కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 5

మేము కూడా మీతో వస్తాం

మేము కూడా మీతో వస్తాం

“దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుము.”—జెక. 8:23.

పాట 26 మీరు నా కోసం చేశారు

ఈ ఆర్టికల్‌లో . . . *

వేరే గొర్రెలు (‘పది మంది’) అభిషిక్తులతో (‘ఒక యూదునితో’) కలిసి యెహోవాను ఆరాధించడం గొప్ప గౌరవంగా భావిస్తారు (1-2 పేరాలు చూడండి)

1. మనం జీవించే కాలంలో ఏం జరుగుతుందని యెహోవా చెప్పాడు?

మనకాలం గురించి యెహోవా ముందుగానే ఇలా ప్రవచించాడు: “ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని—దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.” (జెక. 8:23) ఈ లేఖనంలోని “యూదుడు” అనే పదం యెహోవా తన పవిత్రశక్తితో అభిషేకించినవాళ్లను సూచిస్తుంది. వాళ్లు “దేవుని ఇశ్రాయేలు” అని కూడా పిలవబడ్డారు. (గల. 6:16) ‘పది మంది’ అనే మాట భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ ఉన్నవాళ్లను సూచిస్తుంది. అభిషిక్త క్రైస్తవుల గుంపును యెహోవా ఎంచుకున్నాడని వీళ్లకు తెలుసు కాబట్టి ఆ గుంపుతో కలిసి దేవున్ని ఆరాధించడం గౌరవంగా భావిస్తారు.

2. అభిషిక్తులతో కలిసి ‘పది మంది’ ఎలా నడుస్తారు?

2 నేడు భూమ్మీదున్న అభిషిక్త క్రైస్తవులందరి పేర్లు * తెలుసుకోవడం సాధ్యం కాకపోయినా, భూనిరీక్షణ ఉన్న ప్రజలు అభిషిక్తులతో కలిసి నడవవచ్చు. ఎలా? “పదేసిమంది ఒక యూదుని చెంగుపట్టుకొని—దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు” అని బైబిలు చెప్తుంది. ఆ లేఖనం ఒక యూదుడు అని ప్రస్తావిస్తుంది. కానీ “మీకు” అలాగే “మీతో” అనే పదాల్ని బట్టి అది ఒక్క వ్యక్తి కన్నా ఎక్కువమందిని సూచిస్తుందని అర్థంచేసుకోవచ్చు. దీన్నిబట్టి ఆ యూదుడు ఒక్క వ్యక్తిని కాదుగానీ అభిషిక్త క్రైస్తవుల గుంపు అంతటినీ సూచిస్తున్నాడని తెలుస్తుంది. అభిషిక్తులు కానివాళ్లు అభిషిక్తులతో కలిసి యెహోవాను సేవిస్తున్నారు. అయితే, వాళ్లు అభిషిక్తుల్ని తమ నాయకులుగా చూడరు. ఎందుకంటే యేసు తమ నాయకుడని వాళ్లకు తెలుసు.—మత్త. 23:10.

3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

3 నేడు దేవుని ప్రజల మధ్య అభిషిక్త క్రైస్తవులు ఇంకా ఉన్నారు కాబట్టి కొంతమంది ఇలా ఆలోచిస్తుండవచ్చు: (1) అభిషిక్త క్రైస్తవులు తమ గురించి తాము ఎలా భావించాలి? (2) జ్ఞాపకార్థ ఆచరణ రోజు రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్లను మనమెలా చూడాలి? (3) రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్ల సంఖ్య పెరుగుతుంటే మనం ఆందోళనపడాలా? ఈ ఆర్టికల్‌ వాటికి జవాబిస్తుంది.

అభిషిక్త క్రైస్తవులు తమ గురించి తాము ఎలా భావించాలి?

4. అభిషిక్త క్రైస్తవులు 1 కొరింథీయులు 11:27-29 లో ఉన్న ఏ హెచ్చరిక గురించి గంభీరంగా ఆలోచించాలి? ఎందుకు?

4 అభిషిక్త క్రైస్తవులు 1 కొరింథీయులు 11:27-29 లో ఉన్న హెచ్చరిక గురించి గంభీరంగా ఆలోచించాలి. (చదవండి.) ఒక అభిషిక్త క్రైస్తవుడు జ్ఞాపకార్థ ఆచరణ రోజు రొట్టె, ద్రాక్షారసాన్ని ఎలా “అర్హత లేకుండా” తీసుకునే ప్రమాదం ఉంది? ఎలాగంటే, అతను యెహోవా నీతి ప్రమాణాలను పాటించకుండా రొట్టెను తిని, ద్రాక్షారసాన్ని తాగితే అలా చేసినట్లు అవుతుంది. (హెబ్రీ. 6:4-6; 10:26-29) “క్రీస్తుయేసు ద్వారా దేవుని నుండి వచ్చే పరలోక పిలుపు అనే బహుమానం” పొందాలంటే చివరివరకు నమ్మకంగా ఉండాలనే విషయాన్ని అభిషిక్త క్రైస్తవులు గుర్తిస్తారు.—ఫిలి. 3:13-16.

5. అభిషిక్త క్రైస్తవులు తమ గురించి తాము ఎలా భావించాలి?

5 తన సేవకులు గర్వంగా కాకుండా వినయంగా ఉండేలా యెహోవా ఇచ్చే పవిత్రశక్తి వాళ్లకు సహాయం చేస్తుంది. (ఎఫె. 4:1-3; కొలొ. 3:10, 12) కాబట్టి అభిషిక్త క్రైస్తవులు తాము వేరేవాళ్ల కన్నా గొప్పవాళ్లమని అనుకోరు. యెహోవా ఇతర సేవకులకన్నా తమకు ఎక్కువ పవిత్రశక్తిని ఇవ్వడని కూడా వాళ్లకు తెలుసు. బైబిల్లోని లోతైన విషయాలు అందరికన్నా ఎక్కువగా తమకే తెలుసని వాళ్లు అనుకోరు. అంతేకాదు, మీరు కూడా అభిషేకించబడ్డారు కాబట్టి జ్ఞాపకార్థ ఆచరణ రోజు రొట్టె, ద్రాక్షారసం తీసుకోవడం మొదలుపెట్టండి అని వాళ్లు ఎవ్వరికీ చెప్పరు. బదులుగా, యెహోవా మాత్రమే ప్రజలకు పరలోక పిలుపు ఇవ్వగలడని వాళ్లు వినయంగా గుర్తిస్తారు.

6. మొదటి కొరింథీయులు 4:7, 8 ప్రకారం అభిషిక్త క్రైస్తవులు ఎలా ప్రవర్తిస్తారు?

6 అభిషిక్త క్రైస్తవులు పరలోక పిలుపు అందుకోవడం గొప్ప గౌరవంగా భావించినప్పటికీ, ఇతరులు వాళ్లను ప్రత్యేకంగా చూడాలని కోరుకోరు. (ఫిలి. 2:2, 3) అంతేకాదు, యెహోవా వాళ్లను అభిషేకించినప్పుడు, ఆ విషయం అందరికీ తెలిసేలా చేయలేదని కూడా వాళ్లకు తెలుసు. కాబట్టి ఒక వ్యక్తి అభిషేకించబడ్డాడని తెలిసినప్పుడు, ఇతరులు ఆ విషయాన్ని వెంటనే నమ్మకపోతే అతను ఆశ్చర్యపోడు. దేవుడు తమకు ఒక ప్రత్యేక బాధ్యత ఇచ్చాడని ఎవరైనా చెప్తే వెంటనే నమ్మకూడదని బైబిలు చెప్తున్న మాటల్ని అతను గుర్తిస్తాడు. (ప్రక. 2:2) ఒక అభిషిక్త క్రైస్తవుడు ఇతరుల అవధానం తనవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించడు. అందుకే అతను ఎవరినైనా కలిసినప్పుడు తాను అభిషిక్త క్రైస్తవుణ్ణని చెప్పడు. అలాగే దాని గురించి ఇతరులకు గొప్పలు చెప్పుకోడు.—1 కొరింథీయులు 4:7, 8 చదవండి.

7. అభిషిక్త క్రైస్తవులు ఏం చేయరు? ఎందుకు?

7 అభిషిక్త క్రైస్తవులంతా ఒక గుంపుగా ఏర్పడి, తమ తోటి అభిషిక్తులతోనే సమయం గడపాలని కోరుకోరు. వాళ్లు వేరే అభిషిక్త క్రైస్తవుల కోసం వెదికి, తాము ఎలా అభిషేకించబడ్డామో చర్చించడానికి గానీ ప్రత్యేక గుంపులుగా ఏర్పడి బైబిలు అధ్యయనం చేయడానికి గానీ ప్రయత్నించరు. (గల. 1:15-17) ఒకవేళ అభిషిక్తులు అలాంటి పనులు చేస్తే సంఘం ఐక్యంగా ఉండదు. అంతేకాదు దేవుని ప్రజలు శాంతిగా, ఐక్యంగా ఉండడానికి సహాయం చేసే పవిత్రశక్తికి విరుద్ధంగా పని చేసినవాళ్లౌతారు.—రోమా. 16:17, 18.

జ్ఞాపకార్థ ఆచరణ రోజు రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్లను మనమెలా చూడాలి?

అభిషిక్తులను లేదా నాయకత్వం వహిస్తున్న వేరేవాళ్లను మనం పేరుగాంచిన సెలబ్రిటీల్లా చూడకూడదు (8వ పేరా చూడండి) *

8. జ్ఞాపకార్థ ఆచరణలో రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్లను ఎలా చూస్తున్నామనే విషయంలో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? (అధస్సూచి కూడా చూడండి.)

8 మనం అభిషిక్త సహోదరసహోదరీలను ఎలా చూడాలి? ఒక వ్యక్తి క్రీస్తు అభిషిక్త సహోదరుడైనా సరే, అతన్ని అతిగా అభిమానించడం తప్పు. (మత్త. 23:8-12) బైబిలు సంఘపెద్దల గురించి మాట్లాడుతూ, “వాళ్ల విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకోండి” అని ప్రోత్సహిస్తుంది. అంతేగానీ ఒక మనిషిని మన నాయకునిగా చేసుకోవచ్చని చెప్పట్లేదు. (హెబ్రీ. 13:7) నిజమే, కొంతమంది “రెట్టింపు గౌరవానికి అర్హులు” అని బైబిలు చెప్తుంది. అయితే, వాళ్లు అభిషిక్తులు అయినందుకు కాదుగానీ “చక్కగా నాయకత్వం” వహిస్తున్నందుకు అలాగే “మాట్లాడే విషయంలో, బోధించే విషయంలో కష్టపడి” పనిచేస్తున్నందుకు అలా చేయమని బైబిలు చెప్తుంది. (1 తిమో. 5:17) అభిషిక్త క్రైస్తవుల్ని మనం అతిగా పొగిడినా, అనవసరమైన అవధానం ఇచ్చినా వాళ్లను ఇబ్బంది పెట్టినవాళ్లమౌతాం. * లేదా అంతకన్నా ఘోరమైన విషయమేమిటంటే, వాళ్లు గర్విష్ఠులుగా తయారయ్యేలా చేసినవాళ్లమౌతాం. (రోమా. 12:3) క్రీస్తు అభిషిక్త సహోదరుల్లో ఏ ఒక్కరు అంత పెద్ద పొరపాటు చేయాలని మనలో ఎవ్వరం కోరుకోం!—లూకా 17:2.

9. అభిషిక్త క్రైస్తవుల్ని గౌరవిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?

9 యెహోవా అభిషేకించిన వాళ్లను మనం గౌరవిస్తున్నామని ఎలా చూపించవచ్చు? వాళ్లు ఎలా అభిషేకించబడ్డారో మనం అడగము. అది వ్యక్తిగత విషయం, దాన్ని తెలుసుకునే హక్కు మనకు లేదు. (1 థెస్స. 4:11; 2 థెస్స. 3:11) అంతేకాదు, వాళ్ల భర్త లేదా భార్య, వాళ్ల అమ్మనాన్నలు, లేదా ఇతర కుటుంబ సభ్యులు కూడా అభిషిక్తులై ఉంటారని మనం అనుకోకూడదు. పరలోక నిరీక్షణ వారసత్వంగా వచ్చేది కాదు. ఒక వ్యక్తి దాన్ని దేవుని నుండి పొందుతాడు. (1 థెస్స. 2:12) అలాగే మనం ఇతరుల్ని నొప్పించే ప్రశ్నల్ని అడగకూడదు. ఉదాహరణకు, మీ భర్త లేకుండా భూమ్మీద శాశ్వతకాలం జీవించడం గురించి మీరెలా భావిస్తున్నారు అని అభిషిక్త క్రైస్తవుని భార్యను అడగకూడదు. ఎందుకంటే కొత్త లోకంలో, యెహోవా తన “గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను” తృప్తిపరుస్తాడనే బలమైన నమ్మకంతో మనం ఉండవచ్చు.—కీర్త. 145:16.

10. ఇతరుల్ని అతిగా అభిమానించకుండా ఉండడం ద్వారా మనల్ని మనం ఎలా కాపాడుకుంటాం?

10 అభిషిక్త క్రైస్తవుల్ని ఇతరుల కన్నా ఎక్కువ ప్రాముఖ్యమైన వాళ్లుగా చూడకుండా ఉండడం ద్వారా, మనల్ని మనం కాపాడుకుంటాం. ఎలా? కొంతమంది అభిషిక్త క్రైస్తవులు చివరివరకు నమ్మకంగా ఉండకపోవచ్చని బైబిలు చెప్తుంది. (మత్త. 25:10-12; 2 పేతు. 2:20, 21) కానీ మనం అభిషిక్తుల్ని లేదా బాగా పేరు పొందిన సహోదరుల్ని లేదా ఎంతోకాలంగా యెహోవాను సేవిస్తున్నవాళ్లను అతిగా అభిమానించకుండా ఉంటే, వాళ్లను అనుకరించం. (యూదా 16) వాళ్లు తమ విశ్వాసాన్ని కోల్పోయినా లేదా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్లినా, మనం యెహోవా మీద విశ్వాసాన్ని కోల్పోకుండా లేదా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఉండగలుగుతాం.

రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్ల సంఖ్య పెరుగుతుంటే మనం ఆందోళనపడాలా?

11. జ్ఞాపకార్థ ఆచరణలో రొట్టె, ద్రాక్షారసం తీసుకునే వాళ్ల సంఖ్య ఏమౌతుంది?

11 కొంతకాలం పాటు, జ్ఞాపకార్థ ఆచరణలో రొట్టె, ద్రాక్షారసం తీసుకునే వాళ్ల సంఖ్య తగ్గింది. కానీ ఈ మధ్యకాలంలో ఆ సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతూ ఉంది. దాని గురించి మనం ఆందోళనపడాలా? అవసరంలేదు. మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

12. జ్ఞాపకార్థ ఆచరణలో రొట్టె, ద్రాక్షారసం తీసుకునే వాళ్ల సంఖ్య పెరుగుతుంటే మనమెందుకు ఆందోళనపడాల్సిన అవసరంలేదు?

12 “యెహోవాకు తనవాళ్లు ఎవరో తెలుసు.” (2 తిమో. 2:19) జ్ఞాపకార్థ ఆచరణ రోజు రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్లను లెక్కించే సహోదరులకు, ఎవరు నిజంగా అభిషేకించబడ్డారో తెలీదు. అది కేవలం యెహోవాకే తెలుసు. కాబట్టి అభిషిక్తులు కాకపోయినా, తాము అభిషిక్తులమని అనుకునేవాళ్ల సంఖ్య కూడా అందులో ఉంటుంది. ఉదాహరణకు గతంలో రొట్టె, ద్రాక్షారసం తీసుకున్నవాళ్లు ఇప్పుడు తీసుకోవడం మానేశారు. ఇంకొంతమంది తమ మానసిక లేదా భావోద్వేగ సమస్యల వల్ల తాము క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలిస్తామని భ్రమపడి రొట్టె, ద్రాక్షారసం తీసుకుంటుండవచ్చు. దీన్నిబట్టి ఈ భూమ్మీద ఎంతమంది అభిషిక్తులు మిగిలి ఉన్నారో ఖచ్చితంగా చెప్పలేమని స్పష్టమౌతుంది.

13. మహాశ్రమ మొదలయ్యే సమయానికి ఎంతమంది అభిషిక్తులు ఉంటారనే దానిగురించి బైబిలు ఏమైనా చెప్తుందా?

13 యేసు అభిషిక్తుల్ని పరలోకానికి తీసుకెళ్లే సమయానికి, వాళ్లందరూ భూమ్మీద వేర్వేరు దేశాల్లో ఉంటారు. (మత్త. 24:31) చివరిరోజుల్లో ఈ భూమ్మీద కొంతమంది అభిషిక్తులు మాత్రమే మిగిలివుంటారని బైబిలు చెప్తుంది. (ప్రక. 12:17) అయితే, మహాశ్రమ మొదలయ్యే సమయానికి ఎంతమంది అభిషిక్తులు ఉంటారనేది మాత్రం అది చెప్పట్లేదు.

జ్ఞాపకార్థ ఆచరణ రోజు ఎవరైనా రొట్టె, ద్రాక్షారసం తీసుకుంటే వాళ్లను మనమెలా చూడాలి? (14వ పేరా చూడండి)

14. రోమీయులు 9:11, 16 ప్రకారం అభిషిక్తుల్ని ఎంచుకోవడం గురించి మనం ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలి?

14 అభిషిక్తుల్ని ఎప్పుడు ఎంచుకోవాలో యెహోవా నిర్ణయిస్తాడు. (రోమా. 8:28-30) యేసు పునరుత్థానమైన తర్వాత యెహోవా అభిషిక్తుల్ని ఎంచుకోవడం మొదలుపెట్టాడు. బహుశా మొదటి శతాబ్దానికి చెందిన నిజ క్రైస్తవులందరూ అభిషిక్తులై ఉండవచ్చు. ఆ తర్వాతి సంవత్సరాల్లో, క్రైస్తవులమని చెప్పుకునే వాళ్లలో చాలామంది క్రీస్తును నిజంగా అనుసరించలేదు. అయినప్పటికీ, ఆ సంవత్సరాల్లో యెహోవా కొంతమంది నిజ క్రైస్తవుల్ని అభిషిక్తులుగా ఎంచుకున్నాడు. వాళ్లు యేసు చెప్పిన ఉదాహరణలోని గురుగుల మధ్య పెరిగిన గోధుమల్లా ఉన్నారు. (మత్త. 13:24-30) చివరిరోజుల్లో కూడా యెహోవా 1,44,000 మందిలో భాగంగా ఉండే ప్రజల్ని ఎంచుకుంటూనే ఉన్నాడు. * కాబట్టి అంతం రావడానికి కొంచెం సమయం ముందు దేవుడు కొంతమందిని ఎంచుకోవాలని నిర్ణయించుకుంటే, ఆ నిర్ణయాన్ని మనం సందేహించకూడదు. (రోమీయులు 9:11, 16 చదవండి.) * మనం యేసు చెప్పిన ఒకానొక ఉదాహరణలోని పనివాళ్లలా స్పందించకుండా జాగ్రత్తపడాలి. చివరి నిమిషంలో పనిచేసినవాళ్లకు జీతం ఇచ్చినందుకు వాళ్లు తమ యజమానిమీద సణిగారు.—మత్త. 20:8-15.

15. మత్తయి 24:45-47 లో ప్రస్తావించబడిన దాసునిలో అభిషిక్త క్రైస్తవులందరూ భాగంగా ఉన్నారా? వివరించండి.

15 పరలోక నిరీక్షణ ఉన్నవాళ్లందరూ ‘నమ్మకమైన, బుద్ధిగల దాసునిలో’ భాగం కాదు. (మత్తయి 24:45-47 చదవండి.) మొదటి శతాబ్దంలోలాగే యెహోవా, యేసు కొంతమంది సహోదరులను ఉపయోగించుకొని చాలామందికి ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తున్నారు లేదా బోధిస్తున్నారు. మొదటి శతాబ్దంలో కేవలం కొద్దిమంది అభిషిక్తులే క్రైస్తవ గ్రీకు లేఖనాల్ని రాశారు. నేడు, దేవుని ప్రజలకు “తగిన సమయంలో ఆహారం పెట్టే” బాధ్యత కూడా కొద్దిమంది అభిషిక్తులకే ఉంది.

16. ఈ ఆర్టికల్‌లో మీరు ఏం నేర్చుకున్నారు?

16 ఈ ఆర్టికల్‌లో మనం ఏం నేర్చుకున్నాం? యెహోవా తన సేవకుల్లో చాలామందికి భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ ఇవ్వాలనీ, అలాగే కొద్దిమందికి పరలోకంలో యేసుతోపాటు పరిపాలించే నిరీక్షణ ఇవ్వాలనీ నిర్ణయించుకున్నాడు. యెహోవా ‘యూదుడికి’ అదేవిధంగా ‘పది మందికి’ అంటే తన సేవకులందరికీ ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాదు వాళ్లందరూ ఒకే నియమాలకు లోబడాలని, చివరివరకు నమ్మకంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందరూ వినయంగా ఉంటూ కలిసిమెలిసి ఐక్యంగా ఆయన్ని ఆరాధించాలి. అంతేకాదు సహోదరసహోదరీల మధ్య శాంతిని కాపాడడానికి కృషిచేయాలి. అంతం దగ్గరపడుతుండగా, యెహోవాను సేవిస్తూ “ఒకే మందగా” క్రీస్తును అనుసరిస్తూ ఉందాం.—యోహా. 10:16.

^ పేరా 5 ఈ సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను మంగళవారం, ఏప్రిల్‌ 7న జరుపుకుంటాం. ఆ రోజు సాయంత్రం రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్లను మనమెలా చూడాలి? రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్ల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతుంటే మనం ఆందోళనపడాలా? ఈ ఆర్టికల్‌లో ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం. ఈ ఆర్టికల్‌ కావలికోట జనవరి 2016 పై ఆధారపడి ఉంది.

^ పేరా 2 కీర్తన 87:5, 6 ప్రకారం యేసుతోపాటు పరిపాలించే వాళ్లందరి పేర్లను యెహోవా భవిష్యత్తులో మనకు తెలియజేసే అవకాశం ఉందని చెప్పవచ్చు.—రోమా. 8:19.

^ పేరా 8 కావలికోట జనవరి, 2016లో వచ్చిన ‘ప్రేమ “అమర్యాదగా నడువదు”’ అనే బాక్సు చూడండి.

^ పేరా 14 అపొస్తలుల కార్యాలు 2:33 ప్రకారం, యేసు ద్వారా పవిత్రశక్తి కుమ్మరించబడుతున్నప్పటికీ, ప్రతీ వ్యక్తిని ఆహ్వానించేది మాత్రం యెహోవాయే.

^ పేరా 14 మరింత సమాచారం కోసం కావలికోట మే 1, 2007లో వచ్చిన “పాఠకుల ప్రశ్నలు” చూడండి.

పాట 34 యథార్థంగా జీవించడం

^ పేరా 56 చిత్రాల వివరణ: ఒక సమావేశానికి ప్రధాన కార్యాలయ ప్రతినిధి, ఆయన భార్య వచ్చినప్పుడు వాళ్ల చుట్టూ చేరి ఫోటోలు తీసుకుంటుంటే చూడ్డానికి ఎంత అమర్యాదగా ఉంటుందో కదా!