓదార్పు అవసరమో మనం సులువుగా గుర్తించవచ్చు. ఇతరులు మనకు ఓదార్పును ఇవ్వడానికి ఉపయోగించిన మాటలనే మనం ఉపయోగించవచ్చు. తన అమ్మమ్మను పోగొట్టుకున్న నీనో అనే సహోదరి ఇలా చెప్తుంది, “యెహోవా మనల్ని ఉపయోగించుకునేలా అనుమతిస్తే ఆయన మన ద్వారా ఇతరులకు ఓదార్పును ఇవ్వగలడు.” (2 కొరింథీయులు 1:3, 4 చదవండి.) ముందు ప్రస్తావించిన జానెట్‌ ఇలా చెప్తుంది, “2 కొరింథీయులు 1:4 లోని మాటలు అక్షరాలా నిజం. మనం పొందే ఓదార్పును మనం వేరేవాళ్లకు అందించవచ్చు.”

18. (ఎ) కొంతమంది ఇతరులకు ఓదార్పును ఇవ్వడానికి ఎందుకు భయపడతారు? (బి) మనం ఇతరులకు మనస్ఫూర్తిగా ఎలా ఓదార్పును ఇవ్వవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

18 మనకు భయం అనిపించినా ఇతరులకు సహాయం చేయడానికి చొరవ తీసుకోవాలి. ఉదాహరణకు, ఎవరైనా ఓదార్పు అవసరమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్లతో ఏం మాట్లాడాలో, వాళ్లకు ఏం చేయాలో మనకు తెలీదని మనం భయపడవచ్చు. పాల్‌ అనే సంఘపెద్ద, తన తండ్రి చనిపోయిన తర్వాత తనకు ఓదార్పును ఇవ్వడానికి కొంతమంది చేసిన కృషిని గుర్తుచేసుకుంటున్నాడు. “అంత సులువుగా వాళ్లు నా దగ్గరకు రాలేకపోయారు. వాళ్లు మాట్లాడడానికి మాటలు వెతుక్కున్నారు. నన్ను ఓదార్చాలనే, నాకు మద్దతివ్వాలనే వాళ్ల కోరికను నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను.” పెద్ద భూకంపాన్ని చూసిన టాజన్‌ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “భూకంపం తర్వాత ప్రజలు పంపిన మెస్సేజ్‌లు ఏవీ నాకు గుర్తులేవు. వాళ్లు నా మీద శ్రద్ధతో నా యోగక్షేమాలు కనుక్కోవడమే నాకు గుర్తుంది.” అలాంటి శ్రద్ధ చూపిస్తే మనం కూడా చక్కగా ఓదార్పునిచ్చే వాళ్లముగా ఉంటాం.

19. మీరు ‘ఎంతో ఊరటను’ ఇచ్చేవాళ్లుగా ఉండాలని ఎందుకు నిశ్చయించుకున్నారు?

19 ఈ వ్యవస్థ ముగింపుకు మనం చేరుకుంటుండగా, ప్రపంచ పరిస్థితులు దారుణంగా తయారౌతున్నాయి, జీవితం కష్టతరంగా మారుతోంది. (2 తిమో. 3:13) మనం అపరిపూర్ణులం, తప్పులు చేస్తుంటాం కాబట్టి మనకు ఎప్పటికప్పుడు ఓదార్పు అవసరమౌతుంది. పౌలు తన జీవితంలో చివరి వరకు నమ్మకంగా సహించగలగడానికి ఒక కారణం, ఆయన తోటి క్రైస్తవుల నుండి పొందిన ఓదార్పు. మనం కూడా అరిస్తార్కులా విశ్వసనీయంగా, తుకికులా నమ్మకంగా, మార్కులా సేవచేయడానికి సుముఖంగా ఉండవచ్చు. అలా చేయడం ద్వారా మన సహోదరసహోదరీలు విశ్వాసంలో స్థిరంగా కొనసాగడానికి వాళ్లకు సహాయం చేద్దాం.—1 థెస్స. 3:2, 3.

^ పేరా 5 అపొస్తలుడైన పౌలు తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. అలాంటి సమయాల్లో, తన తోటి పనివాళ్లలో కొంతమంది ఆయనకు ఎంతో ఊరటగా నిలిచారు. వాళ్లు ఇతరులకు అంతబాగా ఊరటనివ్వడానికి లేదా ఓదార్పును ఇవ్వడానికి దోహదపడిన లక్షణాల్లో మూడింటిని మనం చర్చిద్దాం. వాళ్లను ఆదర్శంగా తీసుకుని మనం ఇతరులకు ఏయే విధాలుగా సహాయం చేయవచ్చో పరిశీలిద్దాం.

^ పేరా 5 ఈ ఆర్టికల్‌లో కొన్ని అసలు పేర్లు కావు.

పాట 111 మన సంతోషానికి కారణాలు

^ పేరా 56 చిత్రాల వివరణ: ఓడ బద్దలైనప్పుడు ఆ తాకిడిని అరిస్తార్కు, పౌలు కలిసి ఎదుర్కొన్నారు.

^ పేరా 58 చిత్రాల వివరణ: తన ఉత్తరాలను సంఘాలకు చేరవేసే పనిని పౌలు తుకికుకు అప్పగించాడు.

^ పేరా 60 చిత్రాల వివరణ: పౌలుకు అవసరమైన పనులు మార్కు చేసిపెట్టాడు.