అధ్యయన ఆర్టికల్ 2
పాట 19 ప్రభువు రాత్రి భోజనం
సంవత్సరంలోని ముఖ్యమైన రోజు కోసం సిద్ధపడండి
“నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.”—లూకా 22:19.
ముఖ్యాంశం
జ్ఞాపకార్థ ఆచరణ ఎందుకంత ప్రత్యేకమైనదో, దానికి ఎలా సిద్ధపడవచ్చో, ఇతరులు హాజరవ్వడానికి ఎలా సహాయం చేయవచ్చో ఆలోచించండి.
1. జ్ఞాపకార్థ ఆచరణ సంవత్సరం మొత్తంలో చాలా ప్రత్యేకమైనదని ఎందుకు చెప్పవచ్చు? (లూకా 22:19, 20)
యెహోవా ప్రజలకు సంవత్సరం మొత్తంలో క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణే చాలా ప్రత్యేకమైనది. యేసు తన అనుచరుల్ని జరుపుకోమని చెప్పిన ఒకేఒక్క ఆచరణ ఇదే! (లూకా 22:19, 20 చదవండి.) జ్ఞాపకార్థ ఆచరణ కోసం ఎదురుచూడడానికి మనకు ఎన్నో కారణాలున్నాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
2. జ్ఞాపకార్థ ఆచరణ కోసం ఎదురుచూడడానికి కొన్ని కారణాలు ఏంటి?
2 జ్ఞాపకార్థ ఆచరణ విమోచన క్రయధన విలువ గురించి ఆలోచించడానికి సహాయం చేస్తుంది. యేసు చేసిన త్యాగానికి మనం ఎలా కృతజ్ఞత చూపించవచ్చో అది గుర్తుచేస్తుంది. (2 కొరిం. 5:14, 15) ఒకరినొకరం “ప్రోత్సహించుకోవడానికి” అవకాశం ఇస్తుంది. (రోమా. 1:12) ప్రతీ సంవత్సరం ఎంతోమంది నిష్క్రియులు జ్ఞాపకార్థ ఆచరణకు వస్తారు. వాళ్లని మనం ఆప్యాయంగా ఆహ్వానించినప్పుడు, వాళ్లలో కొంతమంది యెహోవా దగ్గరికి తిరిగి రావాలని అనుకోవచ్చు. అలాగే, ఎంతోమంది కొత్తవాళ్లకు అక్కడ విన్నవి, చూసినవి బాగా నచ్చి, బైబిలు స్టడీ తీసుకోవాలని అనుకోవచ్చు. కాబట్టి, జ్ఞాపకార్థ ఆచరణకు మన హృదయాల్లో నిజంగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది!
3. జ్ఞాపకార్థ ఆచరణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన బ్రదర్స్-సిస్టర్స్‌ని ఎలా ఐక్యం చేస్తుంది? (చిత్రం కూడా చూడండి.)
3 అంతేకాదు, జ్ఞాపకార్థ ఆచరణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన బ్రదర్స్-సిస్టర్స్‌ని ఎలా ఐక్యం చేస్తుందో ఆలోచించండి. ఆయా ప్రాంతాల్లో సూర్యుడు అస్తమిస్తుండగా, యెహోవాసాక్షులందరూ జ్ఞాపకార్థ ఆచరణ కోసం కలుసుకుంటారు. విమోచన క్రయధనం ఎంత ప్రాముఖ్యమో ఆరోజు ప్రసంగంలో వింటాం. యెహోవాను స్తుతిస్తూ రెండు పాటలు పాడతాం. రొట్టె, ద్రాక్షారసాన్ని అందించుకుంటాం. ఆరోజు చేసే నాలుగు ప్రార్థనలకు మనస్ఫూర్తిగా “ఆమేన్” అంటాం. 24 గంటలు గడిచేలోపు అన్నీ సంఘాలు ఒకే పద్ధతిలో ఈ ఆచరణను జరుపుకుంటాయి. అలా మనందరం ఐక్యంగా ఈ ఆచరణ జరుపుకుంటూ యెహోవాను, యేసును ఘనపర్చినప్పుడు వాళ్ల హృదయం ఎంత ఉప్పొంగిపోతుందో కదా!
4. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?
4 ఈ ఆర్టికల్‌లో ఈ ప్రశ్నల్ని పరిశీలిస్తాం: జ్ఞాపకార్థ ఆచరణ కోసం మన మనసుల్ని ఎలా సిద్ధం చేసుకోవచ్చు? ఆ ఆచరణ నుండి ఇతరులు ప్రయోజనం పొందేలా మనం ఏం చేయవచ్చు? నిష్క్రియులకు మనమెలా సహాయం చేయవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్నప్పుడు ఆ పవిత్రమైన రోజు కోసం సిద్ధంగా ఉంటాం.
జ్ఞాపకార్థ ఆచరణ కోసం మన మనసుల్ని ఎలా సిద్ధం చేసుకోవచ్చు?
5. (ఎ) విమోచన క్రయధనం విలువ గురించి ఎందుకు ఆలోచించాలి? (కీర్తన 49:7, 8) (బి) యేసు ఎందుకు చనిపోయాడు? అనే వీడియో నుండి మీరేం నేర్చుకున్నారు?
5 జ్ఞాపకార్థ ఆచరణ కోసం మన మనసుల్ని సిద్ధం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన విధానం ఏంటంటే, విమోచన క్రయధనం విలువ గురించి ఆలోచించడం. మనంతటికి మనమే పాపమరణాల నుండి ఎప్పటికీ విడిపించుకోలేం. (కీర్తన 49:7, 8 చదవండి; యేసు ఎందుకు చనిపోయాడు? అనే వీడియో కూడా చూడండి.) a కాబట్టి యెహోవా మనకోసం తనెంతో ప్రేమించే కుమారుడైన యేసును బలిగా ఇచ్చి, చాలా గొప్ప మూల్యం చెల్లించాడు. (రోమా. 6:23) యెహోవా, యేసు మనకోసం ఏం త్యాగం చేశారో ఆలోచించేకొద్దీ, ఆ విమోచన క్రయధనం మీద మన కృతజ్ఞత పెరుగుతూ ఉంటుంది. ఇంతకీ విమోచన క్రయధనం కోసం యెహోవా, యేసు ఏం త్యాగం చేశారు? ఇప్పుడు చూద్దాం! ముందుగా, విమోచన క్రయధనం అంటే ఏంటో చూద్దాం.
6. విమోచన క్రయధనం అంటే ఏంటి?
6 విమోచన క్రయధనం అంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి చెల్లించే మూల్యం. మొదటి మనిషైన ఆదాము సృష్టించబడినప్పుడు పరిపూర్ణుడు. కానీ అతను పాపం చేసినప్పుడు, తను శాశ్వత జీవితాన్ని కోల్పోవడమే కాదు తన పిల్లలు కూడా కోల్పోయేలా చేశాడు. ఆదాము వల్ల పోయినదాన్ని తిరిగి సంపాదించడానికి యేసు తన పరిపూర్ణ జీవితాన్ని బలిచ్చాడు. యేసు తన భూజీవితం మొత్తంలో “ఏ పాపం చేయలేదు, ఆయన నోట ఏ మోసం కనిపించలేదు.” (1 పేతు. 2:22) పాపం చేయకముందు ఆదాము ఎలా పరిపూర్ణుడో, చనిపోయే సమయానికి యేసు కూడా పరిపూర్ణుడే. కాబట్టి యేసు తన ప్రాణాన్ని బలివ్వడం వల్ల సరిసమానమైన మూల్యాన్ని చెల్లించాడు.—1 కొరిం. 15:45; 1 తిమో. 2:6.
7. భూమ్మీద ఉన్నప్పుడు యేసు ఎదుర్కొన్న కొన్ని పరీక్షలు ఏంటి?
7 యేసు ఈ భూమ్మీద ఉన్నప్పుడు ఎన్ని పరీక్షలు ఎదురైనా తన పరలోకపు తండ్రికి నూటికి నూరుశాతం లోబడ్డాడు. ఆయన పరిపూర్ణుడిగానే పుట్టినా, చిన్నప్పుడు తన అపరిపూర్ణ తల్లిదండ్రులకు లోబడాల్సి వచ్చింది. (లూకా 2:51) టీనేజీలో ఉన్నప్పుడు యెహోవాకు, తల్లిదండ్రులకు ఎదురుతిరగాలన్న ఒత్తిడి ఎదిరించివుంటాడు. పెద్దయ్యాక, సాతాను తీసుకొచ్చిన శోధనలన్నిటినీ, ఆఖరికి యెహోవాను ఆరాధించడం ఆపేయమని నేరుగా చెప్పినదాన్ని కూడా యేసు తిప్పికొట్టాడు. (మత్త. 4:1-11) యేసుతో ఎలాగైనా పాపం చేయించి, విమోచన క్రయధనం చెల్లించకుండా చేయాలని సాతాను విశ్వ ప్రయత్నాలు చేశాడు.
8. యేసు ఇంకా ఏ పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది?
8 అంతేకాదు, యేసు పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. శత్రువులు ఆయన్ని హింసించి, చంపాలని చూశారు. (లూకా 4:28, 29; 13:31) ఇవి చాలదన్నట్టు, తన అనుచరుల అపరిపూర్ణతను సహించాల్సి వచ్చింది. (మార్కు 9:33, 34) ఆయన్ని విచారణ చేస్తున్నప్పుడు చిత్రహింసలు పెట్టి, ఎగతాళి చేశారు. ఆఖరికి అవమానకరంగా, విపరీతమైన నొప్పి కలిగేలా ఆయన్ని చంపారు. (హెబ్రీ. 12:1-3) యేసు తన భూజీవితంలోని ఈ చివరి ఘట్టాన్ని, యెహోవా సంరక్షణ లేకుండా ఒంటరిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. b—మత్త. 27:46.
9. యేసు ఇచ్చిన విమోచన క్రయధనం గురించి మీకు ఏం అనిపిస్తుంది? (1 పేతురు 1:8)
9 దీన్నిబట్టి విమోచన క్రయధనం చెల్లించడానికి యేసు ఎన్నో సహించాల్సి వచ్చిందని అర్థమౌతుంది. మనకోసం ఇంత చేసిన యేసు మీద మనకు ఎంత ప్రేమ ఉండాలో కదా!—1 పేతురు 1:8 చదవండి.
10. విమోచన క్రయధనం కోసం యెహోవా ఏ త్యాగం చేశాడు?
10 మరి యెహోవా సంగతేంటి? యేసు విమోచన క్రయధనం ఇచ్చేలా ఆయన ఏ త్యాగం చేశాడు? తండ్రి కొడుకులుగా యెహోవాకు, యేసుకు మధ్య ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంత అనుబంధం ఉండేది. (సామె. 8:30) అలాంటిది, యేసు ఈ భూమ్మీద ఉన్నప్పుడు ఎన్నో పరీక్షలు ఎదుర్కోవడం చూసి యెహోవాకు ఎలా అనిపించివుంటుందో ఆలోచించండి. తన కొడుకు నొప్పి, బాధ అనుభవిస్తున్నప్పుడు యెహోవాకు గుండె పిండేసినట్లుగా ఉండివుంటుంది.
11. యేసు చనిపోయినప్పుడు యెహోవాకు ఎలా అనిపించివుంటుందో వివరించండి.
11 కళ్లముందే ఎదిగిన కొడుకు చనిపోయినప్పుడు ఎంత వేదన ఉంటుందో అనుభవించే ఆ తండ్రికే తెలుస్తుంది. నిజమే, పునరుత్థాన నిరీక్షణ మీద ఎంత విశ్వాసం ఉన్నా, మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు కలిగే బాధ మాత్రం పోదు. దీన్నిబట్టి, క్రీ.శ. 33 లో తనెంతగానో ప్రేమించే తన కుమారుడు, తన కళ్లముందే బాధలు అనుభవించి, చనిపోవడం చూసినప్పుడు యెహోవాకు ఎలా అనిపించివుంటుందో అర్థం చేసుకోవచ్చు. c—మత్త. 3:17.
12. ఇప్పటి నుండే జ్ఞాపకార్థ ఆచరణకు ఎలా సిద్ధపడవచ్చు?
12 ఇప్పటి నుండి జ్ఞాపకార్థ ఆచరణ రోజు వరకు, విమోచన క్రయధనం గురించి మీ వ్యక్తిగత అధ్యయనంలో లేదా కుటుంబ ఆరాధనలో పరిశీలించండి. ఆ అంశం గురించి యెహోవాసాక్షుల పరిశోధన పుస్తకంలో గానీ, వేరే బైబిలు అధ్యయన పనిముట్లలో గానీ ఇంకా లోతుగా పరిశోధన చేయండి. d అంతేకాదు, జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించి మీటింగ్ వర్క్‌బుక్‌లో ఉండే బైబిలు పట్టికను చదవండి. అలాగే జ్ఞాపకార్థ ఆచరణ రోజు, ప్రత్యేక ఉదయకాల ఆరాధన మర్చిపోకుండా చూడండి. ఇవన్నీ చేస్తే, జ్ఞాపకార్థ ఆచరణ కోసం మీరు సిద్ధపడడమే కాదు, దాన్నుండి ఇతరులు కూడా ప్రయోజనం పొందేలా సహాయం చేయగలుగుతారు.—ఎజ్రా 7:10.
ఇతరుల్ని ఆహ్వానించండి, వాళ్లకు సహాయం చేయండి
13. జ్ఞాపకార్థ ఆచరణ నుండి ఇతరులు ప్రయోజనం పొందేలా సహాయం చేయడానికి మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి?
13 జ్ఞాపకార్థ ఆచరణ నుండి ఇతరులు ప్రయోజనం పొందేలా మనం ఎలా సహాయం చేయవచ్చు? దానికి మొట్టమొదటిగా చేయాల్సిన పని, ఇతరుల్ని ఆహ్వానించడం. మనం ప్రీచింగ్‌లో కలిసేవాళ్లను ఆహ్వానించడంతో పాటు, ఎవరెవర్ని ఆహ్వానించాలని అనుకుంటున్నామో ఒక లిస్టు వేసుకోవచ్చు. దాంట్లో మన బంధువులు, మనతో పని చేసేవాళ్లు, చదువుకుంటున్నవాళ్లు ఇంకా మనకు తెలిసినవాళ్లు ఉండవచ్చు. ఒకవేళ మన దగ్గర సరిపోయేంత ముద్రిత ఆహ్వాన పత్రాలు లేకపోతే, ఎలక్ట్రానిక్ కాపీలను కూడా పంపించవచ్చు. మీరు ఆహ్వానించిన వాళ్లలో చాలామంది రావచ్చేమో!—ప్రసం. 11:6.
14. ఆహ్వాన పత్రాన్ని ఇచ్చి, ఆహ్వానించడాన్ని ఎందుకు తక్కువ అంచనా వేయకూడదో ఒక అనుభవాన్ని చెప్పండి.
14 ఆహ్వాన పత్రాన్ని చేతికిచ్చి, ఆహ్వానించడాన్ని లేదా ఎలక్ట్రానిక్ కాపీ ఇచ్చి ఆహ్వానించడాన్ని తక్కువ అంచనా వేయకండి. ఒక సిస్టర్ వాళ్ల భర్త యెహోవాసాక్షి కాదు. అయితే, ఈసారి తనతో కలిసి జ్ఞాపకార్థ ఆచరణకు వస్తానని అతను చెప్పినప్పుడు ఆ సిస్టర్ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె గతంలో ఎన్నిసార్లు పిలిచినా, అతను రాలేదు. మరి ఈసారి ఎందుకు వస్తానన్నాడు? ఎందుకంటే “నాకు కూడా ఒకరు ఆహ్వాన పత్రం ఇచ్చి, ఆహ్వానించారు” అని అతను చెప్పాడు. అతనికి తెలిసిన ఒక సంఘపెద్ద స్వయంగా వచ్చి, ఆహ్వానించాడు. ఆ సంవత్సరం నుండి చాలాసార్లు అతను జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యాడు.
15. జ్ఞాపకార్థ ఆచరణకు పిలుస్తున్నప్పుడు మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?
15 జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యే వాళ్లకు చాలా ప్రశ్నలు వస్తాయని గుర్తుంచుకోండి. ముఖ్యంగా, వాళ్లు మొదటిసారి మన మీటింగ్స్‌కు హాజరవుతున్నప్పుడు వాళ్లకు ఎన్నో ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వాళ్లకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయో, వాటికి ఎలా జవాబివ్వాలో ముందుగానే సిద్ధపడండి. (కొలొ. 4:6) ఉదాహరణకు, ‘ఆచరణలో ఏం జరుగుతుంది?’ ‘అది ఎంతసేపు ఉంటుంది?’ ‘దానికోసం ప్రత్యేకమైన డ్రెస్ ఏమైనా వేసుకోవాలా?’ ‘అక్కడికి రావాలంటే డబ్బులేమైనా కట్టాలా?’ ‘అక్కడ చందాలు పడతారా?’ లాంటి ప్రశ్నలు వాళ్లకు ఉండొచ్చు. అందుకే, మనం ఆహ్వాన పత్రాన్ని ఇచ్చి, “మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?” అని అడగొచ్చు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు మీరు జవాబివ్వొచ్చు. అంతేకాదు, యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అలాగే రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియోల్ని కూడా చూపించి, కొంతవరకు వాళ్లకు మీటింగ్స్ ఎలా జరుగుతాయో చూపించవచ్చు. దాంతోపాటు, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని 28వ పాఠంలో వాళ్లకు ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి.
16. జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చినవాళ్లకు ఇంకా ఏ ప్రశ్నలు రావచ్చు?
16 జ్ఞాపకార్థ ఆచరణకు కొత్తగా వచ్చినవాళ్లకు ఇంకొన్ని ప్రశ్నలు రావచ్చు. రొట్టె, ద్రాక్షారసాన్ని ఎందుకు ఎవ్వరూ తీసుకోవట్లేదు? ఒకవేళ తీసుకుంటే, ఒకరిద్దరు ఎందుకు తీసుకుంటున్నారు? ఈ ఆచరణ ఎన్నిసార్లు జరుగుతుంది? యెహోవాసాక్షుల మీటింగ్స్ అన్నీ ఇలాగే జరుగుతాయా? అనే ప్రశ్నలు వాళ్లకు ఉండవచ్చు. వీటన్నిటికి ఆ ప్రసంగంలో జవాబులు వచ్చినా, కొత్తగా వచ్చినవాళ్లకు మనం ఇంకాస్త వివరించాల్సి రావచ్చు. దీనికోసం jw.orgలో ఉన్న, “యెహోవాసాక్షులు ప్రభువు రాత్రి భోజనాన్ని మిగతావాళ్లు చేసుకున్నట్లుగా ఎందుకు చేసుకోరు?” అనే ఆర్టికల్‌ని ఉపయోగించి వాళ్లకు జవాబివ్వవచ్చు. అలా జ్ఞాపకార్థ ఆచరణకు ముందు, ఆ ఆచరణ జరుగుతున్నప్పుడు, ఆ ఆచరణ తర్వాత “సరైన హృదయ స్థితి” గలవాళ్లు దాన్నుండి ప్రయోజనం పొందేలా మనం సహాయం చేయవచ్చు.—అపొ. 13:48.
నిష్క్రియులకు సహాయం చేయండి
17. సంఘపెద్దలు నిష్క్రియులకు ఎలా సహాయం చేయవచ్చు? (యెహెజ్కేలు 34:12, 16)
17 జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో, సంఘపెద్దలు నిష్క్రియులకు ఎలా సహాయం చేయవచ్చు? వాళ్లను పట్టించుకుంటున్నాం అని చూపించండి. (యెహెజ్కేలు 34:12, 16 చదవండి.) జ్ఞాపకార్థ ఆచరణకు ముందు, వీలైనంత ఎక్కువమంది నిష్క్రియులను కలవండి. వాళ్లను పట్టించుకుంటున్నారని, వాళ్లకు సహాయం చేయాలని ఎంతగానో కోరుకుంటున్నారని చెప్పండి. వాళ్లను ఆచరణకు ఆహ్వానించండి. ఒకవేళ వాళ్లు వస్తే, వాళ్లను ఆప్యాయంగా పలకరించండి. జ్ఞాపకార్థ ఆచరణ తర్వాత ఆ ప్రియమైన బ్రదర్స్-సిస్టర్స్‌ని కలుస్తూ ఉండండి, ఫోన్ చేస్తూ ఉండండి. వాళ్లు యెహోవా దగ్గరికి తిరిగి రావడానికి మీరు చేయగలిగినదంతా చేయండి.—1 పేతు. 2:25.
18. నిష్క్రియులకు మనందరం ఎలా సహాయం చేయవచ్చు? (రోమీయులు 12:10)
18 జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చే నిష్క్రియులకు సంఘంలో ఉన్నవాళ్లందరూ ఎలా సహాయం చేయవచ్చు? వాళ్లతో ప్రేమగా, దయగా, గౌరవపూర్వకంగా మాట్లాడాలి. (రోమీయులు 12:10 చదవండి.) ఆ ప్రియమైన బ్రదర్స్-సిస్టర్స్ మీటింగ్స్‌కి రావడానికి తటపటాయిస్తూ ఉండవచ్చని గుర్తుపెట్టుకోండి. బహుశా వాళ్ల గురించి ఏమనుకుంటారో, ఎవరైనా ఏమైనా అంటారేమో అని భయపడుతుండవచ్చు. e కాబట్టి వాళ్లను ఇబ్బందిపెట్టే, బాధపెట్టే ప్రశ్నల్ని అడగకండి. (1 థెస్స. 5:11) వాళ్లు కూడా మనతోపాటు యెహోవాను ఆరాధించే బ్రదర్స్-సిస్టర్సే! అలాంటివాళ్లతో కలిసి మళ్లీ యెహోవాను ఆరాధించడం మనకు సంతోషంగా ఉంటుంది.—కీర్త. 119:176; అపొ. 20:35.
19. యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?
19 ప్రతీ సంవత్సరం తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసు చెప్పినందుకు మనమెంత కృతజ్ఞులమో కదా! అదెంత ప్రాముఖ్యమో మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఆ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనప్పుడు మనం ప్రయోజనం పొందుతాం. అలాగే, ఇతరులు కూడా ప్రయోజనం పొందేలా ఎన్నో విధాలుగా సహాయం చేస్తాం. (యెష. 48:17, 18) యెహోవా మీద, యేసు మీద మన ప్రేమ ఇంకా పెరుగుతుంది. వాళ్లు మనకోసం చేసినదానికి మనకు ఎంత కృతజ్ఞతవుందో చూపిస్తాం. బ్రదర్స్-సిస్టర్స్ మధ్య బంధం బలపడుతుంది. విమోచన క్రయధనం వల్ల వచ్చే ప్రయోజనాన్ని అర్థం చేసుకునేలా ఇతరులకు సహాయం చేయగలుగుతాం. ఇవన్నీ చేస్తూ ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధమౌదాం. అదే ఈ సంవత్సరంలో మనకు అన్నిటికన్నా ప్రాముఖ్యమైన రోజు!
మీరెలా జవాబిస్తారు?
-
జ్ఞాపకార్థ ఆచరణకు మనం ఎలా సిద్ధపడవచ్చు?
-
దాన్నుండి ఇతరులు ప్రయోజనం పొందేలా మనం ఏం చేయవచ్చు?
-
నిష్క్రియులకు ఎలా సహాయం చేయవచ్చు?
పాట 18 విమోచన క్రయధనంపట్ల కృతజ్ఞత
a ఇందులో ఉన్న ఆర్టికల్స్, వీడియోలు చూడడానికి jw.orgలో ఉన్న “వెతుకు” అనే బాక్సును ఉపయోగించండి.
b 2021, ఏప్రిల్ కావలికోట సంచికలోని “పాఠకుల ప్రశ్న” చూడండి.
d “ పరిశోధన కోసం ఐడియాలు” అనే బాక్సు చూడండి.
e చిత్రాలు అలాగే “ బ్రదర్స్-సిస్టర్స్ ఎలా స్పందించారు?” అనే బాక్సు చూడండి నిష్క్రియుడైన ఒక బ్రదర్ రాజ్యమందిరం లోపలికి రావడానికి తటపటాయిస్తున్నాడు. కానీ ధైర్యం తెచ్చుకొని వచ్చాడు. అందరూ ఆయన్ని ఆప్యాయంగా పలకరించారు, వాళ్లతో సమయం గడపడం ఆయనకు నచ్చింది.
f చిత్రాల వివరణ: ప్రపంచంలోని ఒక ప్రాంతంలో యెహోవా ప్రజలు జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకుంటున్నప్పుడు, వేరే దేశాల్లో ఉన్న బ్రదర్స్-సిస్టర్స్ దానికోసం సిద్ధపడుతున్నారు.