కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 23

యెహోవా ఉండగా, మీరు ఎప్పటికీ ఒంటరివాళ్లు కాదు

యెహోవా ఉండగా, మీరు ఎప్పటికీ ఒంటరివాళ్లు కాదు

“తనకు మొరపెట్టే వాళ్లందరికీ యెహోవా దగ్గరగా ఉన్నాడు.”—కీర్త. 145:18.

పాట 28 యెహోవా స్నేహాన్ని సంపాదించుకోవడం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. కొన్నిసార్లు యెహోవా సేవకులకు ఎందుకు ఒంటరిగా అనిపించవచ్చు?

కొన్నిసార్లు మనలో చాలామందికి ఒంటరిగా అనిపిస్తుంది. కొంతమంది అలాంటి భావాల నుండి త్వరగా బయటపడతారు; ఇంకొంతమందికి ఎక్కువ సమయం పట్టవచ్చు. కొన్నిసార్లు నలుగురిలో ఉన్నా మనకు ఒంటరిగా అనిపించవచ్చు. కొందరికి, కొత్త సంఘానికి వెళ్లాక స్నేహితుల్ని చేసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ఇంకొందరు ఎక్కువ ప్రేమానురాగాలు ఉన్న కుటుంబంలో పెరిగి ఉంటారు. వాళ్లు తమ కుటుంబం నుండి వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు ఒంటరితనంతో బాధపడతారు. మరికొందరు వాళ్ల ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు వాళ్లతో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడతారు. ఇంకొంతమంది, ముఖ్యంగా సత్యంలోకి కొత్తగా వచ్చిన క్రైస్తవులు, యెహోవాను ఆరాధించని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు వ్యతిరేకించినప్పుడు ఒంటరిగా భావిస్తారు.

2. మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

2 యెహోవాకు మన గురించి పూర్తిగా తెలుసు, ఆయన మనల్ని అర్థంచేసుకుంటాడు కూడా. మనం ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు మనకెలా అనిపిస్తుందో ఆయనకు తెలుసు. అలాంటి భావాల నుండి బయటపడేలా మనకు సహాయం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి యెహోవా ఎలా సహాయం చేస్తాడు? మనవైపు నుండి ఎలాంటి ప్రయత్నం చేయవచ్చు? సంఘంలో ఎవరైనా ఒంటరితనంతో బాధపడుతుంటే వాళ్లకు మనం ఎలా సహాయం చేయవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం.

యెహోవా మనల్ని పట్టించుకుంటాడు

ఏలీయా ఒంటరివాడు కాడని అభయం ఇవ్వడానికి యెహోవా ఒక దూతను పంపించాడు (3వ పేరా చూడండి)

3. యెహోవా ఏలీయాను ఎలా పట్టించుకున్నాడు?

3 తన ఆరాధకులందరూ సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఆయన మనలో ప్రతీ ఒక్కరికి దగ్గరగా ఉంటాడు. మనం నిరుత్సాహంతో బాధపడుతున్నప్పుడు మనల్ని గమనిస్తాడు. (కీర్త. 145:18, 19) ప్రవక్త అయిన ఏలీయాను యెహోవా ఎలా పట్టించుకున్నాడో, అతనికి ఎలా సహాయం చేశాడో పరిశీలించండి. ఇశ్రాయేలు చరిత్రలోని కష్టమైన కాలంలో ఏలీయా జీవించాడు. ఆ కాలంలో యెహోవా అంటే ఇష్టంలేని వ్యక్తులు ఇశ్రాయేలీయుల్ని పరిపాలించారు. వాళ్లు ఆయన ఆరాధకుల్ని తీవ్రంగా హింసించారు. ముఖ్యంగా ఏలీయాను చంపాలని అనుకున్నారు. (1 రాజు. 19:1, 2) దానికి తోడు, యెహోవాను సేవిస్తున్న ప్రవక్తల్లో తాను ఒక్కడినే మిగిలానని అనుకోవడం వల్ల ఏలీయా ఇంకా ఎక్కువ నిరుత్సాహపడి ఉంటాడు. (1 రాజు. 19:10) దేవుడు వెంటనే ఏలీయాకు సహాయం చేశాడు. యెహోవా ఒక దూతను పంపించి ఏలీయా ఒంటరివాడు కాడని అభయమిచ్చాడు, ఇశ్రాయేలీయుల్లో తనను నమ్మకంగా సేవిస్తున్నవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారని ఆ దూత ద్వారా చెప్పాడు.—1 రాజు. 19:5, 18.

4. మార్కు 10:29, 30 చెప్తున్నట్లు కుటుంబ సభ్యుల, స్నేహితుల మద్దతును కోల్పోయినవాళ్లను యెహోవా ఎలా పట్టించుకుంటాడు?

4 యెహోవాను సేవించాలని నిర్ణయించుకున్నప్పుడు మనలో కొంతమంది చాలా త్యాగాలు చేయాల్సివస్తుందని యెహోవాకు తెలుసు. అందులో ఒకటి సత్యంలోలేని కుటుంబ సభ్యుల, స్నేహితుల మద్దతు కోల్పోవడం. బహుశా కాస్త ఆందోళనతో అపొస్తలుడైన పేతురు యేసును ఇలా అడిగాడు, “మేము అన్నీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం, మరి మాకు ఏం దొరుకుతుంది?” (మత్త. 19:27) దానికి యేసు, క్రైస్తవ సంఘం వాళ్లకు కుటుంబంగా ఉంటుందని అభయమిచ్చాడు. (మార్కు 10:29, 30 చదవండి.) అలాగే మన ఆధ్యాత్మిక కుటుంబానికి శిరస్సైన యెహోవా తన సేవ చేయాలని కోరుకునేవాళ్లకు సహాయం చేస్తానని మాట ఇస్తున్నాడు. (కీర్త. 9:10) ఒంటరితనంతో పోరాడుతున్నప్పుడు యెహోవా ఇస్తున్న సహాయాన్ని తీసుకోవడానికి, మనం ఏం చేయవచ్చో కొన్ని విషయాల్ని పరిశీలిద్దాం.

మీకు ఒంటరిగా అనిపిస్తే మీరు ఏం చేయవచ్చు?

5. యెహోవా మీకు ఎలా సహాయం చేస్తున్నాడో ఆలోచించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?

5 యెహోవా మీకు ఎలా సహాయం చేస్తున్నాడో ఆలోచించండి. (కీర్త. 55:22) అలా ఆలోచించినప్పుడు మీరు ఒంటరివాళ్లు కాదని తెలుసుకుంటారు. తన కుటుంబ సభ్యులెవ్వరూ సత్యంలోలేని క్యారల్‌ * అనే ఒంటరి సహోదరి ఇలా అంటుంది, “నాకు ఎదురైన కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా ఎలా సహాయం చేశాడో గుర్తుచేసుకున్నప్పుడు, నేను ఒంటరిగా లేనని నాకనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా యెహోవా నాకు తోడుగా ఉంటాడని నమ్మకం కుదిరింది.”

6. సమస్యల వల్ల బాధపడుతున్న వాళ్లకు 1 పేతురు 5:9, 10 లో ఉన్న మాటలు ఎలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి?

6 సమస్యల వల్ల బాధపడుతున్న తోటి సహోదరసహోదరీలకు యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడో ఆలోచించండి. (1 పేతురు 5:9, 10 చదవండి.) చాలాకాలం నుండి సత్యంలో ఒక్కడే కొనసాగుతున్న హీరోషీ అనే సహోదరుడు ఇలా అంటున్నాడు, “సంఘంలో ప్రతీ ఒక్కరికి సమస్యలు ఉంటాయి. అయినా యెహోవా సేవ చేయడానికి మనందరం శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని తెలుసుకోవడం, సత్యంలో ఒంటరిగా ఉన్న మాలాంటి వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది.”

7. ప్రార్థన మీకు వ్యక్తిగతంగా ఎలా సహాయం చేసింది?

7 క్రమంగా ప్రార్థించండి, బైబిలు చదవండి, కూటాలకు హాజరవ్వండి. మీకెలా అనిపిస్తుందో ప్రార్థనలో యెహోవాకు చెప్పండి. (1 పేతు. 5:7) మాసీయెల్‌ అనే ఒంటరి సహోదరి ఇలా చెప్తుంది, “ఒంటరితనం నుండి బయటపడడానికి నాకు ముఖ్యంగా సహాయం చేసింది యెహోవాకు పట్టుదలగా ప్రార్థించడమే.” ఆమె యెహోవా సేవ చేయాలని నిర్ణయించుకుంది. అయితే మిగతా కుటుంబ సభ్యులు తనలాంటి నిర్ణయం తీసుకోనప్పుడు ఆమెకు ఒంటరిగా అనిపించింది. ఆమె ఇంకా ఇలా అంటుంది, “యెహోవాను నేను నిజమైన తండ్రిలా భావించాను. అందుకే నేను ప్రతిరోజూ చాలాసార్లు ప్రార్థించి నాకు ఎలా అనిపిస్తుందో చెప్పేదాన్ని.”

బైబిలు అలాగే మన ప్రచురణల ఆడియో రికార్డింగులను వింటే అంత ఒంటరిగా అనిపించకపోవచ్చు (8వ పేరా చూడండి) *

8. బైబిల్ని చదవడం, ధ్యానించడం మీకు వ్యక్తిగతంగా ఎలా సహాయం చేసింది?

8 రోజూ దేవుని వాక్యాన్ని చదువుతూ యెహోవాకు మీమీద ప్రేమ ఉందని తెలిపే బైబిలు వృత్తాంతాన్ని ధ్యానించండి. బియాంకా అనే సహోదరితో ఆమె కుటుంబ సభ్యులు నిరుత్సాహపర్చేలా మాట్లాడేవాళ్లు. ఆమె ఇలా అంటుంది, “బైబిలు వృత్తాంతాల్ని, నాలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న యెహోవా సేవకుల జీవిత కథల్ని చదివి, ధ్యానించడం నాకు నిజంగా సహాయం చేస్తుంది.” కీర్తనలు 27:10, యెషయా 41:10 లాంటి ఓదార్పునిచ్చే లేఖనాల్ని కొంతమంది క్రైస్తవులు గుర్తుచేసుకుంటారు. ఇంకొంతమంది కూటాలకు సిద్ధపడుతున్నప్పుడు లేదా బైబిలు చదువుతున్నప్పుడు వాటికి సంబంధించిన ఆడియో రికార్డింగులను వింటారు. దానివల్ల అంత ఒంటరిగా అనిపించట్లేదని వాళ్లు అంటున్నారు.

9. కూటాలకు హాజరవ్వడం మీకు వ్యక్తిగతంగా ఎలా సహాయం చేసింది?

9 కూటాలకు క్రమంగా హాజరవ్వడానికి చేయగలిగినదంతా చేయండి. అలా చేస్తే అక్కడ వినే ప్రోత్సాహకరమైన విషయాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. అలాగే మీ సహోదరసహోదరీల గురించి ఎక్కువ తెలుసుకుంటారు. (హెబ్రీ. 10:24, 25) పై పేరాల్లో చూసిన మాసీయెల్‌ ఇలా చెప్తుంది, “నేను చాలా బిడియస్థురాలిని, అయినప్పటికీ ప్రతీ కూటానికి వెళ్లాలని, ఒక్క కామెంట్‌ అయినా చెప్పాలని నిశ్చయించుకున్నాను. అలా చేయడం వల్ల సంఘంలోని సహోదరసహోదరీలకు దగ్గరైనట్టు అనిపించింది.”

10. సంఘంలోని నమ్మకమైన క్రైస్తవుల్ని స్నేహితులుగా చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

10 నమ్మకమైన క్రైస్తవుల్ని స్నేహితులుగా చేసుకోండి. చిన్నవాళ్లనైనా, పెద్దవాళ్లనైనా, వేరే సంస్కృతికి చెందినవాళ్లనైనా సంఘంలో ఆదర్శవంతుల్ని మీ స్నేహితులుగా చేసుకోండి. “వృద్ధుల దగ్గర” తెలివి ఉంటుందని బైబిలు మనకు గుర్తుచేస్తుంది. (యోబు 12:12) వృద్ధులు కూడా, సంఘంలో నమ్మకంగా సేవచేస్తున్న యౌవనుల నుండి ఎంతో నేర్చుకోవచ్చు. దావీదు, యోనాతాను కన్నా వయసులో చాలా చిన్నవాడు. అయినా వాళ్లిద్దరు సన్నిహిత స్నేహితులయ్యారు. (1 సమూ. 18:1) ఎన్నో కష్టమైన సందర్భాల్లో కూడా యెహోవాను సేవించడానికి దావీదు, యోనాతానులు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. (1 సమూ. 23:16-18) ప్రస్తుతం తన కుటుంబంలో తాను మాత్రమే యెహోవాసాక్షిగా ఉన్న ఐరీన అనే సహోదరీ ఇలా అంటుంది, “మన సహోదరసహోదరీలు మనకు నిజంగా ఆధ్యాత్మిక తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు అవ్వగలరు. అలా యెహోవా వాళ్లను ఉపయోగించుకుని మనకు ఒక కుటుంబాన్ని ఇస్తాడు.”

11. సన్నిహిత స్నేహాల్ని ఏర్పరచుకోవాలంటే మనం ఏం చేయాలి?

11 మీరు బిడియస్థులైతే కొత్త స్నేహితుల్ని చేసుకోవడం బహుశా అంత తేలిక కాదు. వ్యతిరేకత ఉన్నప్పటికీ సత్యం నేర్చుకున్న రత్న అనే సహోదరి ఇలా ఒప్పుకుంటుంది, “సంఘంలోని సహోదరసహోదరీల సహాయం నాకు అవసరమని అర్థం చేసుకున్నాను.” మీ భావాల్ని వేరేవాళ్లతో పంచుకోవడం మీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ అలా చేసినప్పుడే మీరు అతనికి లేదా ఆమెకు దగ్గరి స్నేహితులవుతారు. మీ స్నేహితులు మిమ్మల్ని ప్రోత్సహించాలని, మీకు సహాయం చేయాలని కోరుకుంటారు. అయితే, వాళ్లు అలా చేయాలంటే మీ భావాల్ని వాళ్లతో పంచుకోవాలి.

12. సహోదరీలను మంచి స్నేహితులుగా చేసుకోవడానికి పరిచర్య మనకెలా సహాయం చేస్తుంది?

12 తోటి సహోదరసహోదరీలను స్నేహితుల్ని చేసుకోవడానికి ఒక మంచి మార్గం వాళ్లతో కలిసి పరిచర్యలో పాల్గొనడం. పైన ప్రస్తావించబడిన క్యారల్‌ ఇలా అంటోంది, “పరిచర్యలో అలాగే ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో సహోదరీలతో కలిసి సమయం గడపడం వల్ల మంచి స్నేహితుల్ని సంపాదించుకోగలిగాను. యెహోవా ఇలాంటి స్నేహితుల ద్వారా నాకు సంవత్సరాలుగా సహాయం చేశాడు.” నమ్మకమైన క్రైస్తవుల్ని స్నేహితులుగా చేసుకోవడం ఎప్పుడూ మంచిదే. మీరు నిరుత్సాహానికి గురైనప్పుడు అంటే మీకు ఒంటరిగా అనిపించినప్పుడు, యెహోవా ఈ స్నేహితుల్ని ఉపయోగించుకొని మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు.—సామె. 17:17.

సంఘంలో ఒకరిగా భావించేలా ఇతరులకు సహాయం చేయండి

13. సంఘంలోని వాళ్లందరికి ఏ బాధ్యత ఉంది?

13 ఎవ్వరికీ ఒంటరిగా అనిపించకుండా సంఘంలో ప్రేమపూర్వక, శాంతియుత వాతావరణాన్ని కల్పించే బాధ్యత సంఘంలోని వాళ్లందరికి ఉంది. (యోహా. 13:35) మన మాటలు, పనులు ఇతరుల్ని ఎంతో ప్రోత్సహించగలవు. ఒక సహోదరి ఇలా చెప్పింది, “నేను సత్యం నేర్చుకున్నప్పుడు సంఘంలోని వాళ్లందరూ నా కుటుంబ సభ్యులయ్యారు. వాళ్ల సహాయం లేకపోతే నేనొక యెహోవాసాక్షిని అయ్యుండేదాన్ని కాదు.” సత్యంలో ఒంటరిగా ఉన్నవాళ్లు కూడా సంఘంలో ఒకరిగా భావించేలా మనం ఎలా సహాయం చేయవచ్చు?

14. కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి మీరేం చేయవచ్చు?

14 కొత్తవాళ్లను స్నేహితులుగా చేసుకోవడానికి చొరవ తీసుకోండి. సంఘానికి కొత్తగా వచ్చినవాళ్లను ప్రేమగా ఆహ్వానించడం ద్వారా అలా చేయవచ్చు. (రోమా. 15:7) అయితే మనం కేవలం పలకరించడం కంటే ఎక్కువే చేయాలి. సమయం గడిచేకొద్దీ మనం వాళ్లకు దగ్గరి స్నేహితులు అవ్వాలి. కాబట్టి కొత్తవాళ్లతో దయగా ఉంటూ, వాళ్ల పట్ల నిజమైన శ్రద్ధ చూపించండి. వాళ్లను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు అడగకుండా వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. కొంతమందికి వాళ్ల భావాల్ని పంచుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్లను మాట్లాడమని బలవంతం చేయకండి. దానికి బదులు తెలివిగా ప్రశ్నలు అడిగి, వాళ్లు చెప్పే జవాబుల్ని ఓపిగ్గా వినండి. ఉదాహరణకు వాళ్లు ఎలా సత్యం నేర్చుకున్నారో మీరు అడగవచ్చు.

15. పరిణతిగల క్రైస్తవులు సంఘంలోని వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?

15 ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ చూపించుకున్నప్పుడు సంఘంలో వాళ్లందరి విశ్వాసం బలపడుతుంది. ముఖ్యంగా సంఘ పెద్దలు అలాగే పరిణతిగల క్రైస్తవులు ఆ విషయంలో చొరవ తీసుకోవాలి. తన తల్లి చేత సత్యంలో పెంచబడిన మెలిసా ఇలా అంటుంది, “సంవత్సరాలుగా సంఘంలోని సహోదరులు సమయం వెచ్చించి, ఒక తండ్రిలా నన్ను పట్టించుకున్నారు. దానికి నేనెంతో కృతజ్ఞురాలిని. నాకేదైనా చెప్పాలని అనిపించినప్పుడు ఎవరోకరు వినడానికి సిద్ధంగా ఉండేవాళ్లు.” మౌరీస్యో అనే యువ సహోదరునికి బైబిలు స్టడీ ఇచ్చిన వ్యక్తి నిష్క్రియుడు అయినప్పుడు ఆయనకు బాధగా, ఒంటరిగా అనిపించింది. ఆయన ఇలా అంటున్నాడు, “ఆ సమయంలో సంఘ పెద్దలు నా మీద చూపించిన శ్రద్ధ నాకెంతో సహాయం చేసింది. వాళ్లు నాతో తరచూ మాట్లాడేవాళ్లు, నాతో కలిసి పరిచర్య చేసేవాళ్లు, వాళ్ల వ్యక్తిగత అధ్యయనంలో నేర్చుకున్న విషయాల్ని నాకు చెప్పేవాళ్లు. చివరికి నాతో కలిసి ఆటలు కూడా ఆడేవాళ్లు.” ఇప్పుడు మెలిసా అలాగే మౌరీస్యో పూర్తికాల సేవచేస్తున్నారు.

సంఘంలో మీరు చూపించే శ్రద్ధ, మీ సహవాసం వల్ల ప్రయోజనం పొందేవాళ్లు ఎవరైనా ఉన్నారా? (16-19 పేరాలు చూడండి) *

16-17. మనం ఇంకా ఏయే విధాలుగా సహోదరసహోదరీలకు సహాయం చేయవచ్చు?

16 అవసరమైన సహాయం చేయండి. (గల. 6:10) తన కుటుంబానికి దూరంగా వేరే ప్రాంతంలో మిషనరీగా సేవ చేస్తున్న లియో ఇలా అంటున్నాడు, “మనకు చాలా సందర్భాల్లో కావాల్సిందల్లా దయతో చేసే చిన్న సహాయం. ఒక రోజు నేను నా కారులో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్‌ అయింది. నేను ఇంటికొచ్చేసరికి బాగా అలసిపోయాను. అప్పుడే ఒక జంట నన్ను వాళ్ల ఇంటికి భోజనానికి పిలిచారు. ఆ రోజు అక్కడ ఏం తిన్నానో నాకు గుర్తులేదు కానీ నేను చెప్పింది వాళ్లు శ్రద్ధగా వినడమే గుర్తుంది. ఆ తర్వాత నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది.”

17 సమావేశాలను మనందరం ఆనందిస్తాం. ఎందుకంటే ఆ సందర్భాల్లో తోటి సాక్షులతో కలిసి సమయం గడపవచ్చు అలాగే అక్కడ విన్న ప్రసంగాల గురించి చర్చించుకోవచ్చు. అయితే పైన ప్రస్తావించబడిన క్యారల్‌ ఇలా అంటుంది, “సమావేశాలకు వెళ్లినప్పుడు నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది.” తనకు ఎందుకలా అనిపిస్తుందో చెప్తూ క్యారల్‌ ఇంకా ఇలా అంటుంది, “నా చుట్టూ వందలమంది లేదా వేలమంది సహోదరసహోదరీలు ఉన్నా, వాళ్లు ఎక్కువశాతం వాళ్ల కుటుంబాలతో ఉండడం, కూర్చోవడం చూసినప్పుడు నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది.” కొంతమందికి తమ వివాహజతను మరణంలో కోల్పోయిన తర్వాత మొదటిసారి సమావేశాలకు రావడం కష్టంగా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సహోదరసహోదరీలు ఎవరైనా మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే, అలాంటివాళ్లను ఈసారి సమావేశంలో మీ కుటుంబంతో పాటు కూర్చోమని ఆహ్వానించవచ్చు.

18. మనం ఆతిథ్యం ఇచ్చినప్పుడు 2 కొరింథీయులు 6:11-13 లో ఉన్న మాటల్ని ఎలా పాటించవచ్చు?

18 కలిసి సమయం గడపండి. వేర్వేరు సహోదరసహోదరీలతో ముఖ్యంగా ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్లతో సమయం గడపడానికి ప్రయత్నించండి. అలాంటివాళ్ల విషయంలో ‘మన హృదయాల్ని విశాలం చేసుకోవాలి.’ (2 కొరింథీయులు 6:11-13 చదవండి.) పై పేరాల్లో ప్రస్తావించబడిన మెలిసా ఇలా గుర్తుచేసుకుంటుంది, “సహోదరసహోదరీలు తమతో సమయం గడపడానికి మమ్మల్ని తమ ఇంటికి పిలిచినప్పుడు లేదా వేర్వేరు ప్రదేశాలను చూడడానికి తమతో రమ్మన్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది.” మీరు కూడా మీ సంఘంలో ఎవ్వరికైనా ఆతిథ్యం ఇవ్వగలరా?

19. ముఖ్యంగా ఏ సందర్భాల్లో తోటి సహోదరసహోదరీలతో సమయం గడపడం సహాయకరంగా ఉండొచ్చు?

19 కొన్ని సందర్భాల్లో మనం తోటి సహోదరసహోదరీలతో సమయం గడిపితే వాళ్లు చాలా సంతోషిస్తారు. సత్యంలోలేని కుటుంబ సభ్యులు పండుగల్ని జరుపుకుంటున్నప్పుడు వాళ్లతో ఉండడం కొంతమంది క్రైస్తవులకు కష్టంగా అనిపించవచ్చు. ఇంకొంతమందికి సంవత్సరంలో కొన్ని తేదీలు వచ్చినప్పుడు, ఉదాహరణకు తమ ప్రియమైనవాళ్లు చనిపోయిన రోజు వచ్చినప్పుడు చాలా బాధగా అనిపించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సహోదరసహోదరీలతో మనం సమయం గడిపినప్పుడు వాళ్ల పట్ల “నిజమైన శ్రద్ధ చూపించిన” వాళ్లమౌతాం.—ఫిలి. 2:20.

20. మనకు ఒంటరిగా అనిపించినప్పుడు మత్తయి 12:48-50 లో ఉన్న యేసు మాటలు ఎలా సహాయం చేస్తాయి?

20 చాలా కారణాల్ని బట్టి ఒక క్రైస్తవునికి కొన్నిసార్లు ఒంటరిగా అనిపించవచ్చు. కానీ అలాంటి భావాల గురించి యెహోవాకు పూర్తిగా తెలుసని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన తరచూ తోటి సహోదరసహోదరీలను ఉపయోగించుకుని మనకు కావాల్సింది ఇస్తాడు. (మత్తయి 12:48-50 చదవండి.) మన సహోదరసహోదరీలకు సహాయం చేయడానికి శాయశక్తులా కృషి చేసినప్పుడు సంఘాన్ని ఏర్పాటు చేసిన యెహోవాకు కృతజ్ఞత చూపించిన వాళ్లమౌతాం. కొన్ని సందర్భాల్లో మనకెలా అనిపించినప్పటికీ మనం ఒంటరివాళ్లం కాదు. ఎందుకంటే యెహోవా ఎప్పుడూ మనతో ఉంటాడు.

పాట 46 యెహోవా నీకు కృతజ్ఞతలు

^ పేరా 5 మీరు కొన్నిసార్లు ఒంటరితనంతో బాధపడుతున్నారా? అలాగైతే మీకు ఎలా అనిపిస్తుందో యెహోవాకు తెలుసని, ఆయన మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడని నమ్మండి. ఒంటరితనంతో బాధపడేవాళ్లు దాని నుండి బయటపడడానికి ఏం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. ఒంటరితనంతో బాధపడుతున్న తోటి సహోదరసహోదరీలను మనం ఎలా ప్రోత్సహించవచ్చో కూడా తెలుసుకుంటాం.

^ పేరా 5 కొన్ని అసలు పేర్లు కావు.

^ పేరా 60 చిత్రాల వివరణ: భార్యను కోల్పోయిన ఒక సహోదరుడు బైబిలు అలాగే కూటాలకు సంబంధించిన ఆడియో రికార్డింగులను వినడం ద్వారా ప్రయోజనం పొందుతున్నాడు.

^ పేరా 62 చిత్రాల వివరణ: ఒక సహోదరుడు, అతని కూతురు సంఘంలోని వృద్ధ సహోదరుడిని కలిసి ఆయన మీద శ్రద్ధ చూపిస్తున్నారు.