కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 23

“ఎవ్వరూ మిమ్మల్ని బానిసలుగా చేసుకోకుండా జాగ్రత్తపడండి”!

“ఎవ్వరూ మిమ్మల్ని బానిసలుగా చేసుకోకుండా జాగ్రత్తపడండి”!

‘మనుషుల సంప్రదాయాల ప్రకారం ఉన్న తత్త్వజ్ఞానంతో, మోసపూరితమైన వట్టి మాటలతో ఎవ్వరూ మిమ్మల్ని బానిసలుగా చేసుకోకుండా జాగ్రత్తపడండి.’—కొలొ. 2:8.

పాట 96 దేవుడిచ్చిన గ్రంథం ఒక నిధి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. కొలొస్సయులు 2:4, 8 ప్రకారం, సాతాను ఏం చేయడానికి ప్రయత్నిస్తాడు?

మనల్ని యెహోవాకు దూరం చేయాలన్నదే సాతాను కోరిక. అందుకోసం మన ఆలోచనా విధానాన్ని మార్చి, తనకు అనుగుణంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తాడు. మనకు ఆకర్షణీయంగా కనిపించేవాటిని ఉపయోగించి తనను అనుసరించేలా మనల్ని నమ్మిస్తాడు లేదా మోసం చేస్తాడు.—కొలొస్సయులు 2:4, 8 చదవండి.

2-3. (ఎ) కొలొస్సయులు 2:8⁠లో ఉన్న హెచ్చరికను మనం ఎందుకు లక్ష్యపెట్టాలి? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

2 మనం నిజంగా సాతాను చేతుల్లో మోసపోయేంత పెద్ద ప్రమాదంలో ఉన్నామా? అవును, ఉన్నాం! కొలొస్సయులు 2:8⁠లోని మాటల్ని పౌలు అవిశ్వాసులకు కాదుగానీ పవిత్రశక్తితో అభిషేకించబడిన క్రైస్తవుల్ని హెచ్చరిస్తూ రాశాడని గుర్తుంచుకోండి. (కొలొ. 1:2, 5) అప్పట్లో ఆ క్రైస్తవులు ప్రమాదంలో ఉన్నారు, ఇప్పుడు మనం అంతకన్నా ఎక్కువ ప్రమాదంలో ఉన్నాం. (1 కొరిం. 10:12) ఎందుకంటే సాతాను భూమ్మీదికి పడవేయబడ్డాడు, అప్పటినుండి దేవుని నమ్మకమైన సేవకుల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. (ప్రక. 12:9, 12, 17) అంతేకాదు దుష్టులు, మోసగాళ్లు ‘అంతకంతకూ చెడిపోతున్న’ కాలంలో మనం జీవిస్తున్నాం.—2 తిమో. 3:1, 13.

3 సాతాను “మోసపూరితమైన వట్టి మాటలతో” మన ఆలోచనా విధానాన్ని మార్చడానికి ఎలా ప్రయత్నిస్తాడో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అంతేకాదు సాతాను ఉపయోగించే మూడు ‘పన్నాగాల్ని’ లేదా ‘వ్యూహాల్ని’ కూడా పరిశీలిస్తాం. (ఎఫె. 6:11, అధస్సూచి) ఒకవేళ ఇప్పటికే సాతాను మనల్ని మోసగించి మన ఆలోచనల్ని పాడుచేసినా, వాటిని ఎలా సరిచేసుకోవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం. ముందుగా, వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన ఇశ్రాయేలీయుల్ని సాతాను ఎలా పక్కదారి పట్టించాడో, దాన్నుండి మనమేం నేర్చుకోవచ్చో చూద్దాం.

విగ్రహపూజ చేసేలా ప్రలోభపెట్టడం

4-6. ద్వితీయోపదేశకాండము 11:10-15 ప్రకారం, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో స్థిరపడ్డాక వ్యవసాయ పద్ధతుల్ని ఎలా మార్చుకోవాల్సి వచ్చింది?

4 సాతాను చాలా తెలివిగా ఇశ్రాయేలీయుల్ని విగ్రహపూజ చేసేలా ప్రలోభపెట్టాడు. ఏ విధంగా? ఇశ్రాయేలీయులకు ఆహారం అవసరమని గమనించి సాతాను ఆ అవసరాన్ని తనకు అనుకూలంగా వాడుకున్నాడు. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించాక, పంట పండించే పద్ధతుల్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఐగుప్తులో ఉన్నప్పుడైతే నైలు నది నుండి తమ పొలాలకు నీళ్లు పెట్టేవాళ్లు. కానీ వాగ్దాన దేశంలో నైలులాంటి పెద్ద నదులు లేవు, పైగా పంట కోసం వర్షాల మీద, మంచు మీద ఆధారపడాలి. (ద్వితీయోపదేశకాండము 11:10-15 చదవండి; యెష. 18:4, 5) కాబట్టి ఇశ్రాయేలీయులు కొత్త వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవాలి. కానీ అది అంత తేలిక కాదు, ఎందుకంటే కొద్దోగొప్పో వ్యవసాయ అనుభవం ఉన్నవాళ్లలో చాలామంది అరణ్యంలోనే చనిపోయారు.

ఇశ్రాయేలు రైతుల ఆలోచనను సాతాను ఎలా మలచగలిగాడు? (4-6 పేరాలు చూడండి) *

5 పరిస్థితులు మారాయని యెహోవా తన ప్రజలకు వివరించాడు. ఆ తర్వాత, వ్యవసాయానికి ఎలాంటి సంబంధం లేనట్లు అనిపించే ఈ హెచ్చరికను ఇచ్చాడు: “మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్తపడుడి.” (ద్వితీ. 11:16, 17) కొత్త వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవడం గురించి మాట్లాడుతూ యెహోవా అబద్ధ ఆరాధన గురించి ఎందుకు హెచ్చరించాడు?

6 ఇశ్రాయేలీయులు, చుట్టూవున్న అన్యుల దగ్గర కొన్ని స్థానిక వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటారని యెహోవాకు తెలుసు. నిజమే, ఇశ్రాయేలీయుల కన్నా వాళ్లకే వ్యవసాయంలో ఎక్కువ అనుభవం ఉంది, కాబట్టి వాళ్లనుండి ఇశ్రాయేలీయులు కొన్ని మెళకువలు నేర్చుకోవచ్చు. కానీ ఒక ప్రమాదం పొంచివుంది. కనాను రైతులు బయలును పూజిస్తారు కాబట్టి వాళ్ల ఆలోచనలు వాళ్ల మతనమ్మకాల ఆధారంగానే ఉండేవి. బయలు ఆకాశానికి యజమాని అనీ, వర్షాలు కురిపిస్తాడనీ వాళ్లు నమ్మేవాళ్లు. తన ప్రజలు అలాంటి అబద్ధాల వల్ల మోసపోవడం యెహోవాకు ఇష్టం లేదు. కానీ పదేపదే ఇశ్రాయేలీయులు బయలును పూజించాలని నిర్ణయించుకున్నారు. (సంఖ్యా. 25:3, 5; న్యాయా. 2:13; 1 రాజు. 18:18) ఇంతకీ సాతాను వాళ్లను ఎలా బానిసలుగా చేసుకోగలిగాడో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా చేసుకోవడానికి సాతాను వాడిన మూడు  పన్నాగాలు

7. వాగ్దాన దేశానికి వెళ్లాక ఇశ్రాయేలీయులకు ఎలాంటి విశ్వాస పరీక్ష ఎదురైంది?

7 సాతాను మొదటి పన్నాగం పన్నాడు. వర్షాలు పడి తమ పొలాలు పండాలనే ఇశ్రాయేలీయుల సహజ కోరికను వాడుకున్నాడు. ప్రతీ సంవత్సరం, వాగ్దాన దేశంలో ఏప్రిల్‌ చివరి నుండి సెప్టెంబరు వరకు వర్షాలు ఉండవు. సాధారణంగా అక్టోబరు నుండి మొదలయ్యే వర్షాల మీదే వాళ్ల జీవనం, పంటలు ఆధారపడివుండేవి. కాబట్టి, పంటలు బాగా పండాలంటే తమ చుట్టూవున్న అన్యుల ఆచారాల్ని పాటించాలని ఇశ్రాయేలీయులు అనుకునేలా సాతాను మోసం చేశాడు. తమ దేవుళ్లు చర్య తీసుకోవాలన్నా, వర్షం కురిపించాలన్నా కొన్ని ఆచారాలు చేయాలని అన్యులు నమ్మేవాళ్లు. యెహోవా మీద విశ్వాసం లేని కొంతమంది ఇశ్రాయేలీయులు కూడా, కరువు రాకూడదంటే ఇదొక్కటే మార్గం అనుకుని అబద్ధ దేవుడైన బయలును పూజిస్తూ అన్య ఆచారాలు చేశారు.

8. సాతాను ఉపయోగించిన రెండో పన్నాగం ఏంటి? వివరించండి.

8 సాతాను రెండో పన్నాగం పన్నాడు. ఈసారి వాళ్లను లైంగిక పాపం చేసేలా ప్రలోభపెట్టాడు. అన్య జనాంగాలవాళ్లు తమ దేవుళ్లను ఆరాధించడంలో భాగంగా నీచమైన అనైతిక పనులు చేసేవాళ్లు. ఆ భ్రష్టుపట్టిన ఆరాధనలో మగ ఆలయ వేశ్యలు, ఆడ ఆలయ వేశ్యలు చేసే అసహ్యమైన పనులు కూడా ఉండేవి. దాంతోపాటు స్వలింగ సంపర్కాన్ని, ఇతర రకాల లైంగిక పాపాల్ని చూసీచూడనట్లు వదిలేశారు, అవి వాళ్లకు సర్వసాధారణమైపోయాయి! (ద్వితీ. 23:17, 18; 1 రాజు. 14:24) అలాంటి ఆచారాలు చేస్తేనే తమ దేవుళ్లు పంటలు బాగా పండేలా చేస్తారని అన్యులు నమ్మేవాళ్లు. వాళ్ల అనైతిక ఆచారాలకు చాలామంది ఇశ్రాయేలీయులు ఆకర్షితులై, అబద్ధ దేవుళ్లను ఆరాధించాలని నిర్ణయించుకున్నారు. నిజానికి, సాతానే వాళ్లను బానిసలుగా చేసుకున్నాడు.

9. హోషేయ 2:16, 17 బట్టి, సాతాను పన్నిన మూడో పన్నాగం ఏంటి?

9 సాతాను మూడో పన్నాగం పన్నాడు. యెహోవా ఎలాంటి దేవుడో ఇశ్రాయేలీయులు మర్చిపోయేలా చేశాడు. యిర్మీయా కాలంలోని అబద్ధ ప్రవక్తలు ఇశ్రాయేలీయుల్ని ప్రలోభపెట్టి తన పేరును మర్చిపోయేలా చేశారని యెహోవా చెప్పాడు. బయలును వాళ్లు ఆరాధించడమే కాకుండా ఇతరులు కూడా ఆరాధించేలా చేశారు. (యిర్మీ. 23:27) బహుశా కొంతకాలం దేవుని ప్రజలు యెహోవా పేరును ఉపయోగించడం మానేసి, దాని స్థానంలో “యజమాని” అనే అర్థమున్న బయలు పేరును ఉపయోగించివుంటారు. అలా చేయడం వల్ల ఇశ్రాయేలీయులు యెహోవాకు, బయలుకు మధ్య తేడాను గుర్తించలేకపోయారు. దానివల్ల, బయలు ఆరాధనలో చేసే ఆచారాల్ని యెహోవా ఆరాధనలో కలిపేశారు.హోషేయ 2:16, 17 చదవండి.

నేడు సాతాను ఉపయోగిస్తున్న పన్నాగాలు

10. నేడు సాతాను ఎలాంటి పన్నాగాలు ఉపయోగిస్తున్నాడు?

10 నేడు కూడా సాతాను అవే పన్నాగాలు ఉపయోగిస్తున్నాడు. మన సహజ కోరికల్ని తనకు అనుకూలంగా వాడుకోవడం ద్వారా, లైంగిక పాపాల్ని ప్రోత్సహించడం ద్వారా, యెహోవా ఎలాంటి దేవుడో మర్చిపోయేలా చేయడం ద్వారా సాతాను మనల్ని బానిసలుగా చేసుకుంటున్నాడు. ముందుగా మూడో పన్నాగాన్ని చూద్దాం.

11. యెహోవా ఎలాంటి దేవుడో ప్రజలు మర్చిపోయేలా సాతాను ఏం చేశాడు?

11 యెహోవా ఎలాంటి దేవుడో ప్రజలు మర్చిపోయేలా సాతాను చేస్తున్నాడు. అపొస్తలులు చనిపోయాక, క్రైస్తవులమని చెప్పుకున్న కొంతమంది అబద్ధ బోధల్ని వ్యాప్తి చేయడం మొదలుపెట్టారు. (అపొ. 20:29, 30; 2 థెస్స. 2:3) ఆ మతభ్రష్టులు ప్రజల్ని ఏకైక సత్య దేవుడెవరో గుర్తించకుండా చేశారు. ఉదాహరణకు, తమ బైబిళ్లలో దేవుని పేరు తీసేసి “ప్రభువు” లాంటి పదాల్ని పెట్టారు. దేవుని పేరుకు బదులు “ప్రభువు” అని పెట్టడం వల్ల, బైబిలు చదివేవాళ్లు యెహోవాకు, లేఖనాల్లోని ఇతర ప్రభువులకు ఉన్న తేడాను గుర్తించడం కష్టమైంది. (1 కొరిం. 8:5) యెహోవాకు, యేసుకు ఇద్దరికీ “ప్రభువు” అని పెట్టడం వల్ల వాళ్లిద్దరు వేర్వేరు వ్యక్తులని, వాళ్ల స్థానాలు వేరని అర్థంచేసుకోవడం కష్టమైంది. (యోహా. 17:3) ఈ తికమక నుండే త్రిత్వ సిద్ధాంతం పుట్టుకొచ్చింది. నిజానికి అది బైబిల్లో లేని బోధ. దానివల్ల చాలామంది దేవుడు తమకు అర్థం కాడని, ఆయన్ని తెలుసుకోవడం అసాధ్యమని అనుకుంటున్నారు. అదెంత అబద్ధమో కదా!—అపొ. 17:27.

అనైతిక కోరికల్ని ప్రోత్సహించడానికి సాతాను అబద్ధ మతాన్ని ఎలా వాడుకున్నాడు? (12వ పేరా చూడండి) *

12. అబద్ధ మతం దేన్ని ప్రోత్సహిస్తుంది? రోమీయులు 1:28-31 ప్రకారం దాని ఫలితమేంటి?

12 లైంగిక పాపం చేసేలా సాతాను ప్రలోభపెడుతున్నాడు. ప్రాచీన ఇశ్రాయేలు కాలంలో అనైతికతను ప్రోత్సహించడానికి సాతాను అబద్ధ మతాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. అబద్ధ మతం అనైతిక ప్రవర్తనను అనుమతించడమే కాదు, దాన్ని ప్రోత్సహిస్తుంది కూడా. ఫలితంగా, దేవున్ని సేవిస్తున్నామని చెప్పుకునే చాలామంది ఆయన స్పష్టమైన నైతిక ప్రమాణాలను పాటించడం మానేశారు. దానివల్ల ఎలాంటి పర్యవసానాలు వచ్చాయో అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన ఉత్తరంలో వివరించాడు. (రోమీయులు 1:28-31 చదవండి.) స్వలింగ సంపర్కంతో సహా అన్నిరకాల లైంగిక పాపాలు “చేయకూడని పనుల” కిందకే వస్తాయి. (రోమా. 1:24-27, 32; ప్రక. 2:20) బైబిలు స్పష్టంగా చెప్తున్నవాటిని మనం పాటించడం చాలా ప్రాముఖ్యం!

13. సాతాను ఉపయోగిస్తున్న మరో పన్నాగం ఏంటి?

13 సాతాను మనుషుల సహజ కోరికల్ని వాడుకుంటున్నాడు. మనల్ని, మన కుటుంబాల్ని పోషించుకోవడానికి ఉపయోగపడే నైపుణ్యాలు నేర్చుకోవాలని కోరుకోవడం సహజమే. (1 తిమో. 5:8) చాలావరకు, స్కూల్‌కు వెళ్లి చక్కగా చదువుకోవడం ద్వారా వాటిని నేర్చుకోవచ్చు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా దేశాల్లో, విద్యా వ్యవస్థ విద్యార్థులకు ఉపయోగపడే నైపుణ్యాల్ని నేర్పించడంతోపాటు మనుషుల తత్త్వజ్ఞానాన్ని కూడా బోధిస్తోంది. దానివల్ల విద్యార్థులు దేవుని ఉనికిని ప్రశ్నిస్తున్నారు, బైబిల్ని పనికిరానిదిగా చూస్తున్నారు. అంతేకాదు, తెలివైనవాళ్లందరూ పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతారని విద్యా వ్యవస్థ బోధిస్తోంది. (రోమా. 1:21-23) అలాంటి బోధలు ‘దేవుని తెలివికి’ విరుద్ధంగా ఉన్నాయి.—1 కొరిం. 1:19-21; 3:18-20.

14. మనుషుల తత్త్వజ్ఞానం వేటిని ప్రోత్సహిస్తుంది?

14 మనుషుల తత్త్వజ్ఞానం యెహోవా నీతి ప్రమాణాలను నిర్లక్ష్యం చేస్తుంది, వ్యతిరేకిస్తుంది. అది పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని కాదు గానీ ‘పాపపు శరీరం చేసే పనుల్ని’ ప్రోత్సహిస్తుంది. (గల. 5:19-23) అది ప్రజల్లో గర్వాన్ని, అహంకారాన్ని నూరిపోస్తుంది, అందుకే వాళ్లు ‘స్వార్థపరులుగా’ తయారౌతున్నారు. (2 తిమో. 3:2-4) దేవుని సేవకుల్లో ఉండాల్సిన సాత్వికానికి, వినయానికి ఆ లక్షణాలు విరుద్ధమైనవి. (2 సమూ. 22:28) ఉన్నత విద్యను అభ్యసించిన కొంతమంది క్రైస్తవులు దేవునిలా కాకుండా లోకస్థుల్లా ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ ప్రమాదాన్ని పసిగట్టకపోతే ఏం జరగవచ్చో ఒక ఉదాహరణ చూద్దాం.

మనుషుల తత్త్వజ్ఞానం మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చగలదు? (14-16 పేరాలు చూడండి) *

15-16. ఒక సహోదరి అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?

15 పదిహేను కన్నా ఎక్కువ సంవత్సరాలు పూర్తికాల సేవ చేసిన ఒక సహోదరి ఇలా చెప్తుంది, “నేను బాప్తిస్మం తీసుకున్న ఒక యెహోవాసాక్షిగా, ఉన్నత విద్య అభ్యసించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయో చదివాను, విన్నాను. కానీ ఆ హెచ్చరికల్ని పట్టించుకోలేదు. ఆ సలహా నాకు కాదులే అనుకున్నాను.” మరి ఆమె ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంది? ఆమె ఇలా ఒప్పుకుంటుంది, “నా పుస్తకాలు చదువుకోవడానికే సమయం, శక్తి అయిపోయేవి. దానివల్ల అంతకుముందులా యెహోవాకు మనస్ఫూర్తిగా ప్రార్థించడానికి సమయం ఉండేది కాదు; ఇతరులతో బైబిలు గురించి చర్చించడానికి, మీటింగ్స్‌కి చక్కగా సిద్ధపడడానికి ఓపిక ఉండేది కాదు. కానీ ఉన్నత విద్య యెహోవాతో నా సంబంధాన్ని పాడు చేస్తోందని గుర్తించాను. దాంతో నా చదువును ఆపేయాలనుకున్నాను, ఆపేశాను కూడా.”

16 ఉన్నత విద్య ఆ సహోదరి ఆలోచనల మీద ఎలాంటి ప్రభావం చూపించింది? ఆమె ఇలా అంటుంది, “ఈ విషయం ఒప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. నేను అభ్యసించిన విద్య ఇతరుల్లో, ముఖ్యంగా నా సహోదరసహోదరీల్లో తప్పులు వెదకడం, వాళ్ల నుండి మరీ ఎక్కువ ఆశించడం, వాళ్ల నుండి వేరుగా ఉండడం నేర్పించింది. ఆ భావాల్ని తీసేసుకోవడానికి నాకు చాలాకాలం పట్టింది. తన సంస్థ ద్వారా మన పరలోక తండ్రి ఇస్తున్న హెచ్చరికల్ని పట్టించుకోకపోవడం ఎంత ప్రమాదకరమో నా అనుభవం నేర్పింది. నా గురించి నాకన్నా యెహోవాకే బాగా తెలుసు. నేను ముందే ఆయన మాట వినుంటే బాగుండేది!”

17. (ఎ) మన నిర్ణయం ఏమై ఉండాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

17 సాతాను లోకంలోని “తత్త్వజ్ఞానంతో, మోసపూరితమైన వట్టి మాటలతో” ఎన్నడూ మోసపోకూడదని నిర్ణయించుకోండి. సాతాను పన్నాగాలకు ఎన్నడూ పడిపోకండి. (1 కొరిం. 3:18; 2 కొరిం. 2:11) యెహోవా ఎలాంటి దేవుడో మీరు ఎన్నడూ మర్చిపోకండి. దేవుని ఉన్నతమైన నైతిక ప్రమాణాల ప్రకారం జీవించండి. సాతాను చేతుల్లో మోసపోయి యెహోవా సలహాల్ని నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ ఈ లోక ఆలోచనా విధానం ఇప్పటికే మీ మీద ప్రభావం చూపిస్తే ఏం చేయాలి? లోతుగా పాతుకుపోయిన ఆలోచనల నుండి, అలవాట్ల నుండి బయటపడడానికి దేవుని వాక్యం ఎలా సహాయం చేస్తుందో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.—2 కొరిం. 10:4, 5.

పాట 49 యెహోవా హృదయాన్ని సంతోషపెడదాం

^ పేరా 5 సాతాను ప్రజల్ని మోసం చేయడంలో దిట్ట. తాము స్వతంత్రులం అనుకునేలా సాతాను చాలామందిని మోసం చేశాడు, కానీ నిజానికి వాళ్లను బానిసలుగా చేసుకున్నాడు. ప్రజల్ని మోసం చేయడానికి సాతాను ఉపయోగించే కొన్ని పన్నాగాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 48 చిత్రాల వివరణ: కనానీయులతో సహవసిస్తున్న ఇశ్రాయేలీయులు బయలును పూజించేలా, అనైతిక పనులు చేసేలా ప్రలోభానికి గురౌతున్నారు.

^ పేరా 51 చిత్రాల వివరణ: స్వలింగ సంపర్కులకు గుర్తుగా ఉన్న రంగుల్ని తమ ప్రకటనలో చూపించి వాళ్లకు మద్దతు తెలుపుతున్న ఒక చర్చీ.

^ పేరా 53 చిత్రాల వివరణ: ఒక యౌవన సహోదరి యూనివర్సిటీలో చదువుకుంటోంది. సైన్స్‌, టెక్నాలజీ మనుషుల సమస్యలన్నిటినీ తీసేయగలవని ప్రొఫెసర్‌ చెప్తున్న మాటల్ని ఆ సహోదరి, ఆమె తోటి విద్యార్థులు నమ్ముతున్నారు. తర్వాత రాజ్యమందిరంలో ఆమె ఆసక్తి లేకుండా కూర్చుంది, అక్కడ చెప్పే విషయాల్లో తప్పులు వెదకడం మొదలుపెట్టింది.