కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

నా కష్టాలన్నిటిలో నన్ను ఓదార్చాడు

నా కష్టాలన్నిటిలో నన్ను ఓదార్చాడు

 ధునదికి పశ్చిమాన ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు పాకిస్థాన్‌ అని పిలుస్తున్నారు. అక్కడే ప్రాచీన నగరమైన సక్కర్‌ ఉంది. ఆ నగరంలోనే నేను 1929 నవంబరు 9న పుట్టాను. ఆ సమయంలోనే, ఆంగ్లేయుడైన ఒక మిషనరీ ప్రకాశవంతమైన రంగుల్లో ఉన్న పుస్తకాల సెట్‌ను మా అమ్మానాన్నలకు ఇచ్చాడు. బైబిలు ఆధారితంగా రాయబడిన ఆ పుస్తకాలు నేనొక యెహోవాసాక్షిగా మారడానికి ఎంతగానో సహాయం చేశాయి.

ఆ పుస్తకాల్ని రెయిన్‌బో సెట్‌ అని పిలిచేవాళ్లు. వాటిని నేను లోతుగా చదివినప్పుడు, అందులోని చక్కని చిత్రాలు నా ఊహాశక్తిని మరింత పెంచాయి. వాటివల్ల అద్భుతమైన ఆ పుస్తకాల్లో ఉన్న ఎన్నో బైబిలు విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి చిన్నప్పటి నుండే నాలో పెరిగింది.

ఒకవైపు రెండవ ప్రపంచ యుద్ధం భారతదేశం మీదకు ముంచుకొస్తుందనే భయంతో ఉండగా, మరోవైపు నా జీవితం దయనీయంగా తయారవ్వడం మొదలైంది. మా అమ్మానాన్నలు విడిపోయారు, కొంతకాలం తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు. నేనెంతో ప్రేమించిన ఇద్దరు వ్యక్తులు ఎందుకలా విడిపోయారో నాకు అర్థంకాలేదు. మానసికంగా చాలా కృంగిపోయాను, నాకెవ్వరూ లేరనిపించింది. మా అమ్మానాన్నలకు నేను ఒక్కడ్నే అవ్వడంవల్ల నన్ను ఓదార్చేవాళ్లు, నాకు తోడుండేవాళ్లు ఎవ్వరూ లేకుండాపోయారు.

రాజధాని నగరమైన కరాచీలో అమ్మ, నేనూ ఉండేవాళ్లం. ఒకరోజు ఫ్రెడ్‌ హార్డేకర్‌ అనే పెద్దవయసు వ్యక్తి మా ఇంటి తలుపు తట్టాడు. ఆయన ఒక యెహోవాసాక్షి, డాక్టర్‌గా పనిచేసేవాడు. అప్పట్లో మా కుటుంబానికి పుస్తకాలు ఇచ్చిన మిషనరీది, ఈయనది ఒకటే మతం. ఫ్రెడ్‌ హార్డేకర్‌ మా అమ్మను బైబిలు స్టడీ తీసుకోమని అడిగాడు. ఆమె దానికి ఇష్టపడలేదుగానీ, నాకు ఆసక్తి ఉండవచ్చని చెప్పింది. ఆ తర్వాతి వారం నుండే సహోదరుడు హార్డేకర్‌ దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాను.

కొన్ని వారాల తర్వాత, సహోదరుడు హార్డేకర్‌ నడిపే క్లినిక్‌లో జరిగే మీటింగ్స్‌కు వెళ్లడం మొదలుపెట్టాను. పెద్దవయసు ఉన్న దాదాపు 12 మంది ప్రచారకులు ఆ మీటింగ్‌కి వచ్చేవాళ్లు. వాళ్లు నన్ను కొడుకులా చూసుకున్నారు, ఓదార్చారు. వాళ్లు నాతో మాట్లాడే విధానాన్ని ఇప్పటికీ గుర్తుంచుకున్నాను. కిందికి వంగి నా కళ్లలోకి చూస్తూ నిజమైన స్నేహితుల్లా మాట్లాడేవారు. ఆ సమయంలో నాకు అలాంటి ప్రేమే అవసరమైంది.

కొన్నిరోజుల తర్వాత సహోదరుడు హార్డేకర్‌ తనతో ప్రీచింగ్‌కు రమ్మని నన్ను పిలిచాడు. నాకు ఫోనోగ్రాఫ్‌ ప్లే చేయడం నేర్పించాడు. దాంతో చిన్న బైబిలు ప్రసంగాలు ఉన్న రికార్డుల్ని ప్లే చేశాను. కొన్ని ప్రసంగాలు చాలా సూటిగా ఉండడంవల్ల కొంతమంది ఇంటివాళ్లకు అవి నచ్చేవి కావు. కానీ ఇతరులకు ప్రీచింగ్‌ చేయడం నాకు చాలా నచ్చింది. బైబిలు సత్యాలపట్ల నాకు చాలా ఆసక్తి ఉండేది, వాటిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడేవాణ్ణి.

జపాన్‌ సైన్యం భారతదేశం మీద దాడికి సిద్ధమౌతుండగా బ్రిటీష్‌ అధికారులు యెహోవాసాక్షుల మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి, 1943 జూలైలో అది నామీద కూడా ప్రభావం చూపించింది. మా స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఇంగ్లాండ్‌ చర్చికి సంబంధించిన మతగురువు కావడంతో, నా ప్రవర్తన సరిగ్గా లేదంటూ నన్ను స్కూల్‌ నుండి పంపించేశాడు. నేను యెహోవాసాక్షులతో సహవసించడం చూసి మిగతా విద్యార్థులు చెడిపోతారని మా అమ్మకు చెప్పాడు. ఆమె భయపడి, నన్ను యెహోవాసాక్షులతో కలవకుండా చేసింది. కొంతకాలం తర్వాత, పెషావర్‌లో ఉన్న నాన్న దగ్గరకు నన్ను పంపించేసింది. అది మా ప్రాంతానికి ఉత్తరాన 1,370 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆధ్యాత్మిక ఆహారం, సహోదరుల సహవాసం లేకపోవడంతో యెహోవాతో నా సంబంధం బలహీనపడింది.

యెహోవాతో నా సంబంధం మళ్లీ బలపడింది

1947వ సంవత్సరం, ఉద్యోగ వేటలో మళ్లీ కరాచీకి వచ్చాను. అప్పుడు డాక్టర్‌ హార్డేకర్‌ క్లినిక్‌కి వెళ్లాను, ఆయన నన్ను ఆప్యాయంగా ఆహ్వానించాడు.

నాకు ఒంట్లో బాగోక తన దగ్గరకు వచ్చానేమో అనుకొని, “చెప్పు, ఏంటి నీ సమస్య?” అని అడిగాడు.

అప్పుడు నేను, “డాక్టర్‌, నా ఒంట్లో బాగానే ఉంది. కానీ ఆధ్యాత్మికంగా బలహీనమయ్యాను. నాకు బైబిలు స్టడీ కావాలి” అని జవాబిచ్చాను.

“ఎప్పుడు మొదలుపెట్టమంటావు?” అని ఆయన అడిగాడు.

“వీలైతే, ఇప్పుడే” అని అన్నాను.

ఆ సాయంత్రం బైబిలు అధ్యయనం చేస్తూ మేం బాగా ఆనందించాం. నాకైతే, నా ఆధ్యాత్మిక కుటుంబం దగ్గరకు తిరిగి వచ్చినట్టు అనిపించింది. నన్ను యెహోవాసాక్షులతో కలవనివ్వకుండా చేయాలని మా అమ్మ ఎంత గట్టిగా ప్రయత్నించినా, ఈసారి మాత్రం నేను సత్యాన్ని సొంతం చేసుకోవాలని మనసులో తీర్మానించుకున్నాను. 1947 ఆగస్టు 31న బాప్తిస్మం తీసుకున్నాను. ఆ తర్వాత నా 17వ ఏటే క్రమ పయినీరుగా సేవచేయడం మొదలుపెట్టాను.

పయినీరు సేవలో ఆనందం పొందాను

నేను మొట్టమొదట క్వేటలో నా పయినీరు సేవ ప్రారంభించాను. ఒకప్పుడు బ్రిటీష్‌ మిలిటరీ ఉపయోగించిన బిల్డింగ్‌లు అక్కడ ఉండేవి. 1947లో దేశం మొత్తం రెండుగా అంటే భారతదేశంగా, పాకిస్థాన్‌గా * విడిపోయింది. ఆ సంఘటనవల్ల దేశవ్యాప్తంగా మతపరమైన హింస చెలరేగింది. దాంతో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అతిపెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్లారు. సుమారు 140 లక్షలమంది శరణార్థులు తాముంటున్న ప్రాంతాల్ని వదిలి వెళ్లాల్సివచ్చింది. భారతదేశంలోని ముస్లిమ్‌లు పాకిస్థాన్‌కు వెళ్లారు, పాకిస్థాన్‌లో ఉన్న హిందువులు, సిక్కులు భారతదేశానికి వచ్చారు. ఇంత గందరగోళంలో, నేను కరాచీలో క్వేటకు వెళ్లే ట్రైన్‌ ఎక్కాను. అది జనంతో కిక్కిరిసిపోయి ఉండడంతో మెట్లదగ్గరున్న రాడ్డును పట్టుకొని వేలాడుతూ ప్రయాణించాను.

1948లో భారతదేశంలో జరిగిన ప్రాంతీయ సమావేశానికి వెళ్లినప్పుడు

క్వేటలో ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్న దాదాపు 25 ఏళ్ల జార్జ్‌ సింగ్‌ అనే సహోదరుణ్ణి కలిశాను. కొండ ప్రాంతాల్లో వెళ్లడానికి వీలుగా జార్జ్‌ నాకొక పాత సైకిల్‌ ఇచ్చాడు. చాలాసార్లు నేనొక్కడినే ప్రీచింగ్‌ చేసేవాణ్ణి. ఆరు నెలల్లో, 17 బైబిలు స్టడీలు ప్రారంభించాను. వాళ్లలో కొంతమంది యెహోవాసాక్షులు అయ్యారు. వాళ్లలో ఒకతని పేరు సాదిక్‌ మసై. అతను ఆర్మీ ఆఫీసర్‌గా పనిచేసేవాడు. పాకిస్థాన్‌ జాతీయ భాష అయిన ఉర్దూలోకి కొన్ని బైబిలు సాహిత్యాల్ని అనువదించడానికి జార్జ్‌కూ, నాకూ సాదిక్‌ సహాయం చేశాడు. కొంతకాలానికి సాదిక్‌ ఉత్సాహవంతమైన ప్రచారకుడు అయ్యాడు.

క్వీన్‌ ఎలీసబెత్‌ ఓడలో గిలియడ్‌ పాఠశాలకు వెళ్తూ

కొంతకాలం తర్వాత తిరిగి కరాచీకి వచ్చేశాను. అప్పుడు, గిలియడ్‌ పాఠశాలను పూర్తిచేసుకొని కొత్తగా మిషనరీలుగా వచ్చిన హెన్రీ ఫిన్చ్‌, హ్యారీ ఫారెస్ట్‌తో సేవచేశాను. వాళ్లు నాకెంతో విలువైన శిక్షణ ఇచ్చారు. ఒకసారి సహోదరుడు ఫిన్చ్‌ ఉత్తర పాకిస్థాన్‌కి ప్రీచింగ్‌ చేయడానికి వెళ్తుంటే నేను కూడా ఆయనతో వెళ్లాను. పెద్దపెద్ద పర్వత శ్రేణుల అడుగు భాగంలో, బైబిలు సత్యం కోసం తపించిపోయే ఉర్దూ ప్రజల్ని కలిశాం. రెండు సంవత్సరాల తర్వాత, నేను గిలియడ్‌ పాఠశాలకు హాజరయ్యాను. పాఠశాల పూర్తి అయ్యాక, తిరిగి పాకిస్థాన్‌కు వచ్చాను, అక్కడ కొన్నిసార్లు ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేశాను. అప్పుడు నేను మరో ముగ్గురు మిషనరీ సహోదరులతో కలిసి లాహోర్‌లోని మిషనరీ హోమ్‌లో ఉండేవాణ్ణి.

సమస్య నుండి బయటపడడం

విచారకరంగా 1954లో లాహోర్‌లోని మిషనరీల మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. దానివల్ల బ్రాంచి కార్యాలయం వాళ్ల నియామకాల్ని మార్చింది. వాళ్ల గొడవలో నేను కూడా తెలివితక్కువగా తలదూర్చడంతో నన్ను గట్టిగా మందలించింది. దాంతో చాలా కుమిలిపోయాను, ఆధ్యాత్మికంగా విఫలమయ్యానని అనిపించింది. మళ్లీ ఆనందంగా సేవ మొదలుపెట్టాలనే ఉద్దేశంతో తిరిగి కరాచీకి వెళ్లిపోయాను తర్వాత అక్కడ నుండి ఇంగ్లాండ్‌లోని లండన్‌కు వెళ్లిపోయాను.

అక్కడ లండన్‌ బెతెల్‌ కుటుంబ సభ్యులు చాలామంది మా సంఘంతో సహవసించేవాళ్లు. బ్రాంచి సర్వెంట్‌గా సేవ చేస్తున్న ప్రైస్‌ హ్యూజ్‌ నాకు దయగా, ప్రేమగా శిక్షణ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిని పర్యవేక్షిస్తున్న జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ఒక సందర్భంలో తనను సరిదిద్దాడని సహోదరుడు హ్యూజ్‌ నాకు చెప్పాడు. తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ గట్టిగా మందలించాడని సహోదరుడు హ్యూజ్‌ చెప్పాడు. ఆయన ఆ విషయాన్ని చిరునవ్వుతో చెప్పడం చూసి నాకు ఆశ్చర్యమేసింది. మొదట్లో ఆ సంఘటనవల్ల ఆయన చాలా నిరుత్సాహపడ్డాడని చెప్పాడు. కానీ యెహోవా ప్రేమకు నిదర్శనమైన అలాంటి మందలింపు తనకు అవసరమని తర్వాత గ్రహించాడు. (హెబ్రీ. 12:6) ఆయన మాటలు నా హృదయాన్ని హత్తుకున్నాయి, మళ్లీ సంతోషంగా యెహోవా సేవచేసేలా నాకు సహాయం చేశాయి.

దాదాపు ఆ సమయంలోనే మా అమ్మ లండన్‌కి వచ్చేసింది. సహోదరుడు జాన్‌ ఈ. బార్‌ దగ్గర ఆమె బైబిలు స్టడీ తీసుకుంది. సహోదరుడు జాన్‌ బార్‌ కొంతకాలం తర్వాత పరిపాలక సభ సభ్యుడు అయ్యాడు. ఆమె చక్కని ఆధ్యాత్మిక ప్రగతి సాధించి 1957లో బాప్తిస్మం తీసుకుంది. మా నాన్న కూడా చనిపోయేముందు యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకున్నాడని కొంతకాలం తర్వాత నాకు తెలిసింది.

లండన్‌లో స్థిరపడిన లీనె అనే డానిష్‌ సహోదరిని 1958లో నేను పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాతి సంవత్సరమే మాకు ఓ కూతురు పుట్టింది, తనకు జేన్‌ అని పేరు పెట్టాం. ఆ తర్వాత మాకు మరో నలుగురు పిల్లలు పుట్టారు. ఫూలమ్‌ సంఘంలో నాకు సేవావకాశాలు ఇచ్చారు. కొంతకాలానికి లీనె ఆరోగ్యం పాడవడం వల్ల మేము కాస్త వేడిగా ఉండే ప్రాంతానికి మారాల్సివచ్చింది. దాంతో 1967లో మేము ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌కి వెళ్లిపోయాం.

గుండెల్ని పిండేసిన విషాదం

ఆడిలైడ్‌లోని మా సంఘంలో 12 మంది వృద్ధ అభిషిక్త క్రైస్తవులు కూడా ఉండేవాళ్లు. వాళ్లు ముందుండి ప్రకటనా పనిని చాలా ఉత్సాహంగా నడిపించారు. మేము అక్కడికి వెళ్లాక చాలా త్వరగా మా ఆధ్యాత్మిక కార్యకలాపాల్ని కొనసాగించాం.

1979లో మా ఐదో బిడ్డ పుట్టాడు, తన పేరు డానియెల్‌. ఆ బాబుకు డౌన్‌ సిండ్రోమ్‌ * వ్యాధి రావడంతో ఎక్కువకాలం బతకడని తెలిసింది. అప్పుడు మేం పడ్డ ఆవేదనను ఇప్పటికీ వర్ణించలేము. తన అవసరాలు తీర్చడానికి మేం చేయగలిగినదంతా చేశాం. అలాగని మిగతా నలుగురు పిల్లల ఆలనాపాలనను నిర్లక్ష్యం చేయలేదు. డానియెల్‌ గుండెకి రెండు రంధ్రాలు ఉండడంవల్ల శరీరానికి ఆక్సిజన్‌ సరిగ్గా అందక అప్పుడప్పుడు నీలి రంగులోకి మారిపోయేవాడు. అలా జరిగినప్పుడు తనను తీసుకొని హాస్పిటల్‌కు పరుగెత్తేవాళ్లం. ఆరోగ్యం బాగోకపోయినా డానియెల్‌ చాలా తెలివిగలవాడు, ప్రేమగలవాడు. తనకు కూడా యెహోవా అంటే చాలా ఇష్టం. భోజనానికి ముందు ప్రార్థన చేసేటప్పుడు, తన చిన్ని చేతుల్ని జోడించి, తల ఊపుతూ, మనస్ఫూర్తిగా “ఆమేన్‌” అని చెప్పాకే భోంచేసేవాడు.

డానియెల్‌కు నాలుగేళ్లు ఉన్నప్పుడు లుకేమియా వ్యాధి వచ్చింది. అది తెలిశాక నేనూ, లీనె శారీరకంగా, మానసికంగా బాగా కృంగిపోయాం. ఇక దేన్నీ తట్టుకునే శక్తి నాలో లేదనిపించింది. అంతటి నిరాశలో ఉన్నప్పుడు మా ప్రాంతీయ పర్యవేక్షకుడైన నెవిల్‌ బ్రామిచ్‌ మా ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి ఆయన కంటతడి పెట్టుకుని, మమ్మల్ని హత్తుకున్నాడు. మేమందరం ఏడ్చేశాం. ప్రేమగా, దయగా ఆయన మాట్లాడిన మాటలు మమ్మల్ని ఎంత ఓదార్చాయో చెప్పలేం. సుమారు అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆయన మాతోనే ఉన్నాడు. ఆయన వెళ్లిపోయిన కాసేపటికే డానియెల్‌ చనిపోయాడు. అదే మా జీవితంలో అత్యంత విషాద సంఘటన. ఎలాగోలా మేం ఆ బాధను తట్టుకోగలిగాం. ఎందుకంటే యెహోవా ప్రేమ నుండి డానియెల్‌ను ఏదీ, చివరికి మరణం కూడా విడదీయలేదనే నమ్మకం మాకు ఉంది. (రోమా. 8:38, 39) దేవుడు తీసుకొచ్చే కొత్త లోకంలో డానియెల్‌ని కలుసుకోవాలని ఎంతగానో ఎదురుచూస్తున్నాం.—యోహా. 5:28, 29.

ఇతరులకు సహాయం చేయడంలో సంతోషాన్ని పొందాను

రెండుసార్లు నాకు తీవ్రమైన బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది, ఎలాగోలా కోలుకొని ఇప్పటికీ సంఘపెద్దగా సేవచేస్తున్నాను. నాకు ఎదురైన అనుభవాల వల్ల సమస్యలతో సతమతమౌతున్న వాళ్లను చూసినప్పుడు నాకు సానుభూతి, కరుణ కలుగుతాయి. వాళ్ల విషయంలో తొందరపడి ఒక ముగింపుకు వచ్చేసే బదులు ఇలా ఆలోచిస్తాను, ‘వాళ్లు జీవితంలో అనుభవించిన వాటిని బట్టి వాళ్ల ఆలోచనా విధానం ఎలా మారింది? నాకు వాళ్లపట్ల శ్రద్ధ ఉందని నేనెలా చూపించవచ్చు? యెహోవా ఇష్టాన్ని చేసేలా వాళ్లను నేనెలా ప్రోత్సహించగలను?’ కాపరి సందర్శనాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే, ఇతరుల్ని ఓదార్చి వాళ్లకు సేదదీర్పును ఇచ్చినప్పుడు నేను ఓదార్పు, సేదదీర్పు పొందినట్టు అనిపిస్తుంది.

కాపరి సందర్శనాలు చేస్తూ సంతృప్తిని పొందుతున్నాను

“నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది” అని చెప్పిన కీర్తనకర్తలా నాకూ అనిపిస్తుంటుంది. (కీర్త. 94:19) కుటుంబ సమస్యల నుండి, మతపరమైన వ్యతిరేకతల నుండి, నిరాశానిస్పృహల నుండి ఆయన నన్ను కాపాడాడు. నిజంగా సొంత తండ్రిలా యెహోవా నన్ను ఆదరించాడు.

^ పేరా 19 మొదట్లో, పశ్చిమ పాకిస్థాన్‌ని (ఇప్పుడు పాకిస్థాన్‌), తూర్పు పాకిస్థాన్‌ని (ఇప్పుడు బంగ్లాదేశ్‌) కలిపి పాకిస్థాన్‌ అని పిలిచేవాళ్లు.

^ పేరా 29 2010, ఏప్రిల్‌ 15 కావలికోట సంచికలో “శ్రమలను సహించడం వల్ల యెహోవాపై మా నమ్మకం బలపడింది” అనే ఆర్టికల్‌ చూడండి.