కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పైరూపాన్ని కాకుండా హృదయాన్ని చూడగలరా?

పైరూపాన్ని కాకుండా హృదయాన్ని చూడగలరా?

కెనడాకు చెందిన డాన్‌ అనే యెహోవాసాక్షి, బైబిలు విషయాల్ని వీధుల వెంబడి తిరుగుతూ బ్రతికేవాళ్లతో పంచుకోవడానికి కృషిచేసేవాడు. తనకు ఎదురైన ఒక అనుభవాన్ని వివరిస్తూ డాన్‌ ఇలా అన్నాడు, “వీధుల్లో తిరిగే పీటర్‌ అనే వ్యక్తి ఎంత అపరిశుభ్రంగా ఉండేవాడంటే, అలాంటి వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదు. ప్రజలు అతని దగ్గరకు వెళ్లడానికి భయపడేవాళ్లు, ఒకవేళ వెళ్లినా పీటర్‌ వాళ్లను దగ్గరకు రానిచ్చేవాడు కాదు. చాలాసార్లు ప్రజలు అతనికి ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నించినా అతను ఒప్పుకునేవాడు కాదు.” అయినప్పటికీ 14 కన్నా ఎక్కువ ఏళ్లపాటు వివిధ సందర్భాల్లో డాన్‌ ఓపికతో అతనిపై దయ చూపించడానికి ప్రయత్నించాడు.

ఒకరోజు పీటర్‌ డాన్‌ని, “నువ్వు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావ్‌? నన్ను ఎవ్వరూ పట్టించుకోరు, కానీ నువ్వు ఎందుకు శ్రద్ధ తీసుకుంటున్నావ్‌?” అని అడిగాడు. అప్పుడు డాన్‌ తెలివిగా మూడు లేఖనాల్ని ఉపయోగించి అతని హృదయాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాడు. మొదటిగా, దేవుని పేరు ఏంటో తెలుసానని పీటర్‌ని అడిగి, కీర్తన 83:18 వ వచనాన్ని అతనితో చదివించాడు. తర్వాత, అతని మీద ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నాడో చెప్తూ, రోమీయులు 10:13-14 వచనాలు పీటర్‌తో చదివించాడు. అక్కడిలా ఉంది, “యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.” చివరిగా, డాన్‌ మత్తయి 9:36 చదివి, పీటర్‌ని కూడా చదవమని బైబిలు ఇచ్చాడు. ఆ వచనంలో ఇలా ఉంది, “ఆయన [యేసు] ప్రజల్ని చూసినప్పుడు వాళ్లమీద జాలిపడ్డాడు, ఎందుకంటే వాళ్లు చర్మం ఒలిచేయబడి, విసిరేయబడిన కాపరిలేని గొర్రెల్లా ఉన్నారు.” దాంతో పీటర్‌ చెమ్మగిల్లిన కళ్లతో, “ఆ గొర్రెల్లో నేనూ ఒకడినా?” అని అడిగాడు.

పీటర్‌ మార్పులు చేసుకోవడం మొదలుపెట్టాడు. శుభ్రంగా స్నానం చేశాడు, గడ్డం కత్తరించుకున్నాడు, డాన్‌ ఇచ్చిన మంచి బట్టలు వేసుకున్నాడు. ఆ తర్వాత నుండి పీటర్‌ శుభ్రంగానే ఉన్నాడు.

పీటర్‌కి డైరీ రాసే అలవాటు ఉంది. ఆ డైరీలోని మొదటి భాగమంతా తన జీవితంలోని చేదు జ్ఞాపకాలతో నిండివుంది. కానీ ఈ మధ్యకాలంలో రాసిన వివరాలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఆ డైరీలోని ఒక పేజీలో ఇలా ఉంది, “ఈరోజు నేను దేవుని పేరు తెలుసుకున్నాను. నేనిప్పుడు యెహోవాకు ప్రార్థించవచ్చు. ఆయన పేరు తెలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. నేను ఎప్పుడు, ఏమి చెప్పినా వినడానికి సిద్ధంగా ఉండే స్నేహితుడిగా యెహోవా ఉంటాడని డాన్‌ చెప్పాడు.”

ఇవి పీటర్‌ తన తోబుట్టువులకు రాసిన చివరి మాటలు:

“ఈరోజు నాకు ఒంట్లో బాలేదు. నేను ముసలివాడిని అయ్యాననుకుంటా. ఒకవేళ ఇదే నా చివరి రోజైనా ఫర్వాలేదు, ఎందుకంటే నేను నా స్నేహితుణ్ణి [డాన్‌ని] పరదైసులో మళ్లీ కలుస్తానని నాకు తెలుసు. ఒకవేళ మీరు ఈ మాటల్ని చదివే సమయానికి నేను ప్రాణాలతో ఉండకపోవచ్చు. కానీ నా అంత్యక్రియల దగ్గర మీకు పరిచయంలేని వ్యక్తి ఎవరైనా కనిపిస్తే అతనితో మాట్లాడండి. దయచేసి మీరు ఈ నీలి రంగు పుస్తకాన్ని చదవండి. a నేను నా స్నేహితుణ్ణి మళ్లీ పరదైసులో చూస్తానని ఆ పుస్తకంలో ఉంది. నేను ఆ మాటల్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇట్లు మీ ప్రియమైన పీటర్‌.”

అంత్యక్రియల తర్వాత పీటర్‌ వాళ్ల అక్క ఊమీ ఇలా చెప్పింది, “రెండు సంవత్సరాల క్రితం పీటర్‌ నన్ను కలిశాడు. చాలా ఏళ్ల తర్వాత అతను సంతోషంగా ఉండడం చూశాను. అతను నవ్వాడు కూడా.” ఆమె డాన్‌తో ఇలా అంది, “నేను ఈ పుస్తకాన్ని చదువుతాను, ఎందుకంటే మా తమ్ముడి హృదయాన్ని చేరుకునేది ఏదైనా అది చాలా ప్రత్యేకమైనది.” ఈమధ్య కాలంలో బైబిలు అధ్యయనం కోసం ఉపయోగించే బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకం నుండి బైబిలు అధ్యయనం తీసుకోవడానికి ఊమీ ఒప్పుకుంది కూడా.

మనం కూడా కేవలం పై రూపాన్ని చూడకూడదు, నిజమైన ప్రేమ చూపించాలి, అన్నిరకాల ప్రజలతో ఓపిగ్గా ఉండాలి. (1 తిమో. 2:3, 4) మనమలా చేస్తే కంటికి అందంగా కనిపించకపోయినా, మంచి మనసున్న పీటర్‌లాంటి వాళ్లను కనుగొనగలుగుతాం. ‘హృదయాన్ని చూసే’ దేవుడు, యోగ్యుల హృదయంలో సత్యం నాటుకుపోయేలా చేయగలడనే పూర్తి నమ్మకంతో ఉండవచ్చు.—1 సమూ. 16:7; యోహా. 6:44.

a కొన్ని సంవత్సరాల క్రితం తనకు అందిన, ‘నిత్యజీవమునకు నడుపు సత్యము’ అనే పుస్తకం గురించి పీటర్‌ చెప్తున్నాడు. ఆ పుస్తకం అప్పట్లో బైబిలు అధ్యయనానికి ఉపయోగించేవాళ్లు. అది యెహోవాసాక్షులు ప్రచురించినది, కానీ ఇప్పుడు ముద్రించడం లేదు.