కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించండి

యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించండి

‘యెహోవా మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు; కాబట్టి మహిమ, ఘనత, శక్తి పొందడానికి నువ్వు అర్హుడవు.’ప్రక. 4:11.

పాటలు: 2, 49

1, 2. మనందరం ఏ విషయాన్ని అర్థంచేసుకోవాలి? (ప్రారంభ చిత్రం చూడండి.)

 ముందటి ఆర్టికల్‌లో మనం చర్చించుకున్నట్లు, మనుషుల్ని పరిపాలించే హక్కు యెహోవాకు లేదని సాతాను నిందిస్తున్నాడు. యెహోవా పరిపాలన అన్యాయంతో నిండివుంటుందని, మనుషులు తమను తాము పరిపాలించుకుంటేనే ఎక్కువ సంతోషంగా ఉంటారని సాతాను అంటున్నాడు. సాతాను చెప్పేవి నిజమేనా? మనుషులు తమను తాము పరిపాలించుకుంటూ, నిత్యం జీవించగలిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. దేవుని పరిపాలనలో కన్నా మనుషుల పరిపాలనలో ఎక్కువ సంతోషాన్ని పొందగలరా? ఒకవేళ దేవునికి దూరంగా ఉంటూ నిత్యం జీవించగలిగితే మీరు సంతోషంగా ఉండగలరా?

2 ఈ ప్రశ్నలకు ఎవరికివాళ్లే జవాబు చెప్పాలి. వీటిగురించి ప్రతీఒక్కరం జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడు, యెహోవా పరిపాలనే సరైనదని, మన పూర్తి మద్దతును పొందడానికి ఆయనే అర్హుడని మనకు స్పష్టంగా అర్థమవ్వాలి. ఈ విశ్వాన్ని పరిపాలించే హక్కు యెహోవాకు మాత్రమే ఉందని, ఆయన పరిపాలనే అత్యుత్తమమైనదని నమ్మడానికి బైబిలు ఇస్తున్న శక్తివంతమైన కారణాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం.

పరిపాలించే హక్కు యెహోవాకే ఉంది

3. విశ్వసర్వాధిపతిగా ఉండే హక్కు యెహోవాకే ఉందని ఎందుకు చెప్పవచ్చు?

3 యెహోవా సర్వశక్తిగల దేవుడు, సృష్టికర్త కాబట్టి ఆయనే విశ్వసర్వాధిపతి. (1 దిన. 29:11; అపొ. 4:24) ఒక దర్శనంలో, పరలోకంలో ఉన్న క్రీస్తు తోటి రాజులైన 1,44,000 మంది ఇలా అన్నారు, “యెహోవా మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు; నీ ఇష్టాన్ని బట్టే అవి ఉనికిలోకి వచ్చాయి, సృష్టించబడ్డాయి. కాబట్టి మహిమ, ఘనత, శక్తి పొందడానికి నువ్వు అర్హుడవు.” (ప్రక. 4:11) యెహోవా సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి భూమ్మీదగానీ పరలోకంలోగానీ ప్రతీఒక్కరిని పరిపాలించే హక్కు ఆయనకే ఉంది.

4. దేవునికి ఎదురుతిరగడం అంటే స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగం చేయడమేనని ఎందుకు చెప్పవచ్చు?

4 సాతాను దేన్నీ సృష్టించలేదు కాబట్టి అతనికి విశ్వాన్ని పరిపాలించే హక్కు ఏమాత్రం లేదు. సాతాను అలాగే మొదటి మానవ దంపతులు యెహోవా సర్వాధిపత్యం మీద తిరుగుబాటు చేయడం ద్వారా అహంకారంతో ప్రవర్తించారు. (యిర్మీ. 10:23) వాళ్లకు స్వేచ్ఛాచిత్తం ఉంది కాబట్టి యెహోవా పరిపాలనను తిరస్కరించే హక్కు వాళ్లకు ఉన్నట్లా? కాదు. స్వేచ్ఛాచిత్తమనేది ఎంపికలు చేసుకునే, నిర్ణయాలు తీసుకునే హక్కును ఇస్తుందేగానీ, సృష్టికర్తయైన యెహోవాకు ఎదురుతిరిగే హక్కును ఇవ్వదు. నిజానికి దేవునికి ఎదురుతిరగడం అంటే మన స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగం చేయడమే. మనుషులమైన మనకు యెహోవా పరిపాలన, నడిపింపు అవసరం.

5. దేవుడు తీసుకునే నిర్ణయాలన్నీ ఎప్పుడూ న్యాయమైనవేనని ఎందుకు చెప్పవచ్చు?

5 పరిపాలించే హక్కు యెహోవాకే ఉందనడానికి రెండవ కారణమేమిటంటే, ఆయన తనకున్న అధికారాన్ని ఎంతో న్యాయంగా ఉపయోగిస్తాడు. ఆయనిలా చెప్తున్నాడు, “భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే . . . అట్టి వాటిలో నేనానందించువాడను.” (యిర్మీ. 9:24) సరైనదేమిటో నిర్ణయించడానికి యెహోవాకు మానవ చట్టాల సహాయం అవసరంలేదు. బదులుగా, ఏది సరైనదో తెలియజేసే ప్రమాణాల్ని ఆయనే ఏర్పరుస్తాడు. తన పరిపూర్ణమైన న్యాయ ప్రమాణాల ఆధారంగా యెహోవా మనుషులకు నియమాలను ఇచ్చాడు. కీర్తనకర్త ఇలా అన్నాడు, “నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు.” కాబట్టి, యెహోవా ఏర్పరిచే ఏ చట్టమైన, సూత్రమైన ఆయన తీసుకునే ఏ నిర్ణయమైనా సరైనదే. (కీర్త. 89:14; 119:128) కానీ ఈ లోకంలో న్యాయాన్ని స్థాపించలేని సాతాను, యెహోవా పరిపాలన అన్యాయంతో నిండుకున్నదని నిందిస్తున్నాడు.

6. పరిపాలించే హక్కు యెహోవాకే ఉందనడానికి మరో కారణం ఏమిటి?

6 పరిపాలించే హక్కు యెహోవాకు ఉందనడానికి మూడవ కారణమేమిటంటే, విశ్వాన్ని కాపాడే జ్ఞానం, తెలివి ఆయనకే ఉన్నాయి. అదెలా చెప్పవచ్చంటే, ఏ డాక్టరూ నయం చేయలేని రోగాల్ని తీసేసే సామర్థ్యాన్ని యెహోవా తన కుమారునికి ఇచ్చాడు. (మత్త. 4:23, 24; మార్కు 5:25-29) అది మనకు అద్భుతంగా అనిపించవచ్చు కానీ యెహోవాకు మాత్రం అది అద్భుతం కాదు. మన శరీరానికి వచ్చే ఏ జబ్బునైనా ఎలా నయం చేయాలో ఆయనకు తెలుసు, దాన్ని చేసే సామర్థ్యం కూడా ఆయనకు ఉంది. అంతేకాదు చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించగలడు, ప్రకృతి విపత్తులు రాకుండా ఆపగలడు.

7. సాతాను లోకంలో ఉన్న వేరే ఎవరికన్నా యెహోవాకే ఎక్కువ తెలివి ఉందని ఎందుకు చెప్పవచ్చు?

7 ఒక దేశంలోగానీ రెండు దేశాల మధ్యగానీ సాతాను పరిపాలిస్తున్న ఈ లోకం శాంతిని తీసుకురాలేదు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని తీసుకొచ్చేందుకు కావాల్సిన తెలివి యెహోవాకు మాత్రమే ఉంది. (యెష. 2:3, 4; 54:13) అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, “ఆహా! దేవుని ఆశీర్వాదాలు ఎంత గొప్పవి! ఆయన తెలివి, జ్ఞానం ఎంత లోతైనవి! ఆయన తీర్పుల్ని శోధించడం అసాధ్యం, ఆయన మార్గాల్ని అర్థంచేసుకోవడం అసంభవం!” మనం కూడా అలాగే భావిస్తాం కదా?—రోమా. 11:33.

యెహోవా పరిపాలనే అత్యుత్తమమైనది

8. యెహోవా పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏమిటి?

8 మనం ఇప్పటివరకు పరిశీలించినట్లు, పరిపాలించే హక్కు యెహోవాకే ఉందని బైబిలు స్పష్టంగా తెలియజేస్తోంది. ఆయనే ఎందుకు అత్యుత్తమ పరిపాలకుడో కూడా బైబిలు తెలియజేస్తోంది. ఒక కారణమేమిటంటే, ఆయన ప్రేమతో పరిపాలిస్తాడు. దేవునికున్న “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యముల” గురించి ఆలోచించినప్పుడు ఆయనకు మరింత దగ్గరౌతాం. (నిర్గ. 34:6) దేవుడు మనపట్ల గౌరవమర్యాదలు చూపిస్తున్నాడు. మనగురించి మనకన్నా యెహోవాయే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. యెహోవా మనకు మంచిది దక్కకుండా చేస్తున్నాడని సాతాను వేసిన నింద పచ్చి అబద్ధం. నిజానికి, మనం శాశ్వతకాలం జీవించాలని దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మనకోసం బలిగా అర్పించాడు.—కీర్తన 84:11; రోమీయులు 8:32 చదవండి.

9. దేవునికి మనలో ఒక్కొక్కరి మీద శ్రద్ధ ఉందని ఎలా చెప్పవచ్చు?

9 యెహోవా తన ప్రజలందర్నీ ఒక గుంపుగా ప్రేమిస్తున్నాడు. అలాగే ఒక్కొక్కరి మీద కూడా ఆయనకు ఎంతో శ్రద్ధ ఉంది. ప్రాచీన కాలాల్లో ఏమి జరిగిందో ఆలోచించండి. దాదాపు 300 సంవత్సరాల పాటు, యెహోవా న్యాయాధిపతుల ద్వారా తన జనాంగాన్ని నడిపించాడు, శత్రువులపై విజయం సాధించేలా సహాయం చేశాడు. అలా చేస్తూనే, ఆయన ఒక్కొక్కరిపై కూడా శ్రద్ధ చూపించాడు. అలా యెహోవా శ్రద్ధను రుచి చూసినవాళ్లలో ఒకరు అన్యురాలైన రూతు. ఆమె యెహోవా ఆరాధకురాలు అయ్యేందుకు ఎన్నిటినో త్యాగం చేసింది. అందుకు యెహోవా ఆమెకు భర్తను, బిడ్డను ఇచ్చి దీవించాడు. అంతేకాదు, రూతు కొడుకు మెస్సీయకు పూర్వీకుడయ్యాడు. రూతు జీవిత కథను ఒక పుస్తక రూపంలో రాయించి దాన్ని బైబిల్లో యెహోవా భద్రపర్చాడు. రూతు పునరుత్థానమై, ఈ విషయాలన్ని తెలుసుకున్నప్పుడు ఆమెకు ఎలా అనిపిస్తుందో మీరు ఊహించగలరా?—రూతు 4:13; మత్త. 1:5, 16.

10. యెహోవా కఠినుడైన పరిపాలకుడు కాదని ఎందుకు చెప్పవచ్చు?

10 యెహోవా కఠినుడైన పరిపాలకుడు కాదు. బదులుగా, ఆయనకు లోబడేవాళ్లు స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటారు. (2 కొరిం. 3:17) యెహోవా గురించి దావీదు ఇలా చెప్పాడు, “ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.” (1 దిన. 16:7, 27) కీర్తనకర్తయైన ఏతాను ఇలా రాశాడు, “ఆనంద ధ్వనులు తెలుసుకొన్న ప్రజలు ధన్యజీవులు. యెహోవా, నీ ముఖకాంతిలో వారు మసులుకుంటారు. నీ పేరునుబట్టి వారు రోజంతా ఆనందిస్తారు. నీ న్యాయం మూలంగా వారు ఉన్నత స్థితికి వస్తారు.”—కీర్త. 89:15, 16, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

11. యెహోవా పరిపాలనే అత్యుత్తమమైనదనే మన నమ్మకం మరింత బలపడాలంటే ఏమి చేయాలి?

11 యెహోవా మంచితనం గురించి మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే, ఆయన పరిపాలనే అత్యుత్తమమైనదని అంత ఎక్కువ నమ్మకం కుదురుతుంది. కీర్తనకర్త దేవునితో ఇలా అన్నాడు, “నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము.” మనం కూడా అలానే భావిస్తాం. (కీర్త. 84:10) యెహోవా మన రూపకర్త, సృష్టికర్త కాబట్టి మనకు సంతోషాన్ని ఇచ్చేవేమిటో ఆయనకు బాగా తెలుసు. వాటిని ఆయన మనకు సమృద్ధిగా ఇస్తాడు కూడా. యెహోవా మనల్ని ఏదైనా చేయమని చెప్తే అది ఖచ్చితంగా మన మంచి కోసమే. ఒకవేళ మనం త్యాగాలు చేయాల్సి వచ్చినా యెహోవా మాట వింటే సంతోషంగా ఉంటాం.—యెషయా 48:17 చదవండి.

12. మనం యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడానికిగల ముఖ్య కారణమేమిటి?

12 క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన తర్వాత, కొంతమంది యెహోవా సర్వాధిపత్యానికి ఎదురుతిరుగుతారని మనం బైబిల్లో చదువుతాం. (ప్రక. 20:7, 8) వాళ్లెందుకు అలా చేస్తారు? ఎందుకంటే, దేవునికి లోబడకుండానే శాశ్వతకాలం జీవించవచ్చని ప్రజల్ని నమ్మించడానికి సాతాను మళ్లీ ప్రయత్నిస్తాడు. కానీ అతను చెప్పేది అబద్ధం. అయితే మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘ఆ అబద్ధాన్ని నేను నమ్ముతానా?’ మనం యెహోవాను నిజంగా ప్రేమిస్తే, ఆయన మంచివాడని, ఈ విశ్వాన్ని పరిపాలించే హక్కు ఆయనకే ఉందని నమ్మితే అలాంటి అబద్ధాన్ని మనం అసహ్యించుకుంటాం. ప్రేమతో పరిపాలించే యెహోవా పరిపాలనలోనే మనం జీవించాలని కోరుకుంటాం.

దేవుని సర్వాధిపత్యాన్ని నమ్మకంగా సమర్థించండి

13. మనం యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తున్నామని ఎలా చూపిస్తాం?

13 మనం పై పేరాల్లో చూసినట్టు, పరిపాలించే హక్కు యెహోవాకే ఉంది, ఆయన పరిపాలనే అత్యుత్తమమైనది. ఆయన సర్వాధిపత్యానికి మన పూర్తి మద్దతును తెలపాలి. అయితే అలా మద్దతు తెలపాలంటే మనం యెహోవాకు నమ్మకంగా ఉండాలి, ఆయన్ను అనుకరించాలి. మనం యెహోవాలా ప్రవర్తించడానికి శాయశక్తులా కృషి చేసినప్పుడు, ఆయన పరిపాలనను ప్రేమిస్తున్నామని, దానికి మద్దతిస్తున్నామని చూపిస్తాం.—ఎఫెసీయులు 5:1, 2 చదవండి.

14. సంఘపెద్దలు, కుటుంబ యజమానులు యెహోవాను ఎలా అనుకరించవచ్చు?

14 యెహోవా ఎప్పుడూ తన శక్తిని ప్రేమపూర్వకంగానే ఉపయోగిస్తాడని మనం బైబిలు నుండి తెలుసుకున్నాం. యెహోవా సర్వాధిపత్యాన్ని ప్రేమించే కుటుంబ యజమానులు అలాగే సంఘపెద్దలు ఆయనను అనుకరిస్తూ, కఠినంగా లేదా ఇతరుల్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలనే విధంగా ప్రవర్తించరు. అపొస్తలుడైన పౌలు దేవున్ని, ఆయన కుమారుణ్ణి అనుకరించడానికి చాలా కృషిచేశాడు. (1 కొరిం. 11:1) అతను ఇతరుల్ని కించపర్చలేదు లేదా సరైనది చేయమని బలవంతపెట్టలేదు. బదులుగా, సరైనది చేసేలా ఇతరుల్ని దయతో ప్రోత్సహించాడు. (రోమా. 12:1; ఎఫె. 4:1; ఫిలే. 8-10) అలా పౌలు యెహోవాను అనుకరించాడు. మనం ఇతరులతో ప్రేమగా వ్యవహరించినప్పుడు యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించిన వాళ్లమౌతాం.

15. అధికారంలో ఉన్నవాళ్లకు సహకరించడం ద్వారా మనం యెహోవా పరిపాలనా హక్కును సమర్థిస్తున్నామని ఎలా చూపిస్తాం?

15 యెహోవా అధికారమిచ్చిన వాళ్లకు సహకరించడం ద్వారా కూడా మనం ఆయన సర్వాధిపత్యాన్ని సమర్థిస్తాం. వాళ్లు తీసుకున్న ఒక నిర్ణయం మనకు పూర్తిగా అర్థంకాకపోయినా లేదా నచ్చకపోయినా వాళ్లకు సహకరించడం ద్వారా యెహోవాకు లోబడుతున్నామని చూపిస్తాం. లోకంలోని వాళ్లు అలా సహకరించరు. కానీ మనం మన మద్దతును తెలపడం ద్వారా యెహోవాను మన పరిపాలకునిగా ఒప్పుకుంటున్నామని చూపిస్తాం. (ఎఫె. 5:22, 23; 6:1-3; హెబ్రీ. 13:17) యెహోవా మన మంచే కోరుకుంటాడు కాబట్టి అధికారంలో ఉన్నవాళ్లకు సహకరించడం ద్వారా మనం ప్రయోజనం పొందుతాం.

16. మనం యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తున్నామని మన నిర్ణయాల ద్వారా ఎలా చూపించవచ్చు?

16 మన నిర్ణయాల ద్వారా కూడా మనం యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించవచ్చు. జీవితంలో ఎదురయ్యే ప్రతీ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలో తెలిపే ప్రత్యేకమైన ఆజ్ఞలేమీ యెహోవా మనకు ఇవ్వట్లేదు. బదులుగా తన ఆలోచనలు ఏమిటో మనకు చెప్తున్నాడు. దాన్నిబట్టి మనం ఏమి చేయాలో అర్థంచేసుకోవచ్చు. ఉదాహరణకు, క్రైస్తవులు ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఎలాంటివి వేసుకోకూడదో ఒక లిస్టు యెహోవా ఇవ్వలేదు. కానీ తన సాక్షులుగా మనం అణకువగా, గౌరవంగా కనబడాలని ఆయన చెప్తున్నాడు. (1 తిమో. 2:9, 10) మన నిర్ణయాలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మనం ఆలోచించాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 కొరిం. 10:31-33) యెహోవా ఆలోచనల ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకున్నప్పుడు, మనం ఆయన పరిపాలనను ఇష్టపడుతున్నామని, దానికి మద్దతిస్తున్నామని చూపిస్తాం.

నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అలాగే మీ కుటుంబంలో యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించండి (16-18 పేరాలు చూడండి)

17, 18. యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తున్నామని క్రైస్తవ దంపతులు ఎలా చూపించవచ్చు?

17 పెళ్లయినవాళ్లు కూడా యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించగల ఒక మార్గాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత వివాహ జీవితం వాళ్లు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. భార్యాభర్తల మధ్య పెద్దపెద్ద సమస్యలు కూడా తలెత్తవచ్చు. అలా జరిగితే, ప్రాచీన ఇశ్రాయేలు జనాంగంతో యెహోవా వ్యవహరించిన విధానం గురించి ఆలోచించడం ద్వారా వాళ్లు ప్రయోజనం పొందవచ్చు. ఆ ప్రజలకు తాను ఒక భర్తలా ఉన్నానని యెహోవా వర్ణించుకున్నాడు. (యెష. 54:5; 62:4) కానీ ఆ జనాంగం ఆయనను చాలాసార్లు బాధపెట్టింది. వాళ్ల బంధం కష్టంగాసాగే వివాహ జీవితంలా తయారైంది. అయినప్పటికీ, ఇశ్రాయేలీయుల్ని వదులుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. బదులుగా, ఆ ప్రజల్ని పదేపదే క్షమించాడు, వాళ్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.—కీర్తన 106:43-45 చదవండి.

18 యెహోవాను ప్రేమించే క్రైస్తవ దంపతులు ఆయనను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ తమ వివాహంలో సమస్యలు వచ్చినప్పటికీ, లేఖనాధారం లేకుండా విడిపోవడానికి ప్రయత్నించరు. పెళ్లి ప్రమాణాన్ని యెహోవా ఎంతో ప్రాముఖ్యంగా ఎంచుతాడని, భార్యాభర్తలు ఒకరికొకరు “అంటిపెట్టుకొని” ఉండాలనేది ఆయన కోరికని వాళ్లకు తెలుసు. ‘లైంగిక పాపాల’ కారణంగా మాత్రమే విడాకులు తీసుకొని, మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందని లేఖనాలు చెప్తున్నాయి. (మత్త. 19:5, 6, 9) తమ వివాహ జీవితాన్ని సంతోషంగా గడపడానికి చేయగలిగినదంతా చేసినప్పుడు, భార్యాభర్తలు యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తారు.

19. తప్పులు చేసినప్పుడు మనమేమి చేయాలి?

19 మనందరం అపరిపూర్ణులం కాబట్టి కొన్నిసార్లు మనం చేసే పనులు యెహోవాను బాధపెడతాయి. ఆయనకు అది తెలుసు కాబట్టే విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే, మనం తప్పు చేస్తే యెహోవాను క్షమాపణ అడగాలి. (1 యోహా. 2:1, 2) తప్పు చేశామని కేవలం బాధపడితే సరిపోదుగానీ, దానినుండి పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మనల్ని క్షమించి, అపరాధ భావాల నుండి బయటపడి తనను సేవిస్తూ ఉండడానికి సహాయం చేసే యెహోవాకు మనం దగ్గరవ్వాలనుకుంటాం.—కీర్త. 103:3.

20. మనం యెహోవా సర్వాధిపత్యాన్ని ఇప్పుడే ఎందుకు సమర్థించాలి?

20 కొత్తలోకంలో ప్రతీఒక్కరు యెహోవా పరిపాలన కింద ఉంటారు, ఆయన నీతియుక్త మార్గాలను నేర్చుకుంటారు. (యెష. 11:9) కానీ ఇప్పుడుకూడా ఆయన ఆలోచనలు ఏమిటో, మనమెలా ప్రవర్తించాలని ఆయన కోరుకుంటున్నాడో మనం తెలుసుకోవచ్చు. దేవుని పరిపాలన హక్కును ప్రశ్నించే వాళ్లెవ్వరూ ఉండని రోజు త్వరలోనే వస్తుంది. కాబట్టి ఆయనకు విధేయత చూపిస్తూ, నమ్మకంగా సేవచేస్తూ, మన పనులన్నిటిలో ఆయన్ను అనుకరిస్తూ ఉండడం ద్వారా ఇప్పుడే యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిద్దాం.