కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 2

పాట 132 మనమిప్పుడు ఒక్కరం

భర్తలారా, మీ భార్యల్ని గౌరవించండి

భర్తలారా, మీ భార్యల్ని గౌరవించండి

‘భర్తలారా, మీ భార్యలకు గౌరవం ఇవ్వండి.’1 పేతు. 3:7.

ముఖ్యాంశం

ఒక భర్త తన భార్య మీద గౌరవం ఉందని తన మాటల్లో, పనుల్లో ఎలా చూపించవచ్చు?

1. యెహోవా పెళ్లి అనే బహుమతిని ఇవ్వడానికి ఒక కారణం ఏంటి?

 యెహోవా “సంతోషంగల దేవుడు,” మనం కూడా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 తిమో. 1:11) మన జీవితాన్ని ఆస్వాదించడానికి ఆయన చాలా బహుమతులు ఇచ్చాడు. (యాకో. 1:17) అందులో ఒకటి పెళ్లి అనే బహుమతి. ఒక పురుషుడు, ఒక స్త్రీ పెళ్లి చేసుకున్నప్పుడు ఒకర్నొకరు ప్రేమించుకుంటారని, గౌరవించుకుంటారని, విలువిచ్చుకుంటారని మాటిచ్చారు. కాబట్టి వాళ్ల మధ్యవున్న ప్రేమ ఎంత బలంగా ఉంటే, వాళ్లు అంత సంతోషంగా ఉంటారు.—సామె. 5:18.

2. ఈరోజుల్లో చాలామంది భార్యాభర్తలు ఎలా తయారయ్యారు?

2 బాధాకరంగా, చాలామంది భార్యాభర్తలు పెళ్ళిరోజు వాళ్లు ఇచ్చిన మాటను పూర్తిగా మర్చిపోయారు. అందుకే వాళ్ల జీవితాల్లో సంతోషం ఆవిరైపోయింది. చాలామంది భర్తలు తమ భార్యల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, మనసుకు మానని గాయాలు చేస్తున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈమధ్య ఇచ్చిన ఒక నివేదికలో చెప్పింది. బహుశా అలాంటి ఒక భర్త నలుగురిలో ఉన్నప్పుడు భార్యను బాగా చూసుకోవచ్చు. కానీ నాలుగు గోడల మధ్య చిత్రహింసలు పెడుతూ ఉండవచ్చు. అలాగే భర్తలు అశ్లీల చిత్రాలు చూడడం వల్ల చాలా కుటుంబాలు ముక్కలుముక్కలయ్యాయి.

3. కొంతమంది భర్తలు ఎందుకంత క్రూరంగా ఉంటారు?

3 కొంతమంది భర్తలు ఎందుకంత క్రూరంగా ఉంటారు? ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ల నాన్న వాళ్ల అమ్మను కొట్టడం చూసి వాళ్లు పెరిగి ఉండొచ్చు. కాబట్టి అది మామూలు విషయమే అని వాళ్లు అనుకోవచ్చు. ఇంకొంతమంది చుట్టుపక్కలవాళ్ల ఆలోచనల్ని ఒంటపట్టించ్చుకొని ఉండవచ్చు. భర్తను చూసి భార్య గజగజ వణికిపోతేనే అతను “ఒక మగాడు” అని వాళ్లు అనుకుంటుండవచ్చు. మరికొంతమంది పురుషులకు, కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలో చిన్నప్పుడు నేర్పించి ఉండకపోవచ్చు. ఇంకొంతమంది పురుషులు అశ్లీల చిత్రాల్ని చూసీ-చూసీ ఆడవాళ్లు మగాళ్ల కోరికల్ని తీర్చడానికే ఉన్నారని అనుకుంటుండవచ్చు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఈ సమస్యలన్నీ తారాస్థాయికి చేరుకున్నాయని నివేదికలు చెప్తున్నాయి. నిజానికి భార్యతో క్రూరంగా ఉండడానికి ఇవి సాకులే కాదు.

4. యెహోవాసాక్షియైన ఒక భర్త ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు?

4 యెహోవాసాక్షులైన భర్తలు స్త్రీలను ఈ లోకం చూసినట్టు తప్పుగా చూడకుండా జాగ్రత్తపడాలి. a ఎందుకు? ఒక కారణం ఏంటంటే, నేటి ఆలోచనలే రేపటి పనులు. అపొస్తలుడైన పౌలు రోములో ఉన్న అభిషిక్త క్రైస్తవులకు, “ఈ వ్యవస్థ మిమ్మల్ని మలచనివ్వకండి” అని హెచ్చరించాడు. (రోమా. 12:1, 2) నిజానికి పౌలు వాళ్లకు ఆ మాటలు చెప్పే టైంకి వాళ్లు క్రైస్తవులుగా మారి చాలా సంవత్సరాలైంది. కానీ ఈ లోకంలో ఉన్నవాళ్ల ఆలోచనలు, పద్ధతులు వాళ్లకు సోకాయని పౌలు మాటల్నిబట్టి మనకు అర్థమౌతుంది. అందుకే వాళ్ల ఆలోచనల్ని, పనుల్ని మార్చుకోమని పౌలు సలహా ఇచ్చాడు. అయితే, ఆ సలహా ఇప్పుడున్న భర్తలకు కూడా వర్తిస్తుంది. బాధాకరమైన విషయమేమిటంటే, కొంతమంది యెహోవాసాక్షులైన భర్తలు ఈ లోకంలోని భర్తల్లాగే తమ భార్యల్ని తిడుతున్నారు, కొడుతున్నారు. b కానీ భర్త తన భార్యని ఎలా చూసుకోవాలని యెహోవా ఆశిస్తున్నాడు? ఈ ఆర్టికల్‌లో ఉన్న ముఖ్య లేఖనమే దానికి జవాబు.

5. మొదటి పేతురు 3:7 ప్రకారం, భర్తలు భార్యల్ని ఎలా చూసుకోవాలి?

5 మొదటి పేతురు 3:7 చదవండి. భర్తలు భార్యల్ని గౌరవించాలని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. భార్యను గౌరవించే భర్త ఆమెతో ప్రేమగా, దయగా ఉంటాడు. అయితే, ఈ ఆర్టికల్‌లో భార్య మీద గౌరవం ఉందని ఒక భర్త ఎలా చూపించవచ్చో చూస్తాం. ముందుగా, ఎలాంటి పనులు భార్యను అగౌరవపర్చినట్టు అవుతాయో చూద్దాం.

భార్యను అగౌరవపర్చే ఏ పనీ చేయకండి

6. భార్యల్ని కొట్టే భర్తల్ని యెహోవా ఎలా చూస్తాడు? (కొలొస్సయులు 3:19)

6 భార్యల్ని కొట్టడం. క్రూరంగా ఉండేవాళ్లంటే యెహోవాకు చీదర. (కీర్త. 11:5) ముఖ్యంగా భార్యల్ని కొట్టే భర్తలంటే ఆయనకు పరమ అసహ్యం. (మలా. 2:16; కొలొస్సయులు 3:19 చదవండి.) మన ఆర్టికల్‌ ముఖ్య లేఖనం 1 పేతురు 3:7 ప్రకారం, ఒక భర్త భార్యను బాగా చూసుకోకపోతే దేవునితో అతనికి ఉన్న సంబంధం కూడా బాగుండదని అర్థం. ఆఖరికి యెహోవా అతని ప్రార్థనలు కూడా వినడు.

7. ఎఫెసీయులు 4:31, 32 ప్రకారం, భర్తలు భార్యలతో ఎలా మాట్లాడకూడదు? (“పదాల వివరణ” కూడా చూడండి.)

7 భార్యల్ని తిట్టడం. కొంతమంది భర్తలు భార్యల మీద అరుస్తారు, తిడతారు, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారు. కానీ యెహోవాకు “కోపం, ఆగ్రహం, అరవడం, తిట్టడం” అసహ్యం. c (ఎఫెసీయులు 4:31, 32) ఆయన ప్రతీది వింటాడు. ఒక భర్త తన భార్యతో నాలుగు గోడల మధ్య ఎలా మాట్లాడుతున్నాడో కూడా యెహోవా వింటాడు. భార్యతో కఠినంగా మాట్లాడే భర్త తన కాపురాన్నే కాదు యెహోవాతో ఉన్న బంధాన్ని కూడా తగలబెట్టుకుంటాడు.—యాకో. 1:26.

8. భర్త అశ్లీల చిత్రాలు చూస్తే యెహోవాకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు?

8 అశ్లీల చిత్రాలు చూడడం. అశ్లీల చిత్రాల గురించి యెహోవా ఏమనుకుంటున్నాడు? అవంటే యెహోవాకు అసహ్యం. కాబట్టి ఒక భర్త అశ్లీల చిత్రాలు చూస్తే యెహోవాతో తనకున్న బంధాన్ని పాడుచేసుకుంటాడు, భార్య గౌరవాన్ని దిగజార్చినవాడౌతాడు. d ఒక భర్త తన భార్యకు పనుల్లోనే కాదు, ఆలోచనల్లో కూడా నమ్మకంగా ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడు. పరాయి స్త్రీని అదేపనిగా తప్పుగా చూస్తూ ఉండే వ్యక్తి అప్పటికే “తన హృదయంలో” ఆమెతో వ్యభిచారం చేశాడని యేసు చెప్పాడు. eమత్త. 5:28, 29.

9. భార్యను దిగజారిన లైంగిక పనులు చేయమని భర్త బలవంతపెడితే, యెహోవాకు ఎందుకు కంపరం?

9 దిగజారిన లైంగిక పనులు చేయమని బలవంతపెట్టడం. కొంతమంది భర్తలు తమ భార్యల్ని దిగజారిన లైంగిక పనులు చేయమని ఒత్తిడి చేస్తారు. అలా చేస్తే, భార్య మీద ప్రేమ లేనట్టు, ఆమెను ఆటవస్తువుగా చూస్తున్నట్టు అవుతుంది. విచక్షణలేని మృగంలాంటి ఆ ప్రవర్తన యెహోవాకు కంపరం. భర్త తన భార్యను ప్రేమించాలని, అపురూపంగా చూసుకోవాలని, ఆమె ఫీలింగ్స్‌ని పట్టించుకోవాలని యెహోవా ఆశిస్తున్నాడు. (ఎఫె. 5:28, 29) అయితే, యెహోవాసాక్షియైన ఒక భర్త ఇప్పటికే భార్యను తిట్టడం, కొట్టడం లేదా అశ్లీల చిత్రాలు చూడడం చేస్తుంటే అప్పుడేంటి? అతను తన ఆలోచనల్ని, పనుల్ని ఎలా మార్చుకోవచ్చు?

భర్త ఎలా మారవచ్చు?

10. యేసు నుండి భర్తలు ఏం నేర్చుకోవచ్చు?

10 భార్యను తిట్టి, కొట్టి, చులకనగా చూసే భర్తలు ఎలా మారవచ్చు? వాళ్లు యేసును అనుకరించడానికి ప్రయత్నించాలి. నిజమే యేసుకు పెళ్లి కాలేదు, కానీ ఆయన తన శిష్యుల్ని ఎలా చూసుకున్నాడో భర్తలు తమ భార్యల్ని అలా చూసుకోవచ్చు. (ఎఫె. 5:25) ఆయన తన శిష్యుల్ని ఎలా చూసుకున్నాడో, వాళ్లతో ఎలా మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం.

11. యేసు తన అపొస్తలులతో ఎలా ఉన్నాడు?

11 యేసు తన అపొస్తలులతో దయగా, గౌరవంగా వ్యవహరించాడు. ఆయన ఎప్పుడూ కఠినంగా మాట్లాడలేదు లేదా పెత్తనం చెలాయించలేదు. నిజానికి ఆయన వాళ్లకు ప్రభువు, యజమాని అయినాసరే తన అధికారాన్ని ఉపయోగించి వాళ్లను భయపెట్టలేదు, వాళ్లను తొక్కేయాలని చూడలేదు. బదులుగా వినయంగా వాళ్లకు సేవచేశాడు. (యోహా. 13:12-17) తన శిష్యులకు యేసు ఇలా చెప్పాడు: “నేను సౌమ్యుడిని, వినయస్థుడిని కాబట్టి … నా దగ్గర నేర్చుకోండి; అప్పుడు మీరు సేదదీర్పు పొందుతారు.” (మత్త. 11:28-30) యేసు సౌమ్యుడు అనే విషయాన్ని గమనించారా? సౌమ్యత బలహీనత కాదు, బలం! సౌమ్యత ఉన్న వ్యక్తి ఇతరులు తనను రెచ్చగొట్టినా ప్రశాంతంగా ఉంటాడు, కోప్పడకుండా తననుతాను అదుపులో పెట్టుకుంటాడు.

12. యేసు ఇతరులతో ఎలా మాట్లాడాడు?

12 యేసు ఎప్పుడూ ఇతరులకు ఊరటను, సేదదీర్పును ఇచ్చేలా మాట్లాడేవాడు. ఆయన తన అనుచరులతో అస్సలు కఠినంగా మాట్లాడలేదు. (లూకా 8:47, 48) ఆఖరికి శత్రువులు తనని అవమానించి, రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా “ఆయన తిరిగి వాళ్లను అవమానించలేదు.” (1 పేతు. 2:21-23) కొన్నిసార్లయితే నోరుజారే బదులు యేసు మౌనంగా ఉండిపోయాడు. (మత్త. 27:12-14) భర్తలకు ఆయన ఎంతమంచి ఆదర్శం!

13. మత్తయి 19:4-6 లో ఉన్నట్టు భర్త తన భార్యను ఎలా “అంటిపెట్టుకొని” ఉండవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

13 భర్తలు తమ భార్యలకు నమ్మకంగా ఉండాలని యేసు చెప్పాడు. ఆయన తన తండ్రి చెప్పిన మాటల్నే చెప్తూ భర్త “తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు” అన్నాడు. (మత్తయి 19:4-6 చదవండి.) ఇక్కడ “అంటిపెట్టుకొని” అని అనువదించబడిన గ్రీకు క్రియాపదానికి అక్షరార్థంగా “అతుక్కొని” అనే అర్థముంది. కాబట్టి భార్యాభర్తల బంధం ఒక గమ్‌తో అతికించినంత బలంగా ఉండాలి. అంటే భార్యాభర్తల్లో ఒక్కరు ఏం చేసినా నష్టం ఇద్దరికీ ఉంటుంది. అలాంటి బంధాన్ని పెంచుకున్న ఒక భర్త ఎలాంటి అశ్లీల చిత్రాల జోలికీ వెళ్లడు! “వ్యర్థమైనవాటిని చూడకుండా” వెంటనే తన కళ్లను పక్కకు తిప్పుకుంటాడు. (కీర్త. 119:37) అలా అతను యోబులాగే పరాయి స్త్రీని తప్పుగా చూడొద్దని తన కళ్లతో ఒప్పందం చేసుకుంటాడు.—యోబు 31:1.

భార్యకు నమ్మకంగా ఉండే భర్త అశ్లీల చిత్రాల జోలికి వెళ్లడు (13వ పేరా చూడండి) g


14. భర్త తన భార్యతో అలాగే యెహోవాతో ఉన్న బంధాన్ని బాగుచేసుకోవడానికి ఏ పనులు చేయాలి?

14 భార్యను తిట్టే లేదా కొట్టే భర్త యెహోవాతో అలాగే భార్యతో తనకున్న బంధాన్ని బాగుచేసుకోవడానికి ఇంకొన్ని పనులు చేయాలి. ఏంటవి? ఒకటి, తనలో ఒక పెద్ద సమస్య ఉందని గుర్తించాలి. ఎందుకంటే యెహోవా కళ్లను ఎవ్వరూ కప్పలేరు. (కీర్త. 44:21; ప్రసం. 12:14; హెబ్రీ. 4:13) రెండోది, తన భార్యను తిట్టడం, కొట్టడం ఆపేయాలి, తన ప్రవర్తనను మార్చుకోవాలి. (సామె. 28:13) మూడోది, తన భార్యకు అలాగే యెహోవాకు క్షమాపణ చెప్పాలి. (అపొ. 3:19) అంతేకాదు, మారాలనే కోరిక కోసం, తన ఆలోచనలు-మాటలు-పనులు అదుపు చేసుకోవడానికి సహాయం కోసం యెహోవాను వేడుకోవాలి. (కీర్త. 51:10-12; 2 కొరిం. 10:5; ఫిలి. 2:13) నాలుగోది, అన్నిరకాల హింసను, తిట్లను అసహ్యించుకోవడం నేర్చుకుంటూ తన ప్రార్థనలకు తగ్గట్టు ప్రవర్తించాలి. (కీర్త. 97:10) ఐదోది, సంఘంలో ప్రేమగల కాపరుల సహాయాన్ని వెంటనే తీసుకోవాలి. (యాకో. 5:14-16) ఆరోది, భవిష్యత్తులో అలాంటి పనులు చేయకుండా ఎలా ఉండవచ్చో ఆలోచించి పెట్టుకోవాలి. అశ్లీల చిత్రాలు చూసే భర్త కూడా ఈ ఆరు పనులు చేయాలి. మారడానికి అతను చేసే ప్రతీ ప్రయత్నంలో యెహోవా తోడుంటాడు. (కీర్త. 37:5) అయితే, ఒక భర్త తన భార్యను బాధపెట్టే పనులు ఆపడం మాత్రమే కాదు ఆమె మీద గౌరవం చూపించడం కూడా నేర్చుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

మీ భార్యను ఎలా గౌరవించవచ్చు?

15. ఒక భర్త తన భార్య మీద ఎలా ప్రేమను కురిపించవచ్చు?

15 ప్రేమ కురిపించండి. పెళ్లయిన కొంతమంది బ్రదర్స్‌కు ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే, తమ భార్యను ఎంత ప్రేమిస్తున్నారో చెప్పడానికి ప్రతీరోజు ఏదోకటి చేస్తారు. (1 యోహా. 3:18) ఒక భర్త తన భార్య చేతులు పట్టుకోవడం లేదా కౌగిలించుకోవడం లాంటి చిన్నచిన్న పనుల్లో కూడా తన మీద ప్రేమ ఉందని చూపించవచ్చు. బహుశా ఆమెకు ఒక మెసేజ్‌ పెట్టి “తిన్నావా” అని అడగొచ్చు. తన “రోజు ఎలా గడుస్తుంది” అని అడగవచ్చు. అప్పుడప్పుడు మీ ప్రేమను అక్షరాల్లో పెట్టి ఒక కార్డు ఇవ్వవచ్చు. ఒక భర్త ఇవన్నీ చేసినప్పుడు తన భార్యను గౌరవిస్తాడు, వాళ్లిద్దరి బంధం కూడా విడువని ముడిలా అవుతుంది.

16. ఒక భర్త భార్యను ఎందుకు మెచ్చుకోవాలి?

16 మెచ్చుకోండి. భార్యను గౌరవించే భర్త ఆమె తనకు ఎంత విలువైందో చెప్తాడు, ఆమెను బలపరుస్తాడు. అలా చేయడానికి ఒక పద్ధతి ఏంటంటే, భార్య తనకోసం చేసే వాటన్నిటికీ మర్చిపోకుండా థ్యాంక్స్‌ చెప్పడం. (కొలొ. 3:15) ఒక భర్త భార్యను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నప్పుడు ఆమె చాలా మురిసిపోతుంది, ఆమెకు సురక్షితంగా అనిపిస్తుంది. భర్త ప్రేమను, గౌరవాన్ని చూడగలుగుతుంది.—సామె. 31:28.

17. భర్త తన భార్యతో మర్యాదగా ఎలా ఉండవచ్చు?

17 దయగా, మర్యాదగా ఉండండి. భార్యను ప్రేమించే భర్త ఆమెను విలువైనదానిగా, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఆమెను యెహోవా ఇచ్చిన వరంగా చూస్తాడు. (సామె. 18:22; 31:10) దానివల్ల నాలుగు గోడల మధ్య ప్రేమ చూపించుకుంటున్నప్పుడు కూడా భర్త భార్యతో దయగా, మర్యాదగా ఉంటాడు. తనకు ఇబ్బందిగా అనిపించే, అసహ్యించుకునే లేదా తన మనస్సాక్షిని ఇబ్బందిపెట్టే లాంటి లైంగిక పనులు చేయమని ఒత్తిడి చేయడు. f భర్త కూడా యెహోవా ముందు మంచి మనస్సాక్షితో ఉండడానికి ప్రయత్నిస్తాడు.—అపొ. 24:16.

18. భర్త ఏం చేయాలని గట్టిగా నిర్ణయించుకోవాలి? (“ భార్యను గౌరవించే భర్తగా ఉండాలంటే చేయాల్సిన నాలుగు పనులు” అనే బాక్స్‌ కూడా చూడండి.)

18 భర్తలారా మీ భార్యల్ని గౌరవించడానికి చెప్పే ప్రతీ మాటను, చేసే ప్రతీ పనిని యెహోవా చూస్తాడని, మిమ్మల్ని మెచ్చుకుంటాడని మర్చిపోకండి. ఆమె మనసును బాధపెట్టే ఏ పనీ చేయకుండా దయగా, మర్యాదగా, ప్రేమగా ఉండడం ద్వారా ఆమెను గౌరవించాలని గట్టిగా నిర్ణయించుకోండి. అలా చేసినప్పుడు మీరు ఆమెను ప్రేమిస్తున్నారని, ఆమె మీకు చాలా విలువైనదని చూపించినవాళ్లౌతారు. మీ భార్యను గౌరవిస్తే మీరు అన్నిటికంటే ముఖ్యమైన బంధాన్ని అంటే యెహోవాతో మీకున్న స్నేహాన్ని కాపాడుకున్న వాళ్లౌతారు.—కీర్త. 25:14.

పాట 131 “దేవుడు ఒకటి చేసినవాళ్లు”

a 2024, జనవరి కావలికోట పత్రికలో ఉన్న “మీరు స్త్రీలను యెహోవాలాగే చూస్తున్నారా?” ఆర్టికల్‌ భర్తలకు బాగా పనికొస్తుంది.

b గృహ హింస బాధితురాళ్లకు 2002, జనవరి 8 తేజరిల్లు! పత్రికలోని 9వ పేజీలో ఉన్న “హింసలనుభవిస్తున్న స్త్రీలకు సహాయం” ఆర్టికల్‌ బాగా పనికొస్తుంది.

c పదాల వివరణ: “తిట్టడం” అంటే కఠినంగా, లెక్కలేనట్టు, కించపర్చే పేర్లు పెట్టి వెక్కిరించడం కూడా వస్తుంది. ద్వేషంతో, చులకనగా, దిగజార్చేలా అన్న ఏ మాటలైనా తిట్టడం కిందకే వస్తాయి.

d jw.orgలో “పోర్నోగ్రఫీ—ప్రమాదకరమైనదా, కాదా?” అనే ఆర్టికల్‌ చూడండి.

e అశ్లీల చిత్రాలు చూసే భర్త ఉన్న భార్యలు 2023, ఆగస్టు కావలికోట పత్రికలో వచ్చిన “జీవిత భాగస్వామి అశ్లీల చిత్రాలు చూస్తే ఏం చేయవచ్చు?” ఆర్టికల్‌ నుండి ప్రయోజనం పొందవచ్చు.

f భార్యాభర్తల మధ్య ఎలాంటి లైంగిక పనులు తప్పు లేదా తప్పుకాదు అనేది బైబిలు చెప్పట్లేదు. యెహోవాను ఘనపర్చడానికి, ఒకరినొకరు సంతోషపెట్టుకోవడానికి, మంచి మనస్సాక్షి కాపాడుకోవడానికి ఏం చేయవచ్చో ఒక జంట సొంతగా నిర్ణయించుకోవాలి. సాధారణంగా, నాలుగు గోడల మధ్య వాళ్లు చేసుకునే పనుల గురించి ఏ భార్యాభర్తలు వేరేవాళ్లతో మాట్లాడరు.

g చిత్రం వివరణ: తనతోపాటు పనిచేసే ఒకతను మన బ్రదర్‌కి అశ్లీల చిత్రాలు ఉన్న పత్రికను చూడమని పిలుస్తున్నాడు.