కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు”

“నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు”

‘సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకంలోకి వచ్చాను.’యోహా. 18:37.

పాటలు: 15, 74

1, 2. (ఎ) నేటి ప్రపంచంలో ఐక్యత కనుమరుగౌతోందని ఎందుకు చెప్పవచ్చు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

“చిన్నప్పటి నుండి అన్యాయాన్నే చూస్తూ పెరిగాను. అందుకే మా దేశ రాజకీయ వ్యవస్థను అసహ్యించుకునేదాన్ని. చాలామంది విప్లవాత్మక ఆలోచనలుగా పరిగణించేవాటిని ప్రోత్సహించేదాన్ని. చాలా ఏళ్లు ఒక తీవ్రవాదికి గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్నాను” అని దక్షిణ యూరప్‌లోని ఒక సహోదరి చెప్పింది. దక్షిణ ఆఫ్రికాలోని ఒక సహోదరుడు, గతంలో ఆయనెందుకు హింసాత్మకంగా ఉండేవాడో వివరిస్తూ ఇలా చెప్పాడు, “తెగలన్నిటిలో మా తెగ మాత్రమే గొప్పదని నమ్మేవాణ్ణి. ఒక రాజకీయ పార్టీలో కూడా చేరాను. మా ప్రత్యర్థుల్ని ఈటెతో చంపడం మాకు నేర్పించారు, ఒకవేళ మా సొంత తెగవాళ్లు ఎవరైనా వేరే రాజకీయ పార్టీలకు మద్దతిచ్చినా వాళ్లను కూడా చంపేయాలని చెప్పారు.” సెంట్రల్‌ యూరప్‌లో ఉంటున్న ఒక సహోదరి ఇలా ఒప్పుకుంది, “నేను పక్షపాతం చూపించేదాన్ని. వేరే దేశస్థులను, మతస్థులను ద్వేషించేదాన్ని.”

2 ఒకప్పుడు ఈ ముగ్గురికి ఉన్నలాంటి ఆలోచనాతీరే నేడు చాలామందిలో కనిపిస్తోంది. చాలా రాజకీయ పార్టీలు హింసతో స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నాయి. ప్రజలు రాజకీయాల గురించి గొడవలు పడుతున్నారు. చాలా దేశాల్లోని ప్రజలు విదేశీయుల పట్ల ద్వేషం పెంచుకుంటున్నారు. బైబిలు ముందే చెప్పినట్లు, ఈ చివరి రోజుల్లోని ప్రజలు ‘మొండివాళ్లుగా’ తయారయ్యారు. (2 తిమో. 3:1, 3) ఐక్యత కనుమరుగౌతున్న ఈ ప్రపంచంలో క్రైస్తవులు ఐక్యంగా ఎలా ఉండగలరు? దాన్ని మనం యేసు జీవితం నుండి నేర్చుకోవచ్చు. ఆయన కాలంలోని ప్రజలకు కూడా రాజకీయాల పట్ల వేర్వేరు బలమైన అభిప్రాయాలు ఉండేవి. దానివల్ల వాళ్లలో ఐక్యత ఉండేది కాదు. ఈ ఆర్టికల్‌లో మనం మూడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం: లోక రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని యేసు ఎలా చూపించాడు? దేవుని ప్రజలు రాజకీయ విషయాల్లో తలదూర్చకూడదని యేసు ఎలా చూపించాడు? మనం ఎన్నడూ హింసకు పాల్పడకూడదని యేసు ఎలా నేర్పించాడు?

స్వాతంత్ర్యాన్ని కోరుకునేవాళ్ల పక్షాన యేసు నిలబడ్డాడా?

3, 4. (ఎ) యేసు కాలంలోని చాలామంది యూదులు ఏమి కోరుకున్నారు? (బి) అది యేసు శిష్యులపై ఎలాంటి ప్రభావం చూపించింది?

3 యేసు ఎవరికైతే ప్రకటించాడో ఆ యూదుల్లో చాలమంది రోమన్ల నుండి స్వాతంత్ర్యం కావాలని కోరుకునేవాళ్లు. ప్రజల్లో ఆ కోరికను మరింత బలపర్చడానికి యూదా మతోన్మాదులుగా పేరుగాంచిన ఒక రాజకీయ గుంపు శతవిధాలా ప్రయత్నించింది. ఆ గుంపులోని చాలామంది, గలిలయకు చెందిన యూదా అనే వ్యక్తిని అనుసరించేవాళ్లు. ఆ వ్యక్తి ఎంతోమంది ప్రజల్ని తప్పుదారి పట్టించిన అబద్ధ మెస్సీయ. చరిత్రకారుడైన జోసిఫస్‌ యూదా గురించి ఇలా చెప్పాడు, “అతను యూదుల్ని రోమన్లకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేవాడు. రోమన్లకు పన్ను కట్టేవాళ్లను పిరికివాళ్లని అనేవాడు.” చివరికి రోమన్లు యూదాను చంపేశారు. (అపొ. 5:37) అతన్ని అనుసరించిన మతోన్మాదుల్లో కొంతమంది, తమ లక్ష్యాల్ని సాధించడానికి హింసకు కూడా పాల్పడ్డారు.

4 చాలామంది యూదులు మెస్సీయ కోసం ఆత్రంగా ఎదురుచూశారు. ఆయన వాళ్లను రోమన్ల నుండి విడిపించి, మళ్లీ ఇశ్రాయేలును గొప్ప జనాంగంగా చేస్తాడని అనుకున్నారు. (లూకా 2:38; 3:15) మెస్సీయ ఇశ్రాయేలు దేశంలో రాజ్యాన్ని స్థాపిస్తాడని, అప్పుడు వేర్వేరు దేశాలకు చెదిరిపోయిన యూదులు ఇశ్రాయేలుకు తిరిగి రావచ్చని చాలామంది నమ్మేవాళ్లు. ఒక సందర్భంలో బాప్తిస్మమిచ్చు యోహాను కూడా “రాబోతున్న వాడివి నువ్వేనా? లేక ఇంకో వ్యక్తి కోసం మేము ఎదురుచూడాలా?” అని యేసును అడిగాడు. (మత్త. 11:2, 3) యూదులను విడిపించడానికి ఇంకెవరైనా వస్తారేమోనని యోహాను తెలుసుకోవాలని అనుకునివుంటాడు. కొంతకాలం తర్వాత, ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులను పునరుత్థానమైన యేసు కలిశాడు. యేసే ఇశ్రాయేలీయులకు విడుదల తీసుకొస్తాడని తాము ఎదురుచూసినట్లు ఆయనకు చెప్పారు. (లూకా 24:21 చదవండి.) ఆ వెంటనే అపొస్తలులు యేసును ఇలా అడిగారు, “ప్రభువా, ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని మళ్లీ ఇస్తావా?”—అపొ. 1:6.

5. (ఎ) యేసు రాజవ్వాలని గలిలయలోని ప్రజలు ఎందుకు కోరుకున్నారు? (బి) వాళ్ల ఆలోచనను యేసు ఎందుకు సరిచేశాడు?

5 తమ సమస్యల్ని మెస్సీయ పరిష్కరిస్తాడని యూదులు ఎదురుచూశారు. అందుకే యేసు రాజవ్వాలని గలిలయలోని ప్రజలు కోరుకుని ఉంటారు. ఆయన అద్భుతంగా బోధించేవాడు, రోగుల్ని బాగుచేసేవాడు, ఆకలితో ఉన్నవాళ్లకు ఆహారమిచ్చేవాడు కాబట్టి ఆయన మంచి నాయకునిగా ఉండగలడని వాళ్లు అనుకొనివుంటారు. ఒక సందర్భంలో ఆయన దాదాపు 5,000 మంది పురుషులకు ఆహారం పెట్టడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. తన నుండి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో యేసు గ్రహించాడు. బైబిలు ఇలా చెప్తుంది, “వాళ్లు తన దగ్గరకు వచ్చి, తనను పట్టుకుని రాజుగా చేయబోతున్నారని తెలుసుకొని యేసు ఒక్కడే మళ్లీ కొండకు వెళ్లిపోయాడు.” (యోహా. 6:10-15) తర్వాతి రోజు పరిస్థితి సద్దుమణిగి ఉంటుంది. అప్పుడు యేసు వాళ్లకు, తాను ప్రజల భౌతిక అవసరాలు తీర్చడానికి కాదుగానీ దేవుని రాజ్యం గురించి బోధించడానికి వచ్చానని వివరించాడు. “పాడైపోయే ఆహారం కోసం కాకుండా, శాశ్వత జీవితాన్ని ఇచ్చే పాడవ్వని ఆహారం కోసం కష్టపడండి” అని ఆయన వాళ్లను ప్రోత్సహించాడు.—యోహా. 6:25-27.

6. తనకు లోక రాజకీయాల పట్ల ఆసక్తి లేదని యేసు ఎలా స్పష్టం చేశాడు? (1వ ప్రారంభ చిత్రం చూడండి.)

6 యేసు చనిపోయే సమయం దగ్గరపడింది. కానీ ఆయన త్వరలోనే యెరూషలేములో రాజ్యాన్ని స్థాపిస్తాడని తన అనుచరుల్లో కొంతమంది నమ్ముతున్నట్లు యేసు గ్రహించాడు. అలాంటిదేమీ జరగదని వాళ్లు అర్థం చేసుకోవడానికి యేసు మినాల ఉదాహరణను చెప్పాడు. ఆ ఉదాహరణ దూర దేశానికి ప్రయాణమైన “గొప్ప ఇంట్లో పుట్టిన ఒకతని” గురించి చెప్తుంది. గొప్ప ఇంట్లో పుట్టిన ఆ వ్యక్తి యేసును సూచిస్తున్నాడు. (లూకా 19:11-13, 15) అంతేకాదు, తాను లోక రాజకీయాలకు మద్దతివ్వనని రోమా అధికారియైన పొంతి పిలాతుతో యేసు స్పష్టంగా చెప్పాడు. అప్పుడు పిలాతు “నువ్వు యూదుల రాజువా?” అని ఆయన్ను అడిగాడు. (యోహా. 18:33) ఎందుకంటే యేసు ప్రజల్ని రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడతాడేమోనని పిలాతు భయపడివుంటాడు. కానీ యేసు ఇలా జవాబిచ్చాడు, “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.” (యోహా. 18:36) తన రాజ్యం పరలోకంలో ఉంటుంది కాబట్టి లోక రాజకీయాల పట్ల యేసు ఆసక్తి చూపించలేదు. ఈ లోకంలో తనకున్న పని “సత్యం గురించి సాక్ష్యం” ఇవ్వడం మాత్రమేనని ఆయన చెప్పాడు.—యోహాను 18:37 చదవండి.

మీరు లోకంలోని సమస్యల మీద మనసుపెడుతున్నారా లేక దేవుని రాజ్యం మీదా? (7వ పేరా చూడండి)

7. రాజకీయ పార్టీలకు మనసులో కూడా మద్దతివ్వకుండా ఉండడం ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

7 తన పనేమిటో యేసు అర్థంచేసుకున్నాడు కాబట్టే రాజకీయాల్లో తలదూర్చలేదు. అదేవిధంగా మనం కూడా మన పనేమిటో అర్థంచేసుకుంటే ఏ రాజకీయ పార్టీకి మనసులో కూడా మద్దతివ్వం. అది అన్ని సందర్భాల్లో తేలిక కాదు. ఒక ప్రయాణ పర్యవేక్షకుడు ఇలా చెప్పాడు, “మా ప్రాంతంలోని ప్రజలు మరీ విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. తమ దేశమే గొప్పదని భావిస్తూ, తమ దేశస్థులు అధికారంలోకి వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని నమ్ముతున్నారు. కానీ సంతోషకరమైన విషయమేమిటంటే, సహోదరులు దేవుని రాజ్యం గురించి ప్రకటించడం మీదే మనసుపెట్టడం ద్వారా క్రైస్తవులుగా తమ ఐక్యతను కాపాడుకున్నారు. మనం ఎదుర్కొంటున్న అన్యాయాన్ని, ఇతర సమస్యల్ని దేవుడే పరిష్కరిస్తాడని వాళ్లు ఎదురుచూస్తున్నారు.”

యేసు రాజకీయాలకు దూరంగా ఎలా ఉండగలిగాడు?

8. యేసు కాలంలోని చాలామంది యూదులు ఎలాంటి అన్యాయాన్ని ఎదుర్కొన్నారు?

8 చుట్టూ అన్యాయం చూసినప్పుడు ప్రజలు రాజకీయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. యేసు కాలంలో, విపరీతమైన పన్ను భారం వల్ల ప్రజలకు రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగింది. నిజానికి గలిలయుడైన యూదా రోమన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది కూడా దానివల్లే. రోమన్లు ప్రజలచేత పన్ను కట్టించడం కోసం అందరి పేర్లను తమ దేశ జనాభాలో నమోదు చేయించేవాళ్లు. పైగా ఆస్తి పన్ను, భూమి పన్ను, ఇంటి పన్ను అంటూ లెక్కలేనన్ని పన్నులు విధించేవాళ్లు. వీటికితోడు పన్ను వసూలుదారుల అవినీతి వల్ల సమస్య మరింత పెద్దదైంది. కొంతమందైతే ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చి మరీ పన్ను వసూలు చేసే ఉద్యోగాన్ని సంపాదించుకునేవాళ్లు. తర్వాత ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు వసూలు చేసేవాళ్లు. అలా అడ్డదారిలో ధనవంతులైన వాళ్లలో జక్కయ్య ఒకడు. అతను యెరికోలో పన్ను వసూలు చేసే ముఖ్య అధికారిగా పనిచేసేవాడు.—లూకా 19:2, 8.

9, 10. (ఎ) ఒకానొక రాజకీయ వివాదాంశంలో యేసును ఇరికించాలని శత్రువులు ఎలా ప్రయత్నించారు? (బి) దానికి యేసు ఇచ్చిన జవాబు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (2వ ప్రారంభ చిత్రం చూడండి.)

9 పన్ను కట్టడం గురించిన వివాదంలో యేసును కూడా ఇరికించాలని శత్రువులు ప్రయత్నించారు. అప్పట్లో ప్రతీ యూదుడు ఒక దేనారాన్ని రోమా ప్రభుత్వానికి పన్నుగా కట్టాలనే నియమం ఉండేది. అది సరైనదా కాదానని శత్రువులు యేసును ప్రశ్నించారు. (మత్తయి 22:16-18 చదవండి.) యూదులకు ఆ పన్ను కట్టడం ఇష్టముండేది కాదు. ఎందుకంటే ఆ పన్ను కట్టిన ప్రతీసారి వాళ్లు రోమా ప్రభుత్వం కింద ఉన్నారని గుర్తుకొచ్చేది. ఒకవేళ యేసు ఆ ప్రశ్నకు జవాబుగా, యూదులు పన్ను కట్టాల్సిన అవసరం లేదని చెప్తే రోమా ప్రభుత్వానికి తిరుగుబాటు చేస్తున్నాడనే నింద మోపవచ్చని ‘హేరోదు అనుచరులు’ కుట్రపన్నారు. ఒకవేళ యూదులు పన్ను కట్టాలని యేసు చెప్తే, ప్రజలు ఆయన్ని వెంబడించడం మానేస్తారని వాళ్లు అనుకున్నారు. మరి, ఆ చిక్కు ప్రశ్నకు యేసు ఏమని జవాబిచ్చాడు?

10 అటు రోమా ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మద్దతివ్వకుండా యేసు జాగ్రత్తపడ్డాడు. ఆయనిలా చెప్పాడు, “కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి.” (మత్త. 22:21) ఎంతోమంది పన్ను వసూలుదారులు అవినీతికి పాల్పడుతున్నారనే విషయం యేసుకు తెలిసినా ఆయన దానిమీద మనసుపెట్టలేదు. బదులుగా మనుషుల సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే దేవుని రాజ్యం మీద మనసుపెట్టాడు. ఆ విధంగా ఆయన మనకు ఆదర్శాన్ని ఉంచాడు. కాబట్టి ఏదైనా రాజకీయ పార్టీ సరైనదిగా, ప్రజల మంచి కోరేదిగా అనిపించినా మనం దానికి మద్దతివ్వకూడదు. అంతేకాదు క్రైస్తవులు లోకంలో జరిగే అన్యాయాల గురించి విమర్శిస్తూ మాట్లాడరు. బదులుగా దేవుని రాజ్యం మీద, ఆయన నీతి మీద మనసుపెడతారు.—మత్త. 6:33.

11. న్యాయం జరగాలనే మన కోరికను సరైన విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

11 చాలామంది యెహోవాసాక్షులు, రాజకీయ విషయాల పట్ల ఒకప్పుడు తమకున్న బలమైన అభిప్రాయాలను మార్చుకోవడానికి కృషిచేసి విజయం సాధించారు. ఉదాహరణకు గ్రేట్‌ బ్రిటన్‌లో ఉండే ఒక సహోదరి, సత్యం తెలుసుకోకముందు యూనివర్సిటీలో సోషల్‌స్టడీస్‌ క్లాస్‌లు తీసుకునేది. ఆ క్రమంలో ఆమెకు రాజకీయ విషయాలపట్ల బలమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆమె ఇలా చెప్పింది, “నల్ల జాతీయులమైన మేము చాలా అన్యాయాన్ని ఎదుర్కొన్నాం. అందుకే మా హక్కుల కోసం పోరాడాలని నాకు అనిపించింది. ఆ విషయాల్లో వాదించి ఎన్నోసార్లు గెలిచేదాన్ని కానీ ఏదో చిరాకుగా అనిపించేది. జాతి వివక్షను రూపుమాపాలంటే దాని మూలాలను ప్రజల హృదయాల్లో నుండి తీసేయాలని నేను గ్రహించలేకపోయాను. బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాక, వివక్షను ముందు నా హృదయంలో నుండి తీసేసుకోవాలని గుర్తించాను. ఆ విషయంలో నాకు సహాయపడిన సహోదరి తెల్లజాతీయురాలు. ప్రస్తుతం నేను సంజ్ఞా భాష సంఘంలో క్రమ పయినీరుగా సేవచేస్తున్నాను. అన్నిరకాల ప్రజలకు మంచివార్త ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నాను.”

“నీ కత్తిని తిరిగి ఒరలో పెట్టు”

12. యేసు దూరంగా ఉండమని హెచ్చరించిన “పులిసిన పిండి” ఏమిటి?

12 యేసు కాలంలోని మతనాయకులు రాజకీయ పార్టీలకు మద్దతిచ్చేవాళ్లు. ఉదాహరణకు, డైలీ లైఫ్‌ ఇన్‌ పాలెస్టయిన్‌ ఎట్‌ ద టైమ్‌ ఆఫ్‌ క్రైస్ట్‌ అనే పుస్తకం ఏం చెప్తుందంటే, “దాదాపుగా రాజకీయ పార్టీల్లాగే యూదులు కూడా వివిధ గుంపులుగా ఏర్పడ్డారు.” అందుకే యేసు తన శిష్యుల్ని హెచ్చరిస్తూ ఇలా అన్నాడు, “అప్రమత్తంగా ఉండండి, పరిసయ్యుల పులిసిన పిండి విషయంలో, హేరోదు పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి.” (మార్కు 8:15) ఆ సందర్భంలో హేరోదు పేరును ప్రస్తావించినప్పుడు, బహుశా హేరోదు అనుచరుల్ని యేసు సూచిస్తుండవచ్చు. మరో గుంపు అంటే పరిసయ్యులు, యూదులకు రోమా ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యం కావాలని కోరుకునేవాళ్లు. మత్తయి వృత్తాంతం ప్రకారం, సద్దూకయ్యులతో కూడా జాగ్రత్తగా ఉండమని యేసు తన శిష్యుల్ని హెచ్చరించాడు. సద్దూకయ్యులు రోమా పరిపాలనే కావాలని కోరుకునేవాళ్లు ఎందుకంటే ఆ ప్రభుత్వంలో వాళ్లు పెద్దపెద్ద పదవులు పొందేవాళ్లు. అందుకే ‘పులిసిన పిండికి’ లేదా ఈ మూడు గుంపుల బోధలకు దూరంగా ఉండమని యేసు తన శిష్యుల్ని హెచ్చరించాడు. (మత్త. 16:6, 12) ఆసక్తికరంగా, ప్రజలు తనను రాజును చేయడానికి ప్రయత్నించిన వెంటనే యేసు ఈ హెచ్చరికల్ని ఇచ్చాడు.

13, 14. (ఎ) మతాలు రాజకీయాలకు మద్దతిచ్చినప్పుడు హింస, అన్యాయం చెలరేగుతుందని ఎలా చెప్పవచ్చు? (బి) అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు సైతం మనమెందుకు హింసకు పాల్పడకూడదు? (3వ ప్రారంభ చిత్రం చూడండి.)

13 చాలా సందర్భాల్లో, మతాలు రాజకీయాలకు మద్దతిచ్చినప్పుడు హింస చెలరేగుతుంది. కానీ తన శిష్యులు రాజకీయాలతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని యేసు నేర్పించాడు. ఆ కారణం వల్ల కూడా ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసును చంపడానికి ప్రయత్నించారు. ఒకవేళ ప్రజలు ఆయన మాట విని, తమను పట్టించుకోవడం మానేస్తారేమోనని వాళ్లు భయపడ్డారు. వాళ్ల భయమే గనుక నిజమైతే మతపరంగా, రాజకీయపరంగా వాళ్లకున్న అధికారాన్ని కోల్పోతారు. అందుకే వాళ్లిలా అనుకున్నారు, “ఆయన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఆయనమీద విశ్వాసం ఉంచుతారు. అప్పుడు రోమన్లు వచ్చి మన స్థలాన్ని, మన దేశాన్ని లాక్కుంటారు.” (యోహా. 11:48) దాంతో ప్రధాన యాజకుడైన కయప యేసును చంపేందుకు పథకం వేశాడు.—యోహా. 11:49-53; 18:14.

14 చీకటిపడ్డాక యేసును బంధించమని కయప సైనికుల్ని పంపించాడు. తనను చంపడానికి కుట్ర పన్నారనే విషయం అప్పటికే యేసుకు తెలుసు. అందుకే తమతోపాటు కత్తిని తెచ్చుకోమని అపొస్తలులతో కలిసి చివరిసారిగా భోజనం చేస్తున్నప్పుడు యేసు చెప్పాడు. తన శిష్యులకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పించడానికి రెండు కత్తులు సరిపోతాయి. (లూకా 22:36-38) ఆరోజు రాత్రి యేసును బంధించడానికి ఒక గుంపు వచ్చింది. ఆ అన్యాయాన్ని చూస్తూ భరించలేని పేతురు కోపంతో కత్తి తీసి ఆ గుంపులోని ఒకరిపై దాడి చేశాడు. (యోహా. 18:10) అప్పుడు యేసు పేతురుతో, “నీ కత్తిని తిరిగి ఒరలో పెట్టు. కత్తి పట్టుకున్న వాళ్లందరూ కత్తితోనే నాశనమౌతారు” అని అన్నాడు. (మత్త. 26:52, 53) ఆ సందర్భంలో యేసు తన శిష్యులకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించాడు. అదేమిటంటే, వాళ్లు ఈ లోకంతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు. ఆ రోజు ప్రార్థనలో యేసు వేడుకున్నది కూడా అదే. (యోహాను 17:16 చదవండి.) అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే హక్కు దేవునికి మాత్రమే ఉంది.

15, 16. (ఎ) హింసకు దూరంగా ఉండడానికి దేవుని వాక్యం క్రైస్తవులకు ఎలా సహాయం చేసింది? (బి) ప్రస్తుతం ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు యెహోవా ఏ తేడా గమనిస్తాడు?

15 ముందు పేరాల్లో పేర్కొనబడిన దక్షిణ యూరప్‌లోని ఒక సహోదరి కూడా ఆ పాఠాన్నే నేర్చుకుంది. ఆమె ఇలా చెప్పింది, “హింస వల్ల న్యాయం జరగదని నేను తెలుసుకున్నాను. హింసకు పాల్పడేవాళ్లు ప్రాణాలు కోల్పోవడం చూశాను. అంతేకాదు దానివల్ల ఎంతోమందికి చేదు జ్ఞాపకాలే మిగిలాయి. భూమిపై నిజమైన న్యాయాన్ని దేవుడు మాత్రమే తీసుకురాగలడని బైబిలు ద్వారా నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. గత 25 ఏళ్లుగా ఆ విషయాన్ని అందరికీ ప్రకటిస్తున్నాను.” దక్షిణ ఆఫ్రికాలోని ఒక సహోదరుడు తన ఈటెను వదిలేసి “దేవుని వాక్యం అనే ఖడ్గం” పట్టుకున్నాడు. (ఎఫె. 6:17) ఇప్పుడాయన తెగతో సంబంధం లేకుండా అన్నిరకాల ప్రజలకు శాంతి సందేశాన్ని ప్రకటిస్తున్నాడు. సెంట్రల్‌ యూరప్‌కు చెందిన సహోదరి యెహోవాసాక్షి అయ్యాక, ఒకప్పుడు ఆమె ద్వేషించిన జాతికి చెందిన సహోదరుడిని పెళ్లిచేసుకుంది. ఆ ముగ్గురు సహోదరసహోదరీలు క్రీస్తులా ఉండాలనుకోవడం వల్లే ఆ మార్పుల్ని చేసుకోగలిగారు.

16 మనం కూడా ఈ మార్పుల్ని చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. మానవజాతి ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉండే సముద్రం లాంటిదని బైబిలు చెప్తుంది. (యెష. 17:12; 57:20, 21; ప్రక. 13:1) రాజకీయ వివాదాంశాలు ప్రజల్ని రెచ్చగొడతాయి, ఐక్యతను పాడుచేస్తాయి, హింసను రేపుతాయి. కానీ దేవుని ప్రజలుగా మనం శాంతితో, ఐక్యంగా ఉంటున్నాం. ఒకరంటే ఒకరికి పడని ఈ లోకంలో, తన ప్రజలు ఐక్యంగా ఉండడం చూసి యెహోవా ఖచ్చితంగా సంతోషిస్తుంటాడు.—జెఫన్యా 3:17 చదవండి.

17. (ఎ) మనం ఏ మూడు విధాలుగా ఐక్యతను పెంపొందిస్తాం? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

17 మనం మూడు విధాలుగా ఐక్యతను పెంపొందించవచ్చని ఈ ఆర్టికల్‌ ద్వారా తెలుసుకున్నాం. (1) దేవుని రాజ్యం మాత్రమే అన్నిరకాల అన్యాయాల్ని రూపుమాపుతుందని నమ్మడం, (2) ఎన్నడూ రాజకీయ విషయాల్లో తలదూర్చకపోవడం, (3) హింసకు పాల్పడకపోవడం. కానీ మన ఐక్యతను దెబ్బతీసే ఉరి మరొకటి ఉంది, అదే వివక్ష. తొలి క్రైస్తవుల్లాగే మనం కూడా దానితో ఎలా పోరాడి గెలవవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.