పాఠకుల ప్రశ్న
రెండు కర్రలు ఒక్కటి అవ్వడం గురించి యెహెజ్కేలు 37వ అధ్యాయంలో చదువుతాం. దానర్థమేమిటి?
తన ప్రజలు వాగ్దాన దేశానికి తిరిగొచ్చి ఒక్క జనాంగంగా మళ్లీ ఐక్యంగా ఉంటారని యెహోవా తన ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ముందే చెప్పాడు. అంతేకాదు తన ఆరాధికులు చివరిరోజుల్లో ఐక్యమవుతారని కూడా యెహోవా ముందే చెప్పాడు.
యెహెజ్కేలు ప్రవక్తను రెండు కర్రలు తీసుకోమని యెహోవా చెప్పాడు. ఆ తర్వాత అతను ఒక కర్ర మీద, “యూదావారి దనియు, వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు” రాయాలి. మరో కర్ర మీద, “ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారితోటి వారగు ఇశ్రాయేలువారి దనియు” రాయాలి. ఆ రెండు కర్రలు యెహెజ్కేలు చేతిలో ‘ఒకటి’ అవుతాయి.—యెహె. 37:15-17.
ద్వితీ. 33:13, 17; 1 రాజు. 11:26) ఆ గోత్రం యోసేపు కొడుకైన ఎఫ్రాయిము నుండి వచ్చింది. (సంఖ్యా. 1:32, 33) తన తండ్రి అయిన యాకోబు నుండి యోసేపు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందాడు. కాబట్టి ‘ఎఫ్రాయిము కర్ర’ పది గోత్రాల ఉత్తర రాజ్యాన్ని సూచిస్తుందని చెప్పడం సరైనదే. యెహెజ్కేలు రెండు కర్రల గురించి చెప్పడానికి ఎంతోకాలం ముందే అంటే సా.శ.పూ. 740లో అష్షూరీయులు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యంపై దాడి చేసి దానిలోని ప్రజలను చెరగా తీసుకెళ్లిపోయారు. (2 రాజు. 17:6) కొన్ని సంవత్సరాల తర్వాత, బబులోనీయులు అష్షూరీయులను ఓడించారు. కాబట్టి యెహెజ్కేలు రెండు కర్రల గురించి రాసే సమయానికి, చాలామంది ఇశ్రాయేలీయులు బబులోను సామ్రాజ్యమంతటా చెదరిపోయారు.
“ఎఫ్రాయిము” అనే పదానికి అర్థం ఏమిటి? ఇశ్రాయేలు ఉత్తర రాజ్య గోత్రాల్లో ఎఫ్రాయిము గోత్రమే చాలా ప్రాముఖ్యమైనది. నిజానికి, ఆ రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజు యరొబాము ఈ ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడే. (సా.శ.పూ. 607లో బబులోనీయులు రెండు గోత్రాల యూదా దక్షిణ రాజ్యంపై దాడిచేసి దానిలోని ప్రజలను బబులోనుకు తీసుకెళ్లారు. వాళ్లు బహుశా ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి చెందిన మిగిలినవాళ్లను కూడా తీసుకెళ్లి ఉంటారు. దక్షిణ రాజ్యం రాజులు, యూదా గోత్రానికి చెందినవాళ్లు. యాజకులు యెరూషలేములోని దేవాలయంలో సేవచేసేవాళ్లు కాబట్టి వాళ్లు కూడా యూదాలో ఉండేవాళ్లు. (2 దిన. 11:13, 14; 34:30) దీన్నిబట్టి, “యూదావారి దనియు” అంటున్నప్పుడు అది రెండు గోత్రాల దక్షిణ రాజ్యాన్ని సూచిస్తుందని చెప్పడం సరైనదే.
రెండు కర్రలు ఎప్పుడు ఒక్కటి అయ్యాయి? సా.శ.పూ. 537లో దక్షిణ రాజ్యం వాళ్లు, ఉత్తర రాజ్యం వాళ్లు దేవాలయాన్ని మళ్లీ కట్టడానికి యెరూషలేముకు తిరిగొచ్చినప్పుడు అది జరిగింది. ఇశ్రాయేలు జనాంగం ఇక రెండు జనాంగాలుగా లేదుగానీ ఒకే జనాంగంగా మళ్లీ యెహోవాను కలిసి ఆరాధించింది. (యెహె. 37:21, 22) ఈ విషయం గురించి ప్రవక్తలైన యెషయా, యిర్మీయా కూడా ముందే చెప్పారు.—యెష. 11:12, 13; యిర్మీ. 31:1, 6, 31.
స్వచ్ఛారాధన గురించి యెహెజ్కేలు ముందే ఏమి చెప్పాడు? యెహోవా తనను ఆరాధించే ప్రజల్ని ‘ఏకం’ చేస్తాడని యెహెజ్కేలు చెప్పాడు. (యెహె. 37:18, 19) మరి మనకాలంలో ఆ మాటలు నిజమయ్యాయా? అవును, ఆ మాటలు 1919లో నెరవేరడం మొదలయ్యాయి. దానికి ముందు, దేవుని ప్రజల్ని ఇక ఎప్పటికీ కలవనివ్వకుండా చేయాలని సాతాను ప్రయత్నించాడు. కానీ 1919లో వాళ్లు క్రమక్రమంగా మళ్లీ ఒక సంస్థగా ఏర్పడి, ఐక్యమయ్యారు.
ఆ సమయానికి, యేసుతోపాటు పరలోకంలో రాజులుగా, యాజకులుగా సేవచేసే నిరీక్షణ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. (ప్రక. 20:6) వాళ్లు యూదా కర్రలా ఉన్నారు. అయితే, భూమ్మీద నిత్యం జీవించే నిరీక్షణ ఉన్నవాళ్లు మాత్రం కొద్దిమందే ఉన్నారు. సమయం గడిచేకొద్దీ, వీళ్ల సంఖ్య పెరిగింది. (జెక. 8:23) వీళ్లు యోసేపు కర్రలా ఉన్నారు.
నేడు, ఈ రెండు గుంపుల వాళ్లు కలిసి యెహోవాను ఆరాధిస్తున్నారు. అంతేకాదు వాళ్లకు రాజు కూడా ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన్ను యెహెజ్కేలు పుస్తకంలో “నా సేవకుడు దావీదు” అన్నారు. (యెహె. 37:24, 25) యేసు తన అనుచరుల గురించి తండ్రికి ఇలా ప్రార్థించాడు, “తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెను.” a (యోహా. 17:20, 21) అంతేకాదు తన చిన్న మంద అయిన అభిషిక్తులు ‘వేరే గొర్రెలతో’ కలిసి ఒక్కమంద అవుతారని ఆయన చెప్పాడు. వాళ్లందరూ ఒక్క కాపరిని అనుసరిస్తారు. (యోహా. 10:16) యేసు చెప్పినట్టే, నేడు దేవుని ప్రజలందరూ పరలోకానికి వెళ్లే వాళ్లయినా లేదా భూమ్మీద నిత్యం జీవించే వాళ్లయినా ఐక్యంగా ఉన్నారు.
a యేసు అంత్యదినాల సూచన గురించి మాట్లాడుతూ, తన శిష్యులకు చాలా ఉపమానాలు చెప్పాడు. ఆయన ముందుగా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” గురించి చెప్పాడు. ఆ దాసుడు ఎవరంటే, దేవుని ప్రజలకు నాయకత్వం వహిస్తున్న అభిషిక్త క్రైస్తవుల చిన్న గుంపు. (మత్త. 24:45-47) ఆ తర్వాత, అభిషిక్త క్రైస్తవులందర్నీ సూచించే ఉపమానాల్ని ఆయన చెప్పాడు. (మత్త. 25:1-30) చివరిగా, క్రీస్తు సహోదరులకు మద్దతిస్తూ భూమ్మీద నిత్యం జీవించేవాళ్ల గురించి చెప్పాడు. (మత్త. 25:31-46) అదేవిధంగా, యెహెజ్కేలు చెప్పిన మాటలు మన కాలంలో నెరవేరడం మొదలైనప్పుడు, అది మొదటిగా పరలోకంలో జీవించేవాళ్లకు వర్తిస్తుంది. ఇశ్రాయేలు పది గోత్రాలు భూమ్మీద నిత్యం జీవించేవాళ్లను సూచించట్లేదు. అయినప్పటికీ, యెహెజ్కేలు ప్రవచనంలో రెండు కర్రలు ఒక్కటవ్వడం, పరలోకానికి వెళ్లేవాళ్లకు, భూమ్మీద జీవించేవాళ్లకు మధ్య ఉన్న ఐక్యతను మనకు గుర్తుచేస్తుంది.