కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వజ్రాలకన్నా ఎంతో విలువైన ఓ లక్షణం

వజ్రాలకన్నా ఎంతో విలువైన ఓ లక్షణం

ప్రజలు వజ్రాల్ని చాలా విలువైనవాటిగా చూస్తారు. కొన్ని వజ్రాలైతే కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. అయితే వజ్రాలకన్నా లేదా ఇతర రత్నాల కన్నా దేవుడు విలువైనదిగా చూసేది ఏదైనా ఉందా?

ఆర్మేనియాలో ఉంటున్న హైగానూష్‌ అనే సహోదరికి తన ఇంటి దగ్గర ఓ పాస్‌పోర్ట్‌ దొరికింది. ఆ పాస్‌పోర్ట్‌లో కొన్ని ATM కార్డులు, పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నాయి. అయితే ఆ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. వాళ్లిద్దరూ బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు.

ఆ దంపతులు అప్పుల్లో కూరుకుపోయి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. అయినాసరే వాళ్లు ఆ డబ్బును, పాస్‌పోర్ట్‌లో ఉన్న అడ్రస్‌కు తీసుకెళ్లి ఇచ్చేయాలని అనుకున్నారు. వాళ్ల నిజాయితీ చూసి పాస్‌పోర్ట్‌ పోగొట్టుకున్న వ్యక్తి, అతని కుటుంబం ఆశ్చర్యపోయారు. బైబిలు నుండి తాము నేర్చుకుంటున్న దాన్నిబట్టే నిజాయితీగా వాటిని తీసుకొచ్చామని హైగానూష్‌, ఆమె భర్త వాళ్లకు వివరించారు. ఆ తర్వాత, యెహోవాసాక్షుల గురించి చెప్పి కొన్ని ప్రచురణల్ని కూడా ఇచ్చారు.

పాస్‌పోర్ట్‌ పోగొట్టుకున్న వ్యక్తి కుటుంబం హైగానూష్‌కు కొంత డబ్బు బహుమానంగా ఇవ్వాలనుకుంది, కానీ ఆమె తీసుకోలేదు. తర్వాతి రోజు ఆ వ్యక్తి భార్య హైగానూష్‌నూ, ఆమె భర్తనూ కలిసి తమ కుటుంబం తరఫున కృతజ్ఞతగా ఇస్తున్న డైమండ్‌ ఉంగరాన్ని తీసుకోవాల్సిందేనని బలవంతం చేసింది.

హైగానూష్‌, ఆమె భర్త చూపించిన నిజాయితీని చూసి పాస్‌పోర్ట్‌ పోగొట్టుకున్న వ్యక్తి కుటుంబంలానే చాలామంది ఆశ్చర్యపోతారు. మరి యెహోవా కూడా ఆశ్చర్యపోతాడా? వాళ్ల నిజాయితీ చూసి యెహోవా ఎలా భావిస్తాడు? వాళ్లు నిజాయితీగా ఉండడం వల్ల ఏమైనా ఫలితం పొందారా?

వస్తుసంపదలకన్నా ఎంతో విలువైన లక్షణాలు

ఆ ప్రశ్నలకు జవాబులు కష్టమేమీ కాదు. ఎందుకంటే తన లక్షణాలను చూపించేవాళ్లను యెహోవా వజ్రాలు, బంగారం లేదా మరితర వస్తుసంపదలకన్నా ఎంతో విలువైనవాళ్లుగా చూస్తాడని తన సేవకులకు తెలుసు. అవును, వేటిని విలువైనవిగా ఎంచుతామనే విషయంలో యెహోవాకు, మనుషులకు చాలా తేడా ఉంది. (యెష. 55:8, 9) అంతేకాదు దేవుని లక్షణాల్ని అనుకరించడానికి తాము చేసే కృషిని ఆయన సేవకులు చాలా విలువైనదిగా భావిస్తారు.

యెహోవా దృష్టిలో ఏవి విలువైనవో అర్థంచేసుకునేందుకు వివేచన, జ్ఞానం గురించి బైబిలు ఏం చెప్తుందో పరిశీలిద్దాం. సామెతలు 3:13-15 వచనాల్లో ఇలా ఉంది, “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు. పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.” కాబట్టి వివేచన, జ్ఞానం వంటి లక్షణాల్ని యెహోవా వస్తుసంపదలన్నిటికన్నా ఎంతో విలువైనవిగా ఎంచుతాడని స్పష్టంగా తెలుస్తోంది.

మరైతే, నిజాయితీగా ఉండడం సంగతేంటి?

యెహోవా నిజాయితీపరుడు. ఆయన “అబద్ధమాడనేరని దేవుడు.” (తీతు 1:1-4) యెహోవా ప్రేరణతో మొదటి శతాబ్దంలోని హెబ్రీ క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, ‘మా గురించి ప్రార్థిస్తూ ఉండండి; మేము అన్ని విషయాల్లో నిజాయితీగా ప్రవర్తించాలనుకుంటున్నాం కాబట్టి మంచి మనస్సాక్షి కలిగివున్నామని నమ్ముతున్నాం.’—హెబ్రీ. 13:18, NW.

నిజాయితీగా ఉండే విషయంలో యేసుక్రీస్తు చక్కని ఆదర్శాన్ని ఉంచాడు. ఉదాహరణకు, ప్రధాన యాజకుడైన కయప యేసుతో ఇలా అన్నాడు, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను.” అయితే దేవదూషణ చేస్తున్నాడని తనను నిందించి, చివరికి చంపేస్తారని తెలిసినా మహాసభలో యేసు నిజాయితీగా తానే మెస్సీయనని ఒప్పుకున్నాడు.—మత్త. 26:63-67.

మన విషయమేంటి? కొన్ని నిజాల్ని దాచిపెట్టడంవల్ల లేదా వాటిని కాస్త మార్చి చెప్పడంవల్ల ఏదైనా లాభం వస్తుందనిపించే పరిస్థితిలో కూడా మనం నిజాయితీగా ఉంటామా?

నిజాయితీగా ఉండడంలో ఉన్న సవాలు

“స్వార్థప్రియులు, ధనాపేక్షులు” ఉన్న ఈ చివరిరోజుల్లో నిజాయితీగా ఉండడం కష్టమవ్వవచ్చు. (2 తిమో. 3:2) ఆర్థిక సంక్షోభం లేదా నిరుద్యోగ సమస్యలు ఉన్నప్పుడు దొంగతనం చేయడంలో, మోసాలు చేయడంలో లేదా నిజాయితీలేని పనులు చేయడంలో తప్పులేదని చాలామంది అనుకుంటారు. అలా ఆలోచించడం ఎంత సహజమైపోయిందంటే, ఏదైనా లాభం పొందడానికి నిజాయితీని పక్కనబెట్టి మోసాలు చేయడమే ఏకైక మార్గమని చాలామంది అనుకుంటున్నారు. చివరికి కొంతమంది క్రైస్తవులు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొని, “దుర్లాభము” కోసం సంఘంలో తమకున్న మంచి పేరును పాడుచేసుకున్నారు.—1 తిమో. 3:8; తీతు 1:7.

చాలామంది క్రైస్తవులు యేసును అనుకరిస్తారు. దేవునికి ఉన్నలాంటి లక్షణాలు కలిగివుండడమే డబ్బుకన్నా లేదా లాభాలకన్నా ఎంతో విలువైనదని వాళ్లు గుర్తిస్తారు. అందుకే క్రైస్తవ యౌవనులు మంచి మార్కులు పొందడం కోసం కాపీ కొట్టరు. (సామె. 20:23) అయితే నిజాయితీగా ఉండే ప్రతీసారి హైగానూష్‌లానే మనం కూడా బహుమానం పొందలేకపోవచ్చు. అయినప్పటికీ నిజాయితీగా ఉండడమే దేవుని దృష్టిలో సరైనది. అంతేకాదు అలావుంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగివుంటాం, అది ఎంతో విలువైనది.

ఆ విషయాన్ని గాజిక్‌ అనే సహోదరుని ఉదాహరణ రుజువుచేస్తుంది. అతనిలా అంటున్నాడు, “క్రైస్తవునిగా మారక ముందు నేను ఓ పెద్ద కంపెనీలో పనిచేసేవాడిని. ఆ కంపెనీ యజమాని పన్ను ఎగ్గొట్టడానికి లాభాల విషయంలో తప్పుడు లెక్కలు చూపించేవాడు. నేను ఆ కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌ కాబట్టి, అందులో జరిగే మోసాల్ని పట్టించుకోకుండా ఉండేందుకు టాక్స్‌ ఏజెంట్లకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అందువల్ల నాకు నిజాయితీలేని వ్యక్తిననే పేరు వచ్చింది. నేను సత్యం తెలుసుకున్న తర్వాత, ఆ ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాను. మంచి జీతం వస్తున్నప్పటికీ నేను దాన్ని వదిలేశాను, ఆ తర్వాత నేనే ఓ వ్యాపారం మొదలుపెట్టాను. మొదటిరోజు నుండే నా కంపెనీని రిజిస్టర్‌ చేసుకుని అన్ని పన్నులు కట్టాను.”—2 కొరిం. 8:21.

గాజిక్‌ ఇంకా ఇలా అంటున్నాడు, “నా ఆదాయం సగానికి పడిపోయింది, నా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టమైంది. అయినా నేను చాలా సంతోషంగా ఉన్నాను. యెహోవా ముందు నిర్మలమైన మనస్సాక్షితో ఉన్నాను. నా ఇద్దరు కొడుకులకు మంచి ఆదర్శాన్ని ఉంచాను, సంఘంలో సేవావకాశాలు పొందడానికి అర్హతలు సంపాదించుకున్నాను. ఇప్పుడు టాక్స్‌ ఆడిటర్ల దగ్గర, అలాగే నేను వ్యాపారం చేసే ఇతరుల దగ్గర నిజాయితీపరుడిననే పేరు నాకుంది.”

యెహోవా మనకు సహాయం చేస్తాడు

నిజాయితీతోపాటు తనకున్న అద్భుతమైన లక్షణాల్ని అనుకరిస్తూ తనకు ఘనత తీసుకొచ్చేవాళ్లను యెహోవా ప్రేమిస్తాడు. (తీతు 2:9, 10) అంతేకాదు అలా అనుకరించినప్పుడు మనకు సహాయం చేస్తానని ఆయన మాటిస్తున్నాడు. దేవుని ప్రేరణతో దావీదు ఇలా రాశాడు, “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.”—కీర్త. 37:25.

నమ్మకస్థురాలైన రూతు అనుభవం ఆ విషయాన్ని నిరూపిస్తుంది. రూతు, వృద్ధురాలైన తన అత్త నయోమిని విడిచిపెట్టే బదులు నమ్మకంగా ఉంది. యెహోవాను ఆరాధించడానికి వీలుగా రూతు ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. (రూతు 1:16, 17) అంతేకాదు ధర్మశాస్త్రంలో పేదవాళ్ల కోసం ఉన్న ఏర్పాటును పాటిస్తూ ఆమె నిజాయితీగా కష్టపడి పరిగె ఏరుకుంది. తర్వాతి కాలాల్లో యెహోవా దావీదును కాపాడినట్లే రూతును, నయోమిని కాపాడాడు. దేవుడు కేవలం రూతు అవసరాల్ని తీర్చడమే కాదు. రాజైన దావీదుకు, మెస్సీయకు పూర్వీకురాలయ్యే అవకాశాన్ని కూడా ఇచ్చాడు.—రూతు 4:13-17; మత్త. 1:5, 16.

కొంతమంది యెహోవా సేవకులకు, తమ కనీస అవసరాల్ని తీర్చుకోవడానికి కావాల్సిన డబ్బును సంపాదించడం చాలా కష్టంగా ఉండవచ్చు. అంతమాత్రాన తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం వాళ్లు నిజాయితీలేని పనులు చేయరు. బదులుగా కష్టపడి, శ్రద్ధగా పనిచేస్తారు. అలా చేయడం ద్వారా, వస్తుసంపదలకన్నా నిజాయితీ, యెహోవాకున్న ఇతర అద్భుతమైన లక్షణాలే తమకు ఎంతో విలువైనవని చూపిస్తారు.—సామె. 12:24; ఎఫె. 4:27, 28.

రూతులాగే భూవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు తమకు యెహోవా సహాయం చేస్తాడనే విశ్వాసాన్ని చూపించారు. “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అని మాటిచ్చిన యెహోవా మీద వాళ్లకు పూర్తి నమ్మకం ఉంది. (హెబ్రీ. 13:5) అన్ని సమయాల్లో నిజాయితీగా ఉన్నవాళ్లకు తాను సహాయం చేస్తాననీ, అలా చేయగల శక్తి తనకుందని యెహోవా పదేపదే నిరూపించాడు. తన సేవకుల కనీస అవసరాలను తీరుస్తానని ఇచ్చిన మాటను యెహోవా అన్నిసార్లు నిలబెట్టుకున్నాడు.—మత్త. 6:33.

నిజమే, మనుషులు వజ్రాలను, ఇతర వస్తుసంపదలను విలువైనవిగా చూడవచ్చు. కానీ మన పరలోక తండ్రైన యెహోవా మాత్రం మనకున్న నిజాయితీనీ, ఇతర మంచి లక్షణాల్నీ విలువైన రత్నాల కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ విలువైనవిగా ఎంచుతాడనే నమ్మకంతో ఉండవచ్చు.

మనం నిజాయితీగా ఉంటే, మన మనస్సాక్షి మనల్ని నిందించదు, పరిచర్యలో ధైర్యంగా మాట్లాడగలుగుతాం