కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 5

“మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి”

“మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి”

“మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ తెలివితక్కువవాళ్లలా కాకుండా తెలివిగలవాళ్లలా నడుచుకోండి, మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి.”—ఎఫె. 5:15, 16.

పాట 8 యెహోవా మనకు ఆశ్రయం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మనం యెహోవాతో ఎలా సమయం గడపవచ్చు?

 మనకు ఇష్టమైనవాళ్లతో సమయం గడపాలని మనం కోరుకుంటాం. భార్యాభర్తలు ఒకరితోఒకరు, యౌవనులు తమ దగ్గరి స్నేహితులతో, సంఘంలోనివాళ్లు తోటి సహోదరసహోదరీలతో సమయం గడపడానికి ఇష్టపడతారు. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా మనం దేవునితో సమయం గడపడానికి ఇష్టపడతాం. ఆయనకు ప్రార్థించడం ద్వారా, ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా, ఆయన సంకల్పం, అద్భుతమైన లక్షణాల గురించి ధ్యానించడం ద్వారా ఆయనతో సమయం గడపవచ్చు. యెహోవాతో గడిపే ఆ సమయం నిజంగా ఎంతో అమూల్యమైనది.—కీర్త. 139:17.

2. మనకేం చేయడం కష్టమవ్వొచ్చు?

2 యెహోవాతో సమయం గడపడం మనకిష్టమే అయినా కొన్నిసార్లు అలా చేయడం కష్టమవ్వొచ్చు. ఎందుకంటే మనం చాలా బిజీగా ఉంటున్నాం. సాధారణంగా ఉద్యోగానికి, కుటుంబ బాధ్యతలకు అలాగే ఇతర ముఖ్యమైన పనులకే ఎక్కువ సమయం అయిపోతుంది. దానివల్ల ప్రార్థించడానికి, వ్యక్తిగత అధ్యయనం చేయడానికి లేదా ధ్యానించడానికి సమయం లేనట్టు అనిపిస్తుంది.

3. ఇంకా ఏ కారణంవల్ల ఆధ్యాత్మిక విషయాల కోసం మనం పెట్టే సమయం తగ్గిపోవచ్చు?

3 మరో కారణంవల్ల కూడా ఆధ్యాత్మిక విషయాల కోసం మనం పెట్టే సమయం తగ్గిపోవచ్చు. ఉదాహరణకు కొన్ని పనులు తప్పు కాకపోయినా, జాగ్రత్తగా లేకపోతే వాటివల్ల యెహోవాకు దగ్గరవ్వడానికి మనం పెట్టే సమయం తగ్గిపోవచ్చు. వినోదం కోసం సమయం పెట్టడం తప్పేమీకాదు. మనం ఎంచుకునే వినోదం మంచిదే అయినా దానికి ఎక్కువ సమయం పెడితే, ఆధ్యాత్మిక విషయాలకు సమయం మిగలకపోవచ్చు. కాబట్టి మనం వినోదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదని గుర్తుంచుకోవాలి.—సామె. 25:27; 1 తిమో. 4:8.

4. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

4 మన జీవితంలో ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో ఎందుకు నిర్ణయించుకోవాలి? యెహోవాతో మనం గడిపే సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఎలా ఉపయోగించవచ్చు? అలా చేసినప్పుడు మనం పొందే ప్రయోజనాలు ఏంటి? ఈ ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం.

సరైనవి ఎంచుకోండి; ఏవి ప్రాముఖ్యమైనవో నిర్ణయించుకోండి

5. యౌవనులు తమ జీవితంలో సరైనది ఎంచుకోవడానికి, ఎఫెసీయులు 5:15-17 లోని సలహా ఎలా సహాయం చేస్తుంది?

5 మీ జీవితంలో సరైనది ఎంచుకోండి. యౌవనులు తమ జీవితం బాగుండాలంటే ఏం చేయాలో తరచూ ఆలోచిస్తుంటారు. ఒకపక్క టీచర్లు, సత్యంలోలేని కుటుంబసభ్యులు ఉన్నత విద్య చదవమని వాళ్లను ప్రోత్సహిస్తారు. అలా చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించే మంచి ఉద్యోగం దొరుకుతుందని కూడా చెప్తారు. కానీ ఉన్నత విద్య చదివితే దానికే ఎక్కువ సమయం పోతుంది. మరోపక్క తల్లిదండ్రులు, సంఘంలోని స్నేహితులు యెహోవా సేవలో జీవితం గడపమని యౌవనుల్ని ప్రోత్సహిస్తారు. యెహోవాను ప్రేమించే యౌవనులకు సరైన నిర్ణయం తీసుకోవడానికి ఏది సహాయం చేస్తుంది? వాళ్లు ఎఫెసీయులు 5:15-17 వచనాల్ని చదివి, ధ్యానించవచ్చు. (చదవండి.) ఆ వచనాల్ని చదివిన తర్వాత యౌవనులు ఇలా ప్రశ్నించుకోవచ్చు: “‘యెహోవా ఇష్టం ఏంటి?’ నేను ఏ నిర్ణయం తీసుకుంటే యెహోవా సంతోషిస్తాడు? ఏ నిర్ణయం తీసుకుంటే నా సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగిస్తాను?” గుర్తుంచుకోండి, “రోజులు చెడ్డవి” అలాగే సాతాను పరిపాలించే లోకం త్వరలోనే నాశనమౌతుంది. కాబట్టి యెహోవాను సంతోషపెట్టే విధంగా జీవించడమే తెలివైనపని.

6. మరియ ఏ ఎంపిక చేసుకుంది? అదెందుకు సరైనది?

6 ఏవి ప్రాముఖ్యమైనవో నిర్ణయించుకోండి. కొన్నిసార్లు మనం రెండు పనులు చేయాలనుకోవచ్చు, అవి రెండూ సరైనవే కావచ్చు. అయితే మన సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించాలంటే ఏదైనా ఒక్క పనే చేయాల్సిరావచ్చు. దీన్ని అర్థంచేసుకోవడానికి మరియ, మార్తల ఇంటికి యేసు వెళ్లినప్పుడు ఏం జరిగిందో గమనించండి. యేసు తమ ఇంటికి వచ్చాడన్న ఆనందంలో ఆతిథ్యస్ఫూర్తి ఉన్న మార్త రకరకాల వంటలు చేయడం మొదలుపెట్టింది. కానీ మరియ, యేసు దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది. మార్త మంచి ఉద్దేశంతోనే ఆ పనులు చేస్తున్నా, మరియ “శ్రేష్ఠమైనదాన్ని ఎంచుకుంది” అని యేసు చెప్పాడు. (లూకా 10:38-42, అధస్సూచి) కొంతకాలానికి యేసుకు ఏం ఆహారం పెట్టారో మరియకు గుర్తులేకపోయినా, ఆయన చెప్పిన మాటలు ఖచ్చితంగా గుర్తుండి ఉంటాయి. మరియ యేసుతో కొద్ది సమయమే గడిపినా ఆ సమయాన్ని విలువైనదిగా ఎంచింది. అదేవిధంగా మనం కూడా యెహోవాతో గడిపే సమయాన్ని విలువైనదిగా ఎంచుతాం. ఆ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఎలా ఉపయోగించవచ్చు?

యెహోవాతో గడిపే సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించండి

7. ప్రార్థించడం, బైబిల్ని అధ్యయనం చేయడం, ధ్యానించడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

7 ప్రార్థించడం, బైబిల్ని అధ్యయనం చేయడం, ధ్యానించడం ఆరాధనలో భాగమని అర్థంచేసుకోండి. మనం ప్రార్థించినప్పుడు మనల్ని ఎంతో ప్రేమించే మన పరలోక తండ్రితో మాట్లాడతాం. (కీర్త. 5:7) మనం బైబిల్ని అధ్యయనం చేసినప్పుడు అందరికన్నా ఎక్కువ తెలివి ఉన్న దేవుని నుండి నేర్చుకుంటాం. (సామె. 2:1-5) మనం ధ్యానించినప్పుడు యెహోవాకున్న ఆకర్షణీయమైన లక్షణాల గురించి, మనుషులందరి విషయంలో ఆయనకున్న అద్భుతమైన సంకల్పం గురించి ఆలోచిస్తాం. ఈ మూడు పనులు చేయడం ద్వారా మన సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించవచ్చు. అయితే మనకున్న తక్కువ సమయంలో వాటిని ఎలా చేయవచ్చు?

వ్యక్తిగత అధ్యయనం చేయడానికి మీరు ప్రశాంతమైన చోటును ఎంచుకోగలరా? (8, 9 పేరాలు చూడండి)

8. యేసు ఎడారిలో తన సమయాన్ని ఎలా ఉపయోగించాడు? దాన్నుండి మనమేం నేర్చుకోవచ్చు?

8 వీలైతే ప్రశాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోండి. యేసు గురించి ఆలోచించండి. ఆయన పరిచర్య మొదలుపెట్టే ముందు 40 రోజులు ఎడారిలో గడిపాడు. (లూకా 4:1, 2) ఆ ప్రశాంతమైన స్థలంలో ఆయన యెహోవాకు ప్రార్థించాడు. అలాగే తన విషయంలో తండ్రి ఇష్టం ఏంటో ధ్యానించాడు. ఆయన త్వరలో ఎదుర్కోబోయే పరీక్షల్ని తట్టుకోవడానికి అది సిద్ధం చేసింది. యేసు నుండి మీరేం నేర్చుకోవచ్చు? మీరు పెద్ద కుటుంబంలో ఉంటే ఇంట్లో ప్రశాంతమైన స్థలం దొరకడం ప్రతీసారి సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఇంటి బయట మీరొక ప్రశాంతమైన స్థలాన్ని చూసుకోవచ్చు. ప్రార్థనలో యెహోవాతో సమయం గడపాలని అనుకున్నప్పుడు జూలీ అనే సహోదరి అలానే చేస్తుంది. ఆమె తన భర్తతోపాటు ఫ్రాన్స్‌లో ఒక్క గది ఉన్న ఫ్లాట్‌లో ఉంటుంది. కాబట్టి ఆమె ఏకాంతంగా ఉండడం కష్టం. ఆమె ఇలా చెప్తుంది: “నేను ప్రతిరోజు నడవడానికి పార్కుకు వెళ్తాను. అక్కడ నేను ఒక్కదాన్నే నా మనసువిప్పి యెహోవాతో మాట్లాడగల్గుతాను.”

9. యేసు చాలా బిజీగా ఉన్నా ఏం చేసేవాడు?

9 యేసు చాలా బిజీగా ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రజలు వచ్చేవాళ్లు. ఆయన వాళ్లందరితో సమయం గడపాల్సి వచ్చేది. ఒక సందర్భంలో యేసు ఒక ఇంట్లో ఉన్నప్పుడు, “నగర ప్రజలంతా ఆ ఇంటి గుమ్మం” దగ్గర గుమికూడారు. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసు యెహోవాకు ప్రార్థించడానికి సమయం ఉండేలా చూసుకున్నాడు. ఆయన తెల్లవారుజామునే లేచి తన తండ్రితో ఏకాంతంగా గడపడానికి “ఎవ్వరూ లేని ప్రదేశానికి” వెళ్లాడు.—మార్కు 1:32-35.

10-11. మత్తయి 26:40, 41 ప్రకారం, ఏం చేయమని యేసు తన శిష్యులకు చెప్పాడు? కానీ ఏం జరిగింది?

10 యేసు తాను చనిపోవడానికి ముందురోజు రాత్రి ధ్యానించడానికి, ప్రార్థించడానికి మళ్లీ ఒక ప్రశాంతమైన చోటును చూసుకున్నాడు. దానికోసం ఆయన గెత్సేమనే తోటకు వెళ్లాడు. (మత్త. 26:36) యేసు అక్కడ తన శిష్యులకు ప్రార్థన గురించి సమయానుకూలమైన సలహా ఇచ్చాడు.

11 అక్కడ ఏం జరిగిందో గమనించండి. వాళ్లు గెత్సేమనే తోటకు వెళ్లినప్పుడు బహుశా మధ్యరాత్రి దాటి ఉంటుంది. యేసు తన అపొస్తలులకు ‘మెలకువగా ఉండమని’ చెప్పి ప్రార్థించడానికి వెళ్లాడు. (మత్త. 26:37-39) అయితే ఈలోపు వాళ్లు నిద్రపోయారు. వాళ్లను అలా చూసినప్పుడు యేసు మళ్లీ, “మెలకువగా ఉంటూ, ప్రార్థన చేస్తూ ఉండండి” అని చెప్పాడు. (మత్తయి 26:40, 41 చదవండి.) వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, అలసిపోయారని ఆయన గుర్తించాడు. అందుకే ‘శరీరం బలహీనం’ అని ఆయన కనికరంతో అన్నాడు. ఆ తర్వాత యేసు మరో రెండుసార్లు ప్రార్థించడానికి వెళ్లి తిరిగొచ్చినప్పుడు కూడా, తన శిష్యులు ప్రార్థించే బదులు నిద్రపోతున్నారని గమనించాడు.—మత్త. 26:42-45.

మీరు అంతగా అలసిపోని సమయంలో ప్రార్థించగలరా? (12వ పేరా చూడండి)

12. కొన్నిసార్లు బాగా ఒత్తిడి లేదా అలసట వల్ల ప్రార్థించాలని అనిపించకపోతే అప్పుడేం చేయవచ్చు?

12 సరైన సమయాన్ని ఎంచుకోండి. కొన్నిసార్లు బాగా ఒత్తిడి లేదా అలసట వల్ల మనకు ప్రార్థించాలని అనిపించకపోవచ్చు. మీకేకాదు చాలామందికి అలా అనిపిస్తుంది. అప్పుడు మీరేం చేయవచ్చు? కొంతమంది రాత్రి పడుకునేముందు ప్రార్థించేవాళ్లు. కానీ అప్పటికే వాళ్లు బాగా అలసిపోయి ఉండేవాళ్లు. అందుకే అంతగా అలసిపోని సాయంత్ర సమయంలో ప్రార్థిస్తున్నారు. ఇంకొంతమంది కూర్చొని లేదా మోకాళ్లమీద ప్రార్థించినప్పుడు మరింత ఏకాగ్రతతో ప్రార్థిస్తున్నారని గుర్తించారు. ఒకవేళ మీకు బాగా ఆందోళనగా, నిరుత్సాహంగా అనిపించడం వల్ల ప్రార్థన చేయలేకపోతే అప్పుడేంటి? మీకెలా అనిపిస్తుందో యెహోవాకు చెప్పండి. మన కరుణగల తండ్రి అర్థంచేసుకుంటాడనే నమ్మకంతో మీరుండొచ్చు.—కీర్త. 139:4.

మీరు కూటాల్లో ఉన్నప్పుడు మెసేజ్‌లు, ఈమెయిల్‌లు చూడకుండా ఉండగలరా? (13, 14 పేరాలు చూడండి)

13. మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు లేదా కూటాలకు హాజరౌతున్నప్పుడు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు మీ దృష్టిని ఎలా పక్కకు మళ్లించగలవు?

13 అధ్యయనం చేస్తున్నప్పుడు మీ దృష్టి పక్కకు మళ్లకుండా చూసుకోండి. యెహోవాతో మన సంబంధాన్ని బలపర్చుకోవడానికి ప్రార్థనతో పాటు బైబిల్ని అధ్యయనం చేయడం, సంఘ కూటాలకు హాజరవడం సహాయం చేస్తాయి. వాటి కోసం మనం కేటాయించే సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించడానికి ఏం చేయవచ్చు? మీరిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను కూటాల్లో ఉన్నప్పుడు లేదా అధ్యయనం చేస్తున్నప్పుడు ఏవి నా దృష్టిని పక్కకు మళ్లిస్తున్నాయి?’ మీ ఫోన్‌కు లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు వచ్చే కాల్స్‌, ఈమెయిల్స్‌, మెసేజ్‌లు మీ దృష్టిని మళ్లిస్తున్నాయా? నేడు కోట్లమంది దగ్గర ఈ పరికరాలు ఉన్నాయి. మనం దేనిమీదైనా అవధానం నిలపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనకు దగ్గరలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే మన దృష్టి పక్కకు మళ్లొచ్చని కొంతమంది పరిశోధకులు చెప్తున్నారు. అలాగే “మీ దృష్టి, చేసే పనిమీద కాకుండా ఇంకెక్కడో ఉంటుంది” అని ఒక సైకాలజి ప్రొఫెసర్‌ చెప్తున్నాడు. అందుకే మన సమావేశాలు ప్రారంభమయ్యే ముందు మన ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఇతరులకు ఇబ్బంది కలిగించని సెట్టింగ్‌లో పెట్టుకోమని చెప్తారు. మీరు కూడా యెహోవాతో సమయం గడుప్పుతున్నప్పుడు మీ అవధానం పక్కకు మళ్లకుండా మీ ఎలక్ట్రానిక్‌ పరికరాలను సెట్‌ చేసుకోగలరా?

14. ఫిలిప్పీయులు 4:6, 7 ప్రకారం, దృష్టి నిలిపేలా యెహోవా మనకెలా సహాయం చేస్తాడు?

14 దృష్టి నిలిపేలా సహాయం చేయమని యెహోవాను అడగండి. మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు లేదా సంఘకూటాల్లో ఉన్నప్పుడు వేరే విషయాల వైపు మీ ఆలోచనలు వెళ్తుంటే, సహాయం కోసం యెహోవాను అడగండి. మీరు ఏదైనా ఆందోళనలో ఉన్నప్పుడు దాన్ని పక్కనపెట్టి, ఆధ్యాత్మిక విషయాలమీద మనసుపెట్టడం కష్టంకావొచ్చు. అయినా అలా చేయడం ప్రాముఖ్యం. కాబట్టి మీ హృదయాలకే కాదు “మీ మనసులకు” కూడా కాపలా ఉండే దేవుని శాంతికోసం ప్రార్థించండి.—ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.

యెహోవాతో సమయం గడపడం వల్ల వచ్చే ప్రయోజనాలు

15. యెహోవాతో సమయం గడపడం వల్ల వచ్చే ఒక ప్రయోజనం ఏంటి?

15 మీరు సమయం తీసుకొని యెహోవాతో మాట్లాడినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన గురించి ఆలోచించినప్పుడు ఎంతో ప్రయోజనం పొందుతారు. ఎలా? మొదటిగా, మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బైబిలు ఇలా చెప్తుంది, “తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు.” (సామె. 13:20) కాబట్టి తెలివికి మూలమైన యెహోవాతో సమయం గడిపినప్పుడు మీరింకా తెలివిగలవాళ్లు అవుతారు. అప్పుడు ఆయన్ని ఎలా సంతోషపెట్టవచ్చో, ఆయన్ని బాధపెట్టే నిర్ణయాలు తీసుకోకుండా ఎలా ఉండవచ్చో ఇంకా బాగా అర్థంచేసుకుంటారు.

16. యెహోవాతో సమయం గడపడం వల్ల వచ్చే రెండో ప్రయోజనం ఏంటి?

16 రెండోది, మీరు మంచి బోధకులౌతారు. మనం బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు విద్యార్థి యెహోవాకు దగ్గరయ్యేలా సహాయం చేయడమే మన ముఖ్యలక్ష్యం అయ్యుండాలి. మనం యెహోవాకు ఎంతెక్కువ ప్రార్థిస్తే, ఆయనమీద అంతెక్కువ ప్రేమ పెరుగుతుంది. అప్పుడు మన విద్యార్థి యెహోవాను ప్రేమించేలా ఇంకా బాగా బోధించగలుగుతాం. యేసు విషయమే తీసుకోండి. ఆయన తన తండ్రి గురించి ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడాడంటే, దాన్ని విన్న ఆయన శిష్యులుకూడా యెహోవాను ప్రేమించారు.—యోహా. 17:25, 26.

17. మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి ప్రార్థన, వ్యక్తిగత అధ్యయనం ఎలా సహాయం చేస్తాయి?

17 మూడోది, మీ విశ్వాసం మరింత బలపడుతుంది. నిర్దేశం, ఓదార్పు లేదా మద్దతు కోసం మీరు యెహోవాకు ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. వాటికోసం మీరు చేసే ప్రార్థనలకు యెహోవా జవాబిచ్చిన ప్రతీసారి ఆయనమీద మీ విశ్వాసం పెరుగుతుంది. (1 యోహా. 5:15) మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి వ్యక్తిగత అధ్యయనం కూడా సహాయం చేస్తుంది. “దేని గురించైనా విన్నప్పుడే విశ్వాసం కలుగుతుంది” అని గుర్తుంచుకోండి. (రోమా. 10:17) అయితే మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాలంటే అధ్యయనం చేసి కేవలం జ్ఞానాన్ని సంపాదిస్తే సరిపోదు. దాంతోపాటు ఇంకా ఏంచేయవచ్చు?

18. మనం ఎందుకు ధ్యానించాలో ఒక ఉదాహరణతో చెప్పండి.

18 మనం నేర్చుకుంటున్న వాటిని ధ్యానించాలి. 77వ కీర్తన రాసిన కీర్తనకర్త అనుభవాన్ని గమనించండి. తోటి ఇశ్రాయేలీయులతో పాటు అతను యెహోవా ఆమోదాన్ని కోల్పోయాడనుకొని ఎంతో బాధపడ్డాడు. ఆ ఆందోళనవల్ల అతనికి రాత్రి నిద్రపట్టేది కాదు. (2 నుండి 8 వచనాలు) అప్పుడు అతను ఏంచేశాడు? “నీ పనులన్నిటినీ ధ్యానిస్తాను, నీ కార్యాల గురించి లోతుగా ఆలోచిస్తాను” అని యెహోవాతో అన్నాడు. (12వ వచనం) నిజానికి యెహోవా తన ప్రజలకు గతంలో ఏం చేశాడో ఆ కీర్తనకర్తకు తెలిసినప్పటికీ, మొదట్లో అతనిలా అన్నాడు: “దేవుడు దయ చూపించడం మర్చిపోయాడా? కోపంతో కరుణ చూపించడం ఆపేశాడా?” (9వ వచనం) తర్వాత ఆ కీర్తనకర్త, గతంలో యెహోవా చేసిన పనుల గురించి అలాగే ఆయన చూపించిన దయ, కనికరం గురించి ధ్యానించాడు. (11వ వచనం) అప్పుడేం జరిగింది? యెహోవా తన ప్రజల్ని విడిచిపెట్టడనే నమ్మకం కీర్తనకర్తకు కలిగింది. (15వ వచనం) అదేవిధంగా యెహోవా తన ప్రజలకు గతంలో ఏం చేశాడో, మీకేం చేశాడో ధ్యానించడంవల్ల మీ విశ్వాసం ఇంకా బలపడుతుంది.

19. యెహోవాతో సమయం గడపడం వల్ల వచ్చే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ప్రయోజనం ఏంటి?

19 యెహోవాతో సమయం గడపడం వల్ల వచ్చే నాలుగో ప్రయోజనం, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, యెహోవామీద మీకున్న ప్రేమ ఇంకా పెరుగుతుంది. ఆయనకు విధేయత చూపించేలా, ఆయన్ని సంతోషపెట్టడానికి త్యాగాలు చేసేలా, ఎలాంటి కష్టాన్నైనా సహించేలా వేరే ఏ లక్షణంకన్నా ప్రేమే మనల్ని కదిలిస్తుంది. (మత్త. 22:37-39; 1 కొరిం. 13:4, 7; 1 యోహా. 5:3) యెహోవాతో దగ్గరి స్నేహం కలిగివుండడం కన్నా మనకు విలువైనది ఏదీలేదు.—కీర్త. 63:1-8.

20. ప్రార్థించడానికి, అధ్యయనం చేయడానికి, ధ్యానించడానికి మనకు సమయం ఉండాలంటే ఏంచేయాలి?

20 ప్రార్థించడం, బైబిల్ని అధ్యయనం చేయడం, ధ్యానించడం మన ఆరాధనలో భాగమని గుర్తుంచుకోండి. యెహోవాకు ప్రార్థించడానికి యేసులాగే ప్రశాంతమైన చోటును ఎంచుకోండి. మీ దృష్టిని పక్కకు మళ్లించే వాటిని దూరంగా పెట్టండి. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటున్నప్పుడు, ఏకాగ్రత నిలిపేలా సహాయం చేయమని యెహోవాను అడగండి. ఇప్పుడు మీకున్న సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగిస్తే, కొత్తలోకంలో యెహోవా మీకు శాశ్వత జీవితమనే బహుమానాన్ని ఇస్తాడు.—మార్కు 4:24.

పాట 28 యెహోవా స్నేహాన్ని సంపాదించుకోవడం

^ యెహోవా మన బెస్ట్‌ ఫ్రెండ్‌. ఆయనతో స్నేహాన్ని మనం విలువైనదిగా ఎంచుతాం. అలాగే ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరుకుంటాం. ఎవరి గురించైనా తెలుసుకోవాలంటే సమయం పడుతుంది. యెహోవాతో ఉన్న బంధాన్ని కూడా బలపర్చుకుంటూ ఉండాలంటే సమయం పడుతుంది. ఈరోజుల్లో మనందరం చాలా బిజీగా ఉంటున్నాం. అయినా మన పరలోక తండ్రికి దగ్గరవ్వడానికి సమయాన్ని ఎలా వెచ్చించవచ్చు? అలా చేయడం వల్ల మనమెలాంటి ప్రయోజనం పొందుతాం?