కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 5

పాట 108 దేవుని విశ్వసనీయ ప్రేమ

యెహోవా ప్రేమ తెచ్చిపెట్టిన ప్రయోజనాలు

యెహోవా ప్రేమ తెచ్చిపెట్టిన ప్రయోజనాలు

“పాపుల్ని రక్షించడానికి క్రీస్తుయేసు ఈ లోకంలోకి వచ్చాడు.”1 తిమో. 1:15.

ముఖ్యాంశం

విమోచన క్రయధనం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటో, మన కృతజ్ఞతను యెహోవాకు ఎలా చూపించవచ్చో చూస్తాం.

1. యెహోవా సంతోషించాలంటే మనం ఏం చేయాలి?

 మీ మనసుకు బాగా నచ్చిన వ్యక్తికి మీరొక గిఫ్ట్‌ ఇచ్చారనుకోండి. ఆ గిఫ్ట్‌ చాలా అందంగా ఉంది, వాళ్లకు బాగా పనికొస్తుంది. కానీ వాళ్లు దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అటకెక్కించారు కాబట్టి దానికి బూజు పట్టింది. అప్పుడు మీకెలా అనిపిస్తుంది? బాధపడతారు కదా. మరోవైపు, వాళ్లు ఆ గిఫ్ట్‌ని చక్కగా ఉపయోగిస్తూ మీకు థ్యాంక్స్‌ చెప్తే ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుంది కదా. యెహోవా కూడా మనకోసం తన కుమారుణ్ణి ఒక గిఫ్ట్‌గా ఇచ్చాడు. వెలకట్టలేని ఆ గిఫ్ట్‌కి, ఆయన చూపించిన ఆ ప్రేమకు అంటే విమోచన క్రయధనానికి మనం కృతజ్ఞత చూపించినప్పుడు యెహోవా కూడా చాలా సంతోషిస్తాడు.—యోహా. 3:16; రోమా. 5:7, 8.

2. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

2 అయితే, రోజులు గడిచేకొద్దీ విమోచన క్రయధనం అనే గిఫ్ట్‌ని మనం మర్చిపోయే అవకాశం ఉంది. అదెలా ఉంటుందంటే, దేవుడిచ్చిన ఒక మంచి గిఫ్ట్‌ని తీసుకెళ్లి అటకెక్కించినట్టు ఉంటుంది. మొదట్లో చాలా సంతోషించాం కానీ మెల్లిమెల్లిగా దానిగురించి పూర్తిగా మర్చిపోతామేమో. అలా జరగకుండా ఉండాలంటే, యెహోవా అలాగే యేసుక్రీస్తు చూపించిన ప్రేమ గురించి మనం ప్రతీరోజు ఆలోచిస్తూ ఉండాలి. దానికోసమే ఈ ఆర్టికల్‌. విమోచన క్రయధనం వల్ల ఇప్పుడు మనకు వచ్చే ప్రయోజనం ఏంటో, భవిష్యత్తులో వచ్చే ప్రయోజనం ఏంటో ఇందులో చూస్తాం. అంతేకాదు, యెహోవా చూపించిన ప్రేమకు కృతజ్ఞతతో మనం ఏం చేయవచ్చో, ముఖ్యంగా జ్ఞాపకార్థ ఆచరణ నెలలో ఏం చేయవచ్చో చూస్తాం.

ఇప్పుడు మనకేంటి ప్రయోజనం?

3. మనం ఇప్పటికే విమోచన క్రయధనం నుండి పొందే ఒక ప్రయోజనం ఏంటి?

3 విమోచన క్రయధనం వల్ల మనం ఇప్పటికే ప్రయోజనం పొందుతున్నాం. ఉదాహరణకు, విమోచన క్రయధనం ఆధారంగానే యెహోవా మన పాపాల్ని క్షమిస్తున్నాడు. నిజానికి అలా క్షమించాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ ఆయన క్షమించాలని అనుకుంటున్నాడు. గుండె నిండా కృతజ్ఞత నిండిన కీర్తనకర్త ఇలా అన్నాడు: “యెహోవా, నువ్వు మంచివాడివి, క్షమించడానికి సిద్ధంగా ఉంటావు.”—కీర్త. 86:5; 103:3, 10-13.

4. యెహోవా విమోచన క్రయధనం ఎవరి కోసం ఇచ్చాడు? (లూకా 5:32; 1 తిమోతి 1:15)

4 యెహోవా క్షమాపణ పొందడానికి తమకు అర్హత లేదని కొంతమంది అనుకోవచ్చు. నిజానికి మనలో ఎవ్వరికీ ఆ అర్హత లేదు. అపొస్తలుడైన పౌలు కూడా అలాగే అనుకున్నాడు. “అపొస్తలుణ్ణని పిలవబడే అర్హత కూడా నాకు లేదు” కానీ “దేవుని అపారదయ వల్లే నేను అపొస్తలుణ్ణి అయ్యాను” అన్నాడు. (1 కొరిం. 15:9, 10) మన పాపాల విషయంలో పశ్చాత్తాపం చూపించినప్పుడు యెహోవా మనల్ని క్షమిస్తాడు. ఎందుకు? అది మన అర్హత కాదు, ఆయన ప్రేమ. మీకు అర్హత లేదు అనే ఫీలింగ్‌ వస్తే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. అదేంటంటే: యెహోవా ఏ పాపం చేయని వాళ్లకోసం విమోచన క్రయధనం ఇవ్వలేదు గానీ పశ్చాత్తాపం చూపించే పాపుల కోసమే ఇచ్చాడు.—లూకా 5:32; 1 తిమోతి 1:15 చదవండి.

5. యెహోవా కరుణను పొందే హక్కు మనలో ఎవరికైనా ఉందని చెప్పగలమా? వివరించండి.

5 మనలో ఎవ్వరం, ఆఖరికి చాలా సంవత్సరాలు దేవుని సేవ చేసినవాళ్లమైనా సరే, యెహోవా కరుణ పొందే హక్కు మనకు ఉందని అనుకోవద్దు. నిజమే, నమ్మకంగా మనం చేసిన సేవను యెహోవా అస్సలు మర్చిపోడు. (హెబ్రీ. 6:10) అయితే, ఆయన తన కుమారుణ్ణి ఒక ఉచిత బహుమతిగా ఇచ్చాడు గానీ మనం చేసిన సేవకు జీతంగా కాదు. మనం యెహోవా కరుణను సంపాదించుకున్నాం అని గానీ లేదా యెహోవా సేవ చేశాను కాబట్టి నాకు ఇది దక్కాలని గానీ అనుకుంటే మనం ఒకవిధంగా ఇలా చెప్తున్నట్టే: ‘యేసుక్రీస్తు నాకోసం చనిపోలేదు.’—గలతీయులు 2:21 తో పోల్చండి.

6. పౌలు యెహోవా సేవలో ఎందుకు కష్టపడి పనిచేశాడు?

6 దేవుని కరుణ తను సంపాదించుకునే ఒక హక్కు కాదని పౌలుకు తెలుసు. మరి యెహోవా సేవలో ఆయన ఎందుకంత కష్టపడ్డాడు? తనకు ఆ హక్కు ఉందని నిరూపించుకోవడానికి కాదుగానీ యెహోవా అపారదయ మీద తనకున్న కృతజ్ఞత చూపించడానికే అలా చేశాడు. (ఎఫె. 3:7) పౌలులాగే మనం కూడా యెహోవా కరుణను సంపాదించుకోవడానికి కాదుగానీ, దానిమీద మనకున్న కృతజ్ఞతను చూపించడానికే ఉత్సాహంగా సేవ చేస్తాం.

7. మనం ఇప్పుడు విమోచన క్రయధనం నుండి పొందే ఇంకో ప్రయోజనం ఏంటి? (రోమీయులు 5:1; యాకోబు 2:23)

7 విమోచన క్రయధనం వల్ల మనం ఇప్పుడు పొందే ఇంకో ప్రయోజనం ఏంటంటే, యెహోవాతో దగ్గరి స్నేహం. a ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు మనకు పుట్టుకతోనే దేవునితో ఒక మంచి సంబంధం లేదు. కానీ విమోచన క్రయధనం వల్ల మనం “దేవునితో శాంతియుత సంబంధాన్ని” ఆస్వాదిస్తున్నాం, ఆయనకు దగ్గరౌతున్నాం.—రోమీయులు 5:1; యాకోబు 2:23 చదవండి.

8. ప్రార్థన అనే వరం ఇచ్చినందుకు మనం యెహోవాకు ఎందుకు కృతజ్ఞతతో ఉండవచ్చు?

8 యెహోవాతో మన స్నేహానికి సంబంధించిన ఒక విషయం గురించి ఆలోచించండి, అదే ప్రార్థన అనే వరం. తన సేవకులు రాజ్యమందిరంలో కలుసుకున్నప్పుడు చేసే ప్రార్థనలే కాదు, మనలో ప్రతీఒక్కరం హృదయంలో మౌనంగా చేసుకునే ప్రార్థనలు కూడా యెహోవా వింటాడు. ప్రార్థన మన హృదయాన్ని నెమ్మదిగా ఉంచుతుంది, మనశ్శాంతిని ఇస్తుంది. అయితే, ప్రార్థన కేవలం మనశ్శాంతికి ఒక మందు కాదు. అది యెహోవాతో మనకున్న స్నేహాన్ని పెంచే మార్గం. (కీర్త. 65:2; యాకో. 4:8; 1 యోహా. 5:14) భూమ్మీదున్నప్పుడు యేసుక్రీస్తు చాలాసార్లు ప్రార్థన చేశాడు. ఎందుకంటే యెహోవా తన ప్రార్థనను వింటున్నాడని, అది తన తండ్రితో ఉన్న బంధాన్ని బలంగా ఉంచుతుందని ఆయనకు తెలుసు. (లూకా 5:16) యేసు ఇచ్చిన బలి వల్ల మనం యెహోవాకు ఫ్రెండ్స్‌ అవ్వొచ్చు, ప్రార్థనలో ఆయనతో డైరెక్ట్‌గా మాట్లాడవచ్చు. అది ఆలోచించినప్పుడు మన హృదయం కృతజ్ఞతతో పొంగిపోతుంది.

భవిష్యత్తులో వచ్చే ప్రయోజనం ఏంటి?

9. యెహోవా నమ్మకమైన ఆరాధకులకు విమోచన క్రయధనం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రయోజనం ఏంటి?

9 యెహోవా నమ్మకమైన ఆరాధకులకు విమోచన క్రయధనం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రయోజనం ఏంటి? యెహోవా వాళ్లకు శాశ్వత జీవితాన్ని ఇస్తాడు. అది అసంభవమని చాలామంది ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే వేల సంవత్సరాలుగా ప్రజలు చనిపోతూనే ఉన్నారు. కానీ యెహోవా మనుషుల్ని సృష్టించింది చనిపోవడానికి కాదు, శాశ్వతకాలం బ్రతకడానికి. ఒకవేళ ఆదాముహవ్వలు పాపం చేసుండకపోతే శాశ్వతకాల జీవితమనేది పగటి కలగా ఉండేదికాదు. ప్రస్తుతం శాశ్వతకాల జీవితం మన ఊహకు అందనట్టుగా అనిపించవచ్చు. కానీ దాన్ని సాధ్యం చేయడానికి యెహోవా మన ఊహకందనంత పెద్ద బహుమతి ఇచ్చాడు. అదే తన ప్రియకుమారుని ప్రాణం!—రోమా. 8:32.

10. అభిషిక్తులు, వేరేగొర్రెలు దేనికోసం ఎదురుచూడవచ్చు?

10 శాశ్వత జీవితం భవిష్యత్తులో మనకు వచ్చే ప్రయోజనమే అయినా ఇప్పటి నుండి మనం దానిగురించి ఆలోచించాలని యెహోవా కోరుకుంటున్నాడు. అభిషిక్తులు పరలోకంలో క్రీస్తుతోపాటు ఈ భూమిని పరిపాలించడం గురించి ఎదురుచూస్తారు. (ప్రక. 20:6) వేరేగొర్రెలు పరదైసు భూమ్మీద ఏ నొప్పి, బాధ లేని జీవితం గురించి ఎదురుచూస్తారు. (ప్రక. 21:3, 4) మీరు భూమ్మీద మరణమే లేని అంతులేని జీవితం కోసం ఎదురుచూసే వేరేగొర్రెలా? మీ బహుమానం పరలోక బహుమతికి ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే యెహోవా మనుషుల్ని సృష్టించింది ఈ భూమ్మీద జీవించడం కోసమే. నిజానికి, కొత్తలోకంలో సంతోషానికే అలసట వచ్చేంత సంతోషం మీ సొంతం!

11-12. పరదైసులో ఏ ఆనందాల కోసం మనం ఎదురుచూడవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

11 పరదైసు భూమ్మీద జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. రోగాల గురించి, చావు గురించి ఆలోచనే ఉండదు. (యెష. 25:8; 33:24) మీ ప్రతీ కోరికను యెహోవా తీరుస్తాడు. మీకు ఏదంటే బాగా ఇష్టం? ఫిజిక్స్‌హా? కెమిస్ట్రీనా? మ్యూజిక్‌హా? బొమ్మలేయడమా? ఇవన్నీ మీరు అక్కడ చేయవచ్చు. మనకు కొత్తలోకంలో ఇంటి ప్లాన్‌లు గీసేవాళ్లు, వాటిని కట్టేవాళ్లు, రైతులు అందరూ కావాలి. వీళ్లతోపాటు వంటవాళ్లు, పనిముట్లు తయారుచేసేవాళ్లు, అందమైన తోటను తయారుచేసేవాళ్లు, దాన్ని చూసుకునేవాళ్లు కావాలి. (యెష. 35:1; 65:21) మీకు అంతులేని ఆయుష్షు ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన, మీరు మెచ్చిన పనిని చేస్తూ ఉండడానికి బోలెడంత టైం ఉంటుంది.

12 పునరుత్థానమైనవాళ్లను చూసినప్పుడు సంతోషంతో మన ఒళ్లు పులకించిపోతుంది. (అపొ. 24:15) కొత్తలోకంలో యెహోవా అందమైన సృష్టిని చూస్తూ ఆయన గురించి కొత్తకొత్త విషయాలు తెలుసుకోవడం ఎంతబాగుంటుందో ఊహించుకోండి. (కీర్త. 104:24; యెష. 11:9) అన్నిటికి మించి, మనం తప్పు చేయం, తప్పు చేశామనే బాధా ఉండదు. అలాంటి ఒక మనసుతో యెహోవాను ఆరాధించడం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! ఇప్పుడున్న “తాత్కాలిక సుఖాల” కోసం ఆ ఆనందాలన్నిటినీ పణంగా పెట్టగలమా చెప్పండి! (హెబ్రీ. 11:25) ఇప్పుడు మనం చేసే ఏ త్యాగమైనా ఆ ఆనందాలకు సాటిరావు. పరదైసు భూమి ఎప్పుడూ తీరని కోరికగా మిగిలిపోదని గుర్తుంచుకోండి. త్వరలోనే అదొక వాస్తవంగా మారబోతుంది. నిజానికి యెహోవా మన మీద ప్రేమతో తన కుమారుణ్ణి ఇచ్చుండకపోతే అది సాధ్యమయ్యే పనికాదు.

పరదైసులో ఏ ఆనందాల కోసం మీ కళ్లు ఎదురుచూస్తున్నాయి? (11-12 పేరాలు చూడండి)


యెహోవా ప్రేమకు తిరిగి ఏం ఇవ్వొచ్చు?

13. యెహోవా ప్రేమకు కృతజ్ఞతగా తిరిగి ఏం ఇవ్వొచ్చు? (2 కొరింథీయులు 6:1)

13 యెహోవా విమోచన క్రయధనం ఇచ్చినందుకు కృతజ్ఞతగా తిరిగి మనం ఏం ఇవ్వొచ్చు? మన జీవితంలో ఆయన పనికే మొదటిస్థానం ఇవ్వాలి. (మత్త. 6:33) ఎంతైనా “బ్రతికున్నవాళ్లు ఇకమీదట తమకోసం జీవించకుండా, తమకోసం చనిపోయి బ్రతికించబడిన వ్యక్తి కోసం జీవించాలని ఆయన అందరి కోసం చనిపోయాడు.” (2 కొరిం. 5:15) అవును మనం దేవుని అపారదయ ఉద్దేశాన్ని అస్సలు మర్చిపోకూడదు.—2 కొరింథీయులు 6:1 చదవండి.

14. యెహోవా ఇచ్చే నిర్దేశం మీద మనం నమ్మకాన్ని ఎలా చూపించవచ్చు?

14 యెహోవా చూపించిన ప్రేమకు కృతజ్ఞతగా ఆయన ఇచ్చే నిర్దేశాల మీద నమ్మకముంచాలి. ఎలా? మనం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అంటే ఎంతవరకు చదువుకోవాలి, ఎలాంటి ఉద్యోగం చేయాలి లాంటి నిర్ణయాల్లో యెహోవా ఏం కోరుకుంటున్నాడో ఆలోచించాలి. (1 కొరిం. 10:31; 2 కొరిం. 5:7) మన విశ్వాసాన్ని పనుల్లో చూపించాలి. అప్పుడు దేవుని మీద మన నమ్మకం, ఆయనతో మనకున్న స్నేహం ఇంకా పెరుగుతాయి. అంతేకాదు, భవిష్యత్తు మీద మనకున్న ఆశకు ఆయువు పోసిన వాళ్లమౌతాం!—రోమా. 5:3-5; యాకో. 2:21, 22.

15. మన కృతజ్ఞతను జ్ఞాపకార్థ ఆచరణ నెలలో ఎలా చూపించవచ్చు?

15 యెహోవా ప్రేమకు కృతజ్ఞత చూపించే ఇంకొక పద్ధతి ఏంటంటే, విమోచన క్రయధనానికి మనమెంత రుణపడి ఉన్నామో చూపించడానికి జ్ఞాపకార్థ ఆచరణ నెలను చక్కగా ఉపయోగించడం. మనం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి ప్రణాళిక వేసుకోవడంతో పాటు వేరేవాళ్లను పిలవచ్చు. (1 తిమో. 2:4) జ్ఞాపకార్థ ఆచరణలో ఏం జరుగుతుందో వాళ్లకు వివరించవచ్చు. jw.orgలో ఉన్నయేసు ఎందుకు చనిపోయాడు? అలాగే యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి లాంటి వీడియోలు చూపించండి. సంఘపెద్దలు నిష్క్రియుల్ని ఆహ్వానించాలి. ఎందుకంటే, తప్పిపోయిన గొర్రె తిరిగి మందలో కలిసినప్పుడు పరలోకంలో అలాగే భూమ్మీద ఎంత ఆనందం కలుగుతుందో ఊహించండి! (లూకా 15:4-7) జ్ఞాపకార్థ ఆచరణకు వెళ్లినప్పుడు మనం ఒకర్నొకరం పలకరించుకోవడంతో పాటు, కొత్తవాళ్లను అలాగే చాలాకాలం తర్వాత మీటింగ్‌కి వచ్చినవాళ్లను పలకరించడం మర్చిపోకండి. వాళ్లు వచ్చినందుకు మనం సంతోషిస్తున్నాం అని చూపిద్దాం!—రోమా. 12:13.

16. జ్ఞాపకార్థ ఆచరణ నెలలో ప్రీచింగ్‌ ఎందుకు ఎక్కువ చేయాలి?

16 జ్ఞాపకార్థ ఆచరణ నెలలో యెహోవా సేవ ఇంకా ఎక్కువ చేయగలరా? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు మనకోసం చేసినదాని మీద కృతజ్ఞత చూపించడానికి అదొక మంచి పద్ధతి. ఆ సమయంలో మనం యెహోవా సేవలో ఎంతెక్కువ మునిగిపోతే, ఆయన మద్దతును అంతగా రుచి చూస్తాం. దానివల్ల ఆయన మీద మనకున్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. (1 కొరిం. 3:9) అంతేకాదు, దినవచనంలో వచ్చే బైబిలు పఠన భాగాన్ని చదవచ్చు లేదా మీటింగ్‌ వర్క్‌బుక్‌లో ఇచ్చే చార్టును చూడొచ్చు. వాటిని ఒక స్టడీ ప్రాజెక్టుగా కూడా చేసుకోవచ్చు.

17. యెహోవాకు ఏది సంతోషాన్నిస్తుంది? (“ యెహోవా ప్రేమకు తిరిగి ఏం ఇవ్వొచ్చు?” బాక్స్‌ కూడా చూడండి.)

17 నిజమే ఈ ఆర్టికల్‌లో ఉన్న ప్రతీది చేసే పరిస్థితి మీకు ఉండకపోవచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. అదేంటంటే, యెహోవా మీరు చేసే సేవను వేరేవాళ్లు చేసే సేవతో పోల్చడు. ఆయన మీ హృదయంలో ఏముందో చూస్తాడు. ఆయన ఇచ్చిన విమోచన క్రయధనం అనే వెలకట్టలేని బహుమతి మీద మీ మనసు నిండా కృతజ్ఞత ఉండడం ఆయన చూస్తే చాలా సంతోషిస్తాడు.—1 సమూ. 16:7; మార్కు 12:41-44.

18. యెహోవాకు, యేసుకు మనం ఎందుకు రుణపడి ఉండాలి?

18 కేవలం విమోచన క్రయధనం వల్లే మన పాపాలకు క్షమాపణ, యెహోవాతో స్నేహం, శాశ్వతకాలం జీవించే ఆశ మనకు వచ్చాయి. కాబట్టి యెహోవా చూపించిన ప్రేమకు, ఆ ప్రేమతో ఆయన మనకిచ్చే దీవెనలకు ఎప్పుడూ రుణపడి ఉందాం. (1 యోహా. 4:19) అలాగే మన తరఫున తన ప్రాణాన్ని ఇష్టంగా ఇచ్చిన యేసుక్రీస్తు మీద కూడా కృతజ్ఞత చూపిద్దాం.—యోహా. 15:13.

పాట 154 ప్రేమ శాశ్వతమైనది

a యేసుక్రీస్తు విమోచన క్రయధనం చెల్లించడానికి ముందే యెహోవా తన నమ్మకమైన సేవకుల పాపాల్ని క్షమించాడు. ఎందుకంటే, తన కుమారుడు చనిపోయే వరకు యథార్థంగా ఉంటాడనే నమ్మకం యెహోవాకు ఉంది. అలా, దేవుని దృష్టిలో విమోచన క్రయధనం యేసు చనిపోకముందే చెల్లించబడినట్టు లెక్క.—రోమా. 3:25.