కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లేఖకుని సిరాబుడ్డి ఉన్న వ్యక్తి యేసుక్రీస్తును సూచిస్తున్నాడు. ఆయనే రక్షించబడేవాళ్లకు గుర్తువేస్తాడు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

యెహెజ్కేలు దర్శనంలోని, లేఖకుని సిరాబుడ్డి ఉన్న వ్యక్తి అలాగే హతముచేసే ఆయుధాలను పట్టుకొని ఉన్న ఆరుగురు వ్యక్తులు ఎవర్ని సూచిస్తున్నారు?

వాళ్లు యెరూషలేమును నాశనం చేయడంలో భాగం వహించిన పరలోక సైన్యాలను సూచిస్తున్నారు. ఆ సైన్యాలే హార్‌మెగిద్దోను సమయంలో సాతాను దుష్టలోకాన్ని నాశనం చేయడంలో కూడా భాగం వహిస్తాయి. ఇది మన అవగాహనలో వచ్చిన సవరణ. ఈ సవరణ ఎందుకు అవసరమైంది?

యెరూషలేము నాశనమవ్వడానికి ముందు ఆ పట్టణంలో ఏమి జరుగుతుందో సా.శ.పూ. 607కన్నా ముందే యెహోవా దేవుడు యెహెజ్కేలుకు ఓ దర్శనంలో చూపించాడు. ఆ పట్టణంలో ఎన్నో చెడు పనులు జరగడాన్ని యెహెజ్కేలు ఆ దర్శనంలో చూశాడు. ఆ తర్వాత, “హతముచేయు ఆయుధమును చేత పట్టుకొని” ఉన్న ఆరుగురు వ్యక్తుల్ని అతను చూశాడు. వాళ్లతోపాటు “అవిసెనారబట్ట ధరించుకొని,” “లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని” ఉన్న మరో వ్యక్తి కూడా యెహెజ్కేలుకు కనిపించాడు. (యెహె. 8:6-12; 9:2, 3) పట్టణములో జరుగుతున్న “హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారి లలాటముల గురుతు” వేసే పని ఈ వ్యక్తికి అప్పగించబడింది. ఆ గుర్తు లేనివాళ్లందర్నీ చంపే పని ఆయుధాలు పట్టుకొనివున్న ఆరుగురు వ్యక్తులకు ఇవ్వబడింది. (యెహె. 9:4-7) ఈ దర్శనం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? లేఖకుని సిరాబుడ్డి ఉన్న వ్యక్తి ఎవరు?

యెహెజ్కేలు ఈ దర్శనాన్ని సా.శ.పూ. 612లో చూశాడు. అయితే ఐదు సంవత్సరాల తర్వాత అంటే బబులోను సైన్యాన్ని ఉపయోగించుకుని యెహోవా యెరూషలేమును నాశనం చేసినప్పుడు ఈ ప్రవచనం మొదటి నెరవేర్పు జరిగింది. ఆ విధంగా, బబులోనీయుల్ని ఉపయోగించుకుని అవిధేయులుగా మారిన తన ప్రజల్ని యెహోవా నాశనం చేశాడు. (యిర్మీ. 25:8-9, 15-18) మరి యెరూషలేములో జరుగుతున్న చెడు పనుల్లో పాలుపంచుకోని నీతిమంతులైన యూదుల సంగతేంటి? వాళ్లకు ఏ హానీ కలగకుండా సురక్షితంగా ఉండేలా యెహోవా చూశాడు.

నిజానికి ఆ దర్శనంలో, యెహెజ్కేలు ఎవ్వరి నొసటి మీద గుర్తు వేయలేదు లేదా యెరూషలేమును నాశనం చేయడంలో భాగం వహించలేదు. దేవదూతలే ఆ పనిని నడిపించారు. కాబట్టి పరలోకంలో జరిగే విషయాల్ని తెలుసుకోవడానికి ఈ ప్రవచనం మనకు సహాయం చేస్తుంది. చెడ్డవాళ్లందర్నీ నాశనం చేసి, నీతిమంతుల్ని రక్షించమని యెహోవా తన దూతలకు ఆజ్ఞాపించాడు. a

ఈ ప్రవచనం రెండవ నెరవేర్పు భవిష్యత్తులో జరుగుతుంది. ఒకప్పుడు మనం, లేఖకుని సిరాబుడ్డి ఉన్న వ్యక్తి భూమ్మీద మిగిలివున్న అభిషిక్త క్రైస్తవుల గుంపును సూచిస్తున్నాడని చెప్పేవాళ్లం. అంతేకాదు సువార్త విని దాన్ని అంగీకరించేవాళ్ల నొసళ్ల మీద గుర్తు వేయబడుతుందని కూడా అనుకున్నాం. కానీ ఆ వివరణలో కొంత సవరణ అవసరమని ఈ మధ్యకాలంలో స్పష్టమైంది. ఎందుకంటే మత్తయి 25:31-33 వచనాల్నిబట్టి, ప్రజల్ని గొర్రెలుగా మేకలుగా తీర్పు తీర్చేది యేసు అని తెలుసుకున్నాం. ఆయన ఆ పనిని మహాశ్రమల కాలంలో చేస్తాడు. అప్పుడు గొర్రెలుగా తీర్పు పొందినవాళ్లు రక్షించబడతారు, మేకలుగా తీర్పు పొందినవాళ్లు నాశనం అవుతారు.

కాబట్టి యెహెజ్కేలు దర్శనం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఐదు పాఠాల్ని నేర్చుకోవచ్చు, అవేమిటంటే:

  1. యెరూషలేము పట్టణం నాశనం అవ్వకముందే, ఆ పట్టణానికి జరగబోయే దానిగురించి యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు ప్రవక్తలు ప్రజల్ని హెచ్చరించారు. వాళ్లు దేవుని నుండి వచ్చే హెచ్చరికా సందేశాన్ని ప్రకటించారు. నేడు యెహోవా, మహాశ్రమలు మొదలవ్వక ముందే తన ప్రజలకు బోధించడానికి, ఇతరుల్ని హెచ్చరించడానికి అభిషిక్త క్రైస్తవుల చిన్న గుంపును ఉపయోగించుకుంటున్నాడు. నిజానికి ఆ హెచ్చరికా సందేశాన్ని ప్రకటించాల్సిన బాధ్యత దేవుని ప్రజలందరికీ అంటే క్రీస్తు ఇంటివాళ్లందరికీ ఉంది.—మత్త. 24:45-47.

  2. యెహెజ్కేలులాగే, నేడున్న దేవుని ప్రజలు కూడా రక్షించబడేవాళ్లకు ఎలాంటి గుర్తు వేయరు. వాళ్లు కేవలం ప్రకటిస్తూ భవిష్యత్తులో జరగబోయే వాటిగురించి ప్రజల్ని హెచ్చరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పని దేవదూతల సహాయంతో జరుగుతోంది.—ప్రక. 14:6.

  3. యెహెజ్కేలు కాలంలో రక్షించబడిన ప్రజల నొసళ్లపై ఎలాంటి గుర్తులేనట్లే, భవిష్యత్తులో రక్షించబడే ప్రజల నొసళ్లపై కూడా ఎలాంటి గుర్తు ఉండదు. ఇంతకీ మహాశ్రమల్ని తప్పించుకోవాలంటే ప్రజలు ఏమి చేయాలి? సువార్తకు చక్కగా స్పందించాలి, క్రీస్తును అనుకరించాలి, తమను తాము దేవునికి సమర్పించుకోవాలి, సువార్త ప్రకటిస్తూ క్రీస్తు సహోదరులకు మద్దతివ్వాలి. (మత్త. 25:35-40) అలాంటివాళ్లకు మహాశ్రమల కాలంలో గుర్తు వేయబడుతుంది, అంటే వాళ్లు రక్షించబడతారని దానర్థం.

  4. సిరాబుడ్డి ఉన్న వ్యక్తి యేసును సూచిస్తున్నాడు. ఆయన మహాశ్రమల కాలంలో, గొప్పసమూహంలోని వాళ్లను గొర్రెలుగా తీర్పు తీర్చినప్పుడు వాళ్లకు గుర్తు వేస్తాడు. ఆ తర్వాత వాళ్లకు భూమ్మీద నిత్యం జీవించే అవకాశం ఉంటుంది.—మత్త. 25:34, 46. b

  5. నేడు, హతము చేసే ఆయుధాలున్న ఆరుగురు వ్యక్తులు యేసు నాయకత్వంలో ఉన్న పరలోక సైన్యాల్ని సూచిస్తున్నారు. వాళ్లు త్వరలోనే భూరాజుల్ని నాశనం చేసి దుష్టత్వాన్ని పూర్తిగా లేకుండా చేస్తారు.—యెహె. 10:2, 6, 7; ప్రక. 19:11-21.

ఈ దర్శనం నుండి మనం నేర్చుకున్న పాఠాలు, దేవుడు చెడ్డవాళ్లతోపాటు నీతిమంతుల్ని నాశనం చేయడనే నమ్మకాన్ని కలిగివుండడానికి మనకు సహాయం చేస్తాయి. (2 పేతు. 2:9-10; 3:9) అంతేకాదు మనకాలంలో జరుగుతున్న ప్రకటనాపని చాలా ముఖ్యమైనదనే విషయాన్ని కూడా ఆ పాఠాలు మనకు గుర్తుచేస్తున్నాయి. అంతం రాకముందే అందరూ ఆ హెచ్చరికను తెలుసుకోవడం చాలా ముఖ్యం.—మత్త. 24:14.

a ఆ విధంగా రక్షించబడిన బారూకు (యిర్మీయా కార్యదర్శి), ఐతియోపీయుడైన ఎబెద్మెలెకు, రేకాబీయులు వంటివాళ్ల నొసళ్ల మీద కంటికి కనిపించే ఎలాంటి గుర్తు లేదు. (యిర్మీ. 35:1-19; 39:15-18; 45:1-5) వాళ్లు రక్షించబడడమే ఓ విధంగా గుర్తు లాంటిది.

b నమ్మకమైన అభిషిక్తులు రక్షించబడాలంటే ఈ గుర్తును పొందాల్సిన అవసరంలేదు. బదులుగా వాళ్లు చనిపోవడానికి ముందు లేదా మహాశ్రమలు మొదలవ్వడానికి ముందు తమ చివరి ముద్రను పొందుతారు.—ప్రక. 7:1, 3.