కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 3

పాట 35 ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో తెలుసుకోండి’

మంచి నిర్ణయాలు తీసుకోండి, యెహోవాను సంతోషపెట్టండి

మంచి నిర్ణయాలు తీసుకోండి, యెహోవాను సంతోషపెట్టండి

“యెహోవా మీదుండే భయమే తెలివికి ఆరంభం, అతి పవిత్రుడైన దేవుని గురించి తెలుసుకోవడమే అవగాహన.”సామె. 9:10.

ముఖ్యాంశం

మంచి నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానం, అవగాహన, వివేచన ఎలా సహాయం చేస్తాయో తెలుసుకుంటాం.

1. ప్రతీరోజు మనం ఏం చేస్తూ ఉంటాం?

 పొద్దున లేచిన దగ్గర్నుండి, పడుకునే వరకు మనం చాలా నిర్ణయాలు తీసుకుంటాం. ఏం తినాలి, ఎప్పుడు పడుకోవాలి లాంటి కొన్ని చిన్న నిర్ణయాలు తీసుకుంటాం. మరోవైపు, కాస్త పెద్ద నిర్ణయాలు కూడా తీసుకుంటాం. వాటివల్ల మన ఆరోగ్యం, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంతోషం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అలాగే యెహోవాను మనం ఎంత బాగా ఆరాధిస్తాం అనేది కూడా మన నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఎంతైనా మన నిర్ణయాల వల్ల మనకు, మన కుటుంబానికి మంచే జరగాలని కోరుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన నిర్ణయాలు యెహోవాను సంతోషపెట్టాలని కూడా ఆశిస్తాం.—రోమా. 12:1, 2.

2. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీరేం చేయవచ్చు?

2 ఫలానా విషయం గురించి (1) వాస్తవాలన్నీ తెలుసుకొని, (2) యెహోవా ఆలోచన ఏంటో అర్థం చేసుకొని, (3) ఉన్న ఆప్షన్లు అన్నీ జాగ్రత్త ఆలోచిస్తే, మీరు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈ పనుల్ని ఎలా చేయాలో, మన వివేచన సామర్థ్యానికి ఎలా శిక్షణ ఇవ్వాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.—సామె. 2:11.

వాస్తవాలన్నీ తెలుసుకోండి

3. నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాల్ని తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో ఉదాహరణతో చెప్పండి.

3 మంచి నిర్ణయం తీసుకోవడానికి మనం చేయాల్సిన మొదటి పని, వాస్తవాల్ని తెలుసుకోవడం. ఇది ఎందుకు ప్రాముఖ్యం? ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. ఒక డాక్టర్‌ ఏదైనా పెద్ద జబ్బు వచ్చిన వ్యక్తికి చికిత్స ఎలా చేస్తాడు? రోగిని చూడకుండా లేదా అతన్ని ఏ ప్రశ్నలు అడగకుండానే చికిత్స మొదలుపెట్టేస్తాడా? లేదు కదా. మీరు కూడా ఆ మంచి డాక్టర్‌లాగే, పరిస్థితికి సంబంధించిన వాస్తవాలన్నిటినీ ముందు తెలుసుకుంటే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దాన్నెలా చేయవచ్చు?

4. సామెతలు 18:13 ప్రకారం, వాస్తవాల్ని తెలుసుకోవడానికి మీరేం చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

4 మీరు వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు, మిమ్మల్ని ఎవరైనా ఒక పార్టీకి ఆహ్వానిస్తే, మీరు ఏం చేస్తారు? ఒకవేళ ఆ పార్టీకి పిలిచిన వ్యక్తి గానీ, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు గానీ మీకు తెలీకపోతే ఈ ప్రశ్నలు అడగవచ్చు: “పార్టీ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది? ఎవరెవరు వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? ఏర్పాట్లన్నీ ఎవరు చూసుకుంటున్నారు? పార్టీలో ఎలాంటి ప్రోగ్రామ్‌లు ఉంటాయి? పార్టీలో మందు-చిందులు ఉంటాయా?” ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్నప్పుడు మీరు తెలివైన నిర్ణయం తీసుకోగలుగుతారు.—సామెతలు 18:13 చదవండి.

నిర్ణయం తీసుకునేముందు వాస్తవాలు తెలుసుకోండి (4వ పేరా చూడండి) a


5. వాస్తవాలన్నీ తెలుసుకున్నాక ఏం చేయాలి?

5 వాస్తవాలన్నీ తెలుసుకున్నాక, పరిస్థితిని అన్నివైపుల నుండి చూస్తూ బాగా ఆలోచించండి. ఉదాహరణకు, బైబిలంటే లెక్కలేనివాళ్లు పార్టీకి వస్తున్నారని, అడ్డూ అదుపూ లేకుండా మందు పోస్తారని మీకు తెలిస్తే, అప్పుడేంటి? పార్టీ హద్దులు దాటి విచ్చలవిడి పార్టీగా మారే అవకాశం ఉందా? (1 పేతు. 4:3) ఒకవేళ ఆ పార్టీ మీటింగ్‌కి లేదా ప్రీచింగ్‌కి అడ్డొస్తుందా? ఇలా పరిస్థితిని అన్నివైపుల నుండి చూస్తే, మీరు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. అయితే, మీరు చేయాల్సిన మరో పని కూడా ఉంది. అదేంటంటే, పరిస్థితి గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది కానీ దానిగురించి యెహోవాకు ఎలా అనిపిస్తుందో ఆలోచించారా?—సామె. 2:6.

యెహోవాకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి

6. యాకోబు 1:5 ప్రకారం, యెహోవా సహాయం కోసం మనం ఎందుకు ప్రార్థించాలి?

6 తన ఆలోచనను తెలుసుకోవడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి. ఫలానా నిర్ణయం తీసుకుంటే తనకు సంతోషంగా ఉంటుందో లేదో అర్థం చేసుకునే తెలివిని ఇస్తానని యెహోవా మాటిచ్చాడు. ఆయన అలాంటి తెలివిని “కోప్పడకుండా అందరికీ ఉదారంగా ఇస్తాడు.”—యాకోబు 1:5 చదవండి.

7. యెహోవా ఆలోచనల్ని తెలుసుకోవడానికి మీరేం చేయవచ్చో ఉదాహరణతో చెప్పండి.

7 యెహోవా నిర్దేశం కోసం ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఇచ్చే జవాబును మనసుపెట్టి వినాలి. ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. మీరేదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు దారి తప్పారు అనుకోండి. ఎటు వెళ్లాలో చుట్టుపక్కల ఉన్నవాళ్లను మీరు అడిగి తెలుసుకుంటారు. అయితే వాళ్లను అడిగాక, వాళ్ల జవాబు వినకముందే మీరు వెళ్లిపోతారా? వెళ్లరు కదా. వాళ్లు చెప్పే ప్రతీమాటను జాగ్రత్తగా వింటారు. అదేవిధంగా, మీరు తెలివి కోసం యెహోవాకు ప్రార్థన చేశాక మీ పరిస్థితికి ఏ బైబిలు సూత్రాలు, నియమాలు సరిపోతాయో వెదకడం ద్వారా ఆయన జవాబును తెలుసుకోగలుగుతారు. ఉదాహరణకు, ఇంతకుముందు మాట్లాడుకున్న ఆ పార్టీకి వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు విచ్చలవిడి విందులు, చెడు స్నేహాలు, సొంత ఇష్టాయిష్టాల కన్నా దేవుని రాజ్యానికే మొదటిస్థానం ఇవ్వడం గురించి బైబిలు ఏం చెప్తుందో ఆలోచించవచ్చు.—మత్త. 6:33; రోమా. 13:13; 1 కొరిం. 15:33.

8. సలహాలు వెదకడానికి మీకు సహాయం అవసరమైతే ఏం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)

8 అయినాసరే, కొన్నిసార్లు మీకు కావాల్సిన సలహా వెదకడానికి మీకు సహాయం అవసరం కావచ్చు. మీరు కావాలనుకుంటే అనుభవంగల బ్రదర్స్‌సిస్టర్స్‌ని అడిగి తెలుసుకోవచ్చు. కానీ సొంతగా పరిశోధన చేస్తే కూడా చాలా ప్రయోజనాలున్నాయి. ఉదాహరణకు, యెహోవాసాక్షుల పరిశోధన పుస్తకం అలాగే మంచి క్రైస్తవులుగా ఉండడానికి ఉపయోగపడే లేఖనాలు లాంటి అధ్యయన పనిముట్లలో చాలా సమాచారం ఉంది. అయితే, యెహోవాను సంతోషపెట్టే నిర్ణయం తీసుకోవాలనే మీ లక్ష్యాన్ని ఎప్పుడూ కళ్లముందు ఉంచుకోండి.

యెహోవా ఆలోచన ఏంటో తెలుసుకోండి (8వ పేరా చూడండి) b


9. మనం తీసుకునే నిర్ణయాలు యెహోవాను సంతోషపెడతాయా లేదా అని మనం ఖచ్చితంగా ఎలా చెప్పవచ్చు? (ఎఫెసీయులు 5:17)

9 మనం తీసుకునే నిర్ణయాలు యెహోవాను సంతోషపెడతాయా లేదా అని మనం ఖచ్చితంగా ఎలా చెప్పవచ్చు? ముందుగా, మనం ఆయన గురించి బాగా తెలుసుకోవాలి. “అతి పవిత్రుడైన దేవుని గురించి తెలుసుకోవడమే అవగాహన” అని బైబిలు చెప్తుంది. (సామె. 9:10) అవును, ఎప్పుడైతే యెహోవా లక్షణాల గురించి, ఆయన ఉద్దేశాల గురించి, ఆయన ఇష్టాయిష్టాల గురించి మనం తెలుసుకుంటామో అప్పుడే మనకు నిజమైన అవగాహన వస్తుంది. ఈ ప్రశ్న వేసుకోండి: ‘యెహోవా గురించి నాకు తెలిసిన దాన్నిబట్టి నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆయన సంతోషిస్తాడు?’—ఎఫెసీయులు 5:17 చదవండి.

10. కుటుంబ సభ్యుల కన్నా, సమాజం కన్నా బైబిలు సూత్రాల్నే ఎందుకు ప్రాముఖ్యంగా చూడాలి?

10 కొన్నిసార్లు యెహోవాను సంతోషపెట్టాలంటే మన కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని బాధపెట్టాల్సి రావచ్చు. ఉదాహరణకు, కొంతమంది తల్లిదండ్రులు మంచి ఉద్దేశాలతోనే, తమ అమ్మాయికి ఆధ్యాత్మికంగా అంతంత మాత్రంగా ఉన్నా బాగా డబ్బున్న అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారు. నిజమే, వాళ్ల అమ్మాయిని కాలు కింద పెట్టకుండా చూసుకునే అబ్బాయి కావాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఆమె యెహోవాకు దగ్గరయ్యేలా అతను సహాయం చేయగలడా? దీనిగురించి యెహోవాకు ఎలా అనిపిస్తుంది? దానికి జవాబు మత్తయి 6:33 లో ఉంది. అక్కడ ‘దేవుని రాజ్యానికి మొదటిస్థానం’ ఇవ్వమని క్రైస్తవులు ప్రోత్సహించబడుతున్నారు. నిజమే, మనం మన అమ్మానాన్నల్ని, సమాజాన్ని గౌరవిస్తాం. కానీ వాళ్లకన్నా యెహోవా సంతోషమే కదా మనకు ముఖ్యం.

మీకున్న ఆప్షన్‌ల గురించి బాగా ఆలోచించండి

11. మీకున్న ఆప్షన్‌ల గురించి బాగా ఆలోచించడానికి ఫిలిప్పీయులు 1:9, 10 లో ఉన్న ఏ లక్షణం సహాయం చేస్తుంది?

11 మీ పరిస్థితికి సరిపోయే బైబిలు సూత్రాల్ని చూశాక, మీకున్న ఆప్షన్‌ల గురించి మీరు బాగా ఆలోచించాలి. (ఫిలిప్పీయులు 1:9, 10 చదవండి) వివేచన అనే లక్షణం ఉంటే ప్రతీ ఆప్షన్‌కి ఎలాంటి ఫలితాలు వస్తాయో మీరు ఊహించుకోగలుగుతారు. కొన్ని నిర్ణయాలు చాలా ఈజీగా ఉంటాయి, కొన్ని చాలా కష్టంగా ఉంటాయి. కానీ పరిస్థితి ఎంత తికమకగా ఉన్నా, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి వివేచన మీకు సహాయం చేస్తుంది.

12-13. ఉద్యోగాన్ని ఎంచుకునే విషయంలో తెలివైన నిర్ణయం తీసుకోవడానికి వివేచన ఎలా సహాయం చేస్తుంది?

12 ఈ పరిస్థితి గురించి ఆలోచించండి. మీరు మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక ఉద్యోగం కోసం చూస్తున్నారు. మీకు రెండు ఆఫర్లు వచ్చాయి. అయితే, మీరు వాస్తవాలన్నీ తెలుసుకున్నారు, అంటే ఎలాంటి పనిచేయాలి, ఎప్పటి నుండి ఎప్పటివరకు పనిచేయాలి, ప్రయాణించడానికి ఎంత టైం పడుతుంది, ఇలా చాలా విషయాలు కనుక్కున్నారు. అయితే ఈ రెండిట్లో బైబిలుకు విరుద్ధమైన పనులేవీ చేయాల్సిన అవసరంలేదు. కాబట్టి ఆ రెండిట్లో ఏ ఉద్యోగం మీకు నచ్చుతుందో లేదా ఎందులో ఎక్కువ జీతం వస్తుందో చూసుకొని దాన్నే ఎంచుకోవాలని అనుకోవచ్చు. కానీ ఒక నిర్ణయానికి వచ్చే ముందు మీరు ఆలోచించాల్సిన వేరే విషయాలు కూడా ఉన్నాయి.

13 ఉదాహరణకు, ఆ రెండు ఉద్యోగాల్లో ఏదైనా మీటింగ్‌కి అడ్డొస్తుందా? లేదా మీ కుటుంబ సభ్యుల్ని పట్టించుకోవడానికి, వాళ్లు యెహోవాకు దగ్గరయ్యేలా సహాయం చేయడానికి సమయం మిగిలిద్దా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం వల్ల మీరు డబ్బు కన్నా “ఎక్కువ ప్రాముఖ్యమైన వాటికి” అంటే మీ ఆరాధనకు, మీ కుటుంబ సభ్యుల అవసరాలకు మొదటిస్థానం ఇవ్వగలుగుతారు. అలా యెహోవా దీవించే నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు.

14. ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా వివేచన, ప్రేమ ఎలా సహాయం చేస్తాయి?

14 వివేచన ఉంటే మన నిర్ణయాల వల్ల “ఇతరులు విశ్వాసం కోల్పోవడానికి కారణం” అవ్వకుండా ఉంటాం. (ఫిలి. 1:10) మనం వేసుకునే బట్టలు, హెయిర్‌స్టైల్స్‌ విషయంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకు, మనకు ఫలానా బట్టలు వేసుకోవాలని లేదా ఫలానా హెయిర్‌ స్టైల్‌ చేసుకోవాలని అనిపించవచ్చు. కానీ సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌, మన చుట్టూ ఉన్న సమాజం అభ్యంతరపడతారా? వివేచన ఉంటే మనం వాళ్ల ఫీలింగ్స్‌ని కూడా పట్టించుకుంటాం. ప్రేమ ఉంటే మనం అవతలి వ్యక్తి “ప్రయోజనం గురించి ఆలోచిస్తాం,” అణకువ చూపిస్తాం. (1 కొరిం. 10:23, 24, 32; 1 తిమో. 2:9, 10) అలా ఇతరుల మీదున్న ప్రేమ, గౌరవం మన నిర్ణయాల్లో కనిపిస్తాయి.

15. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేముందు మీరు ఏమేమి చేస్తే మంచిది?

15 ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు దానికి తగ్గట్టు ఏమేమి పనులు చేయాల్సి రావచ్చో ఆలోచించండి. యేసు కూడా ముందుగా ‘లెక్కలు వేసుకోమని’ చెప్పాడు. (లూకా 14:28) కాబట్టి మీ నిర్ణయం సఫలం అవ్వడానికి ఎంత సమయం, శక్తి, డబ్బు అవసరం రావచ్చో ముందుగానే చూసుకోండి. కొన్నిసార్లు మీ నిర్ణయానికి తగ్గట్టు కుటుంబంలో ఉన్న ప్రతీ సభ్యుడు సహకరించాల్సి రావచ్చు కాబట్టి ముందుగానే మీరు కుటుంబంలో ఉన్న ప్రతీఒక్కరితో మాట్లాడాలి. ఇలా ముందుగా ప్లాన్‌ చేసుకోవడం ఎందుకు మంచిది? ఎందుకంటే ఇలా మాట్లాడుకోవడం వల్ల మీ నిర్ణయంలో మార్పు చేసుకోవాలని లేదా పూర్తిగా వేరే నిర్ణయం తీసుకోవాలని మీకు అర్థమవ్వచ్చు. అంతేకాదు, కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు, వాళ్లు చెప్పేది విన్నప్పుడు మీ నిర్ణయం సఫలమయ్యేలా మీకు హెల్ప్‌ చేయడానికి వాళ్లు ముందుకొస్తారు.—సామె. 15:22.

సఫలమయ్యే నిర్ణయాలు తీసుకోండి

16. సఫలమయ్యే నిర్ణయాలు తీసుకోవడానికి మీకు ఏ విషయాలు సహాయం చేస్తాయి? (“ తెలివైన నిర్ణయాల్ని ఎలా తీసుకోవాలి?”అనే బాక్స్‌ చూడండి.)

16 ఇప్పటివరకు చూసిన విషయాలన్నిటినీ పాటిస్తే తెలివైన నిర్ణయం తీసుకోవడానికి మీరు రెడీ అయిపోయినట్టే! మీరు వాస్తవాలన్నీ తెలుసుకొని, యెహోవాకు ఇష్టమైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేసే సూత్రాల్ని పరిశీలించారు. ఇక మిగిలింది ఏంటంటే, మీ నిర్ణయం సఫలమయ్యేలా సహాయం చేయమని యెహోవాను అడగడమే!

17. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మనం ముఖ్యంగా దేనిమీద ఆధారపడాలి?

17 మీరు గతంలో తెలివైన నిర్ణయాలు తీసుకొని ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మీ సొంత తెలివి, అనుభవం మీద కాదుగానీ యెహోవా ఇచ్చే తెలివి మీదే ఆధారపడాలి. తెలివికి పునాది రాళ్లుగా ఉన్న నిజమైన జ్ఞానం, అవగాహన, వివేచన ఆయన మాత్రమే ఇవ్వగలడు. (సామె. 2:1-5) అవును, తనను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోవడానికి యెహోవాయే మీకు సహాయం చేస్తాడు.—కీర్త. 23:2, 3.

పాట 28 యెహోవా స్నేహాన్ని సంపాదించుకోవడం

a చిత్రం వివరణలు: ఒక పార్టీకి రమ్మని కొంతమంది యౌవన బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఆహ్వానం వచ్చింది. వాళ్లు దానిగురించి మాట్లాడుకుంటున్నారు.

b చిత్రం వివరణ: ఒక బ్రదర్‌ పార్టీకి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకునే ముందు పరిశోధన చేస్తున్నాడు.