“మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా”
“ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.”—ద్వితీ. 6:4.
1, 2. (ఎ) ద్వితీయోపదేశకాండము 6:4లోని మాటలు ఎందుకు అంత ప్రసిద్ధి చెందాయి? (బి) మోషే ఆ మాటల్ని ఎందుకు చెప్పాడు?
యూదులు కొన్ని వందల సంవత్సరాల వరకు ద్వితీయోపదేశకాండము 6:4 లోని మాటల్ని ఓ ప్రత్యేక ప్రార్థనలో ఉపయోగించేవాళ్లు. హీబ్రూ భాషలో ఆ వచనం షెమా అనే మాటతో మొదలౌతుంది. దాంతో ఆ ప్రత్యేక ప్రార్ధనను ‘షెమా’ అని పిలిచేవాళ్లు. చాలామంది యూదులు దేవునిపట్ల తమ పూర్తి భక్తిని చూపించడానికి ఆ ప్రార్థనను ప్రతీరోజు ఉదయం, సాయంత్రం చేసేవాళ్లు.
2 ఆ మాటలు, సా.శ.పూ. 1473లో మోయాబు మైదానంలో సమకూడిన ఇశ్రాయేలీయుల్ని ఉద్దేశించి మోషే ఇచ్చిన చివరి ప్రసంగంలో భాగం. ఆ సమయంలో వాళ్లు యొర్దాను నది దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు. (ద్వితీ. 6:2) మోషే ఆ జనాంగాన్ని 40 సంవత్సరాలపాటు నడిపించాడు, రాబోయే కష్టాల్ని వాళ్లు ధైర్యంగా ఎదుర్కోవాలని అతను కోరుకున్నాడు. వాళ్లు అలా ఎదుర్కోవాలంటే యెహోవా మీద విశ్వాసం ఉంచాలి, ఆయనకు నమ్మకంగా ఉండాలి. కాబట్టి మోషే వాళ్లతో చివరిసారిగా మాట్లాడిన మాటల్లో సరిగ్గా అలాంటి ప్రోత్సాహమే ఉంది. యెహోవా ఇచ్చిన పది ఆజ్ఞల్ని, ఇతర నియమాల్ని చెప్పిన తర్వాత మోషే వాళ్లకు ఓ శక్తివంతమైన జ్ఞాపికను ఇచ్చాడు. అది ద్వితీయోపదేశకాండము 6:4, 5 లో ఉంది. (చదవండి.)
3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?
3 తమ దేవుడైన యెహోవా ‘అద్వితీయుడు’ అని ఇశ్రాయేలీయులకు తెలుసు. నమ్మకస్థులైన ఇశ్రాయేలీయులు అద్వితీయుడైన దేవుణ్ణి అంటే తమ పూర్వీకుల దేవున్ని మాత్రమే ఆరాధించారు. మరి వాళ్ల దేవుడైన యెహోవా ‘అద్వితీయుడు’ అని మోషే ఎందుకు గుర్తుచేశాడు? యెహోవా ‘అద్వితీయుడు’ అనే వాస్తవానికీ; పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో ఆయన్ను ప్రేమించడానికీ మధ్య సంబంధం ఏంటి? ద్వితీయోపదేశకాండము 6:4, 5 లోని మాటలు నేడు మనకెలా వర్తిస్తాయి?
మన దేవుడు “అద్వితీయుడగు యెహోవా”
4, 5. (ఎ) ‘అద్వితీయుడు’ అనే మాటకు ఒక అర్థమేంటి? (బి) యెహోవాకు, అబద్ధ దేవుళ్లకు మధ్య తేడా ఏంటి?
4 సాటిలేనివాడు. “అద్వితీయుడగు యెహోవా” అంటే యెహోవా సాటిలేనివాడని, ఆయన లాంటి వాళ్లెవ్వరూ లేరని అర్థం. మోషే ఎందుకు ఆ మాటను ఉపయోగించాడు? అతను అబద్ధ బోధ అయిన త్రిత్వ సిద్ధాంతం గురించి మాట్లాడట్లేదని తెలుస్తుంది. యెహోవా ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు; ఆయనే ఈ విశ్వానికి పరిపాలకుడు. ఆయన మాత్రమే సత్యదేవుడు, ఆయనలా ఏ దేవుడు లేడు. (2 సమూ. 7:22) కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాను మాత్రమే ఆరాధించాలని మోషే మాటలు వాళ్లకు గుర్తుచేశాయి. తమ చుట్టూ ఉన్న ప్రజలు అబద్ధ దేవుళ్లను-దేవతల్ని ఆరాధించేవాళ్లు, కొన్ని ప్రకృతిశక్తులపై తమ దేవుళ్లకు అధికారం ఉందని ఆ ప్రజలు నమ్మేవాళ్లు. కానీ ఇశ్రాయేలీయులు వాళ్లను అనుకరించకూడదు.
5 ఉదాహరణకు ఐగుప్తీయులు, రా అనే సూర్య దేవున్ని, నట్ అనే ఆకాశ దేవతని, గెబ్ అనే భూ దేవున్ని, హాపీ అనే నైలు దేవున్ని, ఎన్నో జంతువుల్ని ఆరాధించేవాళ్లు. అయితే యెహోవా ఐగుప్తీయుల మీదకు పది తెగుళ్లు రప్పించడం ద్వారా ఈ అబద్ధ దేవుళ్లెవ్వరూ తన శక్తికి సాటిరారని నిరూపించాడు. కనానీయులు ముఖ్యంగా బయలును ఆరాధించేవాళ్లు, ఆ అబద్ధ దేవుడే జీవాన్ని సృష్టించాడని వాళ్లు నమ్మేవాళ్లు. అంతేకాదు ఆకాశం, వర్షం, తుఫాను బయలు గుప్పిట్లోనే ఉంటాయని వాళ్లు భావించేవాళ్లు. చాలా ప్రాంతాల్లోని ప్రజలు తమను బయలు రక్షిస్తాడని నమ్మేవాళ్లు. (సంఖ్యా. 25:3) కానీ ఇశ్రాయేలీయులు మాత్రం తమ దేవుడైన యెహోవా సత్య దేవుడనీ, ‘అద్వితీయుడనీ’ గుర్తుంచుకోవాలి.—ద్వితీ. 4:35, 39.
6, 7. ‘అద్వితీయుడు’ అనే మాటకు ఇంకా ఏ అర్థం కూడా ఉంది? దాన్ని యెహోవా ఎలా నిరూపించాడు?
6 మార్పులేనివాడు, నమ్మదగినవాడు. “అద్వితీయుడగు యెహోవా” అనే మాటకు ఆయన సంకల్పం, పనులు ఎప్పటికీ నమ్మదగినవిగా ఉంటాయని కూడా అర్థం. యెహోవా దేవుడు ఎప్పటికీ మార్పులేనివాడు, నమ్మదగినవాడు, సత్యవంతుడు. ఉదాహరణకు, అబ్రాహాము సంతానానికి చెందినవాళ్లంతా వాగ్దాన దేశంలో నివసిస్తారని యెహోవా మాటిచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన ఎన్నో శక్తివంతమైన అద్భుతాలు చేశాడు కూడా. ఆ మాటిచ్చి 430 సంవత్సరాలు గడిచినా ఆయన సంకల్పం మాత్రం మారలేదు.—ఆది. 12:1, 2, 7; నిర్గ. 12:40, 41.
7 వందల సంవత్సరాల తర్వాత, ఇశ్రాయేలీయుల్ని తన సాక్షులని పిలుస్తూ యెహోవా ఇలా అన్నాడు, ‘నేను మార్పులేనివాడిని, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు ఉండడు.’ అంతేకాదు ‘నేను మార్పులేని వాడిని’ అని ఆయన చెప్పినప్పుడు తన సంకల్పం ఎన్నడూ మారదని కూడా స్పష్టం చేశాడు. (యెష. 43:10, 13, NW; 44:6; 48:12) మార్పులేనివాడు, ఎప్పటికీ నమ్మదగినవాడు అయిన దేవున్ని ఆరాధించే ఎంత గొప్ప అవకాశం ఇశ్రాయేలీయులకు దొరికిందో కదా! నేడు మనకు కూడా అదే గొప్ప అవకాశం ఉంది.—మలా. 3:6; యాకో. 1:17.
8, 9. (ఎ) యెహోవా తన ఆరాధకుల నుండి ఏమి కోరుతున్నాడు? (బి) మోషే మాటలకున్న ప్రాముఖ్యతను యేసు ఎలా నొక్కిచెప్పాడు?
8 అవును యెహోవా చూపించే ప్రేమలో, శ్రద్ధలో ఎలాంటి మార్పు ఉండదని మోషే ఇశ్రాయేలీయులకు గుర్తుచేశాడు. అందుకే వాళ్లు తమ పూర్తి భక్తిని చూపించాలనీ, పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణబలంతో తనను ప్రేమించాలనీ యెహోవా ఆశించాడు. పిల్లలు కూడా తమ పూర్తి భక్తిని చూపించాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు తమకు దొరికే ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని యెహోవా గురించి నేర్పించాలి.—ద్వితీ. 6:6- 9.
9 యెహోవా తన సంకల్పాన్ని ఎన్నడూ మార్చుకోడు, కాబట్టి ఆయన తన సత్యారాధకులకు ఉండాల్సిన ప్రాథమిక అర్హతల్ని ఎప్పటికీ మార్చడు. మనం చేసే ఆరాధనను యెహోవా ఇష్టపడాలంటే పూర్తి భక్తిని చూపించాలి; పూర్ణహృదయంతో, పూర్ణవివేకంతో, పూర్ణబలంతో ఆయన్ను ప్రేమించాలి. అదే అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ అని యేసు చెప్పాడు. (మార్కు 12:28-31 చదవండి.) అయితే మన దేవుడైన యెహోవా ‘అద్వితీయుడని’ మన పనుల ద్వారా ఎలా చూపించవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.
యెహోవా పట్ల మీ పూర్తి భక్తిని చూపించండి
10, 11. (ఎ) మనం యెహోవాపట్ల పూర్తి భక్తిని ఎలా చూపించవచ్చు? (బి) బబులోనులోని హెబ్రీ యువకులు దేవునిపట్ల తమ పూర్తి భక్తిని ఎలా చూపించారు?
10 యెహోవాయే మన ఏకైక దేవుడు. మనం ఆయన్ను మాత్రమే ఆరాధించడం ద్వారా మన పూర్తి భక్తిని చూపిస్తాం. మనం వేరే దేవుళ్లను ఆరాధించకూడదు లేదా యెహోవాకు మనం చేసే ఆరాధనలో తప్పుడు సిద్ధాంతాల్ని లేదా నమ్మకాల్ని చేర్చకూడదు. యెహోవా వేరే దేవుళ్ల కన్నా గొప్పవాడు, శక్తిమంతుడు మాత్రమేకాదు ఆయనే ఏకైక నిజమైన దేవుడు. కాబట్టి మనం యెహోవాను మాత్రమే ఆరాధించాలి.—ప్రకటన 4:10, 11 చదవండి.
11 దానియేలు పుస్తకంలో హెబ్రీ యువకులైన దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా గురించి చదువుతాం. యెహోవా ఆరాధకులు అపవిత్రంగా ఎంచే ఆహారాన్ని తినడానికి ఇచ్చినప్పుడు వాళ్లు దాన్ని తినకుండా ఉండడం ద్వారా దేవునిపట్ల పూర్తి భక్తిని చూపించారు. అంతేకాదు నెబుకద్నెజరు చేయించిన బంగారు ప్రతిమకు నమస్కరించడానికి దానియేలు ముగ్గురు స్నేహితులు ఒప్పుకోలేదు. వాళ్లు యెహోవాకు ప్రథమ స్థానం ఇచ్చి, ఆయనకు మాత్రమే నమ్మకంగా ఉన్నారు.—దాని. 1:1–3:30.
12. యెహోవాపట్ల మన పూర్తి భక్తిని చూపిస్తున్నప్పుడు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి?
12 మన జీవితంలో యెహోవాకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయనపట్ల పూర్తి భక్తిని చూపించాలంటే, ఆయనకు ఇవ్వాల్సిన స్థానాన్ని వేరే వాటికి ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. ఇంతకీ అవి ఏమైవుండవచ్చు? తన ప్రజలు వేరే దేవుళ్లను ఆరాధించకూడదనీ ఎలాంటి విగ్రహారాధన చేయకూడదనీ యెహోవా పది ఆజ్ఞల్లో చెప్పాడు. (ద్వితీ. 5:6-10) నేడు విగ్రహారాధన చాలా రకాలుగా ఉంది, వాటిలో కొన్నింటిని గుర్తించడం కూడా కష్టంగా ఉండవచ్చు. కానీ యెహోవా ప్రమాణాలు మాత్రం మారలేదు. ఆయన ఇప్పటికీ ‘అద్వితీయుడగు యెహోవాయే.’ అయితే నేడు మనమెలా విగ్రహారాధనకు దూరంగా ఉండవచ్చో ఇప్పుడు చూద్దాం.
13. మనం యెహోవాకన్నా వేటిని ఎక్కువ ప్రేమించే ప్రమాదం ఉంది?
13 కొలొస్సయులు3:5లో యెహోవాతో మనకున్న ప్రత్యేక స్నేహాన్ని పాడుచేయగల వాటిగురించి ఉంది. (చదవండి.) ధనాపేక్ష కూడా ఓ రకమైన విగ్రహారాధనేనని ఈ వచనంలో చదువుతాం. అదెలా? ఉదాహరణకు ఎక్కువ డబ్బు లేదా సుఖభోగాలు కావాలనే బలమైన కోరిక ఉంటే, మన జీవితం పూర్తిగా ఆ కోరిక చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అది మన జీవితాన్ని అదుపులోకి తీసుకుని ఓ శక్తివంతుడైన దేవునిలా మారుతుంది. కొలొస్సయులు 3:5లో ప్రస్తావించబడిన అన్ని పాపాలు ధనాపేక్షకు సంబంధించినవే, అవి ఒక రకమైన విగ్రహారాధనే. కాబట్టి వాటిని పొందాలనే బలమైన కోరిక ఉంటే, దేవునికన్నా వాటినే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెడతాం. అదే జరిగితే యెహోవా మనకు ‘అద్వితీయుడిగా’ ఉండడు. అలా జరగాలని మనమెన్నడూ కోరుకోం.
14. అపొస్తలుడైన యోహాను మనకు ఏ హెచ్చరిక ఇచ్చాడు?
14 అపొస్తలుడైన యోహాను కూడా అలాంటి ఓ విషయం గురించే ప్రాముఖ్యంగా చెప్పాడు. ఎవరైనా లోకంలో ఉన్నవాటిని, అంటే ‘శరీరాశను, నేత్రాశను, జీవపుడంబాన్ని’ ప్రేమిస్తే, “తండ్రి ప్రేమ వానిలో నుండదు” అని యోహాను హెచ్చరించాడు. (1 యోహా. 2:15, 16) కాబట్టి మనం ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తున్నామేమో అని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. బహుశా మనం లోకంలోని వినోదానికి, వ్యక్తులకు, ఫ్యాషన్‌లకు ఆకర్షితులౌతున్నట్టు గుర్తించవచ్చు. లేదా పైచదువులు చదివి “గొప్పవాటిని” చేయాలనే కోరిక మనలో ఉండవచ్చు. (యిర్మీ. 45:4, 5) కానీ కొత్తలోకం చాలా దగ్గర్లో ఉంది. కాబట్టి మోషే చెప్పిన శక్తివంతమైన మాటల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. “మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా” అనే విషయాన్ని మనం అర్థంచేసుకుని, నిజంగా నమ్మితే ఆయనపట్ల మన పూర్తి భక్తిని చూపిస్తాం, ఆయన ఇష్టపడే విధంగా సేవిస్తాం.—హెబ్రీ. 12:28, 29.
క్రైస్తవ ఐక్యతను కాపాడండి
15. యెహోవా ‘ఒక్కడే దేవుడు’ అని పౌలు క్రైస్తవులందరికీ ఎందుకు గుర్తుచేయాల్సివచ్చింది?
15 “అద్వితీయుడగు యెహోవా” లేదా ఏకైక దేవుడు అనే మాటనుబట్టి, తన సేవకులు ఒకే సంకల్పంతో ఐక్యంగా ఉండాలనేదే యెహోవా కోరిక అని మనకు అర్థమౌతుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో యూదులు, గ్రీకులు, రోమన్లు, ఇతర దేశాలనుండి వచ్చిన ప్రజలు ఉండేవాళ్లు. వాళ్ల నేపథ్యాలు, ఆచారాలు, అభిరుచులు వేర్వేరుగా ఉండేవి. దానివల్ల కొత్త ఆరాధనా విధానాన్ని అంగీకరించడం లేదా తమ పాత ఆచారాల్ని మానేయడం వాళ్లలో కొంతమందికి కష్టమైంది. అందుకే యెహోవా ‘ఒక్కడే దేవుడు’ అని పౌలు క్రైస్తవులందరికీ గుర్తు చేయాల్సివచ్చింది.—1 కొరింథీయులు 8:5, 6 చదవండి.
16, 17. (ఎ) నేడు ఏ మాటలు నెరవేరుతున్నాయి? దాని ఫలితం ఏంటి? (బి) మన ఐక్యతను ఏవి దెబ్బతీయవచ్చు?
16 మరి నేడున్న క్రైస్తవ సంఘం విషయమేంటి? “అంత్యదినములలో” అన్ని దేశాల ప్రజలు యెహోవాను ఆరాధించడానికి సమకూడుతారని, “ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము” అని వాళ్లు చెప్పుకుంటారని యెషయా ప్రవక్త ముందే చెప్పాడు. (యెష. 2:2, 3) ఆ మాటలు నేడు మన కళ్లముందు నెరవేరడం చూసి చాలా సంతోషిస్తున్నాం. మన సహోదరసహోదరీల్లో వివిధ ప్రాంతాలనుండి వచ్చినవాళ్లు, వేర్వేరు భాషలు మాట్లాడేవాళ్లు, వేర్వేరు సంస్కృతులకు చెందినవాళ్లు ఉన్నారు. అయినప్పటికీ మనందరం యెహోవాను ఐక్యంగా ఆరాధిస్తాం. అయితే మనలో చాలా తేడాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు మన మధ్య సమస్యలు రావచ్చు.
17 ఉదాహరణకు, వేరే సంస్కృతికి చెందిన సహోదరసహోదరీలను మీరెలా చూస్తారు? వాళ్ల భాష, బట్టలు, పద్ధతులు, ఆహారం వేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్లకు దూరంగా ఉంటూ మీ సంస్కృతికి చెందినవాళ్లతోనే ఉంటారా? మీ సంఘంలో లేదా సర్క్యూట్‌లో ఉన్న సంఘపెద్దలు వయసులో మీకన్నా చిన్నవాళ్లయితే లేదా వేరే సంస్కృతికి చెందినవాళ్లయితే వాళ్లను మీరెలా చూస్తారు? మనం జాగ్రత్తగా లేకపోతే అలాంటి తేడాలు మనసులో మొలకెత్తి, మన ఐక్యతను దెబ్బతీయవచ్చు.
18, 19. (ఎ) ఎఫెసీయులు 4:1-3 వచనాల్లో ఏ సలహా ఉంది? (బి) సంఘం ఐక్యంగా ఉండడానికి మనమేమి చేయవచ్చు?
18 అలాంటి సమస్యలు రాకుండా ఎలా చూసుకోవచ్చు? సంపన్న నగరమైన ఎఫెసులో వివిధ నేపథ్యాల నుండి వచ్చిన ప్రజలు ఉండేవాళ్లు. అందుకే అపొస్తలుడైన పౌలు అక్కడున్న క్రైస్తవులకు ఉపయోగపడే ఓ సలహా ఇచ్చాడు. (ఎఫెసీయులు 4:1-3 చదవండి.) వినయం, సాత్వికం, దీర్ఘశాంతము, ప్రేమ వంటి లక్షణాల గురించి అతడు ప్రస్తావించాడు. ఈ లక్షణాలు, ఓ ఇంటిని దృఢంగా ఉంచడానికి ఉపయోగపడే బలమైన స్తంభాలు లాంటివి. అయితే బలమైన స్తంభాలు ఉంటేనే సరిపోదు, ఆ ఇంటిని మంచి స్థితిలో ఉంచుకోవడానికి రోజూ కష్టపడాలి కూడా. అదేవిధంగా ఎఫెసులో ఉన్న క్రైస్తవులు కూడా పవిత్రశక్తి వల్ల కలిగే ఐక్యతను కాపాడుకోవడానికి కష్టపడాలని పౌలు కోరుకున్నాడు.
19 సంఘం ఐక్యంగా ఉండడానికి మనలో ప్రతీఒక్కరం చేయగలిగినదంతా చేయాలి. అందుకోసం మొదటిగా, పౌలు ప్రస్తావించిన లక్షణాలు అంటే వినయాన్ని, సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని, ప్రేమను పెంపొందించుకొని, వాటిని చూపించాలి. రెండవదిగా, ‘సమాధానమను బంధాన్ని’ కలిగివుండడానికి కష్టపడాలి. మనస్పర్థలు మన ఐక్యతకు కలిగే చిన్నచిన్న బీటల్లాంటివి. కాబట్టి వాటిని పరిష్కరించుకోవడానికి కృషిచేయాలి, అప్పుడు మన మధ్య సమాధానం, ఐక్యత ఉంటాయి.
20. “మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా” అని మనం అర్థం చేసుకున్నామని ఎలా చూపించవచ్చు?
20 “మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.” అది ఎంత శక్తివంతమైన వాక్యమో కదా! వాగ్దాన దేశంలోకి ప్రవేశించి దాన్ని సొంతం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీయులకు ఎదురైన కష్టాల్ని సహించేందుకు ఆ మాటలు వాళ్లకు సహాయం చేశాయి. అదేవిధంగా మనం కూడా మహాశ్రమల్ని తప్పించుకోవడానికి, భూమిని పరదైసుగా మార్చడానికి కావాల్సిన బలాన్ని ఆ మాటల ద్వారా పొందవచ్చు. కాబట్టి మనం యెహోవాపట్ల మన పూర్తి భక్తిని చూపిస్తూ ఉందాం. దానికోసం మనం మన పూర్ణహృదయంతో, పూర్ణమనసుతో, పూర్ణబలంతో ఆయన్ను ప్రేమించి, సేవించాలి. అంతేకాదు సంఘం సమాధానంగా, ఐక్యంగా ఉండడానికి మనం కృషిచేయాలి. ఇవన్నీ మనం చేస్తూ ఉంటే యేసు మనల్ని గొర్రెలుగా తీర్పుతీరుస్తాడు, అప్పుడు యేసు చెప్పిన ఈ మాటలు నెరవేరడాన్ని మనం చూస్తాం: “నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.”—మత్త. 25:34.