కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 4

“పవిత్రశక్తే మన మనసుకు సాక్ష్యమిస్తుంది”

“పవిత్రశక్తే మన మనసుకు సాక్ష్యమిస్తుంది”

“మనం దేవుని పిల్లలమని పవిత్రశక్తే మన మనసుకు సాక్ష్యమిస్తుంది.”—రోమా. 8:16.

పాట 25 దేవుని ప్రత్యేక సొత్తు

ఈ ఆర్టికల్‌లో . . . *

పెంతెకొస్తు రోజున దాదాపు 120 మందిపై యెహోవా అద్భుతరీతిలో తన పవిత్రశక్తిని కుమ్మరించాడు (1-2 పేరాలు చూడండి)

 

1-2. క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున ఏ అద్భుతమైన సంఘటన జరిగింది?

అది క్రీ.శ. 33వ సంవత్సరం, పెంతెకొస్తు రోజు, ఆదివారం ఉదయం. యెరూషలేములోని ఒక ఇంటి మేడ గదిలో దాదాపు 120 మంది శిష్యులు కలుసుకున్నారు. (అపొ. 1:13-15; 2:1) యెరూషలేమును విడిచిపెట్టకుండా అక్కడే ఉండమని యేసు కొన్నిరోజుల క్రితం వాళ్లకు చెప్పాడు. ఎందుకంటే, ఆ రోజు వాళ్లు ఒక ప్రత్యేకమైన బహుమతి పొందాల్సి ఉంది. (అపొ. 1:4, 5) తర్వాత ఏం జరిగింది?

2 “ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. అది వేగంగా వీచే బలమైన గాలి శబ్దంలా ఉంది. వాళ్లు కూర్చున్న ఇల్లంతా ఆ శబ్దంతో నిండిపోయింది. అప్పుడు అగ్ని లాంటి నాలుకలు” శిష్యుల తలలపై కనిపించాయి. “వాళ్లంతా పవిత్రశక్తితో నిండిపోయారు.” (అపొ. 2:2-4) అలా యెహోవా ఆ గుంపుపై అద్భుతరీతిలో తన పవిత్రశక్తిని కుమ్మరించాడు. (అపొ. 1:8) పవిత్రశక్తితో అభిషేకించబడిన * మొట్టమొదటి గుంపు అదే. యేసుతో కలిసి పరలోకంలో పరిపాలించే నిరీక్షణ వాళ్లకు ఇవ్వబడింది.

ఎవరైనా అభిషేకించబడినప్పుడు ఏం జరుగుతుంది?

3. పెంతెకొస్తు రోజున అభిషేకించబడిన వాళ్లకు, తాము పవిత్రశక్తితో అభిషేకించబడ్డామో లేదో అనే అనుమానం ఎందుకు రాలేదు?

3 ఆ రోజు మేడ గదిలో సమకూడిన శిష్యుల్లో మీరూ ఒకరై ఉంటే, ఆ సంఘటనను ఎన్నడూ మర్చిపోరు. ఒక్కసారి ఊహించుకోండి, నాలుకల్లా కనిపించే అగ్ని మీ తలపై వాలింది, దాంతో మీరు వివిధ భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు! (అపొ. 2:5-12) మీరు పవిత్రశక్తి చేత అభిషేకించబడ్డారో లేదో అనే అనుమానమే మీకు రాదు. అయితే, అభిషిక్తులందరూ తమ జీవితంలో ఒకే విధంగా, ఒకే సమయంలో అభిషేకించబడ్డారా? లేదు! అలాగని మనకెలా తెలుసు?

4. మొదటి శతాబ్దంలోని అభిషిక్త క్రైస్తవులందరూ తమ జీవితంలో ఒకే సమయంలో అభిషేకించబడ్డారా? వివరించండి.

4 ముందుగా, ఒకవ్యక్తి ఎప్పుడు అభిషేకించబడవచ్చో పరిశీలిద్దాం. క్రీ.శ. 33, పెంతెకొస్తు రోజున అభిషేకించబడింది కేవలం ఆ 120 మంది క్రైస్తవులు మాత్రమే కాదు. అదే రోజున ఇంకో సమయంలో, దాదాపు 3,000 మంది కూడా యేసు మాటిచ్చిన పవిత్రశక్తిని పొందారు. వాళ్లు బాప్తిస్మం తీసుకున్నప్పుడు అభిషేకించబడ్డారు. (అపొ. 2:37, 38, 41) కానీ ఆ తర్వాతి సంవత్సరాల్లో, అభిషిక్త క్రైస్తవులందరూ తాము బాప్తిస్మం తీసుకుంటున్న సమయంలో అభిషేకించబడలేదు. సమరయులు, బాప్తిస్మం తీసుకున్న కొంతకాలానికి అభిషేకించబడ్డారు. (అపొ. 8:14-17) అంతేకాదు, ఒక అసాధారణ సంఘటన ఏంటంటే కొర్నేలి, అతని ఇంటివాళ్లు బాప్తిస్మం తీసుకోకముందే అభిషేకించబడ్డారు.—అపొ. 10:44-48.

5. రెండో కొరింథీయులు 1:21, 22 ప్రకారం, ఒక వ్యక్తి పవిత్రశక్తితో అభిషేకించబడినప్పుడు ఏం జరుగుతుంది?

5 ఒక వ్యక్తి పవిత్రశక్తి చేత అభిషేకించబడినప్పుడు ఏం జరుగుతుందో కూడా పరిశీలిద్దాం. కొంతమంది అభిషిక్తులకు యెహోవా తమను ఎంచుకున్నాడనే వాస్తవాన్ని అంగీకరించడం మొదట్లో కాస్త కష్టంగా ఉండవచ్చు. ‘దేవుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడు?’ అని వాళ్లు అనుకోవచ్చు. మరికొందరు అలా అనుకోకపోవచ్చు. ఏదేమైనా, అభిషేకించబడిన వాళ్లందరికీ ఏం జరుగుతుందో అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: “మీరు ఆయన్ని నమ్మిన తర్వాత, దేవుడు తాను వాగ్దానం చేసిన పవిత్రశక్తితో మీకు ముద్ర * వేశాడు. . . . మనం తప్పకుండా వారసత్వాన్ని పొందుతామనడానికి దేవుడు మనకు ముందుగా ఇచ్చిన గుర్తే ఆ పవిత్రశక్తి.” (ఎఫె. 1:13, 14; అధస్సూచి.) కాబట్టి యెహోవా తాను ఎంచుకున్న వాళ్లకు తన పవిత్రశక్తి ద్వారా ఆ విషయాన్ని స్పష్టం చేస్తాడు. ఈ విధంగా, వాళ్లు భవిష్యత్తులో భూమ్మీద కాదుగానీ పరలోకంలో శాశ్వతకాలం జీవిస్తారని చెప్పడానికి పవిత్రశక్తి “గుర్తుగా [లేదా పూచీగా]” ఇవ్వబడుతుంది.—2 కొరింథీయులు 1:21, 22 చదవండి.

6. ఒక అభిషిక్త క్రైస్తవుడు తన పరలోక బహుమానాన్ని పొందాలంటే ఏం చేయాలి?

6 ఒక క్రైస్తవుడు అభిషేకించబడితే, అతను తప్పకుండా పరలోకానికి వెళ్తాడా? లేదు. తను పరలోకానికి వెళ్లడానికి ఎంచుకోబడ్డాడని అతనికి ఖచ్చితంగా తెలుసు. కానీ అతను ఈ మాటల్ని గుర్తుపెట్టుకోవాలి: “సోదరులారా, మిమ్మల్ని దేవుడు పిలిచాడు, ఎంచుకున్నాడు కాబట్టి ఆ అర్హతను కాపాడుకోవడానికి శాయశక్తులా కృషిచేయండి; మీరు అవి చేస్తూ ఉంటే, అసలెన్నడూ విఫలం కారు.” (2 పేతు. 1:10) కాబట్టి ఒక అభిషిక్త క్రైస్తవుడు పరలోకానికి వెళ్లడానికి ఎంచుకోబడినప్పటికీ, అతను చివరివరకు నమ్మకంగా ఉంటేనే తన బహుమానాన్ని పొందుతాడు.—ఫిలి. 3:12-14; హెబ్రీ. 3:1; ప్రక. 2:10.

తాను అభిషిక్తుణ్ణని ఒక వ్యక్తికి ఎలా తెలుస్తుంది?

7. తమకు పరలోక పిలుపు ఉందని అభిషిక్త క్రైస్తవులకు ఎలా తెలుస్తుంది?

7 ఇంతకీ తాను అభిషిక్తుణ్ణని ఒక వ్యక్తికి ఎలా తెలుస్తుంది? “పవిత్రులుగా” పిలవబడిన రోము సంఘంలోని వాళ్లకు పౌలు రాసిన మాటల్లో దానికి జవాబు ఉంది. ఆయన వాళ్లకిలా రాశాడు, “దేవుని పవిత్రశక్తి మనల్ని మళ్లీ బానిసల్ని చేయదు, మనలో మళ్లీ భయాన్ని పుట్టించదు; కానీ, దాని ద్వారా మనం దేవుని పిల్లలుగా దత్తత తీసుకోబడతాం, దేవుణ్ణి ‘నాన్నా, తండ్రీ!’ అని పిలిచేలా పురికొల్పబడతాం. మనం దేవుని పిల్లలమని పవిత్రశక్తే మన మనసుకు సాక్ష్యమిస్తుంది.” (రోమా. 1:7; 8:15, 16) కాబట్టి తమకు పరలోక పిలుపు ఉందని దేవుడు తన పవిత్రశక్తి ద్వారా అభిషిక్త క్రైస్తవులకు స్పష్టం చేస్తాడు.—1 థెస్స. 2:12.

8. మొదటి యోహాను 2:20, 27 ప్రకారం ఒక వ్యక్తి అభిషిక్త క్రైస్తవుడని వేరేవాళ్లు నిర్ధారించాల్సిన అవసరం ఎందుకు లేదు?

8 పరలోకం వెళ్లడానికి ఆహ్వానం అందుకున్నవాళ్ల మనసులో గానీ, హృదయాల్లో గానీ యెహోవా ఏ సందేహానికి చోటు ఇవ్వడు. (1 యోహాను 2:20, 27 చదవండి.) నిజమే, అభిషిక్త క్రైస్తవులకు కూడా అందరిలాగే సంఘం ద్వారా యెహోవా ఇచ్చే ఉపదేశం అవసరం. కానీ వాళ్లు అభిషిక్త క్రైస్తవులని వేరేవాళ్లు నిర్ధారించాల్సిన అవసరం లేదు. యెహోవా ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన తన పవిత్రశక్తిని ఉపయోగించి వాళ్లు అభిషిక్తులని వాళ్లకు స్పష్టం చేశాడు!

వాళ్లు ‘మళ్లీ పుట్టారు’

9. దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు, ఎఫెసీయులు 1:18 ప్రకారం అతనిలో ఏ మార్పు జరుగుతుంది?

9 దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు, అతనికి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం నేడున్న దేవుని సేవకుల్లో చాలామందికి కష్టంగా ఉండవచ్చు. వాళ్లు అభిషిక్తులు కాదు కాబట్టి అలా అనిపించడం సహజమే. మనుషులు పరలోకంలో కాదుగానీ భూమ్మీద శాశ్వతకాలం జీవించడానికి సృష్టించబడ్డారు. (ఆది. 1:28; కీర్త. 37:29) కానీ యెహోవా కొంతమందిని పరలోకంలో జీవించడానికి ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన వాళ్లను అభిషేకించినప్పుడు, వాళ్ల నిరీక్షణను అలాగే వాళ్ల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాడు. దానివల్ల వాళ్లు పరలోకంలో జీవించడం కోసం ఎదురుచూస్తారు.—ఎఫెసీయులు 1:18 చదవండి.

10. ‘మళ్లీ పుట్టడం’ అంటే ఏంటి? (అధస్సూచి కూడా చూడండి.)

10 క్రైస్తవులు పవిత్రశక్తితో అభిషేకించబడినప్పుడు, వాళ్లు ‘మళ్లీ పుడతారు’ లేదా ‘పైనుండి పుడతారు.’ * ‘మళ్లీ పుట్టినప్పుడు’ లేదా ‘పవిత్రశక్తి వల్ల పుట్టినప్పుడు’ ఒక వ్యక్తికి ఎలా అనిపిస్తుందో అభిషేకించబడని వాళ్లకు వివరించడం చాలా కష్టమని యేసు కూడా చెప్పాడు.—యోహా. 3:3-8; అధస్సూచి.

11. ఒక వ్యక్తి అభిషేకించబడినప్పుడు అతని ఆలోచనలో ఎలాంటి మార్పు వస్తుందో వివరించండి.

11 క్రైస్తవులు అభిషేకించబడినప్పుడు వాళ్ల ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? యెహోవా ఆ క్రైస్తవుల్ని అభిషేకించక ముందు, వాళ్లు భూమ్మీద శాశ్వతకాలం జీవించడం అనే నిరీక్షణను కలిగివున్నారు. యెహోవా చెడుతనాన్ని పూర్తిగా తీసేసి, ఈ భూమిని పరదైసుగా మార్చే రోజు కోసం వాళ్లు ఆశతో ఎదురుచూశారు. బహుశా వాళ్లు చనిపోయిన తమ కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను ఆహ్వానిస్తున్నట్లు కూడా ఊహించుకొని ఉంటారు. కానీ వాళ్లు అభిషేకించబడిన తర్వాత, వాళ్ల ఆలోచన మారింది. ఎందుకని? వాళ్లు భూనిరీక్షణ మీద అసంతృప్తి చెందడం వల్ల కాదు. మానసిక ఒత్తిడివల్ల లేదా కృంగుదలవల్ల వాళ్లు తమ ఆలోచనను మార్చుకోలేదు. భూమ్మీద శాశ్వతకాలం జీవించడం విసుగ్గా ఉంటుందని వాళ్లు హఠాత్తుగా తమ ఆలోచనను మార్చుకోలేదు. బదులుగా, యెహోవా తన పవిత్రశక్తిని ఉపయోగించి వాళ్ల ఆలోచనను, నిరీక్షణను మార్చాడు.

12. మొదటి పేతురు 1:3, 4 ప్రకారం, అభిషిక్త క్రైస్తవులు తమ నిరీక్షణ గురించి ఎలా భావిస్తారు?

12 ఒక వ్యక్తి అభిషేకించబడినప్పుడు, ఇంత అమూల్యమైన అవకాశానికి తాను అర్హుణ్ణి కాదని అనుకోవచ్చు. కానీ యెహోవా తనను నిజంగా ఎంచుకున్నాడా లేదా అనే విషయంలో అతనికి ఏమాత్రం సందేహం ఉండదు. తన భవిష్యత్తు నిరీక్షణ గురించి ఆలోచించినప్పుడు అతని మనసంతా సంతోషంతో, కృతజ్ఞతతో నిండిపోతుంది.—1 పేతురు 1:3, 4 చదవండి.

13. అభిషిక్త క్రైస్తవులు భూమ్మీద తమ జీవితం గురించి ఎలా భావిస్తారు?

13 దీనర్థం అభిషిక్త క్రైస్తవులు చనిపోవాలని కోరుకుంటారా? అపొస్తలుడైన పౌలు దీనికి జవాబిచ్చాడు. ఆయన వాళ్ల శరీరాల్ని డేరాతో పోలుస్తూ ఇలా అన్నాడు: “నిజానికి ఈ ఇంట్లో ఉన్న మనం ఎన్నో ఆందోళనలతో మూల్గుతున్నాం. ప్రస్తుతమున్న ఇల్లును మనం తీసివేయాలనుకోవట్లేదు కానీ పరలోకంలో ఉన్న భవనాన్ని ధరించాలనుకుంటున్నాం. అప్పుడు, నాశనమైపోయేదాని స్థానంలో శాశ్వత జీవితం పొందుతాం.” (2 కొరిం. 5:4) ఆ క్రైస్తవులు తమ జీవితం మీద ఆసక్తి కోల్పోయి, త్వరగా చనిపోవాలని కోరుకోరు. దానికి భిన్నంగా, వాళ్లు తమ జీవితాన్ని ఆనందిస్తూ తమ కుటుంబంతో, స్నేహితులతో కలిసి యెహోవాను ప్రతీరోజు ఆరాధించాలని కోరుకుంటారు. అయితే, వాళ్లు ఏం చేస్తున్నప్పటికీ, వాళ్ల అద్భుతమైన నిరీక్షణ ఎప్పుడూ వాళ్ల మనసులోనే ఉంటుంది.—1 కొరిం. 15:53; 2 పేతు. 1:4; 1 యోహా. 3:2, 3; ప్రక. 20:6.

యెహోవా మిమ్మల్ని అభిషేకించాడా?

14. ఒక వ్యక్తిని దేవుడు తన పవిత్రశక్తితో అభిషేకించాడని వేటిని బట్టి చెప్పలేం?

14 బహుశా దేవుడు తన పవిత్రశక్తితో మిమ్మల్ని అభిషేకించాడా లేదా అనే సందేహం మీకు వస్తుందా? అయితే, ఈ ముఖ్యమైన ప్రశ్నల గురించి ఆలోచించండి: యెహోవా ఇష్టం చేయాలని మీరు బలంగా కోరుకుంటున్నారా? ప్రకటనా పని అంటే మీరు చాలా ఆసక్తి చూపిస్తారా? మీరు బైబిల్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తూ, “దేవుని లోతైన విషయాల్ని” తెలుసుకుంటారా? (1 కొరిం. 2:10) పరిచర్యలో అద్భుతమైన ఫలితాలు సాధించేలా యెహోవా మీకు సహాయం చేశాడని అనిపిస్తుందా? యెహోవాను సేవించేలా ఇతరులకు సహాయం చేయాల్సిన గొప్ప బాధ్యత మీకుందని భావిస్తున్నారా? మీ జీవితంలో యెహోవా మీకు అనేక విధాలుగా సహాయం చేయడాన్ని చూశారా? ఈ ప్రశ్నలన్నిటికీ మీ జవాబు అవును అయితే, మీకు పరలోక పిలుపు ఉన్నట్టా? ఎంతమాత్రం కాదు. ఎందుకంటే అభిషిక్తులైనా, కాకపోయినా దేవుని సేవకులందరికీ అలాగే అనిపించవచ్చు. తన సేవకుల నిరీక్షణ ఏదైనా ఆ పనులన్నీ చేయడానికి యెహోవా వాళ్లకు తన పవిత్రశక్తి ద్వారా ఒకేలా సహాయం చేస్తాడు. నిజానికి, పవిత్రశక్తి చేత మీరు అభిషేకించబడ్డారా లేదా అనే అనుమానం మీకు వచ్చిందంటే, మీరు అభిషేకించబడలేదని అర్థం. ఎందుకంటే, యెహోవా చేత అభిషేకించబడిన వాళ్లు, దేవుడు తమను అభిషేకించాడో లేదో అని ఆలోచించరు, వాళ్లకు అది ఖచ్చితంగా తెలుసు!

అబ్రాహాము, శారా, దావీదు, బాప్తిస్మమిచ్చే యోహాను వీళ్లంతా యెహోవా పవిత్రశక్తి సహాయంతో గొప్పగొప్ప పనులు చేశారు. కానీ వాళ్లకు పరలోకంలో జీవించే నిరీక్షణ లేదు. (15-16 పేరాలు చూడండి) *

15. పవిత్రశక్తి పొందిన వాళ్లందరూ పరలోకం వెళ్లడానికి ఎంచుకోబడలేదని మనకెలా తెలుసు?

15 బైబిలంతటిలో, విశ్వాసులైన స్త్రీపురుషులు ఎంతోమంది దేవుని పవిత్రశక్తిని పొందారు. అయినప్పటికీ వాళ్లందరికీ పరలోక నిరీక్షణ లేదు. ఉదాహరణకు, దావీదు పవిత్రశక్తి చేత నడిపించబడ్డాడు. (1 సమూ. 16:13) యెహోవాకు సంబంధించిన లోతైన విషయాలు అర్థం చేసుకునేలా, బైబిల్లోని కొన్ని భాగాలు రాసేలా ఆయనకు పవిత్రశక్తి సహాయం చేసింది. (మార్కు 12:36) అయినప్పటికీ, “దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు” అని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (అపొ. 2:34) బాప్తిస్మమిచ్చే యోహానుకు, ‘దేవుడు పవిత్రశక్తిని’ ఇచ్చాడు. (లూకా 1:13-16) బాప్తిస్మమిచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడని చెప్పినప్పటికీ అతను పరలోకానికి వెళ్లేవాళ్లలో ఉండడని యేసు చెప్పాడు. (మత్త. 11:10, 11) గొప్పగొప్ప పనులు చేయడానికి యెహోవా ఆ పురుషులకు పవిత్రశక్తిని ఇచ్చాడు కానీ పరలోకంలో జీవించడానికి వాళ్లను ఎంచుకోలేదు. అంటే పరలోకంలో పరిపాలించడానికి ఎంచుకోబడిన వాళ్లకు ఉన్నంత విశ్వాసం వీళ్లకు లేదని దానర్థమా? కాదు. పరదైసు భూమ్మీద జీవించడానికి యెహోవా వాళ్లను మళ్లీ బ్రతికిస్తాడు.—యోహా. 5:28, 29; అపొ. 24:15.

16. నేడు దేవుని సేవకుల్లో చాలామంది దేనికోసం ఎదురుచూస్తున్నారు?

16 నేడు భూమ్మీద జీవిస్తున్న లక్షలాదిమంది దేవుని సేవకుల్లో చాలామందికి పరలోక నిరీక్షణ లేదు. బైబిలు కాలంలో జీవించిన అబ్రాహాము, శారా, దావీదు, బాప్తిస్మమిచ్చే యోహాను అలాగే ఎంతోమంది ఇతర స్త్రీపురుషులు ఎదురుచూసినట్టే వాళ్లు కూడా దేవుని రాజ్యంలో భూమ్మీద శాశ్వతకాలం జీవించడం కోసం ఎదురుచూస్తున్నారు.—హెబ్రీ. 11:10.

17. తర్వాతి ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

17 ఇప్పటికీ కొంతమంది అభిషిక్త క్రైస్తవులు దేవుని ప్రజల మధ్య ఉన్నారు కాబట్టి మనకు కొన్ని ప్రశ్నలు రావడం సహజమే. (ప్రక. 12:17) ఉదాహరణకు, అభిషిక్త క్రైస్తవులు తమ గురించి తాము ఎలా భావించాలి? మీ సంఘంలో ఎవరైనా జ్ఞాపకార్థ ఆచరణ రోజు రొట్టె, ద్రాక్షారసం తీసుకుంటే, అతన్ని మీరెలా చూడాలి? తాము అభిషిక్తులమని చెప్పుకునే వాళ్ల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతుంటే, అప్పుడేంటి? దానిగురించి మీరు ఆందోళనపడాలా? తర్వాతి ఆర్టికల్‌లో దానికి జవాబులు తెలుసుకుంటాం.

^ పేరా 5 క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజు నుండి యెహోవా కొంతమంది క్రైస్తవులకు ఓ అద్భుతమైన నిరీక్షణ ఇచ్చాడు. అదే పరలోకంలో తన కుమారునితో కలిసి పరిపాలించడం. అయితే, ఈ ప్రత్యేక అవకాశం కోసం దేవుడు తమను ఎంచుకున్నాడని ఆ క్రైస్తవులకు ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఈ ఆహ్వానం అందుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం. ఈ ఆర్టికల్‌, కావలికోట జనవరి 2016లో వచ్చిన ఆర్టికల్‌ మీద ఆధారపడి ఉంది.

^ పేరా 2 పదాల వివరణ: పవిత్రశక్తితో అభిషేకించబడడం: పరలోకంలో యేసుతో కలిసి పరిపాలించడానికి ఒక వ్యక్తిని ఎంచుకునేందుకు యెహోవా తన పవిత్రశక్తిని ఉపయోగిస్తాడు. తన పవిత్రశక్తి ద్వారా, యెహోవా ఆ వ్యక్తికి భవిష్యత్తుకు సంబంధించిన వాగ్దానాన్ని తెలియజేస్తాడు లేదా దానిగురించి ‘ముందుగా గుర్తు’ వేస్తాడు. (ఎఫె. 1:13, 14) పవిత్రశక్తి తమకు “సాక్ష్యమిస్తుంది” అని లేదా పరలోకంలో తమకు బహుమతి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తుందని ఆ క్రైస్తవులు చెప్పగలరు.—రోమా. 8:16.

^ పేరా 5 పదాల వివరణ: ముద్ర. ఓ అభిషిక్తుడు నమ్మకంగా చనిపోయేముందు లేదా మహాశ్రమ మొదలవ్వడానికి కొంతకాలం ముందు మాత్రమే ఆ ముద్రకు శాశ్వత విలువ వస్తుంది.—ఎఫె. 4:30; ప్రక. 7:2-4; కావలికోట ఏప్రిల్‌ 2016లో వచ్చిన “పాఠకుల ప్రశ్న” చూడండి.

^ పేరా 10 మళ్లీ పుట్టడం గురించి మరింత సమాచారం కోసం కావలికోట ఫిబ్రవరి 15, 1993, 5వ పేజీ చూడండి.

పాట 27 దేవుని పిల్లల మహిమ వెల్లడయ్యే సమయం

^ పేరా 58 చిత్రాల వివరణ: మన విశ్వాసం కారణంగా జైల్లో ఉన్నా లేదా సత్యాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, బోధించే స్థితిలో ఉన్నా దేవుని రాజ్యం ఈ భూమిని పరిపాలించే కాలం కోసం ఎదురుచూడవచ్చు.