పాఠకుల ప్రశ్న
కీర్తన 12:7 ని ఎలా అర్థం చేసుకోవాలి?
వేరే భాషా అనువాదాల్లో ఉపయోగించిన ఒక పదం ఆ లేఖనాన్ని అర్థం చేసుకునే విషయంలో కాస్త అయోమయాన్ని సృష్టిస్తోంది. ఇప్పుడు మనం ఆ లేఖన సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం.
కీర్తన 12:1-4 లో దావీదు ఏమన్నాడంటే, “మనుష్యుల్లో నమ్మకమైనవాళ్లు కనుమరుగయ్యారు.” కానీ ఆ తర్వాత 12:5-7లో ఆయన ఇలా అన్నాడు,
“యెహోవా ఇలా అంటున్నాడు: ‘బాధితులు అణచివేయబడుతున్నారు,
పేదవాళ్లు నిట్టూర్పులు విడుస్తున్నారు,
కాబట్టి, నేను చర్య తీసుకోవడానికి లేస్తాను.
వాళ్లను నీచంగా చూసేవాళ్ల నుండి వాళ్లను రక్షిస్తాను.’
యెహోవా మాటలు స్వచ్ఛమైనవి;
అవి మట్టి కొలిమిలో శుద్ధిచేయబడి, ఏడుసార్లు శుభ్రం చేయబడిన వెండి లాంటివి.
యెహోవా, నువ్వు బాధితుల్ని, నిస్సహాయుల్ని రక్షిస్తావు;
వాళ్లలో ప్రతీ ఒక్కర్ని ఈ తరంవాళ్ల నుండి శాశ్వతంగా కాపాడతావు”
5వ వచనంలో దేవుడు బాధితుల విషయంలో ఏం చేస్తాడో ఉంది, ఆయన వాళ్లను రక్షిస్తాడు.
6వ వచనంలో యెహోవా మాటలు స్వచ్ఛమైనవని, శుభ్రం చేయబడిన వెండి లాంటివని ఉంది. అవును, ఆయన మాటలు అలాంటివేనని మనందరం ఒప్పుకుంటాం.—కీర్త. 18:30; 119:140.
ఇప్పుడు తర్వాతి వచనం అంటే కీర్తన 12:7 గమనించండి, “యెహోవా, నువ్వు బాధితుల్ని, నిస్సహాయుల్ని రక్షిస్తావు; వాళ్లలో ప్రతీ ఒక్కర్ని ఈ తరంవాళ్ల నుండి శాశ్వతంగా కాపాడతావు.” ఈ వచనంలో “వాళ్లలో” అనే పదం ఉన్న చోట కొన్ని వేరే భాషా బైబిలు అనువాదాల్లో అది యెహోవా మాటల్ని సూచిస్తుందా లేక ప్రజల్ని సూచిస్తుందా అన్నది అర్థంకాని ఓ సర్వనామాన్ని వాడారు. దానివల్లే, దీన్ని అర్థంచేసుకునే విషయంలో కాస్త గలిబిలి.
6వ వచనం “యెహోవా మాటల” గురించి చెప్తుంది కాబట్టి ఆయన తన మాటల్ని ‘రక్షిస్తాడు’ లేదా కాపాడతాడు అన్నది కొందరి అభిప్రాయం. నిజమే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎంతమంది బైబిల్ని నిషేధించి, నాశనం చేయాలని చూసినా యెహోవా దాన్ని కాపాడుతూ వచ్చాడు.—యెష. 40:8; 1 పేతు. 1:25.
మరోవైపు, ప్రజల్ని రక్షిస్తాడని 5వ వచనంలో ఉన్న మాటలు కూడా నిజమే. బాధితుల్ని, నిస్సహాయుల్ని యెహోవా కాపాడాడు, కాపాడుతూనే ఉంటాడు.—యోబు 36:15; కీర్త. 6:4; 31:1, 2; 54:7; 145:20.
మరైతే 7వ వచనానికి సంబంధించి మనం ఏ ముగింపుకు రావచ్చు?
ఈ కీర్తనలో ఉన్న మాటల్ని కాస్త లోతుగా చూస్తే అక్కడ ప్రజల్ని సూచించే పదమే ఉండాలని స్పష్టమౌతోంది.
12వ కీర్తన మొదట్లో, చెడ్డవాళ్లు దేవుని నమ్మకమైన సేవకులతో అబద్ధాలాడారు అని ఉంది. ఆ తర్వాతి వచనాల్లో, అలా అబద్ధాలాడేవాళ్లను యెహోవా శిక్షిస్తాడు అని ఉంది. యెహోవా మాటలు స్వచ్ఛమైనవి కాబట్టి ఆయన తన ప్రజల తరఫున చర్య తీసుకుంటాడనే భరోసాను ఈ కీర్తన ఇస్తుంది.
కాబట్టి 7వ వచనంలో ఉన్నట్టు యెహోవా రక్షించేది చెడ్డవాళ్ల చేతుల్లో నలిగిపోయిన “బాధితుల్ని.”
మరి ఈ వచనంలో కొన్ని వేరే భాషా బైబిలు అనువాదాల్లో అది యెహోవా మాటల్ని సూచిస్తుందా లేక ప్రజల్ని సూచిస్తుందా అన్నది అర్థంకాని ఓ సర్వనామాన్ని ఎందుకు వాడారు? చెప్పాలంటే, వాళ్లు ప్రాచీన హీబ్రూ రాత ప్రతుల్లోని సర్వనామాన్ని ఉన్నదున్నట్టుగా అనువదించడానికి ప్రయత్నించారు. కానీ, గ్రీకు సెప్టువజింటు 7వ వచనంలో “మమ్మల్ని” అనే మాటను రెండుసార్లు ఉపయోగించింది. కాబట్టి అది బాధించబడిన, నిస్సహాయ స్థితిలో ఉన్న నమ్మకమైనవాళ్లనే సూచించే పదమై ఉండాలి. దీనికి అనుగుణంగానే ఆ లేఖనం చివర్లో నమ్మకస్థులైన “ప్రతీ ఒక్కర్ని” అడ్డూ అదుపూ లేని “ఈ తరంవాళ్ల నుండి” యెహోవా కాపాడతాడు అని ఉంది. (కీర్త. 12:7, 8) అరామిక్ భాషలో ఉన్న హీబ్రూ లేఖనాల్లో కూడా ఆ వచనం మొదటి భాగంలో “వాళ్లను” అని ఉపయోగించారు. అందులో ఇలా ఉంది: “ఓ ప్రభువా నువ్వు నీతిమంతుల్ని కాపాడతావు, ఈ చెడ్డ తరం నుండి వాళ్లను శాశ్వతంగా కాపాడతావు.” కాబట్టి కీర్తన 12:7 లో వేరే భాషా అనువాదాల్లో ఉపయోగించిన సర్వనామం దేవుని మాటల్ని సూచించట్లేదు కానీ, మనుష్యుల్ని సూచిస్తుందని చెప్పడానికి ఇది అదనపు రుజువు.
ఏదేమైనా, ఈ వచనం దేవుడు తనకు నమ్మకంగా ఉన్న ప్రజల్ని కాపాడతాడనే ఆశను అందరిలో నింపుతుంది.