కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాను మన కుమ్మరిగా గుర్తిస్తూ కృతజ్ఞత చూపిద్దాం

యెహోవాను మన కుమ్మరిగా గుర్తిస్తూ కృతజ్ఞత చూపిద్దాం

“యెహోవా . . . నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.”యెష. 64:8.

పాటలు: 11, 26

1. యెహోవా ఓ గొప్ప కుమ్మరి అని ఎందుకు చెప్పవచ్చు?

 లండన్‌లో, 2010 నవంబరు నెలలో, అతి పురాతనమైన చైనా మట్టి పాత్ర దాదాపు 7 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. ఒక కుమ్మరి, చౌకగా ఎక్కడైనా దొరికే మామూలు మట్టిని అంత అందమైన, ఖరీదైన పాత్రగా మల్చగలగడం ఓ అద్భుతమైన విషయం. యెహోవా కూడా కుమ్మరి లాంటివాడే, కానీ మానవ కుమ్మరులు ఎవ్వరూ ఆయనకు సాటిరారు. ఆయన ‘నేలమట్టితో’ ఓ పరిపూర్ణ మనిషిని చేశాడని బైబిలు చెప్తుంది. (ఆది. 2:7) అంతేకాదు తన లక్షణాల్ని అనుకరించగలిగే సామర్థ్యంతో అతన్ని సృష్టించాడు. అందుకే బైబిలు ఆ పరిపూర్ణ మనిషైన ఆదామును ‘దేవుని కుమారుడు’ అని పిలుస్తోంది.—లూకా 3:38.

2, 3. పశ్చాత్తాపపడిన ఇశ్రాయేలీయులు చూపించిన వైఖరిని మనం ఎలా చూపించవచ్చు?

2 అయితే ఆదాము తిరుగుబాటు చేసినప్పుడు, కుమారునిగా తనకున్న స్థానాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఆదాము పిల్లల్లో చాలామంది యెహోవానే తమ పరిపాలకునిగా ఎన్నుకున్నారు. (హెబ్రీ. 12:1, 2) అంతేకాదు తమ సృష్టికర్తకు వినయంగా లోబడడం ద్వారా, సాతానుకు బదులు యెహోవానే తమకు తండ్రిగా, కుమ్మరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చూపించారు. (యోహా. 8:44) వాళ్లు యెహోవాపై ఉంచిన నమ్మకం, పశ్చాత్తాపపడిన ఇశ్రాయేలీయులు అన్న ఈ మాటల్ని మనకు గుర్తుచేస్తుంది: “యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.”—యెష. 64:8.

3 మనకాలంలోని దేవుని సేవకులు కూడా, ఆయనకు వినయంగా లోబడి ఉండడానికి చేయగలిగినదంతా చేస్తారు. యెహోవాను ‘తండ్రి’ అని పిలిచే అవకాశాన్ని వాళ్లు గొప్ప గౌరవంగా భావిస్తారు. అంతేకాదు ఆయనే తమ కుమ్మరిగా ఉండాలని కూడా కోరుకుంటారు. మరి మన విషయమేమిటి? యెహోవా మనల్ని ఓ విలువైన పాత్రలా మలిచేందుకు వీలుగా ఆయన చేతిలో మెత్తని మట్టిలా ఉండడానికి ఇష్టపడుతున్నామా? తోటి సహోదరసహోదరీల్ని, దేవుని చేతిలో మలచబడుతూ ఉన్న వ్యక్తులుగా చూస్తున్నామా? అసలు యెహోవా ఎవర్ని, ఎందుకు, ఎలా మలుస్తాడో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. సంఘంలోని ఇతరుల్ని సరైన దృష్టితో చూసేందుకు అవి మనకు సహాయం చేస్తాయి.

ఎవర్ని మలుస్తాడు?

4. ఎవర్ని మలచాలో యెహోవా ఎలా ఎన్నుకుంటాడు? ఉదాహరణలు చెప్పండి.

4 యెహోవా మనుషుల్ని మనం చూసినట్లు చూడడు. ఆయన హృదయాన్ని పరిశీలించి మనం నిజంగా ఎలాంటివాళ్లమో తెలుసుకుంటాడు. (1 సమూయేలు 16:7 చదవండి.) ఆయన క్రైస్తవ సంఘాన్ని స్థాపించినప్పుడు ఆ విషయం స్పష్టమైంది. ఎలాగంటే, ప్రజలు పనికిరానివాళ్లుగా భావించిన చాలామందికి యెహోవా తన గురించిన, తన కుమారుని గురించిన సత్యాన్ని తెలియజేశాడు. (యోహా. 6:44) అలాంటివాళ్లలో ఒకరు పరిసయ్యుడైన సౌలు. అతను ‘దూషకునిగా హింసకునిగా హానికరునిగా’ ఉండేవాడు. (1 తిమో. 1:12, 13) కానీ యెహోవా అతని హృదయాన్ని చూశాడు, అందుకే అతన్ని పనికిరానివాడిగా భావించలేదు. (సామె. 17:3) బదులుగా అతన్ని ఓ విలువైన పాత్రగా అంటే ‘అన్యజనుల యెదుట రాజుల యెదుట ఇశ్రాయేలీయుల యెదుట’ తన గురించి సాక్ష్యమివ్వడానికి ‘ఏర్పరచుకొనిన సాధనంగా’ మలచాలని అనుకున్నాడు. (అపొ. 9:15) కేవలం సౌలునే కాదు, ఒకప్పుడు త్రాగుబోతులుగా, తప్పుడు పనులు చేసేవాళ్లుగా, దొంగలుగా ఉన్న ఎంతోమందిని కూడా ఘనమైన పాత్రలుగా మలిచేందుకు యెహోవా ఎన్నుకున్నాడు. (రోమా. 9:21; 1 కొరిం. 6:9-11) వాళ్లు లేఖనాల్ని అధ్యయనం చేస్తూ యెహోవాపై తమకున్న విశ్వాసాన్ని బలపర్చుకున్నారు, యెహోవా చేతిలో మలచబడేందుకు తమను తాము అప్పగించుకున్నారు.

5, 6. యెహోవామీద మనకున్న నమ్మకం (ఎ) పరిచర్యలో మనం కలిసే ప్రజల గురించి (బి) తోటి సహోదరసహోదరీల గురించి ఆలోచించే తీరుపై ఎలాంటి ప్రభావం చూపించాలి?

5 సరైన ప్రజల్ని ఎన్నుకుని, వాళ్లకు తన గురించిన సత్యం తెలియజేసే సామర్థ్యం యెహోవాకు ఉందని మనం నమ్ముతాం. కాబట్టి పరిచర్యలో కలిసేవాళ్లకు లేదా మన సంఘంలోనివాళ్లకు మనం తీర్పు తీర్చకూడదు. ఉదాహరణకు, యెహోవాసాక్షులు తన ఇంటికి వచ్చినప్పుడు మైఖేల్‌ అనే ఓ వ్యక్తి ఎలా ప్రవర్తించాడో ఓసారి పరిశీలించండి. అతనిలా చెప్తున్నాడు, “వాళ్లు మా ఇంటికి వచ్చినప్పుడు ముఖం మీదే తలుపు వేసేవాడిని. వాళ్లను అస్సలు పట్టించుకునేవాడిని కాదు, చాలా కఠినంగా ప్రవర్తించాను. అయితే ఆ తర్వాత నేను ఓ కుటుంబాన్ని కలిశాను, వాళ్ల ప్రవర్తన నాకు నచ్చింది. కానీ వాళ్లు యెహోవాసాక్షులని తెలిసినప్పుడు నా నోట మాటరాలేదు. వాళ్ల ప్రవర్తన చూశాక అసలు నేను సాక్షుల్ని ఎందుకు ద్వేషిస్తున్నానో ఆలోచించుకున్నాను. నిజానికి నాకు యెహోవాసాక్షుల గురించి ఏమీ తెలియకపోవడంవల్ల, వాళ్లూ-వీళ్లూ చెప్పినవి వినడంవల్ల అలాంటి చెడు అభిప్రాయం కలిగిందని తర్వాత అర్థమైంది.” ఆ తర్వాత మైఖేల్‌ అసలు నిజమేంటో తెలుసుకోవాలని బైబిలు స్టడీకి ఒప్పుకున్నాడు. కొంతకాలానికి అతను బాప్తిస్మం తీసుకుని పూర్తికాల సేవ మొదలుపెట్టాడు.

6 యెహోవాను మన కుమ్మరిగా గుర్తించినప్పుడు, తోటి సహోదరసహోదరీల పట్ల మన ఆలోచనాతీరు మారుతుంది. వాళ్లను యెహోవా చూస్తున్నట్లు అంటే ఆయన చేతిలో మలచబడుతూ ఉన్న వ్యక్తులుగా చూస్తాం. యెహోవా హృదయాల్ని పరిశీలించి వాళ్లు నిజంగా ఎలాంటివాళ్లో తెలుసుకుంటాడు. అంతేకాదు తన చేతిలో వాళ్లు ఎలాంటి వ్యక్తులుగా మారగలరో కూడా ఆయనకు తెలుసు. అందుకే కొంతకాలమే ఉండే వాళ్ల అపరిపూర్ణతల్ని కాకుండా వాళ్లలో ఉన్న మంచినే యెహోవా చూస్తాడు. (కీర్త. 130:3) కాబట్టి మనం యెహోవాను అనుకరిస్తూ తోటి సహోదరసహోదరీల్ని ఆయన చూస్తున్నట్లే చూడాలి. అంతేకాదు వాళ్లు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి సహాయం చేయాలి, అలా చేస్తే మన కుమ్మరితో కలిసి పనిచేసిన వాళ్లమౌతాం. (1 థెస్స. 5:14, 15) ఈ విషయంలో సంఘపెద్దలు చక్కని ఆదర్శం ఉంచాలి.—ఎఫె. 4:8, 11-13.

ఎందుకు మలుస్తాడు?

7. యెహోవా ఇచ్చే క్రమశిక్షణను మీరు విలువైనదిగా ఎందుకు ఎంచుతున్నారు?

7 ‘మా అమ్మానాన్నలు క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు నేను అస్సలు పట్టించుకోలేదు. కానీ దాని విలువేంటో నాకు పిల్లలు పుట్టాకే తెలిసింది’ అని కొంతమంది అనవచ్చు. నిజమే, ప్రేమ ఉంటేనే క్రమశిక్షణ ఇస్తారనీ మనం పెద్దవాళ్లమయ్యే కొద్దీ గుర్తిస్తాం. అందుకే దాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతాం. (హెబ్రీయులు 12:5, 6, 11 చదవండి.) యెహోవా కూడా తన పిల్లలమైన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఎంతో ఓపిగ్గా మనకు క్రమశిక్షణ ఇస్తున్నాడు లేదా మలుస్తున్నాడు. మనం జ్ఞానంతో నడుచుకోవాలనీ, సంతోషంగా ఉండాలనీ, తనను ప్రేమించాలనీ ఓ తండ్రిగా ఆయన కోరుకుంటున్నాడు. (సామె. 23:15) మనం బాధలుపడడంగానీ, పశ్చాత్తాపం చూపించని పాపులుగా చనిపోవడంగానీ ఆయనకు ఇష్టంలేదు.—ఎఫె. 2:2, 3.

8, 9. నేడు యెహోవా మనకెలా బోధిస్తున్నాడు? భవిష్యత్తులో మరింత ఎక్కువగా ఎలా బోధిస్తాడు?

8 యెహోవా గురించి తెలియకముందు మనకెన్నో చెడు అలవాట్లు ఉండివుండవచ్చు. కానీ యెహోవా మనల్ని మలిచి, మార్పులు చేసుకోవడానికి సహాయం చేశాడు. దాంతో మనం కొన్ని చక్కని లక్షణాల్ని వృద్ధిచేసుకున్నాం. (యెష. 11:6-8; కొలొ. 3:9, 10) ఇప్పుడు మనం ఆధ్యాత్మిక పరదైసులో జీవిస్తున్నాం. ఆ ప్రత్యేకమైన వాతావరణంలో తాను మలిచినట్లుగా మారడానికి యెహోవా మనకు సహాయం చేస్తున్నాడు. అందుకే మనం చెడుతనంతో నిండిపోయిన లోకంలో జీవిస్తున్నప్పటికీ సురక్షితంగా, భద్రంగా ఉండగలుగుతున్నాం. సొంతవాళ్ల ప్రేమ పొందని కొంతమంది, తోటి సహోదరసహోదరీల వల్ల నిజమైన ప్రేమను రుచి చూడగలుగుతున్నారు. (యోహా. 13:35) అంతేకాదు ఇతరులపట్ల ప్రేమ ఎలా చూపించాలో మనం నేర్చుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవా గురించి తెలుసుకోగలిగాం, తండ్రిగా ఆయన చూపించే ప్రేమను రుచి చూడగలుగుతున్నాం.—యాకో. 4:8.

9 కొత్తలోకంలో, ఆధ్యాత్మిక పరదైసు నుండి మనం పూర్తి ప్రయోజనం పొందుతాం. అంతేకాదు దేవుని రాజ్యం తీసుకొచ్చే ఎన్నో ఆశీర్వాదాల్ని ఆనందిస్తాం. అప్పుడు కూడా మనం ఊహించని రీతిలో యెహోవా మనల్ని మలుస్తూ, బోధిస్తూ ఉంటాడు. (యెష. 11:9) మానసికంగా, శారీరకంగా ఆయన మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. దానివల్ల ఆయనిచ్చే సూచనల్ని అర్థంచేసుకుని, వాటికి పూర్తిగా లోబడడం మనకు చాలా తేలికౌతుంది. కాబట్టి యెహోవా మనల్ని మలుస్తున్నప్పుడు ఆయనకు లోబడుతూ, ఆయన ప్రేమను ఎంతో విలువైనదిగా ఎంచుతున్నామని చూపిద్దాం.—సామె. 3:11, 12.

ఎలా మలుస్తాడు?

10. గొప్ప కుమ్మరికి ఉన్న ఓపికను, నైపుణ్యాన్ని యేసు ఎలా చూపించాడు?

10 నైపుణ్యంగల కుమ్మరిలాగే, యెహోవాకు కూడా మనగురించి బాగా తెలుసు. మన బలహీనతలేమిటో, పరిమితులేమిటో, ఎంత ప్రగతి సాధించామో ఆయనకు తెలుసు. వీటన్నిటినీ మనసులో ఉంచుకొని ఆయన మనల్ని మలుస్తాడు. (కీర్తన 103:10-14 చదవండి.) యెహోవా మనల్ని ఎలా చూస్తున్నాడో అర్థంచేసుకోవడానికి, యేసు జీవితం మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు యేసు తన అపొస్తలుల బలహీనతలతో ఎలా వ్యవహరించాడో ఓసారి ఆలోచించండి. తమలో ఎవరు గొప్ప అనే విషయం గురించి అపొస్తలులు కొన్నిసార్లు వాదించుకునేవాళ్లు. మీరే అక్కడుంటే వాళ్ల గురించి ఏమి అనుకునేవాళ్లు? వాళ్లు ఇక మారరని అనుకునేవాళ్లా? కానీ యేసు మాత్రం అలా అనుకోలేదు. తాను దయగా ఓపిగ్గా ఇచ్చే సలహాను విని, తనలాంటి వినయాన్ని చూపిస్తే వాళ్లు మారతారని ఆయనకు తెలుసు. (మార్కు 9:33-37; 10:37, 41-45; లూకా 22:24-27) యేసు పునరుత్థానమయ్యాక, ఆయన శిష్యులు పవిత్రశక్తిని పొందారు. అంతేకాదు తమలో ఎవరు గొప్ప అనే విషయం గురించి ఆలోచించడం మానేసి, యేసు తమకు అప్పగించిన పనిమీదే మనసుపెట్టారు.—అపొ. 5:42.

11. దేవుడు తనను మలచడానికి దావీదు ఎలా అనుమతించాడు? దావీదును మనమెలా అనుకరించవచ్చు?

11 నేడు యెహోవా బైబిలు ద్వారా, పవిత్రశక్తి ద్వారా, సంఘం ద్వారా మనల్ని మలుస్తున్నాడు. బైబిలు సహాయంతో మార్పులు చేసుకోవాలంటే మనమేమి చేయాలి? మనం దాన్ని చదవాలి, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించాలి, నేర్చుకున్నవాటిని పాటించడానికి సహాయం చేయమని యెహోవాను అడగాలి. రాజైన దావీదు ఇలా రాశాడు, ‘నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రిజాములయందు నిన్ను ధ్యానిస్తాను.’ (కీర్త. 63:4) ఆయనింకా ఇలా రాశాడు, “నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది.” (కీర్త. 16:7) అవును, యెహోవా ఇచ్చిన సలహాను ధ్యానిస్తూ, అది తన అంతరింద్రియములో అంటే తన హృదయలోతుల్లో ఉన్న ఆలోచనల్నీ భావాల్నీ మలచడానికి దావీదు అనుమతించాడు. కష్టంగా ఉన్న సలహాల్ని కూడా ఆయన పాటించాడు. (2 సమూ. 12:1-13) వినయం చూపించే విషయంలో, లోబడే విషయంలో దావీదు మనకు చక్కని ఆదర్శాన్ని ఉంచాడు. మీరు కూడా ఇలా ప్రశ్నించుకోండి, ‘బైబిలు చదువుతున్నప్పుడు, అందులోని విషయాల గురించి నేను లోతుగా ఆలోచిస్తానా? దేవుని సలహాలు నా హృదయలోతుల్లో ఉన్న ఆలోచనలపై, భావాలపై ప్రభావం చూపించడానికి అనుమతిస్తున్నానా? ఈ విషయంలో నేనింకా ఏమైనా మార్పులు చేసుకోవాలా?’—కీర్త. 1:2, 3.

12, 13. మనల్ని మలచడానికి యెహోవా పవిత్రశక్తిని, సంఘాన్ని ఎలా ఉపయోగించుకుంటాడు?

12 పవిత్రశక్తి మనల్ని వేర్వేరు విధాలుగా మలచగలదు. ఉదాహరణకు, పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని వృద్ధిచేసుకుంటూ యేసును అనుకరించడానికి అది మనకు సహాయం చేయగలదు. (గల. 5:22-24) పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ప్రేమ ఒకటి. యెహోవా ఆజ్ఞలు మేలు చేస్తాయని మనకు తెలుసు కాబట్టి ఆయన్ను ప్రేమిస్తున్నాం, ఆయనకు లోబడుతూ ఆయన చేతిలో మలచబడాలని కోరుకుంటాం. అంతేకాదు ఈ లోక ప్రభావాల్ని ఎదిరించడానికి కూడా పవిత్రశక్తి మనకు సహాయం చేయగలదు. (ఎఫె. 2:2) అపొస్తలుడైన పౌలు యువకునిగా ఉన్నప్పుడు గర్విష్ఠులైన యూదా మతనాయకుల ప్రభావం ఆయనపై పడింది. కానీ పవిత్రశక్తి సహాయంతో అతను మార్పులు చేసుకోగలిగాడు. అందుకే పౌలు తర్వాత ఇలా రాశాడు, “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలి. 4:13) కాబట్టి పవిత్రశక్తిని ఇవ్వమని మనం కూడా యెహోవాకు ప్రార్థించాలి. మనస్ఫూర్తిగా మనం చేసే అలాంటి ప్రార్థనలకు ఆయన తప్పకుండా జవాబిస్తాడు.—కీర్త. 10:17.

సంఘపెద్దల ద్వారా యెహోవా మనల్ని మలుస్తాడు. కాబట్టి వాళ్లిచ్చే సలహాను మనం పాటించాలి (12, 13 పేరాలు చూడండి)

13 మనలో ప్రతిఒక్కరినీ మలచడానికి సంఘాన్ని, సంఘపెద్దల్ని కూడా యెహోవా ఉపయోగించుకుంటాడు. ఉదాహరణకు, మనలో ఏదైనా బలహీనత ఉందని పెద్దలు గమనిస్తే వాళ్లు మనకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే వాళ్లు తమ సొంత జ్ఞానంతో మనకు సలహాలు ఇవ్వరు. (గల. 6:1) బదులుగా తమకు అవగాహనను, జ్ఞానాన్ని ఇవ్వమని వినయంగా యెహోవాకు ప్రార్థిస్తారు. ఆ తర్వాత బైబిల్లో, మన ప్రచురణల్లో మనకు సహాయపడే సమాచారం కోసం పరిశోధిస్తారు. కాబట్టి మీరు వేసుకునే బట్టలు వంటి వాటి గురించి సంఘపెద్దలు మీకు దయగా, ప్రేమగా ఏదైనా సలహా ఇస్తే అది దేవునికి మీపై ఉన్న ప్రేమకు ఓ రుజువని గుర్తుంచుకోండి. ఆ సలహాను పాటించినప్పుడు, యెహోవా మలిచేందుకు వీలుగా మీరు మెత్తని మట్టిలా ఉంటారు. దానివల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు.

14. యెహోవాకు ప్రజలపై హక్కు ఉన్నప్పటికీ, వాళ్లకు ఉన్న స్వేచ్ఛాచిత్తాన్ని ఆయన ఎలా గౌరవిస్తాడు?

14 యెహోవా మనల్ని ఎలా మలుస్తాడో అర్థంచేసుకుంటే, మన తోటి సహోదరసహోదరీలతో మంచి సంబంధం కలిగివుంటాం. అలాగే మనం స్టడీ ఇస్తున్నవాళ్లపై, పరిచర్యలో కలిసే ప్రజలపై మనకు మంచి అభిప్రాయం ఉంటుంది. ఓ కుమ్మరి, మట్టిని పాత్రగా మలచడానికి ముందు దాన్ని శుభ్రంచేసి, అందులో రాళ్లుగానీ వేరే ఏవైనా అనవసరమైనవిగానీ ఉంటే వాటిని తీసేస్తాడు. మన గొప్ప కుమ్మరియైన యెహోవా కూడా, మార్పులు చేసుకోవడానికి ఇష్టపడేవాళ్లకు సహాయం చేస్తాడు. అంతేగానీ మారమని వాళ్లను బలవంతం చేయడు. బదులుగా వాళ్లే స్వయంగా తమ జీవితంలో మార్పులు చేసుకునేలా తన నీతి ప్రమాణాలను వాళ్లకు తెలియజేస్తాడు.

15, 16. యెహోవా చేతిలో మలచబడడానికి తాము ఇష్టపడుతున్నామని బైబిలు విద్యార్థులు ఎలా చూపిస్తారు? ఓ అనుభవం చెప్పండి.

15 ఉదాహరణకు, ఆస్ట్రేలియాలో ఉంటున్న టెసీ అనుభవాన్ని పరిశీలించండి. బైబిలు చెప్పేవాటిని ఆమె చాలా తేలిగ్గా నేర్చుకునేది. అయినాసరే ఆమె అంతగా అభివృద్ధి సాధించలేదు, మీటింగ్స్‌కు కూడా వెళ్లేదికాదు. దాంతో ఆమెకు స్టడీ ఇస్తున్న సహోదరి యెహోవాకు ప్రార్థించి, ఇక ఆ రోజుతో స్టడీ ఆపేయాలని నిర్ణయించుకుని ఆమె దగ్గరకు వెళ్లింది. ఆ రోజు ఆశ్చర్యకరంగా, తాను ఎందుకు ప్రగతి సాధించడంలేదో టెసీ ఆ సహోదరికి వివరించింది. తనకు జూదం ఆడడమంటే చాలా ఇష్టమనీ, ఓవైపు యెహోవా గురించి నేర్చుకుంటూ మరోవైపు జూదం ఆడడం వేషధారణలా అనిపించిందనీ ఆమె చెప్పింది. అంతేకాదు ఆమె జూదం ఆడడం ఆపేయాలని నిర్ణయించుకుందని చెప్పింది.

16 కొంతకాలానికే ఆమె మీటింగ్స్‌కు వెళ్లడం, క్రైస్తవ లక్షణాల్ని చూపించడం మొదలుపెట్టింది. అది చూసి తన పాత స్నేహితులు ఎగతాళి చేసినప్పటికీ టెసీ ప్రగతి సాధిస్తూనే వచ్చింది. ఆమెకు స్టడీ ఇచ్చిన సహోదరి ఇలా చెప్పింది, “ఆ తర్వాత టెసీ బాప్తిస్మం తీసుకుంది. తనకు చిన్నపిల్లలు ఉన్నప్పటికీ క్రమ పయినీరు సేవ చేయడం ప్రారంభించింది.” అవును, ఎప్పుడైతే స్టడీ తీసుకుంటున్నవాళ్లు దేవున్ని సంతోషపెట్టడానికి మార్పులు చేసుకోవడం మొదలుపెడతారో, అప్పుడు దేవుడు వాళ్లకు దగ్గరౌతాడు, వాళ్లను విలువైన పాత్రలుగా మలుస్తాడు.

17. (ఎ) యెహోవా మీ కుమ్మరిగా ఉండడం గురించి మీరెలా భావిస్తున్నారు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో వేటిని పరిశీలిస్తాం?

17 ఇప్పటికీ కొంతమంది కుమ్మరులు, తమ చేతితో మట్టిని జాగ్రత్తగా అందమైన పాత్రలుగా మలుస్తారు. అదేవిధంగా యెహోవా కూడా తన సలహాల ద్వారా మనల్ని మలుస్తూ, మనం ఎలా స్పందిస్తామో జాగ్రత్తగా గమనిస్తాడు. (కీర్తన 32:8 చదవండి.) యెహోవా మీపై చూపిస్తున్న శ్రద్ధను మీరు గుర్తించగలుగుతున్నారా? యెహోవా మిమ్మల్ని ఎలా జాగ్రత్తగా మలుస్తున్నాడో చూడగలుగుతున్నారా? అలాగైతే, యెహోవా మిమ్మల్ని మలిచేందుకు వీలుగా ఆయన చేతిలో మెత్తని మట్టిలా ఉండడానికి మీకు ఏ లక్షణాలు సహాయం చేస్తాయి? మలిచేందుకు అనువుగాలేని మట్టిలా ఉండకూడదంటే మీరు ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి? తమ పిల్లల్ని మలిచే విషయంలో తల్లిదండ్రులు యెహోవాకు ఎలా మద్దతివ్వవచ్చు? ఈ ప్రశ్నలన్నిటికీ తర్వాతి ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం.