కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా, యేసులా మనందరం ఐక్యంగా ఉందాం

యెహోవా, యేసులా మనందరం ఐక్యంగా ఉందాం

“తండ్రీ, నువ్వు నాతో ఐక్యంగా ఉన్నట్లు, నేను నీతో ఐక్యంగా ఉన్నట్లు వాళ్లు కూడా మనతో ఐక్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.”యోహా. 17:20, 21.

పాటలు: 24, 99

1, 2. (ఎ) తన అపొస్తలులతో కలిసి చివరిసారి ప్రార్థించినప్పుడు యేసు ఏ కోరికను తెలియజేశాడు? (బి) యేసు ఐక్యత గురించి ఎందుకు ఆలోచించాడు?

యేసు తన అపొస్తలులతో కలిసి చివరిసారి భోజనం చేసినప్పుడు ఐక్యత గురించి ఎంతో ఆలోచించాడు. ఆయన, తన తండ్రితో ఐక్యంగా ఉన్నట్లే శిష్యులందరూ కూడా ఐక్యంగా ఉండాలనే తన కోరికను వాళ్లతో కలిసి చేసిన ప్రార్థనలో యేసు తెలియజేశాడు. (యోహాను 17:20, 21 చదవండి.) యేసును భూమ్మీదకు పంపించింది యెహోవాయేనని అందరికీ స్పష్టంగా తెలియాలంటే శిష్యులు ఐక్యంగా ఉండాలి. వాళ్లు చూపించుకునే ప్రేమను బట్టి యేసు నిజ శిష్యులు ఎవరో ప్రజలు గుర్తించగలుగుతారు. అంతేకాదు ఆ ప్రేమే శిష్యుల్ని మరింత ఐక్యం చేస్తుంది.—యోహా. 13:34, 35.

2 ఆ రాత్రి ఐక్యత గురించి యేసు చాలాసేపు మాట్లాడాడు ఎందుకంటే తన అపొస్తలుల మధ్య కొంతమేరకు ఐక్యత లోపించిందని ఆయన గుర్తించాడు. ఉదాహరణకు, “తమలో ఎవరు అందరికన్నా గొప్ప అనే విషయం గురించి” వాళ్లు మళ్లీ గొడవపడ్డారు. (లూకా 22:24-27; మార్కు 9:33, 34) మరో సందర్భంలో యాకోబు, యోహానులు యేసు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యంలో తమకు ముఖ్యమైన స్థానాలు అంటే ఆయన పక్కన కూర్చునే స్థానాలు కావాలని అడిగారు.—మార్కు 10:35-40.

3. యేసు శిష్యులు ఐక్యంగా లేకపోవడానికి కారణమేమిటి? ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

3 పెద్ద హోదా, ఎక్కువ అధికారం కావాలనే కోరిక యేసు శిష్యుల్లో ఉన్నప్పటికీ, వాళ్ల మధ్య ఐక్యత లేకపోవడానికి అదొక్కటే కారణం కాకపోవచ్చు. యేసు కాలంలోని ప్రజలు ద్వేషం, వివక్షవల్ల ఐక్యంగా ఉండేవాళ్లు కాదు. అలాంటి ప్రతికూల భావాల్ని యేసు శిష్యులు అధిగమించాల్సి వచ్చింది. ఈ ఆర్టికల్‌లో మనం ఈ ప్రశ్నల్ని పరిశీలిస్తాం: వివక్షతో యేసు ఎలా వ్యవహరించాడు? తన శిష్యులు ఇతరులపట్ల వివక్ష చూపించకుండా, ఐక్యంగా ఉండేలా యేసు ఎలా సహాయం చేశాడు? మనం ఐక్యంగా ఉండడానికి యేసు ఆదర్శం, ఆయన బోధలు ఎలా సహాయం చేస్తాయి?

వివక్షకు గురైన యేసు, ఆయన అనుచరులు

4. యేసు ఎలాంటి వివక్షను ఎదుర్కొన్నాడు?

4 యేసు కూడా వివక్షను ఎదుర్కొన్నాడు. మెస్సీయను కొనుగొన్నానని ఫిలిప్పు చెప్పినప్పుడు నతనయేలు ఇలా అన్నాడు, “నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా?” (యోహా. 1:46) మీకా 5:2⁠లో ఉన్న ప్రవచనం ప్రకారం మెస్సీయ బేత్లెహేములో పుడతాడని బహుశా నతనయేలుకు తెలిసేవుంటుంది. మెస్సీయ పుట్టడానికి నజరేతులాంటి చిన్న ఊరు సరైనది కాదని నతనయేలు అనుకొనివుంటాడు. అంతేకాదు యేసు గలిలయుడు కావడంవల్ల ప్రముఖులైన యూదులు కూడా ఆయన్ని చిన్నచూపు చూశారు. (యోహా. 7:52) గలిలయ ప్రజలందరూ తక్కువవాళ్లని చాలామంది యూదులు భావించేవాళ్లు. ఇంకొంతమంది యూదులైతే, యేసును సమరయుడని పిలుస్తూ ఆయన్ని అవమానించడానికి ప్రయత్నించారు. (యోహా. 8:48) నిజానికి సమరయుల అలాగే యూదుల జాతి, మతం వేర్వేరు. అందుకే యూదులు, గలిలయులు సమరయుల్ని అంతగా గౌరవించేవాళ్లు కాదు, వాళ్లను దూరం పెట్టేవాళ్లు.—యోహా. 4:9.

5. యేసు శిష్యులు ఎలాంటి వివక్షను ఎదుర్కొన్నారు?

5 యూదా మతనాయకులు యేసు అనుచరుల్ని కూడా గౌరవించేవాళ్లు కాదు. పరిసయ్యులు వాళ్లను “శపించబడిన వాళ్లు” అని పిలిచేవాళ్లు. (యోహా. 7:47-49) అంతేకాదు యూదామత పాఠశాలలో చదువుకోనివాళ్లను, తమ ఆచారాల్ని పాటించనివాళ్లను పనికిరానివాళ్లుగా, సామాన్యులుగా చూసేవాళ్లు. (అపొ. 4:13, అధస్సూచి) యేసు కాలంలోని ప్రజలు తమ మతాన్ని, సామాజిక హోదాను, జాతిని చూసుకుని ఎంతో గర్వించేవాళ్లు దానివల్ల యేసు, ఆయన శిష్యులు వివక్షను ఎదుర్కొన్నారు. అది శిష్యుల మీద ప్రతికూల ప్రభావం చూపించింది. కానీ, వాళ్లు ఐక్యంగా ఉండాలంటే తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.

6. వివక్ష ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఉదాహరణలు చెప్పండి.

6 నేడున్న లోకం వివక్షతో నిండిపోయింది. ప్రజలు మనపట్ల వివక్ష చూపిస్తుండవచ్చు లేదా మనం ఇతరులపట్ల కొంతమేరకు వివక్ష చూపిస్తుండవచ్చు. ఆస్ట్రేలియాలో ఉంటున్న ఒక పయినీరు సహోదరి ఇలా చెప్తుంది: “తరతరాలుగా ఆస్ట్రేలియాలోని ఆదిమవాసులకు జరుగుతున్న అన్యాయం గురించే ఆలోచించడంవల్ల తెల్లజాతి ప్రజలపై నాకున్న ద్వేషం మరింత పెరిగింది.” ఆమె స్వయంగా ఎదుర్కొన్న వివక్షనుబట్టి కూడా ద్వేషం మరింత ఎక్కువైంది. కెనడాలో ఉంటున్న ఒక సహోదరుడు ఒకప్పుడు భాషపట్ల తనకున్న వివక్ష గురించి చెప్తూ ఇలా ఒప్పుకున్నాడు, “ఫ్రెంచ్‌ భాష మాట్లాడే ప్రజలే గొప్పవాళ్లని నేను అనుకునేవాణ్ణి. అందుకే ఇంగ్లీషు మాట్లాడే ప్రజలపై ద్వేషం పెంచుకున్నాను.”

7. వివక్షతో యేసు ఎలా వ్యవహరించాడు?

7 యేసు కాలంలోలాగే, నేడు కూడా వివక్ష ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయింది, దాన్ని తీసేసుకోవడం కష్టంగా ఉంది. మరి వివక్షతో యేసు ఎలా వ్యవహరించాడు? మొదటిదిగా, ఆయన ఎన్నడూ వివక్ష చూపించలేదు, బదులుగా అందర్నీ సమానంగా చూశాడు. పేదవాళ్లకు-ధనవంతులకు, పరిసయ్యులకు-సమరయులకు, ఆఖరికి పన్ను వసూలు చేసేవాళ్లకు, పాపులకు కూడా ఆయన ప్రకటించాడు. రెండవదిగా, ఇతరుల్ని అనుమానించకూడదని లేదా వాళ్లపట్ల వివక్ష చూపించకూడదని యేసు తన బోధల ద్వారా, ఆదర్శం ద్వారా శిష్యులకు నేర్పించాడు.

ప్రేమతో, వినయంతో వివక్షను తీసేసుకోండి

8. మనం ఐక్యంగా ఉండడానికి సహాయం చేసే ఒక ప్రాముఖ్యమైన సూత్రం ఏమిటి? వివరించండి.

8 మనం ఐక్యంగా ఉండడానికి సహాయం చేసే ఒక ప్రాముఖ్యమైన సూత్రాన్ని యేసు నేర్పించాడు. తన శిష్యులకు ఆయనిలా చెప్పాడు, “మీరందరూ సోదరులు.” (మత్తయి 23:8, 9 చదవండి.) మనందరం ఆదాము పిల్లలం కాబట్టి ఒకవిధంగా మనం సహోదరులమే. (అపొ. 17:26) అంతేకాదు, శిష్యులు యెహోవాను తమ పరలోక తండ్రిగా అంగీకరించారు కాబట్టి వాళ్లు సహోదరసహోదరీలు అవుతారని యేసు వివరించాడు. (మత్త. 12:50) వాళ్లందరూ దేవుని కుటుంబంలో సభ్యులయ్యారు అలాగే ప్రేమ, విశ్వాసం చేత ఐక్యమయ్యారు. అందుకే, అపొస్తలులు సంఘాలకు రాసిన ఉత్తరాల్లో ఇతర క్రైస్తవుల్ని సహోదరసహోదరీలు అని పిలిచారు.—రోమా. 1:13; 1 పేతు. 2:17; 1 యోహా. 3:13. *

9, 10. (ఎ) యూదులు తమ జాతిని బట్టి ఎందుకు గర్వం చూపించాల్సిన అవసరంలేదు? (బి) వేరే జాతికి చెందిన ప్రజల్ని చిన్నచూపు చూడడం తప్పని యేసు ఎలా నేర్పించాడు? (1వ ప్రారంభ చిత్రం చూడండి.)

9 ఒకరినొకరు సహోదరసహోదరీల్లా చూసుకోవాలని యేసు తన శిష్యులకు చెప్పిన తర్వాత, వాళ్లు వినయంగా ఉండాలని నొక్కి చెప్పాడు. (మత్తయి 23:11, 12 చదవండి.) మనం ఇంతకుముందు నేర్చుకున్నట్లు, గర్వంవల్ల కొన్నిసార్లు అపొస్తలుల మధ్య ఐక్యత దెబ్బతింది. పైగా యేసు కాలంలో ప్రజలు తమ జాతిని బట్టి చాలా గర్వించేవాళ్లు. చాలామంది యూదులు, తాము అబ్రాహాము పిల్లలం కాబట్టి ఇతరుల కన్నా గొప్పవాళ్లమని నమ్మేవాళ్లు. కానీ బాప్తిస్మమిచ్చు యోహాను వాళ్లతో ఇలా అన్నాడు, “దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడు.”—లూకా 3:8.

10 తమ జాతిని బట్టి గర్వించడం తప్పని యేసు నేర్పించాడు. ఏవిధంగా? ఒక శాస్త్రి యేసు దగ్గరకు వచ్చి “ఇంతకీ నా సాటిమనిషి ఎవరు?” అని అడిగాడు. దానికి జవాబుగా యేసు ఒక కథ చెప్పాడు. దొంగలు ఒక యూదుణ్ణి కొట్టి, రోడ్డు మీద పడేశారు. ఆ దారిలో వెళ్లిన కొంతమంది యూదులు అతన్ని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. కానీ ఒక సమరయుడు మాత్రం ఆ యూదుని మీద జాలిపడి అతనికి సహాయం చేశాడు. యేసు ఆ కథను ముగిస్తూ ఆ సమరయునిలా ఉండాలని శాస్త్రికి చెప్పాడు. (లూకా 10:25-37) తమ పొరుగువాణ్ణి ప్రేమించడమంటే ఏమిటో ఒక సమరయుడు యూదులకు నేర్పించగలడని యేసు తెలియజేశాడు.

11. శిష్యులు ఎందుకు వివక్ష చూపించకూడదు? దాన్ని అర్థంచేసుకోవడానికి యేసు ఎలా సహాయం చేశాడు?

11 “యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా” ప్రకటించమని యేసు పరలోకానికి వెళ్లక ముందు తన శిష్యులకు చెప్పాడు. (అపొ. 1:8) యేసు చెప్పిన ఆ పని చేయాలంటే, ఆయన శిష్యులు గర్వానికి, వివక్షకు దూరంగా ఉండాలి. అన్ని జాతుల ప్రజలకు ప్రకటించేలా శిష్యుల్ని సిద్ధం చేయడానికి, యేసు పరదేశుల్లో ఉండే మంచి లక్షణాల గురించి తరచూ మాట్లాడేవాడు. ఉదాహరణకు, అసాధారణ విశ్వాసాన్ని చూపించిన అన్యుడైన ఒక సైనికాధికారిని యేసు మెచ్చుకున్నాడు. (మత్త. 8:5-10) సీదోను దేశంలోని సారెపతులో ఉన్న విధవరాలు, కుష్ఠ రోగంతో బాధపడిన సిరియా దేశస్థుడైన నయమాను వంటి విదేశీయులకు యెహోవా ఎలా సహాయం చేశాడో యేసు తన సొంత ఊరు అయిన నజరేతులో వివరించాడు. (లూకా 4:25-27) అంతేకాదు యేసు సమరయ స్త్రీకి ప్రకటించాడు, సమరయ పట్టణస్థుల ఆసక్తి చూసి అక్కడే రెండు రోజులు ఉండిపోయాడు.—యోహా. 4:21-24, 40.

మొదటి శతాబ్దపు క్రైస్తవులు వివక్షతో పోరాడాల్సి వచ్చింది

12, 13. (ఎ) ఒక సమరయ స్త్రీకి యేసు ప్రకటించినప్పుడు శిష్యులు ఎలా భావించారు? (2వ ప్రారంభ చిత్రం చూడండి.) (బి) యేసు నేర్పించాలని అనుకున్న పాఠాన్ని యాకోబు, యోహానులు పూర్తిగా అర్థంచేసుకోలేదని ఎలా చెప్పవచ్చు?

12 తమలో ఉన్న వివక్షను తీసేసుకోవడం అపొస్తలులకు తేలికైన విషయం కాదు. యేసు ఒక సమరయ స్త్రీకి బోధించడం చూసి అపొస్తలులు ఆశ్చర్యపోయారు. (యోహా. 4:9, 27) ఎందుకు? యూదా మతనాయకులు నలుగురిలో ఉన్నప్పుడు స్త్రీలతో మాట్లాడరు, అందులోనూ చెడ్డపేరున్న ఒక సమరయ స్త్రీతో అస్సలు మాట్లాడరు. అపొస్తలులు యేసును భోజనం చేయమని చెప్పారు. కానీ ఆయన ఆ స్త్రీతో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ ఎంత ఆనందాన్ని పొందాడంటే భోజనం చేయడాన్ని అంత ప్రాముఖ్యంగా ఎంచలేదు. యేసు ప్రకటనాపని చేయాలని యెహోవా కోరుకున్నాడు, తన తండ్రి ఇష్టాన్ని చేయడంలో భాగంగా ఒక సమరయ స్త్రీకి ప్రకటించడం కూడా ఆయనకు ఆహారంగా అనిపించింది.—యోహా. 4:31-34.

13 యాకోబు, యోహాను ఆ ప్రాముఖ్యమైన పాఠాన్ని అర్థంచేసుకోలేదు. యేసుతోపాటు శిష్యులు సమరయ గుండా వెళ్తున్నప్పుడు, రాత్రి ఉండడానికి సమరయ గ్రామంలో ఒక చోటు కోసం వెతికారు. కానీ సమరయులు వాళ్లను ఉండడానికి అనుమతించలేదు. అప్పుడు యాకోబు, యోహానులు కోపంతో మండిపడి ఆ గ్రామం అంతటినీ నాశనం చేయడానికి ఆకాశం నుండి అగ్నిని రప్పించమంటావా అని యేసును అడిగారు. కానీ ఆ ఆలోచన తప్పని ఆయన వాళ్లను ఖండించాడు. (లూకా 9:51-56) సమరయలో జరిగినట్టు బహుశా గలిలయలో జరిగివుంటే యాకోబు, యోహానులకు అంత కోపం వచ్చేది కాదేమో. వివక్ష వల్లే వాళ్లకు అలా కోపం వచ్చివుంటుంది. కొంతకాలం తర్వాత, యోహాను సమరయులకు ప్రకటించినప్పుడు చాలామంది విన్నారు. అప్పుడు, ఇదివరకు ఆయన ప్రవర్తించిన విధానానికి బహుశా సిగ్గుపడివుంటాడు.—అపొ. 8:14, 25.

14. సంఘంలో వివక్షను అపొస్తలులు ఎలా పరిష్కరించారు?

14 క్రీ.శ. 33న పెంతెకొస్తు పండగ జరిగి ఎంతోకాలం అవ్వకముందే సంఘంలో వివక్ష చూపిస్తున్నారనే సమస్య తలెత్తింది. సహోదరులు అవసరంలో ఉన్న విధవరాళ్లకు ఆహారం పంచిపెడుతున్నప్పుడు, గ్రీకు భాష మాట్లాడే విధవరాళ్లను నిర్లక్ష్యం చేశారు. (అపొ. 6:1) బహుశా భాషపట్ల ఉన్న వివక్షవల్ల అలా జరిగివుండవచ్చు. అయితే, అపొస్తలులు ఆ సమస్యను వెంటనే పరిష్కరించారు. వాళ్లు అర్హులైన ఏడుగురు సహోదరులను ఎంపిక చేసి ఆహారాన్ని న్యాయంగా పంచిపెట్టే బాధ్యతను అప్పగించారు. ఆ సహోదరులందరికీ గ్రీకు పేర్లు ఉండడం చూసి నిర్లక్ష్యానికి గురైన విధవరాళ్లు ఊరట పొందివుంటారు.

15. పక్షపాతం లేకుండా ప్రవర్తించడం పేతురు ఎలా నేర్చుకున్నాడు? (3వ ప్రారంభ చిత్రం చూడండి.)

15 క్రీ.శ. 36లో యేసు శిష్యులు అన్నిజాతుల ప్రజలకు ప్రకటించడం మొదలుపెట్టారు. దానికన్నా ముందు అపొస్తలుడైన పేతురు కేవలం యూదులతోనే సమయం గడుపుతుండేవాడు. కానీ క్రైస్తవులు పక్షపాతం చూపించకూడదని దేవుడు పేతురుకు స్పష్టం చేశాడు. అప్పుడు పేతురు రోమా సైనికుడైన కొర్నేలికి ప్రకటించాడు. (అపొస్తలుల కార్యాలు 10:28, 34, 35 చదవండి.) దాని తర్వాత క్రైస్తవులుగా మారిన అన్యులతో సమయం గడిపాడు, కలిసి భోజనం చేశాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, అంతియొకయలో క్రైస్తవులుగా మారిన అన్యులతో కలిసి భోజనం చేయడం ఆపేశాడు. (గల. 2:11-14) ఆ విషయంలో పౌలు సరిదిద్దినప్పుడు పేతురు దాన్ని స్వీకరించాడు. అది మనకెలా తెలుసు? ఆసియా మైనరులోని యూదులకు, క్రైస్తవులుగా మారిన అన్యులకు పేతురు తన మొదటి ఉత్తరాన్ని రాసినప్పుడు, మన సహోదరులందర్నీ ప్రేమించడం చాలా ప్రాముఖ్యమని చెప్పాడు.—1 పేతు. 1:1; 2:17.

16. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలాంటి పేరు సంపాదించుకున్నారు?

16 అవును, యేసు ఉంచిన ఆదర్శాన్ని బట్టి, అపొస్తలులు “అన్నిరకాల ప్రజల్ని” ప్రేమించడం నేర్చుకున్నారు. (యోహా. 12:32; 1 తిమో. 4:10) దానికి కొంత సమయం పట్టినప్పటికీ, ప్రజల్ని చూసే విధానాన్ని వాళ్లు మార్చుకున్నారు. నిజ క్రైస్తవులు ఒకరిపట్ల ఒకరు ప్రేమ చూపించుకుంటారనే పేరు సంపాదించుకున్నారు. సుమారు 200వ సంవత్సరంలో, టెర్టూలియన్‌ అనే రచయిత క్రైస్తవుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో రాశాడు. ఆయనిలా రాశాడు, “వాళ్లు ఒకరినొకరు ప్రేమించుకుంటారు,” “ఒకరి కోసం ఒకరు ప్రాణాల్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు.” నిజమే, క్రైస్తవులు “కొత్త వ్యక్తిత్వాన్ని” అలవర్చుకుంటారు కాబట్టి, దేవుడు చూసినట్టు వాళ్లు అందర్నీ సమానంగా చూడడం నేర్చుకున్నారు.—కొలొ. 3:10, 11.

17. వివక్షకు సంబంధించిన ఎలాంటి భావాలనైనా మనమెలా తీసేసుకోవచ్చు? ఉదాహరణలు చెప్పండి.

17 నేడు మనకు కూడా వివక్షను తీసేసుకోవడానికి సమయం పట్టవచ్చు. ఫ్రాన్స్‌లో ఉన్న ఒక సహోదరి ఇలా వివరించింది, “ప్రేమ అంటే ఏమిటో, పంచుకోవడం అంటే ఏమిటో, అన్నిరకాల ప్రజల్ని ప్రేమించడం అంటే ఏమిటో యెహోవా నాకు నేర్పించాడు. అయినప్పటికీ, ఇతరులపట్ల ఉన్న వివక్ష తీసేసుకోవడం నేనింకా నేర్చుకుంటున్నాను, అది ప్రతీసారి సులభం కాదు. అందుకే దానిగురించి ప్రార్థిస్తూనే ఉంటాను.” స్పెయిన్‌లోని ఒక సహోదరి ఒకానొక గుంపుపట్ల కలిగే ప్రతికూల భావాలతో ఇప్పటికీ కొన్నిసార్లు పోరాడాల్సి వస్తుందని వివరిస్తుంది. ఆమె ఇలా చెప్తుంది, “నేను చాలావరకు అలాంటి భావాల్ని అధిగమించగలుగుతాను కానీ నేను వాటితో పోరాడుతూనే ఉండాలని నాకు తెలుసు. యెహోవా సహాయంవల్ల నేనిప్పుడు ఒక ఐక్య కుటుంబంలో సభ్యురాలిగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను.” మనందరం మన భావాల్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. వివక్షకు సంబంధించిన ఎలాంటి భావాలనైనా మనమింకా తీసేసుకోవాల్సి ఉందా?

ప్రేమ పెరిగినప్పుడు, వివక్ష ఉండదు

18, 19. (ఎ) ప్రతిఒక్కరినీ అంగీకరించడానికి మనకు ఎలాంటి కారణాలు ఉన్నాయి? (బి) దాన్ని మనమెలా చేయవచ్చు?

18 ఒకప్పుడు మనం దేవుడు ఎవరో తెలియనివాళ్లలా జీవించామని గుర్తుంచుకోవడం మంచిది. (ఎఫె. 2:12) కానీ యెహోవా మనల్ని ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. (హోషే. 11:4; యోహా. 6:44) యేసుక్రీస్తు మనల్ని ఆహ్వానించాడు. మనం దేవుని కుటుంబంలో భాగమయ్యేలా మార్గం తెరిచాడు. (రోమీయులు 15:7 చదవండి.) మనం అపరిపూర్ణులమైనప్పటికీ యేసు మనల్ని దయతో ఆహ్వానించాడు కాబట్టి ఇతరులు మనకన్నా తక్కువనే ఆలోచనను ఎన్నడూ రానివ్వకూడదు.

‘పరలోకం నుండి వచ్చే తెలివిని’ మనం సంపాదించుకుంటాం కాబట్టి ఐక్యంగా, ప్రేమగా ఉంటాం (19వ పేరా చూడండి)

19 మనం ఈ దుష్ట విధానాంతానికి దగ్గరౌతుండగా ప్రజల్లో ఐక్యత మరింత తగ్గిపోతుంది. అంతేకాదు వివక్ష, ద్వేషం మరింత పెరిగిపోతాయి. (గల. 5:19-21; 2 తిమో. 3:13) కానీ యెహోవా ప్రజలమైన మనం ‘పరలోకం నుండి వచ్చే తెలివిని’ పొందాలనుకుంటాం. నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఉండడానికి అది మనకు సహాయం చేస్తుంది. (యాకో. 3:17, 18) మనం ఇతర దేశస్థులతో స్నేహం చేస్తాం, వాళ్ల పద్ధతుల్ని అంగీకరిస్తాం, వాళ్ల భాషను కూడా నేర్చుకుంటాం. అలా చేసినప్పుడు, “నదివలె” ఉండే సమాధానాన్ని, “సముద్రతరంగములవలె” ఉండే న్యాయాన్ని ఆనందిస్తాం.—యెష. 48:17, 18.

20. మన ఆలోచనల్లో, భావాల్లో ప్రేమ ఎలాంటి మార్పు తీసుకొస్తుంది?

20 ఆస్ట్రేలియాలోని సహోదరి బైబిలు స్టడీ తీసుకున్నప్పుడు, ఆమెలో నాటుకుపోయిన వివక్ష, ద్వేషం మెల్లమెల్లగా తగ్గిపోయాయి. ప్రేమ ఆమె ఆలోచనా విధానాన్ని, భావాల్ని మార్చేసింది. కెనడాకు చెందిన ఫ్రెంచ్‌ భాష మాట్లాడే సహోదరుడు ఏమంటున్నాడంటే, ప్రజలు ఇతరుల్ని తరచూ ద్వేషించడానికిగల కారణం వాళ్ల గురించి తెలియకపోవడమే. “వాళ్లలో ఉండే లక్షణాలకు, వాళ్లు పుట్టిన ప్రాంతానికి సంబంధం ఉండదని” ఆయన అర్థంచేసుకున్నాడు. అంతేకాదు ఆ సహోదరుడు ఇంగ్లీషు మాట్లాడే సహోదరిని పెళ్లిచేసుకున్నాడు. ప్రేమతో వివక్షను అధిగమించగలమని ఈ ఉదాహరణలు తెలియజేస్తున్నాయి. ఆ ప్రేమ ఎప్పటికీ విడదీయలేని బంధంతో మనల్ని ఐక్యం చేస్తుంది.—కొలొ. 3:14.

^ పేరా 8 ‘సోదరులు’ అనే పదం సంఘంలోని సహోదరీలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే, పౌలు రోములోని “సోదరులకు” ఉత్తరం రాసినప్పుడు కొంతమంది సహోదరీల పేర్లను కూడా ప్రస్తావించాడు. (రోమా. 16: 3, 6, 12) కావలికోట పత్రిక చాలా సంవత్సరాలుగా, సంఘంలోని క్రైస్తవుల్ని ‘సహోదరసహోదరీలు’ అని ప్రస్తావిస్తోంది.