కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 25

పాట 7 యెహోవా, మన బలం

యెహోవా “జీవంగల దేవుడు” అని గుర్తుంచుకోండి

యెహోవా “జీవంగల దేవుడు” అని గుర్తుంచుకోండి

“యెహోవా సజీవుడు!”కీర్త. 18:46.

ముఖ్యాంశం

మనం ఆరాధించే దేవుడు “జీవంగల దేవుడు” అని గుర్తుంచుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

1. ఎన్ని సమస్యలున్నా యెహోవా ప్రజలు తనను ఎలా ఆరాధించగలుగుతున్నారు?

 మనం జీవిస్తున్నది “ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు” అని బైబిలు చెప్తుంది. (2 తిమో. 3:1) అందరికి వచ్చే సమస్యలతో పాటు యెహోవా ప్రజలుగా మనకు వ్యతిరేకత, హింస కూడా వస్తాయి. మరి ఇన్ని సమస్యలున్నా మనం యెహోవాను ఆరాధిస్తూ ఎలా ఉండగలుగుతున్నాం? ఒక ముఖ్య కారణం ఏంటంటే, యెహోవా “జీవంగల దేవుడు” అని మనం తెలుసుకున్నాం.—యిర్మీ. 10:10; 2 తిమో. 1:12.

2. యెహోవా ఎలా జీవంగల దేవుడు?

2 యెహోవా నిజమైన వ్యక్తి, మన కష్టాల్లో ఆయన మన వెన్నంటే ఉంటాడు. అలాగే మనకు ఎప్పుడెప్పుడు సహాయం చేయాలా అని ఆయన చూస్తూ ఉంటాడు. (2 దిన. 16:9; కీర్త. 23:4) యెహోవాని మనం జీవంగల దేవుడిలా చూస్తే మన జీవితంలో వచ్చే ఏ కష్టాన్నైనా సునాయాసంగా ఎదుర్కోగలం. రాజైన దావీదు విషయంలో అదెలా నిజమైందో ఇప్పుడు చూద్దాం.

3. “యెహోవా సజీవుడు!” అని అన్నప్పుడు దావీదు ఉద్దేశం ఏంటి?

3 దావీదుకు యెహోవా అంటే ఏంటో తెలుసు. అందుకే ఆయన యెహోవా మీద ఆధారపడ్డాడు. రాజైన సౌలు అలాగే వేరే శత్రువులు ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సహాయం కోసం దావీదు యెహోవాకు ప్రార్థించాడు. (కీర్త. 18:6) దేవుడు తన ప్రార్థన విని, ఆయన్ని కాపాడినప్పుడు దావీదు ఇలా అన్నాడు: “యెహోవా సజీవుడు!” (కీర్త. 18:46) ఆ మాటలు అనడం ద్వారా దావీదు కేవలం దేవుడు ఉన్నాడని మాత్రమే చెప్పడంలేదు. ఒక రెఫరెన్సు పుస్తకం చెప్తున్నట్టు యెహోవా “జీవంగల దేవుడు, తన ప్రజల తరఫున ఆయన ఎప్పుడూ చర్య తీసుకుంటాడు” అనే నమ్మకాన్ని దావీదు ఇక్కడ చూపించాడు. తనకు ఎదురైన సంఘటనల్ని బట్టి దేవుడు సజీవుడని దావీదు అర్థం చేసుకున్నాడు. ఆ నమ్మకంతోనే ఏదేమైనా యెహోవాను సేవిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ ఉండాలని దావీదు గట్టిగా నిర్ణయించుకున్నాడు.—కీర్త. 18:28, 29, 49.

4. యెహోవా జీవంగల దేవుడని మనం నమ్మినప్పుడు ఏం జరుగుతుంది?

4 యెహోవా జీవంగల దేవుడని మనం నమ్మినప్పుడు తన సేవను ఉత్సాహంగా చేస్తాం. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోవడానికి కావాల్సిన బలం పొందుతాం. అంతేకాదు, ఆయన సేవలో కష్టపడి పనిచేస్తూ ఉండాలనే తపన పెరుగుతుంది, యెహోవాకు దగ్గరగా ఉండాలనే మన నిర్ణయం బలపడుతుంది.

జీవంగల దేవుడు మీకు బలాన్నిస్తాడు

5. కష్టాలు వచ్చినప్పుడు మనకున్న ధైర్యం ఏంటి? (ఫిలిప్పీయులు 4:13)

5 యెహోవా సజీవుడని, ఆయన మనకు ఉన్నాడని గుర్తుంచుకున్నప్పుడు మనకొచ్చే ఏ కష్టమైనా, అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని ఎదుర్కోగలం. మనకొచ్చే ఎంత పెద్ద కష్టమైనా మన దేవుని ముందు చిన్నబోవాల్సిందే! ఎందుకంటే ఆయనే సర్వశక్తిమంతుడు. అలాగే తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఆయన మనకు ఇవ్వగలడు. (ఫిలిప్పీయులు 4:13 చదవండి.) కాబట్టి కష్టాల్లో అదే మన ధైర్యం. మనకొచ్చే చిన్నచిన్న కష్టాల్లో యెహోవా సహాయాన్ని రుచి చూసినప్పుడు పెద్దపెద్ద కష్టాల్లో కూడా ఆయన సహాయం చేస్తాడని నమ్మగలుగుతాం.

6. యెహోవా మీద నమ్మకాన్ని పెంచే ఏ రెండు సంఘటనలు దావీదు చిన్నతనంలో జరిగాయి?

6 దావీదుకు యెహోవా మీద నమ్మకాన్ని పెంచిన రెండు సంఘటనల్ని పరిశీలించండి. చిన్నతనంలో దావీదు తన తండ్రి గొర్రెల్ని చూసుకుంటున్నప్పుడు ఒకసారి ఒక ఎలుగుబంటి, ఇంకొకసారి సింహం ఆ గొర్రెల్ని ఎత్తుకెళ్లాయి. ఆ రెండు సందర్భాల్లో దావీదు ధైర్యంగా ఆ జంతువులతో పోరాడి, తన గొర్రెల్ని కాపాడుకున్నాడు. అయితే అది తన సొంత శక్తితోనే చేశాడని దావీదు అనుకోలేదు. తన వెనుక యెహోవా ఉన్నాడని ఆయన నమ్మాడు. (1 సమూ. 17:34-37) ఈ రెండు సందర్భాల్ని దావీదు ఎప్పుడూ మర్చిపోలేదు. వాటిగురించి ఆలోచిస్తూ ఉండడంవల్ల జీవంగల దేవుడు ముందుముందు కూడా తనకు బలాన్ని ఇస్తాడనే నమ్మకాన్ని కూడగట్టుకున్నాడు.

7. గొల్యాతుతో తలపడడానికి దావీదుకు ఏది సహాయం చేసింది?

7 తర్వాత, బహుశా దావీదు టీనేజీలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు సైనికులు ఉన్నచోటకు వెళ్లాడు. అక్కడ ఫిలిష్తీయుడైన గొల్యాతు తనతో తలపడమని ‘ఇశ్రాయేలు సైనికుల్ని సవాలు చేస్తున్నాడు.’ (1 సమూ. 17:10, 11) దానికి సైనికులు గజగజ వణికిపోయారు. ఎందుకంటే వాళ్లు భారీ శరీరంతో ఉన్న గొల్యాతును చూశారు, అతని మాటల్ని విన్నారు. (1 సమూ. 17:24, 25) కానీ ఆ పరిస్థితిని దావీదు ఇంకో కోణం నుండి చూశాడు. గొల్యాతు ఇశ్రాయేలు సైనికుల్ని మాత్రమే సవాలు చేసినట్లు కాదుగానీ “జీవంగల దేవుని సైన్యాన్ని” సవాలు చేసినట్లు దావీదు చూశాడు. (1 సమూ. 17:26) దావీదు యెహోవా గురించి ఆలోచించాడు. తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడని నమ్మాడు. ఆ ధైర్యంతోనే దావీదు గొల్యాతుతో తలపడ్డాడు, గెలిచాడు.—1 సమూ. 17:45-51.

8. కష్టాల్ని ఎదుర్కొంటున్నప్పుడు యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకాన్ని ఎలా బలపర్చుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

8 జీవంగల దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తు తెచ్చుకుంటే మనకొచ్చే ఏ కష్టాన్నైనా చక్కగా ఎదుర్కోవచ్చు. (కీర్త. 118:6) ఆ నమ్మకాన్ని కూడగట్టుకోవడానికి గతంలో ఆయన ఏం చేశాడో ఆలోచించవచ్చు. యెహోవా తన ఆరాధకుల్ని ఎలా కాపాడాడో గుర్తుచేసే బైబిలు వృత్తాంతాల్ని చదవండి. (యెష. 37:17, 33-37) అలాగే ఇప్పుడు కూడా మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడో చూపించే నివేదికల్ని jw.orgలో చూడండి. అంతేకాదు, మీ జీవితంలో యెహోవా ఏం చేశాడో గుర్తుతెచ్చుకోండి. బహుశా సింహం నుండో, ఎలుగుబంటి నుండో కాపాడిన సందర్భాలేవీ మీ జీవితంలో లేవని మీకు అనిపించవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే మీ జీవితంలో యెహోవా చాలా చేశాడు. మిమ్మల్ని తనవైపుకు ఆకర్షించుకుని, తనతో స్నేహం చేసే అవకాశాన్ని ఇచ్చాడు. (యోహా. 6:44) అంతేకాదు మీరిప్పటికీ సత్యంలో ఉన్నారంటే అది ఆయనవల్లే. కాబట్టి మీ ప్రార్థనలకు జవాబిచ్చిన, మీకు సరైన టైమ్‌లో సహాయం చేసిన లేదా ఏదైనా కష్టమైన పరిస్థితుల్లో మిమ్మల్ని కళ్లలో పెట్టుకుని చూసుకున్న సందర్భాల్ని గుర్తు చేయమని యెహోవానే అడగండి. ఆ అనుభవాలన్నిటి గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే ముందుముందు కూడా యెహోవా మీ తరఫున చర్య తీసుకుంటాడనే నమ్మకం బలపడుతుంది.

మన సమస్యలకు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం అనేదాన్ని బట్టి యెహోవా సంతోషించవచ్చు లేదా బాధపడవచ్చు (8-9 పేరాలు చూడండి)


9. మన కష్టాల్ని మనం ఎలా చూడాలి? (సామెతలు 27:11)

9 యెహోవాను జీవంగల దేవుడిగా చూస్తే మనకొచ్చే సమస్యల గురించి సరిగ్గా ఆలోచించగలుగుతాం. ఎలా? యెహోవాకు, సాతానుకు జరుగుతున్న పోరాటంలో మనకొచ్చే కష్టాలు ఒక చిన్న భాగమని గుర్తిస్తాం. మనకు కష్టాలొస్తే యెహోవాను వదిలేస్తామని సాతాను నిందిస్తున్నాడు. (యోబు 1:10, 11; సామెతలు 27:11 చదవండి.) కానీ సమస్యల్ని మనం చక్కగా దాటగలిగితే యెహోవాను ప్రేమిస్తున్నామని చూపిస్తాం, సాతాను అబద్ధాలకోరని నిరూపిస్తాం. ప్రభుత్వం నుండి వ్యతిరేకతను, ఆర్థిక ఇబ్బందుల్ని, ప్రీచింగ్‌లో మీరు చెప్పేది ఎవరూ వినకపోవడం లేదా ఇంకేదైనా సమస్యతో మీరు పోరాడుతున్నారా? అలాగైతే, మీ పరిస్థితి యెహోవా హృదయాన్ని సంతోషపెట్టడానికి ఒక అవకాశమని గుర్తుంచుకోండి. అంతేకాదు, మీరు తట్టుకోగలిగే దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని పరీక్షించనివ్వడని గుర్తుంచుకోండి. (1 కొరిం. 10:13) వాటన్నిటిని ఎదుర్కోవడానికి ఆయన మీకు బలాన్నిస్తాడు.

జీవంగల దేవుడు మీకు ప్రతిఫలమిస్తాడు

10. తన ఆరాధకుల కోసం జీవంగల యెహోవా ఏం చేస్తాడు?

10 యెహోవా తన ఆరాధకులకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. (హెబ్రీ. 11:6) ఆయన ఇప్పుడు మనకు మనశ్శాంతిని, సంతృప్తిని ఇస్తున్నాడు. అలాగే భవిష్యత్తులో శాశ్వత జీవితం ఇస్తాడు. మనకు ప్రతిఫలం ఇవ్వాలనే కోరిక, శక్తి రెండూ ఆయనకు ఉన్నాయని మనం నమ్మకంతో ఉండవచ్చు. ఆ నమ్మకంతోనే గతంలో ఉన్న నమ్మకమైన సేవకుల్లాగే మనం కూడా తన సేవలో బిజీగా ఉండవచ్చు. మొదటి శతాబ్దంలో ఉన్న తిమోతి అదే చేశాడు.—హెబ్రీ. 6:10-12.

11. తిమోతి సంఘంలో ఎందుకంత కష్టపడి పనిచేశాడు? (1 తిమోతి 4:10)

11 1 తిమోతి 4:10 చదవండి. జీవంగల దేవుడు తనకు ప్రతిఫలం ఇస్తాడని తిమోతి గట్టిగా నమ్మాడు. అందుకే యెహోవా కోసం, ఇతరుల కోసం కష్టపడి పనిచేశాడు. ఏవిధంగా? బోధించే విషయంలో, మాట్లాడే విషయంలో ప్రగతి సాధించాలని అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్పాడు. అలాగే పిల్లలు, పెద్దవాళ్లు, తోటి ఆరాధకులందరూ తనను చూసి నేర్చుకునేలా ఉండాలని కూడా పౌలు తిమోతికి చెప్పాడు. అంతేకాదు ఆయనకు కొన్ని కష్టమైన పనుల్ని కూడా అప్పగించాడు. దాంట్లో భాగంగా తిమోతి అవసరమైనవాళ్లకు కాస్త గట్టిగానే అయినా ప్రేమగా దిద్దుబాటు ఇవ్వాలి. (1 తిమో. 4:11-16; 2 తిమో. 4:1-5) కొన్నిసార్లు తను చేస్తున్న పనుల్ని ఎవ్వరూ చూడకపోయినా లేదా ఎవ్వరూ మెచ్చుకోకపోయినా యెహోవా ప్రతిఫలం ఇస్తాడని తిమోతి నమ్మాడు.—రోమా. 2:6, 7.

12. సంఘపెద్దలు ఎందుకు కష్టపడి పనిచేస్తున్నారు? (చిత్రం కూడా చూడండి.)

12 ఈరోజుల్లో కూడా పెద్దలు చేస్తున్న పనుల్ని యెహోవా చూస్తున్నాడని, విలువైనదిగా ఎంచుతున్నాడని వాళ్లు నమ్మకంతో ఉండవచ్చు. చాలామంది పెద్దలు కాపరి సందర్శనాలు చేయడం, బోధించడం, ప్రీచింగ్‌ చేయడంతోపాటు నిర్మాణ ప్రాజెక్టుల్లో, విపత్తు సహాయక పనుల్లో సేవ చేస్తున్నారు. ఇంకొంతమంది రోగి సందర్శన గుంపుల్లో లేదా ఆసుపత్రి అనుసంధాన కమిటీల్లో సేవచేస్తున్నారు. ఈ పనులన్నీ చేయడానికి ముందుకొస్తున్న పెద్దలు, సంఘం ఒక మనిషిది కాదుగానీ యెహోవాది అని గుర్తిస్తున్నారు. దానివల్లే వాళ్లు మనస్ఫూర్తిగా తమ పనుల్ని చేస్తూ, తాము చేసే వాటన్నిటికీ యెహోవా ప్రతిఫలం ఇస్తాడనే నమ్మకంతో ఉంటున్నారు.—కొలొ. 3:23, 24.

సంఘం కోసం మీరు పడే కష్టానికి జీవంగల దేవుడు ప్రతిఫలం ఇస్తాడు (12-13 పేరాలు చూడండి)


13. తన సేవలో మనం చేసేదాన్ని యెహోవా ఎలా చూస్తున్నాడు?

13 అందరూ సంఘపెద్దలుగా ఉండలేకపోవచ్చు. కానీ యెహోవాకు ఇవ్వడానికి మనందరి దగ్గర ఏదోకటి ఉంది. తన సేవలో మనం చేయగలిగినదంతా చేసినప్పుడు మన దేవుడు మెచ్చుకుంటాడు. ప్రపంచవ్యాప్త పనికోసం ఏ కొంత విరాళం ఇచ్చినా ఆయన దాన్ని అపురూపంగా చూస్తాడు. మీటింగ్స్‌లో కామెంట్స్‌ చెప్పడానికి భయమేసినా దాన్ని పక్కనపెట్టి, చేయి పైకెత్తినప్పుడు ఆయన మురిసిపోతాడు. ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు దాన్ని మర్చిపోయి, వాళ్లను క్షమిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. యెహోవా కోసం మీరు అనుకున్నంత చేయలేకపోతున్నారని మీకు అనిపించినా, మీరు చేస్తున్నదాన్ని మాత్రం ఆయన చాలా విలువైనదిగా చూస్తాడని నమ్మండి. మీరు చేస్తున్నదానికి ఆయన మిమ్మల్ని చాలా ప్రేమిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు.—లూకా 21:1-4.

జీవంగల దేవునికి దగ్గరగా ఉండండి

14. యెహోవాకు నమ్మకంగా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? (చిత్రం కూడా చూడండి.)

14 మనం యెహోవాను ఒక నిజమైన వ్యక్తిలా చూస్తే ఆయనకు నమ్మకంగా ఉండడం తేలికౌతుంది. యోసేపు విషయంలో అదే నిజమైంది. లైంగిక పాపం చేయడానికి ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన యెహోవాను నిజమైన వ్యక్తిగా చూశాడు. దేవునికి ఇష్టంలేని ఏ పని చేయాలనుకోలేదు. (ఆది. 39:9) మనకు కూడా యెహోవా ఒక నిజమైన వ్యక్తిగా అవ్వాలంటే సమయం తీసుకుని ప్రార్థనలో ఆయనతో మాట్లాడాలి, ఆయన వాక్యాన్ని అధ్యయనం చేయాలి. అప్పుడు ఆయనతో మన స్నేహం పెరుగుతుంది. యోసేపులాగే యెహోవాతో మనకు దగ్గరి స్నేహం ఉంటే తనకు ఇష్టంలేని ఏ పని చేయం.—యాకో. 4:8.

జీవంగల దేవునికి దగ్గరైతే, ఆయనకు నమ్మకంగా ఉండగలుగుతారు (14-15 పేరాలు చూడండి)


15. ఎడారిలో ఉన్న ఇశ్రాయేలీయులకు జరిగిన దాన్నుండి మనం ఏ గుణపాఠం నేర్చుకోవచ్చు? (హెబ్రీయులు 3:12)

15 యెహోవా జీవంగల దేవుడని మర్చిపోతే ఆయనకు దూరమౌతాం. ఎడారిలో ఉన్న ఇశ్రాయేలీయులకు ఏం జరిగిందో ఆలోచించండి. యెహోవా ఉన్నాడని వాళ్లకు తెలుసు. కానీ ఆయన వాళ్ల అవసరాల్ని తీరుస్తాడా లేదా అని అనుమానించడం మొదలుపెట్టారు. ఆఖరికి వాళ్లు “యెహోవా అసలు మన మధ్య ఉన్నాడా, లేడా?” అని కూడా అనుకున్నారు. (నిర్గ. 17:2, 7) ఆ తర్వాత వాళ్లు దేవునికి ఎదురుతిరిగారు. వాళ్లు మనకు ఒక గుణపాఠంగా ఉన్నారు కాబట్టి మనం వాళ్లలా అస్సలు ఉండాలనుకోం.—హెబ్రీయులు 3:12 చదవండి.

16. మన విశ్వాసానికి ఏది పరీక్షలా మారవచ్చు?

16 ఈ లోకంలో యెహోవాకు దగ్గరగా ఉండడం ఇంకాఇంకా కష్టమౌతుంది. చాలామంది దేవుడు ఉన్నాడని అస్సలు ఒప్పుకోరు. పైగా, దేవుడు చెప్పేవాటిని విననివాళ్లే బాగుపడుతున్నట్టు మనకు అనిపించవచ్చు. అది మన విశ్వాసానికి ఒక పరీక్షలా ఉండవచ్చు. దేవుడు ఉన్నాడని మనం నమ్మినా, ఆయన మనకు సహాయం చేస్తాడా లేదా అనే అనుమానం మనలో మొదలవ్వవచ్చు. 73వ కీర్తన రాసిన వ్యక్తికి కూడా అలానే అనిపించింది. దేవుని నియమాల్ని పక్కన పెట్టిన వాళ్లే బాగుపడుతున్నారని ఆయన అనుకున్నాడు. దానివల్ల దేవుని సేవ చేస్తే అసలు ఏమైనా ఉపయోగం ఉందా అని అనుమానించడం మొదలుపెట్టాడు.—కీర్త. 73:11-13.

17. యెహోవాకు దగ్గరగా ఉండడానికి మనమేం చేయవచ్చు?

17 కీర్తనకర్త తన ఆలోచనల్ని ఎలా సరిచేసుకున్నాడు? యెహోవాను మర్చిపోయే వాళ్లకు ఏ గతి పడుతుందో ఆయన ఆలోచించాడు. (కీర్త. 73:18, 19, 27) అలాగే యెహోవాను సేవిస్తూ ఉండడంవల్ల వచ్చే ప్రయోజనాల గురించి కూడా ఆయన ఆలోచించాడు. (కీర్త. 73:24) మనం కూడా యెహోవా మనకు ఇచ్చిన దీవెనల గురించి ఆలోచించవచ్చు. ఆయన సేవ చేస్తూ ఉండకపోతే మన జీవితం ఎంత ఘోరంగా ఉండేదో కూడా ఆలోచించవచ్చు. అలా చేసినప్పుడు ఆయనకు నమ్మకంగా ఉండగలుగుతాం. కీర్తనకర్తలాగే ఇలా అనగలుగుతాం: “నా విషయానికొస్తే, దేవునికి దగ్గరవ్వడం నాకు మంచిది.”—కీర్త. 73:28.

18. మనం ఎందుకు భవిష్యత్తు గురించి భయపడం?

18 మనం “జీవంగల సత్యదేవునికి దాసులుగా” ఉన్నాం కాబట్టి ఈ చివరిరోజుల్లో మనకొచ్చే ఏ కష్టాన్నైనా మనం ఎదుర్కోగలం. (1 థెస్స. 1:9) మనల్ని ఎప్పుడూ పట్టించుకునే, ఎప్పుడూ సహాయం చేసే మన దేవుడు ఒక నిజమైన వ్యక్తి. తన సేవకుల వెన్నంటే ఉన్నాడని ఆయన గతంలో నిరూపించాడు, ఇప్పుడు కూడా నిరూపిస్తున్నాడు. మనందరం త్వరలోనే భూమ్మీద ఎప్పుడూ చూడని గొప్ప శ్రమను చూడబోతున్నాం. కానీ మనం ఏ దిక్కులేనివాళ్లం కాదు! (యెష. 41:10) “మనం మంచి ధైర్యంతో ఇలా అనగలం: ‘నాకు సహాయం చేసేది యెహోవాయే; నేను భయపడను.’”—హెబ్రీ. 13:5, 6.

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం