కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 2

యేసు తమ్ముడి నుండి నేర్చుకోండి

యేసు తమ్ముడి నుండి నేర్చుకోండి

“దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకు దాసుడైన యాకోబు.”—యాకో. 1:1.

పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యాకోబు ఎలాంటి కుటుంబంలో పెరిగాడు?

 యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు యెహోవాకు నమ్మకంగా ఉన్న కుటుంబంలో పెరిగాడు. ఆయన తల్లిదండ్రులైన యోసేపు, మరియ యెహోవాను ఎంతో ప్రేమించారు అలాగే ఆయన్ని ఆరాధించడానికి శాయశక్తులా కృషిచేశారు. యాకోబుకున్న ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే, ఆయన పెద్ద అన్నయ్య యేసు పెరిగాక వాగ్దాన మెస్సీయ అయ్యాడు. నిజంగా యాకోబు ఎంత మంచి కుటుంబంలో పెరిగాడో కదా!

యేసుతో కలిసి పెరుగుతున్నప్పుడు, యాకోబు తన అన్న గురించి ఎక్కువ తెలుసుకున్నాడు (2వ పేరా చూడండి)

2. యాకోబు తన అన్న మీద ఇష్టాన్ని, గౌరవాన్ని పెంచుకోవడానికి ఎలాంటి కారణాలున్నాయి?

2 యాకోబు తన అన్న మీద ఇష్టాన్ని, గౌరవాన్ని పెంచుకోవడానికి చాలా కారణాలున్నాయి. (మత్త. 13:55) ఉదాహరణకు, యేసుకు 12 ఏళ్లు ఉన్నప్పుడు లేఖనాలు ఎంత బాగా తెలుసంటే, ఆయన మాటల్ని విన్న యెరూషలేములోని బోధకులు ఆశ్చర్యపోయారు. (లూకా 2:46, 47) యాకోబు యేసుతో కలిసి వడ్రంగి పని చేసుంటాడు. అదే నిజమైతే, అతను తన అన్న గురించి ఎక్కువ విషయాలు తెలుసుకొని ఉంటాడు. సహోదరుడు నేథన్‌ హెచ్‌. నార్‌ ఎప్పుడూ ఈ మాట చెప్తుండేవాడు, “మీరు ఒక వ్యక్తితో కలిసి పనిచేస్తే అతని గురించి ఎక్కువ తెలుసుకుంటారు.” * కాబట్టి ‘యేసు పెరిగి పెద్దవాడౌతూ, ఇంకా తెలివిగలవాడిగా తయారవ్వడం, అంతకంతకూ దేవుని దయను, మనుషుల దయను పొందడం’ యాకోబు చూసుంటాడు. (లూకా 2:52) ఈ కారణాల్నిబట్టి యేసు మొదటి శిష్యుల్లో యాకోబు కూడా ఉండి ఉంటాడని మనం అనుకోవచ్చు. కానీ అలా జరగలేదు.

3. యేసు పరిచర్యను మొదలుపెట్టినప్పుడు యాకోబు ఎలా స్పందించాడు?

3 యేసు ఈ భూమ్మీద పరిచర్య చేస్తున్నప్పుడు యాకోబు ఆయనకు శిష్యుడు అవ్వలేదు. (యోహా. 7:3-5) నిజానికి యేసుకు “పిచ్చి పట్టింది” అని మాట్లాడిన బంధువుల్లో యాకోబు కూడా ఉండివుంటాడు. (మార్కు 3:21) అంతేకాదు యేసును హింసాకొయ్యమీద వేలాడదీసినప్పుడు, యాకోబు తన తల్లియైన మరియతో పాటు అక్కడ ఉన్నాడని లేఖనాలు చెప్పట్లేదు.—యోహా. 19:25-27.

4. ఈ ఆర్టికల్‌లో మనమేం నేర్చుకుంటాం?

4 కొంతకాలానికి యాకోబు యేసుమీద విశ్వాసముంచాడు అలాగే సంఘంలో పెద్దగా సేవచేశాడు. ఈ ఆర్టికల్‌లో యాకోబు ఆదర్శం నుండి (1) మనం వినయంగా ఎందుకుండాలో, (2) నైపుణ్యంగల బోధకులుగా ఎలా ఉండవచ్చో నేర్చుకుంటాం.

యాకోబులా వినయంగా ఉండండి

యేసు పునరుత్థానం అయ్యాక తనకు కనిపించినప్పుడు ఆయనే మెస్సీయ అని యాకోబు వినయంగా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత యాకోబు నమ్మకమైన క్రీస్తు శిష్యుడయ్యాడు (5-7 పేరాలు చూడండి)

5. యేసు పునరుత్థానమై యాకోబుకు కనిపించిన తర్వాత ఏం జరిగింది?

5 యాకోబు ఎప్పుడు యేసు శిష్యుడయ్యాడు? యేసు పునరుత్థానమైన తర్వాత “యాకోబుకు, ఆ తర్వాత అపొస్తలులందరికీ కనిపించాడు.” (1 కొరిం. 15:7) అలా యేసును కలిసిన తర్వాత యాకోబు ఆయనకు శిష్యుడయ్యాడు. యెరూషలేములోని మేడగదిలో పవిత్రశక్తి కోసం ఎదురుచూసిన అపొస్తలులతోపాటు యాకోబు కూడా ఉన్నాడు. (అపొ. 1:13, 14) ఆ తర్వాత పరిపాలక సభ సభ్యునిగా కూడా యాకోబు సేవచేశాడు. (అపొ. 15:6, 13-22; గల. 2:9) అలాగే క్రీ.శ. 62 ముందు, దేవుని ప్రేరణతో అతను అభిషిక్త క్రైస్తవులకు ఉత్తరం రాశాడు. మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా ఆ ఉత్తరం నుండి మనం కూడా ప్రయోజనం పొందవచ్చు. (యాకో. 1:1) మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన జోసిఫస్‌ రాసినట్టు, యూదా ప్రధాన యాజకుడైన అన్నా కుమారుడు అనన్యా ఆజ్ఞాపించడంతో యాకోబును చంపేశారు. అతను చనిపోయేవరకు యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు.

6. యాకోబుకు, ఆ కాలంలోని మతనాయకులకు తేడా ఏంటి?

6 యాకోబు వినయంగల వ్యక్తి. అదెలా చెప్పొచ్చు? యేసు దేవుని కుమారుడనే స్పష్టమైన రుజువును యాకోబు చూసినప్పుడు, అతను దాన్ని వెంటనే ఒప్పుకున్నాడు. కానీ యెరూషలేములోని ముఖ్య యాజకులు మాత్రం ఒప్పుకోలేదు. ఉదాహరణకు యేసు లాజరును తిరిగి బ్రతికించాడనే వాస్తవాన్ని వాళ్లు కాదనకపోయినా యేసును, లాజరును చంపాలని చూశారు. (యోహా. 11:53; 12:9-11) ఆ తర్వాత, యేసు పునరుత్థానమైనప్పుడు ఆ వాస్తవాన్ని దాయడానికి వాళ్లు ప్రయత్నించారు. (మత్త. 28:11-15) మతనాయకులు గర్వంవల్ల మెస్సీయను అంగీకరించలేదు.

7. మనకెందుకు గర్వం ఉండకూడదు?

7 పాఠం: గర్వాన్ని చూపించకండి, యెహోవా నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. గుండె జబ్బు వల్ల ఒకవ్యక్తి గుండె ఎలాగైతే సరిగ్గా పని చేయదో, అలాగే ఒకవ్యక్తి హృదయంలో గర్వం ఉంటే యెహోవా నిర్దేశానికి అతను లోబడడం కష్టమౌతుంది. పరిసయ్యులు ఎంత గర్విష్ఠులుగా తయారయ్యారంటే యేసుకు దేవుని పవిత్రశక్తి సహాయం ఉందని, ఆయన దేవుని కుమారుడని స్పష్టమైన రుజువులున్నా ఆయన్ని నమ్మలేదు. (యోహా. 12:37-40) వాళ్లు గర్వంవల్ల శాశ్వత జీవితాన్ని కోల్పోయారు. (మత్త. 23:13, 33) దేవుని వాక్యం అలాగే ఆయన శక్తి మన వ్యక్తిత్వాన్ని మలిచేలా, మన ఆలోచనల్నీ నిర్ణయాల్నీ ప్రభావితం చేసేలా మనం అనుమతిస్తూ ఉండాలి. (యాకో. 3:17) యాకోబుకు వినయం ఉంది కాబట్టి యెహోవా నుండి నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు ఆ వినయంవల్లే అతను నైపుణ్యంగల బోధకుడయ్యాడు.

యాకోబులా నైపుణ్యంగా బోధించండి

8. నైపుణ్యంగల బోధకులుగా తయారవ్వడానికి మనకేది సహాయం చేస్తుంది?

8 యాకోబు పెద్దగా చదువుకోలేదు. ఆ కాలంలోని మతనాయకులు అపొస్తలులైన పేతురు, యోహానులను ‘చదువుకోని సామాన్యులుగా’ చూసినట్టే యాకోబును కూడా చూశారు. (అపొ. 4:13) కానీ యాకోబు నైపుణ్యంగల బోధకుడని అతను రాసిన బైబిలు పుస్తకం చదివితే తెలుస్తుంది. యాకోబులాగే మనం కూడా అంతగా చదువుకొని ఉండకపోవచ్చు. అయినప్పటికీ యెహోవా పవిత్రశక్తి ద్వారా, ఆయన సంస్థ ఇస్తున్న శిక్షణ ద్వారా మనం కూడా నైపుణ్యంగల బోధకులుగా తయారవ్వొచ్చు. ఒక మంచి బోధకుడిగా యాకోబు ఉంచిన ఆదర్శాన్ని పరిశీలిస్తూ మనమేం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

9. యాకోబు ఎలా బోధించేవాడు?

9 యాకోబు కష్టమైన పదాల్ని ఉపయోగించలేదు, పెద్దపెద్ద వివరణల్ని ఇవ్వలేదు. దానివల్ల అతని బోధల్ని విన్నవాళ్లు ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థంచేసుకున్నారు. ఉదాహరణకు, క్రైస్తవులకు అన్యాయం ఎదురైతే వాళ్లు కోపాన్ని పెంచుకోకుండా సహించాలని తేలిగ్గా అర్థమయ్యేలా బోధించాడు. అతనిలా చెప్పాడు: “మనం, సహించినవాళ్లను ధన్యులని అంటాం. మీరు యోబు సహనం గురించి విన్నారు, యెహోవా అతన్ని ఎలా ఆశీర్వదించాడో మీకు తెలుసు. యెహోవా ఎంతో వాత్సల్యం గలవాడని, కరుణామయుడని మీరు తెలుసుకున్నారు.” (యాకో. 5:11) యాకోబు లేఖనాల ఆధారంగా బోధించాడని గమనించండి. యోబులా విశ్వసనీయంగా ఉండేవాళ్లను యెహోవా ఎప్పుడూ ఆశీర్వదిస్తాడని యాకోబు లేఖనాల్ని ఉపయోగించి బోధించాడు. అతను ఆ విషయాన్ని తేలికైన పదాల్ని ఉపయోగించి వివరించాడు. అలా వినేవాళ్ల అవధానాన్ని తనవైపు కాకుండా యెహోవావైపు మళ్లించాడు.

10. బోధించేటప్పుడు మనం యాకోబును ఎలా అనుకరించవచ్చు?

10 పాఠం: తేలికైన పదాల్ని ఉపయోగించి దేవుని వాక్యం నుండి బోధించండి. ఇతరులకు బోధిస్తున్నప్పుడు, మనకు ఎంత జ్ఞానం ఉందో చూపించుకోవడానికి ప్రయత్నించకూడదు. బదులుగా యెహోవాకు ఎక్కువ జ్ఞానం ఉందని, ఆయనకు వాళ్లపట్ల ఎంతో శ్రద్ధ ఉందని అర్థమయ్యేలా చెప్పాలి. (రోమా. 11:33) అలా చేయాలంటే మనమెప్పుడూ బైబిలు ఆధారంగానే బోధించాలి. ఉదాహరణకు బైబిలు విద్యార్థుల స్థానంలో మనం ఉంటే ఏం చేస్తామో చెప్పే బదులు, బైబిలు ఉదాహరణల్ని ఆలోచించడానికి అలాగే యెహోవా ఆలోచనల్ని, భావాల్ని అర్థంచేసుకోవడానికి వాళ్లకు సహాయం చేయాలి. అప్పుడు మనల్ని కాకుండా యెహోవాను సంతోషపెట్టాలనే ఉద్దేశంతో వాళ్లు నేర్చుకున్నదాన్ని పాటిస్తారు.

11. (ఎ) యాకోబు జీవించిన కాలంలో కొంతమంది క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉండేది? (బి) అలాంటివాళ్లకు అతను ఏ సలహా ఇచ్చాడు? (యాకోబు 5:13-15)

11 యాకోబు తోటి సహోదరసహోదరీల్ని అర్థంచేసుకున్నాడు. వాళ్లకున్న సవాళ్ల గురించి యాకోబుకు తెలుసని అతను రాసిన ఉత్తరం నుండి అర్థమౌతుంది. ఆ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడానికి వాళ్లేం చేయాలో అతను స్పష్టమైన నిర్దేశాల్ని ఇచ్చాడు. ఉదాహరణకు కొంతమంది క్రైస్తవులు సలహాను వెంటనే పాటించలేదు. (యాకో. 1:22) ఇంకొంతమంది పేదవాళ్ల పట్ల పక్షపాతం చూపించారు. (యాకో. 2:1-3) మరికొంతమంది నాలుకను అదుపు చేసుకోలేదు. (యాకో. 3:8-10) ఆ క్రైస్తవులకు అలాంటి పెద్ద సవాళ్లున్నా వాళ్లు మారతారని యాకోబు నమ్మాడు. వాళ్లేం చేయాలో అతను దయగా, సూటిగా చెప్పాడు. మార్పులు చేసుకోవడానికి కష్టంగా ఉన్నవాళ్లకు సంఘపెద్దల సహాయం తీసుకోమని సలహా ఇచ్చాడు.—యాకోబు 5:13-15 చదవండి.

12. బైబిలు విద్యార్థులకు సహాయం చేస్తున్నప్పుడు ఏ ఆశతో ఉండొచ్చు?

12 పాఠం: ఇతరుల్ని అర్థంచేసుకుంటూ, వాళ్లు మార్పులు చేసుకుంటారనే నమ్మకంతో ఉండండి. బైబిలు స్టడీ తీసుకుంటున్న చాలామందికి నేర్చుకుంటున్న వాటిని పాటించడం కష్టంగా ఉంటుంది. (యాకో. 4:1-4) వాళ్లు చెడు అలవాట్లను మానేసి, క్రైస్తవ లక్షణాల్ని వృద్ధిచేసుకోవడానికి సమయం పట్టొచ్చు. యాకోబులాగే మనం కూడా, మన బైబిలు విద్యార్థులు ఏయే విషయాల్లో మార్పులు చేసుకోవాలో ధైర్యంగా చెప్పాలి. అలాగే యెహోవా వినయంగల వాళ్లను తనవైపు ఆకర్షిస్తాడని, వాళ్లు మార్పులు చేసుకోవడానికి సహాయం చేస్తాడని నమ్ముతూ వాళ్లమీద ఆశ వదులుకోకుండా ఉందాం.—యాకో. 4:10.

13. యాకోబు 3:2 చెప్తున్నట్టు, అందరూ ఏం చేస్తారని యాకోబు గుర్తించాడు?

13 యాకోబు ఇతరులకన్నా తానే గొప్ప అని అనుకోలేదు. తాను యేసు తమ్ముడ్ని కాబట్టి, తనకు ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇతర క్రైస్తవులకన్నా తానే గొప్ప అని యాకోబు అనుకోలేదు. అతను తోటి క్రైస్తవుల్ని “నా ప్రియ సహోదరులారా” అని పిలిచాడు. (యాకో. 1:16, 19; 2:5) తాను పరిపూర్ణుడు అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించలేదు. బదులుగా తనను కూడా కలుపుకుంటూ “మనందరం తరచూ పొరపాట్లు చేస్తుంటాం” అని అన్నాడు.—యాకోబు 3:2 చదవండి.

14. మనం కూడా తప్పులు చేస్తామని నిజాయితీగా ఎందుకు ఒప్పుకోవాలి?

14 పాఠం: మనందరం పాపులమని గుర్తుంచుకోవాలి. మన బైబిలు విద్యార్థుల కన్నా మనమే గొప్ప అని ఎప్పుడూ అనుకోకూడదు. ఒకవేళ మనమలా అనుకొని, బైబిలు విద్యార్థుల ముందు ఏ తప్పు చేయమన్నట్లు ప్రవర్తిస్తే, దేవుడు కోరేవాటిని వాళ్లు ఎప్పటికీ చేయలేమని నిరుత్సాహపడొచ్చు. కాబట్టి లేఖన సూత్రాల్ని పాటించడం కొన్నిసార్లు మనకు కూడా కష్టమైందని నిజాయితీగా ఒప్పుకోవచ్చు. అలాగే మార్పులు చేసుకోవడానికి యెహోవా మనకెలా సహాయం చేశాడో వివరించొచ్చు. అప్పుడు బైబిలు విద్యార్థులు తాము కూడా యెహోవాను సేవించగలమని అర్థంచేసుకుంటారు.

యాకోబు చెప్పిన ఉదాహరణలు తేలిగ్గా అర్థమయ్యేలా, స్పష్టంగా, ప్రజల హృదయాల్ని తాకేలా ఉన్నాయి (15-16 పేరాలు చూడండి) *

15. యాకోబు ఎలాంటి ఉదాహరణల్ని ఉపయోగించాడు? వివరించండి. (యాకోబు 3:2-6, 10-12)

15 యాకోబు ప్రజల హృదయాల్ని తాకే ఉదాహరణలు చెప్పాడు. ఆ విషయంలో అతనికి ఖచ్చితంగా పవిత్రశక్తి సహాయం చేసింది. అంతేకాదు తన అన్న అయిన యేసు ఉపయోగించిన ఉదాహరణల్ని అతను అధ్యయనం చేయడంవల్ల, ఎలా బోధించాలో ఇంకా ఎక్కువ నేర్చుకుని ఉంటాడు. యాకోబు తన ఉత్తరంలో ఉపయోగించిన ఉదాహరణలు తేలిగ్గా అర్థమయ్యేలా ఉన్నాయి అలాగే వాటినుండి ఏం నేర్చుకోవచ్చో స్పష్టంగా ఉంది.—యాకోబు 3:2-6, 10-12 చదవండి.

16. ప్రజల హృదయాల్ని తాకే ఉదాహరణల్ని మనమెందుకు ఉపయోగించాలి?

16 పాఠం: ప్రజల హృదయాల్ని తాకే ఉదాహరణల్ని ఉపయోగించండి. మనం సరైన ఉదాహరణల్ని ఉపయోగించినప్పుడు, మనం చెప్పే విషయాల్ని ప్రజలు ఊహించుకోగలుగుతారు. దానివల్ల వాళ్లు బైబిల్లోని ముఖ్యమైన సత్యాలను గుర్తుపెట్టుకుంటారు. ప్రజల హృదయాల్ని తాకే ఉదాహరణల్ని ఉపయోగించడంలో యేసుకు ఎంతో నైపుణ్యం ఉంది. ఈ విషయంలో యాకోబు యేసును అనుకరించాడు. అతను ఉపయోగించిన ఒక ఉదాహరణను ఇప్పుడు పరిశీలిద్దాం.

17. యాకోబు 1:22-25 లో ఉన్న అద్దం ఉదాహరణ, ఏ కారణాల్నిబట్టి ప్రజల హృదయాల్ని తాకేలా ఉంది?

17 యాకోబు 1:22-25 చదవండి. యాకోబు అద్దం గురించి చెప్పిన ఉదాహరణ, ప్రజల హృదయాల్ని తాకేలా ఉందనడానికి ఎన్నో కారణాలున్నాయి. అతను ఆ ఉదాహరణ ద్వారా ఒక ముఖ్యమైన పాఠం నేర్పించాడు. అదేంటంటే మనం దేవుని వాక్యం నుండి ప్రయోజనం పొందాలంటే, దాన్ని చదవడంతోపాటు పాటించడం కూడా చాలా ప్రాముఖ్యం. తన కాలంలోని చాలామందికి అద్దం గురించి తెలుసు, కాబట్టి యాకోబు ఆ ఉదాహరణను ఉపయోగించాడు. అతను ఏం చెప్పాలనుకున్నాడు? ఒక వ్యక్తి అద్దంలో తనను చూసుకొని ముఖంమీద ఏదైన ఉందని గమనించి, దాన్ని సరిచేసుకోకపోతే లేదా తుడుచుకోకపోతే అది తెలివితక్కువతనం అవుతుంది. అదేవిధంగా మనం బైబిల్ని చదివినప్పుడు మనలో ఏదైనా మార్పు చేసుకోవాలని గమనించి, దాన్ని చేసుకోకపోతే అది తెలివితక్కువతనం అవుతుంది.

18. మనం ఉదాహరణల్ని ఉపయోగిస్తున్నప్పుడు ఏ మూడు పనుల్ని చేయాలి?

18 మనం ఒక ఉదాహరణ చెప్తున్నప్పుడు మూడు పనులు చేయడం ద్వారా యాకోబును అనుకరించవచ్చు. (1) చర్చిస్తున్న విషయానికి సరిపోయే ఉదాహరణను ఉపయోగించాలి. (2) వినేవాళ్లకు తేలిగ్గా అర్థమయ్యే ఉదాహరణ ఉపయోగించాలి. (3) నేర్పించాలనుకునే పాఠం స్పష్టంగా ఉండాలి. సరైన ఉదాహరణల్ని వెదకడానికి వాచ్‌ టవర్‌ పబ్లికేషన్‌ ఇండెక్స్‌ (ఇంగ్లీష్‌) చూడొచ్చు. “ఉదాహరణలు” (illustrations) శీర్షిక కింద మనకు కావాల్సినన్ని దొరుకుతాయి. ఉదాహరణలు మైక్‌ లాంటివి. ఏలాగైతే మైకులో మాట్లాడడంవల్ల మన స్వరం గట్టిగా వినిపిస్తుందో, అలాగే ఉదాహరణలతో బోధించడం వల్ల మనం నేర్పించాలనుకునే పాఠం బాగా అర్థమౌతుంది. అందుకే, ముఖ్యమైన విషయాల్ని చెప్పడానికి మాత్రమే ఉదాహరణల్ని ఉపయోగించడం మంచిది. మనం బోధనా నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవాలని కోరుకుంటాం. ఎందుకంటే వినేవాళ్ల అవధానాన్ని మనవైపు మళ్లించుకోవడానికి కాదుగానీ, సాధ్యమైనంత ఎక్కువమంది యెహోవా కుటుంబంలోకి వచ్చేలా సహాయం చేయడానికే.

19. సహోదరసహోదరీల్ని ప్రేమిస్తున్నామని మనమెలా చూపిస్తాం?

19 యాకోబు పరిపూర్ణుడైన యేసుతో కలిసి పెరిగాడు. అయితే మనకు అలాంటి అవకాశం లేకపోయినా, క్రైస్తవ సహోదరసహోదరీల పెద్ద కుటుంబంతో కలిసి యెహోవాను సేవించే అవకాశముంది. వాళ్లతో సమయం గడపడం ద్వారా, వాళ్లనుండి నేర్చుకోవడం ద్వారా అలాగే వాళ్లతో కలిసి నమ్మకంగా ప్రకటనాపని, బోధనాపని చేయడం ద్వారా వాళ్లను ప్రేమిస్తున్నామని చూపించవచ్చు. మన ఆలోచనాతీరులో, ప్రవర్తనలో, బోధనా విధానంలో యాకోబు ఆదర్శాన్ని అనుకరిద్దాం. అలాచేస్తే యెహోవాకు మహిమ తెస్తాం అలాగే ఆయనకు దగ్గరయ్యేలా యథార్థ హృదయంగల ప్రజలకు సహాయం చేస్తాం.

పాట 114 ఓర్పు చూపించండి

^ యాకోబు, యేసు ఒకే కుటుంబంలో పెరిగారు. ఆ కాలంలోని చాలామంది ప్రజలకన్నా దేవుని పరిపూర్ణ కుమారుని గురించి యాకోబుకు ఎక్కువ తెలుసు. యేసు తమ్ముడైన యాకోబు మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాన్ని నడిపించిన సహోదరుల్లో ఒకడు. ఈ ఆర్టికల్‌లో ఆయన జీవితం నుండి అలాగే ఆయన బోధల నుండి మనమేం నేర్చుకోవచ్చో పరిశీలిస్తాం.

^ సహోదరుడు నేథన్‌ హెచ్‌. నార్‌ పరిపాలక సభ సభ్యునిగా సేవచేశాడు. 1977లో ఆయన తన భూజీవితాన్ని ముగించాడు.

^ చిత్రాల వివరణ: నాలుకను అదుపులో పెట్టుకోకపోతే వచ్చే ప్రమాదం గురించి చెప్పడానికి యాకోబు చిన్న నిప్పు ఉదాహరణను ఉపయోగించాడు. అది మంచి ఉదాహరణ, ఎందుకంటే చిన్న నిప్పు గురించి అందరికీ తెలుసు.