కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇతరుల పొరపాట్లను చూసి యెహోవాకు దూరమవ్వకండి

ఇతరుల పొరపాట్లను చూసి యెహోవాకు దూరమవ్వకండి

“మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి.”కొలొ. 3:13, NW.

పాటలు: 53, 28

1, 2. యెహోవాసాక్షుల సంఖ్య గురించి బైబిలు ముందుగానే ఏమి చెప్పింది?

 భూమ్మీదున్న యెహోవా దేవుని నమ్మకమైన సాక్షులందరూ ఓ ప్రత్యేకమైన సంస్థగా రూపొందారు. ఆ సంస్థలో ఉన్నది అందరిలా పొరపాట్లు చేసే అపరిపూర్ణ మనుషులే. అయినప్పటికీ దేవుడు తన పవిత్రశక్తి ద్వారా వాళ్లను నడిపిస్తూ, అభివృద్ధి చెందేందుకు సహాయం చేస్తున్నాడు. అలా నడిపించిన సందర్భాల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

2 యెహోవాను ఆరాధించే ప్రజలు 1914లో చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవాళ్లు. అయితే వాళ్లు చేసిన ప్రకటనాపనిని యెహోవా ఆశీర్వదించడం వల్ల లక్షలమంది బైబిలు సత్యాల్ని తెలుసుకొని ఆయనకు సాక్షులయ్యారు. తన ప్రజల సంఖ్య అసాధారణ స్థాయికి పెరుగుతుందని యెహోవా ముందుగానే చెప్పాడు. ఆయనిలా అన్నాడు, “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.” (యెష. 60:22) యెహోవా చెప్పిన మాటలు అక్షరాలా నిజమవ్వడాన్ని నేడు మనం కళ్లారా చూస్తున్నాం. అవును, యెహోవా ప్రజలు ఓ గొప్ప జనాంగంగా ఉన్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఉన్న జనాభా కన్నా యెహోవాసాక్షుల సంఖ్యే ఎక్కువగా ఉంది.

3. దేవుని సేవకులు తమ ప్రేమను ఎలా చాటిచెప్పారు?

3 అయితే ఈ చివరిరోజుల్లో, ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమను బలపర్చుకోవడానికి యెహోవా తన ప్రజలకు సహాయం చేశాడు. “దేవుడు ప్రేమాస్వరూపి” కాబట్టి ఆయన ప్రజలు కూడా ఆయనలా ప్రేమ చూపిస్తారు. (1 యోహా. 4:8) యేసు తన అనుచరులను ‘ఒకరినొకరు ప్రేమించుకోవాలని’ ఆజ్ఞాపించాడు. అంతేకాదు, ‘మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరు తెలుసుకుంటారు’ అని ఆయన చెప్పాడు. (యోహా. 13:34, 35) గతంలో దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు వాటిలో పాల్గొనకపోవడం ద్వారా యెహోవా సేవకులు తమకు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమను చాటిచెప్పారు. ఉదాహరణకు, రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపు 5 కోట్ల 50 లక్షలమంది చంపబడ్డారు. కానీ యెహోవాసాక్షులు మాత్రం ఆ యుద్ధంలో పాలుపంచుకోలేదు. (మీకా 4:1, 3 చదవండి.) అలా ఉండడంవల్ల ఎవ్వరి రక్తం విషయంలోను వాళ్లు బాధ్యులు కాలేదు.—అపొ. 20:26.

4. యెహోవా ప్రజల సంఖ్య పెరుగుతూ ఉండడం ఎందుకు ఆసక్తికరమైన విషయం?

4 భూమంతా “ఈ యుగ సంబంధమైన దేవత” సాతాను చేతుల్లో ఉన్నప్పటికీ యెహోవా ప్రజల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. (2 కొరిం. 4:4) ఈ లోక రాజకీయ సంస్థల్ని, మీడియాను ఉపయోగించుకుని ప్రకటనాపనిని ఆపడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ పనిని ఆపడం అతని వల్లకాదు. అయితే తనకు సమయం కొంచెమే ఉందని సాతానుకు తెలుసు కాబట్టి మనల్ని యెహోవాను ఆరాధించకుండా చేయడానికి అతను ప్రయత్నిస్తూనే ఉంటాడు.—ప్రక. 12:12.

ఇతరులు పొరపాట్లు చేసినా మీరు నమ్మకంగా ఉంటారా?

5. కొన్నిసార్లు ఇతరులు మనల్ని ఎందుకు బాధపెట్టవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

5 దేవున్ని, ఇతరుల్ని ప్రేమించడం చాలా ముఖ్యమని దేవుని సేవకులకు తెలుసు. యేసు ఇలా చెప్పాడు, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.” (మత్త. 22:35-39) అయితే ఆదాము చేసిన పాపంవల్ల మనుషులందరూ అపరిపూర్ణులయ్యారని బైబిలు చెప్తోంది. (రోమీయులు 5:12, 19 చదవండి.) కాబట్టి అప్పుడప్పుడు సంఘంలోని కొందరు మనల్ని బాధపెట్టేలా ఏదైనా అనవచ్చు లేదా చేయవచ్చు. ఒకవేళ అలా జరిగితే మనమేమి చేస్తాం? యెహోవాపై మనకున్న ప్రేమ అలానే బలంగా ఉంటుందా? యెహోవాకు, ఆయన ప్రజలకు నమ్మకంగా ఉంటామా? తమ మాటలతో లేదా చేతలతో ఇతరుల్ని బాధపెట్టిన కొంతమంది దేవుని సేవకుల గురించి బైబిల్లో ఉంది. వాళ్ల నుండి మనమేమి నేర్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏలీ, అతని కొడుకులు జీవించిన కాలంలో మీరు ఉండివుంటే ఏమి చేసుండేవాళ్లు? (6వ పేరా చూడండి)

6. తన ఇద్దరు కొడుకులు తప్పులు చేసినప్పుడు ఏలీ ఏమి చేయలేకపోయాడు?

6 ఉదాహరణకు, ప్రధాన యాజకుడైన ఏలీ ఇద్దరు కొడుకులు యెహోవా నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. వాళ్ల గురించి బైబిలు ఇలా చెప్తోంది, ‘ఏలీ కుమారులు చెడ్డవాళ్లు. వాళ్లు యెహోవాను లక్ష్యపెట్టలేదు.’ (1 సమూ. 2:12, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) తన కొడుకులు చాలా చెడ్డపనులు చేస్తున్నారని తెలిసినప్పటికీ ఏలీ వాళ్లను గట్టిగా మందలించలేదు. కొంతకాలానికి యెహోవా ఏలీని, అతని ఇద్దరు కొడుకుల్ని శిక్షించాడు. ఆ తర్వాత నుండి, ఏలీ వంశానికి చెందిన వాళ్లెవ్వర్నీ ప్రధాన యాజకులుగా సేవచేయడానికి యెహోవా అనుమతించలేదు. (1 సమూ. 3:10-14) ఒకవేళ మీరు ఏలీ కాలంలో జీవించివుంటే, అతని కొడుకులు చేస్తున్న ఘోరమైన పనుల గురించి తెలిసి ఏమి చేసుండేవాళ్లు? వాళ్లు చేసిన పనులవల్ల యెహోవాపై మీకున్న విశ్వాసం తగ్గిపోయేదా? చివరికి యెహోవాను ఆరాధించడం మానేసేవాళ్లా?

7. దావీదు ఎలాంటి ఘోరమైన పాపం చేశాడు? అప్పుడు దేవుడు ఏమి చేశాడు?

7 మరో ఉదాహరణ దావీదు. దావీదు మంచి లక్షణాలున్న వ్యక్తి, అందుకే యెహోవా అతన్ని ఎంతో ప్రేమించాడు. (1 సమూ. 13:13, 14; అపొ. 13:22) అయితే అతను కూడా ఓ ఘోరమైన పాపం చేశాడు. ఊరియా యుద్ధానికి వెళ్లినప్పుడు, అతని భార్య అయిన బత్షెబతో దావీదు వ్యభిచారం చేశాడు. దాంతో ఆమె గర్భవతి అయ్యింది. అయితే తాను చేసిన తప్పు గురించి ఎవ్వరికీ తెలియకూడదని దావీదు అనుకున్నాడు. అందుకే ఊరియాను యుద్ధం నుండి పిలిపించి ఇంటికి పంపడానికి ప్రయత్నించాడు. అలా చేస్తే ఊరియా ఇంటికి వెళ్లి బత్షెబతో శయనిస్తాడని, అప్పుడు ఆమెకు పుట్టే బిడ్డకు తండ్రి ఊరియానేనని అందరూ అనుకుంటారని దావీదు ఆలోచించాడు. కానీ ఊరియా ఇంటికి వెళ్లలేదు, దాంతో అతన్ని యుద్ధంలో చంపించేశాడు. అంతటి ఘోరమైన పాపాలు చేయడంవల్ల దావీదు, అతని కుటుంబం చాలా బాధలుపడ్డారు. (2 సమూ. 12:9-12) అయితే దావీదు ‘యథార్థహృదయుడని’ యెహోవాకు తెలుసు కాబట్టి అతని మీద కనికరం చూపించి క్షమించాడు. (1 రాజు. 9:4) ఒకవేళ మీరు దావీదు కాలంలో జీవించివుంటే, దావీదు చేసిన తప్పుకు మీరెలా స్పందించేవాళ్లు? యెహోవాను ఆరాధించడం మానేసేవాళ్లా?

8. (ఎ) పేతురు ఎలాంటి పొరపాట్లు చేశాడు? (బి) అయినప్పటికీ యెహోవా అతన్ని ఎందుకు ఉపయోగించుకున్నాడు?

8 ఇంకొక ఉదాహరణ అపొస్తలుడైన పేతురు. యేసు పేతురును తన అపొస్తలునిగా ఎన్నుకున్నాడు. అయినప్పటికీ అతను కొన్నిసార్లు పొరపాట్లు చేశాడు. ఉదాహరణకు అతను ఓ సందర్భంలో, అందరూ విడిచిపెట్టినా తాను మాత్రం యేసును వదిలి వెళ్లనని అన్నాడు. (మార్కు 14:27-31, 50) కానీ యేసును బంధించినప్పుడు, అపొస్తలులు అందరితోపాటు పేతురు కూడా పారిపోయాడు. ఆ తర్వాత మరో మూడు వేర్వేరు సందర్భాల్లో, యేసు ఎవరో తనకు తెలీదని చెప్పాడు. (మార్కు 14:53, 54, 66-72) కానీ తాను చేసినదాని గురించి పేతురు చాలా కుమిలిపోయాడు. అందుకే యెహోవా అతన్ని క్షమించి, తిరిగి తన సేవలో ఉపయోగించుకున్నాడు. ఒకవేళ యేసు శిష్యుల్లో మీరూ ఒకరై ఉండి, పేతురు చేసినదాని గురించి తెలిసుంటే ఏమి చేసుండేవాళ్లు? యెహోవాపై మీకున్న నమ్మకం ఎప్పటికీ అలానే ఉండేదా?

9. యెహోవా ఎల్లప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడని మీరెందుకు నమ్ముతారు?

9 ఈ ఉదాహరణల్ని బట్టి, కొంతమంది యెహోవా సేవకులు చెడ్డ పనులు చేశారని, ఇతరుల్ని చాలా బాధపెట్టారని తెలుసుకున్నాం. ఒకవేళ అలాంటివి ఇప్పుడు జరిగితే మీరేమి చేస్తారు? మీటింగ్స్‌కు వెళ్లడం మానేసి, చివరికి యెహోవాకు, ఆయన ప్రజలకు పూర్తిగా దూరమైపోతారా? లేదా యెహోవా కనికరం చూపిస్తున్నాడనీ, బహుశా తప్పు చేసిన ఆ వ్యక్తి పశ్చాత్తాపం చూపించాలని ఆయన ఎదురుచూస్తున్నాడనీ మీరు గుర్తిస్తారా? అయితే గంభీరమైన పాపం చేసిన కొంతమందిలో, తప్పు చేశామనే భావన ఉంటుందిగానీ పశ్చాత్తాపపడరు. అలాంటివాళ్లను దేవుడు చూస్తున్నాడని, సరైన సమయంలో చర్య తీసుకుంటాడని మీరు నమ్ముతారా? అవసరమైతే అలాంటివాళ్లను యెహోవా తన సంఘం నుండి బయటికి పంపించేస్తాడు. యెహోవా ఎల్లప్పుడూ సరైనదాన్ని, న్యాయమైనదాన్ని చేస్తాడనే నమ్మకం మీకుందా?

ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండండి

10. ఇస్కరియోతు యూదా, పేతురు పొరపాట్లు చేసినప్పుడు యేసు ఎలా స్పందించాడు?

10 తమ చుట్టూ ఉన్నవాళ్లు ఘోరమైన తప్పులు చేస్తున్నా యెహోవాకు, ఆయన ప్రజలకు నమ్మకంగా ఉన్న ఎంతోమంది ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. అలాంటి ఓ మంచి ఉదాహరణ యేసు. సహాయం కోసం తన తండ్రికి ఓ రాత్రంతా ప్రార్థించాక, ఆయన 12 మంది అపొస్తలుల్ని ఎన్నుకున్నాడు. వాళ్లలో ఒకడైన ఇస్కరియోతు యూదా కొంతకాలానికి మోసం చేశాడు. అపొస్తలుడైన పేతురు కూడా, యేసు ఎవరో తనకు తెలియదని అబద్ధం చెప్పాడు. (లూకా 6:12-16; 22:2-6, 31, 32) అపొస్తలులు తనను బాధపెట్టినా యేసు మాత్రం యెహోవా ప్రజలమీదగానీ, యెహోవా మీదగానీ కోపాన్ని పెంచుకోలేదు. బదులుగా తండ్రికి సన్నిహితంగా ఉంటూ ఆయన్ను నమ్మకంగా సేవించాడు. ఫలితంగా ఆయన్ను పునరుత్థానం చేయడం ద్వారా, కొంతకాలం తర్వాత పరలోక రాజ్యానికి రాజుగా నియమించడం ద్వారా యెహోవా యేసుకు తగిన ప్రతిఫలం ఇచ్చాడు.—మత్త. 28:7, 18-20.

11. ఈ కాలంలోని తన సేవకుల గురించి యెహోవా ముందే ఏమని చెప్పాడు?

11 యెహోవాకు, ఆయన ప్రజలకు నమ్మకంగా ఉండాలని యేసు ఉదాహరణ నుండి మనం నేర్చుకోవచ్చు. అలా నమ్మకంగా ఉండడానికి సరైన కారణాలు కూడా మనకున్నాయి. ఈ చివరి రోజుల్లో యెహోవా తన సేవకుల్ని నడిపించడాన్ని మనం చూస్తున్నాం. సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడానికి ఆయన వాళ్లకు సహాయం చేస్తున్నాడు. ప్రకటనాపని చేస్తున్నది కూడా వాళ్లు మాత్రమే. యెహోవా వాళ్లకు నేర్పిస్తున్న వాటన్నిటివల్ల అందరూ ఎంతో ఐక్యంగా, సంతోషంగా ఉన్నారు. దానిగురించి యెహోవా ముందే ఇలా అన్నాడు, “నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరు.”—యెష. 65:14.

12. ఇతరుల తప్పుల్ని మనమెలా చూడాలి?

12 యెహోవా మనల్ని నడిపిస్తూ, ఎన్నో మంచి పనులు చేయడానికి సహాయం చేస్తున్నందుకు నిజంగా సంతోషంగా ఉన్నాం. దానికి భిన్నంగా, సాతాను లోకంలోని ప్రజలు భవిష్యత్తు గురించి ఎలాంటి ఆశ లేకుండా బ్రతుకుతున్నారు. కాబట్టి కేవలం సంఘంలో ఎవరో తప్పు చేశారని, లేదా తప్పుగా మాట్లాడారని మనం యెహోవాకూ ఆయన ప్రజలకూ దూరమవ్వడం ఎంత తెలివితక్కువ పనో కదా! దానికి బదులు మనం యెహోవాకు నమ్మకంగా ఉంటూ ఆయనిచ్చే నిర్దేశాల్ని పాటించాలి. అంతేకాదు ఇతరులు చేసే పొరపాట్లను ఎలా చూడాలో, వాటికి ఎలా స్పందించాలో కూడా మనం నేర్చుకోవాలి.

ఎలా స్పందించాలి?

13, 14. (ఎ) ఇతరులు మనల్ని బాధపెడితే ఎందుకు కోప్పడకూడదు? (బి) మనం ఏ వాగ్దానాన్ని గుర్తుంచుకోవాలి?

13 మీ తోటి సహోదరుల్లో ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టేలా ఏదైనా అంటే లేదా చేస్తే మీరేమి చేయాలి? బైబిలు ఇలా సలహా ఇస్తోంది, “ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.” (ప్రసం. 7:9) మనందరం అపరిపూర్ణులం, పొరపాట్లు చేస్తాం. కాబట్టి మన సహోదరులు ఎప్పుడూ సరైనదే మాట్లాడతారని, చేస్తారని మనం ఆశించలేం. వాళ్లు చేసిన పొరపాట్ల గురించే ఆలోచిస్తూ కూర్చోవడం కూడా మంచిది కాదు. అలా ఆలోచిస్తూ ఉంటే యెహోవాను సంతోషంగా సేవించలేం. చివరికి మన విశ్వాసం బలహీనపడి, యెహోవా సంస్థను విడిచిపెట్టే ప్రమాదం ఉంది. అప్పుడు మనం యెహోవాను సేవించలేం, ఆయన తీసుకొచ్చే కొత్తలోకంలో జీవించే అవకాశాన్ని పోగొట్టుకుంటాం.

14 ఇతరులు మనల్ని బాధపెట్టినా, యెహోవాను సంతోషంగా సేవించడానికి మనకేది సహాయం చేయగలదు? యెహోవా చేసిన ఈ ఓదార్పుకరమైన వాగ్దానాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి: “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.” (యెష. 65:17; 2 పేతు. 3:13) మీరు తనకు నమ్మకంగా ఉంటే యెహోవా ఈ దీవెనల్ని ఇస్తాడు.

15. ఇతరులు పొరపాట్లు చేసినప్పుడు మనమేమి చేయాలని యేసు చెప్పాడు?

15 నిజమే, మనమింకా కొత్తలోకంలోకి ప్రవేశించలేదు. కాబట్టి మనల్ని ఎవరైనా బాధపెడితే, అలాంటి పరిస్థితుల్లో మనమేం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడో ఆలోచించాలి. ఉదాహరణకు యేసు ఇలా అన్నాడు, “మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.” అంతేకాదు తప్పు చేసినవాళ్లను ఏడుసార్లు క్షమించాలా అని పేతురు అడిగినప్పుడు, ‘ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏడు మారులమట్టుకని నీతో చెప్తున్నాను’ అని యేసు జవాబిచ్చాడు. ఇతరుల్ని క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని యేసు మనకు నేర్పించాడు.—మత్త. 6:14, 15; 18:21, 22.

16. యోసేపు ఎలాంటి మంచి ఆదర్శాన్ని ఉంచాడు?

16 ఇతరుల పొరపాట్లకు ఎలా స్పందించాలో యోసేపును చూసి మనం నేర్చుకోవచ్చు. యాకోబు, రాహేలులకు పుట్టిన ఇద్దరు కొడుకుల్లో యోసేపు మొదటివాడు. యాకోబుకు మరో పదిమంది కొడుకులు ఉన్నప్పటికీ, అందరికన్నా ఎక్కువగా యోసేపునే ప్రేమించాడు. దాంతో యోసేపు అన్నలు అతనిమీద అసూయ పెంచుకున్నారు. నిజానికి వాళ్లు యోసేపును ఎంత ద్వేషించారంటే, అతన్ని బానిసగా అమ్మేశారు. చాలా సంవత్సరాల తర్వాత, యోసేపు పని నచ్చి ఈజిప్టు రాజు అతన్ని రెండవ రాజుగా నియమించాడు. కొంతకాలానికి కరువు రావడంతో ఆహారం కొనుక్కోవడానికి యోసేపు అన్నలు ఈజిప్టుకు వచ్చారు. వాళ్లు యోసేపును గుర్తుపట్టలేదు కానీ యోసేపు మాత్రం తన అన్నలను గుర్తుపట్టాడు. అతను వాళ్లతో కఠినంగా ప్రవర్తించాడుగానీ శిక్షించలేదు. బదులుగా వాళ్లు నిజంగా మారారో లేదో తెలుసుకోవడానికి పరీక్షించాడు. వాళ్లు మారారని యోసేపుకు నమ్మకం కుదిరాక, తాను వాళ్ల తమ్ముడినని చెప్పి, వాళ్లను బాధపడొద్దని ఓదార్చాడు. యోసేపు ఇలా అన్నాడు. ‘భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను.’—ఆది. 50:21.

17. ఇతరులు పొరపాట్లు చేసినప్పుడు మీరేమి చేయాలనుకుంటున్నారు?

17 ప్రతీఒక్కరూ పొరపాట్లు చేస్తారు కాబట్టి మీరు కూడా ఇతరుల్ని బాధపెట్టే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు ఎవర్నైనా బాధపెట్టారని గుర్తిస్తే బైబిలు సలహాను పాటిస్తూ, ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి క్షమించమని అడిగి, సమాధానపడండి. (మత్తయి 5:23, 24 చదవండి.) ఇతరులు మనల్ని క్షమించినప్పుడు మనం సంతోషపడతాం. అదేవిధంగా మనం కూడా ఇతరుల్ని క్షమించాలి. కొలొస్సయులు 3:13, NW ఇలా చెప్తుంది: ‘ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. ఇతరులు మిమ్మల్ని నొప్పించినా సరే అలా చేయండి. యెహోవా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి.’ తోటి సహోదరులపై మనకు నిజంగా ప్రేముంటే, వాళ్లు ఎప్పుడో చేసిన దానిగురించి బాధపడుతూ ఉండం. (1 కొరిం. 13:5) అంతేకాదు మనం ఇతరుల్ని క్షమిస్తే, యెహోవా మనల్ని కూడా క్షమిస్తాడు. కాబట్టి మన తండ్రి అయిన యెహోవా మనమీద కనికరం చూపించినట్లే, ఇతరులు పొరపాట్లు చేసినప్పుడు మనం కూడా వాళ్లపై కనికరం చూపిద్దాం.—కీర్తన 103:12-14 చదవండి.