కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 1

“యెహోవాను వెదికేవాళ్లకు మంచిదేదీ కొదువ కాదు”

“యెహోవాను వెదికేవాళ్లకు మంచిదేదీ కొదువ కాదు”

2022 వార్షిక వచనం: “యెహోవాను వెదికేవాళ్లకు మంచిదేదీ కొదువ కాదు.”—కీర్త. 34:10.

పాట 4 “యెహోవా నా కాపరి”

ఈ ఆర్టికల్‌లో . . . *

కష్ట సమయాల్లో కూడా తనకు ‘మంచిదేదీ కొదువ కాలేదని’ దావీదు భావించాడు (1-3 పేరాలు చూడండి) *

1. దావీదుకు ఎలాంటి కష్టమైన పరిస్థితి ఎదురైంది?

 దావీదు ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని పరిగెడుతున్నాడు. ఇశ్రాయేలు రాజైన సౌలు అతన్ని చంపాలని తరుముతున్నాడు. దావీదుకు ఆహారం అవసరమైనప్పుడు నోబు అనే పట్టణంలో ఆగి, ఒక యాజకుణ్ణి ఐదు రొట్టెలు అడిగాడు. (1 సమూ. 21:1, 3) తర్వాత అతను తన మనుషులతోపాటు ఒక గుహలో తలదాచుకున్నాడు. (1 సమూ. 22:1) అసలు దావీదుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

2. సౌలు తన ప్రాణాన్ని ఎలా ప్రమాదంలో పడేసుకున్నాడు? (1 సమూయేలు 23:16, 17)

2 దావీదుకున్న పేరుప్రఖ్యాతల్ని, అతను యుద్ధాల్లో సాధించిన విజయాల్ని చూసి సౌలు చాలా ఈర్ష్యపడ్డాడు. తాను చూపించిన అవిధేయత వల్లే యెహోవా తనను ఇశ్రాయేలుకు రాజుగా తిరస్కరించి, తర్వాతి రాజుగా దావీదును ఎన్నుకున్నాడని సౌలుకు తెలుసు. (1 సమూయేలు 23:16, 17 చదవండి.) సౌలు అప్పటికింకా రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర పెద్ద సైన్యం అలాగే ఎంతోమంది మద్దతుదారులు ఉన్నారు. అందుకే దావీదు తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది. దావీదును రాజుగా చేయకుండా యెహోవాను ఆపగలనని సౌలు అనుకున్నాడా? (యెష. 55:11) అలా అని బైబిలు చెప్పట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం సౌలు తన ప్రాణాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నాడు. ఎందుకంటే యెహోవాకు వ్యతిరేకంగా పోరాడే వాళ్లెవ్వరూ ఎప్పుడూ గెలవరు.

3. కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా దావీదు ఏం చేయలేదు?

3 దావీదు వినయంగల వ్యక్తి, అతను రాజవ్వాలని అనుకోలేదు. కానీ యెహోవాయే అతన్ని రాజుగా ఎంచుకున్నాడు. (1 సమూ. 16:1, 12, 13) సౌలు దావీదును బద్ద శత్రువులా చూశాడు. అయినా దావీదు తానున్న ప్రమాదకరమైన పరిస్థితినిబట్టి యెహోవాను నిందించలేదు. లేదా తనకు సరిపడా ఆహారం లేనందుకు, గుహలో తలదాచుకోవాల్సి వచ్చినందుకు అసంతృప్తితో యెహోవాను ఏమీ అనలేదు. బదులుగా అతను ఆ గుహలో ఉన్నప్పుడే యెహోవాను స్తుతిస్తూ 34వ కీర్తన రాసుంటాడు. దానిలో ఈ ఆర్టికల్‌ ముఖ్యవచనంలోని మాటలు కూడా ఉన్నాయి, “యెహోవాను వెదికేవాళ్లకు మంచిదేదీ కొదువ కాదు.”—కీర్త. 34:10.

4. మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం? అవి ఎందుకు ప్రాముఖ్యమైనవి?

4 మనకాలంలో చాలామంది యెహోవా సేవకులు సరిపడా ఆహారం అలాగే జీవించడానికి ఇతర అవసరాలు లేక ఇబ్బందిపడ్డారు. * ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో అలాంటి పరిస్థితి ఎదురైంది. “మహాశ్రమ” దగ్గర పడుతుండగా పరిస్థితులు మరింత కష్టంగా తయారవ్వొచ్చు. (మత్త. 24:21) కాబట్టి మనం ఈ నాలుగు ప్రశ్నల గురించి ఆలోచించడం మంచిది: ఏవిధంగా దావీదుకు “మంచిదేదీ కొదువ కాలేదు?” మనకున్న వాటితో సంతృప్తిగా ఉండడం ఎందుకు అవసరం? యెహోవా మనల్ని పట్టించుకుంటాడని ఎందుకు నమ్మకంతో ఉండొచ్చు? భవిష్యత్తులో వచ్చే కష్టాల్ని ఎదుర్కోవడానికి ఇప్పటినుండే మనమేం చేయవచ్చు?

“నాకు ఏ లోటూ ఉండదు”

5-6. యెహోవా సేవకులకు “మంచిదేదీ కొదువ కాదు” అని దావీదు అన్నప్పుడు, అతని ఉద్దేశమేంటో అర్థంచేసుకోవడానికి కీర్తన 23:1-6 వచనాలు ఎలా సహాయం చేస్తాయి?

5 యెహోవా సేవకులకు “మంచిదేదీ కొదువ కాదు” అని దావీదు అన్నప్పుడు అతని ఉద్దేశమేంటి? దావీదు 23వ కీర్తన రాసినప్పుడు అలాంటి మాటల్నే ఉపయోగించాడు. కాబట్టి దాన్ని పరిశీలించినప్పుడు అతని ఉద్దేశాన్ని అర్థంచేసుకోవచ్చు. (కీర్తన 23:1-6 చదవండి.) దావీదు ఆ కీర్తనను ఈ మాటలతో ప్రారంభించాడు: “యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ ఉండదు.” ఆ కీర్తనలోని మిగతా వచనాల్లో దావీదు నిజంగా ప్రాముఖ్యమైన వాటిగురించి మాట్లాడాడు. వాటిలో ఒకటి ఏంటంటే అతను యెహోవాను తన కాపరిగా అంగీకరించడంవల్ల పొందే ఎన్నో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు. యెహోవా దావీదును “నీతి మార్గాల్లో” నడిపిస్తాడు, అన్ని సమయాల్లో చివరికి కష్టసమయాల్లో కూడా దావీదును విడిచిపెట్టకుండా మద్దతిస్తాడు. యెహోవా తనను ‘పచ్చికబయళ్లలో పడుకోబెట్టినా’ తనకు కష్టాలు వస్తాయని దావీదు గుర్తించాడు. కొన్నిసార్లు “గాఢాంధకార లోయలో” నడిచినట్లు అతనికి నిరుత్సాహం ఎదురవ్వవచ్చు, శత్రువులు కూడా ఉండొచ్చు. కానీ యెహోవా తన కాపరిగా ఉన్నాడు కాబట్టి దావీదు ‘భయపడడు.’

6 ఏవిధంగా దావీదుకు “మంచిదేదీ కొదువ కాలేదు?” అనే ప్రశ్నకు జవాబు ఇదే: యెహోవాకు ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండడానికి కావాల్సిన ప్రతీది దావీదు దగ్గర ఉంది. అతని దగ్గర ఎక్కువ వస్తువులు లేకపోయినా సంతోషంగా ఉన్నాడు. యెహోవా తనకిచ్చిన వాటితో సంతృప్తిగా ఉన్నాడు. యెహోవా ఇచ్చే ఆశీర్వాదం, కాపుదలే అతనికి అన్నిటికన్నా ముఖ్యం.

7. లూకా 21:20-24 ప్రకారం, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏ కష్టమైన పరిస్థితిని ఎదుర్కున్నారు?

7 దావీదు మాటల్నిబట్టి వస్తుసంపదల విషయంలో మనకు సరైన అభిప్రాయం ఉండడం చాలా ప్రాముఖ్యమని నేర్చుకుంటాం. మన దగ్గరున్న వాటితో ఆనందించడం తప్పేమీకాదు. కానీ వస్తుసంపదలకే అన్నిటికన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఈ సత్యాన్ని యూదయలో నివసించిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు అర్థంచేసుకోవాల్సి వచ్చింది. (లూకా 21:20-24 చదవండి.) “యెరూషలేమును సైన్యాలు చుట్టుముట్టే” సమయం వస్తుందని యేసు వాళ్లను హెచ్చరించాడు. అది జరిగినప్పుడు వాళ్లు “కొండలకు పారిపోవడం మొదలుపెట్టాలి.” వాళ్లు పారిపోతేనే రక్షించబడతారు. కానీ అలా వెళ్తే వాళ్ల వస్తువుల్లో చాలా వాటిని వదిలేయాల్సి రావొచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం కావలికోట ఇలా చెప్పింది: “వాళ్లు పొలాల్ని, ఇళ్లను విడిచిపెట్టారు. తమ ఇళ్లలో నుండి తమకున్నవాటిని తీసుకెళ్లడానికి కూడా వాళ్లు ప్రయత్నించలేదు. యెహోవా ఇచ్చే రక్షణ, మద్దతుపై నమ్మకముంచి ప్రాముఖ్యమైనదిగా అనిపించే వేటికన్నా ఆయన ఆరాధనకే మొదటిస్థానం ఇచ్చారు.”

8. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు జరిగిన దాన్నుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు?

8 యూదయలో నివసించిన మొదటి శతాబ్దపు క్రైస్తవులకు జరిగిన దాన్నుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు? ఆ కావలికోట ఇంకా ఇలా చెప్పింది: “మనం వస్తుసంపదల్ని ఎలా చూస్తామనే విషయంలో మనకు పరీక్షలు ఎదురవ్వొచ్చు. అవి అత్యంత ప్రాముఖ్యమా? లేదా తనకు నమ్మకంగా ఉండేవాళ్లకు దేవుడిచ్చే రక్షణ అత్యంత ప్రాముఖ్యమా? అంతం వచ్చినప్పుడు మనం కష్టాల్ని తట్టుకోవాల్సి రావచ్చు, త్యాగాల్ని చేయాల్సి రావచ్చు. యూదయకు పారిపోయిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు చేసినట్టే మనం కూడా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి.” *

9. అపొస్తలుడైన పౌలు, హెబ్రీ క్రైస్తవులకు ఇచ్చిన సలహా నుండి మనమేం తెలుసుకోవచ్చు?

9 మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమ దగ్గరున్న చాలావాటిని వదిలేసి, కొత్త ప్రాంతానికి వెళ్లి జీవించడం ఎంత కష్టంగా ఉంటుందో ఊహించండి. యెహోవా వాళ్ల కనీస అవసరాల్ని తీరుస్తాడని నమ్మడానికి వాళ్లకు విశ్వాసం అవసరమైంది. వాళ్లు విశ్వాసం పెంచుకోవడానికి ఏది సహాయం చేసింది? రోమన్లు యెరూషలేమును చుట్టుముట్టడానికి ఐదు సంవత్సరాల ముందు అపొస్తలుడైన పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఈ మంచి సలహా ఇచ్చాడు: “డబ్బును ప్రేమించకండి, ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి. ఎందుకంటే, దేవుడే ఇలా అన్నాడు: ‘నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.’ అందుకే మనం మంచి ధైర్యంతో ఇలా అనగలం: ‘నాకు సహాయం చేసేది యెహోవాయే; నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?’” (హెబ్రీ. 13:5, 6) రోమన్లు యెరూషలేమును చుట్టుముట్టక ముందు అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను పాటించడంవల్ల, కొత్త ప్రాంతానికి వెళ్లిన క్రైస్తవులకు తమ దగ్గరున్న కొద్దిపాటి వస్తువులతో జీవించడం తేలికైంది. యెహోవా తమ కనీస అవసరాల్ని తీరుస్తాడని వాళ్లు నమ్మారు. పౌలు మాటల్నిబట్టి యెహోవా మన అవసరాల్ని కూడా తీరుస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.

ఉన్నవాటితో తృప్తిపడదాం

10. పౌలు ఏ విషయం నేర్చుకున్నాడు ?

10 పౌలు తిమోతికి అలాంటి సలహానే ఇచ్చాడు. అది మనకు కూడా వర్తిస్తుంది. పౌలు ఇలా చెప్పాడు: “కాబట్టి మనకు ఆహారం, బట్టలు ఉంటే చాలు, వాటితో తృప్తిపడదాం.” (1 తిమో. 6:8) దానర్థం మనం రుచికరమైన ఆహారం తినకూడదనా? మనకు మంచి ఇళ్లు ఉండకూడదనా? లేదా అప్పుడప్పుడు కొత్తబట్టలు కొనుక్కోకూడదనా? పౌలు ఉద్దేశం అదికాదు. మనకున్న వాటితో తృప్తిపడాలని పౌలు చెప్తున్నాడు. (ఫిలి. 4:12) పౌలు కూడా అదే నేర్చుకున్నాడు. కాబట్టి మన దగ్గరున్న వస్తువులు కాదుగానీ యెహోవాతో మనకున్న సంబంధమే అన్నిటికన్నా విలువైన ఆస్తి అని నేర్చుకోవచ్చు.—హబ. 3:17, 18.

ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నప్పుడు వాళ్లకు “మంచిదేదీ కొదువ కాలేదు.” ఇప్పుడు మన దగ్గరున్న వాటినిబట్టి తృప్తిగా ఉండగలమా? (11వ పేరా చూడండి) *

11. మోషే ఇశ్రాయేలీయులకు చెప్పిన మాటల నుండి, తృప్తిగా ఉండడం గురించి మనమేం నేర్చుకోవచ్చు?

11 మనకేం అవసరం అనే విషయంలో మన అభిప్రాయం, యెహోవా అభిప్రాయం వేరై ఉండొచ్చు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఎడారిలో గడిపిన తర్వాత మోషే వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు చేసిన ప్రతీ పనిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని దీవిస్తూ వచ్చాడు. ఈ మహా ఎడారిలో మీరు సాగించిన నడక గురించి కూడా ఆయనకు పూర్తిగా తెలుసు. ఈ 40 సంవత్సరాలు యెహోవా మీకు తోడుగా ఉన్నాడు, మీకు ఏమీ తక్కువ కాలేదు.” (ద్వితీ. 2:7) ఆ సమయమంతటిలో ఇశ్రాయేలీయులు తినడానికి యెహోవా మన్నాను కురిపించాడు. వాళ్లు ఐగుప్తును విడిచి వచ్చేటప్పుడు ఏ బట్టలతోనైతే వచ్చారో అవి పాతబడలేదు, చినిగిపోలేదు. (ద్వితీ. 8:3, 4) మన్నాతో, వాళ్ల దగ్గరున్న బట్టలతో కొంతమంది తృప్తిపడకపోయినా, ఇశ్రాయేలీయులకు కావాల్సిన ప్రతీది వాళ్ల దగ్గర ఉందని మోషే గుర్తుచేశాడు. మనం తృప్తిగా ఉండడం నేర్చుకున్నప్పుడు యెహోవా సంతోషిస్తాడు. ఆయనిచ్చే చిన్నచిన్న వాటికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలని, అవి ఆయన్నుండి వచ్చే బహుమానాలుగా మనం చూడాలని ఆయన కోరుకుంటున్నాడు.

యెహోవా మిమ్మల్ని పట్టించుకుంటాడనే నమ్మకంతో ఉండండి

12. దావీదు తనమీద కాకుండా యెహోవామీద నమ్మకం ఉంచాడని దేన్నిబట్టి చెప్పొచ్చు?

12 యెహోవా విశ్వసనీయుడని, తనను ప్రేమించేవాళ్లను ఆయన బాగా పట్టించుకుంటాడని దావీదుకు తెలుసు. 34వ కీర్తన రాసే సమయానికి దావీదు ప్రాణం ప్రమాదంలో ఉంది. అయినప్పటికీ అతని విశ్వాసం ఎంత బలంగా ఉందంటే, తన “చుట్టూ” యెహోవా ‘దూత కాపలా ఉన్నాడని’ దావీదు నమ్మాడు. (కీర్త. 34:7) బహుశా అతను యెహోవా దూతను, ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ కాపలా కాసే ఒక సైనికుడితో పోల్చాడు. దావీదు ధైర్యవంతుడైన సైనికుడు అలాగే యెహోవా అతన్ని రాజుగా చేస్తానని వాగ్దానం చేశాడు. అయినప్పటికీ తన శత్రువులను ఓడించడానికి అతను వడిసెలను లేదా కత్తిని ఉపయోగిస్తున్నప్పుడు సొంత సామర్థ్యం మీద ఆధారపడలేదు. (1 సమూ. 16:13; 24:12) ‘యెహోవాకు భయపడేవాళ్లందర్ని ఆయన దూత రక్షిస్తాడని’ దావీదు నమ్మాడు. ఈరోజుల్లో యెహోవా మనల్ని అద్భుతరీతిలో కాపాడతాడని ఎదురుచూడం. కానీ ఆయనమీద నమ్మకముంచే వాళ్లందరూ ఒకవేళ ఇప్పుడు చనిపోయినా, భవిష్యత్తులో శాశ్వత జీవితం పొందుతారని మనకు తెలుసు.

మహాశ్రమ కాలంలో, మాగోగువాడైన గోగు సైన్యాలు మన ఇళ్లకు వచ్చి మనపై దాడి చేయొచ్చు. అయితే వాళ్లను యేసు అలాగే ఆయన దేవదూతలు చూస్తారని, మనల్ని కాపాడతారని నమ్మకంతో ఉండొచ్చు (13వ పేరా చూడండి)

13. మాగోగువాడైన గోగు దాడిచేసినప్పుడు మనమెందుకు నిస్సహాయంగా కనిపిస్తాం? కానీ మనమెందుకు భయపడకూడదు? (ముఖచిత్రం చూడండి.)

13 యెహోవాకున్న కాపాడే సామర్థ్యం మీద మనకెంత నమ్మకముందో త్వరలోనే పరీక్షించబడుతుంది. మాగోగువాడైన గోగు అంటే దేశాల గుంపు, దేవుని ప్రజలమీద దాడిచేసినప్పుడు మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు మనల్ని రక్షించే సామర్థ్యం యెహోవాకు ఉందని, ఆయన మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడని నమ్మాలి. అయితే మనం ఎవ్వరూ రక్షించలేని నిస్సహాయస్థితిలో ఉన్న గొర్రెల్లా ఆ దేశాల గుంపుకు కనిపిస్తాం. (యెహె. 38:10-12) ఎందుకంటే మన దగ్గర ఆయుధాలు ఉండవు అలాగే యుద్ధం చేయడానికి శిక్షణ తీసుకొని ఉండము. మనల్ని ఓడించడం తేలికని ఆ దేశాలకు అనిపిస్తుంది. అయితే దేవుని మీద మనకున్న విశ్వాసాన్నిబట్టి దూతల సైన్యం మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉందని మనకు తెలుస్తుంది. కానీ ఆ దేశాలకు అది తెలీదు. ఎందుకంటే వాళ్లకు దేవుని మీద విశ్వాసం లేదు. పరలోక సైన్యాలు మన తరఫున యుద్ధం చేసినప్పుడు ఆ దేశాలు ఆశ్చర్యపోతాయి.—ప్రక. 19:11, 14, 15.

భవిష్యత్తు కోసం ఇప్పుడే సిద్ధపడండి

14. భవిష్యత్తు కోసం ఇప్పుడే సిద్ధపడడానికి మనమేం చేయవచ్చు?

14 భవిష్యత్తు కోసం ఇప్పుడే సిద్ధపడడానికి మనమేం చేయవచ్చు? మొదటిగా, మనం వస్తువులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఎందుకంటే వాటిని ఏదోకరోజు విడిచిపెట్టేయాల్సి వస్తుంది. అంతేకాదు మన దగ్గరున్న వాటినిబట్టి మనం తృప్తిపడాలి. అలాగే యెహోవాతో మనకున్న సంబంధాన్ని బట్టి ఎక్కువ సంతోషించాలి. మనం ఆయనను ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మాగోగువాడైన గోగు దాడిచేసినప్పుడు, ఆయనకున్న కాపాడే సామర్థ్యం మీద అంతెక్కువగా నమ్మకముంచుతాం.

15. యౌవనుడిగా ఉన్నప్పుడు తనకెదురైన ఏ విషయాల్ని బట్టి, యెహోవా ఎప్పుడూ సహాయం చేస్తాడని దావీదు అర్థంచేసుకున్నాడు?

15 దావీదుకు ఇంకా ఏం సహాయం చేసిందో తెలుసుకుంటూ, పరీక్షల కోసం మనమెలా సిద్ధపడవచ్చో నేర్చుకుందాం. అతను ఇలా అన్నాడు: “యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి; ఆయన్ని ఆశ్రయించేవాళ్లు సంతోషంగా ఉంటారు.” (కీర్త. 34:8) యెహోవామీద ఆధారపడొచ్చని దావీదుకు ఎందుకు తెలుసో ఆ మాటలు వివరిస్తున్నాయి. దావీదు తరచూ యెహోవామీద ఆధారపడ్డాడు; యెహోవా కూడా అతన్ని ఎప్పుడూ నిరుత్సాహపర్చలేదు. అతను యౌవనుడిగా ఉన్నప్పుడు ఫిలిష్తీయుడైన గొల్యాతుతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ బలవంతుడైన యోధుడితో దావీదు ఇలా అన్నాడు: “ఈ రోజే యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు.” (1 సమూ. 17:46) ఆ తర్వాత దావీదు రాజైన సౌలు దగ్గర పని చేస్తున్నప్పుడు, అతను ఎన్నోసార్లు దావీదును చంపడానికి ప్రయత్నించాడు. కానీ “యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు.” (1 సమూ. 18:12) గతంలో దావీదు యెహోవా సహాయాన్ని రుచి చూశాడు కాబట్టి, ఆ తర్వాత తనకొచ్చిన సమస్యల్లో కూడా ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడని అర్థంచేసుకున్నాడు.

16. మనం యెహోవా మంచితనాన్ని ఏయే విధాలుగా “రుచి” చూడవచ్చు?

16 యెహోవా నిర్దేశం మీద ఇప్పుడు మనమెంత ఎక్కువగా ఆధారపడితే, భవిష్యత్తులో ఆయన మనల్ని కాపాడగలడని అంతెక్కువగా నమ్ముతాం. ఉదాహరణకు మనం సమావేశాలకు హాజరయ్యేలా మన యజమానిని సెలవు అడగాల్సి రావచ్చు. అన్ని కూటాలకు హాజరయ్యేలా, పరిచర్యలో ఎక్కువ సమయం గడిపేలా మన పని గంటల్లో మార్పు చేయమని యజమానితో మాట్లాడాల్సి రావచ్చు. అలాంటప్పుడు మనకు విశ్వాసం, యెహోవామీద ఆధారపడాలనే కోరిక ఉండాలి. ఒకవేళ మన యజమాని మనం అడిగినదానికి ఒప్పుకోకుండా ఉద్యోగం నుండి తీసేస్తే, అప్పుడేంటి? యెహోవా మనల్ని అస్సలు విడిచిపెట్టడు లేదా వదిలేయడని, ఆయన మన కనీస అవసరాల్ని ఎప్పుడూ తీరుస్తాడని విశ్వాసం చూపిస్తామా? (హెబ్రీ. 13:5) తామెంతో అవసరంలో ఉన్నప్పుడు యెహోవా ఎలా సహాయం చేశాడో పూర్తికాల సేవలోవున్న చాలామంది చెప్తారు. యెహోవా నమ్మకస్థుడు కాబట్టి ఆయన తన సేవకుల్ని ఎన్నడూ విడిచిపెట్టడు.

17. ఈ సంవత్సరం వార్షిక వచనం ఏంటి? అదెందుకు సరైనది?

17 యెహోవా మనవైపు ఉన్నప్పుడు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడాల్సిన అవసరంలేదు. మన జీవితంలో ఆయన ఇష్టానికి మొదటిస్థానం ఇచ్చినంతకాలం, ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. మనం రాబోయే కష్టాల కోసం ఇప్పుడే సిద్ధపడాలని, యెహోవామీద నమ్మకముంచాలని పరిపాలక సభ కోరుకుంటుంది. అందుకే 2022 వార్షిక వచనం కోసం కీర్తన 34:10 ని ఎంచుకుంది. అక్కడిలా ఉంది: “యెహోవాను వెదికేవాళ్లకు మంచిదేదీ కొదువ కాదు.”

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

^ 2022 వార్షిక వచనాన్ని కీర్తన 34:10 నుండి తీసుకున్నారు. అక్కడిలా ఉంది: “యెహోవాను వెదికేవాళ్లకు మంచిదేదీ కొదువ కాదు.” యెహోవాకు నమ్మకంగా సేవచేస్తున్న చాలామంది దగ్గర తక్కువ డబ్బు లేదా కొన్ని వస్తువులే ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్లకు “మంచిదేదీ కొదువ కాదు” అని మనమెలా చెప్పొచ్చు? ఈ వచనాన్ని అర్థంచేసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే కష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మనమెలా సిద్ధంగా ఉండొచ్చు?

^ 2014, సెప్టెంబరు 15 కావలికోట పత్రికలోని “పాఠకుల ప్రశ్న” చూడండి.

^ 1999, మే 1 కావలికోట పత్రికలో 19వ పేజీ చూడండి.

^ చిత్రాల వివరణ: దావీదు రాజైన సౌలు నుండి పారిపోతూ గుహలో దాక్కున్నప్పుడు కూడా, యెహోవా ఇచ్చిన వాటినిబట్టి కృతజ్ఞత కలిగివున్నాడు.

^ చిత్రాల వివరణ: ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత, వాళ్లు తినడానికి యెహోవా మన్నాను కురిపించాడు. అలాగే వాళ్ల బట్టలు చిరిగిపోకుండా చూసుకున్నాడు.