అధ్యయన ఆర్టికల్ 4
జ్ఞాపకార్థ ఆచరణకు మనమెందుకు హాజరౌతాం?
“నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.”—లూకా 22:19.
పాట 20 ప్రశస్తమైన నీ కుమారుణ్ణి ఇచ్చావు
ఈ ఆర్టికల్‌లో . . . *
1-2. (ఎ) చనిపోయిన మన ఇష్టమైనవాళ్లను ప్రత్యేకంగా ఎప్పుడు గుర్తుచేసుకుంటాం? (బి) తాను చనిపోవడానికి ముందురోజు రాత్రి యేసు దేన్ని ప్రారంభించాడు?
మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయి చాలాకాలమైనా, ఇప్పటికీ వాళ్లను గుర్తుచేసుకుంటాం. ప్రతీ సంవత్సరం వాళ్లు చనిపోయిన రోజున ఇంకా ఎక్కువ గుర్తుచేసుకుంటాం.
2 యేసుక్రీస్తును మనం ఎంతో ప్రేమిస్తాం. ఆయన చనిపోయిన రోజును ఆచరించడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలమందితో సహా మనమూ హాజరౌతాం. (1 పేతు. 1:8) మనల్ని పాపం, మరణం నుండి విడిపించడానికి తన ప్రాణాన్ని విమోచనగా అర్పించిన యేసును గుర్తుచేసుకోవడానికి మనమలా కలుస్తాం. (మత్త. 20:28) నిజానికి తన అనుచరులు తన మరణాన్ని గుర్తుచేసుకోవాలని యేసు కోరుకున్నాడు. అందుకే తాను చనిపోవడానికి ముందురోజు రాత్రి ఒక ప్రత్యేకమైన భోజనాన్ని ప్రారంభించి ఇలా చెప్పాడు: “నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.”—లూకా 22:19.
3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
3 క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యే వాళ్లలో కొంతమందికి పరలోక నిరీక్షణ ఉంది, కానీ లక్షలమందికి భూనిరీక్షణ ఉంది. ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి ఆ రెండు గుంపులవాళ్లు ఎందుకు ఎదురుచూస్తారో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. ఆ ఆచరణకు హాజరవ్వడంవల్ల మనమెలాంటి ప్రయోజనం పొందుతామో కూడా చూస్తాం. ముందుగా, అభిషిక్తులు ఆ ఆచరణకు ఎందుకు హాజరౌతారో కొన్ని కారణాల్ని చూద్దాం.
అభిషిక్తులు ఎందుకు హాజరౌతారు?
4. జ్ఞాపకార్థ ఆచరణ రోజు అభిషిక్త క్రైస్తవులు ఎందుకు రొట్టెను తింటారు, ద్రాక్షారసాన్ని తాగుతారు?
4 ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యే అభిషిక్త క్రైస్తవులు రొట్టెను తింటారు, ద్రాక్షారసాన్ని తాగుతారు. ఎందుకు? దానికి జవాబు తెలుసుకోవడానికి యేసు ఈ భూమ్మీద జీవించిన చివరిరోజు రాత్రి ఏం జరిగిందో చూద్దాం. ఆయన పస్కా భోజనం అయ్యాక ప్రభువు రాత్రి భోజనాన్ని మొదలుపెట్టాడు. తన 11 మంది నమ్మకమైన అపొస్తలులకు రొట్టె, ద్రాక్షారసం ఇచ్చి వాటిని తిని, తాగమన్నాడు. ఆ సమయంలో యేసు వాళ్లతో కొత్త ఒప్పందం గురించి, రాజ్య ఒప్పందం గురించి మాట్లాడాడు. * (లూకా 22:19, 20, 28-30) ఈ ఒప్పందాలవల్ల అపొస్తలులకు అలాగే ఇంకొంతమందికి పరలోకంలో రాజులుగా, యాజకులుగా సేవచేసే అవకాశం దొరికింది. (ప్రక. 5:10; 14:1) ఈ రెండు ఒప్పందాల్లో భాగంగావున్న అభిషిక్తుల్లో మిగిలినవాళ్లు, జ్ఞాపకార్థ ఆచరణ రోజున రొట్టె, ద్రాక్షారసాన్ని తీసుకుంటారు.
5. అభిషిక్త క్రైస్తవులకు తమ నిరీక్షణ గురించి ఏయే విషయాలు తెలుసు?
5 అభిషిక్త క్రైస్తవులు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి మరొక కారణం కూడా ఉంది. అదేంటంటే వాళ్లు తమ నిరీక్షణ గురించి ఆలోచించడానికి అదొక మంచి సందర్భం. యెహోవా వాళ్లకిచ్చిన నిరీక్షణ అద్భుతమైనది. వాళ్లు కుళ్లిపోని, నాశనంకాని శరీరంతో పరలోకంలో జీవిస్తారు. వాళ్లు 1,44,000 మందిలో ఒకరిగా యేసుక్రీస్తుతో పాటు సేవ చేస్తారు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యెహోవాను చూడగలుగుతారు. (1 కొరిం. 15:51-53; 1 యోహా. 3:2) వాళ్లు పరలోకంలో అలాంటి ఆశీర్వాదాలు అనుభవిస్తారని తెలిసినా, అక్కడికి వెళ్లాలంటే చనిపోయేంతవరకు నమ్మకంగా జీవించాలి. (2 తిమో. 4:7, 8) ఆ ఆచరణకు హాజరై తమ నిరీక్షణ గురించి ఆలోచించడం ద్వారా అభిషిక్త క్రైస్తవులు ఎంతో ఆనందాన్ని పొందుతారు. (తీతు 2:13) మరి “వేరే గొర్రెల” సంగతేంటి? (యోహా. 10:16) వాళ్లు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి కొన్ని కారణాలేంటి?
వేరే గొర్రెలు ఎందుకు హాజరౌతారు?
6. వేరే గొర్రెల్లోనివాళ్లు జ్ఞాపకార్థ ఆచరణకు ఎందుకు హాజరౌతారు?
6 వేరే గొర్రెలకు చెందినవాళ్లు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనప్పుడు రొట్టె, ద్రాక్షారసాన్ని తీసుకోరు కానీ గమనించేవాళ్లుగా ఉంటారు. 1938లో భూనిరీక్షణ ఉన్నవాళ్లను మొట్టమొదటిసారి జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించారు. దానిగురించి 1938, మార్చి 1 కావలికోట (ఇంగ్లీష్) ఇలా చెప్పింది: “ఆ కూటానికి వేరే గొర్రెల్లోనివాళ్లు రావడం, అక్కడ జరుగుతున్నదాన్ని గమనించడం సరైనదే. . . . అది వాళ్లు కూడా సంతోషించే సమయం.” ఒక వివాహానికి ఎలాగైతే అతిథులు హాజరై సంతోషిస్తారో, అలాగే వేరే గొర్రెలకు చెందినవాళ్లు కూడా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరై అక్కడ జరిగేదాన్ని చూసి సంతోషిస్తారు.
7. వేరే గొర్రెలకు చెందినవాళ్లు జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగాన్ని వినడానికి ఎందుకు ఎదురుచూస్తారు?
7 వేరే గొర్రెలకు చెందినవాళ్లు కూడా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనప్పుడు తమ నిరీక్షణ గురించి ఆలోచిస్తారు. ఆ ఆచరణలో ఇచ్చే ప్రసంగాన్ని వినడానికి వాళ్లు ఎదురుచూస్తారు. అందులో ప్రాముఖ్యంగా క్రీస్తు, ఆయనతో పాటు పరిపాలించే 1,44,000 మంది వెయ్యేండ్ల పరిపాలనలో నమ్మకమైన మనుషుల కోసం ఏం చేస్తారో తెలుసుకుంటారు. తమ రాజైన యేసు నాయకత్వం కింద ఈ సహపరిపాలకులు భూమిని పరదైసుగా మార్చడానికి, విధేయులైన మనుషులు పరిపూర్ణులవ్వడానికి సహాయం చేస్తారు. వేరే గొర్రెలకు చెందిన లక్షలమంది యెషయా 35:5, 6; 65:21-23; ప్రకటన 21:3, 4 వంటి ప్రవచనాలు నెరవేరడాన్ని ఊహించుకుని సంతోషిస్తారు. తమకు ఇష్టమైనవాళ్లతో కొత్తలోకంలో ఉన్నట్టు ఊహించుకోవడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించి తమ నిరీక్షణను బలపర్చుకుంటారు. అలాగే యెహోవా సేవలో ఎప్పటికీ కొనసాగాలని తీర్మానించుకుంటారు.—మత్త. 24:13; గల. 6:9.
8. వేరే గొర్రెలకు చెందినవాళ్లు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి మరో కారణమేంటి?
8 వేరే గొర్రెలకు చెందినవాళ్లు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి ఉన్న మరో కారణాన్ని చూడండి. వాళ్లు అభిషిక్తులకు తమ ప్రేమను, మద్దతును చూపించాలని కోరుకుంటారు. అభిషిక్త క్రైస్తవులు అలాగే భూనిరీక్షణ ఉన్నవాళ్లు కలిసి దగ్గరగా పనిచేస్తారని దేవుని వాక్యం ముందే చెప్పింది. అదెలాగో తెలుసుకోవడానికి మనం కొన్ని ఉదాహరణల్ని చూద్దాం.
9. జెకర్యా 8:23 లోని ప్రవచనం, వేరే గొర్రెలకూ అభిషిక్తులకూ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందని వర్ణిస్తుంది?
9 జెకర్యా 8:23 చదవండి. వేరే గొర్రెలకు చెందినవాళ్లు అభిషిక్త క్రైస్తవుల గురించి ఎలా భావిస్తున్నారో ఈ ప్రవచనం చక్కగా వర్ణిస్తుంది. ‘ఒక యూదుడు,’ “మీకు” అనే పదాలు భూమ్మీద మిగిలివున్న అభిషిక్త క్రైస్తవుల్ని సూచిస్తున్నాయి. (రోమా. 2:28, 29) “ఆయా దేశాలకు చెందిన అన్ని భాషల ప్రజల్లో నుండి పదేసిమంది” వేరే గొర్రెలకు చెందినవాళ్లను సూచిస్తున్నారు. వీళ్లు ఒక యూదుని చెంగును ‘గట్టిగా పట్టుకుంటారు’ అంటే అభిషిక్త క్రైస్తవులతో కలిసి స్వచ్ఛారాధన చేస్తారు. అందుకే వేరే గొర్రెలకు చెందినవాళ్లు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడం ద్వారా అభిషిక్త క్రైస్తవులతో తమకు దగ్గరి సంబంధం ఉందని చూపిస్తారు.
10. యెహెజ్కేలు 37:15-19, 24, 25 లో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చడానికి యెహోవా ఏం చేశాడు?
10 యెహెజ్కేలు 37:15-19, 24, 25 చదవండి. అభిషిక్తులు, వేరే గొర్రెలు కలిసి పనిచేసే ఏర్పాటు చేయడం ద్వారా యెహోవా ఈ ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఈ ప్రవచనంలో రెండు కర్రల గురించి ఉంది. ఒకటి ‘యూదా’ కర్ర (ఇశ్రాయేలు రాజుల్ని ఈ గోత్రం నుండి ఎంచుకున్నారు). రెండోది “ఎఫ్రాయిము” కర్ర. * యూదా కర్ర పరలోక నిరీక్షణ ఉన్నవాళ్లను సూచిస్తుంది. ఎఫ్రాయిము కర్ర భూనిరీక్షణ ఉన్నవాళ్లను సూచిస్తుంది. యెహోవా ఈ రెండు గుంపుల్ని “ఒక్క కర్ర” అయ్యేలా ఐక్యం చేస్తాడు. దీనర్థం వాళ్లంతా తమ రాజైన యేసుక్రీస్తు కింద కలిసి సేవచేస్తారు. అందుకే ప్రతీ సంవత్సరం అభిషిక్తులు, వేరే గొర్రెలకు చెందినవాళ్లు జ్ఞాపకార్థ ఆచరణకు రెండు వేర్వేరు గుంపులుగా కాకుండా, “ఒకే కాపరి” కింద ‘ఒకే మందలా’ హాజరౌతారు.—యోహా. 10:16.
11. మత్తయి 25:31-36, 40 లో ప్రస్తావించిన “గొర్రెలు” క్రీస్తు సహోదరులకు ఎలా మద్దతిస్తున్నాయి?
11 మత్తయి 25:31-36, 40 చదవండి. ఈ ఉదాహరణలో యేసు చెప్పిన “గొర్రెలు” చివరిరోజుల్లో జీవించే నీతిమంతుల్ని సూచిస్తున్నాయి. వీళ్లే భూనిరీక్షణ ఉన్న వేరే గొర్రెలు. వీళ్లు మిగిలివున్న క్రీస్తు అభిషిక్త సహోదరులకు ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిలో, శిష్యుల్ని చేసేపనిలో సహాయం చేస్తూ నమ్మకంగా మద్దతిస్తున్నారు.—మత్త. 24:14; 28:19, 20.
12-13. వేరే గొర్రెలకు చెందినవాళ్లు క్రీస్తు సహోదరులకు ఇంకా ఏయే విధాలుగా మద్దతిస్తారు?
12 ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు కొన్ని వారాల ముందు నుండి, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రచార కార్యక్రమం జరుగుతుంది. వేరే గొర్రెలకు చెందినవాళ్లు దానిలో పూర్తిగా పాల్గొని, ఆసక్తిగలవాళ్లను ఆహ్వానించడం ద్వారా క్రీస్తు సహోదరులకు మద్దతిస్తారు. (“ జ్ఞాపకార్థ ఆచరణకు మీరు ముందే సిద్ధపడతారా?” అనే బాక్సు చూడండి.) ప్రపంచవ్యాప్తంగా చాలా సంఘాల్లో అభిషిక్తులు లేకపోయినా వేరే గొర్రెలకు చెందినవాళ్లు జ్ఞాపకార్థ ఆచరణ జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో సహాయం చేస్తారు. ఈ విధంగా క్రీస్తు సహోదరులకు మద్దతివ్వడం ద్వారా వేరే గొర్రెలకు చెందినవాళ్లు సంతోషాన్ని పొందుతారు. అభిషిక్త సహోదరులకు సహాయం చేస్తే స్వయంగా యేసుకు సహాయం చేసినట్లే అని వేరే గొర్రెలకు చెందినవాళ్లకు తెలుసు.—మత్త. 25:37-40.
13 మన నిరీక్షణ ఏదైనా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి ఇంకా ఏ కారణాలున్నాయి?
మనందరం ఎందుకు హాజరౌతాం?
14. యెహోవా, యేసు మనమీద గొప్ప ప్రేమను ఎలా చూపించారు?
14 యెహోవా, యేసు మనమీద చూపించిన ప్రేమకు కృతజ్ఞత కలిగివుంటాం. యెహోవా ఎన్నో విధాలుగా మనమీద ప్రేమ చూపించాడు. అయితే తన ప్రియ కుమారుణ్ణి మనకోసం బాధలుపడి చనిపోయేలా ఈ భూమ్మీదకు పంపించడం ద్వారా సాటిలేని విధంగా ఆయన నిస్వార్థమైన ప్రేమ చూపించాడు. (యోహా. 3:16) యేసు కూడా తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా ఇవ్వడం ద్వారా గొప్ప ప్రేమ చూపించాడు. (యోహా. 15:13) యెహోవా, యేసు చూపించిన ప్రేమకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అయితే మనం ప్రతీరోజు జీవించే విధానం బట్టి కృతజ్ఞతను చూపించవచ్చు. (కొలొ. 3:15) అంతేకాదు, జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడం ద్వారా వాళ్లు చూపించిన ప్రేమను గుర్తుచేసుకుంటాం, తిరిగి వాళ్లమీద ప్రేమ చూపిస్తాం.
15. అభిషిక్తులు అలాగే వేరే గొర్రెలకు చెందినవాళ్లు విమోచన క్రయధనాన్ని ఎందుకు ఎంతో విలువైనదిగా చూస్తారు?
15 విమోచన క్రయధనం అనే బహుమానాన్ని మనం ఎంతో విలువైనదిగా చూస్తాం. (మత్త. 20:28) విమోచన క్రయధనం వల్ల అభిషిక్తులకు అద్భుతమైన పరలోక నిరీక్షణ సాధ్యమైంది, కాబట్టి వాళ్లు దాన్ని విలువైనదిగా ఎంచుతారు. క్రీస్తు బలిమీద విశ్వాసం ఉంచడంవల్ల యెహోవా వాళ్లను నీతిమంతులుగా తీర్పుతీర్చి, తన పిల్లలుగా దత్తత తీసుకున్నాడు. (రోమా. 5:1; 8:15-17, 23) వేరే గొర్రెలకు చెందినవాళ్లు కూడా విమోచన క్రయధనాన్ని విలువైనదిగా చూస్తారు. వాళ్లకు క్రీస్తు బలిమీద విశ్వాసం ఉంది కాబట్టి దేవుని ముందు స్వచ్ఛంగా ఉండగలుగుతారు, ఆయనకు పవిత్రసేవ చేయగలుగుతారు. అంతేకాదు, “మహాశ్రమను దాటి” వస్తారనే ఆశతో ఉంటారు. (ప్రక. 7:13-15) కాబట్టి అభిషిక్తులు, వేరే గొర్రెలకు చెందినవాళ్లు విమోచన క్రయధనంపట్ల తమకు కృతజ్ఞత ఉందని చూపించే ఒక మార్గమేంటంటే ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడం.
16. మనమింకా ఏ కారణాన్నిబట్టి జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌతాం?
16 మనం యేసు ఆజ్ఞకు లోబడాలని కోరుకుంటాం. అందుకే జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌతాం. మన నిరీక్షణ ఏదైనా యేసు ఈ భూమ్మీద జీవించిన చివరిరోజు రాత్రి ఇచ్చిన ఆజ్ఞను పాటించాలని కోరుకుంటాం. ఆయనిలా చెప్పాడు: “నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.”—1 కొరిం. 11:23, 24.
జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడంవల్ల వచ్చే ప్రయోజనాలు
17. యెహోవాకు మరింత దగ్గరవ్వడానికి జ్ఞాపకార్థ ఆచరణ ఎలా సహాయం చేస్తుంది?
17 మనం యెహోవాకు మరింత దగ్గరౌతాం. (యాకో. 4:8) మనం నేర్చుకున్నట్టుగా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడం ద్వారా, యెహోవా మనకిచ్చిన నిరీక్షణ గురించి ఆలోచించడానికి, ఆయన చూపించిన గొప్ప ప్రేమ గురించి ధ్యానించడానికి అవకాశం దొరుకుతుంది. (యిర్మీ. 29:11; 1 యోహా. 4:8-10) వాటి గురించి ఆలోచించినప్పుడు యెహోవా మీద మనకున్న ప్రేమ మరింత పెరుగుతుంది, ఆయనతో స్నేహం ఇంకా బలపడుతుంది.—రోమా. 8:38, 39.
18. యేసు ఆదర్శం గురించి ధ్యానించినప్పుడు మనమేం చేయడానికి కదిలించబడతాం?
18 మనం యేసు ఆదర్శాన్ని అనుకరించడానికి కదిలించబడతాం. (1 పేతు. 2:21) జ్ఞాపకార్థ ఆచరణ దగ్గరపడుతుండగా యేసు ఈ భూమ్మీద జీవించిన చివరి వారం, ఆయన మరణం, పునరుత్థానం గురించి వివరించే బైబిలు వృత్తాంతాల్ని మనం చదివి, ధ్యానిస్తాం. అలాగే జ్ఞాపకార్థ ఆచరణ రోజు సాయంత్రం ఇవ్వబడే ప్రసంగం, యేసు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో గుర్తుచేస్తుంది. (ఎఫె. 5:2; 1 యోహా. 3:16) మనం యేసు స్వయంత్యాగ స్ఫూర్తి గురించి చదివి, ధ్యానించినప్పుడు “ఆయనలాగే నడుచుకుంటూ” ఉండాలని తీర్మానించుకుంటాం.—1 యోహా. 2:6.
19. మనం దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచి ఉండాలంటే ఏం చేయాలి?
19 దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండాలని ఇంకా గట్టిగా నిశ్చయించుకుంటాం. (యూదా 20, 21) మనం యెహోవాకు లోబడడానికి, ఆయన పేరును పవిత్రపర్చడానికి, ఆయన హృదయాన్ని సంతోషపెట్టడానికి చేయగలిగినదంతా చేయాలి. అలా చేసినప్పుడు దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుంటాం. (సామె. 27:11; మత్త. 6:9; 1 యోహా. 5:3) మనం ప్రతీరోజు, యెహోవా ‘నేను ఎప్పటికీ నీ ప్రేమలో నిలిచివుండాలని కోరుకుంటున్నాను’ అనే విధంగా జీవించాలి. అలా జీవించాలని మనం ఇంకా గట్టిగా నిశ్చయించుకునేలా జ్ఞాపకార్థ ఆచరణ కదిలిస్తుంది.
20. జ్ఞాపకార్థ ఆచరణకు ప్రతీ సంవత్సరం హాజరవ్వడానికి మనకు ఏ కారణాలున్నాయి?
20 మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి మంచి కారణాలున్నాయి. ప్రతీ సంవత్సరం ఆ ఆచరణకు హాజరైనప్పుడు మనమెంతో ప్రేమించే యేసు మరణాన్ని గుర్తుచేసుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవా తన కుమారుణ్ణి విమోచన క్రయధనంగా అర్పించి చూపించిన సాటిలేని ప్రేమను గుర్తుచేసుకుంటాం. ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ 2022, ఏప్రిల్ 15, శుక్రవారం సాయంత్రం జరుగుతుంది. మనం యెహోవాను, యేసును ప్రేమిస్తాం కాబట్టి ఆ ఆచరణకు హాజరవ్వడమే అన్నిటికన్నా ఎక్కువ ప్రాముఖ్యం.
పాట 16 అభిషిక్త కుమారుణ్ణి బట్టి యెహోవాను స్తుతించండి
^ మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి ఎదురుచూస్తాం. ఈ ఆర్టికల్‌లో, ఆ ఆచరణకు హాజరవ్వడానికిగల కారణాల్ని లేఖనాల ఆధారంగా చర్చిస్తాం. అలాగే దానికి హాజరవ్వడంవల్ల వచ్చే ప్రయోజనాల్ని తెలుసుకుంటాం.
^ కొత్త ఒప్పందం, రాజ్య ఒప్పందం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి 2014, అక్టోబరు 15 కావలికోటలో 15-17 పేజీల్లో ఉన్న “మీరు ‘యాజక రూపమైన రాజ్యముగా’ ఉంటారు” అనే ఆర్టికల్ చూడండి.
^ మరింత సమాచారం కోసం జూలై 2016 కావలికోటలో ఉన్న “పాఠకుల ప్రశ్న” చూడండి.