యేసు నా కోసం చనిపోయాడా?
‘మనలాంటి భావాలు’ ఉన్న నమ్మకమైన వ్యక్తుల మాటల్ని బైబిల్లో చదువుతాం. (యాకో. 5:17, అధస్సూచి) ఉదాహరణకు, రోమీయులు 7:21-24 వచనాల్లో ఉన్న పౌలు మాటల భావాన్ని మనం తేలిగ్గా అర్థంచేసుకోగలం. ఆయనిలా చెప్పాడు: “నేను సరైనది చేయాలనుకున్నప్పుడు, చెడు చేయడం వైపే మొగ్గుచూపుతున్నాను. . . . నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి!” అలాంటి మాటలు, అపరిపూర్ణతలతో పోరాడుతున్నప్పుడు మనకు ఓదార్పునిస్తాయి.
పౌలు తన మనసులోని మరికొన్ని భావాల్ని కూడా చెప్పాడు. ఉదాహరణకు, యేసు ‘నన్ను ప్రేమించి నాకోసం తనను తాను అప్పగించుకున్నాడు’ అని పౌలు ఎంతో నమ్మకంగా చెప్పాడు. (గల. 2:20) మీకూ అలాగే అనిపిస్తుందా? బహుశా కొన్నిసార్లు అనిపించకపోవచ్చు.
మీరు గతంలో చేసిన పాపాల్ని బట్టి ఎందుకూ పనికిరానివాళ్లని భావిస్తుంటే యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, మీ పాపాల్ని క్షమించాడని నమ్మడం కష్టంగా ఉండవచ్చు. యేసు మీ కోసం చనిపోయాడని కూడా మీరు గుర్తించలేకపోవచ్చు. అయితే, మీరు విమోచన క్రయధనాన్ని ఒక బహుమానంగా చూడాలని యేసు నిజంగా కోరుకుంటున్నాడా? అలా చూడడానికి మీకేది సహాయం చేస్తుంది? ఈ రెండు ప్రశ్నలకు జవాబుల్ని పరిశీలిద్దాం.
తన బలిని ఎలా చూడాలని యేసు కోరుకుంటున్నాడు?
తాను అర్పించిన బలిని, మనలో ప్రతీఒక్కరికి ఇచ్చిన బహుమానంగా చూడాలని యేసు కోరుకుంటున్నాడు. అలాగని ఎలా చెప్పవచ్చు? లూకా 23:39-43 వచనాల్లో ఉన్న వృత్తాంతాన్ని ఊహించుకోండి. ఒకవ్యక్తి యేసు పక్కన కొయ్యకు వేలాడదీయబడ్డాడు. తాను గతంలో చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తున్నట్లు అతను ఒప్పుకున్నాడు. అతను చేసిన నేరం పెద్దదే అయ్యుంటుంది, ఎందుకంటే అలాంటివాళ్లకే అంత కఠినమైన శిక్ష విధిస్తారు. ఆ వ్యక్తి ఎంతో ఆందోళనతో యేసును ఇలా వేడుకున్నాడు, “నువ్వు రాజ్యాధికారం పొందినప్పుడు నన్ను గుర్తుచేసుకో.”
దానికి యేసు ఏమన్నాడు? ఆ నేరస్తుని వైపు తల తిప్పినప్పుడు యేసుకు ఎంత నొప్పి కలిగివుంటుందో ఊహించుకోండి. అంత బాధలో కూడా ఆయన చిరునవ్వుతో, “ఈ రోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు” అని అతన్ని ఓదార్చాడు. నిజానికి ఆయన, “మానవ కుమారుడు . . . ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు” అని చెప్పి ఊరుకోవచ్చు. (మత్త. 20:28) కానీ ఆయన ఆ బలిని అతని కోసం కూడా ఇస్తున్నట్లు దయగా చెప్పాడు. అంతేకాదు “నువ్వు,” “నాతో” అనే పదాల్ని ఉపయోగిస్తూ స్నేహపూర్వకంగా మాట్లాడాడు, భూపరదైసులో జీవిస్తావని అతనితో చెప్పాడు.
ఇంకొన్ని క్షణాల్లో అర్పించబడే బలి వల్ల తాను కూడా ప్రయోజనం పొందుతాననే విషయాన్ని ఆ నేరస్తుడు అర్థంచేసుకోవాలని యేసు కోరుకున్నాడు. దేవుణ్ణి ఆరాధించే అవకాశం దొరకని నేరస్తుని విషయంలోనే యేసు అలా కోరుకున్నాడంటే, బాప్తిస్మం తీసుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్న క్రైస్తవుని విషయంలో కూడా ఆయన అలాగే కోరుకుంటున్నాడని చెప్పడం ఎంత సరైనదో కదా! మనం గతంలో పాపాలు చేసినప్పటికీ, క్రీస్తు బలి వల్ల వ్యక్తిగతంగా ప్రయోజనాలు పొందుతామని నమ్మడానికి ఏది సహాయం చేస్తుంది?
పౌలుకు ఏది సహాయం చేసింది?
యేసు తనకోసం చనిపోయాడని అర్థంచేసుకోవడానికి పౌలుకు ప్రకటనా పని సహాయం చేసింది. అందుకే పౌలు 1 తిమో. 1:12-14) గతంలో చెడ్డ పనులు చేసిన తనకు ప్రకటించే నియామకాన్ని ఇచ్చాడంటే యేసుకు తనపై దయ, ప్రేమ, నమ్మకం ఉన్నాయని పౌలు అర్థంచేసుకోగలిగాడు. అదేవిధంగా, యేసు మనలో ప్రతీఒక్కరికి మంచివార్త ప్రకటించే నియామకాన్ని ఇచ్చాడు. (మత్త. 28:19, 20) యేసు మనకోసం కూడా చనిపోయాడని అర్థం చేసుకోవడానికి ఆ నియామకం మనకు సహాయం చేస్తుందా?
ఇలా అన్నాడు, “నాకు బలాన్నిచ్చిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు నేను కృతజ్ఞుణ్ణి. ఎందుకంటే, ఆయన తన పరిచర్య కోసం నన్ను నియమించి నన్ను నమ్మకస్థునిగా ఎంచాడు. ఒకప్పుడు నేను దైవదూషణ చేశాను, హింసించాను, తలబిరుసుగా ప్రవర్తించాను. అయినా ఆయన నన్ను నమ్మకస్థునిగా ఎంచాడు.” (దాదాపు 34 ఏళ్ల క్రితం బహిష్కరించబడిన ఆల్బర్ట్ ఈ మధ్యే సంఘంలోకి తిరిగి చేర్చుకోబడ్డాడు. ఆయనిలా చెప్తున్నాడు, “నేను చేసిన పాపాలన్నీ ఇంకా నా కళ్ల ముందే ఉన్నాయి. కానీ యేసు అపొస్తలుడైన పౌలుకు అప్పగించినట్టే నాకు కూడా ఈ పరిచర్యను అప్పగించాడని ప్రకటనా పని చేస్తున్నప్పుడు అనిపిస్తుంది. ఆ ఆలోచన నాకు సంతోషాన్నిస్తుంది. అంతేకాదు నా గురించి, నా జీవితం గురించి, నా భవిష్యత్తు గురించి ఇంకా సానుకూలంగా ఆలోచించగల్గుతున్నాను.”—కీర్త. 51:3.
ఆలెన్ సత్యం తెలుసుకోక ముందు ఎన్నో నేరాలు చేశాడు, చాలా క్రూరంగా ప్రవర్తించాడు. ఆయనిలా చెప్తున్నాడు, “నేను ప్రజలకు చేసిన హాని గురించి ఇప్పటికీ ఆలోచిస్తుంటాను, అప్పుడప్పుడు చాలా బాధనిపిస్తుంది. కానీ మంచివార్త ప్రకటించే అవకాశాన్ని నా లాంటి పాపికి ఇచ్చినందుకు యెహోవాకు ఎంతో రుణపడివున్నాను. ప్రజలు మంచివార్తకు చక్కగా స్పందించినప్పుడు యెహోవాలో ఉన్న మంచితనం, ప్రేమ నాకు గుర్తొస్తాయి. నాలా చెడ్డపనులు చేసినవాళ్లకు సహాయం చేయడానికి యెహోవా నన్ను ఉపయోగించుకుంటున్నట్లు అనిపిస్తుంది.”
మనం పరిచర్యలో పాల్గొనడం ద్వారా మంచిపని చేస్తున్నాం అలాగే మంచి విషయాల మీద మనసు పెడుతున్నాం. మనపై యేసుకు దయ, ప్రేమ, నమ్మకం ఉన్నాయని అర్థంచేసుకోవడానికి ఆ పరిచర్య సహాయం చేస్తుంది.
యెహోవా మన హృదయాల కన్నా గొప్పవాడు
సాతాను దుష్ట లోకం నాశనం అయ్యేవరకు, మనం గతంలో చేసిన తప్పుల్ని బట్టి అపరాధ భావాలతో పోరాడాల్సి రావచ్చు. అయితే, అలాంటి భావాల్ని తీసేసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది?
జీన్ యౌవనంలో గడిపిన ద్వంద్వ జీవితం విషయంలో ఇప్పటికీ బాధపడుతుంటుంది. ఆమె ఇలా చెప్తుంది, “‘దేవుడు మన హృదయాల కన్నా గొప్పవాడు’ అనే మాట నాకు సంతోషాన్నిస్తుంది.” (1 యోహా. 3:19, 20) అవును మనం పాపులమని యెహోవా, యేసు అర్థంచేసుకుంటారు కాబట్టి జీన్‌లాగే మనమూ ఊరట పొందవచ్చు. వాళ్లు విమోచనా క్రయధనాన్ని పరిపూర్ణుల కోసం కాదుగానీ, పశ్చాత్తాపపడే పాపుల కోసం ప్రేమతో ఏర్పాటు చేశారని గుర్తుంచుకోండి.—1 తిమో. 1:15.
యేసు అపరిపూర్ణ మనుషులతో ఎలా వ్యవహరించాడో ప్రార్థనాపూర్వకంగా ధ్యానించినప్పుడు, ఆయన అప్పగించిన పరిచర్యను పూర్తిచేయడానికి శాయశక్తులా కృషిచేసినప్పుడు విమోచనా క్రయధనం వ్యక్తిగతంగా మనకోసం ఇవ్వబడిందని నమ్మగలుగుతాం. అప్పుడు పౌలులాగే మనమూ ఇలా అంటాం: యేసు “నన్ను ప్రేమించి, నాకోసం తనను తాను అప్పగించుకున్నాడు.”