కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పలకరింపుకు ఉన్న శక్తి

పలకరింపుకు ఉన్న శక్తి

“హాయ్‌! బాగున్నారా?”

సాధారణంగా మీరు ఇతరుల్ని ఈ విధంగానే పలకరించివుంటారు. ఒక్కోసారి పలకరించడంతోపాటు షేక్‌హ్యాండ్‌ ఇచ్చివుంటారు లేదా ఆత్మీయంగా కౌగలించుకొని ఉంటారు. ప్రాంతాన్ని బట్టి పలకరించే పద్ధతులు, అందుకోసం వాడే పదాలు మారవచ్చు, కానీ పలకరింపులో ఉన్న భావం ఎక్కడైనా దాదాపుగా ఒకేలా ఉంటుంది. నిజానికి పలకరించకపోవడాన్ని ప్రజలు అమర్యాదగా భావిస్తుంటారు.

కాకపోతే పలకరించే అలవాటు అందరికీ ఉండకపోవచ్చు. కొంతమంది బిడియం వల్లో, ఆత్మన్యూనతా భావం వల్లో పలకరించడానికి వెనకాడుతుంటారు. ఇంకొంతమంది వేరేవాళ్ల జాతి, సంస్కృతి, నేపథ్యం బట్టి పలకరించడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ ఒక చిన్న పలకరింపు వల్ల ఎంతో మంచి జరుగుతుంది.

వీటి గురించి ఆలోచించండి: ‘పలకరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? పలకరించడం గురించి దేవుని వాక్యం ఏమి నేర్పిస్తుంది?’

“అన్నిరకాల ప్రజల్ని” పలకరించండి

మొదటిసారిగా క్రైస్తవ సంఘంలోకి ఒక అన్యుడిని అంటే కొర్నేలిని ఆహ్వానిస్తున్నప్పుడు అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు, “దేవునికి పక్షపాతం లేదు.” (అపొ. 10:34) అంతేకాదు “అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని” దేవుడు కోరుకుంటున్నట్లు పేతురు తర్వాత రాశాడు. (2 పేతు. 3:9) ఈ వచనాల్లోని విషయాలు కొత్తగా సత్యం నేర్చుకుంటున్నవాళ్ల కోసమే అని మనకు అనిపించవచ్చు. కానీ పేతురు క్రైస్తవుల్ని కూడా ఇలా ప్రోత్సహించాడు, “అన్నిరకాల ప్రజల్ని ఘనపర్చండి; ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదర బృందాన్ని ప్రేమించండి.” (1 పేతు. 2:17) కాబట్టి ఏ జాతికి, సంస్కృతికి లేదా నేపథ్యానికి చెందినవాళ్లనైనా మనం పలకరించాలి. అలాచేస్తే వాళ్లను గౌరవించి, ప్రేమ చూపించినట్లు అవుతుంది.

అపొస్తలుడైన పౌలు సంఘంలోని వాళ్లను ఇలా ప్రోత్సహించాడు, “క్రీస్తు మిమ్మల్ని స్వీకరించినట్లే మీరు కూడా ఒకరినొకరు స్వీకరించండి.” (రోమా. 15:7) ఆయన తనను ‘బలపర్చిన’ సహోదరులను పేరుపేరున ప్రస్తావించాడు. నేడు దేవుని ప్రజలపై సాతాను తీవ్రంగా దాడిచేస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి సహోదరసహోదరీల్ని బలపర్చడం ఇంకెంతో అవసరం.—కొలొ. 4:11, అధస్సూచి; ప్రక. 12:12, 17.

అయితే ఇతరుల్ని పలకరించడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని బైబిల్లోని ఉదాహరణలు చూపిస్తున్నాయి.

నమ్మకం, ప్రోత్సాహం, ప్రేమ

దేవుని కుమారుని జీవాన్ని మరియ గర్భంలోకి మార్చే సమయం దగ్గరపడినప్పుడు, ఆమెతో మాట్లాడడానికి యెహోవా ఒక దూతను పంపాడు. ఆ దూత మరియతో, “దేవుని ఆశీర్వాదం పొందిన నీకు శుభాకాంక్షలు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు” అని అన్నాడు. దేవుని దూత తనతో ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థంకాక ‘ఆమె చాలా కంగారుపడింది.’ అది గమనించిన దూత, “మరియా, భయపడకు. నువ్వు దేవుని ఆశీర్వాదం పొందావు” అని చెప్పాడు. అంతేకాదు ఆమె మెస్సీయకు జన్మనివ్వడం దేవుని సంకల్పమని వివరించాడు. ఆ మాటలకు ఇంకా కంగారుపడే బదులు మరియ ఇలా అంది, “ఇదిగో! యెహోవా దాసురాలిని! నువ్వు చెప్పినట్లే నాకు జరగాలి.”—లూకా 1:26-38.

ఆ దూత యెహోవా సందేశాన్ని చేరవేసే అవకాశాన్ని గొప్ప గౌరవంగా చూశాడేగానీ, అపరిపూర్ణ మనిషితో మాట్లాడడం ఏమిటని చిన్నబుచ్చుకోలేదు. ఆయన తన సంభాషణను శుభాకాంక్షలు తెలుపుతూ మొదలుపెట్టడం నుండి మనం ఏదైనా పాఠం నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు. మనం ఇతరుల్ని పలకరించడానికి, ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉండాలి. పలకరిస్తూ మాట్లాడేవి నాలుగు మాటలే కావచ్చు, కానీ అవి వాళ్లకు సహాయం చేస్తాయి, యెహోవా ప్రజల్లో తాము కూడా ఉన్నామనే నమ్మకాన్ని పెంచుతాయి.

ఆసియా మైనరు, అలాగే ఐరోపా అంతటా అపొస్తలుడైన పౌలుకు చాలామంది స్నేహితులు ఉండేవాళ్లు. ఆయన ఉత్తరాలు రాసేటప్పుడు ఎంతోమందికి పేరుపేరున శుభాకాంక్షలు తెలిపేవాడు. దాన్ని మనం రోమీయులు 16వ అధ్యాయంలో గమనించవచ్చు. ఆయన ఎంతోమంది తోటి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపాడు. ఉదాహరణకు ఫీబే అనే స్త్రీని “మన సోదరి” అని పిలుస్తూ, “ప్రభువు శిష్యురాలిగా ఆమెను పవిత్రులకు తగ్గట్టు చేర్చుకొని ఆమెకు కావాల్సిన సహాయం చేయాలని” సహోదరుల్ని కోరాడు. అంతేకాదు అకుల, ప్రిస్కిల్లకు శుభాకాంక్షలు తెలిపి “నేనే కాదు, అన్యులు ఉన్న సంఘాల వాళ్లంతా కృతజ్ఞతలు చెప్తున్నారు” అని రాశాడు. ఇంకా “నా ప్రియ సోదరుడు ఎపైనెటును,” “ప్రభువు సేవలో కష్టపడి పనిచేస్తున్న త్రుపైనా, త్రుఫోసా అనే సోదరీలను అడిగినట్టు చెప్పండి” అని కూడా పౌలు రాశాడు. వీళ్ల గురించి ఎక్కువ వివరాలు మనకు తెలీదు. ఏదేమైనా పౌలు తోటి సహోదరసహోదరీల్ని పలకరించడానికి ముందుండేవాడని అర్థమౌతుంది.—రోమా. 16:1-16.

పౌలు ప్రేమతో గుర్తుచేసుకున్నప్పుడు ఆ సహోదరసహోదరీలకు ఎంత ఆనందంగా అనిపించివుంటుందో ఒకసారి ఊహించండి. వాళ్లకు పౌలుపై అలాగే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మరింత ఎక్కువై ఉంటుంది. అంతేకాదు ప్రేమ నిండిన ఆ పలకరింపులు విన్నప్పుడు ఇతర క్రైస్తవులు కూడా ప్రోత్సాహాన్ని పొందివుంటారు. విశ్వాసంలో స్థిరంగా ఉండేలా అది వాళ్లను పురికొల్పి ఉంటుంది. అవును నిజమైన శ్రద్ధ, ఆప్యాయత నిండిన పలకరింపు స్నేహితుల్ని మరింత దగ్గర చేస్తుంది, దేవుని నమ్మకమైన సేవకుల్ని ఒక్కటి చేస్తుంది.

పౌలు రోముకు వెళ్తూ పొతియొలీ రేవుకు చేరుకున్నప్పుడు, ఆయన్ను కలవడానికి స్థానిక సహోదరులు వచ్చారు. అల్లంత దూరాన వాళ్లను చూడగానే పౌలు “దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ధైర్యం తెచ్చుకున్నాడు.” (అపొ. 28:13-15) కొన్నిసార్లు మనం చిరునవ్వు ద్వారా లేదా చేయి ఊపడం ద్వారా మాత్రమే పలకరించగల పరిస్థితుల్లో ఉండవచ్చు. అలాంటి చిన్న పలకరింపు సైతం కృంగుదల లేదా బాధతో ఉన్నవాళ్లలో ప్రోత్సాహాన్ని నింపగలదు.

హృదయాన్ని సిద్ధం చేస్తుంది

ఒకసారి శిష్యుడైన యాకోబు తోటి క్రైస్తవుల్ని గట్టిగా మందలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కొంతమంది క్రైస్తవులు లోకంతో స్నేహం చేస్తూ ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తున్నట్లు ఆయన గమనించాడు. (యాకో. 4:4) ఆ సందర్భంలో ఆయన తన ఉత్తరాన్ని ప్రారంభించిన విధానాన్ని గమనించండి:

“దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకు దాసుడైన యాకోబు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన 12 గోత్రాల వాళ్లకు శుభాకాంక్షలు చెప్తూ రాస్తున్న ఉత్తరం.” (యాకో. 1:1) ఆ శుభాకాంక్షల్ని చదవగానే, దేవుని ఎదుట తమకు కూడా అలాంటి స్థానమే ఉందని పాఠకులు గ్రహించివుంటారు. కాబట్టి ఆయనిచ్చే సలహాను స్వీకరించడం వాళ్లకు తేలిక అయ్యుంటుంది. వినయంగా చేసే పలకరింపు, గంభీరమైన విషయాల్ని మాట్లాడడానికి మార్గం తెరుస్తుంది.

మన పలకరింపు ఎంత చిన్నదైనా సరే దానిలో నిజాయితీ, నిజమైన ప్రేమ ఉన్నప్పుడే ప్రయోజనం కలుగుతుంది. ఒకవేళ ఇతరులు దాన్ని గుర్తించకపోయినా సరే మనం ఆ విధంగానే పలకరించాలి. (మత్త. 22:39) ఐర్లాండ్‌లోని ఒక సహోదరి కాసేపట్లో మీటింగ్‌ మొదలౌతుందనగా రాజ్యమందిరానికి వచ్చింది. గబగబ వస్తున్న ఆమెను ఒక సహోదరుడు చూసి, చిన్నగా నవ్వుతూ, “హలో! మిమ్మల్ని ఇక్కడ చూడడం ఆనందంగా ఉంది” అన్నాడు. ఆమె వెళ్లి కూర్చుంది.

కొన్ని వారాల తర్వాత ఆమె ఆ సహోదరుని దగ్గరకు వెళ్లి, కొంతకాలంగా తన ఇంట్లో పరిస్థితులు బాలేవని చెప్పింది. అంతేకాదు, “ఆరోజు సాయంత్రం నేనెంత బాధలో ఉన్నానంటే, మీటింగ్‌లో ఉన్నానేగానీ మనసంతా ఎక్కడో ఉంది. ఆరోజు మీటింగ్‌లో విన్న విషయాలేవీ నాకు గుర్తులేవు, ఒక్క మీ పలకరింపు తప్ప. మీరు పలకరించాక నిజంగా ఊరటగా అనిపించింది. థాంక్యూ” అని ఆ సహోదరునితో చెప్పింది.

ఆ చిన్న పలకరింపు వల్ల అంత మంచి జరిగిందని ఆ సహోదరునికి కూడా తెలీదు. “ఆ నాలుగు మాటలు ఎంత బలాన్ని ఇచ్చాయో ఆ సహోదరి నాకు చెప్పినప్పుడు, తనను పలకరించి మంచి పని చేశానని చాలా సంతోషంగా అనిపించింది. చాలా ప్రోత్సాహంగా కూడా అనిపించింది” అని ఆ సహోదరుడు చెప్పాడు.

“నీ ఆహారమును నీళ్లమీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును” అని సొలొమోను రాశాడు. (ప్రసం. 11:1) ఇతరుల్ని, మరిముఖ్యంగా తోటి క్రైస్తవుల్ని మనస్ఫూర్తిగా పలకరించడం వల్ల వాళ్లకు అలాగే మనకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. కాబట్టి పలకరింపుకు ఉన్న శక్తిని ఎన్నడూ తక్కువ అంచనా వేయకుండా ఉందాం.