కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 3

మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడు!

మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడు!

‘మనం కృంగిపోయినప్పుడు ఆయన మనల్ని గుర్తుచేసుకున్నాడు.’—కీర్త. 136:23, NW.

పాట 33 మీ భారాన్ని యెహోవాపై వేయండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. చాలామంది యెహోవా ప్రజలు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు? అవి వాళ్లమీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి?

ఈ మూడు సందర్భాలను పరిశీలించండి: ఒక యౌవన సహోదరుడికి, రోజురోజుకీ క్షీణింపజేసే జబ్బు ఉన్నట్లు తెలిసింది. కష్టపడి పనిచేసే ఒక మధ్య వయసు సహోదరుడికి ఉద్యోగం పోయింది. ఎంత ప్రయత్నించినా మరో ఉద్యోగం దొరకట్లేదు. వయసు పైబడడం వల్ల ఒక నమ్మకమైన వృద్ధ సహోదరి, యెహోవా సేవలో ఒకప్పుడు చేసినంత ఇప్పుడు చేయలేకపోతుంది.

2 పైన చెప్పిన ఏదైనా ఒక పరిస్థితిని మీరు ఎదుర్కొంటుంటే, ఎందుకూ పనికిరామనే భావన మీకు కలుగవచ్చు. దానివల్ల మీరు మీ సంతోషాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోవచ్చు, ఇతరులతో మీ సంబంధాలు కూడా దెబ్బతినవచ్చు.

3. సాతాను, అతని చెప్పుచేతల్లో ఉన్నవాళ్లు మనుషుల జీవాన్ని ఎలా చూస్తున్నారు?

3 సాతాను ప్రజల జీవాన్ని ఎలా చూస్తున్నాడో ఈ లోక ప్రజలు కూడా అలాగే చూస్తున్నారు. సాతాను మనుషుల్ని ఎప్పుడూ, పనికిరానివాళ్లుగానే చూశాడు. దేవుడికి లోబడకపోవడం మరణానికి దారితీస్తుందని తెలిసి కూడా అతను చాలా దుర్మార్గంగా హవ్వకు అబద్ధం చెప్పాడు. ఈ లోకంలోని వాణిజ్య, రాజకీయ, మత వ్యవస్థలు ఎప్పుడూ అతని చెప్పుచేతల్లోనే ఉన్నాయి. కాబట్టి చాలామంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మతగురువులు సాతానులాగే మనుషుల జీవానికి గానీ వాళ్ల భావాలకు గానీ ఏమాత్రం విలువ ఇవ్వకపోవడంలో ఆశ్చర్యం లేదు.

4. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చర్చిస్తాం?

4 మరోవైపు, మనం విలువైనవాళ్లమనే విషయాన్ని మనం గుర్తించాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనం ఎందుకూ పనికిరామని అనిపించే పరిస్థితుల్లో, ఆయన మనకు సహాయం చేస్తాడు. (కీర్త. 136:23; రోమా. 12:3) ఈ ఆర్టికల్‌లో, (1) మనం అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, (2) మనం ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్నప్పుడు, అలాగే (3) వృద్ధాప్యం వల్ల యెహోవా సేవలో ఉపయోగపడేది ఏదీ మన దగ్గర లేదని అనిపించినప్పుడు, యెహోవా మనకెలా సహాయం చేస్తాడో చర్చిస్తాం. ముందుగా, మనలో ప్రతీఒక్కరం యెహోవాకు విలువైనవాళ్లమని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చో పరిశీలిద్దాం.

యెహోవా మనల్ని విలువైనవాళ్లుగా ఎంచుతాడు

5. మనుషులు యెహోవాకు విలువైనవాళ్లని దేన్నిబట్టి చెప్పొచ్చు?

5 మనం మట్టితో తయారుచేయబడినప్పటికీ, పిడికెడు మట్టి కంటే చాలా విలువైనవాళ్లం. (ఆది. 2:7) మనం యెహోవాకు విలువైనవాళ్లమని ఎందుకు అంత ఖచ్ఛితంగా నమ్మవచ్చో కొన్ని కారణాల్ని పరిశీలించండి. తన లక్షణాలను ప్రతిబింబించే సామర్థ్యంతో ఆయన మనుషుల్ని సృష్టించాడు. (ఆది. 1:27) అలా చేయడం ద్వారా, ఆయన భూమ్మీద సృష్టించిన వాటన్నిటికంటే పై స్థానంలో మనల్ని ఉంచాడు. భూమిని, జంతువుల్ని మనకు అప్పగించాడు.—కీర్త. 8:4-8.

6. యెహోవా అపరిపూర్ణ మనుషుల్ని విలువైనవాళ్లుగా ఎంచుతాడని ఇంకా దేన్నిబట్టి చెప్పొచ్చు?

6 ఆదాము పాపం చేసిన తర్వాత కూడా యెహోవా మనుషుల్ని విలువైనవాళ్లుగానే చూస్తూ వచ్చాడు. మనం ఆయనకెంత విలువైనవాళ్లమంటే, మన పాపాల కోసం ఆయన తన ప్రియ కుమారుడైన యేసునే విమోచనా క్రయధనంగా అర్పించాడు. (1 యోహా. 4:9, 10) ఆ విమోచనా క్రయధనానికున్న ప్రయోజనాలను అన్వయించి, ఆదాము పాపం వల్ల చనిపోయిన “నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని” యెహోవా తిరిగి బ్రతికిస్తాడు. (అపొ. 24:15) మన ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థితి, వయసు వీటన్నిటితో సంబంధం లేకుండా యెహోవా మనల్ని విలువైనవాళ్లుగా ఎంచుతాడని ఆయన వాక్యం చెప్తుంది.—అపొ. 10:34, 35.

7. యెహోవా తన సేవకుల్ని విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడని ఏ ఇతర కారణాల్ని బట్టి చెప్పొచ్చు?

7 యెహోవా మనల్ని విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడని చెప్పడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఆయన మనల్ని తనవైపుకు ఆకర్షించుకొని, మంచివార్తకు మనం ఎలా స్పందించామో గమనించాడు. (యోహా. 6:44) మనం యెహోవాకు దగ్గరౌతుండగా, ఆయన కూడా మనకు దగ్గరయ్యాడు. (యాకో. 4:8) మనకు బోధించడానికి ఆయన తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు, కృషి చేస్తున్నాడు. ఆ విధంగా మనం ఆయనకు విలువైనవాళ్లమని చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎలాంటి వ్యక్తులుగా ఉన్నామో, భవిష్యత్తులో ఎలాంటి వ్యక్తులుగా తయారవ్వగలమో ఆయనకు తెలుసు. అంతేకాదు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు క్రమశిక్షణ ఇస్తున్నాడు. (సామె. 3:11, 12) యెహోవా మనల్ని విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడని చెప్పడానికి ఇదెంత శక్తివంతమైన రుజువో కదా!

8. మన సమస్యల్ని సరైన దృష్టితో చూడడానికి కీర్తన 18:27-29 లో ఉన్న మాటలు మనకెలా సహాయం చేస్తాయి?

8 కొంతమంది దావీదు రాజును ఎందుకూ పనికిరానివానిగా చూశారు. కానీ యెహోవా తనను ప్రేమిస్తున్నాడని, తనకు సహాయం చేస్తాడని దావీదుకు తెలుసు. అందువల్ల ఆయన సరైన వైఖరితో తన పరిస్థితిని సహించగలిగాడు. (2 సమూ. 16:5-8) మనం కృంగిపోయినప్పుడు లేదా మనకు సమస్యలు ఎదురైనప్పుడు, ఆ పరిస్థితిని సరైన దృష్టితో చూడడానికి, ఎలాంటి ఆటంకాన్నైనా అధిగమించడానికి యెహోవా మనకు సహాయం చేయగలడు. (కీర్తన 18:27-29 చదవండి.) మనకు యెహోవా సహాయం ఉన్నంతవరకూ ఆయన్ని సంతోషంగా సేవించకుండా ఏదీ మనల్ని ఆపలేదు. (రోమా. 8:31) యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, మనల్ని విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడని గుర్తుపెట్టుకోవాల్సిన ఆ మూడు పరిస్థితుల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు

యెహోవా ప్రేరణతో రాసిన మాటల్ని చదివినప్పుడు, అనారోగ్యం వల్ల మనలో ఏర్పడే ప్రతికూల భావాలతో పోరాడగలుగుతాం (9-12 పేరాలు చూడండి)

9. అనారోగ్యం కారణంగా మన గురించి మనం ఎలా భావించే ప్రమాదం ఉంది?

9 అనారోగ్యం మన భావాల్ని కూడా ప్రభావితం చేయగలదు. దానివల్ల మనం అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇక ఎందుకూ పనికిరానివాళ్లమని అనిపించవచ్చు. ఇతరులు మన పరిమితుల్ని గమనించడం లేదా సహాయం కోసం మనం ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం మనకు ఇబ్బందిగా అనిపించవచ్చు. ఒక్కోసారి మన అనారోగ్యం గురించి ఇతరులకు తెలీకపోయినా, మనం ఒకప్పుడు చేసిన పనుల్ని ఇప్పుడు చేయలేకపోతున్నామని మనకు అవమానంగా అనిపించవచ్చు. అలాంటి కృంగదీసే పరిస్థితుల్లో యెహోవా మనల్ని ఆదరిస్తాడు. ఎలా?

10. సామెతలు 12:25 ప్రకారం, మనం అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మనకేది సహాయం చేస్తుంది?

10 అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, “దయగల మాట” లేదా మంచి మాట మన ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది. (సామెతలు 12:25 చదవండి.) అలాంటి ఎన్నో మంచి మాటల్ని యెహోవా బైబిల్లో రాయించి పెట్టాడు. మనం అనారోగ్యంతో బాధపడుతున్నా యెహోవా మనల్ని విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడని అవి చూపిస్తాయి. (కీర్త. 31:19; 41:3) ఆ ప్రేరేపిత మాటల్ని మనం మళ్లీమళ్లీ చదివినప్పుడు, అనారోగ్యం వల్ల మనలో ఏర్పడిన ప్రతికూల భావాలతో పోరాడడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు.

11. ఒక సహోదరుడు, యెహోవా సహాయాన్ని ఎలా పొందాడు?

11 హోర్హే అనుభవాన్ని పరిశీలించండి. యౌవనుడిగా ఉన్న రోజుల్లో, ఆయనకు బాగా జబ్బు చేసి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించిపోయింది. దాంతో, తాను ఎందుకూ పనికిరానివాణ్ణని అనుకున్నాడు. ఆయనిలా చెప్తున్నాడు: “నేనున్న పరిస్థితినిబట్టి అందరూ నావైపే చూసేవాళ్లు. అది నాకు చాలా అవమానంగా అనిపించేది. దాన్ని ఎదుర్కోవడానికి అప్పుడు నేను సిద్ధంగా లేను. నా పరిస్థితి ఇంకా దిగజారిపోవడంతో, నా జీవితం ఎలా మలుపు తిరుగుతుందో అని ఆందోళనపడ్డాను. నేను బాగా కృంగిపోయాను, సహాయం కోసం యెహోవాను వేడుకున్నాను.” మరి యెహోవా ఆయనకు ఎలా సహాయం చేశాడు? “నేను ఎక్కువగా ఏకాగ్రత నిలపలేకపోయేవాణ్ణి. దాంతో యెహోవాకు తన సేవకులపట్ల ఎంత శ్రద్ధ ఉందో తెలియజేసే చిన్నచిన్న భాగాల్ని కీర్తనల్లో చదవమని నన్ను ప్రోత్సహించారు. ప్రతీరోజు అవే లేఖనాల్ని మళ్లీమళ్లీ చదివేవాణ్ణి. అవి నాకు ఓదార్పును, భరోసాను ఇచ్చేవి. కొంతకాలానికి, ప్రజలు నా ముఖంలో చిరునవ్వును గమనించారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను చూపించిన సానుకూల వైఖరి వాళ్లను ప్రోత్సహించిందని చెప్పారు. యెహోవా నా ప్రార్థనలకు జవాబిచ్చాడని నాకు అర్థమైంది. నన్ను నేను చూసుకునే విధానాన్ని మార్చుకోవడానికి ఆయన నాకు సహాయం చేశాడు. అనారోగ్యం ఉన్నాసరే ఆయన నన్ను విలువైన వ్యక్తిగా చూస్తాడని బైబిలు చెప్పే మాటమీద మనసుపెట్టాను.”

12. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, మీరు యెహోవా సహాయాన్ని ఎలా పొందవచ్చు?

12 మీరు అనారోగ్యంతో బాధపడుతుంటే, మీ పరిస్థితి యెహోవాకు తెలుసనే నమ్మకంతో ఉండండి. మీ పరిస్థితి గురించి సరిగ్గా ఆలోచించడానికి సహాయం చేయమని యెహోవాను వేడుకోండి. తర్వాత యెహోవా మీకోసం దాచి ఉంచిన మంచి మాటల్ని బైబిల్లో చదవండి. యెహోవా తన సేవకుల్ని ఎంత విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడో తెలియజేసే వచనాలపై దృష్టి పెట్టండి. అలా చేసినప్పుడు, తనను నమ్మకంగా సేవించేవాళ్లందరిపట్ల యెహోవా దయ చూపిస్తాడని మీరే తెలుసుకుంటారు.—కీర్త. 84:11.

ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్నప్పుడు

ఉద్యోగం దొరకడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో, మన అవసరాలు తీరుస్తానని యెహోవా చేసిన వాగ్దానాల్ని గుర్తుచేసుకోవడం మనకు సహాయకరంగా ఉంటుంది (13-15 పేరాలు చూడండి)

13. ఉద్యోగం పోయినప్పుడు ఒక ఇంటి పెద్దకు ఎలా అనిపించవచ్చు?

13 ప్రతీ ఒక్క ఇంటిపెద్ద తన కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చాలని కోరుకుంటాడు. అయితే, తన తప్పేమీ లేకుండానే ఒక సహోదరుని ఉద్యోగం పోయిందనుకోండి. ఆయన ఎంత ప్రయత్నించినా మరో ఉద్యోగం దొరకలేదు. ఆ పరిస్థితుల్లో తాను ఎందుకూ పనికిరానివాణ్ణని ఆయనకు అనిపించవచ్చు. యెహోవా వాగ్దానాలపై మనసుపెట్టడం ఆయనకెలా సహాయం చేస్తుంది?

14. ఏయే కారణాల్నిబట్టి యెహోవా తన వాగ్దానాలను నెరవేరుస్తాడు?

14 యెహోవా అన్నివేళలా తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. (యెహో. 21:45; 23:14) అలా ఆయన చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది, ఆయనకున్న మంచి పేరు లేదా ప్రతిష్ఠ మీద అది ప్రభావం చూపిస్తుంది. తన విశ్వసనీయ సేవకులపట్ల శ్రద్ధ చూపిస్తానని యెహోవా మాటిచ్చాడు, కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావిస్తాడు. (కీర్త. 31:1-3) దానికితోడు, తన కుటుంబంలో భాగంగా ఉన్నవాళ్ల అవసరాలపట్ల ఆయన శ్రద్ధ చూపించకపోతే మనం చాలా బాధపడతామని, నిరుత్సాహపడతామని యెహోవాకు తెలుసు. మన భౌతిక అలాగే ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తానని ఆయన మాటిస్తున్నాడు. దాన్ని నెరవేర్చకుండా ఆయన్ని ఏదీ ఆపలేదు!—మత్త. 6:30-33; 24:45.

15. (ఎ) మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఎలాంటి సవాలు ఎదురైంది? (బి) కీర్తన 37:18, 19 మనకు ఏ హామీ ఇస్తుంది?

15 యెహోవా తన వాగ్దానాలను ఎందుకు నెరవేరుస్తాడో మనం గుర్తుంచుకుంటే, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. మొదటి శతాబ్దపు క్రైస్తవుల ఉదాహరణ గమనించండి. యెరూషలేములోని సంఘం మీద తీవ్రమైన హింస చెలరేగినప్పుడు, “అపొస్తలులు తప్ప మిగతా శిష్యులందరూ . . . చెదిరిపోయారు.” (అపొ. 8:1) వాళ్ల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వాళ్లకు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదురై ఉంటుంది! క్రైస్తవులు తమ ఇళ్లను, వ్యాపారాలను కోల్పోయి ఉంటారు. కానీ, యెహోవా వాళ్ల చెయ్యి విడిచిపెట్టలేదు; వాళ్లూ తమ సంతోషాన్ని కోల్పోలేదు. (అపొ. 8:4; హెబ్రీ. 13:5, 6; యాకో. 1:2, 3) యెహోవా ఆ నమ్మకమైన క్రైస్తవులకు సహాయం చేశాడు, అలాగే మనకు కూడా సహాయం చేస్తాడు.—కీర్తన 37:18, 19 చదవండి.

వృద్ధాప్య సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు

వృద్ధాప్యంలో కూడా మనం చేయగలిగే వాటిపై దృష్టిపెడితే యెహోవా మనల్ని, మనం చేసే నమ్మకమైన సేవను విలువైనదిగా ఎంచుతాడనే భరోసాతో ఉండవచ్చు (16-18 పేరాలు చూడండి)

16. యెహోవాకు ఏమీ ఇవ్వలేమని మనకెప్పుడు అనిపించవచ్చు?

16 మన వయసు పైబడుతున్నకొద్దీ, యెహోవాకు ఏమీ ఇవ్వలేమని అనిపిస్తుండవచ్చు. వృద్ధుడౌతున్నప్పుడు దావీదు రాజుకు కూడా అలాంటి భావాలే కలిగి ఉంటాయి. (కీర్త. 71:9) ఆ పరిస్థితుల్లో యెహోవా మనకెలా సహాయం చేయగలడు?

17. జిరీ అనే సహోదరి అనుభవం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

17 జిరీ అనే సహోదరి అనుభవం గమనించండి. రాజ్యమందిరంలో మరమ్మత్తులకు సంబంధించిన శిక్షణా తరగతికి హాజరవ్వమని ఆమెకు ఆహ్వానం అందింది. కానీ ఆ సహోదరికి వెళ్లాలనిపించలేదు. ఆమె ఇలా చెప్తుంది: “నేను వృద్ధురాల్ని, విధవరాల్ని, యెహోవా నన్ను ఉపయోగించుకోవడానికి నా దగ్గర ఏ నైపుణ్యం లేదు. నేను ఎందుకూ పనికిరానిదాన్ని.” ఆ శిక్షణా తరగతి జరగడానికి ముందు రోజు రాత్రి ప్రార్థనలో ఆమె యెహోవా ఎదుట తన హృదయాన్ని కుమ్మరించింది. మరుసటి రోజు ఆమె రాజ్యమందిరానికి వెళ్లింది. వెళ్లిన తర్వాత కూడా తాను అక్కడ ఉండాలో వద్దో ఆమె తేల్చుకోలేపోయింది. అయితే, కార్యక్రమం జరుగుతున్నప్పుడు, యెహోవా దగ్గర నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండడమే అన్నిటికన్నా ముఖ్యమైన నైపుణ్యం అని ఒక ప్రసంగీకుడు చెప్పాడు. జిరీ ఇలా గుర్తుచేసుకుంటుంది: “అలాగైతే, ‘ఆ నైపుణ్యం నాకు ఉంది!’ అని అనిపించింది. యెహోవా నా ప్రార్థనకు జవాబిస్తున్నాడని నాకు అర్థమై, ఏడ్చేశాను. యెహోవాకు ఇవ్వడానికి నా దగ్గర విలువైనది ఏదో ఉందని, ఆయన నాకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడని నాకు భరోసానిచ్చాడు!” జరిగిన దాని గురించి జిరీ ఇలా చెప్తుంది: “భయం, నిరుత్సాహం, ఎందుకూ పనికిరానిదాన్ననే భావాలతో నేను రాజ్యమందిరంలోకి అడుగుపెట్టాను. కానీ అక్కడి నుండి వచ్చేటప్పుడు ఆత్మవిశ్వాసంతో, ప్రోత్సాహంతో, యెహోవాకు విలువైనదాన్ననే భావనతో నేను బయటకు వచ్చాను!”

18. మనం వృద్ధులమౌతున్నా, మన సేవను యెహోవా విలువైనదిగా ఎంచుతాడని బైబిలు ఎలా చూపిస్తుంది?

18 మనం వృద్ధులమౌతున్నా, యెహోవా సేవలో చేయడానికి మనకు కూడా ఏదోక పని ఉంటుందనే నమ్మకంతో ఉండవచ్చు. (కీర్త. 92:12-15) మనకు పెద్దగా సామర్థ్యాలు లేకపోయినా, మనం చేసే పని చాలా తక్కువని మనకు అనిపించినా, యెహోవా మాత్రం మనం చేసే ఏ పనినైనా ఎంతో విలువైనదిగా ఎంచుతాడని యేసు చెప్పాడు. (లూకా 21:2-4) కాబట్టి మీరు చేయగలిగే వాటిపై దృష్టి పెట్టండి. ఉదాహరణకు, మీరు యెహోవా గురించి ఇతరులకు చెప్పవచ్చు, సహోదరుల కోసం ప్రార్థించవచ్చు, నమ్మకంగా ఉండేలా ఇతరుల్ని ప్రోత్సహించవచ్చు. మీరు ఏం చేయగలరు అనేదాన్నిబట్టి కాదుగానీ, మీరు ఆయనకు ఎంత ఇష్టంగా లోబడుతున్నారు అనే దాన్నిబట్టి యెహోవా మిమ్మల్ని తన తోటి పనివానిగా చూస్తాడు.—1 కొరిం. 3:5-9.

19. రోమీయులు 8:38, 39 వచనాలు మనకు ఏ భరోసాను ఇస్తున్నాయి?

19 తన సేవకులకు నిజంగా విలువిచ్చే యెహోవా దేవున్ని ఆరాధిస్తున్నందుకు మనం ఎంత ధన్యులమో కదా! తన చిత్తం చేయడానికి ఆయన మనల్ని సృష్టించాడు. కాబట్టి సత్యారాధన మాత్రమే మన జీవితాలకు నిజమైన అర్థాన్ని ఇవ్వగలదు. (ప్రక. 4:11) ఈ లోకం దృష్టిలో మనం ఎందుకూ పనికిరానివాళ్లం అయ్యుండొచ్చు, కానీ యెహోవా మాత్రం మనల్ని అలా చూడట్లేదు. (హెబ్రీ. 11:16, 38) అనారోగ్యం వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, లేదా వృద్ధాప్యం వల్ల మనకు నిరుత్సాహంగా అనిపిస్తే, మన పరలోక తండ్రి ప్రేమ నుండి ఏవీ మనల్ని వేరుచేయలేవనే విషయాన్ని గుర్తుంచుకుందాం.—రోమీయులు 8:38, 39 చదవండి.

^ పేరా 5 మీరు ఎందుకూ పనికిరానివాళ్లని అనిపించే సందర్భాలు మీకెప్పుడైనా ఎదురయ్యాయా? యెహోవా మిమ్మల్ని ఎంత విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడో ఈ ఆర్టికల్‌ మీకు గుర్తుచేస్తుంది. మీ జీవితంలో ఏం జరిగినా సరే మీరు ఆత్మగౌరవంతో ఎలా జీవించవచ్చో ఇందులో చర్చిస్తాం.

పాట 30 నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు