కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అత్యంత ప్రాముఖ్యమైన వివాదాంశంపై మనసుపెట్టండి

అత్యంత ప్రాముఖ్యమైన వివాదాంశంపై మనసుపెట్టండి

“యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.”కీర్త. 83:18.

పాటలు: 46, 16

1, 2. (ఎ) అన్నిటికన్నా ప్రాముఖ్యమైన అంశం ఏమిటి? (బి) అది మనకెందుకు ప్రాముఖ్యం?

 ఈ రోజుల్లో చాలామంది డబ్బే అన్నిటికన్నా ప్రాముఖ్యం అనుకుంటున్నారు. డబ్బే వాళ్ల ప్రపంచం. ఎక్కువ డబ్బు సంపాదించడానికి, సంపాదించింది దాచిపెట్టుకోవడానికే వాళ్లు తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇంకొంతమంది కుటుంబం, ఆరోగ్యం లేదా జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలే అన్నిటికన్నా ప్రాముఖ్యమని అనుకుంటున్నారు.

2 అయితే, వీటన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైన అంశం ఒకటుంది. అదే యెహోవా సర్వాధిపత్యాన్ని నిరూపించడం. ఈ ప్రాముఖ్యమైన వివాదాంశాన్ని మనమెప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మనం జాగ్రత్తగా లేకపోతే, మన రోజూవారి పనుల్లో పడిపోయి లేదా మన సొంత సమస్యల గురించే ఆలోచిస్తూ ఆ వివాదాంశానికి ఉన్న ప్రాముఖ్యతను మర్చిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మనం యెహోవా సర్వాధిపత్యానికి మద్దతిస్తే మన రోజూవారి సమస్యల్ని చక్కగా పరిష్కరించుకోగలుగుతాం, యెహోవాకు మరింత దగ్గరవ్వగలుగుతాం.

ఈ వివాదాంశం ఎందుకు ప్రాముఖ్యమైనది?

3. దేవుని పరిపాలన గురించి సాతాను ఏమని ప్రశ్నించాడు?

3 మనుషుల్ని పరిపాలించడానికి యెహోవాకున్న హక్కును సాతాను ప్రశ్నించాడు. యెహోవా అవినీతిపరుడైన పరిపాలకుడనీ, తమకు శ్రేష్ఠమైనది ఇవ్వకుండా దాస్తున్నాడనీ మనుషులందరూ అనుకోవాలనేది సాతాను కోరిక. తమను తాము పరిపాలించుకుంటే చాలా సంతోషంగా ఉంటామని కూడా మనుషులు అనుకోవాలని సాతాను కోరుకున్నాడు. (ఆది. 3:1-5) అంతేకాదు, దేవునికి ఎవ్వరూ నమ్మకంగా లేరని, కష్టాలు వస్తే దేవున్ని తిరస్కరిస్తారని కూడా నిందించాడు. (యోబు 2:4, 5) అందుకే, దేవుని పరిపాలన కింద లేకపోతే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మనుషులందరూ అర్థంచేసుకునేలా యెహోవా కొంత సమయాన్ని అనుమతిస్తున్నాడు.

4. యెహోవా సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశం ఎందుకు పరిష్కరించబడాలి?

4 సాతాను చెప్పేవన్నీ అబద్ధాలని యెహోవాకు తెలుసు. మరి సాతాను తన మాటను నిరూపించుకోవడానికి యెహోవా ఎందుకు సమయమిచ్చాడు? ఎందుకంటే పరలోకంలో అలాగే భూమ్మీదున్న ప్రతీఒక్కరు ఆ వివాదాంశంలో ఉన్నారు. (కీర్తన 83:18 చదవండి.) ఆదాముహవ్వలు అలాగే ఆ తర్వాత జీవించినవాళ్లలో చాలామంది యెహోవా పరిపాలనను తిరస్కరించారు. దీన్నిబట్టి సాతాను చెప్పిన మాటలు నిజమని కొంతమంది అనుకోవచ్చు. నిజానికి ఆ వివాదాంశం గురించి దూతలకు లేదా మనుషులకు పరిష్కారం దొరికేంతవరకు భూమ్మీద నిజమైన శాంతి, సమాధానం ఉండవు. కానీ యెహోవా సర్వాధిపత్యం నిరూపించబడిన తర్వాత భూమ్మీద ప్రజలందరూ ఆయన నీతియుక్త పరిపాలనకు మద్దతిస్తూ శాశ్వత జీవితాన్ని అనుభవిస్తారు. విశ్వవ్యాప్తంగా సమాధానం ఉంటుంది.—ఎఫె. 1:9, 10.

5. సర్వాధిపత్యపు వివాదాంశంలో మనమెలా ఒక భాగంగా ఉన్నాం?

5 దేవుని సర్వాధిపత్యం సమర్థించబడుతుంది, సాతాను అలాగే మనుషుల పరిపాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమౌతుంది, నామరూపాల్లేకుండా పోతుంది. మెస్సీయ రాజ్యం ద్వారా దేవుడు చేసే పరిపాలన విజయవంతం అవుతుంది. నమ్మకమైన దేవుని ప్రజలు ఆయన పరిపాలనకు నమ్మకంగా మద్దతివ్వగలరనీ, ఆయనకు యథార్థంగా ఉండగలరనీ నిరూపిస్తారు. (యెష. 45:23, 24) ఆ నమ్మకమైన వాళ్లలో మనం ఒకరిగా ఉండాలనుకుంటున్నామా? అలాగైతే ఆ వివాదాంశం ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థంచేసుకోవాలి.

మన రక్షణ కన్నా సర్వాధిపత్యాన్ని నిరూపించడమే ప్రాముఖ్యం

6. యెహోవా సర్వాధిపత్యాన్ని నిరూపించడం దేనికన్నా ప్రాముఖ్యం?

6 మన సంతోషం కన్నా యెహోవా సర్వాధిపత్యాన్ని నిరూపించడమే చాలా ప్రాముఖ్యం. దానర్థం మనం రక్షణ పొందడం అంత ప్రాముఖ్యం కాదనీ లేదా యెహోవా మనల్ని పట్టించుకోడనీ కాదు. అలాగని ఎందుకు చెప్పవచ్చు?

7, 8. యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడం వల్ల మనమెలాంటి ప్రయోజనం పొందుతాం?

7 యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. నిజానికి మనం ఆయనకు చాలా విలువైనవాళ్లం, అందుకే మనం శాశ్వత జీవితాన్ని పొందేలా తన కొడుకును బలి ఇచ్చాడు. (యోహా. 3:16; 1 యోహా. 4:9) ఒకవేళ భవిష్యత్తు గురించి యెహోవా మనకిచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే సాతాను అలాగే దేవున్ని వ్యతిరేకించేవాళ్లు అన్న మాటలే నిజమౌతాయి. యెహోవా మంచివాటిని మనకు దక్కకుండా చేస్తాడని, అబద్ధికుడని, అవినీతిపరుడైన పరిపాలకుడని సాతాను నిందిస్తున్నాడు. దేవున్ని వ్యతిరేకించేవాళ్లు యెహోవా వాగ్దానాలను ఎగతాళి చేస్తూ, “ఆయన ప్రత్యక్షత గురించిన వాగ్దానం ఏమైంది? మా పూర్వీకులు చనిపోయిన రోజు నుండి ఇప్పటి వరకు అసలేమీ మారలేదు. దేవుడు మనుషుల్ని సృష్టించినప్పటి నుండి పరిస్థితులన్నీ అలానే ఉన్నాయి కదా” అని అంటారు. (2 పేతు. 3:3, 4) కానీ యెహోవా తన వాగ్దానాల్ని నిలబెట్టుకుంటాడు. తన సర్వాధిపత్యాన్ని నిరూపించడంలో విధేయత చూపించే మనుషుల రక్షణ కూడా ఒక భాగంగా ఉండేలా యెహోవా చేశాడు. (యెషయా 55:10, 11 చదవండి.) యెహోవా సర్వాధిపత్యం ప్రేమ మీద ఆధారపడివుంది. కాబట్టి ఆయన తన నమ్మకమైన సేవకులను ఎప్పటికీ ప్రేమిస్తాడని, వాళ్లను విలువైన వాళ్లలా చూస్తాడని పూర్తి నమ్మకంతో ఉండవచ్చు.—నిర్గ 34:6.

8 యెహోవా సర్వాధిపత్యం అన్నిటికన్నా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి మనం రక్షణ పొందడాన్ని ఆయన ప్రాముఖ్యంగా ఎంచట్లేదని కాదు. యెహోవా మనపై ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాడు. కాబట్టి మనం ప్రాముఖ్యమైన దాన్ని మనసులో ఉంచుకుని, యెహోవా పరిపాలనకు నమ్మకంగా మద్దతివ్వాలి.

యోబు తన ఆలోచనను ఎలా మార్చుకున్నాడు?

9. యోబు గురించి సాతాను ఏమన్నాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

9 యెహోవా సర్వాధిపత్యాన్ని మనం సరైన దృష్టితో చూడడం ప్రాముఖ్యం. ఈ విషయాన్ని అర్థంచేసుకోవడానికి, బైబిల్లో అన్నిటికన్నా ముందు రాయబడిన వాటిలో ఒకటైన యోబు పుస్తకాన్ని చదవాలి. తీవ్రమైన కష్టాలొస్తే యోబు దేవున్ని తిరస్కరిస్తాడని సాతాను వేసిన నింద గురించి ఆ పుస్తకంలో చదువుతాం. యోబుకు కష్టాలు వచ్చేలా చేయమని సాతాను దేవున్ని అడిగాడు. యెహోవా అలా చేయలేదు, కానీ యోబును పరీక్షించడానికి సాతానును అనుమతించాడు. యెహోవా ఇలా అన్నాడు, “ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది.” (యోబు 1:7-12 చదవండి.) ఇది జరిగిన వెంటనే, యోబు తన సేవకుల్ని, ఆస్తిని కోల్పోయాడు. ఆ తర్వాత తన పదిమంది పిల్లలు కూడా హఠాత్తుగా చనిపోయారు. ఈ విషాద సంఘటనలన్నీ యెహోవా వల్లే జరుగుతున్నాయని యోబు అనుకునేలా సాతాను చేశాడు. (యోబు 1:13-19) అంతేకాదు యోబుకు భయంకరమైన, బాధాకరమైన జబ్బు వచ్చేలా సాతాను చేశాడు. (యోబు 2:7) వాటికితోడు యోబు భార్య, ముగ్గురు చెడ్డ స్నేహితులు అతన్ని బాధపెట్టేలా మాట్లాడి నిరుత్సాహపర్చారు.—యోబు 2:9; 3:11; 16:2.

10. (ఎ) యోబు దేవునికి ఎలా యథార్థత చూపించాడు? (బి) యెహోవా యోబును ఎందుకు సరిదిద్దాడు?

10 యోబుపై సాతాను వేసిన నింద నిజమేనా? కాదు. తనకు జీవితంలో ఘోరమైన కష్టాలు ఎదురైనా యోబు ఎన్నడూ యెహోవాను తిరస్కరించలేదు. (యోబు 27:5) కానీ కొంతకాలం వరకు యోబు ఏది నిజంగా ప్రాముఖ్యమో ఆలోచించకుండా తన గురించే ఎక్కువగా ఆలోచించాడు. అతను ఏ తప్పూ చేయలేదని చెప్తూ వచ్చాడు. తన కష్టాలకు కారణమేమిటో యోబు తెలుసుకోవాలనుకున్నాడు. (యోబు 7:20; 13:24) మనం యోబు భావాల్ని అర్థంచేసుకోవచ్చు. కానీ అతను తప్పుగా ఆలోచిస్తున్నాడని యెహోవాకు తెలుసు, అందుకే అతన్ని సరిదిద్దాడు. ఎలా?

11, 12. యోబు ఏ విషయాన్ని అర్థంచేసుకునేలా యెహోవా సహాయం చేశాడు? దానికి యోబు ఎలా స్పందించాడు?

11 యెహోవా యోబుతో అన్న మాటల్ని యోబు పుస్తకంలోని 38 నుండి 41 అధ్యాయాల్లో చూడొచ్చు. యోబు కష్టాలకుగల కారణాన్ని యెహోవా చెప్పలేదు. బదులుగా, దేవునితో పోల్చుకుంటే యోబు ఎంత అల్పుడో అతను అర్థంచేసుకునేలా సహాయం చేశాడు. యోబుకు వచ్చిన కష్టాల కన్నా అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయని యెహోవా అతనికి చెప్పాడు. (యోబు 38:18-21 చదవండి.) యోబు తన ఆలోచనను సరిచేసుకోవడానికి యెహోవా మాటలు సహాయం చేశాయి.

12 యోబు కష్టాలుపడ్డాడనే జాలి లేకుండా యెహోవా మాట్లాడాడా? లేదు, యెహోవా అలా మాట్లాడలేదు. నిజానికి యోబు కూడా అలా అనుకోలేదు. బదులుగా యెహోవా చెప్పినది అర్థంచేసుకుని, దానికి విలువిచ్చాడు. యోబు ఇలా అన్నాడు, ‘నేను పలికిన మాటలకు సిగ్గుపడుచున్నాను. దుమ్ము, బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపపడుతున్నాను.’ (యోబు 42:1-6, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము) అంతకుముందు, ఎలీహు అనే యువకుడు కూడా యోబు తన ఆలోచనను మార్చుకునేలా సహాయం చేశాడు. (యోబు 32:5-10) యోబు ఆ తెలివైన సలహాను పాటించి, తన ఆలోచనను మార్చుకున్నాడు. యోబులో వచ్చిన ఆ మార్పును యెహోవా చూశాడు, తనకు నమ్మకంగా ఉన్నందుకు యెహోవా సంతోషించాడని ఇతరులు తెలుసుకునేలా చేశాడు.—యోబు 42:7, 8.

13. యెహోవా యోబుకు ఇచ్చిన సలహా అతని కష్టాలు తీరాక కూడా ఎలా ఉపయోగపడింది?

13 యెహోవా యోబుకు ఇచ్చిన సలహా అతని కష్టాలు తీరాక కూడా ఉపయోగపడింది. “యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా” ఆశీర్వదించాడు. కొంతకాలానికి అతనికి, “ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలు” పుట్టారు. (యోబు 42:12-14) యోబు ఆ పిల్లల్ని ప్రేమించినప్పటికీ, చనిపోయిన తన పిల్లల విషయంలో తప్పకుండా బాధపడివుంటాడు. అంతేకాదు తనకు, తన కుటుంబానికి ఎదురైన ఘోరమైన పరిస్థితిని యోబు ఎన్నడూ మర్చిపోయి ఉండడు. కొంతకాలం తర్వాత తన కష్టాలకు కారణం తెలిసినప్పటికీ, అన్ని బాధలుపడేలా యెహోవా ఎందుకు అనుమతించి ఉంటాడని యోబు ఆలోచించివుంటాడు. యోబుకు ఆ ఆలోచన వచ్చినప్పుడు యెహోవా తనకు చెప్పిన విషయాలు గుర్తుచేసుకుని ఉంటాడు. ఆ మాటలు అతనికి ఓదార్పును ఇచ్చి, సరైన ఆలోచనను కలిగివుండేందుకు సహాయం చేసి ఉంటాయి.—కీర్త. 94:19.

మన సమస్యల మీద కాకుండా యెహోవా సర్వాధిపత్యం మీద మనసుపెట్టగలమా? (14వ పేరా చూడండి)

14. యోబు అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

14 యోబుకు జరిగినదాన్ని ధ్యానించడం ద్వారా మనం కూడా మన ఆలోచనను సరిచేసుకోవచ్చు, ఓదార్పు పొందవచ్చు. “పూర్వం రాయబడినవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి. మన సహనం ద్వారా, లేఖనాల నుండి దొరికే ఊరట ద్వారా మనం నిరీక్షణ కలిగివుండేందుకు అవి రాయబడ్డాయి.” యెహోవా రాయించిన వాటిలో యోబు పుస్తకం కూడా ఉంది. (రోమా. 15:4) యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడం గురించి ఆలోచించలేనంతగా మన సమస్యల గురించి ఆలోచించకూడదని యోబు పుస్తకం నుండి నేర్చుకుంటాం. యోబులాగే మనం కూడా కష్టాల్లో యెహోవాకు నమ్మకంగా ఉండడం ద్వారా ఆయన సర్వాధిపత్యానికి సమర్ధిస్తున్నామని చూపిస్తాం.

15. కష్టాల్ని నమ్మకంగా సహిస్తే ఏ ప్రతిఫలం దొరుకుతుంది?

15 మనకు కష్టాలు వస్తున్నాయంటే యెహోవా మనమీద కోపంగా ఉన్నట్లు కాదనే ఓదార్పును యోబు అనుభవం నుండి పొందవచ్చు. కష్టాల్ని యెహోవా సర్వాధిపత్యానికి మద్దతిచ్చే అవకాశాలుగా మనం చూడాలి. (సామె. 27:11) మనం కష్టాల్ని నమ్మకంగా సహిస్తే యెహోవా సంతోషిస్తాడు, భవిష్యత్తుకు సంబంధించిన మన నిరీక్షణ మరింత బలపడుతుంది. (రోమీయులు 5:3-5 చదవండి.) “యెహోవా దేవుడు అనురాగాన్ని ఎంతో సున్నితంగా చూపిస్తాడని, ఆయన కరుణామయుడని” యోబు అనుభవం చూపిస్తోంది. (యాకో. 5:11) ఆయన సర్వాధిపత్యానికి మద్దతిస్తే యెహోవా మనకు దీవెనల్ని ఇస్తాడు. ఆ విషయం తెలుసుకోవడంవల్ల మనం, “ఓర్పుతో, సంతోషంతో అన్నిటినీ” సహించగలుగుతాం.—కొలొ. 1:11.

యెహోవా సర్వాధిపత్యంపై మనసుపెట్టండి

16. యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడం అన్నిటికన్నా ప్రాముఖ్యమని ఎందుకు గుర్తుచేసుకోవాలి?

16 సమస్యలు వచ్చినప్పుడు యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడం గురించి ఆలోచించడం కష్టంగా ఉండవచ్చు. మనం సమస్య గురించి అదేపనిగా ఆలోచిస్తే గోరంత సమస్య కొండంత కనిపిస్తుంది. కాబట్టి మన సమస్య ఏదైనప్పటికీ, దేవుని సర్వాధిపత్యానికి మద్దతివ్వడం ఎంత ప్రాముఖ్యమో ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవడం మంచిది.

17. యెహోవా సేవలో బిజీగా ఉంటే మనమెలా ప్రాముఖ్యమైన దానిపై మనసు పెట్టగలుగుతాం?

17 యెహోవా పనిలో బిజీగా ఉంటే నిజంగా ప్రాముఖ్యమైన దానిపై మనసు పెట్టగలుగుతాం. ఉదాహరణకు, రాన్నే అనే సహోదరి తీవ్రమైన గుండెపోటుతో, క్యాన్సర్‌తో కూడా బాధపడింది. ఆమె హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అక్కడ పనిచేసేవాళ్లకు, వేరే పేషెంట్‌లకు, ఆమెను చూడ్డానికి వచ్చినవాళ్లకు సాక్ష్యం ఇచ్చింది. ఒకసారి రాన్నే హాస్పిటల్‌లో రెండున్నర వారాలపాటు ఉండాల్సి వచ్చినప్పుడు అక్కడ ఆమె దాదాపు 80 గంటలు ప్రీచింగ్‌ చేసింది. తాను త్వరలోనే చనిపోతానని తెలిసినా రాన్నే నిజంగా ప్రాముఖ్యమైన దాన్ని మర్చిపోలేదు. యెహోవా సర్వాధిపత్యానికి మద్దతివ్వడం ఆమెకు ప్రశాంతతను ఇచ్చింది.

18. యెహోవా సర్వాధిపత్యానికి మద్దతిచ్చే విషయంలో జెన్నిఫర్‌ అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

18 చిన్నచిన్న సమస్యలతో, రోజూవారి సమస్యలతో వ్యవహరించేటప్పుడు కూడా యెహోవా సర్వాధిపత్యానికి మద్దతివ్వవచ్చు. జెన్నిఫర్‌ అనే సహోదరి ఒకసారి తన ఊరికి వెళ్లే విమానం కోసం మూడు రోజులు ఎయిర్‌పోర్ట్‌లో వేచివుండాల్సి వచ్చింది. అటుగా వెళ్లే విమానాలన్నీ రద్దు అవ్వడంతో చాలా విసిగిపోయి, ఒంటరిగా ఉన్నట్లు ఆమెకు అనిపించింది. జెన్నిఫర్‌ తన పరిస్థితి గురించే ఆలోచించి బాధపడే బదులు ఆమె, తనతోపాటు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నవాళ్లకు మంచివార్త ప్రకటించేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించింది. దానివల్ల ఆమె చాలామందికి ప్రకటించగలిగింది, ఎన్నో ప్రచురణల్ని ఇవ్వగలిగింది. “ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ యెహోవా నన్ను దీవించినట్లు అనిపించింది. ఆయన నామాన్ని ఉన్నతపర్చే విధంగా ఇతరులకు సాక్ష్యమిచ్చే సామర్థ్యాన్ని యెహోవా నాకు ఇచ్చాడు” అని జెన్నిఫర్‌ అంటోంది.

19. యెహోవా సర్వాధిపత్యానికి ఉన్న ప్రాముఖ్యతను ఎవరు అర్థంచేసుకోగలిగారు?

19 కేవలం యెహోవా సేవకులు మాత్రమే ఆయన సర్వాధిపత్యానికి ఉన్న ప్రాముఖ్యతను నిజంగా అర్థంచేసుకోగలుగుతారు. ఇదే ఇతర మతాలవాళ్లకు, నిజక్రైస్తవులకు ఉన్న తేడా. కాబట్టి నిజ క్రైస్తవులముగా మనలో ప్రతీఒక్కరం యెహోవా సర్వాధిపత్యానికి మద్దతిస్తూ ఉండాలి.

20. తన సర్వాధిపత్యానికి మద్దతివ్వడానికి మీరు చేసే కృషినిబట్టి యెహోవా ఎలా భావిస్తాడు?

20 తనకు నమ్మకంగా ఉంటూ కష్టాల్ని సహించడానికి, తన సర్వాధిపత్యానికి మద్దతివ్వడానికి మీరు చేసే కృషిని యెహోవా గుర్తిస్తాడు, విలువైనదిగా చూస్తాడు. (కీర్త. 18:25) యెహోవా సర్వాధిపత్యానికి మీరు ఎందుకు ఖచ్చితంగా మద్దతివ్వాలో, దానికి మీ పూర్తి మద్దతును ఎలా ఇవ్వవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.