కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మిమ్మల్ని మలిచే అవకాశం గొప్ప కుమ్మరికి ఇస్తున్నారా?

మిమ్మల్ని మలిచే అవకాశం గొప్ప కుమ్మరికి ఇస్తున్నారా?

“జిగటమన్ను కుమ్మరిచేతిలో ఉన్నట్టుగా . . . మీరు నా చేతిలో ఉన్నారు.”యిర్మీ. 18:6.

పాటలు: 23, 22

1, 2. దేవుని దృష్టిలో దానియేలు ‘బహు ప్రియుడు’ ఎందుకు అయ్యాడు? దానియేలులా మనం దేవునికి ఎలా లోబడి ఉండవచ్చు?

 యూదులను బంధించి బబులోనుకు చెరగా తీసుకెళ్లే సమయానికి ఆ పట్టణమంతా విగ్రహాలతో, దుష్ట దూతలను ఆరాధించే ప్రజలతో నిండిపోయి ఉంది. అయినా, దానియేలూ అతని ముగ్గురు స్నేహితులూ వంటి నమ్మకమైన యూదులు ఆ ప్రజల్లా మారడానికి ఇష్టపడలేదు. (దాని. 1:6, 8, 12; 3:16-18) దానియేలు, అతని ముగ్గురు స్నేహితులు యెహోవాను తమ కుమ్మరిగా ఒప్పుకొని ఆయన్ను మాత్రమే ఆరాధించారు. దానియేలు తన జీవితంలో ఎక్కువకాలం చెడ్డ ప్రజల మధ్యే గడిపినప్పటికీ, దేవుని దృష్టిలో అతను ‘బహు ప్రియుడు’ అని దేవదూత అన్నాడు.—దాని. 10:11, 18-19.

2 బైబిలు కాలాల్లోని కుమ్మరి మట్టిని అచ్చులో పోతపోసి తనకు కావాల్సిన ఆకారంలో పాత్రను తయారుచేసేవాడు. అదేవిధంగా, యెహోవా ఈ విశ్వానికి పరిపాలకుడు కాబట్టి, ప్రజలను మలిచే అధికారం ఆయనకుందని నేడు సత్యారాధకులు గుర్తిస్తారు. (యిర్మీయా 18:6 చదవండి.) అంతేకాదు, మనలో ప్రతి ఒక్కరినీ మలిచే అధికారం ఆయనకు ఉంది. అయినప్పటికీ, ఆయన మనల్ని బలవంతం చేయడు. బదులుగా మనకు నచ్చింది చేసే స్వేచ్ఛ ఉందని ఆయన గుర్తించి, తనకు ఇష్టపూర్వకంగా లోబడాలని యెహోవా కోరుకుంటున్నాడు. అయితే మనం దేవుని చేతిలో మెత్తని మట్టిలా అంటే మలచబడడానికి వీలుగా ఎలా ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం. అందులో భాగంగా ఈ మూడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం: (1) దేవుని సలహాను వినకుండా చేసే లక్షణాలకు మనం దూరంగా ఎలా ఉండవచ్చు? (2) మనం యెహోవాకు లోబడుతూ, మలచబడడానికి వీలుగా ఉండే మెత్తని మట్టిలా ఉండడానికి సహాయం చేసే లక్షణాలను ఎలా వృద్ధి చేసుకోవచ్చు? (3) తమ పిల్లల్ని మలుస్తున్నప్పుడు క్రైస్తవ తల్లిదండ్రులు దేవునికి ఎలా లోబడవచ్చు?

దేవుని సలహాను వినకుండా చేసే లక్షణాలకు దూరంగా ఉండండి

3. ఏ లక్షణాలు మనల్ని దేవుని మాట వినకుండా చేస్తాయి? ఓ ఉదాహరణ చెప్పండి.

3 సామెతలు 4:23 ఇలా చెప్తుంది, “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.” గర్వం, పాపాలు చేయడం, విశ్వాసం లేకపోవడం వంటి చెడు లక్షణాలు మనల్ని దేవుని సలహాను వినకుండా చేస్తాయి. కాబట్టి అలాంటి వాటినుండి మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే వాటివల్ల అవిధేయులుగా, తిరుగుబాటు చేసేవాళ్లుగా తయారవుతాం. (దాని. 5:1, 20; హెబ్రీ. 3:13-15, 18, 19) యూదా రాజైన ఉజ్జియా విషయంలో అదే జరిగింది. (2 దినవృత్తాంతములు 26:3-5, 16-21 చదవండి.) మొదట్లో ఉజ్జియా విధేయత చూపిస్తూ, దేవునితో మంచి సంబంధాన్ని కలిగివున్నాడు. అందుకే దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు. కానీ ‘అతను స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించాడు.’ అతను ఎంత గర్వం చూపించాడంటే, దేవాలయంలో కేవలం యాజకులు మాత్రమే వేయాల్సిన ధూపాన్ని తాను వేయడానికి ప్రయత్నించాడు. అది తప్పని యాజకులు చెప్పినప్పుడు, ఉజ్జియా వాళ్లమీద మండిపడ్డాడు. అందుకే ఆ గర్విష్ఠి రాజును యెహోవా కుష్ఠు రోగంతో మొత్తాడు, చివరికి అతను చనిపోయాడు.—సామె. 16:18.

4, 5. మనం గర్వాన్ని తీసేసుకోకపోతే ఏమి జరిగే ప్రమాదముంది? ఒక ఉదాహరణ చెప్పండి.

4 ఒకవేళ మనం గర్వాన్ని తీసేసుకోకపోతే, మన గురించి మనం గొప్పగా అనుకోవడం మొదలుపెడతాం. బైబిల్లోని సలహాను వినడానికి కూడా ఇష్టపడం. (రోమా. 12:3; సామె. 29:1) సంఘపెద్దగా సేవచేస్తున్న జిమ్‌ అనే సహోదరుని విషయంలో కూడా అదే జరిగింది. ఒకానొక విషయానికి సంబంధించి మిగతా సంఘ పెద్దలతో అతను ఏకీభవించలేదు. జిమ్‌ ఇలా అంటున్నాడు, “మీకు ప్రేమ లేదని ఆ సహోదరులతో చెప్పి, పెద్దల మీటింగ్‌ నుండి వచ్చేశాను.” ఆరు నెలల తర్వాత, అతను వేరే సంఘానికి వెళ్లిపోయాడు కానీ అక్కడ అతన్ని సంఘపెద్దగా నియమించలేదు. జిమ్‌ ఇలా చెప్తున్నాడు, “నేను చాలా కృంగిపోయాను. నా తప్పేమీ లేదని అనిపించింది, అందుకే యెహోవాను సేవించడం ఆపేశాను.” అలా పది సంవత్సరాలపాటు అతను సంఘానికి దూరమైపోయాడు. అతను ఇలా ఒప్పుకుంటున్నాడు, “నా అహం దెబ్బతింది దాంతో జరుగుతున్న దానంతటికీ యెహోవాను నిందించడం మొదలుపెట్టాను. చాలా సంవత్సరాలపాటు సహోదరులు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడడానికి ప్రయత్నించారు, కానీ నేను వాళ్ల సహాయం తీసుకోవడానికి ఇష్టపడలేదు.”

5 అతను ఇంకా ఏమంటున్నాడంటే, “ఇతరుల తప్పుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయేవాణ్ణి.” ఈ సహోదరుని అనుభవాన్నిబట్టి, మనలో గర్వం ఉంటే చేసిన తప్పును సమర్థించుకుంటామని అర్థమౌతుంది. అలా జరిగినప్పుడు, మనం ఇక మెత్తని మట్టిలా ఉండం. (యిర్మీ. 17:9) ఒక సహోదరుడు/సహోదరి వల్ల మీరెప్పుడైనా నొచ్చుకున్నారా? లేదా మీ సేవావకాశం పోయిందని ఎప్పుడైనా బాధపడ్డారా? అప్పుడు మీరెలా స్పందించారు? మీరు గర్వం చూపించారా లేదా సహోదరులతో సమాధానంగా ఉండడం, యెహోవాకు నమ్మకంగా ఉండడం మాత్రమే అత్యంత ప్రాముఖ్యమని అనుకున్నారా?—కీర్తన 119:165; ఎఫెసీయులు 4:32 చదవండి.

6. మనం పాపం చేస్తూ ఉంటే ఏమి జరగవచ్చు?

6 ఒక వ్యక్తి పాపం చేస్తూ దాన్ని దాచిపెడుతున్నప్పుడు బైబిల్లోని సలహాను తీసుకోవడం అతనికి కష్టంకావచ్చు. దానివల్ల అతనికి పాపం చేయడం మరింత తేలికౌతుంది. అలా పాపం చేస్తున్న ఓ సహోదరుడు, తాను తప్పు చేస్తున్నట్లు తనకు అనిపించలేదని చెప్పాడు. (ప్రసం. 8:11) అశ్లీల చిత్రాలు చూసే అలవాటున్న మరో సహోదరుడు కొంతకాలం తర్వాత ఇలా చెప్పాడు, “నేను పెద్దల్లో తప్పులు వెతకడం మొదలుపెట్టానని గ్రహించాను.” దానివల్ల ఆ సహోదరునికి యెహోవాతో ఉన్న మంచి సంబంధం పాడైంది. అతను చేస్తున్నది ఇతరులకు తెలిసినప్పుడు, పెద్దలు అతనికి సలహా ఇచ్చారు. మనందరం అపరిపూర్ణులమనే విషయం వాస్తవమే. కానీ మనం ఒకవేళ ఇతరులను తప్పుబట్టడం లేదా ఏదైనా తప్పు చేసినప్పుడు దేవున్ని క్షమాపణ అడగకుండా, ఆయన సహాయం తీసుకోకుండా సాకులు చెప్పడం వంటివి చేస్తే దేవుని మాట వినలేము.

7, 8. (ఎ) విశ్వాసాన్ని కోల్పోయిన ఇశ్రాయేలీయులు ఎలా ప్రవర్తించారు? (బి) దాన్నుండి మనం ఏ పాఠం నేర్చుకుంటాం?

7 యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తునుండి విడిపించినప్పుడు, ఆయన చేసిన ఎన్నో అద్భుతాలను వాళ్లు చూశారు. అయినప్పటికీ వాగ్దాన దేశం దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ల హృదయాలు కఠినమైపోయాయి. ఎందుకు? వాళ్లకు దేవుని మీద విశ్వాసం పోయింది. యెహోవా మీద నమ్మకం ఉంచే బదులు వాళ్లు మోషే మీద ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఒకప్పుడు బానిసలుగా ఉన్న ఈజిప్టుకు తిరిగి వెళ్లాలనుకున్నారు. వాళ్ల ప్రవర్తన చూసి యెహోవాకు చాలా బాధ కలిగింది, అప్పుడు ఆయన ఇలా అన్నాడు, “ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు?” (సంఖ్యా. 14:1-4, 11; కీర్త. 78:40, 41) తమ హృదయాల్ని కఠినం చేసుకుని, విశ్వాసాన్ని కోల్పోయిన ఇశ్రాయేలీయులు అరణ్యంలోనే చనిపోయారు.

8 నేడు మనం కొత్తలోకానికి చాలా దగ్గర్లో ఉన్నాం, మన విశ్వాసానికి పరీక్షలు ఎదురౌతున్నాయి. కాబట్టి మన విశ్వాసం బలంగా ఉందో లేదో పరిశీలించుకోవాలి. దానికోసం మనమేమి చేయవచ్చు? మత్తయి 6:33లో ఉన్న యేసు మాటల్ని మనం పరిశీలించవచ్చు. మీరు ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి, ‘నా లక్ష్యాలు, నేను తీసుకునే నిర్ణయాలు యేసు మాటలపై నాకు నిజంగా నమ్మకం ఉందని చూపిస్తున్నాయా? ఎక్కువ డబ్బు సంపాదించడానికి మీటింగ్స్‌ని లేదా ప్రీచింగ్‌ని మానేస్తున్నానా? నేను చేస్తున్న ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని, శక్తిని పెట్టాల్సి వస్తే నేనేమి చేస్తాను? నన్ను మలిచే అవకాశం ఈ లోకానికి ఇచ్చి బహుశా యెహోవాను సేవించడం కూడా మానేస్తానా?’

9. మన విశ్వాసాన్ని ఎందుకు పరిశీలించుకుంటూ ఉండాలి? ఎలా?

9 చెడు స్నేహాల గురించి, ఒకర్ని సంఘం నుండి బహిష్కరించడం గురించి లేదా వినోదం గురించి బైబిలు చెప్తున్నదాన్ని పెడచెవిన పెడితే, మన హృదయం కఠినంగా తయారవ్వవచ్చు. ఒకవేళ మీకే ఇలా జరుగుతున్నట్లు అనిపిస్తే మీరేమి చేయాలి? మీరు వెంటనే మీ విశ్వాసం ఎలా ఉందో పరిశీలించుకోవాలి. బైబిలు ఇలా చెప్తుంది, ‘మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరిశీలించుకుంటూ ఉండండి.’ (2 కొరిం. 13:5, NW) నిజాయితీగా ఉంటూ, మీ ఆలోచనా విధానాన్ని సరిచేసుకోవడానికి క్రమంగా బైబిల్ని ఉపయోగించండి.

ఎల్లప్పుడూ మెత్తని మట్టిలా ఉండండి

10. యెహోవా చేతిలో మెత్తని మట్టిలా ఉండడానికి మనకేవి సహాయం చేస్తాయి?

10 మనం ఎల్లప్పుడూ మెత్తని మట్టిలా ఉండేందుకు సహాయం చేయడానికి దేవుడు బైబిల్ని, క్రైస్తవ సంఘాన్ని, పరిచర్యను ఏర్పాటు చేశాడు. మనం రోజూ బైబిల్ని చదివి, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచిస్తే, యెహోవా చేతిలో మెత్తని మట్టిలా అంటే మలచబడడానికి వీలుగా ఉంటాం. ఇశ్రాయేలు రాజులు దేవుని ధర్మశాస్త్ర ప్రతిని ఒకటి రాసుకొని దాన్ని రోజూ చదవాలని యెహోవా ఆజ్ఞాపించాడు. (ద్వితీ. 17:18-20) లేఖనాలను చదవడం వాటిని లోతుగా ఆలోచించడం తమ పరిచర్య కోసం చాలా ప్రాముఖ్యమని అపొస్తలులకు తెలుసు. వాళ్లు పత్రికలు రాసినప్పుడు హీబ్రూ లేఖనాల్లోని వచనాలను వందలసార్లు ఉపయోగించారు. అంతేకాదు వాళ్లు ప్రకటిస్తున్నప్పుడు ప్రజల్ని కూడా లేఖనాలను ఉపయోగించమని ప్రోత్సహించారు. (అపొ. 17:11) అదేవిధంగా మనం కూడా బైబిల్ని రోజూ చదివి, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించడం ప్రాముఖ్యమని గుర్తిస్తాం. (1 తిమో. 4:15) దానివల్ల మనం వినయంగా ఉండగలుగుతాం, అప్పుడు యెహోవా మనల్ని మలిచేందుకు వీలుగా ఉంటాం.

మీరు ఎల్లప్పుడూ మెత్తని మట్టిలా ఉండేందుకు యెహోవా చేసిన ఏర్పాట్లను ఉపయోగించుకోండి (10-13 పేరాలు చూడండి)

11, 12. మన అవసరాలకు తగ్గట్లుగా మనల్ని మలచడానికి యెహోవా క్రైస్తవ సంఘాన్ని ఎలా ఉపయోగించగలడు? ఓ ఉదాహరణ చెప్పండి.

11 మనలో ప్రతి ఒక్కరికీ ఏమి అవసరమో యెహోవాకు తెలుసు, అంతేకాదు మనల్ని మలచడానికి ఆయన క్రైస్తవ సంఘాన్ని ఉపయోగిస్తున్నాడు. ముందు పేరాల్లో చూసిన జిమ్‌ పట్ల ఒక సంఘపెద్ద శ్రద్ధ చూపించినప్పుడు అతను తన ఆలోచనా విధానం మార్చుకోవడం మొదలుపెట్టాడు. జిమ్‌ ఇలా చెప్తున్నాడు, “నా పరిస్థితి గురించి ఆ పెద్ద ఒక్కసారి కూడా నన్ను నిందించలేదు, విమర్శించలేదు. బదులుగా నన్ను ప్రోత్సహిస్తూ, నాకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పాడు.” దాదాపు మూడు నెలల తర్వాత, ఆ సంఘపెద్ద జిమ్‌ని మీటింగ్‌కి ఆహ్వానించాడు. సంఘంలోని వాళ్లు తనను చక్కగా ఆహ్వానించారని, వాళ్లు చూపించిన ప్రేమ తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి సహాయం చేసిందని అతను చెప్తున్నాడు. తన భావాలే అన్నిటికన్నా ప్రాముఖ్యం కావని అతను గుర్తించడం మొదలుపెట్టాడు. తన భార్య, అలాగే సంఘంలోని పెద్దలు జిమ్‌ను ప్రోత్సహించారు దాంతో అతను మెల్లమెల్లగా యెహోవాను సేవించడం మళ్లీ ప్రారంభించాడు. కావలికోట నవంబరు 15, 1992 సంచికలోని “యెహోవాను నిందించుట తగదు,” “యెహోవాను యథార్థతతో సేవించుము” అనే ఆర్టికల్స్‌ని చదవడంవల్ల కూడా జిమ్‌ ప్రయోజనం పొందాడు.

12 కొంతకాలానికి జిమ్‌ మళ్లీ సంఘపెద్ద అయ్యాడు. అప్పటినుండి, తనలాంటి సమస్యల్నే ఎదుర్కొంటున్న ఇతర సహోదరులు వాటిని పరిష్కరించుకొని, తమ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి జిమ్‌ సహాయం చేస్తున్నాడు. అతను చివరికి ఇలా చెప్తున్నాడు, “నాకు యెహోవాతో దగ్గరి సంబంధం ఉందని అనుకున్నాను, కానీ నిజానికి నేను యెహోవాకు దూరమయ్యాను. గర్వం నన్ను గుడ్డివాడిని చేసింది, దానివల్ల ఇతరుల్లోని తప్పులు వెతికానే తప్ప ఎంతో ప్రాముఖ్యమైన విషయాల మీద మనసుపెట్టలేకపోయాను. అలా చేసినందుకు బాధపడుతున్నాను.”—1 కొరిం. 10:13.

13. పరిచర్యవల్ల మనం ఎలాంటి లక్షణాలను వృద్ధి చేసుకోగలుగుతాం? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

13 పరిచర్య కూడా మనల్ని మలుస్తుంది, మరిన్ని మంచి లక్షణాలను వృద్ధి చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఎలా? మనం సువార్తను ప్రకటించినప్పుడు, వినయం అలాగే పవిత్రశక్తి పుట్టించే ఇతర లక్షణాల్ని చూపించాలి. (గల. 5:22-24) పరిచర్యవల్ల మీరు వృద్ధి చేసుకున్న మంచి లక్షణాల గురించి ఆలోచించండి. మనం క్రీస్తును అనుకరించినప్పుడు, ప్రజలు మనం చెప్పే సువార్తను వింటారు అలాగే మనపట్ల వాళ్ల అభిప్రాయాన్ని కూడా మార్చుకుంటారు. ఉదాహరణకు, ఆస్ట్రేలియాలో ఇద్దరు సాక్షులు ఇంటింటి పరిచర్యలో ఓ స్త్రీని కలిశారు. ఆమె చాలా కోప్పడి, అమర్యాదగా మాట్లాడింది. అయినాసరే సాక్షులు ఆమె మాటల్ని గౌరవంగా విన్నారు. తర్వాత ఆ స్త్రీ, సాక్షులతో అలా ప్రవర్తించినందుకు బాధపడింది. గర్వంగా ప్రవర్తించినందుకు క్షమాపణ చెప్తూ బ్రాంచి కార్యాలయానికి ఒక ఉత్తరం రాసింది. ఆమె ఇలా అంది, “దేవుని వాక్యాన్ని చెప్పడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని తరిమేయడానికి ప్రయత్నించిన నేను మూర్ఖురాలిని.” ఈ అనుభవాన్నిబట్టి, మనం ప్రకటిస్తున్నప్పుడు శాంతంగా ఉండడం ప్రాముఖ్యమని అర్థంచేసుకోవచ్చు. అవును, మనం చేసే పరిచర్య ఇతరులకే కాదు మంచి లక్షణాలను వృద్ధి చేసుకోవడానికి మనకు కూడా సహాయం చేస్తుంది.

పిల్లల్ని మలుస్తున్నప్పుడు తల్లిదండ్రులు దేవునికి లోబడాలి

14. తమ పిల్లల్ని చక్కగా మలచడానికి తల్లిదండ్రులు ఏమి చేయాలి?

14 చాలామంది చిన్నపిల్లలు వినయంగా ఉంటూ, నేర్చుకోవడానికి ఆతురత చూపిస్తారు. (మత్త. 18:1-4) కాబట్టి చిన్నవయసులోనే తమ పిల్లలు సత్యాన్ని నేర్చుకొని దాన్ని ప్రేమించేందుకు సహాయం చేయడానికి తల్లిదండ్రులు కృషిచేయవచ్చు. (2 తిమో. 3:14, 15) ఆ పనిని చక్కగా చేయాలంటే ముందు తల్లిదండ్రులు సత్యాన్ని ప్రేమించి, నేర్చుకుంటున్న విషయాల్ని తమ జీవితాల్లో పాటించాలి. వాళ్లు అలా చేసినప్పుడు, పిల్లలకు కూడా సత్యాన్ని ప్రేమించడం తేలికౌతుంది. అంతేకాదు, పిల్లలు క్రమశిక్షణ పొందినప్పుడు అది తమ తల్లిదండ్రులు అలాగే యెహోవా చూపిస్తున్న ప్రేమకు గుర్తని వాళ్లు అర్థంచేసుకుంటారు.

15, 16. తమ పిల్లలు ఎవరైనా బహిష్కరించబడితే తల్లిదండ్రులు దేవుని మీద నమ్మకాన్ని ఎలా చూపించాలి?

15 తల్లిదండ్రులు సత్యాన్ని నేర్పించినప్పటికీ, కొంతమంది పిల్లలు యెహోవాకు దూరమౌతారు లేదా సంఘం నుండి బహిష్కరించబడతారు. అలా జరిగితే కుటుంబంలోని వాళ్లకు చాలా బాధ కలుగుతుంది. దక్షిణ ఆఫ్రికాలోని ఒక సహోదరి ఇలా చెప్పింది, “మా అన్నయ్యను సంఘం నుండి బహిష్కరించినప్పుడు, అతను చనిపోయినట్టు అనిపించింది. మా గుండె పగిలిపోయింది.” మరి ఆమె, వాళ్ల తల్లిదండ్రులు ఏమి చేశారు? వాళ్లు బైబిల్లోని నిర్దేశాలను పాటించారు. (1 కొరింథీయులు 5:11, 13 చదవండి.) దేవుడు ఇస్తున్న సలహాను పాటిస్తే అందరూ ప్రయోజనం పొందుతారని ఆ తల్లిదండ్రులకు తెలుసు. అంతేకాదు బహిష్కరించడం అనేది యెహోవా ప్రేమతో ఇస్తున్న క్రమశిక్షణ అని వాళ్లు గుర్తించారు. కాబట్టి కుటుంబానికి సంబంధించి ఏదైన ప్రాముఖ్యమైన విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రమే వాళ్లు తమ కొడుకుతో మాట్లాడేవాళ్లు.

16 మరి ఆ కొడుకు ఎలా భావించాడు? సంఘానికి తిరిగొచ్చిన తర్వాత అతను ఇలా చెప్పాడు, “నా కుటుంబం నన్ను ద్వేషించలేదని నాకు తెలుసు. ఆ సమయంలో వాళ్లు యెహోవాకు, ఆయన సంస్థకు లోబడ్డారు. అంతేకాదు సహాయం కోరడానికి, క్షమించమని అడగడానికి యెహోవా తప్ప ఇంకెవ్వరూ కనిపించనప్పుడు ఆయన మనకు ఎంత అవసరమో అప్పుడు తెలుస్తుంది.” ఆ అబ్బాయి తిరిగి యెహోవా దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుటుంబం పొందిన సంతోషాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అవును, మనం యెహోవాకు ఎల్లప్పుడూ లోబడితే సంతోషంగా ఉంటాం, మంచి ఫలితాలు పొందుతాం.—సామె. 3:5, 6; 28:26.

17. మనం ఎందుకు యెహోవాకు లోబడుతూనే ఉండాలి? దానివల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతాం?

17 బబులోనులోని యూదులు పశ్చాత్తాపపడి, ఇలా అంటారని యెషయా ప్రవక్త ముందే చెప్పాడు, “యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము . . . మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసికొనకుము చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే గదా.” (యెష. 64:8, 9) మనం వినయంగా ఉంటూ యెహోవాకు ఎప్పుడూ లోబడుతూ ఉంటే, దానియేలులాగే మనం కూడా ఆయనకు చాలా ప్రియమైనవాళ్లుగా ఉంటాం. మనం భవిష్యత్తులో పరిపూర్ణులైన “దేవుని పిల్లలు” అయ్యేలా యెహోవా మనల్ని తన వాక్యం ద్వారా, పవిత్రశక్తి ద్వారా, సంస్థ ద్వారా మలుస్తూనే ఉంటాడు.—రోమా. 8:20, 21.