కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

యేసు కాలంలో ప్రజలు ఎలాంటి పన్నులు కట్టేవాళ్లు?

ఇశ్రాయేలీయులు ఎన్నో సంవత్సరాలపాటు సత్యారాధనకు మద్దతివ్వడానికి విరాళాలు ఇచ్చేవాళ్లు. అయితే, యేసు జీవించిన కాలంలో యూదులు చాలారకాల పన్నులు కట్టేవాళ్లు. దానివల్ల వాళ్ల జీవితం కష్టంగా తయారైంది.

ప్రత్యక్ష గుడారానికి, ఆ తర్వాత కట్టిన ఆలయానికి మద్దతివ్వడం కోసం యూదుల్లోని మగవాళ్లందరూ అర షెకెల్‌ లేదా రెండు డ్రక్మాలు కట్టేవాళ్లు. యేసు కాలంలో ఆ పన్నును బలుల కోసం, అలాగే హేరోదు కట్టించిన ఆలయాన్ని చూసుకోవడం కోసం ఉపయోగించేవాళ్లు. యేసు పన్ను కడతాడా లేదా అని కొంతమంది యూదులు పేతురును అడిగారు. అప్పుడు యేసు పన్ను కట్టడం తప్పని అనలేదు. నిజానికి, పన్ను కట్టడానికి ఒక నాణెం ఎక్కడ దొరుకుతుందో కూడా ఆయన చెప్పాడు.—మత్త 17:24-27.

అప్పట్లో దేవుని ప్రజలు తమ పంటలో నుండి లేదా సంపాదనలో నుండి పదోవంతు తెచ్చి ఇచ్చేవాళ్లు. (లేవీ. 27:30-32; సంఖ్యా. 18:26-28) మతనాయకులు, ప్రజలు పండించిన ప్రతీ దాన్నుండి పదోవంతు ఇవ్వాలని పట్టుబట్టేవాళ్లు. చివరికి “పుదీనలో, సోపులో, జీలకర్రలో” కూడా పదోవంతు ఇవ్వమని అడిగేవాళ్లు. యేసు పదోవంతు ఇవ్వడాన్ని తప్పుపట్టలేదు, కానీ ఆ విషయంలో శాస్త్రుల, పరిసయ్యుల ఆలోచనాతీరు తప్పని ఖండించాడు.—మత్త. 23:23.

ఆ కాలంలో తమను పరిపాలిస్తున్న రోమన్లకు యూదులు ఎన్నోరకాల పన్నులు చెల్లించాల్సి వచ్చేది. ఉదాహరణకు, ఎవరికైనా భూమి ఉంటే డబ్బును లేదా వస్తువులను పన్నుగా కట్టాలి. వాళ్ల భూమి నుండి పండించిన దానిలో నాలుగోవంతు లేదా ఐదోవంతు ఇవ్వాలి. దానితోపాటు ప్రతీ యూదుడు కట్టాల్సిన ఇంకొక పన్ను ఉండేది. ఈ పన్ను గురించే పరిసయ్యులు యేసును ప్రశ్నించారు. పన్నులు కట్టడం గురించి ఎలా భావించాలో చెప్తూ యేసు ఇలా అన్నాడు: “అయితే కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి.”—మత్త. 22:15-22.

ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి సరుకుల్ని ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేయాలన్నా పన్ను కట్టేవాళ్లు. ఆ పన్నుని ఓడ రేవులు, బ్రిడ్జిలు, కూడళ్ల దగ్గర లేదా పట్టణాల, మార్కెట్ల ప్రవేశాల దగ్గర వసూలు చేసేవాళ్లు.

రోమా పరిపాలనలో ప్రజల మీద పన్నుల భారం మరీ ఎక్కువగా ఉండేది. రోమా చరిత్రకారుడైన టాసిటస్‌ ప్రకారం, యేసు ఈ భూమ్మీద ఉన్నప్పుడు తిబెరి చక్రవర్తి పరిపాలనలో “సిరియా, యూదయ ప్రాంతాలవాళ్లు పన్నులు కట్టలేక వాటిని తగ్గించమని వేడుకున్నారు.”

ఆ పన్నులు వసూలు చేసిన విధానం వల్ల ప్రజలకు ఇంకా ఎక్కువ భారంగా అనిపించింది. పన్నులు వసూలు చేసే ఉద్యోగాన్ని, ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్లకు అమ్మేవాళ్లు. ఉద్యోగాన్ని కొనుక్కున్నవాళ్లు కొంతమంది మనుషుల్ని పెట్టి ప్రజల దగ్గర పన్ను వసూలు చేసేవాళ్లు. అలా వాళ్లందరూ డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించేవాళ్లు. జక్కయ్య కింద కూడా పన్ను వసూలు చేసే మనుషులు ఉండివుంటారు. (లూకా 19:1, 2) ఈ విధంగా పన్నులు వసూలు చేయడాన్ని, అలా వసూలు చేసేవాళ్లను ప్రజలు ద్వేషించారని అర్థమౌతుంది.