కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 4

పాట 18 విమోచన క్రయధనం పట్ల కృతజ్ఞత

విమోచన క్రయధనం నేర్పే పాఠాలు

విమోచన క్రయధనం నేర్పే పాఠాలు

“ఆయనకు మనమీద ఉన్న ప్రేమ వెల్లడైంది.”1 యోహా. 4:9.

ముఖ్యాంశం

యెహోవాను, యేసుక్రీస్తును ఇంకా బాగా ఇష్టపడేలా చేసే ఏ లక్షణాలు విమోచన క్రయధనం చూపిస్తుంది?

1. ప్రతీ సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడం వల్ల మనకేంటి ప్రయోజనం?

 విమోచన క్రయధనం మాటల్లో వర్ణించలేని గొప్ప బహుమతి! (2 కొరిం. 9:15) యేసు తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి మీరు యెహోవాకు మంచి ఫ్రెండ్‌ అవ్వగలిగారు. అలాగే శాశ్వతకాలం జీవించే ఆశ మీకు దొరికింది. ఆ బహుమతికి, దాన్ని ఇచ్చిన యెహోవాకు జీవితాంతం మనం రుణపడి ఉంటాం! (రోమా. 5:8) ఆ బహుమతిని మర్చిపోకుండా ఉండడానికి, దాని మీద కృతజ్ఞత ఉప్పొంగడానికి ప్రతీ సంవత్సరం తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసు చెప్పాడు.—లూకా 22:19, 20.

2. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

2 ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ 2025, ఏప్రిల్‌ 12 శనివారం రోజున జరుపుకుంటాం. మనందరం దానికి హాజరవ్వడానికి ప్రణాళికలు వేసుకుంటాం. యెహోవా అలాగే యేసు మనకోసం చేసిన వాటిగురించి జ్ఞాపకార్థ ఆచరణ నెలలో సమయం తీసుకుని ఆలోచించినప్పుడు a ఎంతో ప్రయోజనం పొందుతాం. ఈ ఆర్టికల్‌లో యెహోవా గురించి, యేసు గురించి విమోచన క్రయధనం ఏం నేర్పిస్తుందో చూస్తాం. తర్వాతి ఆర్టికల్‌లో, విమోచన క్రయధనం నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చో అలాగే దానికి ఎలా కృతజ్ఞత చూపించవచ్చో నేర్చుకుంటాం.

విమోచన క్రయధనం యెహోవా గురించి ఏం నేర్పిస్తుంది?

3. ఒక్క వ్యక్తి చనిపోవడం వల్ల ఎంతోమంది ప్రజలు పాపం, మరణం నుండి ఎలా విడుదల పొందుతారు? (చిత్రం కూడా చూడండి.)

3 యెహోవా న్యాయాన్ని ప్రేమించే దేవుడు అని విమోచన క్రయధనం మనకు నేర్పిస్తుంది. (ద్వితీ. 32:4) అదెలాగో గమనించండి. ఆదాము యెహోవా మాట వినలేదు కాబట్టి మనందరికీ పాపం వారసత్వంగా వచ్చింది. దానివల్ల మనం చనిపోతున్నాం. (రోమా. 5:12) పాపం నుండి, మరణం నుండి మనల్ని విడిపించడానికి యెహోవా యేసును పంపించి, విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు. ఒక్క పరిపూర్ణ వ్యక్తి చనిపోతే ఎంతోమంది ప్రజలు ఎలా విడుదల పొందుతారు? అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “ఒక్క మనిషి [ఆదాము] అవిధేయత ద్వారా అనేకులు పాపులైనట్టే, ఒక్క మనిషి [యేసు] విధేయత ద్వారా అనేకులు నీతిమంతులౌతారు.” (రోమా. 5:19; 1 తిమో. 2:6) ఇంకోమాటలో చెప్పాలంటే, ఒక్క పరిపూర్ణ వ్యక్తి అవిధేయత చూపించడం వల్ల మనుషులందరికీ పాపం, మరణం వచ్చాయి. కాబట్టి ఒక్క పరిపూర్ణ వ్యక్తి విధేయత చూపించడం వల్ల అందరూ విడుదల పొందుతారు.

ఒక్క వ్యక్తి మనల్ని పాపానికి, మరణానికి బానిస చేశాడు. అలాగే ఒక్క వ్యక్తి మనల్ని విడిపించాడు (3వ పేరా చూడండి)


4. తన మాట విన్న ఆదాము పిల్లల్ని శాశ్వతకాలం జీవించడానికి యెహోవా ఎందుకు అనుమతించలేదు?

4 అసలు మనల్ని విడిపించడానికి యేసు చనిపోవాల్సిన అవసరం ఉందా? సింపుల్‌గా యెహోవా తన మాట వినే ఆదాము పిల్లల్ని శాశ్వతకాలం జీవించడానికి అనుమతించేయొచ్చు కదా? అలా చేసినా బాగుండేదని మనకు అనిపించవచ్చు. కానీ అలా చేస్తే, యెహోవా న్యాయానికి అది సరితూగదు. ఎందుకంటే ఆదాము చేసిన తప్పును యెహోవా చూసీచూడనట్టు వదిలేయలేడు.

5. యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

5 ఒకసారి ఇలా ఆలోచించండి. యెహోవా విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేయకుండా, పాపులైన ఆదాము పిల్లల్ని శాశ్వతకాలం జీవించడానికి అనుమతిస్తే, ఏమైవుండేది? యెహోవా తను పెట్టిన ప్రమాణాల్ని తానే పట్టించుకోడని, భవిష్యత్తులో ఆయన చెప్పినవాటిని చేయడేమో అని మనుషులు అనుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అలా జరుగుతుందని మనం కంగారుపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే, న్యాయం కోసం తన ఒక్కగానొక్క కొడుకునే త్యాగం చేసిన యెహోవా ఎప్పుడూ సరైనదే చేయడంటారా?

6. విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేయడానికి యెహోవాను కదిలించిన ఇంకో లక్షణం ఏంటి? (1 యోహాను 4:9, 10)

6 యెహోవా గుండె లోతుల్లో మనమీద ఎంత ప్రేమ ఉందో విమోచన క్రయధనం చూపిస్తుంది. (యోహా. 3:16; 1 యోహాను 4:9, 10 చదవండి.) యెహోవా యేసును మనకోసం త్యాగం చేయడం ద్వారా శాశ్వత జీవితాన్ని ఇవ్వడమే కాదు, మనం తన కుటుంబంలో ఒకరిగా ఉండాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆదాము పాపం చేసినప్పుడు యెహోవా తన కుటుంబంలో నుండి అతన్ని బయటికి పంపించేశాడు. అలా బయటికి వచ్చిన తర్వాతే మనందరం పుట్టాం. కానీ విమోచన క్రయధనం ఆధారంగా యెహోవా మన పాపాల్ని క్షమిస్తున్నాడు. అలాగే తన మాట విని, విశ్వాసం చూపించే ప్రతీఒక్కర్ని చివరికి ఆయన తన కుటుంబంలోకి తీసుకుంటాడు. అయితే ఇప్పుడు కూడా యెహోవాతో అలాగే బ్రదర్స్‌సిస్టర్స్‌తో మనం దగ్గరి స్నేహాన్ని ఆస్వాదించవచ్చు. నిజంగా, యెహోవాకు మనమీద ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేం!—రోమా. 5:10, 11.

7. యెహోవా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలంటే మనం దేని గురించి ఆలోచించాలి?

7 తన కుమారుడు నొప్పితో విలవిలలాడడం చూసి యెహోవా గుండె ఎంత తరుక్కుపోయి ఉంటుంది. దాని గురించి ఆలోచించినప్పుడు ఆయనకు మనమీద ఎంత ప్రేముందో తెలుస్తుంది. ఏ చిన్న కష్టమొచ్చినా మనుషులు యెహోవాకు నమ్మకంగా ఉండరని సాతాను నిందించాడు. అది పచ్చి అబద్ధమని నిరూపించడానికి యేసు బాధలు పడి, చనిపోయేలా యెహోవా అనుమతించాడు. (యోబు 2:1-5; 1 పేతు. 2:21) తన కళ్లముందే మతనాయకులు యేసును ఎగతాళి చేశారు, సైనికులు కొట్టారు, ఆయన్ని మేకులతో కొయ్యకు దిగగొట్టారు. తన ప్రియమైన కుమారుడు అంత బాధను అనుభవిస్తూ చనిపోతుంటే యెహోవా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. (మత్త. 27:28-31, 39) అక్కడ జరుగుతున్న దాన్ని ఏ క్షణంలోనైనా ఆపే శక్తి యెహోవాకు ఉంది. ఉదాహరణకు, అక్కడున్న ప్రజలు ఇలా అన్నారు: “ఇతను దేవునికి ఇష్టమైన వ్యక్తయితే దేవుణ్ణే ఇతన్ని కాపాడనివ్వండి.” నిజానికి, యెహోవా వాళ్లు చెప్పినట్టే చేసుండవచ్చు. (మత్త. 27:42, 43) కానీ ఒకవేళ ఆయన అలా చేసుంటే, మన కోసం ఎలాంటి విమోచన క్రయధనమూ చెల్లించబడేది కాదు. అలాగే మనకు ఏ నిరీక్షణా ఉండేదికాదు. కాబట్టి తన కుమారుడు చివరిశ్వాస వరకు ఎంతో బాధ అనుభవించి, చనిపోయేలా యెహోవా అనుమతించాడు.

8. కళ్లముందు కొడుకు బాధపడుతుంటే యెహోవాకు ఎలా అనిపించిందో వివరించండి. (చిత్రం కూడా చూడండి.)

8 యెహోవా సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనకు ఎలాంటి ఫీలింగ్స్‌ లేవని మనం అనుకోకూడదు. మనం ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాం. మనకు సంతోషం వస్తే నవ్వుతాం, దుఃఖం వస్తే ఏడుస్తాం. మనకే అలాంటి ఫీలింగ్స్‌ ఉన్నాయంటే యెహోవాకు ఖచ్చితంగా ఉంటాయి. నిజానికి, ఒక సందర్భంలో ఆయన ‘బాధపడ్డాడు,’ ‘దుఃఖపడ్డాడు’ అని బైబిలు చెప్తుంది. (కీర్త. 78:40, 41) ఒకసారి అబ్రాహాము, ఇస్సాకు గురించి ఆలోచించండి. కన్న కొడుకుని బలి ఇవ్వమని యెహోవా అబ్రాహాముకు చెప్పాడు. (ఆది. 22:9-12; హెబ్రీ. 11:17-19) లేకలేక పుట్టిన కొడుకు మీద కత్తిపెట్టి చంపడానికి సిద్ధపడినప్పుడు, అబ్రాహాము గుండెల్లోని భావాలు వరదలా పొంగుంటాయి. మరి అలాంటిది తన కళ్లముందే తన కొడుకుని చిత్రహింసలు పెట్టి చంపుతుంటే, యెహోవా ఎంత నలిగిపోయుంటాడో ఊహించండి.—jw.orgలో వాళ్లలా విశ్వాసం చూపించండి—అబ్రాహాము, 2వ భాగం వీడియో చూడండి.

కొడుకు బాధ చూసి యెహోవా నలిగిపోయాడు (8వ పేరా చూడండి)


9. యెహోవాకు మీమీద, మీ తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ మీద ఎంత ప్రేముందో అర్థం చేసుకోవడానికి రోమీయులు 8:32, 38, 39 ఎలా సహాయం చేస్తుంది?

9 యెహోవా మనల్ని ప్రేమించినంతగా మన ఇంట్లోవాళ్లు గానీ మన బెస్ట్‌ ఫ్రెండ్స్‌ గానీ మనల్ని ప్రేమించలేరని విమోచన క్రయధనమే ఒక రుజువు. (రోమీయులు 8:32, 38, 39 చదవండి.) మనల్ని మనం ప్రేమించుకునే దానికన్నా, యెహోవా మనల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. మీరు శాశ్వతకాలం జీవించాలని కోరుకుంటున్నారా? మీకన్నా ఎక్కువ యెహోవా కోరుకుంటున్నాడు. మీ పాపాలన్నీ క్షమించబడాలని కోరుకుంటున్నారా? మీకన్నా ఎక్కువ యెహోవా కోరుకుంటున్నాడు. ఆయన అడిగేదల్లా ఒక్కటే: ఆయన ప్రేమతో ఇచ్చిన బహుమతిని మనం తీసుకుని, తనమీద విశ్వాసం చూపించాలి, తనకు లోబడి ఉండాలి. విమోచన క్రయధనం దేవుని ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. అంతేకాదు, కొత్తలోకంలో దేవుని ప్రేమకు ఇంకెన్నో రుజువుల్ని చూస్తాం.—ప్రసం. 3:11.

విమోచన క్రయధనం యేసు గురించి ఏం నేర్పిస్తుంది?

10. (ఎ) యేసు ఏ విషయంలో కుమిలిపోయాడు? (బి) యెహోవా పేరును యేసు ఎలా పవిత్రపర్చాడు? (“ యేసు చివరివరకు యథార్థంగా ఉండి యెహోవా పేరును పవిత్రపర్చాడు” బాక్స్‌ కూడా చూడండి.)

10 తన తండ్రి పేరు ఎక్కడ పాడౌతుందో అని యేసు బాధపడ్డాడు. (యోహా. 14:31) దైవదూషణ, రాజద్రోహం చేశాడనే నిందతో చనిపోతే తన తండ్రికి చెడ్డపేరు వస్తుందని యేసు కుమిలిపోయాడు. ఆయన అందుకే ఇలా ప్రార్థించాడు: “నా తండ్రీ, సాధ్యమైతే దయచేసి ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయి.” (మత్త. 26:39) తన చివరి శ్వాస వరకు యథార్థంగా ఉండడం ద్వారా యేసు తన తండ్రి పేరును పవిత్రపర్చాడు.

11. యేసు ప్రజల మీద ప్రేమ ఎలా చూపించాడు? (యోహాను 13:1)

11 యేసు ప్రజల్ని ఎంతో పట్టించుకున్నాడని, ముఖ్యంగా శిష్యుల్ని పట్టించుకున్నాడని విమోచన క్రయధనం చూపిస్తుంది. (సామె. 8:31; యోహాను 13:1 చదవండి.) ఉదాహరణకు, యేసు భూమ్మీద చేయాల్సిన కొన్ని పనులు అంత ఈజీ కాదని ఆయనకు తెలుసు. ముఖ్యంగా, బాధలుపడి చనిపోవడం అంత ఈజీ కాదు. అయినాసరే, యేసు తన నియామకాన్ని ఏదో చేయాలి కదా అన్నట్టు చేయలేదు. బదులుగా ఆయన మనసుపెట్టి ప్రీచింగ్‌ చేశాడు, బోధించాడు, ఇతరులకు సేవచేశాడు. ఆఖరికి ఆయన చనిపోయే ముందురోజు రాత్రి కూడా అపొస్తలుల కాళ్లు కడిగాడు. వాళ్లకు ఓదార్పును, ఉపదేశాన్ని ఇచ్చే మాటలతో వీడ్కోలు చెప్పాడు. (యోహా. 13:12-15) యేసు కొయ్యమీద వేలాడుతూ విలవిలలాడుతున్నప్పుడు కూడా, తన పక్కన ఉన్న నేరస్తునికి భవిష్యత్తు మీద ఒక ఆశను ఇచ్చాడు. అలాగే తన తల్లి బాగోగులు చూసుకోవడానికి ఏర్పాటు చేశాడు. (లూకా 23:42, 43; యోహా. 19:26, 27) యేసుకున్న ప్రేమ తన చావులోనే కాదు ఆయన బ్రతికిన విధానంలో కూడా కనిపిస్తుంది.

12. యేసు త్యాగాలు తన మరణంతోనే ఆగిపోలేదని ఎందుకు చెప్పవచ్చు?

12 యేసు మనందరి కోసం “ఒక్కసారే” చనిపోయాడు. కానీ ఆయన త్యాగాలు అక్కడితో ఆగిపోలేదు. (రోమా. 6:10) ఆయన ఏమేమి చేస్తున్నాడు? ఆయన తన సమయాన్ని, శక్తిని పెట్టి విమోచన క్రయధనం వల్ల వచ్చే ప్రయోజనాలు మనకు అందేలా చూసుకుంటున్నాడు. ఏయే విషయాల్లో ఆయన బిజీగా ఉన్నాడో గమనించండి. ఆయన ఒక రాజుగా, ప్రధాన యాజకుడిగా, సంఘానికి శిరస్సుగా సేవచేస్తున్నాడు. (1 కొరిం. 15:25; ఎఫె. 5:23; హెబ్రీ. 2:17) ఆయన అభిషిక్త క్రైస్తవుల్ని పరలోకానికి సమకూర్చడంలో అలాగే గొప్ప సమూహాన్ని సమకూర్చడంలో బిజీగా ఉన్నాడు. ఆ పని మహాశ్రమ ముగిసేలోపు పూర్తౌతుంది. b (మత్త. 25:32; మార్కు 13:27) ఈ చివరిరోజుల్లో దేవుని నమ్మకమైన సేవకులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇచ్చి, వాళ్లను పోషించే బాధ్యతను కూడా యేసు చూసుకుంటున్నాడు. (మత్త. 24:45) వెయ్యేళ్ల పరిపాలన సమయంలో కూడా మనకు ఏం కావాలో అదంతా యేసు చూసుకుంటాడు. ఎంతైనా మనకోసమే యెహోవా తన కుమారుణ్ణి ఇచ్చాడు కదా!

నేర్చుకోవడం ఆపకండి

13. యెహోవా, యేసుక్రీస్తు చూపించిన ప్రేమ గురించి నేర్చుకోవడానికి మనం ఏం చేయవచ్చు?

13 యెహోవా అలాగే యేసుక్రీస్తు చేసిన త్యాగం గురించి బాగా ఆలోచిస్తే, వాళ్ల ప్రేమను ఇంకా ఎక్కువ రుచిచూడవచ్చు. బహుశా ఈ జ్ఞాపకార్థ ఆచరణ నెలలో ఒకటి లేదా రెండు సువార్త పుస్తకాల్ని మీరు జాగ్రత్తగా చదవచ్చు. ఒకేసారి అధ్యాయాల మీద అధ్యాయాలు చదవకండి. బదులుగా కాస్త నెమ్మదిగా చదువుతూ యెహోవాను, యేసును ఎందుకు ప్రేమించాలో ఇంకొన్ని కారణాల కోసం వెదకండి. అయితే, మీరు నేర్చుకున్నవి వేరేవాళ్లకు చెప్పడం మర్చిపోకండి.

14. కీర్తన 119:97 అలాగే అధస్సూచి ప్రకారం, విమోచన క్రయధనం గురించి అలాగే వేరే అంశాల గురించి నేర్చుకుంటూ ఉండడానికి ఏం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)

14 మీరు ఎన్నో సంవత్సరాల నుండి సత్యంలో ఉండివుంటే యెహోవా న్యాయం, ప్రేమ, విమోచన క్రయధనం గురించి కొత్త విషయాలు ఇంకా ఏముంటాయి అనిపించవచ్చు. వాస్తవమేమిటంటే, వీటి గురించి అలాగే వేరే అంశాల గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువే! కాబట్టి మీరు ఏం చేయవచ్చు? మన ప్రచురణల్ని బాగా చదవండి. బైబిలు చదువుతున్నప్పుడు మీకు ఏమైనా అర్థం కాకపోతే పరిశోధన చేయండి. ఆ తర్వాత రోజంతా మీరు చదివిన దానిగురించి, యెహోవా, యేసు చూపించిన ప్రేమ గురించి ఏం నేర్చుకున్నారో ఆలోచిస్తూ ఉండండి.—కీర్తన 119:97, అధస్సూచి కూడా చదవండి.

మనం సత్యంలో చాలా సంవత్సరాలుగా ఉంటున్నా విమోచన క్రయధనం మీద కృతజ్ఞత పెంచుకోవచ్చు (14వ పేరా చూడండి)


15. బైబిల్లో ఉన్న రత్నాల్ని మనం ఎందుకు వెదుకుతూ ఉండాలి?

15 మీరు బైబిలు చదువుతున్నప్పుడు లేదా పరిశోధన చేస్తున్నప్పుడు ఏదైనా కొత్త విషయం గానీ, ఆసక్తికరమైన విషయం గానీ దొరకకపోతే డీలాపడిపోకండి. బంగారం కోసం వెదికే వ్యక్తి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. చిన్న బంగారం ముక్క కోసం వాళ్లు ఎన్నో గంటల తరబడి, రోజుల తరబడి వెదుకుతూనే ఉంటారు. అది దొరక్కపోతే డీలాపడి, వెదకడం ఆపరు. ఎందుకంటే, రవ్వంత బంగారమైనా వాళ్లకు చాలా విలువైనది. నిజానికి, బైబిల్లో మనం నేర్చుకునే ప్రతీ కొత్త విషయం బంగారం కన్నా చాలా విలువైన రత్నం లాంటిది. (కీర్త. 119:127; సామె. 8:10) కాబట్టి బైబిలు చదువుతూనే ఉండండి, కొత్త విషయాల కోసం ఓపిగ్గా వెదుకుతూనే ఉండండి.—కీర్త. 1:2.

16. యెహోవాను, యేసును ఎలా అనుకరించవచ్చు?

16 బైబిల్ని చదివి, ధ్యానిస్తున్నప్పుడు మీరు నేర్చుకున్న వాటిని మీ జీవితంలో ఎక్కడ పాటించాలో ఆలోచించండి. ఉదాహరణకు, అందర్నీ సమానంగా చూస్తూ యెహోవాలా న్యాయంగా ఉండండి. యెహోవా పేరు కోసం అలాగే మీ బ్రదర్స్‌సిస్టర్స్‌ కోసం ఏం చేయడానికైనా వెనకాడకుండా ఉండడం ద్వారా యేసులా ప్రేమ చూపించండి. అంతేకాదు, యేసులా ప్రీచింగ్‌ చేస్తూ యెహోవా ఇచ్చిన వెలకట్టలేని బహుమతి గురించి ప్రజలందరూ తెలుసుకునే అవకాశం ఇవ్వండి.

17. తర్వాతి ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

17 విమోచన క్రయధనం గురించి మనం ఎంతెక్కువ నేర్చుకుంటే యెహోవా మీద, యేసు మీద అంతెక్కువ ప్రేమ చూపిస్తాం. తిరిగి వాళ్లు కూడా మన మీద పట్టలేనంత ప్రేమ కురిపిస్తారు. (యోహా. 14:21; యాకో. 4:8) కాబట్టి విమోచన క్రయధనం గురించి నేర్చుకోవడానికి యెహోవా మనకు ఇచ్చిన వాటన్నిటినీ బాగా ఉపయోగించండి. విమోచన క్రయధనం వల్ల వచ్చే ఇంకొన్ని ప్రయోజనాలు ఏంటో, దానికి మనం ఎలా కృతజ్ఞత చూపించవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

పాట 107 దేవునిలా ప్రేమ చూపిద్దాం

a పదాల వివరణ: సమయం తీసుకొని “ఆలోచించడం” లేదా ధ్యానించడం అంటే మన ఆలోచనలన్నీ ఒక్క అంశం చుట్టే తిరగడం అలాగే దానిగురించి ఇంకా లోతుగా పరిశీలించడం.

b ఎఫెసీయులు 1:10 లో పౌలు చెప్పిన “పరలోకంలో ఉన్నవాటిని” సమకూర్చడం అలాగే యేసు మత్తయి 24:31, మార్కు 13:27 లో చెప్పిన “ఎంచుకున్న వాళ్లను” సమకూర్చడం రెండు వేర్వేరు విషయాలు. యెహోవా తన కుమారునితో పాటు పరలోకంలో పరిపాలించే వాళ్లను తన పవిత్రశక్తితో అభిషేకించి, వాళ్లను ఎంచుకునే సమయం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. యేసు, మహాశ్రమ సమయంలో మిగిలిన అభిషిక్తులను పరలోకానికి సమకూర్చే సమయం గురించి మాట్లాడుతున్నాడు.