కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 4

పాట 30 నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు

యెహోవా మీ మీద ఎంతో వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు

యెహోవా మీ మీద ఎంతో వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు

“యెహోవా ఎంతో వాత్సల్యం గలవాడు.”యాకో. 5:11.

ముఖ్యాంశం

యెహోవాకున్న ప్రేమ మనల్ని ఆయనకు ఎలా దగ్గర చేస్తుందో, ఆయన మనల్ని ఎలా సంరక్షిస్తాడో, శ్రద్ధగా చూసుకుంటాడో, సేదదీర్పును ఇస్తాడో పరిశీలిస్తాం.

1. యెహోవాను మీరెలా ఊహించుకుంటున్నారు?

 మీరెప్పుడైనా యెహోవా ఎలా ఉంటాడో ఊహించుకున్నారా? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన్ని ఎలా ఊహించుకుంటారు? నిజమే, యెహోవా మన కంటికి కనిపించడు. కానీ ఆయన గురించి బైబిలు ఎన్నో విధాలుగా వర్ణిస్తుంది. యెహోవా “సూర్యుడు, డాలు,” “దహించే అగ్ని” అని బైబిలు వర్ణిస్తుంది. (కీర్త. 84:11; హెబ్రీ. 12:29) అంతేకాదు, యెహెజ్కేలు చూసిన దర్శనంలో యెహోవా సింహాసనం నీలం రాయి లాంటిదని, ఆయన చుట్టూ మెరిసే లోహంలా, ప్రకాశవంతమైన ఇంద్రధనస్సు కాంతిలా ఉందని వర్ణించాడు. (యెహె. 1:26-28) యెహోవా గురించి ఈ మాటలు వింటున్నప్పుడు మనకు ఆశ్చర్యం, భయం కలగవచ్చు.

2. కొంతమందికి యెహోవాకు దగ్గరవ్వడం ఎందుకు కష్టమవ్వచ్చు?

2 మనం యెహోవాను చూడలేం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మడం కష్టం కావచ్చు. కొంతమంది, తమకు ఎదురైన చేదు అనుభవాల్ని బట్టి యెహోవా తమను ఎప్పుడూ ప్రేమించడని అనుకుంటారు. బహుశా వాళ్లలో కొంతమంది ఎన్నడూ తండ్రి ప్రేమకు నోచుకొని ఉండకపోవచ్చు. అలాంటివాళ్లకు ఎలా అనిపిస్తుందో యెహోవా అర్థం చేసుకుంటాడు. ఈ విషయంలో ఆయన మనకు సహాయం చేయడానికే తన వాక్యమైన బైబిల్లో తనకున్న ఆకర్షణీయమైన లక్షణాల గురించి రాయించాడు.

3. యెహోవా ప్రేమ గురించి మనం ఎందుకు లోతుగా పరిశీలించాలి?

3 యెహోవాను ఒక్క మాటలో వర్ణించాలంటే ప్రేమ. (1 యోహా. 4:8) దేవుడు ప్రేమ అని బైబిలు చెప్తుంది. ఆయన చేసే ప్రతీ పనిలో ప్రేమ కనిపిస్తుంది. ఆయన ఎంత ప్రేమిస్తాడంటే, తనను ప్రేమించని వాళ్లను కూడా ఆయన ప్రేమిస్తాడు. ఎంత గొప్ప ప్రేమో కదా! (మత్త. 5:44, 45) ఈ ఆర్టికల్‌లో యెహోవా గురించి, ఆయన ప్రేమ గురించి ఇంకాస్త లోతుగా పరిశీలిస్తాం. ఆయన గురించి మనం ఎంతెక్కువ తెలుసుకుంటే, ఆయన్ని మనం అంతెక్కువగా ప్రేమించగలుగుతాం.

యెహోవా ప్రేమకు అంతులేదు

4. యెహోవాకున్న వాత్సల్యాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? (చిత్రం కూడా చూడండి.)

4 “యెహోవా ఎంతో వాత్సల్యం గలవాడు.” (యాకో. 5:11) బైబిల్లో యెహోవా తనను తాను లాలించే తల్లితో పోల్చుకున్నాడు. (యెష. 66:12, 13) ఒక తల్లి తన పిల్లవాడిని ఎంత అపురూపంగా చూసుకుంటుందో ఊహించుకోండి. ఆమె ఆ బిడ్డను ఆప్యాయంగా తన ఒళ్లో పడుకోబెట్టుకుని నెమ్మదిగా, మృదువుగా మాట్లాడుతుంది. ఆ బిడ్డ దేనికైనా ఏడ్చినప్పుడు ఆమె వాడికి కావల్సింది ఇస్తుంది. మనం కూడా దేనికైనా బాధపడుతుంటే యెహోవా అలానే చూసుకుంటాడని నమ్మవచ్చు. అందుకే కీర్తనకర్త ఇలా రాశాడు: “ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు నువ్వే నన్ను ఓదార్చావు, ఊరడించావు.”—కీర్త. 94:19.

“తల్లి తన కుమారుణ్ణి ఓదార్చినట్టు నేను మిమ్మల్ని ఓదారుస్తూ ఉంటాను” (4వ పేరా చూడండి)


5. యెహోవా చూపించే విశ్వసనీయ ప్రేమను బట్టి మీకు ఏమనిపిస్తుంది?

5 యెహోవా విశ్వసనీయుడు. (కీర్త. 103:8) మనం ఏదైనా తప్పు చేసినంతమాత్రాన ఆయన మనల్ని ప్రేమించడం ఆపేయడు. ఇశ్రాయేలు జనాంగం యెహోవాను మాటిమాటికి బాధపెట్టారు. అయినాసరే, పశ్చాత్తాపం చూపించిన ప్రజల మీద ఆయన తన ప్రేమను కుమ్మరిస్తూనే ఉన్నాడు. ఆయన ఇలా అన్నాడు: “నువ్వు నా దృష్టిలో అమూల్యమైనవాడివి, నేను నిన్ను ఘనపర్చాను, నేను నిన్ను ప్రేమించాను.” (యెష. 43:4, 5) యెహోవా ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. అందులో ఏ మార్పు లేదు. మనం ఒకవేళ పెద్దపెద్ద తప్పులు చేసినా, యెహోవా మనల్ని దూరం పెట్టడు. మనం పశ్చాత్తాపపడి, ఆయన దగ్గరికి తిరిగొస్తే ప్రేమతో మనల్ని అక్కున చేర్చుకుంటాడు. “ఆయన అధికంగా క్షమిస్తాను” అని మాటిస్తున్నాడు. (యెష. 55:7) ఆయన క్షమాపణ మనకు “సేదదీర్పును” ఇస్తుందని బైబిలు చెప్తుంది.—అపొ. 3:19.

6. జెకర్యా 2:8 యెహోవా గురించి ఏం చెప్తుంది?

6 జెకర్యా 2:8 చదవండి. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన ఫీలింగ్స్‌ని పట్టించుకుంటాడు. మనల్ని కాపాడడానికి ఆయన ఎంతో ఆత్రుతతో ఉన్నాడు. మనం బాధపడితే, ఆయన కూడా బాధపడతాడు. అందుకే “నీ కనుపాపలా నన్ను కాపాడు” అని మనం చేసే ప్రార్థనకు ఆయన జవాబిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. (కీర్త. 17:8) మన శరీరంలో కన్ను చాలా సున్నితమైన, విలువైన అవయవం. కాబట్టి యెహోవా మనల్ని తన కనుపాపతో పోలుస్తున్నాడంటే, ఒకరకంగా ఆయన ఇలా చెప్తున్నాడు: ‘మీకు ఎవరైనా హాని చేస్తే నాకు హాని చేసినట్టే.’

7. యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చు?

7 యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే విషయం మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. కానీ మీకు గతంలో ఎదురైన చేదు అనుభవాల్ని బట్టి, ఆయన మిమ్మల్ని ప్రేమించట్లేదేమో అనే సందేహం మీకుందని కూడా ఆయనకు తెలుసు లేదా ఇప్పుడు మీకు ఎదురయ్యే పరిస్థితుల్ని బట్టి యెహోవా మిమ్మల్ని ప్రేమించట్లేదేమో అనే అనుమానం ఉందని కూడా ఆయనకు తెలుసు. మరి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చు? యేసు మీద, అభిషిక్తుల మీద, మనందరి మీద యెహోవా ఎలా ప్రేమ చూపిస్తున్నాడో తెలుసుకోవడం వల్ల మీరు ఆ నమ్మకాన్ని పెంచుకోవచ్చు.

యెహోవా తన ప్రేమను ఎలా చూపించాడు?

8. తండ్రి తనను ప్రేమిస్తున్నాడని యేసు ఎందుకు గట్టిగా నమ్మాడు?

8 యెహోవాకు, ఆయన ప్రియ కుమారుడైన యేసుకు మధ్య ఉన్న ప్రేమ ఏ మనిషి లెక్కపెట్టలేనన్ని సంవత్సరాల నుండి ఉన్నది. వాళ్లు కొన్ని కోటానుకోట్ల సంవత్సరాలు కలిసి ఉన్నారు కాబట్టి, వాళ్ల మధ్యున్న బంధం చాలా బలపడివుంటుంది. యెహోవా యేసును ప్రేమిస్తున్నాడని మత్తయి 17:5 లో చాలా స్పష్టంగా చెప్పాడు. యెహోవా కావాలనుకుంటే, కేవలం ‘ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను’ అని చెప్తే సరిపోతుంది. కానీ యెహోవా యేసును ఎంత ప్రేమిస్తున్నాడో మనం తెలుసుకోవాలని ఆయన ఇలా అన్నాడు: “ఈయన నా ప్రియ కుమారుడు.” యేసును, ఆయన చేయబోయే పనిని చూసి యెహోవా చాలా గర్వపడ్డాడు. (ఎఫె. 1:7) తండ్రి తనను ప్రేమిస్తున్నాడో లేదో అనే అనుమానం యేసుకు ఏమాత్రంలేదు. యెహోవా ప్రేమను యేసు తన హృదయ లోతుల్లో రుచి చూశాడు. అందుకే, తండ్రి తనను ప్రేమిస్తున్నాడని ఆయన గట్టి నమ్మకంతో పదేపదే చెప్పాడు.—యోహా. 3:35; 10:17; 17:24.

9. యెహోవాకు అభిషిక్తుల మీద ఎంత ప్రేముందో ఏ మాటల్ని బట్టి చెప్పవచ్చు? వివరించండి. (రోమీయులు 5:5)

9 యెహోవా అభిషిక్తుల్ని ప్రేమిస్తున్నాడని చెప్పాడు. (రోమీయులు 5:5 చదవండి.) యెహోవా వాళ్లను ఎంత ప్రేమిస్తున్నాడో గమనించారా? ఆ లేఖనంలో యెహోవా ప్రేమ వాళ్ల “హృదయాల్లో నింపబడింది” అని ఉంది. ఆ మాటల్ని ఒక రెఫరెన్సు పుస్తకం ఇలా చెప్తుంది: ‘దేవుని ప్రేమ మన మీదికి నీళ్ల ప్రవాహంలా వస్తుంది.’ యెహోవా అభిషిక్తుల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి అదెంత చక్కని పదచిత్రం కదా! దేవుడు తమను “ప్రేమిస్తున్నాడు” అని అభిషిక్తులకు తెలుసు. (యూదా 1) వాళ్లకు ఎలా అనిపిస్తుందో అపొస్తలుడైన యోహాను ఈ మాటల్లో చెప్పాడు: “తండ్రి మనమీద చూపించిన ప్రేమ ఎలాంటిదో చూడండి, దేవుని పిల్లలని పిలవబడే అవకాశాన్ని ఆయన మనకు ఇచ్చాడు!” (1 యోహా. 3:1) అయితే, యెహోవా కేవలం అభిషిక్తుల్నే ప్రేమిస్తున్నాడా? లేదు. ఆయన మనందర్నీ ప్రేమిస్తున్నాడు. అలాగని ఎందుకు చెప్పొచ్చు?

10. యెహోవా ప్రేమకు గొప్ప రుజువేంటి?

10 యెహోవా ప్రేమకు గొప్ప రుజువు ఏంటి? విమోచన క్రయధనం! ఈ విశ్వంలోనే అది ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. (యోహా. 3:16; రోమా. 5:8) మనుషులందరి పాపాల్ని క్షమించడానికి, వాళ్లు తనకు స్నేహితులుగా అవ్వడానికి యెహోవా తన ప్రియ కుమారుడైన యేసును బలిగా ఇచ్చాడు. (1 యోహా. 4:10) విమోచన క్రయధనం ఇవ్వడానికి యెహోవా, యేసు ఎంత మూల్యం చెల్లించారో ఆలోచించాలి. అలా మనం ఎంతెక్కువగా ఆలోచిస్తే, మనలో ప్రతీఒక్కర్ని ఆయన ఎంతెక్కువగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుంటాం. (గల. 2:20) కేవలం మనుషులకు న్యాయం జరుగుతుందని మాత్రమే యెహోవా విమోచన క్రయధనాన్ని ఇవ్వలేదు. అది మనుషుల మీద ప్రేమతో ఆయన ఇచ్చిన బహుమతి. తనకెంతో విలువైనదాన్ని అంటే, యేసు ప్రాణాన్ని ఇచ్చి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో యెహోవా చూపించాడు. మనకోసం తన కుమారుడైన యేసు బాధలు అనుభవించి, చనిపోయేలా యెహోవా అనుమతించాడు.

11. యిర్మీయా 31:3 నుండి మనమేం నేర్చుకోవచ్చు?

11 ఇప్పటివరకు చూసినట్టు యెహోవా తన ప్రేమను కేవలం మనసులో మాత్రమే ఉంచుకోడు, దాన్ని బయటికి చెప్తాడు. (యిర్మీయా 31:3 చదవండి.) ఆయన ప్రేమనుబట్టే మనల్ని తన వైపుకు ఆకర్షించుకున్నాడు. (ద్వితీయోపదేశకాండం 7:7, 8 పోల్చండి.) ఆ ప్రేమ నుండి మనల్ని ఏదీ, ఎవ్వరూ వేరు చేయలేరు! (రోమా. 8:38, 39) ఆ ప్రేమను బట్టి మీకు ఏమనిపిస్తుంది? యెహోవా తన మీద చూపించిన ప్రేమ, ఆప్యాయతను బట్టి దావీదుకు ఎలా అనిపించిందో 23వ కీర్తన చదివి తెలుసుకోండి. అది చదివాక, ఆయన చూపించే ప్రేమాప్యాయతల గురించి మీకెలా అనిపిస్తుందో ఆలోచించండి.

యెహోవా ప్రేమనుబట్టి మీకేం అనిపిస్తుంది?

12. కీర్తన 23 లో మనం ఏం చూస్తాం?

12 కీర్తన 23:1-6 చదవండి. యెహోవా చూపించే ప్రేమాప్యాయతల మీద దావీదుకు ఎంత నమ్మకం ఉందో కీర్తన 23 లో ఒక పాట రూపంలో రాశాడు. తనకు, తన కాపరియైన యెహోవాకు ఉన్న విడదీయలేని బంధాన్ని దావీదు వర్ణించాడు. యెహోవా నడిపించినట్టు నడవడం వల్ల దావీదుకు సురక్షితంగా అనిపించింది. ఆయన ప్రతీ పనిలో యెహోవా మీద ఆధారపడ్డాడు. యెహోవా తనను అనుక్షణం ప్రేమిస్తూనే ఉంటాడని దావీదుకు తెలుసు. అంత నమ్మకం దావీదుకు ఎలా వచ్చింది?

13. యెహోవా తనను చూసుకుంటాడని దావీదు ఎందుకు నమ్మాడు?

13 “నాకు ఏ లోటూ ఉండదు.” యెహోవా తనకు కావల్సినవన్నీ ఎప్పటికీ ఇస్తూనే ఉన్నాడని దావీదుకు అనిపించింది కాబట్టే ఆ మాట అనగలిగాడు. అంతేకాదు యెహోవా తన స్నేహితుడని, తనను చూసి సంతోషిస్తాడని దావీదుకు తెలుసు. అందుకే భవిష్యత్తులో ఏం జరిగినా సరే, యెహోవా తనను చూసుకుంటాడని ఆయన గట్టిగా నమ్మాడు. యెహోవా చూపించే ప్రేమాప్యాయతలు దావీదుకున్న ఆందోళనకు మించినవి. అందుకే ఆయన సంతోషంగా, సంతృప్తిగా ఉండగలిగాడు.—కీర్త. 16:11.

14. యెహోవా మనల్ని ఎలా శ్రద్ధగా చూసుకుంటాడు?

14 యెహోవా మన మీద ఉన్న ప్రేమతో మనల్ని శ్రద్ధగా చూసుకుంటాడు. ముఖ్యంగా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు అలా చూసుకుంటాడు. 20 ఏళ్లకు పైగా బెతెల్‌లో సేవచేసిన క్లారా a అనే సిస్టర్‌ అనుభవాన్ని పరిశీలించండి. ఆమెకు, ఆమె కుటుంబానికి ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. వాళ్ల నాన్నకు పక్షవాతం వచ్చింది, ఒక చెల్లి సంఘం నుండి బహిష్కరించబడింది, వాళ్ల కుటుంబం చేసుకునే వ్యాపారం నష్టాలపాలై, ఇంటిని అమ్మేసుకోవాల్సి వచ్చింది. మరి యెహోవా వాళ్ల మీద ఎలా ప్రేమ చూపించాడు? క్లారా ఇలా చెప్తుంది: “మా కుటుంబం ఎప్పుడూ పస్తులు ఉండలేదు. యెహోవా ప్రతీరోజు మాకు కావల్సినవన్నీ ఇచ్చాడు. యెహోవా మాకు ఎప్పటికప్పుడు మేము ఊహించిన దానికి మించి ఇచ్చాడు. ఆయన మాకు ఎలా సహాయం చేశాడో నేను ఆలోచించేదాన్ని. ఆయన మామీద చూపించిన ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేను. వాటివల్ల మాకున్న కష్టాల్ని తట్టుకుని ముందుకు వెళ్లగలిగాం.”

15. దావీదుకు యెహోవా ఎలా సేదదీర్పును ఇచ్చాడు? (చిత్రం కూడా చూడండి.)

15 “ఆయన నా ప్రాణాన్ని సేదదీరుస్తాడు.” తనకు వచ్చిన కష్టాలు, సమస్యల వల్ల దావీదు కొన్నిసార్లు బాగా అలసిపోయాడు. (కీర్త. 18:4-6) అప్పుడు యెహోవా ఆయన మీద ప్రేమతో, శ్రద్ధతో సేదదీర్పును ఇచ్చాడు. తన స్నేహితుడైన దావీదును “పచ్చికబయళ్ల” దగ్గరికి “నీళ్లున్న విశ్రాంతి స్థలాలకు” తీసుకెళ్లాడు. దానివల్ల దావీదు తన శక్తిని పుంజుకోగలిగాడు, ఆనందంగా యెహోవా సేవ చేయగలిగాడు.—కీర్త. 18:28-32.

దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు యెహోవా చూపించే ప్రేమ, వాత్సల్యం, శ్రద్ధ ఆయనకు సేదదీర్పును ఇచ్చింది (15వ పేరా చూడండి)


16. యెహోవా ప్రేమ మిమ్మల్ని ఎలా సేదదీర్చింది?

16 అదేవిధంగా మనం కష్టాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పటికీ “యెహోవా విశ్వసనీయ ప్రేమ వల్లే మనం ఇంకా నాశనం కాలేదు.” (విలా. 3:22; కొలొ. 1:11) రేచెల్‌ అనే సిస్టర్‌ ఉదాహరణను గమనించండి. కరోనా సమయంలో ఆమె భర్త ఆమెను, యెహోవాను వదిలేసి వెళ్లాడు. అప్పుడు ఆమె గుండె ముక్కలైపోయింది. మరి, యెహోవా ఆమెకు ఎలా సహాయం చేశాడు? ఆమె ఇలా చెప్తుంది: “నేను యెహోవా ప్రేమను రుచి చూశాను. నా స్నేహితులు ఎప్పుడూ నా చుట్టు ఉండేవాళ్లు. వాళ్లు నాకోసం భోజనం వండి తీసుకొచ్చేవాళ్లు, లేఖనాల్ని, ప్రోత్సహించే మెసేజుల్ని పంపేవాళ్లు, ఆప్యాయంగా పలకరించేవాళ్లు. యెహోవా నన్ను శ్రద్ధగా చూసుకుంటున్నాడని చెప్తూ ఉండేవాళ్లు. నన్ను ప్రేమించే ఇంతపెద్ద కుటుంబాన్ని ఇచ్చినందుకు నేను యెహోవాకు ఎంతో రుణపడి ఉన్నాను.”

17. ‘ఏ హానికి భయపడను’ అని దావీదు ఎందుకు అన్నాడు?

17 “హాని కలుగుతుందని నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు.” దావీదు శత్రువులు చాలా బలవంతులు. అందుకే ఆయన చాలాసార్లు ప్రమాదపు అంచుల దాకా వెళ్లొచ్చాడు. కానీ యెహోవా ప్రేమ ఆయన్ని సురక్షితంగా ఉంచింది, కాపాడింది. తన జీవితంలో అనుక్షణం యెహోవా తన వెన్నంటే ఉన్నాడని దావీదుకు అనిపించింది. అది ఆయనకు కొండంత బలాన్ని ఇచ్చింది. అందుకే ఆయన ఇలా పాడగలిగాడు: “నా భయాలన్నిటి నుండి [యెహోవా] నన్ను రక్షించాడు.” (కీర్త. 34:4) నిజమే దావీదు కొన్నిసార్లు చాలా భయపడ్డాడు. కానీ యెహోవా ప్రేమ ఆయన భయాల కన్నా చాలా శక్తివంతమైనది.

18. మీకు భయమేసినప్పుడు యెహోవా ప్రేమ మీకు ఎలా ధైర్యాన్నిస్తుంది?

18 మన జీవితంలో భయపెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు యెహోవా ప్రేమ మనకు ఎలా ధైర్యాన్నిస్తుంది? సూసి అనే పయినీరు అనుభవాన్ని పరిశీలించండి. వాళ్ల కొడుకు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆమెకు, ఆమె భర్తకు ఎలా అనిపించిందో చెప్తూ ఇలా అంది: “జీవితంలో ఊహించని సంఘటన జరిగినప్పుడు మనం ఒంటరివాళ్లుగా, ఎవ్వరూ సహాయం చేసేవాళ్లు లేనట్టుగా అనిపిస్తుంది. కానీ యెహోవా చూపించే ప్రేమాప్యాయతల వల్ల మేము సురక్షితంగా ఉన్నాం అనిపించింది. ఆయన మమ్మల్ని కాపాడాడు.” ముందు పేరాలో మాట్లాడుకున్న రేచెల్‌ ఇలా చెప్తుంది: “ఒకరోజు రాత్రి నేను నా బాధ తట్టుకోలేక గట్టిగా ఏడ్చేశాను. నాకు చాలా ఆందోళనగా, భయంగా అనిపించింది. నేను యెహోవాకు గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేశాను. ఆ వెంటనే, ఒక బిడ్డ ఏడ్పును ఆపడానికి తల్లి ఆ పాపను ఊర్కోబెట్టి, నిద్రబుచ్చినట్టు యెహోవా నా మనసుకు ప్రశాంతతను ఇచ్చి, నిద్రబుచ్చినట్టు అనిపించింది. ఆ క్షణాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను.” టాసోస్‌ అనే సంఘపెద్ద, సైన్యంలో చేరనందుకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. అప్పుడు యెహోవా ప్రేమ, శ్రద్ధ ఆయనకు ఎలా సహాయం చేశాయి? ఆయనిలా చెప్తున్నాడు: “యెహోవా నా అవసరాలకు మించి చూసుకున్నాడు. నేను ఆయన్ని పూర్తిగా నమ్మవచ్చనే నా నమ్మకం ఇంకా బలపడింది. అంతేకాదు, కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, సంతోషంగా ఉండడానికి ఆయన తన పవిత్రశక్తిని నాకిచ్చాడు. దానివల్ల నేను యెహోవాతో ఎంత దగ్గరగా పనిచేస్తే, ఆయన మంచితనం నుండి అంతెక్కువ ప్రయోజనం పొందవచ్చనే నమ్మకం కుదిరింది. దాంతో జైల్లో ఉన్నప్పుడే క్రమపయినీరుగా సేవచేయడం మొదలుపెట్టాను.”

వాత్సల్యంగల మీ దేవునికి దగ్గరవ్వండి

19. (ఎ) దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు మనమెలా ప్రార్థన చేస్తాం? (బి) యెహోవా ప్రేమ విషయంలో మీకేది బాగా నచ్చింది? (“ యెహోవా ప్రేమ మనకు ఎలా సహాయం చేస్తుందో చెప్పే కొన్ని లేఖనాలు” అనే బాక్సు చూడండి.)

19 ఇప్పటివరకు మనం చూసిన అనుభవాలన్నీ ‘ప్రేమకు మూలమైన’ యెహోవా మనకు తోడుంటాడు అని నిరూపిస్తున్నాయి. (2 కొరిం. 13:11) ఆయన మనలో ప్రతీఒక్కరిని పట్టించుకుంటున్నాడు. “ఆయన విశ్వసనీయ ప్రేమ” మనకు తోడుంటుందని మనకు తెలుసు. (కీర్త. 32:10) ఆయన ప్రేమ గురించి మనమెంత ఎక్కువ ఆలోచిస్తే, ఆయన మనకు అంత వాస్తవంగా ఉంటాడు. అలాగే ఆయనకు మనం ఇంకా ఎక్కువ దగ్గరవ్వచ్చు. ఆయన ప్రేమ కోసం మనమెంత పరితపిస్తున్నామో ప్రార్థనలో ధైర్యంగా ఆయనకు చెప్పవచ్చు. మనకున్న ఆందోళనలన్నీ ఆయనకు చెప్పుకోవచ్చు. ఆయన వాటిని పట్టించుకుంటాడని, మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మనం నమ్మకంతో ఉండవచ్చు.—కీర్త. 145:18, 19.

20. యెహోవా ప్రేమ మనల్ని ఆయనకెలా దగ్గర చేస్తుంది?

20 చలి వేసినప్పుడు చలిమంట మనకు వెచ్చదనాన్ని ఇచ్చినట్టే, కష్టాల్లో యెహోవా మనకు కావల్సిన ఓదార్పునిస్తాడు. యెహోవా ప్రేమ శక్తివంతమైనదే కాదు వాత్సల్యమైనది కూడా. కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని సంతోషంగా ఉండండి. అలా ఆయన మన మీద చూపించిన ప్రేమనుబట్టి “నేను యెహోవాను ప్రేమిస్తున్నాను” అంటాం.—కీర్త. 116:1.

మీరెలా జవాబిస్తారు?

  • యెహోవా ప్రేమను మీరెలా వివరిస్తారు?

  • యెహోవాకు మీమీద అంతులేని ప్రేమ ఉందని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

  • యెహోవా ప్రేమనుబట్టి మీకేం అనిపిస్తుంది?

పాట 108 దేవుని విశ్వసనీయ ప్రేమ

a కొన్ని పేర్లను మార్చాం.