కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని అనుగ్రహాన్ని ఆయన పొందగలిగేవాడే

దేవుని అనుగ్రహాన్ని ఆయన పొందగలిగేవాడే

యెహోవా సేవకులమైన మనం ఆయన అనుగ్రహాన్ని పొందాలనుకుంటాం. కానీ యెహోవా అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందాలంటే ఏమి చేయాలి? బైబిలు కాలాల్లోని కొంతమంది ఒకప్పుడు గంభీరమైన పాపాలు చేసినా, కొంతకాలం తర్వాత దేవుని ఆమోదాన్ని లేదా అనుగ్రహాన్ని మళ్లీ సంపాదించుకున్నారు. మరోవైపు మంచి లక్షణాలు ఉన్న కొందరు చివరికి దేవుని ఆమోదాన్ని కోల్పోయారు. దీన్నిబట్టి “అసలు యెహోవా మనలో ఏమి చూస్తాడు?” అనే సందేహం మనకు రావచ్చు. దానికి జవాబు కోసం, యూదా రాజైన రెహబాము గురించి తెలుసుకోవాలి.

చెడ్డ ఆరంభం

రెహబాము తండ్రైన సొలొమోను ఇశ్రాయేలును 40 సంవత్సరాలపాటు పరిపాలించాడు. (1 రాజు. 11:42) తండ్రి చనిపోయాక, రాజుగా పట్టాభిషేకం పొందడానికి రెహబాము యెరూషలేము నుండి షెకెముకు వెళ్లాడు. (2 దిన. 10:1) రాజవ్వడానికి ఆయన భయపడ్డాడా? సొలొమోను చాలా తెలివిగలవాడని అందరికీ తెలుసు. కాబట్టి ఆయన కొడుకుగా కష్టమైన సమస్యల్ని పరిష్కరించేంత తెలివి తనకు ఉందని రెహబాము నిరూపించుకోవాల్సివుంది.

అప్పటికే ఇశ్రాయేలీయులు ఎన్నో బాధలుపడుతున్నారు. వాటిని పరిష్కరించమని అడగడానికి తమ ప్రతినిధుల్ని రెహబాము దగ్గరకు పంపించారు. ఆ ప్రతినిధులు ఇలా అన్నారు, “నీ తండ్రి మా కాడిని బరువుచేసెను; నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మామీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులుకన చేసినయెడల మేము నిన్ను సేవింతుము.”—2 దిన. 10:3, 4.

రెహబాముకు నిర్ణయం తీసుకోవడం కష్టమైవుంటుంది. ఒకవేళ ప్రజలు అడిగింది చేస్తే ఆయనా, ఆయన కుటుంబం, రాజభవనంలో ఉన్న మిగతావాళ్లు అప్పటివరకు అనుభవించిన కొన్ని సౌకర్యాలు కోల్పోయే అవకాశం ఉంది. మరోవైపు అడిగింది చేయకపోతే ప్రజలు ఆయనకు ఎదురుతిరుగుతారు. మరి రెహబాము ఏమి చేశాడు? ముందుగా, తన తండ్రికి సహాయం చేసిన పెద్దవాళ్లను సంప్రదించాడు. ప్రజల మాట వినడమే సరైనదని వాళ్లు ఆయనకు చెప్పారు. కానీ రెహబాము ఆ తర్వాత తన తోటి వయసువాళ్ల సలహా అడిగి, వాళ్లు చెప్పినట్లు ప్రజల్ని మరింత కష్టపెట్టాలని నిర్ణయించుకున్నాడు. రెహబాము ప్రజలకు ఇలా జవాబిచ్చాడు, “నా తండ్రి మీ కాడిని బరువుచేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించెదను.”—2 దిన. 10:6-14.

దీంట్లో మనకు ఏదైనా పాఠం ఉందా? నేడు కూడా ఎన్నో సంవత్సరాల నుండి యెహోవా సేవచేస్తున్న పెద్దవయసువాళ్లు మన మధ్య ఉన్నారు. మంచి నిర్ణయాలు తీసుకునేలా వాళ్లు మనకు సహాయం చేయగలరు. వాళ్ల మాట విని తెలివైనవాళ్లుగా తయారౌదాం.—యోబు 12:12.

వాళ్లు “యెహోవా మాట” విన్నారు

ఎదురుతిరిగిన గోత్రాల వాళ్లతో యుద్ధం చేయడానికి రెహబాము సిద్ధపడ్డాడు. కానీ యెహోవా షెమయా ప్రవక్తను పంపించి ఇలా చెప్పాడు, “జరిగినది నావలననే జరిగెను; మీరు ఇశ్రాయేలువారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్లక, అందరును మీ మీ యిండ్లకు తిరిగి పోవుడి.”—1 రాజు. 12:21-24. *

యెహోవా మాట వినడం రెహబాముకు తేలికేనా? కొత్త రాజు గురించి ప్రజలు ఏమనుకుంటారు? ఆయన వాళ్లను “కొరడాలతో” శిక్షిస్తానని చెప్పాడు. కానీ ఆ తిరుగుబాటు విషయంలో ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు. (2 దిన. 13:7 పోల్చండి.) ప్రజలు ఏమనుకున్నా రాజు, ఆయన సైన్యం మాత్రం “యెహోవా మాటకు లోబడి” యుద్ధం చేయకుండా ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.

దీన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ప్రజలు మనల్ని ఎగతాళి చేసినా యెహోవా మాట వినడమే ఎల్లప్పుడూ తెలివైన పని. ఆయన మాట వింటే మనల్ని ఆశీర్వదిస్తాడు.—ద్వితీ. 28:2.

మరి రెహబాము దేవుని మాట విన్నందుకు ఆశీర్వాదం పొందాడా? యూదా, బెన్యామీను గోత్రాలకు రెహబాము రాజుగా కొనసాగాడు, కొత్త నగరాలను కట్టించాడు. అంతేకాదు కొన్ని “పట్టణములను బహు బలవంతమైన వాటిగా” చేశాడు. (2 దిన. 11:5-12) అన్నిటికన్నా ముఖ్యంగా, ఆయన కొంతకాలంపాటు యెహోవా నియమాలకు లోబడ్డాడు. పదిగోత్రాల రాజ్యంలో ప్రజలు విగ్రహారాధన మొదలుపెట్టడంతో చాలామంది రెహబాముకు అలాగే సత్యారాధనకు మద్దతునివ్వడానికి యెరూషలేముకు వచ్చేవాళ్లు. (2 దిన. 11:16, 17) రెహబాము యెహోవా మాట విన్నాడు కాబట్టి ఆయన రాజ్యం బలంగా తయారైంది.

పాపం, పశ్చాత్తాపం

రాజ్యం బలంగా తయారైన తర్వాత రెహబాము యెహోవా నియమాలను నిర్లక్ష్యం చేసి, అబద్ధ దేవుళ్లను ఆరాధించడం మొదలుపెట్టాడు. ఎందుకు? అమ్మోనీయురాలైన తన తల్లి ప్రభావం వల్ల ఆయన అలా చేశాడా? (1 రాజు. 14:21) మనకు తెలీదు. కానీ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకున్నారు. ఫలితంగా, యూదా రాజ్యంలో చాలా పట్టణాలను ఐగుప్తు రాజైన షీషకు స్వాధీనం చేసుకునేందుకు యెహోవా అనుమతించాడు. రెహబాము ఆ పట్టణాలను చాలా బలంగా తయారు చేసినప్పటికీ షీషకు వాటిని స్వాధీనం చేసుకోగలిగాడు!—1 రాజు. 14:22-24; 2 దిన. 12:1-4.

రెహబాము పరిపాలిస్తున్న యెరూషలేముపై షీషకు తన సైన్యంతో దాడిచేయడానికి వచ్చినప్పుడు పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది. ఆ సమయంలో షెమయా ప్రవక్త రెహబాముకు ఆయన అధిపతులకు దేవుని నుండి వచ్చిన ఈ సందేశాన్ని చెప్పాడు, “మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చి యున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” మరి ఈ దిద్దుబాటుకు రెహబాము ఎలా స్పందించాడు? మెచ్చుకోదగిన విధంగా స్పందించాడు. బైబిలు ఇలా చెప్తుంది, “అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులును రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి.” ఆ తర్వాత యెహోవా రెహబామును రక్షించి, యెరూషలేము నాశనమవ్వకుండా ఆపాడు.—2 దిన. 12:5-7, 12.

ఆ తర్వాత రెహబాము యూదా రాజ్యానికి రాజుగా కొనసాగాడు. ఆయన చనిపోవడానికి ముందు, తన కొడుకులకు చాలా బహుమతులు ఇచ్చాడు. బహుశా తన తర్వాత రాజు కాబోయే వాళ్ల సోదరుడైన అబీయాకు ఎవ్వరూ ఎదురుతిరగకూడదనే ఉద్దేశంతో అలా బహుమతులు ఇచ్చివుండవచ్చు. (2 దిన. 11:21-23) అలా చేయడంవల్ల రెహబాము యౌవనంలో ఉన్నప్పుడు ప్రవర్తించిన దానికంటే ఇప్పుడు తెలివిగా ప్రవర్తించాడు.

మంచివాడా? చెడ్డవాడా?

రెహబాము కొన్ని మంచిపనులు చేసినప్పటికీ ఆయన పరిపాలన గురించి బైబిలు ఇలా చెప్తుంది, “అతడు తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను.” కాబట్టి ఆయన యెహోవాను సంతోషపెట్టలేకపోయాడు.—2 దిన. 12:14.

దావీదుకు ఉన్నట్లు రెహబాముకు యెహోవాతో సన్నిహిత సంబంధం లేదు

రెహబాము జీవితం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఆయన కొన్నిసార్లు యెహోవా మాట విన్నాడు. దేవుని ప్రజల కోసం కొన్ని మంచి పనులు చేశాడు. కానీ ఆయనకు యెహోవాతో సన్నిహిత సంబంధం, దేవున్ని సంతోషపెట్టాలనే బలమైన కోరిక లేవు. అందుకే, సరైనది చేయకుండా అబద్ధ దేవుళ్లను ఆరాధించడం మొదలుపెట్టాడు. మీకు ఈ ప్రశ్న రావచ్చు: ‘రెహబాము యెహోవా ఇచ్చిన దిద్దుబాటును స్వీకరించాడంటే, తన తప్పులు తెలుసుకుని నిజంగా పశ్చాత్తాపపడ్డాడా? లేదా కేవలం ఇతరులు చెప్పినందుకు అలా చేశాడా?’ (2 దిన. 11:3, 4; 12:6) ఆఖరి దశలో ఆయన మళ్లీ చెడ్డ పనులు చేశాడు. తన తాతయైన దావీదు రాజుకు, ఈయనకు చాలా తేడా ఉంది. దావీదు కూడా తప్పులు చేశాడు గానీ నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించాడు. దావీదు జీవితాంతం యెహోవాను ప్రేమించాడు, సత్యారాధనను హత్తుకొని ఉన్నాడు.—1 రాజు. 14:8; కీర్త. 51:1, 17; 63:1.

రెహబాము నుండి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. అదేంటంటే, ప్రజలు తమ కుటుంబ అవసరాలు తీర్చడం, ఇతరుల కోసం మంచిపనులు చేయడం మెచ్చుకోదగిన విషయం. కానీ యెహోవా అనుగ్రహాన్ని పొందాలంటే ఆయన్ను సంతోషపెట్టే విధంగా ఆరాధించాలి, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగివుండాలి.

అలా చేయాలంటే, యెహోవా మీద ప్రగాఢమైన ప్రేమ ఉండాలి. మంట ఆరకుండా ఉండడానికి కట్టెలు వేసినట్లే, దేవుని మీదున్న ప్రేమ చల్లారకుండా ఉండడానికి బైబిల్ని క్రమంగా చదవాలి, చదివినవాటిని లోతుగా ఆలోచించాలి, పట్టుదలగా ప్రార్థన చేయాలి. (కీర్త. 1:2; రోమా. 12:12) అప్పుడే మనం చేసే ప్రతీ పనిలో యెహోవా హృదయాన్ని సంతోషపెట్టగలుగుతాం. మనం చేసిన తప్పులకు నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించగలుగుతాం, యెహోవాను క్షమాపణ అడగగలుగుతాం. అలాచేస్తే రెహబాములా కాకుండా మనం సత్యారాధనలో నమ్మకంగా కొనసాగుతాం.—యూదా 20, 21.

^ పేరా 9 సొలొమోను అవిధేయత కారణంగా రాజ్యం రెండుగా చీలిపోతుందని యెహోవా ముందే చెప్పాడు.—1 రాజు. 11:31-33.