కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

యెహోవా నా ప్రార్థనలు విన్నాడు

యెహోవా నా ప్రార్థనలు విన్నాడు

నాకు పదేళ్లు ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి ఆకాశంలో మెరిసే తారల్ని చూస్తూ ఉన్నాను. అప్పుడు వెంటనే నేను మోకాళ్లమీద ఉండి ప్రార్థన చేశాను. యెహోవా గురించి కొన్నిరోజుల క్రితమే తెలుసుకున్నాను. కానీ నా బాధంతా ఆయనకు చెప్పుకున్నాను. ఆరోజు నేను చేసిన ప్రార్థన, “ప్రార్థనలు వినే” యెహోవా దేవునితో నా ప్రయాణానికి నాంది పలికింది. (కీర్త. 65:2) ఆ దేవుని గురించి కొన్నిరోజుల క్రితమే తెలుసుకున్నప్పటికీ, ఆయనకు ఎందుకు ప్రార్థన చేశానో చెప్తాను వినండి.

మా జీవితాల్ని మార్చేసిన సందర్భం

నేను 1929, డిసెంబరు 22న నోవెల్‌ అనే చిన్న పల్లెటూరిలో పుట్టాను. అది బెల్జియన్‌ ఆర్దిన్స్‌లోని, బ్యాస్టోగ్ని దగ్గరలో ఉన్న తొమ్మిది పొలాల ఊరు. చిన్నప్పుడు పొలంలో అమ్మానాన్నలతో గడిపిన ఎన్నో జ్ఞాపకాలు నాకున్నాయి. నేనూ, మా తమ్ముడు రేమండ్‌ కలిసి పాలు పితికేవాళ్లం, పొలం పని చేసేవాళ్లం. మా చిన్న పల్లెటూరిలో అందరూ ఒక కుటుంబంలా ఉంటూ ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండేవాళ్లం.

మా కుటుంబంతో కలిసి పొలం పని చేస్తున్నాను

మా నాన్న ఎమిల్‌, మా అమ్మ అలీస్‌ నిష్ఠగల క్యాథలిక్కులు. వాళ్లు ప్రతీ ఆదివారం తప్పకుండా చర్చీకి వెళ్లేవాళ్లు. అయితే దాదాపు 1939 లో కొంతమంది పయినీర్లు ఇంగ్లాండ్‌ నుండి మా ఊరికి వచ్చారు. వాళ్లు కంసోలేషన్‌ (ఇప్పుడు తేజరిల్లు! అంటున్నారు) పత్రిక సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోమని మా నాన్నకు చెప్పారు. ఆ పత్రికలో సత్యం దాగివుందని మా నాన్న వెంటనే గుర్తించాడు. ఆ తర్వాత బైబిలు చదవడం మొదలుపెట్టాడు. ఆయన ఎప్పుడైతే చర్చీకి వెళ్లడం ఆపేశాడో, అప్పటివరకు కలిసిమెలిసి ఉన్న ఇరుగుపొరుగువాళ్లు నాన్న మీద మండిపడి, ఆయన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మా నాన్నను క్యాథలిక్‌గానే ఉండమని వాళ్లు ఒత్తిడి చేశారు. దానివల్ల చాలాసార్లు వాడివేడి చర్చలు కూడా జరిగాయి.

దానివల్ల మా నాన్నకు ఎంత ఒత్తిడిగా అనిపించేదో చూసి నేను తట్టుకోలేకపోయేవాణ్ణి. అందుకే ఈ ఆర్టికల్‌ మొదట్లో చెప్పినట్టు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థన చేశాను. ఇరుగుపొరుగువాళ్లు నాన్నను ఒత్తిడి చేయడం తగ్గించిన తర్వాత నా హృదయం ఆనందంతో నిండిపోయింది. యెహోవా “ప్రార్థనలు” వినే దేవుడని అప్పుడు నాకు నమ్మకం కుదిరింది.

యుద్ధపు మరకల్లో జీవితం

1940, మే 10న నాజీ జర్మనీ బెల్జియంని ఆక్రమించుకుంది. దానివల్ల ఆ దేశంలో ఉన్నవాళ్లందరూ చుట్టుపక్కల దేశాలకు పారిపోవాల్సి వచ్చింది. మేము దక్షిణ ఫ్రాన్స్‌కు పారిపోయాం. మేము వెళ్తున్నప్పుడు దారి మధ్యలో జర్మన్‌ అలాగే ఫ్రెంచ్‌ సైన్యాలు బాగా పోరాడుకుంటున్న ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చింది.

ఆ తర్వాత మేము మా పొలం దగ్గరకు తిరిగొచ్చినప్పుడు మా పొలాన్ని, మా ఆస్తిలో చాలా వాటిని ఎవరో కబ్జా చేశారు. మమ్మల్ని ఆహ్వానించడానికి మా కుక్కపిల్ల బాబీ తప్ప ఎవరూ లేరు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అసలు ‘యుద్ధాలు, కష్టాలు ఎందుకున్నాయి?’ అని ఆలోచించేవాణ్ణి.

టీనేజీ వయసులో యెహోవాతో దగ్గరి స్నేహాన్ని పెంచుకున్నాను

సరిగ్గా అప్పుడే మమ్మల్ని ప్రోత్సహించడానికి నమ్మకంగా పయినీరు సేవచేస్తున్న బ్రదర్‌ ఎమిల్‌ స్క్రాంజ్‌ a అనే సంఘపెద్ద వచ్చాడు. అసలు ఇన్ని కష్టాలు ఎందుకున్నాయో బైబిలు ఉపయోగించి చక్కగా వివరించాడు. జీవితానికి సంబంధించి నాకున్న ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చాడు. దాంతో నేను యెహోవాతో ఇంకా దగ్గరి స్నేహం చేయగలిగాను. దేవుడు ప్రేమకు ప్రతిరూపం అని నమ్మకం కుదుర్చుకోగలిగాను.

ఇంకా యుద్ధం అయిపోకముందే మేము యెహోవాసాక్షులతో మాట్లాడుతూ ఉండేవాళ్లం. 1943, ఆగస్టు నెలలో బ్రదర్‌ జ్యోసే నికోలస్‌ మినెట్‌ మా పొలం దగ్గరకు వచ్చి ప్రసంగం ఇచ్చాడు. ఆయనిలా అడిగాడు: “ఎవరికి బాప్తిస్మం తీసుకోవాలని ఉంది?” దానికి మా నాన్న, నేను వెంటనే చెయ్యి ఎత్తాం. మేము మా పొలం పక్కనే ఉన్న ఒక చిన్న నదిలో బాప్తిస్మం తీసుకున్నాం.

1944, డిసెంబరులో, రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా జర్మనీ సైన్యం పడమర యూరప్‌లో తన చివరి దాడి మొదలుపెట్టింది. దాన్నే బ్యాటిల్‌ ఆఫ్‌ బల్జ్‌ అంటారు. మేము ఆ యుద్ధం జరిగే ప్రాంతానికి చాలా దగ్గరలో ఉండేవాళ్లం. కాబట్టి దాదాపు ఒక నెలపాటు మేము మా ఇంటి బేస్‌మెంట్‌లోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఒకరోజు నేను మా పశువులకు ఆహారం పెట్టడానికి బయటికి వెళ్లాను. కానీ మా పొలంలో ఒక బాంబు పేలడం వల్ల ధాన్యాన్ని దాచి పెట్టుకున్న రూమ్‌ పైకప్పు ఊడిపోయింది. అప్పుడే ఒక అమెరికా సైనికుడు ఆ పక్కనే ఉండి “కింద పడుకో” అని గట్టిగా అరిచాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన దగ్గరే కింద పడుకున్నాను. ఆయన నా తలకు హెల్మెట్‌ పెట్టి నన్ను కాపాడాడు.

యెహోవాతో నా బంధం బలపడింది

మా పెళ్లి రోజు

యుద్ధం తర్వాత మేము ఉంటున్న ప్రాంతానికి దాదాపు 90 కి.మీ. దూరంలో ఉన్న లీజ్‌ అనే సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌తో మాట్లాడుతూ ఉండేవాళ్లం. కొంతకాలానికి బ్యాస్టొగ్నీలోనే ఒక చిన్న గుంపు మొదలుపెట్టాం. నేను టాక్స్‌ బిజినెస్‌లో పని చేసేవాణ్ణి. ఆ తర్వాత లాయరు చదువు కూడా చదివాను. అది అయ్యాక ఒక గవర్నమెంట్‌ ఆఫీసులో కూడా పనిచేశాను. మేము 1951 లో బ్యాస్టొగ్నీలో ఒక చిన్న ప్రాంతీయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి దాదాపు 100 మంది వచ్చారు. అందులో ఎల్లీ రూయ్‌టర్‌ అనే ఉత్సాహంగల పయినీరు సిస్టర్‌ కూడా ఉంది. ఆమె ఆ సమావేశానికి రావడానికి 50 కి.మీ. సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చింది. కొంతకాలానికే మేము ప్రేమలో పడి, ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాం. సరిగ్గా అప్పుడే అమెరికాలో జరిగే గిలియడ్‌ పాఠశాలకు రమ్మని ఎల్లీకి ఆహ్వానం వచ్చింది. కానీ ఆమె ఎందుకు రాలేకపోతుందో చెప్తూ ప్రపంచ ప్రధాన కార్యాలయానికి ఒక ఉత్తరం రాసింది. అప్పట్లో యెహోవా ప్రజల్ని నడిపిస్తున్న బ్రదర్‌ నార్‌ ఆ ఉత్తరానికి జవాబిస్తూ ఏదోకరోజు తన భర్తతో కలిసి గిలియడ్‌కు రావచ్చని చెప్పాడు. 1953, ఫిబ్రవరిలో మేము పెళ్లి చేసుకున్నాం.

ఎల్లీ అలాగే మా కొడుకు సెర్గ్‌

అదే సంవత్సరం ఎల్లీ, నేను న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో జరిగిన న్యూ వరల్డ్‌ సొసైటీ అసెంబ్లీకి వెళ్లాం. మేము అక్కడ ఒక బ్రదర్‌ని కలిశాం. ఆయన అమెరికాలో నా కోసం ఒక మంచి ఉద్యోగం ఉందని మమ్మల్ని అక్కడికి మారమని చెప్పాడు. విషయాన్ని మేము ప్రార్థనలో యెహోవాకు చెప్పాం. ఆ తర్వాత అమెరికాకు వెళ్లొద్దని నిర్ణయించుకున్నాం. దానికి బదులు బ్యాస్టొగ్నీలో పదిమంది పబ్లిషర్స్‌ మాత్రమే ఉన్న ఆ చిన్న గుంపుకు మద్దతివ్వడానికి తిరిగి బెల్జియంకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాతి సంవత్సరం మాకు సెర్గ్‌ అనే అబ్బాయి పుట్టాడు. బాధాకరంగా ఏడు నెలల తర్వాత వాడికి ఒంట్లో బాలేక, చనిపోయాడు. ఆ దుఃఖాన్ని మేము ప్రార్థనలో యెహోవాకు చెప్పుకున్నాం. వాడు తప్పకుండా పునరుత్థానం అవుతాడనే నమ్మకం మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది.

పూర్తికాల సేవ

1961, అక్టోబరు నెలలో పయినీరు సేవ చేయడానికి వీలుగా నాకు ఒక పార్ట్‌టైమ్‌ ఉద్యోగం దొరికింది. అదేరోజు బెల్జియం బ్రాంచి కమిటీ సభ్యుల్లో ఒకరు నాకు ఫోన్‌ చేశారు. నేను సర్క్యూట్‌ సర్వెంట్‌గా సేవచేయడానికి అందుబాటులో ఉన్నానో లేదో అడిగారు (ఒకప్పుడు ప్రాంతీయ పర్యవేక్షకుల్ని అలా పిలిచేవారు.) “దానికి ముందు మేము కొంతకాలంపాటు పయినీర్లుగా సేవ చేయవచ్చా?” అని అడిగాను. దానికి వాళ్లు ఒప్పుకున్నారు. మేము ఎనిమిది నెలలపాటు పయినీర్లుగా సేవచేసిన తర్వాత 1962, సెప్టెంబరు నెలలో ప్రాంతీయ సేవను మొదలుపెట్టాం.

రెండు సంవత్సరాలు ప్రాంతీయ సేవ చేసిన తర్వాత, బ్రెజిల్‌లో ఉన్న బెతెల్‌లో సేవ చేయడానికి మమ్మల్ని పిలిచారు. అక్కడ 1964, అక్టోబరు నెల నుండి సేవచేయడం మొదలుపెట్టాం. ఈ కొత్త నియామకం మాకు ఎన్నో దీవెనలు తెచ్చిపెట్టింది. 1965 లో మేము ఉంటున్న బెతెల్‌ను బ్రదర్‌ నార్‌ సందర్శించి వెళ్లిన కొన్నిరోజులకే నన్ను బ్రాంచి సర్వెంట్‌గా నియమించడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ తర్వాత ఎల్లీకి, నాకు 41వ గిలియడ్‌ తరగతికి హాజరవ్వమనే ఆహ్వానం వచ్చింది. 13 సంవత్సరాల క్రితం బ్రదర్‌ నార్‌ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. మేము గిలియడ్‌ తరగతి పూర్తి చేసుకున్నాక బెల్జియం బెతెల్‌కి తిరిగి వచ్చాం.

యెహోవా ప్రజల చట్టపరమైన హక్కుల కోసం పోరాడాను

నేను లాయరు చదువు చదువుకున్నందుకు చాలా సంవత్సరాలపాటు యూరప్‌లో అలాగే వేరే ప్రాంతాల్లో మన ఆరాధన కోసం చట్టబద్ధమైన హక్కును సమర్థించడానికి పని చేయగలిగాను. (ఫిలి. 1:7) దీనివల్ల మన పనిని నిషేధించిన లేదా ఆంక్షలు విధించిన దాదాపు 55 కన్నా ఎక్కువ దేశాల్లో ఉన్న పెద్దపెద్ద అధికారులతో నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. అయితే వాళ్లను పరిచయం చేసుకుంటున్నప్పుడు నాకున్న చట్టపరమైన అనుభవాన్ని చెప్పే బదులు, నన్ను నేను ఒక “దేవుని సేవకునిగా” పరిచయం చేసుకునేవాణ్ణి. నేను ప్రతీసారి ప్రార్థనలో యెహోవా నిర్దేశం కోసం చూసేవాణ్ణి. ఎందుకంటే “రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువ లాంటిది. ఆయన తనకు నచ్చినవైపు దాన్ని తిప్పుతాడు.”—సామె. 21:1.

నేను మర్చిపోలేని సంఘటన ఏంటంటే, ఒకరోజు యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యుణ్ణి నేను కలిశాను. చాలాసార్లు రిక్వెస్ట్‌ చేసుకున్న తర్వాత ఆయన అపాయింట్‌మెంట్‌ దొరికింది. ఆ తర్వాత ఆ అధికారి ఇలా అన్నాడు: “నీతో మాట్లాడడానికి కేవలం ఐదు నిమిషాలే ఇస్తాను. ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఇవ్వను.” నేను వెంటనే తలదించుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నేనేం చేస్తున్నానో అర్థంకాక ఆ అధికారి అడిగాడు. తలెత్తి “మీరు దేవుని సేవకుల్లో ఒకరు కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను” అన్నాను. దానికి ఆయన “అంటే ఏంటి?” అని అడిగాడు. నేను రోమీయులు 13:4 చూపించాను. ఆయన ఒక ప్రొటెస్టెంట్‌ కాబట్టి ఈ బైబిలు లేఖనం ఆయనకు ఆసక్తిగా అనిపించింది. దానివల్ల ఆయన నాకు అరగంట సమయం ఇచ్చాడు. ఆ మీటింగ్‌లో నేను చాలా విషయాలు మాట్లాడాను. ఆఖరికి యెహోవాసాక్షులు చేసే పనిని కూడా ఆయన చాలా మెచ్చుకున్నాడు.

గడిచిన సంవత్సరాల్లో యెహోవా ప్రజలు యూరప్‌లో తటస్థత, పిల్లల సంరక్షణ, టాక్స్‌లు అలాంటి ఎన్నో విషయాల గురించి చట్టపరమైన హక్కుల కోసం పోరాడాల్సి వచ్చింది. వాటిలో చాలా విషయాల్లో పనిచేసే గొప్ప అవకాశం నాకు దొరికింది. వాటిలో యెహోవా ఎలా విజయాన్ని ఇచ్చాడో నేను కళ్లారా చూడగలిగాను. యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టులో యెహోవా ప్రజలు 140 కన్నా ఎక్కువ కేసులు గెలిచారు.

క్యూబాలో రాజ్య పనికి ఎక్కువ స్వేచ్ఛ దొరికింది

1990లలో మన పనిపై ఆంక్షలున్న క్యూబా దేశంలో ఇంకా ఎక్కువ మత స్వేచ్ఛ కోసం పోరాడిన బ్రదర్స్‌తో కలిసి పనిచేసే గొప్ప అవకాశం నాకు దొరికింది. వాళ్లెవరంటే ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన బ్రదర్‌ ఫిలిప్‌ బ్రూమ్లీ అలాగే ఇటలీ నుండి వచ్చిన బ్రదర్‌ వాల్టెర్‌ ఫార్నెటీ. నేను బెల్జియంలోని క్యూబెన్‌ ఎంబసీకి ఒక ఉత్తరం రాశాను. ఆ తర్వాత మన రిక్వెస్ట్‌ను చూసుకోవడానికి ప్రభుత్వం నియమించిన ఒక అధికారిని కలిశాం. మేము ఆ అధికారిని కలిసిన మొదట్లో ప్రభుత్వానికి మన పనిపై ఉన్న తప్పుడు అభిప్రాయాల్ని తీసేయలేకపోయాం.

1990లలో ఒకసారి ఫిలిప్‌ బ్రూమ్లీ అలాగే వాల్టెర్‌ ఫార్నెటీతో కలిసి క్యూబాకి వెళ్లినప్పుడు

ప్రార్థనలో యెహోవా నిర్దేశం అడిగిన తర్వాత మేము క్యూబాకు 5,000ల బైబిళ్లు పంపించడానికి అనుమతి అడిగాం. ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చింది. బైబిళ్లు క్యూబాకు సురక్షితంగా చేరుకున్నాయి. మన బ్రదర్స్‌కి అవి పంచిపెట్టడం జరిగింది. దాంతో యెహోవా మా ప్రయత్నాల్ని దీవిస్తున్నాడని అర్థమైంది. ఆ తర్వాత మేము ఇంకో 27,500ల బైబిళ్లు పంపించడానికి అనుమతి అడిగాం. దానికి కూడా అనుమతి దొరికింది. క్యూబాలో ఉన్న మన బ్రదర్స్‌సిస్టర్స్‌ అందరి చేతిలో ఒక బైబిలు ఉండేలా సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది.

క్యూబాలో మన పనికున్న చట్టబద్ధమైన హక్కు కోసం పనిచేస్తున్నప్పుడు నేను చాలాసార్లు అక్కడికి వెళ్లాను. దానివల్ల అక్కడున్న చాలామంది అధికారులతో నాకు మంచి స్నేహం ఏర్పడింది.

రువాండాలో ఉన్న బ్రదర్స్‌కి సహాయం చేయడం

1994 లో రువాండా దేశంలో టుట్సీ జాతి ప్రజల మీద జరిగిన ఘోరమైన హింసల్లో 10,00,000ల కన్నా ఎక్కువమంది చనిపోయారు. విచారకరంగా అందులో మన బ్రదర్స్‌సిస్టర్స్‌ కొంతమంది కూడా చనిపోయారు. వెంటనే మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి కావల్సిన నిత్యావసరాలను పంపిణీ చేయడానికి కొంతమంది బ్రదర్స్‌ని నియమించారు.

ఆ పనికోసం నియమించబడిన బ్రదర్స్‌ అందరం రువాండా రాజధానియైన కిగాలికి చేరుకున్నాం. అక్కడికి వెళ్లాక అక్కడి ట్రాన్స్‌లేషన్‌ ఆఫీస్‌ అలాగే ప్రచురణలు ఉన్న రూమ్‌పై బుల్లెట్ల వర్షం కురిసిందని చూశాం. మన బ్రదర్స్‌సిస్టర్స్‌ని పెద్దపెద్ద కత్తులతో ఎలా చంపారో విన్నాం. వాటితోపాటు, మన బ్రదర్స్‌సిస్టర్స్‌ క్రైస్తవ ప్రేమను ఎలా చూపించుకున్నారో కూడా విన్నాం. ఉదాహరణకు, మేము ఒక టుట్సీ బ్రదర్‌ని కలిశాం. ఆయన ఈ కాల్పులు జరుగుతున్నప్పుడు ఒక గుంటలో 28 రోజులు దాక్కున్నాడు. ఆయన్ని మన సాక్షుల్లో హుటు కుటుంబానికి చెందినవాళ్లు కాపాడారు. కిగాలిలో జరిగిన ఒక మీటింగ్‌లో 900ల కన్నా ఎక్కువమంది బ్రదర్స్‌సిస్టర్స్‌ని మేము లేఖనాలతో ప్రోత్సహించగలిగాం, ఓదార్చగలిగాం.

ఎడమ: ట్రాన్స్‌లేషన్‌ ఆఫీస్‌లో ఒక బుక్‌కి బుల్లెట్‌ తగిలింది

కుడి: విపత్తు సహాయక పనుల్లో ఉన్నప్పుడు

ఆ తర్వాత మేము గోమా నగరానికి దగ్గర్లోని శరణార్థ శిబిరాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న రువాండా సాక్షుల కోసం వెతకడానికి సరిహద్దు దాటి జైయిర్‌కి వెళ్లాం (దాన్ని ఇప్పుడు డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో అంటున్నారు.) మేము ఎంత వెతికినా సాక్షులు కనిపించలేదు. కాబట్టి మేము ప్రార్థన చేసి వాళ్ల దగ్గరికి నడిపించమని యెహోవాను అడిగాం. ఆ తర్వాత ఒకతను మా వైపు నడుచుకుంటూ రావడం చూశాం. ఆయన్ని ఆపి యెహోవాసాక్షులు ఎవరైనా తెలుసా అని అడిగాం. దానికి అతను “నేను ఒక యెహోవాసాక్షినే. రండి విపత్తు సహాయక కమిటీని పరిచయం చేస్తాను” అని మమ్మల్ని తీసుకెళ్లాడు. విపత్తు సహాయక కమిటీతో మీటింగ్‌ జరిగాక మేము దాదాపు 1600 మంది శరణార్థులకు లేఖనాలు ఉపయోగించి ప్రోత్సాహాన్ని, ఓదార్పును ఇచ్చాం. అంతేకాదు పరిపాలకసభ ఉత్తరంలో ఉన్న విషయాల్ని కూడా వాళ్లకు చెప్పాం. ఆ ఉత్తరంలో ఈ మాటలున్నాయి: “మీ గురించి మేము ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. యెహోవా మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టడని మాకు తెలుసు.” ఆ మాటలు విన్నాక బ్రదర్స్‌సిస్టర్స్‌ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పరిపాలక సభ చెప్పిన ఆ మాటలు ఎంత నిజమో కదా! ప్రస్తుతం రువాండాలో 30,000 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు సంతోషంగా సేవచేస్తున్నారు.

నమ్మకంగా కొనసాగాలని నిర్ణయించుకున్నాను

మా పెళ్లయిన దాదాపు 58 ఏళ్లకు అంటే 2011 లో నా భార్య ఎల్లీ చనిపోయింది. నా బాధంతా యెహోవాకు చెప్పుకోవడం వల్ల ఆయన నన్ను ఓదార్చాడు. అంతేకాదు, దేవుని రాజ్యం గురించిన మంచివార్త ఇరుగు పొరుగువాళ్లకు చెప్పినప్పుడు కూడా నాకు ఓదార్పుగా అనిపించింది.

ఇప్పుడు నాకు 90 ఏళ్లు దాటినా, ప్రతీవారం ప్రీచింగ్‌కి వెళ్తాను. బెల్జియం బ్రాంచిలోని లీగల్‌ డిపార్ట్‌మెంట్‌కి సహాయం చేస్తున్నాను. నా అనుభవాన్ని వేరేవాళ్లతో పంచుకుంటున్నాను. బెతెల్‌ కుటుంబంలో ఉన్న యౌవనస్థులకు కాపరి సందర్శనం చేస్తున్నాను.

దాదాపు 84 ఏళ్ల క్రితం నేను యెహోవాకు మొట్టమొదటిసారి ప్రార్థన చేశాను. అది ఒక అద్భుతమైన జీవితానికి తొలి అడుగు. జీవితం మొత్తంలో యెహోవాకు నేను ఇంకాఇంకా దగ్గరౌతూ ఉన్నాను. ఇప్పటివరకు యెహోవా నా ప్రతీ ప్రార్థన విన్నందుకు నేను ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను!—కీర్త. 66:19. b

a బ్రదర్‌ స్క్రాంజ్‌ జీవిత కథ సెప్టెంబరు 15, 1973 కావలికోట (ఇంగ్లీష్‌) పత్రికలో 570-574 పేజీల్లో ఉంది.

b ఈ ఆర్టికల్‌ని సిద్ధం చేస్తుండగా ఫిబ్రవరి 4, 2023న బ్రదర్‌ మార్షల్‌ గిల్లెట్‌ చనిపోయారు.