కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 3

యేసు పెట్టుకున్న కన్నీళ్ల నుండి నేర్చుకునే పాఠాలు

యేసు పెట్టుకున్న కన్నీళ్ల నుండి నేర్చుకునే పాఠాలు

“యేసు కన్నీళ్లు పెట్టుకున్నాడు.”—యోహా. 11:35.

పాట 17 “నాకు ఇష్టమే”

ఈ ఆర్టికల్‌లో . . . *

1-3. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఏడుస్తాం?

 చివరిసారిగా మీరు ఎప్పుడు ఏడ్చారు? కొన్నిసార్లు మనం సంతోషంతో ఏడుస్తాం, కానీ ఎక్కువసార్లు బాధతో ఏడుస్తాం. ఉదాహరణకు, మనకు ఇష్టమైనవాళ్లు చనిపోతే ఏడుస్తాం. అమెరికాలో ఉంటున్న లోరీ అనే సహోదరి ఇలా రాసింది: “నా కూతురు చనిపోయిందనే బాధ కొన్నిసార్లు నాకెంత ఎక్కువగా ఉండేదంటే, నన్ను ఏది ఓదార్చలేదని అనిపించేది. ఆ సమయంలో నా బాధను తట్టుకోలేనని అనుకున్నాను.” *

2 మనం ఇతర కారణాలవల్ల కూడా ఏడుస్తాం. జపాన్‌లో ఉంటున్న హీరొమీ అనే పయినీరు సహోదరి ఇలా అంది: “పరిచర్యలో నేను చెప్పేది ప్రజలు కొన్నిసార్లు వినకపోతే నాకు బాధ కలుగుతుంది. ఇంకొన్నిసార్లయితే, సత్యం కోసం వెదికేవాళ్లను కనుగొనేలా సహాయం చేయమని నేను ఏడుస్తూ యెహోవాను వేడుకునేదాన్ని.”

3 ఆ సహోదరీల్లాగే మీకూ అనిపిస్తుందా? మనలో చాలామందికి అలా అనిపించవచ్చు. (1 పేతు. 5:9) మనం ‘సంతోషంతో యెహోవాను సేవించాలని’ కోరుకుంటాం. కానీ మనకు ఇష్టమైనవాళ్లు చనిపోవడంవల్ల, నిరుత్సాహంవల్ల, మన విశ్వాసాన్ని పరీక్షించే ఏదైనా కష్టమైన పరిస్థితి వల్ల మనం కన్నీళ్లతో దేవుని సేవ చేస్తుండవచ్చు. (కీర్త. 6:6; 100:2) అలాంటప్పుడు ఏం చేయవచ్చు?

4. ఈ ఆర్టికల్‌లో మనమేం పరిశీలిస్తాం?

4 యేసు ఉదాహరణ నుండి మనమెంతో నేర్చుకోవచ్చు. ఆయనకు కూడా ‘కన్నీళ్లు పెట్టుకునే’ పరిస్థితులు కొన్ని వచ్చాయి. (యోహా. 11:35; లూకా 19:41; 22:44; హెబ్రీ. 5:7) ఆ పరిస్థితుల్ని గమనిస్తూ, యేసు అలాగే యెహోవా గురించి మనమేం నేర్చుకోవచ్చో చూద్దాం. అలాంటి పరిస్థితులు మనకెదురైతే ఏం చేయవచ్చో కూడా చూద్దాం.

యేసు తన స్నేహితుల కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు

బాధపడుతున్నవాళ్లను యేసులాగే ఓదార్చండి (5-9 పేరాలు చూడండి) *

5. యోహాను 11:32-36 వచనాల నుండి యేసు గురించి ఏం నేర్చుకుంటాం?

5 క్రీ.శ. 32 చలికాలంలో, యేసు స్నేహితుడైన లాజరు జబ్బు చేసి చనిపోయాడు. (యోహా. 11:3, 14) లాజరుకు మరియ, మార్త అనే ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆ కుటుంబాన్ని యేసు ఎంతో ప్రేమించాడు. లాజరు చనిపోయినందుకు అతని ఇద్దరు అక్కలు ఎంతో బాధపడ్డారు. అది జరిగిన నాలుగు రోజులకు, యేసు ఆ కుటుంబం ఉంటున్న బేతనియ అనే గ్రామానికి వెళ్లాడు. యేసు వస్తున్నాడని తెలియగానే మార్త వెంటనే ఆయన్ని కలవడానికి వెళ్లింది. అప్పుడామె యేసుతో ఇలా అంది: “ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండివుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు.” (యోహా. 11:21) ఆ మాటల్నిబట్టి ఆమె ఎంత బాధలో ఉందో ఊహించండి. ఆ తర్వాత ఏడుస్తున్న మరియను, ఇతరుల్ని చూసినప్పుడు యేసు “కన్నీళ్లు పెట్టుకున్నాడు.”—యోహాను 11:32-36 చదవండి.

6. లాజరు చనిపోయినప్పుడు యేసు ఎందుకు ఏడ్చాడు?

6 ఆ సందర్భంలో యేసు ఎందుకు ఏడ్చాడు? దానిగురించి లేఖనాలపై అంతర్దృష్టి (ఇంగ్లీష్‌) ఇలా చెప్తుంది: “తన స్నేహితుడైన లాజరు చనిపోవడం, దానివల్ల అతని అక్కలు బాధపడడం చూసినప్పుడు యేసు ‘లోలోపల మూలిగాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు.’” * తన స్నేహితుడైన లాజరు అనారోగ్యంవల్ల ఎంత బాధపడ్డాడో యేసు ఆలోచించి ఉంటాడు. ఇంకొన్ని క్షణాల్లో తన ప్రాణం పోతుందని లాజరుకు తెలిసినప్పుడు, అతనికి ఎలా అనిపించివుంటుందో యేసు ఊహించి ఉంటాడు. తమ తమ్ముడు చనిపోవడంవల్ల మరియ, మార్త ఎంత బాధపడుతున్నారో చూసినప్పుడు కూడా యేసుకు కన్నీళ్లు వచ్చుంటాయి. మీ దగ్గరి స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు చనిపోతే మీరు కూడా యేసులానే బాధపడివుంటారు. ఈ సందర్భం నుండి మనం నేర్చుకోగల మూడు విషయాల్ని ఇప్పుడు చూద్దాం.

7. యేసు కన్నీళ్ల నుండి యెహోవా గురించి ఏం నేర్చుకోవచ్చు?

7 యెహోవా మీ భావాల్ని అర్థంచేసుకుంటాడు. యేసు తన తండ్రికి “అచ్చమైన ప్రతిరూపం.” (హెబ్రీ. 1:3) మనకు ఇష్టమైనవాళ్లు ఎవరైనా చనిపోతే యెహోవాకు ఎలా అనిపిస్తుందో యేసు పెట్టుకున్న కన్నీళ్ల నుండి మనకు అర్థమౌతుంది. (యోహా. 14:9) ఒకవేళ మీకు ఇష్టమైనవాళ్లు ఎవరైనా చనిపోతే యెహోవా మీ బాధను చూడడమే కాదు, ఆయన కూడా బాధపడతాడు. అంతేకాదు, విరిగిన మీ హృదయాన్ని బాగుచేయాలని ఆయన కోరుకుంటున్నాడు.—కీర్త. 34:18; 147:3.

8. చనిపోయిన మనకిష్టమైన వాళ్లను యేసు తిరిగి లేపుతాడని మనమెందుకు నమ్మకంతో ఉండవచ్చు?

8 చనిపోయిన మీకిష్టమైన వాళ్లను తిరిగి లేపాలని యేసు కోరుకుంటున్నాడు. యేసు ఏడ్వడానికి కాస్త ముందు మార్తతో, “నీ సహోదరుడు లేస్తాడు” అని హామీ ఇచ్చాడు. (యోహా. 11:23-27) మార్త దేవుని నమ్మకమైన సేవకురాలు కాబట్టి, కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్తలైన ఏలీయా, ఎలీషా చనిపోయినవాళ్లను తిరిగి లేపారని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. (1 రాజు. 17:17-24; 2 రాజు. 4:32-37) యేసు కూడా చనిపోయినవాళ్లను తిరిగి లేపాడని ఆమె వినివుంటుంది. (లూకా 7:11-15; 8:41, 42, 49-56) మీరు కూడా చనిపోయిన మీకిష్టమైన వాళ్లను తిరిగి చూస్తారనే నమ్మకంతో ఉండవచ్చు. బాధలోవున్న తన స్నేహితుల్ని ఓదారుస్తూ యేసు పెట్టుకున్న కన్నీళ్ల నుండి మనమేం నేర్చుకుంటాం? ఆయనకు చనిపోయినవాళ్లను తిరిగి లేపడం ఇష్టమని నేర్చుకుంటాం.

9. బాధలో ఉన్నవాళ్లకు యేసులా మీరెలా సహాయం చేయవచ్చో ఒక ఉదాహరణ చెప్పండి.

9 బాధలో ఉన్నవాళ్లకు మీరు సహాయం చేయవచ్చు. మార్త, మరియలతో పాటు యేసు ఏడ్వడమే కాదు వాళ్లు చెప్పేది విన్నాడు, వాళ్లను ఓదార్చాడు. మనం కూడా అలాగే చేయవచ్చు. ఆస్ట్రేలియాలో ఉంటున్న డాన్‌ అనే ఒక సంఘపెద్ద ఇలా అంటున్నాడు: “నా భార్య చనిపోయాక నాకు సహాయం అవసరమైంది. చాలామంది సహోదరులు వాళ్ల భార్యలతో కలిసి, నేను చెప్పేది వినడానికి ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండేవాళ్లు. నేను ఏడుస్తున్నప్పుడు వాళ్లు నన్ను తప్పుగా అనుకోలేదు. నా అంతట నేను పనులు చేసుకోలేనని అనిపించిన సమయంలో వాళ్లు నా కారు కడిగారు, సరుకులు తెచ్చారు, వంటచేసి పెట్టారు. అలాగే వాళ్లు నాతో కలిసి తరచూ ప్రార్థించారు. ఆ పరిస్థితుల్లో వాళ్లు నిజమైన స్నేహితుల్లా, ‘కష్టకాలంలో’ సహోదరుల్లా ఉన్నారు.”—సామె. 17:17.

ప్రజల కోసం యేసు కన్నీళ్లు పెట్టుకున్నాడు

10. యేసు కన్నీళ్లు పెట్టుకున్న రెండో సందర్భాన్ని వివరించండి. (లూకా 19:36-40)

10 క్రీ.శ. 33, నీసాను 9న యేసు యెరూషలేముకు వచ్చాడు. ఆయన నగరంలోకి వస్తుండగా ప్రజలు ఒక గుంపుగా చేరి, ఆయన్ని రాజుగా అంగీకరిస్తూ తమ వస్త్రాలను దారిపొడవునా పరిచారు. అది నిజంగా ఒక సంతోషకరమైన సందర్భం. (లూకా 19:36-40 చదవండి.) ఆ తర్వాత శిష్యులు ఊహించనిది జరిగింది. ‘[యేసు] యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు, ఆ నగరాన్ని చూసి, దాని గురించి ఏడ్చాడు.’ అలాగే ఆ నగరంలోని ప్రజలకు జరగబోయే ఘోరమైన విషయాల గురించి వాళ్లకు చెప్పాడు.—లూకా 19:41-44.

11. యెరూషలేములో ఉన్న ప్రజల గురించి యేసు ఎందుకు ఏడ్చాడు?

11 యేసును ప్రజలు సంతోషంగా ఆహ్వానించినా, తాను చెప్పేది యూదుల్లో చాలామంది వినరని ఆయనకు తెలుసు కాబట్టి బాధపడ్డాడు. వాళ్లు అలా నిరాకరించడం వల్ల యెరూషలేము నాశనం చేయబడుతుంది. అలాగే ప్రాణాలతో మిగిలిన యూదులు బందీలుగా తీసుకెళ్లబడతారు. (లూకా 21:20-24) విచారకరంగా, యేసు ఊహించినట్టే చాలామంది ఆయన్ని నిరాకరించారు. మీ ప్రాంతంలోని ప్రజలు మంచివార్తను వింటారా? ఒకవేళ ఎక్కువమంది వినకపోతే, ప్రజల కోసం యేసు పెట్టుకున్న కన్నీళ్ల నుండి మనం ఏ మూడు పాఠాల్ని నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

12. ప్రజల గురించి యేసు పెట్టుకున్న కన్నీళ్లు, యెహోవా గురించి ఏం నేర్పిస్తున్నాయి?

12 యెహోవాకు ప్రజల మీద శ్రద్ధ ఉంది. యేసు పెట్టుకున్న కన్నీళ్లు ప్రజలమీద యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో గుర్తుచేస్తున్నాయి. “ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.” (2 పేతు. 3:9) నేడు మనకు కూడా యెహోవాలాగే ప్రజలమీద శ్రద్ధ ఉంది. అందుకే వాళ్లకు మంచివార్త ప్రకటించడానికి కృషిచేస్తూ వాళ్లమీద ప్రేమ ఉందని చూపిస్తాం.—మత్త. 22:39.

ప్రజలకు అనుకూలమైన సమయాల్లో ప్రకటించడానికి యేసులాగే మార్పులు చేసుకోండి (13, 14 పేరాలు చూడండి) *

13-14. యేసు ప్రజలమీద కనికరాన్ని ఎలా చూపించాడు? మనం కూడా కనికరాన్ని ఎలా చూపించవచ్చు?

13 యేసు ప్రకటించడానికి ఎంతో కృషిచేశాడు. తనకు దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయన ప్రజలకు బోధించడం ద్వారా ప్రేమను చూపించాడు. (లూకా 19:47, 48) యేసుకు కనికరం ఉంది కాబట్టే అలా చేశాడు. కొన్నిసార్లు ఆయన మాటల్ని వినడానికి చాలామంది రావడంవల్ల యేసుకు, ఆయన శిష్యులకు “కనీసం భోజనం చేయడానికి కూడా వీలుకాలేదు.” (మార్కు 3:20) ఒకవ్యక్తి యేసుతో మాట్లాడడానికి రాత్రిపూట వచ్చినప్పుడు, ఆ సమయంలో కూడా అతనితో మాట్లాడడాడు. (యోహా. 3:1, 2) యేసు సందేశం వినిన చాలామంది ఆయన శిష్యులు కాలేదు. అయినా ఆయన మాత్రం పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వడానికి కృషిచేశాడు. నేడు మనం కూడా మంచివార్త వినే అవకాశం అందరికీ దొరకాలని కోరుకుంటాం. (అపొ. 10:42) అలా జరగాలంటే, ప్రకటించే విధానంలో మనం కొన్ని మార్పులు చేసుకోవాలి.

14 అవసరమైన మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మనమెప్పుడూ ఒకే సమయంలో ప్రకటిస్తే, మంచివార్తను తెలుసుకోవాలని కోరుకునే కొంతమందిని కలవలేకపోవచ్చు. మెటిల్డా అనే ఒక పయినీరు సహోదరి ఇలా చెప్తుంది: “నేను, నా భర్త వేర్వేరు సమయాల్లో ప్రకటించడానికి ప్రయత్నిస్తాం. ఉదయం వ్యాపార ప్రాంతంలో ప్రకటిస్తాం. [మా ప్రాంతంలో] మధ్యాహ్న సమయంలో చాలామంది బయట ఉంటారు కాబట్టి కార్టులు పెట్టి ప్రకటిస్తాం. సాయంత్రాలు ప్రజలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంటింటి పరిచర్య చేస్తాం.” దీన్నిబట్టి మన అనుకూల సమయంలో కాకుండా, ప్రజలకు అనుకూలమైన సమయంలో ప్రకటించాలని నేర్చుకుంటాం. అలా చేస్తే మనకు చాలామందిని కలవడం వీలౌతుంది. అంతేకాదు యెహోవా కూడా మనల్ని చూసి ఆనందిస్తాడు.

తండ్రి పేరు గురించి యేసు కన్నీళ్లు పెట్టుకున్నాడు

బాధలో ఉన్నప్పుడు యేసులాగే యెహోవాకు అభ్యర్థనలు చేయండి (15-17 పేరాలు చూడండి) *

15. లూకా 22:39-44 ప్రకారం, నీసాను 14 రాత్రి ఏం జరిగింది?

15 క్రీ.శ. 33, నీసాను 14 రాత్రి యేసు గెత్సేమనే తోటకు వెళ్లాడు. అక్కడ యెహోవాకు ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించాడు. (లూకా 22:39-44 చదవండి.) ఆ కష్ట సమయంలో యేసు, “కన్నీళ్లతో బిగ్గరగా అభ్యర్థనలు . . . చేశాడు.” (హెబ్రీ. 5:7) తాను చనిపోవడానికి ముందురోజు రాత్రి యేసు దేనిగురించి ప్రార్థించాడు? యెహోవాకు నమ్మకంగా ఉండి, ఆయన ఇష్టం చేసేలా తనను బలపర్చమని ప్రార్థించాడు. యేసు ఎంతో తీవ్రంగా చేసిన ప్రార్థనను యెహోవా విన్నాడు. అలాగే తన కుమారుణ్ణి బలపర్చడానికి ఒక దేవదూతను పంపాడు.

16. యేసు ఇంకా ఏ కారణాన్నిబట్టి, గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఏడ్చాడు?

16 ప్రజలు తనపై దైవదూషణ చేశాడనే నింద వేస్తారని యేసుకు తెలుసు కాబట్టి గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఏడ్చాడు. అంతేకాదు చివరివరకు నమ్మకంగా ఉంటూ, తన తండ్రి పేరును పవిత్రపర్చే బరువైన బాధ్యత తనకుందని ఆయనకు తెలుసు. మీ విశ్వాసాన్ని పరీక్షించే ఏదైనా కష్టమైన పరిస్థితిని మీరు ఎదుర్కొంటుంటే, యేసు కన్నీళ్ల నుండి మీరేం నేర్చుకోవచ్చు? మరో మూడు విషయాల్ని ఇప్పుడు చూద్దాం.

17. యేసు చేసిన ప్రార్థనలకు యెహోవా ఎందుకు జవాబిచ్చాడు? దాన్నుండి యెహోవా గురించి మనమేం నేర్చుకుంటాం?

17 యెహోవా మీ అభ్యర్థనల్ని వింటాడు. యేసు మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థనల్ని యెహోవా విన్నాడు. ఎందుకంటే చివరివరకు నమ్మకంగా ఉండి, తన తండ్రి పేరును పవిత్రపర్చడమే యేసు ముఖ్య ఉద్దేశం. మన ముఖ్య ఉద్దేశం కూడా అదే అయినప్పుడు, సహాయం కోసం మనం చేసే ప్రార్థనలకు యెహోవా జవాబిస్తాడు.—కీర్త. 145:18, 19.

18. ఏయే విధాలుగా యేసు అర్థంచేసుకునే స్నేహితుడిలా ఉన్నాడు?

18 యేసు మన భావాల్ని అర్థంచేసుకుంటాడు. మనం బాధలో ఉన్నప్పుడు మనలాంటి సమస్యల్నే ఎదుర్కొని, మనల్ని అర్థంచేసుకునే స్నేహితుడు వచ్చి ఓదారిస్తే మనకు సంతోషంగా ఉంటుంది. యేసు అలాంటి స్నేహితుడిగా ఉన్నాడు. మనకు శక్తి లేనప్పుడు, సహాయం అవసరమైనప్పుడు ఎలా అనిపిస్తుందో ఆయనకు తెలుసు. ఎందుకంటే మనం బలహీనులమని ఆయన అర్థంచేసుకుంటాడు. అలాగే మనకు “సరిగ్గా అవసరమైనప్పుడు” కావాల్సిన సహాయం అందేలా చూస్తాడు. (హెబ్రీ. 4:15, 16 అధస్సూచి) యేసు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఒక దేవదూత సహాయాన్ని అంగీకరించినట్టే, మనం కూడా యెహోవా సహాయాన్ని అంగీకరించాలి. బహుశా ఒక ప్రచురణ ద్వారా, వీడియో ద్వారా, ప్రసంగం ద్వారా, సంఘపెద్ద ద్వారా, పరిణతిగల సహోదరుడు లేదా సహోదరి ద్వారా యెహోవా మనకు సహాయం చేయవచ్చు.

19. యెహోవా మనల్ని ఎలా బలపరుస్తాడు? ఒక ఉదాహరణ చెప్పండి.

19 యెహోవా మీకు శాంతినిస్తాడు. ఆయన మనల్ని ఎలా బలపరుస్తాడు? మనం ప్రార్థించినప్పుడు ‘మానవ అవగాహనకు మించిన దేవుని శాంతిని’ పొందుతాం. (ఫిలి. 4:6, 7) దానివల్ల ప్రశాంతంగా ఉంటాం, సరిగ్గా ఆలోచిస్తాం. ఒక సహోదరి అలాంటి శాంతినే పొందింది. ఆమె ఇలా అంటుంది: “నాకు తరచూ ఒంటరిగా అనిపిస్తుంది. దానివల్ల యెహోవా నన్ను ప్రేమించట్లేదేమో అని కొన్నిసార్లు అనుకునేదాన్ని. అలాంటప్పుడు నాకెలా అనిపించేదో యెహోవాకు వెంటనే చెప్పేదాన్ని. ఆ తర్వాత నా మనసు కుదుటపడేది.” కాబట్టి ప్రార్థిస్తే శాంతిని పొందుతామని ఈ అనుభవం బట్టి అర్థమౌతుంది.

20. యేసు పెట్టుకున్న కన్నీళ్ల నుండి మనం ఏ విషయాలు నేర్చుకున్నాం?

20 యేసు పెట్టుకున్న కన్నీళ్ల నుండి మనం ఓదార్పు పొందాం. అలాగే పాటించదగ్గ కొన్ని విషయాల్ని నేర్చుకున్నాం. బాధలో ఉన్న మన స్నేహితులకు సహాయం చేయాలని, మనకు ఇష్టమైనవాళ్లు చనిపోతే యెహోవా, యేసు మనకు సహాయం చేస్తారనే నమ్మకంతో ఉండాలని నేర్చుకున్నాం. యెహోవా, యేసులాగే మనం కనికరంతో ప్రకటించాలని, బోధించాలని నేర్చుకున్నాం. వాళ్లు మన భావాల్ని, బలహీనతల్ని అర్థంచేసుకుంటారని, మనం తట్టుకోవడానికి సహాయం చేయాలనుకుంటున్నారని తెలుసుకోవడం ఓదార్పును ఇస్తుంది. మన ‘కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తానని’ యెహోవా మాటిచ్చాడు. ఆ మాట నెరవేరే వరకు మనం నేర్చుకున్నవాటిని పాటిస్తూ ఉందాం.—ప్రక. 21:4.

పాట 120 క్రీస్తులా సౌమ్యంగా ఉండండి

^ యేసు కొన్ని సందర్భాల్లో ఏడ్చాడని బైబిల్లో చదువుతాం. ఈ ఆర్టికల్‌లో యేసు కన్నీళ్లు పెట్టుకున్న మూడు సందర్భాల్ని, వాటినుండి నేర్చుకోగల పాఠాల్ని మనం చర్చిస్తాం.

^ కొన్ని అసలు పేర్లు కావు.

^ చిత్రాల వివరణ: మరియ, మార్తను యేసు ఓదార్చాడు. తమకు ఇష్టమైనవాళ్లు చనిపోయి ఎవరైనా బాధపడుతుంటే, మనం కూడా వాళ్లను ఓదార్చవచ్చు.

^ చిత్రాల వివరణ: నీకొదేము రాత్రిపూట వచ్చినప్పుడు యేసు బోధించాడు. ప్రజలకు అనుకూలంగా ఉన్న సమయంలో మనం బైబిలు స్టడీ చేయాలి.

^ చిత్రాల వివరణ: తాను చివరివరకు నమ్మకంగా ఉండేలా బలపర్చమని యేసు యెహోవాకు ప్రార్థించాడు. పరీక్షలు ఎదురైనప్పుడు మనం కూడా అలాగే చేయాలి.