అధ్యయన ఆర్టికల్ 3
పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం
కష్టాల్లో యెహోవా మీకు తోడుంటాడు
“నీ కాలాలకు స్థిరత్వాన్ని ఇచ్చేది [యెహోవాయే].”—యెష. 33:6.
ముఖ్యాంశం
కష్టాలు వచ్చినప్పుడు యెహోవా సహాయం తీసుకోవాలంటే మనమేం చేయాలి?
1-2. నమ్మకమైన యెహోవా సేవకులు ఎలాంటి కష్టాల్ని ఎదుర్కోవచ్చు?
కొన్ని సంఘటనలు మన జీవితాన్ని రాత్రికిరాత్రే మార్చేస్తాయి. ఉదాహరణకు, యెహోవాకు నమ్మకంగా సేవచేస్తున్న లూయిస్ a అనే బ్రదర్‌కి అరుదుగా వచ్చే ఒక క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆయన ఇంకా కొన్ని నెలలే బ్రతుకుతాడని డాక్టర్ చెప్పాడు. మోనికా, ఆమె భర్త ఆధ్యాత్మిక పనుల్లో చాలా బిజీగా ఉండేవాళ్లు. కానీ ఒకరోజు సంఘ పెద్దయిన ఆమె భర్త, రహస్యంగా పాపం చేస్తున్నాడని మోనికాకు తెలిసింది. ఒలీవియా అనే ఒక పెళ్లికాని సిస్టర్, హరికేన్ తుఫాను వచ్చినప్పుడు ఆమె ఉంటున్న ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయింది. తను తిరిగొచ్చేసరికి ఆమె ఇల్లు నేలమట్టమైపోయింది. వీళ్లందరి జీవితాలు ఒక్క రెప్పపాటున పూర్తిగా మారిపోయాయి. మీకు కూడా ఎప్పుడైనా అలా జరిగిందా? ఏదైనా సంఘటన వల్ల మీ ప్రపంచం మొత్తం తలకిందులైపోయిందా?
2 ఈ లోకంలో అందరికీ వచ్చే కష్టాలకు, ఇబ్బందులకు యెహోవా నమ్మకమైన సేవకులు అతీతులేమి కాదు. దానికితోడు వాళ్లు హింస, వ్యతిరేకత కూడా ఎదుర్కోవాలి. అయితే, మనకు కష్టాలు రాకుండా చేస్తానని యెహోవా మాట ఇవ్వట్లేదు గానీ మనకు సహాయం చేస్తానని మాటిస్తున్నాడు. (యెష. 41:10) ఆయన సహాయంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం సంతోషంగా ఉండవచ్చు, సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు, ఆయనకు నమ్మకంగా ఉండవచ్చు. అయితే, మన జీవితం కష్టాలతో చీకటి అలుముకున్నప్పుడు యెహోవా మనకు సహాయం చేసే నాలుగు విధానాల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే, ఆయనిచ్చే సహాయాన్ని పొందడానికి మనమేం చేయాలో కూడా చూస్తాం.
యెహోవా మీ హృదయాలకు, మనసులకు కాపలా ఉంటాడు
3. ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు మనకేం అనిపించవచ్చు?
3 మనకెలా అనిపిస్తుంది? ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు మనం సరిగ్గా ఆలోచించలేం, సరైన నిర్ణయాలు తీసుకోలేం. ఎందుకు? ఎందుకంటే ఆ బాధవల్ల మన గుండె పిండేసినట్టుగా అనిపించవచ్చు. ఆందోళనలు మనల్ని ముంచెత్తినట్టుగా అనిపించవచ్చు. మనం వెళ్లే దారి కనిపించకుండా మన కళ్లను దట్టమైన పొగమంచు కప్పేసినట్టుగా అనిపించవచ్చు. ముందు పేరాల్లో ప్రస్తావించిన ఇద్దరు సిస్టర్స్, కష్టాలు వచ్చినప్పుడు వాళ్లకు ఎలా అనిపించిందో చెప్తున్నారు. ఒలీవియా ఇలా అంటుంది: “హరికేన్ తుఫాను మా ఇంటిని నేలమట్టం చేసినప్పుడు ఇక అంతా అయిపోయింది, నాకు ఇంకేమీ మిగల్లేదు అనిపించింది.” మోనికా అనే సిస్టర్ ఇలా చెప్తుంది: “నా భర్త నాకు ద్రోహం చేశాడు. నా గుండెలో ఎవరో గునపం దింపినట్టుగా అనిపించింది. మళ్లీ నేను మామూలు మనిషి అవ్వడానికి చాలా కాలం పట్టింది. ఇలా జరుగుతుందని నా కలలో కూడా ఊహించలేదు.” అలాంటి ఆలోచనలు మిమ్మల్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు యెహోవా మీకెలా సహాయం చేస్తాడు?
4. ఫిలిప్పీయులు 4:6, 7 ప్రకారం, యెహోవా ఏమని మాటిస్తున్నాడు?
4 యెహోవా ఏం చేస్తాడు? “దేవుని శాంతి” అని బైబిలు అంటున్న దాన్ని ఆయన ఇస్తానని మాటిస్తున్నాడు. (ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.) దేవుని శాంతి అంటే, మనం ఆయనతో దగ్గరి సంబంధం కలిగివుండడం వల్ల వచ్చే ప్రశాంతత, నెమ్మది. ఈ శాంతి “మానవ అవగాహనకు మించినది,” మన ఊహలకు-ఆలోచనలకు అతీతమైనది. దాన్ని మాటల్లో వర్ణించలేం. ఉదాహరణకు, మీరు యెహోవాకు తీవ్రంగా ప్రార్థించిన తర్వాత మీకు వచ్చిన ప్రశాంతతను బట్టి ఆశ్చర్యపోయారా? అదే “దేవుని శాంతి.”
5. దేవుని శాంతి మన హృదయాలకు, మనసులకు ఎలా కాపలా ఉంటుంది?
5 అంతేకాదు ఆ శాంతి మన హృదయాలకు, మనసులకు “కాపలా ఉంటుంది” అని ఫిలిప్పీయులు 4:7 చెప్తుంది. అసలైతే, “కాపలా” అనే పదం మిలిటరీ వాళ్లకు ఉపయోగించే పదం నుండి వచ్చింది. ఒక నగరం మీద దాడి జరగకుండా కాపలా కాసే సైనికుల్ని సూచించడానికి ఆ పదం వాడేవాళ్లు. ఆ నగరాన్ని కాపలా కాయడానికి సైనికులు ఉన్నారనే ధైర్యంతో అందులో ఉన్న ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయేవాళ్లు. అదేవిధంగా, దేవుని శాంతి మన హృదయాలకు, మనసులకు కాపలా ఉన్నప్పుడు మనం సురక్షితంగా ఉన్నామని తెలుసుకుని ప్రశాంతంగా ఉండగలుగుతాం. (కీర్త. 4:8) నిజమే, మనం ప్రార్థన చేసిన వెంటనే మన పరిస్థితులు మారకపోవచ్చు. కానీ హన్నాలా కొంతవరకు ప్రశాంతంగా ఉండగలుగుతాం. (1 సమూ. 1:16-18) అలా ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచించి, తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం.
6. దేవుని శాంతి నుండి ప్రయోజనం పొందాలంటే మనమేం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)
6 మనమేం చేయాలి? మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మిమ్మల్ని కాపాడమని యెహోవాను పిలవండి. అదెలా చేయవచ్చు? దేవుని శాంతి మీకుందని అనిపించేంత వరకు ప్రార్థిస్తూనే ఉండండి. (లూకా 11:9; 1 థెస్స. 5:17) ముందు పేరాలో మాట్లాడుకున్న లూయిస్ ఇంకొన్ని రోజుల్లోనే చనిపోతాడని డాక్టర్ చెప్పినప్పుడు ఆయన, ఆయన భార్య ఎలా తట్టుకున్నారో చెప్పాడు. ఆయన ఇలా అంటున్నాడు: “ఆ సమయంలో ఆరోగ్యం గురించి, ఇతర విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ప్రార్థన మాకు ఈ సమయమంతటిలో మనశ్శాంతిని ఇచ్చింది.” యెహోవా ఇచ్చే శాంతిని, నెమ్మదిని, నిర్ణయాలు తీసుకునే తెలివిని పొందడం కోసం వాళ్లు పదేపదే తీవ్రంగా ప్రార్థించారు. యెహోవా వాళ్లు అడిగింది ఇచ్చాడు. మీకు కూడా కష్టాలు వచ్చినప్పుడు పట్టుదలగా ప్రార్థించండి. అప్పుడు మీ హృదయాలకు, మనసులకు కాపలా ఉండే దేవుని శాంతిని రుచి చూస్తారు.—రోమా. 12:12.
యెహోవా మిమ్మల్ని స్థిరంగా ఉంచుతాడు
7. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది?
7 మనకెలా అనిపిస్తుంది? మనకు కష్టాలు వచ్చినప్పుడు మన ఆలోచనలు, మన పనులు, మన ఫీలింగ్స్ రకరకాలుగా ఉండవచ్చు. అవును, ఒక ఓడ సముద్రంలో అలలకు అటూఇటూ ఊగిసలాడినట్లు మన మనసు కూడా రకరకాల ఫీలింగ్స్‌తో ఊగిసలాడుతుంది. ముందు పేరాలో చూసిన లూయిస్ చనిపోయినప్పుడు తనకు రకరకాలుగా అనిపించిందని ఆయన భార్య యానా చెప్తుంది. ఆమె ఇలా అంటుంది: “నాకు ఇక ఎవ్వరూ లేరు. నేను ఎవరి కోసం బ్రతకాలి అని అనిపించింది. నన్ను వదిలేసి వెళ్లినందుకు మా ఆయన మీద నాకు చాలా కోపం వచ్చింది. అంతేకాదు, లూయిస్ ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకునేవాడు. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నాకు చిరాకుగా అనిపిస్తుంది.” కొన్నిసార్లు ఆమెకు సముద్రంలోని కెరటాలతో పాటు కొట్టుకుపోయినట్టు అనిపించేది. మీ ఆలోచనలు కూడా కెరటాల్లా ఎగసిపడుతుంటే యెహోవా మీకు ఎలా సహాయం చేస్తాడు?
8. యెషయా 33:6 ప్రకారం, యెహోవా ఏమని మాటిస్తున్నాడు?
8 యెహోవా ఏం చేస్తాడు? ఆయన మనల్ని స్థిరపరుస్తానని మాటిస్తున్నాడు. (యెషయా 33:6 చదవండి.) సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు అలల తాకిడికి ఒక ఓడ అటూఇటూ బాగా ఊగిసలాడుతుంది. దాన్ని ఆపడం కోసం నీళ్లలో ఉండే ఓడ కింది భాగంలో రెండువైపులా రెక్కలుంటాయి. ఇవి ఓడ ఊగిసలాడకుండా అలాగే ప్రయాణికులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించడానికి ఉపయోగపడతాయి. అయితే, ఈ రెక్కలు ఓడ ముందుకెళ్తున్నప్పుడే బాగా పనిచేస్తాయి. అదేవిధంగా, మనకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, నమ్మకంగా ముందుకు సాగుతున్నప్పుడే యెహోవా మనల్ని స్థిరపరుస్తాడు.
9. మనం స్థిరంగా ఉండడానికి పరిశోధన పనిముట్లు ఎలా సహాయం చేస్తాయి? (చిత్రం కూడా చూడండి.)
9 మనమేం చేయాలి? మీ మనసులోని ఫీలింగ్స్ ఉప్పెనలా ఎగసిపడుతుంటే, యెహోవాకు దగ్గరయ్యే పనులు చేస్తూ ఉండండి. నిజమే, కొన్నిసార్లు ఇంతకుముందు చేసినట్లుగా మీరు చేయలేకపోవచ్చు. కానీ యెహోవా మీ పరిస్థితిని అర్థం చేసుకుంటాడని గుర్తుంచుకోండి. (లూకా 21:1-4 పోల్చండి.) యెహోవాకు దగ్గర చేసే పనుల్లో భాగంగా మీ వ్యక్తిగత అధ్యయనం కోసం, ధ్యానించడం కోసం కొంత సమయాన్ని పక్కన పెట్టండి. ఎందుకు? ఎందుకంటే మీ మనసు రకరకాల ఫీలింగ్స్ వల్ల ఊగిసలాడకుండా మన సంస్థ ఎన్నో అద్భుతమైన ఆర్టికల్స్‌ని, వీడియోస్‌ని ఇచ్చింది. మీకు అవసరమైనదాన్ని మీ భాషలో వెదకండి. దానికోసం మీరు JW లైబ్రరీ యాప్‌ని గానీ, యెహోవాసాక్షుల పరిశోధన పుస్తకం గానీ ఉపయోగించవచ్చు. ముందు పేరాల్లో మాట్లాడుకున్న మోనికా తన మనసులోని ఆలోచనలు ఉప్పెనలా ఎగసిపడుతున్నప్పుడు సలహా కోసం పరిశోధన చేసింది. ఉదాహరణకు, ఆమె “కోపం” అనే పదాన్ని లేదా కొన్నిసార్లు “ద్రోహం,” “విశ్వసనీయత” అనే పదాల్ని వెతికింది. ఆ తర్వాత, ఆమె వాటిని తన మనసు కుదుటపడేంత వరకు చదువుతూనే ఉంది. ఆమె ఇలా అంటుంది: “పరిశోధన మొదలుపెట్టినప్పుడు నాకు కంగారు కంగారుగా అనిపించింది. కానీ అలా చదువుతూ ఉన్నప్పుడు యెహోవా నన్ను దగ్గరకు తీసుకుని, హత్తుకున్నట్లు అనిపించింది. మీకు కూడా మీ ఆలోచనలు ఉప్పెనలా ఎగసిపడుతుంటే యెహోవా ఇచ్చే అలాంటి సహాయం మీకు నెమ్మదిని ఇస్తుంది.—కీర్త. 119:143, 144.
యెహోవా మీకు చేయూతను ఇస్తాడు
10. ఊహించని ఒక బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు మనకు ఎలా అనిపించవచ్చు?
10 మనకెలా అనిపిస్తుంది? ఊహించని ఒక బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు మన ఒంట్లో శక్తంతా ఆవిరైపోయినట్లు, మనసంతా దిగాలుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మన పరిస్థితి, మెరుపువేగంతో పరుగెత్తే ఒక క్రీడాకారుడు దెబ్బతగిలాకా కుంటుకుంటూ నడుస్తున్నట్లు అనిపించవచ్చు. ఒకప్పుడు అవలీలగా చేసిన పనులన్నీ ఇప్పుడు చాలా కష్టంగా అనిపించవచ్చు, లేదా ఒకప్పుడు చాలా ఉత్సాహంగా చేసిన పనులన్నీ ఇప్పుడు చేయడానికి అసలు మనసేరాకపోవచ్చు. ఏలీయాలాగే, మనకు కూడా మనసంతా భారంగా, దిగాలుగా అనిపించి అస్సలు లేవాలని అనిపించకపోవచ్చు, పడుకొనే ఉండాలని అనిపించవచ్చు. (1 రాజు. 19:5-7) అలాంటప్పుడు యెహోవా ఏం చేస్తానని మాటిస్తున్నాడు?
11. యెహోవా మనకు సహాయం చేసే ఇంకో విధానం ఏంటి? (కీర్తన 94:18)
11 యెహోవా ఏం చేస్తాడు? మనకు చేయూతను ఇస్తానని ఆయన మాటిచ్చాడు. (కీర్తన 94:18 చదవండి.) దెబ్బ తగిలిన ఒక క్రీడాకారుడు నడవడానికి ఎలాగైతే వేరేవాళ్ల సహాయం కావాలో, అలాగే యెహోవా సేవలో ముందుకెళ్లడానికి మనకు కూడా సహాయం కావాలి. అలాంటి పరిస్థితుల్లో యెహోవా ఇలా అభయమిస్తున్నాడు: “నీ దేవుడైన యెహోవా అనే నేను నీ కుడిచేతిని పట్టుకుంటున్నాను, ‘భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను’ అని నేనే నీతో చెప్తున్నాను.” (యెష. 41:13) యెహోవా ఇచ్చే ఆ చేయూతను రాజైన దావీదు రుచి చూశాడు. కష్టాల్ని, శత్రువుల్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆయన యెహోవాతో ఇలా అన్నాడు: “నీ కుడిచెయ్యి నాకు సహాయం చేస్తుంది.” (కీర్త. 18:35) అయితే, యెహోవా ఆ చేయూతను ఎలా ఇస్తాడు?
12. మనకు చేయూతను ఇవ్వడానికి యెహోవా ఎవరిని ఉపయోగించవచ్చు?
12 యెహోవా చాలావరకు మనకు సహాయం చేసేలా ఇతరుల్ని కదిలిస్తాడు. ఉదాహరణకు, దావీదు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన స్నేహితుడైన యోనాతాను ఆయన్ని కలిసి ధైర్యం చెప్పి ప్రోత్సహించాడు. (1 సమూ. 23:16, 17) అదేవిధంగా, ఏలీయాకు సహాయం చేయడానికి యెహోవా ఎలీషాను ఉపయోగించాడు. (1 రాజు. 19:16, 21; 2 రాజు. 2:2) ఇప్పుడు కూడా మనకు చేయూతను ఇవ్వడానికి యెహోవా మన కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, సంఘపెద్దల్ని ఉపయోగించవచ్చు. అయితే, మనం బాధలో ఉన్నప్పుడు ఎవ్వరితో మాట్లాడబుద్ధి కాదు, ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. అది సహజమే! మరి, యెహోవా ఇచ్చే చేయూతను పొందాలంటే మనం ఏం చేయాలి?
13. యెహోవా ఇచ్చే చేయూత నుండి మనం ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)
13 మనమేం చేయాలి? నిజమే, కష్టాలు వచ్చినప్పుడు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. కానీ దాంట్లోనే ఉండిపోకండి. అలా ఉంటే, మీ ప్రపంచంలో మీరూ, మీ సమస్యలు తప్ప ఇంకేమీ ఉండవు. సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేరు. (సామె. 18:1) కష్టాలు వచ్చినప్పుడు కొన్నిరోజులు ఒంటరిగా ఉండడం పర్వాలేదు. కానీ అలా ఎక్కువ కాలంపాటు ఉంటే, యెహోవా ఇచ్చే చేయూతను పక్కకు నెట్టేసిన వాళ్లమౌతాం. కాబట్టి మీకు కష్టంగా అనిపించినా సరే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సంఘపెద్దలు ఇచ్చే సహాయాన్ని తీసుకోండి. మీకు చేయూతను ఇవ్వడానికి యెహోవాయే వాళ్లను ఉపయోగించుకుంటున్నాడని గుర్తించండి.—సామె. 17:17; యెష. 32:1, 2.
యెహోవా మిమ్మల్ని ఓదారుస్తాడు
14. భయపడే ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవ్వవచ్చు?
14 మనకెలా అనిపిస్తుంది? కొన్నిసార్లు మనం భయపడే పరిస్థితులు రావచ్చు. గతంలో దేవుని సేవకులు కూడా శత్రువుల వల్ల, ఇతర పరిస్థితుల వల్ల ఆపదలోపడ్డారని, భయపడ్డారని బైబిలు చెప్తుంది. (కీర్త. 18:4; 55:1, 5) అదేవిధంగా మనకు కూడా స్కూల్లోనో, ఉద్యోగ స్థలంలోనో, కుటుంబ సభ్యుల నుండో, ప్రభుత్వం నుండో వ్యతిరేకత ఎదురవ్వవచ్చు. కొన్నిసార్లు అనారోగ్య సమస్యల వల్ల చనిపోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అలాంటప్పుడు ఏమీ చేయలేని చంటిపిల్లాడిలా మనకు అనిపించవచ్చు. అప్పుడు యెహోవా మనకెలా సహాయం చేస్తాడు?
15. కీర్తన 94:19 మనకు ఏ అభయాన్నిస్తుంది?
15 యెహోవా ఏం చేస్తాడు? ఆయన మనల్ని ఓదారుస్తాడు, ఊరడిస్తాడు. (కీర్తన 94:19 చదవండి.) ఈ కీర్తన చదువుతున్నప్పుడు మనకు ఇలా అనిపించవచ్చు: ఒక పాప పెద్దపెద్ద ఉరుములు, మెరుపులు శబ్దం వల్ల భయంతో నిద్రపోలేకపోతుంది. అప్పుడు వాళ్ల నాన్న వచ్చి, ఆమెను తన చేతిలోకి తీసుకుని ఆమెను నిద్రపుచ్చుతాడు. ఆ ఉరుములు, మెరుపులు ఇంకా అలాగే ఉన్నా, ఆ పాప వాళ్ల నాన్న ఒళ్లో ఉంది కాబట్టి తనకు చాలా సురక్షితంగా అనిపిస్తుంది. మనకు కూడా కష్టాలు ఎదురైనప్పుడు, మన భయం పోయేంతవరకు మన పరలోకం తండ్రైన యెహోవా ఒకవిధంగా మనల్ని కూడా తన చేతిలోకి తీసుకుంటాడు. అయితే, యెహోవా అలా మనల్ని చేతిలోకి తీసుకోవాలంటే ఏం చేయాలి?
16. యెహోవా మనల్ని ఓదార్చాలంటే ఏం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)
16 మనమేం చేయాలి? ప్రార్థన ద్వారా, బైబిలు చదవడం ద్వారా యెహోవాతో ఎక్కువ సమయం గడపండి. (కీర్త. 77:1, 12-14) అలా చేస్తే, మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మీకు వెంటనే గుర్తొచ్చేది మీ పరలోక తండ్రి యెహోవాయే. ఆయనతో మీ భయాల్ని, ఆందోళనల్ని చెప్పుకోండి. లేఖనాల ద్వారా ఆయన మీతో మాట్లాడనివ్వండి. (కీర్త. 119:28) మిమ్మల్ని ఓదార్చనివ్వండి. మీకు భయమేసినప్పుడు, బైబిల్లో కొన్ని భాగాలు మీకు ఓదార్పుగా అనిపించవచ్చు. ఉదాహరణకు యోబు, కీర్తనలు, సామెతలు అలాగే మత్తయి 6వ అధ్యాయంలో ఉన్న యేసు మాటలు మీకు ప్రోత్సాహంగా అనిపించవచ్చు. బైబిలు చదివినప్పుడు, ప్రార్థించినప్పుడు యెహోవాయే మిమ్మల్ని ఓదారుస్తున్నట్లుగా అనిపిస్తుంది.
17. మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?
17 మన జీవితం చీకటిమయం అయినప్పుడు మనం ఒంటరివాళ్లం కాదు, మనకు యెహోవా ఉన్నాడు! (కీర్త. 23:4; 94:14) యెహోవా మనకు కాపలా ఉంటానని, స్థిరపరుస్తానని, చేయూతను ఇస్తానని, ఓదారుస్తానని మాటిస్తున్నాడు. ఆయన గురించి యెషయా 26:3 ఇలా చెప్తుంది: “నీ మీద పూర్తిగా ఆధారపడేవాళ్లను నువ్వు కాపాడతావు; నువ్వు వాళ్లకు ఎప్పుడూ శాంతిని దయచేస్తావు, ఎందుకంటే వాళ్లు నిన్నే నమ్ముకున్నారు.” కాబట్టి యెహోవా మీద నమ్మకం ఉంచండి. ఆయనిచ్చే సహాయాన్ని తీసుకోండి. అలా చేస్తే కష్టాలు వచ్చినప్పుడు కొండంత బలాన్ని పొందుతారు.
మీరెలా జవాబిస్తారు?
-
మనకు యెహోవా సహాయం ఎప్పుడు ఎక్కువ అవసరమవ్వచ్చు?
-
కష్టాల్లో ఉన్నప్పుడు ఏ నాలుగు విధాలుగా యెహోవా మనకు సహాయం చేస్తాడు?
-
యెహోవా సహాయాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి?
పాట 12 యెహోవా గొప్ప దేవుడు
a కొన్ని పేర్లను మార్చాం.