కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 25

‘ఈ చిన్నవాళ్లను’ బాధపెట్టకండి

‘ఈ చిన్నవాళ్లను’ బాధపెట్టకండి

‘ఈ చిన్నవాళ్లలో ఏ ఒక్కర్నీ చిన్నచూపు చూడకండి.’—మత్త. 18:10.

పాట 113 మనకు అనుగ్రహించబడిన శాంతి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా మనలో ప్రతి ఒక్కరినీ ఏం చేశాడు?

యెహోవా మనలో ప్రతి ఒక్కరినీ తన వైపుకు ఆకర్షించుకున్నాడు. (యోహా. 6:44) దానర్థం ఏంటో ఆలోచించండి. ఈ లోకంలో కోట్లమందిని యెహోవా పరిశీలించినప్పుడు, మీలో ఏదో అమూల్యమైనది అంటే ఆయన్ని ప్రేమించగల యథార్థ హృదయాన్ని చూశాడు. (1 దిన. 28:9) యెహోవాకు మీ గురించి తెలుసు, ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు, ప్రేమిస్తాడు. ఆ విషయం ఎంత ఊరటనిస్తుందో కదా!

2. యెహోవాకు ప్రతీ ఒక్కరి మీద శ్రద్ధ ఉందని మనం అర్థం చేసుకునేలా యేసు ఏ ఉదాహరణ చెప్పాడు?

2 యెహోవాకు మీమీద, తోటి సహోదరసహోదరీలందరి మీద ఎంతో శ్రద్ధ ఉంది. మనం ఆ విషయాన్ని అర్థం చేసుకునేలా యేసు యెహోవాను గొర్రెల కాపరితో పోల్చాడు. వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే గొర్రెల కాపరి ఏం చేస్తాడు? “అతను మిగతా 99 గొర్రెల్ని కొండల మీదే విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి” వెళ్తాడు. ఆ గొర్రె దొరికినప్పుడు, అది తప్పిపోయినందుకు దానిమీద కోపపడడు గానీ సంతోషిస్తాడు. దీనినుండి మనం ఏం నేర్చుకోవచ్చు? యెహోవాకు ప్రతీ గొర్రె ప్రాముఖ్యమైనదే. యేసు ఇలా అన్నాడు: “ఈ చిన్నవాళ్లలో ఒక్కరు కూడా నాశనమవ్వడం పరలోకంలో ఉన్న నా తండ్రికి ఇష్టంలేదు.”—మత్త. 18:12-14.

3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

3 తోటి సహోదరసహోదరీల్లో ఏ ఒక్కరినీ నిరుత్సాహపర్చాలని మనం ఎప్పుడూ కోరుకోం. మనం ఇతరుల్ని బాధపెట్టకుండా ఎలా ఉండవచ్చు? ఒకవేళ ఎవరైనా మనల్ని బాధపెడితే మనమేం చేయవచ్చు? ఈ ప్రశ్నలకు మనం ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం. అయితే ముందు మత్తయి 18వ అధ్యాయంలో చెప్పబడిన ‘ఈ చిన్నవాళ్లు’ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం.

‘ఈ చిన్నవాళ్లు’ అంటే ఎవరు?

4. ‘ఈ చిన్నవాళ్లు’ అంటే ఎవరు?

4 ‘ఈ చిన్నవాళ్లు’ అంటే అన్ని వయసులకు చెందిన యేసు శిష్యులు. వయసుతో సంబంధం లేకుండా వాళ్లందరూ “చిన్నపిల్లల్లా” ఉన్నారు. ఎందుకంటే వాళ్లు యేసు దగ్గర నేర్చుకోవాలని కోరుకుంటున్నారు. (మత్త. 18:3) వాళ్లు వేర్వేరు నేపథ్యాలకు, సంస్కృతులకు చెందినవాళ్లైనా, వాళ్ల అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు వేరైనా వాళ్లందరూ యేసు మీద విశ్వాసం చూపిస్తున్నారు. అందుకే యేసు కూడా వాళ్లను ఎంతో ప్రేమిస్తున్నాడు.—యోహా. 1:12.

5. ఎవరైనా తన ప్రజల్లో ఒక్కరిని అభ్యంతరపెట్టినా, లేదా బాధపెట్టినా యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

5 ‘ఈ చిన్నవాళ్లు’ అందరూ యెహోవాకు విలువైనవాళ్లే. యెహోవా వాళ్ల గురించి ఎలా భావిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి, పిల్లల గురించి మనమెలా భావిస్తామో గుర్తుచేసుకుందాం. పిల్లలు మనకు విలువైనవాళ్లు; పెద్దవాళ్లకు ఉన్నంత బలం, అనుభవం, తెలివి వాళ్లకు ఉండవు కాబట్టి మనం వాళ్లను కాపాడాలనుకుంటాం. నిజానికి ఎవరైనా బాధపడుతుంటే మనం చూడలేం. ముఖ్యంగా, పిల్లల్ని ఎవరైనా ఏదైనా అంటే మనకు బాధేస్తుంది, కోపం కూడా వస్తుంది. అదేవిధంగా, యెహోవా తన ప్రజల్ని కాపాడాలని అనుకుంటాడు. ఎవరైనా తన ప్రజల్లో ఒక్కరిని అభ్యంతరపెట్టినా, లేదా నొప్పించినా ఆయనకు బాధ కలుగుతుంది, కోపం కూడా వస్తుంది.—యెష. 63:9.

6. మొదటి కొరింథీయులు 1:26-29 ప్రకారం, లోకంలోని ప్రజలు యేసు శిష్యులను ఎలా చూస్తున్నారు?

6 యేసు శిష్యులు ఇంకా ఏవిధంగా ‘చిన్నవాళ్లలా’ ఉన్నారు? నిజానికి ఈ లోకం ఎవరిని ప్రాముఖ్యమైన వాళ్లుగా ఎంచుతుంది? బాగా డబ్బు, పేరుప్రఖ్యాతులు, అధికారం ఉన్నవాళ్లను. అయితే యేసు శిష్యులు అలాంటివాళ్లు కారు కాబట్టి, ఈ లోకం వాళ్లను ‘చిన్నవాళ్లలా,’ అంత ప్రాముఖ్యమైన వాళ్లు కాదన్నట్లుగా చూస్తుంది. (1 కొరింథీయులు 1:26-29 చదవండి.) కానీ యెహోవా వాళ్లను అలా చూడట్లేదు.

7. మనం సహోదరసహోదరీల గురించి ఎలా భావించాలని యెహోవా కోరుకుంటున్నాడు?

7 తన సేవకులు ఎంతోకాలంగా సత్యంలో ఉన్నా, లేదా ఈ మధ్యే సత్యం నేర్చుకున్నా వాళ్లందరినీ యెహోవా ప్రేమిస్తున్నాడు. మన సహోదరసహోదరీలందరూ యెహోవాకు విలువైనవాళ్లు కాబట్టి, మనం కూడా వాళ్లను విలువైనవాళ్లుగా చూడాలి. మనం కేవలం కొంతమందినే కాకుండా ‘ప్రపంచవ్యాప్త సహోదర బృందాన్ని ప్రేమించాలి’. (1 పేతు. 2:17) వాళ్లను కాపాడడానికి, శ్రద్ధగా చూసుకోవడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. మనం ఎవరినైనా బాధపెట్టామని తెలిస్తే, అదేం పెద్ద విషయం కాదని, అవతలి వ్యక్తే మనల్ని క్షమించి, దాన్ని మర్చిపోవాలని అనుకోకూడదు. కొంతమంది ఎందుకు నొచ్చుకోవచ్చు? కొంతమంది సహోదరసహోదరీలు బహుశా వాళ్లు పెరిగిన విధానాన్ని బట్టి, ఇతరులకన్నా తాము తక్కువవాళ్లమని అనుకుంటారు. ఇంకొంతమంది సత్యంలోకి కొత్తగా రావడంవల్ల, ఇతరుల పొరపాట్లను క్షమించడం ఇంకా నేర్చుకొని ఉండకపోవచ్చు. ఏదేమైనా మనం ఇతరులతో శాంతిగా ఉండడానికి చేయగలిగినదంతా చేయాలి. అంతేకాదు, ఒక వ్యక్తి ప్రతి చిన్నదానికీ బాధపడుతుంటే అలా బాధపడకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అలా చేసినప్పుడు అతను సంతోషంగా ఉంటాడు అలాగే, ఇతర సహోదరసహోదరీలతో అతనికి మంచి సంబంధం ఉంటుంది.

ఇతరుల్ని మీకన్నా గొప్పవాళ్లుగా ఎంచండి

8. యేసు కాలంలో ప్రజలకున్న ఎలాంటి ఆలోచనా విధానం ఆయన శిష్యుల మీద ప్రభావం చూపించింది?

8 ‘ఈ చిన్నవాళ్ల’ గురించి యేసు ఎందుకు మాట్లాడాడు? ఒకసారి ఆయన శిష్యులు, “పరలోక రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు ఎవరు?” అని ఆయన్ని అడిగారు. (మత్త. 18:1) ఆ కాలంలో చాలామంది యూదులు, ఇతరులు తమను ఎంతో ప్రాముఖ్యమైన వాళ్లుగా చూడాలని కోరుకునేవాళ్లు. ఒక పండితుడు ఇలా అంటున్నాడు: ‘చాలామంది పురుషులు ఘనతను, పేరుప్రఖ్యాతుల్ని, అంగీకారాన్ని, గౌరవాన్ని పొందడం కోసమే జీవించారు, చనిపోయారు.’

9. యేసు శిష్యులు ఏం చేయాల్సిన అవసరం ఉంది?

9 తమ చుట్టూ ఉన్న యూదుల్లో పోటీతత్వం బలంగా నాటుకుపోయింది. కాబట్టి తన శిష్యులు అలాంటి ఆలోచనా విధానాన్ని తీసేసుకోవడానికి ఎంతో కృషి చేయాలని యేసుకు తెలుసు. అందుకే ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “మీలో అందరికన్నా గొప్పవాడు అందరికన్నా చిన్నవాడిలా ఉండాలి; ముందుండి నడిపించే వ్యక్తి సేవకుడిలా ఉండాలి.” (లూకా 22:26) ‘ఇతరుల్ని మనకన్నా గొప్పవాళ్లుగా’ ఎంచితే, మనం అందరికన్నా ‘చిన్నవాళ్లుగా’ ప్రవర్తించినవాళ్లం అవుతాం. (ఫిలి. 2:3) అలాంటి ఆలోచనా విధానాన్ని మనం ఎంత ఎక్కువగా అలవర్చుకుంటే, ఇతరుల్ని నొప్పించే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి.

10. పౌలు ఇచ్చిన ఏ సలహాను మనం పాటించాలి?

10 మన సహోదరసహోదరీలందరూ ఏదోకవిధంగా మనకన్నా గొప్పవాళ్లే. వాళ్లలో ఉన్న మంచి లక్షణాల మీద మనం దృష్టిపెడితే, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు ఇచ్చిన ఈ సలహాను మనం పాటించాలి: “ఎదుటివ్యక్తి కన్నా మిమ్మల్ని గొప్పవాళ్లుగా చేసేది ఏమిటి? మీ దగ్గరున్న ప్రతీది దేవుడు ఇచ్చిందే కదా? అన్నీ దేవుడే ఇచ్చినప్పుడు, మీరేదో మీ సొంత శక్తితో సంపాదించుకున్నట్టు ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు?” (1 కొరిం. 4:7) ఇతరులు మనల్ని ప్రత్యేకంగా చూడాలని లేదా వాళ్లకన్నా మనల్ని గొప్పగా ఎంచాలని ఎన్నడూ కోరుకోకూడదు. ఒక సహోదరుడు ప్రోత్సాహకరమైన ప్రసంగాలిచ్చినా, లేదా ఒక సహోదరి చాలా బైబిలు అధ్యయనాల్ని మొదలుపెట్టినా వాళ్లు వెంటనే ఆ ఘనత అంతా యెహోవాకు ఇవ్వాలి.

“మనస్ఫూర్తిగా” క్షమించండి

11. రాజు, అతని దాసుని ఉదాహరణ ద్వారా యేసు మనకేం నేర్పించాడు?

11 ఇతరుల్ని నొప్పించొద్దని తన అనుచరులను హెచ్చరించిన తర్వాత యేసు వాళ్లకు ఒక రాజు, అతని దాసుడి ఉదాహరణ చెప్పాడు. దాసుడు ఎప్పటికీ తీర్చలేని పెద్ద అప్పును ఆ రాజు రద్దు చేశాడు. అయితే తోటి దాసుడు తన దగ్గర చేసిన చిన్న అప్పును రద్దు చేయడానికి ఆ దాసుడు ఏమాత్రం ఒప్పుకోలేదు. చివరికి రాజు కరుణలేని ఆ దాసుణ్ణి చెరసాలలో వేయించాడు. మనమేం నేర్చుకోవచ్చు? యేసు ఇలా అన్నాడు: “మీలో ప్రతీ ఒక్కరు మీ సహోదరుణ్ణి మనస్ఫూర్తిగా క్షమించకపోతే నా పరలోక తండ్రి కూడా మీ విషయంలో అలాగే చేస్తాడు.”—మత్త. 18:21-35.

12. మనం ఇతరుల్ని క్షమించడానికి ఇష్టపడకపోతే ఏం జరగవచ్చు?

12 ఆ దాసుడు చేసిన పని అతన్నే కాదు, ఇతరుల్ని కూడా బాధపెట్టింది. మొదటిగా, అతను తోటి దాసునిపట్ల దయ, కరుణ లేకుండా ప్రవర్తించి “అప్పు తీర్చేంతవరకు ఆ దాసుణ్ణి చెరసాలలో వేయించాడు.” రెండవదిగా, అతను చేసిన పనివల్ల ఇతర దాసుల్ని కూడా బాధపెట్టాడు. ‘జరిగింది చూసినప్పుడు అతని తోటి దాసులు చాలా బాధపడ్డారు’ అని బైబిలు చెప్తుంది. అదేవిధంగా, మన పనులు ఇతరుల మీద ప్రభావం చూపిస్తాయి. ఎవరైనా మనల్ని బాధపెట్టేలా ప్రవర్తించినప్పుడు, మనం వాళ్లని క్షమించడానికి ఇష్టపడకపోతే ఏం జరగవచ్చు? మొదటిగా, క్షమించడానికి ఇష్టపడకపోవడం వల్ల అతన్ని పట్టించుకోం, ప్రేమ చూపించం, ఆవిధంగా అతన్ని బాధపెడతాం. రెండవదిగా, ఆ వ్యక్తితో మనం శాంతియుతంగా లేమని సంఘంలో ఇతరులు గమనించినప్పుడు వాళ్లు ఇబ్బందిపడతారు.

మీరు కోపాన్ని మనసులో ఉంచుకుంటారా? లేదా మనస్ఫూర్తిగా క్షమిస్తారా? (13-14 పేరాలు చూడండి) *

13. ఒక పయినీరు సహోదరి అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

13 తోటి సహోదరసహోదరీలను క్షమించినప్పుడు మనం, అలాగే ఇతరులు ప్రయోజనం పొందుతాం. అలా ప్రయోజనం పొందిన క్రిస్టల్‌ అనే ఒక పయినీరు సహోదరి అనుభవాన్ని గమనించండి. సంఘంలోని ఒక సహోదరి వల్ల ఆమె బాధపడింది. క్రిస్టల్‌ ఇలా గుర్తుచేసుకుంటుంది: “కొన్నిసార్లు ఆమె మాటలు ఎంత కటువుగా ఉండేవంటే, అవి నాకు కత్తిపోట్లులా అనిపించేవి. ఆమెతో కలిసి పరిచర్యకు కూడా వెళ్లాలనిపించేది కాదు. దానివల్ల పరిచర్యలో నా ఉత్సాహం, సంతోషం తగ్గిపోవడం మొదలైంది.” అలా బాధపడడానికి తనకు సరైన కారణమే ఉందని క్రిస్టల్‌ అనుకుంది. అయినా ఆమె ఆ సహోదరి మీద కోపం పెంచుకోలేదు, లేదా అలా బాధపడుతూ ఉండిపోలేదు. దానికి బదులు, 1999 అక్టోబరు 15 కావలికోటలోని “హృదయపూర్వకంగా క్షమించండి” అనే ఆర్టికల్‌లో ఉన్న లేఖన సలహాను వినయంగా పాటించింది. క్రిస్టల్‌ తన సహోదరిని క్షమించింది. ఆమె ఇలా అంటుంది: “మనందరం కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవడానికి కృషిచేస్తూ ఉన్నామని, యెహోవా కూడా మనల్ని ప్రతీరోజు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని నాకిప్పుడు అర్థమైంది. నా హృదయంలో భారం దిగిపోయినట్లు అనిపించింది, దానివల్ల నా సంతోషాన్ని తిరిగి పొందాను.”

14. మత్తయి 18:21, 22 ప్రకారం, అపొస్తలుడైన పేతురుకు ఏం చేయడం కష్టంగా ఉండివుంటుంది, దానికి యేసు ఇచ్చిన జవాబు నుండి మనమేం నేర్చుకోవచ్చు?

14 ఇతరులను క్షమించాలని, అలా చేయడం సరైనదని మనకు తెలుసు. కానీ అలా క్షమించడం మనకు కష్టం కావచ్చు. అపొస్తలుడైన పేతురుకు కొన్నిసార్లు అలానే అనిపించివుండవచ్చు. (మత్తయి 18:21, 22 చదవండి.) ఇతరుల్ని క్షమించడానికి మనకేది సహాయం చేస్తుంది? మొదటిగా, యెహోవా మనల్ని ఎంతగా క్షమించాడో ధ్యానించండి. (మత్త. 18:32, 33) మనమాయన క్షమాపణకు అర్హులం కాకపోయినా, ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. (కీర్త. 103:8-10) అదే సమయంలో “ఒకరినొకరం ప్రేమించుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది.” కాబట్టి క్షమించడం అనేది మనకు వీలైతే చేసే పనికాదు. మన సహోదరసహోదరీలను మనం తప్పకుండా క్షమించాలి. (1 యోహా. 4:11) రెండవదిగా, మనం క్షమించినప్పుడు ఏం జరుగుతుందో ధ్యానించండి. మనల్ని బాధపెట్టేలా ప్రవర్తించిన వ్యక్తికి సహాయం చేయవచ్చు, సంఘ ఐక్యతకు తోడ్పడవచ్చు, యెహోవాతో స్నేహాన్ని కాపాడుకోవచ్చు అలాగే, మనం ప్రశాంతంగా ఉండవచ్చు. (2 కొరిం. 2:7; కొలొ. 3:14) చివరిగా, ఇతరుల్ని క్షమించమని చెప్తున్న యెహోవాకు ప్రార్థించండి. మనకు సహోదరసహోదరీలతో ఉన్న మంచి సంబంధాన్ని పాడుచేసేలా సాతానును అనుమతించకండి. (ఎఫె. 4:26, 27) సాతాను ఉచ్చులో పడిపోకుండా ఉండడానికి మనకు యెహోవా సహాయం అవసరం.

ఇతరుల వల్ల బాధపడకండి

15. ఒక సహోదరుడు, లేదా సహోదరి మిమ్మల్ని ఇబ్బందిపెట్టేలా ప్రవర్తిస్తే, కొలొస్సయులు 3:13 మనల్ని ఏం చేయమని చెప్తుంది?

15 ఒక సహోదరుడు, లేదా సహోదరి మిమ్మల్ని బాగా ఇబ్బందిపెట్టేలా ప్రవర్తిస్తే అప్పుడేంటి? మీరేం చేయాలి? వాళ్లతో శాంతిగా ఉండడానికి చేయగలిగినదంతా చేయండి, మీకెలా అనిపిస్తుందో యెహోవాకు చెప్పండి. మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తికి సహాయం చేయమని ఆయన్ని అడగండి. అతనిలో ఉన్న మంచి లక్షణాల్ని అంటే యెహోవా అతనిలో ఏ లక్షణాలనైతే ఇష్టపడ్డాడో వాటిని చూసేలా మీకు సహాయం చేయమని ప్రార్థించండి. (లూకా 6:28) ఆ సహోదరుడు చేసినదాన్ని మీరు మర్చిపోలేకపోతే అతనితో ఎలా మాట్లాడవచ్చో ఆలోచించండి. అతను మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశంతో అలా ప్రవర్తించి ఉండడని అనుకోవడం మంచిది. (మత్త. 5:23, 24; 1 కొరిం. 13:7) మీరు అతనితో మాట్లాడినప్పుడు అతను చెప్పేది నిజమని నమ్మండి. అతను మీతో సమాధానపడడానికి ఇష్టపడకపోతే మీరేం చేయాలి? అతని పట్ల “సహనం చూపిస్తూ” ఉండండి, మీ సహోదరుని విషయంలో ఆశ వదులుకోకండి. (కొలొస్సయులు 3:13 చదవండి.) మరిముఖ్యంగా, అతని మీద కోపాన్ని ఉంచుకోకండి. దానివల్ల యెహోవాతో మీ సంబంధం పాడవ్వగలదు. మీరు దేనివల్లా బాధపడకుండా చూసుకోండి, అలాచేస్తే మీరు అన్నిటికన్నా యెహోవానే ఎక్కువగా ప్రేమిస్తున్నారని నిరూపిస్తారు.—కీర్త. 119:165.

16. మనలో ప్రతీ ఒక్కరికి ఏ బాధ్యత ఉంది?

16 ‘ఒకే కాపరి కింద ఒకే మందలా’ తోటి సహోదరసహోదరీలతో కలిసి యెహోవాను సేవిస్తున్నందుకు మనమెంత కృతజ్ఞులమో కదా! (యోహా. 10:16) యెహోవా చిత్తం చేస్తున్న సంస్థ అనే పుస్తకంలో ఉన్న 165వ పేజీలో ఇలా ఉంది: “అలాంటి ఐక్యత నుండి ప్రయోజనం పొందుతున్న మీకు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది.” కాబట్టి మనం ‘సహోదరసహోదరీలను యెహోవా చూస్తున్నట్లే చూడడానికి స్వీయ శిక్షణ ఇచ్చుకోవాలి.’ యెహోవాకు మనందరం ప్రియమైన ‘చిన్నవాళ్లం’. తోటి సహోదరసహోదరీలను మీరు కూడా అలాగే చూస్తున్నారా? వాళ్లకు సహాయం చేయడానికి, వాళ్లమీద శ్రద్ధ చూపించడానికి మీరు చేసే ప్రతీదాన్ని యెహోవా గమనిస్తాడు, దాన్ని విలువైనదిగా ఎంచుతాడు.—మత్త. 10:42.

17. మనమేం చేయాలని నిశ్చయించుకుందాం?

17 తోటి సహోదరసహోదరీల్ని మనం ప్రేమిస్తాం. కాబట్టి, “సహోదరుని ముందు అడ్డురాయి గానీ, అడ్డంకి గానీ పెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుందాం.” (రోమా. 14:13) తోటి సహోదరసహోదరీలను మనకన్నా గొప్పగా ఎంచుతూ వాళ్లను మనస్ఫూర్తిగా క్షమిద్దాం, ఇతరుల వల్ల బాధపడకుండా చూసుకుందాం. అలాగే, “ఇతరులతో శాంతిగా ఉండడానికి, ఒకరినొకరం బలపర్చుకోవడానికి చేయగలిగినదంతా చేద్దాం.”—రోమా. 14:19.

పాట 130 క్షమిస్తూ ఉండండి

^ పేరా 5 మనం అపరిపూర్ణులం కాబట్టి తోటి సహోదరసహోదరీలను మన మాటల ద్వారా, పనుల ద్వారా బాధపెట్టే అవకాశం ఉంది. అలా జరిగితే మనమేం చేయాలి? తోటి సహోదరసహోదరీలతో సమాధానపడడానికి చేయగలిగినదంతా చేస్తామా? క్షమించమని వెంటనే అడుగుతామా? లేదా వాళ్లు బాధపడితే అది వాళ్ల సమస్యని, నా సమస్య కాదని అనుకుంటామా? ఒకవేళ ఇతరుల మాటల్ని బట్టి, పనుల్ని బట్టి మనం తరచూ నొచ్చుకుంటుంటే అప్పుడేంటి? నా స్వభావం ఇంతే, నేను మారాల్సిన అవసరం లేదని సమర్థించుకుంటామా లేదా మార్చుకోవాల్సిన అవసరముందని గుర్తిస్తామా?

^ పేరా 53 చిత్రాల వివరణ: ఒక సహోదరి ఇంకో సహోదరి వల్ల నొచ్చుకుంది. వాళ్లిద్దరు కలుసుకొని సమస్యను పరిష్కరించుకున్న తర్వాత, ఆ విషయాన్ని వదిలేసి కలిసి సంతోషంగా సేవచేస్తున్నారు.