కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాకు మహిమ తెచ్చేలా “మీ వెలుగు ప్రకాశింపనివ్వండి”

యెహోవాకు మహిమ తెచ్చేలా “మీ వెలుగు ప్రకాశింపనివ్వండి”

“మనుషుల ముందు మీ వెలుగు ప్రకాశింపనివ్వండి, అప్పుడు వాళ్లు . . . మీ తండ్రిని మహిమపరుస్తారు.”మత్త. 5:16.

పాటలు: 77, 59

1. మనం సంతోషంగా ఉండడానికి ఏ ప్రత్యేక కారణం ఉంది?

యెహోవాసాక్షులు తమ వెలుగును ప్రకాశింపజేస్తున్నారని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహాన్నిస్తుందో కదా! గత సంవత్సరం మనం కోటి కన్నా ఎక్కువ బైబిలు అధ్యయనాలు నిర్వహించాం. లక్షలమంది ఆసక్తిపరులు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరై, యెహోవా ప్రేమతో ఏర్పాటు చేసిన విమోచనా క్రయధనమనే బహుమానం గురించి తెలుసుకున్నారు.—1 యోహా. 4:9.

2, 3. (ఎ) మనం “లోకంలో జ్యోతుల్లా” ప్రకాశించడానికి ఏది అడ్డుకాదు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏమి చర్చిస్తాం?

2 ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల్లో వేర్వేరు భాషలు మాట్లాడేవాళ్లు ఉన్నారు. అయినప్పటికీ వాళ్లు ఐక్యంగా యెహోవాను ఆరాధిస్తున్నారు. (ప్రక. 7:9) మనం ఏ భాష మాట్లాడే వాళ్లమైనా, ఎక్కడ జీవిస్తున్నా “లోకంలో జ్యోతుల్లా” ప్రకాశించవచ్చు.—ఫిలి. 2:15.

3 మన పరిచర్య ద్వారా, ఐక్యత ద్వారా, అప్రమత్తత ద్వారా యెహోవాకు మహిమను తీసుకురావచ్చు. ఈ మూడు రంగాల్లో మన వెలుగును ఎలా ప్రకాశింపజేయవచ్చు?—మత్తయి 5:14-16 చదవండి.

యెహోవా గురించి ఇతరులకు చెప్పండి

4, 5. (ఎ) ప్రకటనాపని చేయడంతోపాటు ఇంకా ఏవిధంగా మన వెలుగును ప్రకాశింపజేయవచ్చు? (బి) దయగా ప్రవర్తించినప్పుడు ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయి? (ప్రారంభ చిత్రం చూడండి.)

4 మన వెలుగును ప్రకాశింపజేసే ఒక ముఖ్యమైన మార్గం ప్రకటించడం, శిష్యుల్ని చేయడం. (మత్త. 28:19, 20) చివరిరోజుల్లో ‘తన వెలుగును ప్రకాశింపజేసే అవకాశాన్ని’ ఉపయోగించుకోని వ్యక్తి ప్రభువుకు నమ్మకంగా ఉండలేడని 1925 కావలికోట జూన్‌ 1 సంచికలోని ‘చీకటిలో వెలుగు’ అనే ఆర్టికల్‌ వివరించింది. అంతేకాదు ఆ ఆర్టికల్‌లో ఇలా ఉంది, ‘ఆ వ్యక్తి భూవ్యాప్తంగా ఉన్న ప్రజలకు మంచివార్త చెప్పడం ద్వారా, వెలుగుకు సంబంధించిన మార్గాల్లో నడవడం ద్వారా తన వెలుగును ప్రకాశింపజేయాలి.’ అయితే పరిచర్యే కాదు మన ప్రవర్తన కూడా యెహోవాకు మహిమ తీసుకొస్తుంది. ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు చాలామంది మనల్ని గమనిస్తారు. వాళ్లను చిరునవ్వుతో పలకరించినప్పుడు మనమీద, మన దేవుని మీద వాళ్లకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

5 యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు, ‘మీరు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లోవాళ్లను పలకరించండి.’ (మత్త. 10:12) యేసు ప్రకటించిన ప్రాంతాల్లో ప్రజలు సాధారణంగా అపరిచితుల్ని ఇంట్లోకి ఆహ్వానించేవాళ్లు. కానీ నేడు మనం ప్రకటించే చాలా ప్రాంతాల్లో అలాంటి పద్ధతి లేదు. సాధారణంగా ఎవరైనా అపరిచితులు తమ గుమ్మం దగ్గరకు వస్తే ఇంటివాళ్లు కంగారుపడతారు లేదా చిరాకుపడతారు. కానీ మనం స్నేహపూర్వకంగా, దయగా ఉండడం ద్వారా వాళ్ల చిరాకును పోగొట్టవచ్చు. ముఖ్యంగా కార్ట్‌ దగ్గర నిలబడి ఉన్నప్పుడు చిరునవ్వుతో స్నేహపూర్వకంగా పలకరిస్తే ప్రజలు కార్ట్‌ దగ్గరకు రావడానికి, ప్రచురణ తీసుకోవడానికి ఇష్టపడడం మీరు గమనించే ఉంటారు. వాళ్లు బైబిలు విషయాలు మాట్లాడడానికి కూడా ఇష్టపడవచ్చు.

6. పరిచర్యలో తమ ఉత్సాహాన్ని కాపాడుకోవడానికి ఒక వృద్ధ జంట ఏమి చేసింది?

6 ఇంగ్లాండ్‌లోని ఒక వృద్ధ జంట, అనారోగ్యంవల్ల ఒకప్పటిలా ఇంటింటి పరిచర్య చేయలేకపోతోంది. దాంతో వాళ్లు తమ ఇంటి బయటే ఒక లిటరేచర్‌ టేబుల్‌ పెట్టేవాళ్లు. వాళ్ల ఇంటిదగ్గర ఒక స్కూల్‌ ఉండేది కాబట్టి పిల్లల్ని స్కూల్‌లో దింపడానికి వచ్చే తల్లిదండ్రులకు ఆసక్తి కలిగించే అంశాలున్న ప్రచురణలు పెట్టేవాళ్లు. కొంతమంది తల్లిదండ్రులు ఆ ప్రచురణలు తీసుకున్నారు. ఇంకొంతమంది, యువత అడిగే ప్రశ్నలు—మంచి సలహాలు (ఇంగ్లీషు) అనే పుస్తకం రెండు సంపుటిల్ని కూడా తీసుకున్నారు. అప్పుడప్పుడు ఒక పయినీరు సహోదరి ఆ వృద్ధ జంటకు తోడుగా టేబుల్‌ దగ్గర ఉండేది. ఆ సహోదరి స్నేహపూర్వకంగా ఉండడం, ఆ జంట ఇతరులకు నిజంగా సహాయం చేయాలనుకోవడం అక్కడికి వచ్చే తల్లిదండ్రులు గమనించారు. దాంతో ఒకతను బైబిలు అధ్యయనానికి కూడా ఒప్పుకున్నాడు.

7. మీ ప్రాంతంలో ఉన్న శరణార్థులకు ఎలా సహాయం చేయవచ్చు?

7 ఈ మధ్యకాలంలో, చాలామంది తమ సొంత దేశాన్ని వదిలి వేరే దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. మీ ప్రాంతంలో ఉన్న శరణార్థులు యెహోవా గురించి తెలుసుకునేలా ఎలా సహాయం చేయవచ్చు? ముందుగా, వాళ్ల భాషలో పలకరించడం నేర్చుకోండి. దాంతోపాటు, వాళ్లతో కొద్దిసేపు మాట్లాడగలిగేలా JW లాంగ్వేజ్‌ యాప్‌ సహాయంతో కొన్ని పదాల్ని నేర్చుకోండి. ఆ తర్వాత jw.orgలో వాళ్ల భాషలో ఉన్న వీడియోలు గానీ ప్రచురణలు గానీ చూపించండి.—ద్వితీ. 10:19.

8, 9. (ఎ) వారం మధ్యలో జరిగే మీటింగ్స్‌ నుండి ఎలాంటి ప్రయోజనం పొందుతున్నాం? (బి) పిల్లలు మీటింగ్స్‌లో చెప్పే వ్యాఖ్యానాలను మెరుగుపర్చుకునేలా తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు?

8 పరిచర్యను నైపుణ్యవంతంగా ఎలా చేయాలో యెహోవా మనకు నేర్పిస్తున్నాడు. ఉదాహరణకు పునర్దర్శనాలు ఎలా చేయాలో, బైబిలు అధ్యయనాలు ఎలా మొదలుపెట్టాలో మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌లో నేర్చుకుంటున్నాం. దానివల్ల పరిచర్యలో మరింత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం.

9 కొత్తవాళ్లు మన మీటింగ్స్‌కు వచ్చినప్పుడు చిన్నపిల్లలు చేసే వ్యాఖ్యానాలు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. కాబట్టి సొంతమాటల్లో వ్యాఖ్యానం ఎలా చెప్పాలో తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించవచ్చు. పిల్లలు తమ విశ్వాసాన్ని వ్యాఖ్యానాల్లో సూటిగా, హృదయపూర్వకంగా తెలియజేయడం విని కొంతమంది సత్యంలోకి వచ్చారు.—1 కొరిం. 14:25.

ఐక్యతను పెంపొందించండి

10. కుటుంబం ఐక్యంగా ఉండడానికి కుటుంబ ఆరాధన ఎలా సహాయం చేస్తుంది?

10 మీ కుటుంబంలో ఐక్యతను, సమాధానాన్ని పెంపొందించడానికి కృషిచేసినప్పుడు యెహోవాకు మహిమ తీసుకొస్తారు. ఒకవేళ మీరు ఒక తండ్రి అయితే, క్రమంగా కుటుంబ ఆరాధన చేయండి. చాలామంది కుటుంబ ఆరాధనలో JW బ్రాడ్‌కాస్టింగ్‌ చూసి, వాటిని తమ జీవితంలో ఎలా పాటించవచ్చో చర్చించుకుంటారు. చిన్నపిల్లలకు కావాల్సిన నిర్దేశాలు, టీనేజీ పిల్లలకు కావాల్సిన నిర్దేశాలు వేర్వేరుగా ఉంటాయని గుర్తుంచుకోండి. కాబట్టి కుటుంబ ఆరాధన నుండి మీ కుటుంబంలోని ప్రతీఒక్కరు ప్రయోజనం పొందేందుకు చేయగలిగినదంతా చేయండి.—కీర్త. 148:12, 13.

వృద్ధులతో సమయం గడపడం వల్ల ప్రోత్సాహం పొందుతాం (11వ పేరా చూడండి)

11-13. సంఘం మరింత ఐక్యంగా ఉండడానికి మనమెలా సహాయం చేయవచ్చు?

11 ఒకవేళ మీరు యౌవనులైతే, సంఘంలో ఐక్యతను ఎలా పెంపొందించవచ్చు? ఇతరులు తమ వెలుగును ప్రకాశించేందుకు మీరెలా సహాయపడవచ్చు? దానికి ఒక మార్గమేమిటంటే, వృద్ధ సహోదరసహోదరీలతో స్నేహం చేయడం. ఎన్నో సంవత్సరాలుగా యెహోవా సేవలో కొనసాగడానికి వాళ్లకేది సహాయం చేసిందో అడగండి. వాళ్ల నుండి మీరు ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంటారు. ఒకరి నుండి ఒకరు ప్రోత్సాహం కూడా పొందుతారు. అంతేకాదు మనం యౌవనులమైనా, వృద్ధులమైనా రాజ్యమందిరానికి కొత్తగా వచ్చిన వాళ్లను స్నేహపూర్వకంగా ఆహ్వానించవచ్చు. మనం వాళ్లను చిరునవ్వుతో పలకరించవచ్చు, కూర్చోవడానికి ఒక కుర్చీ చూపించవచ్చు, ఇతరులకు పరిచయం చేయవచ్చు. దానితోపాటు వాళ్లలో ఉన్న కంగారు పోగొట్టడానికి ప్రయత్నించాలి.

12 క్షేత్రసేవా కూటం నిర్వహించే నియామకం మీకు అప్పగించినట్లయితే, వృద్ధులు పరిచర్యలో పాల్గొనేలా మీరు వాళ్లకు సహాయం చేయవచ్చు. వాళ్లకు అనుకూలంగా ఉండే ప్రాంతం ఇవ్వండి. వాళ్లతో పనిచేయడానికి ఒక యౌవన సహోదరుణ్ణి లేదా సహోదరిని నియమించండి. వృద్ధ సహోదరసహోదరీలు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఒకప్పుడు చేసినంత పరిచర్య ఇప్పుడు చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు. కానీ వాళ్లపట్ల మీకు శ్రద్ధ ఉందనీ, వాళ్ల పరిస్థితిని మీరు అర్థంచేసుకున్నారనీ అనిపించినప్పుడు వాళ్లు సంతోషిస్తారు. వాళ్ల వయసు ఎంతైనా, ఎంతకాలం నుండి సత్యంలో ఉన్నా మీరు చూపించే దయను బట్టి వాళ్లు ఉత్సాహంగా పరిచర్య చేయగలుగుతారు.—లేవీ. 19:32.

13 ఇశ్రాయేలీయులు ఐక్యంగా యెహోవాను ఆరాధిస్తూ సంతోషించారు. అందుకే కీర్తనకర్త ఇలా రాశాడు, “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” (కీర్తన 133:1, 2 చదవండి.) కీర్తనకర్త ఐక్యతను అభిషేక తైలంతో పోల్చాడు. తైలం శరీరానికి సేదదీర్పును ఇస్తుంది, మంచి సువాసనను వెదజల్లుతుంది. అదేవిధంగా, మనం కూడా మన సహోదరసహోదరీలతో ప్రశాంతంగా, దయగా వ్యవహరించడం ద్వారా వాళ్లకు సేదదీర్పును ఇస్తాం. దీనివల్ల సంఘం మరింత ఐక్యంగా ఉంటుంది. మరి మీ సంఘంలోని సహోదరసహోదరీల గురించి మరింత బాగా తెలుసుకోగలరా?—2 కొరిం. 6:11-13.

14. మీరు ఉంటున్న ప్రాంతంలో మీ వెలుగును ఎలా ప్రకాశింపజేయవచ్చు?

14 మీరు ఎక్కడ ఉన్నా మీ వెలుగును ప్రకాశింపజేయవచ్చు. మీరు చూపించే దయను బట్టి మీ ఇరుగుపొరుగువాళ్లకు యెహోవా గురించి తెలుసుకోవాలనే కోరిక కలగవచ్చు. కాబట్టి ఇలా ప్రశ్నించుకోండి: ‘నా గురించి చుట్టుపక్కలవాళ్లు ఏమనుకుంటున్నారు? మా ఇల్లును అలాగే చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకుంటానా? నేను ఇరుగుపొరుగు వాళ్లకు సహాయం చేస్తానా?’ అంతేకాదు దయ చూపించడం వల్ల బంధువులు, చుట్టుపక్కలవాళ్లు, తోటి ఉద్యోగులు, విద్యార్థులు ఎలా స్పందించారో సహోదరసహోదరీలను అడగండి.—ఎఫె. 5:9.

అప్రమత్తంగా ఉండండి

15. మనమెందుకు అప్రమత్తంగా ఉండాలి?

15 మన వెలుగును ప్రకాశింపజేయాలంటే, మనం జీవిస్తున్న కాలం ఎలాంటిదో గుర్తించాలి. యేసు తన శిష్యులతో “అప్రమత్తంగా ఉండండి” అని చాలాసార్లు చెప్పాడు. (మత్త. 24:42; 25:13; 26:41) ఒకవేళ “మహాశ్రమ” చాలా దూరంలో ఉందని మనం అనుకుంటే, ప్రకటించడానికి దొరికే ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో అప్రమత్తంగా ఉండం. (మత్త. 24:21) అప్పుడు మన వెలుగు కాంతివంతంగా ప్రకాశించే బదులు క్రమక్రమంగా తగ్గిపోవచ్చు, పూర్తిగా కనుమరుగైపోవచ్చు కూడా.

16, 17. అప్రమత్తంగా ఉండడానికి మీరేమి చేయవచ్చు?

16 ముందెప్పటికన్నా ఇప్పుడు మనం మరింతెక్కువ అప్రమత్తంగా ఉండాలి. లోకంలోని పరిస్థితులు మరింత ఘోరంగా తయారౌతున్నాయి. కానీ యెహోవా నిర్ణయించిన సమయంలోనే అంతం తప్పకుండా వస్తుందని మనకు తెలుసు. (మత్త. 24:42-44) ఈలోగా, ఓపిగ్గా ఉంటూ భవిష్యత్తుపై మనసుపెట్టాలి. ప్రతీరోజు బైబిలు చదవండి, యెహోవాకు ప్రార్థించడం ఎన్నడూ ఆపకండి. (1 పేతు. 4:7) ఎన్నో సంవత్సరాలుగా యెహోవా సేవచేస్తున్న సహోదరసహోదరీల నుండి నేర్చుకోండి. ఉదాహరణకు, 2012 కావలికోట ఏప్రిల్‌ 15 సంచికలోని 18-21 పేజీల్లో ఉన్న “‘ఒక యూదుని చెంగు పట్టుకొని’ డెబ్భై ఏళ్లు గడిపాను” వంటి జీవిత అనుభవాలను చదవండి.

17 యెహోవా సేవలో బిజీగా ఉండండి. దయతో మంచిపనులు చేయండి, సహోదరసహోదరీలతో సమయం గడపండి. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు, సమయం చాలా త్వరగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది. (ఎఫె. 5:16) గత వంద సంవత్సరాల్లో యెహోవా సేవకులు ఎన్నో సాధించారు. కానీ మనం ముందెప్పటికన్నా ఇప్పుడు మరింత బిజీగా ఉన్నాం. యెహోవా సేవలో జరిగే పని మనం ఎన్నడూ ఊహించనంతగా పెరిగింది. మన వెలుగు చాలా కాంతివంతంగా ప్రకాశిస్తుంది!

దేవుని వాక్యం నుండి ప్రయోజనం పొందడానికి కాపరి సందర్శనాలు సహాయం చేస్తాయి (18, 19 పేరాలు చూడండి)

18, 19. యెహోవా సేవలో ఉత్సాహంగా కొనసాగడానికి పెద్దలు ఎలా సహాయం చేస్తారు? ఒక ఉదాహరణ చెప్పండి.

18 మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నప్పటికీ తన సేవచేయడానికి యెహోవా అనుమతిస్తున్నాడు. అంతేకాదు మనకు సహాయం చేయడానికి “మనుషుల్లో వరాలు” అయిన సంఘపెద్దల్ని నియమించాడు. (ఎఫెసీయులు 4:8, 11, 12 చదవండి.) కాబట్టి సంఘపెద్దలు మీ దగ్గరకు వచ్చి కాపరి సందర్శనం చేస్తున్నప్పుడు, ఆ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుని వాళ్ల జ్ఞానం నుండి, వాళ్లిచ్చే సలహా నుండి నేర్చుకోండి.

19 ఉదాహరణకు, ఇంగ్లాండ్‌లో ఉంటున్న ఒక జంటకు వాళ్ల వివాహ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. వాళ్లు సహాయం కోసం ఇద్దరు సంఘపెద్దల దగ్గరికి వెళ్లారు. తన భర్త కుటుంబాన్ని ఆధ్యాత్మిక విషయాల్లో ముందుండి నడిపించట్లేదని భార్య చెప్పింది. అయితే భర్త తానొక మంచి బోధకుణ్ణి కానని, క్రమంగా కుటుంబ ఆరాధన చేయట్లేదని ఒప్పుకున్నాడు. యేసు ఆదర్శం గురించి ఆలోచించమని పెద్దలు ఆ జంటకు చెప్పారు. యేసు తన శిష్యుల పట్ల శ్రద్ధ చూపించినట్లే భర్త కూడా కుటుంబం పట్ల శ్రద్ధ చూపించాలని పెద్దలు ఆయన్ను ప్రోత్సహించారు. భర్త విషయంలో ఓపిక చూపించమని భార్యను ప్రోత్సహించారు. ఆ జంట తమ ఇద్దరు పిల్లలతో కుటుంబ ఆరాధన చేసుకోవడానికి కావాల్సిన సలహాలు కూడా ఇచ్చారు. (ఎఫె. 5:21-29) మంచి కుటుంబ పెద్దగా తయారవ్వడానికి ఆ భర్త చాలా కష్టపడ్డాడు. ఆ విషయంలో పట్టుదలగా కృషిచేయమని, యెహోవా ఇచ్చే పవిత్రశక్తి మీద ఆధారపడమని పెద్దలు ఆయన్ను ప్రోత్సహించారు. వాళ్లు చూపించిన ప్రేమ, దయ ఆ కుటుంబానికి ఎంతో సహాయపడ్డాయి.

20. మీ వెలుగును ప్రకాశింపజేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి?

20 “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు [సంతోషవంతులు,NW].” (కీర్త. 128:1) మీ వెలుగును ప్రకాశింపజేసినప్పుడు సంతోషంగా ఉంటారు. కాబట్టి యెహోవా గురించి ఇతరులకు నేర్పించండి, మీ కుటుంబం, సంఘం ఐక్యంగా ఉండడానికి, అప్రమత్తంగా ఉండడానికి మీరు చేయగలిగినదంతా చేయండి. ఇతరులు మీ చక్కని ఆదర్శాన్ని గమనిస్తారు, మన పరలోక తండ్రైన యెహోవాను మహిమపర్చాలని కోరుకుంటారు.—మత్త. 5:16.